
బరేలి, ఏప్రిల్ 1: కాంగ్రెస్, థర్డ్‌ఫ్రంట్‌లు అస్థిరతకు ఆజ్యం పోస్తున్నాయని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శిస్తూ, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు కనీసం 300 పైచిలుకు స్థానాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపిని ఆధికారానికి దూరంగా ఉంచడం కోసం కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్న సంకేతాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ,ఇలాంటి శక్తులే దేశాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ‘బిజెపికి ఎవరూ మిత్రులు లభించరు. చాలా మంది కూటమిని వదిలిపెట్టి వెళ్తారని వారు ఫ్రచారం చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కొత్త మిత్రులు బిజెపితో చేతులు కలుపుతున్నారు. మోడీ గుజరాత్‌కే పరిమితమైన నాయకుడని కాంగ్రెస్ అంటోంది. అయితే ఆ ఆరోపణలో కూడా పస లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్లు అస్థిర ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్లు అస్థిరతను కోరుకుంటున్నారు’ అని మోడీ అన్నారు. బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగులుగుతుందని, అంతర్జాతీయ స్థాయిలో దేశ అపతిష్ఠను ఇనుమడింపజేస్తుందని మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోడీ అన్నారు. ‘ఎన్డీఏనుంచి 300కు పైగా ఎంపీలను ఎన్నుకోవాలని, యుపినుంచి అందరినీ ఆ కూటమికి చెందిన వారినే ఎన్నుకోవాలని కాశ్మీర్‌నుంచి కన్యాకుమారిదాకా ఉన్న ఓటర్లకు పిలుపునిస్తున్నాను. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండి కొత్త ప్రధానికి పార్లమెంటులో 300 మంది ఎంపీల మద్దతు ఉంటే అప్పుడు ప్రపంచం కూడా ఆయన మాట వింటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చగలుగుతాం’ అని మోడీ అన్నారు.
80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో విజయావకాశాలను మెరుగుపర్చుకోవడానికి బిజెపి మోడీని వారణాసినుంచి బరిలోకి దింపిన విషయం తెలిసిందే. 120 పార్లమెంటు స్థానాలున్న యుపి, బీహార్‌లో కలిసి వీలయినన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకోవడానికి బిజెపి వ్యూహ రచన చేస్తోంది.
కాంగ్రెస్ లేదా, తృతీయ ఫ్రంట్ కానీ సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీ ఏదీ కూడా ప్రభుత్వాన్నిఏర్పాటు చేసే స్థితిలో లేవని, అందుకే అవి బిజెపి అధికారంలోకి రాకుండా చూడడానికి రకరకాల ట్రిక్కులు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మోడీ అన్నారు. బిజెపిని అధికారానికి దూరం చేయడం కోసం కొత్త సెక్యులర్ ఫ్రంట్ ఏర్పడే అవకాశాలున్నాయనంటూ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ గత వారం చెప్పిన నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ భక్తి అంటే ఇది కాదని, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉండాలని ఆయన అంటూ, ఈ దేశాన్ని నాశనం చేయడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని చెప్పారు.
చిత్రం... బరేలిలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న మోడీ