బెంగళూరు, ఏప్రిల్ 1: ఏ రాష్ట్రంలో లేనివిధంగా కర్నాటక నుంచి ఆరుగురు ఉద్దండులు పార్లమెంటు ఎన్నికల బరిలో పోటీచేస్తున్నారు. వీరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ ప్రధాని కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి ఎం.వీరప్పమొయిలీ, ఎన్.్ధరమ్‌సింగ్; బిజెపి నుంచి బి.ఎస్.ఎడ్యూరప్ప, డి.వి.సదానందగౌడ; జెడి(ఎస్) నుంచి హెచ్.డి.దేవెగౌడ, ఆయన కుమారుడు హెచ్.డి.కుమారస్వామి పార్లమెంటుకు పోటీపడుతున్నారు. దేవెగౌడ పది నెలలపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన విషయం విదితమే. ఈ ఆరుగురు హేమాహేమీల్లో ఎడ్యూరప్ప మినహా మిగిలినవారంతా పార్లమెంటేరియన్లుగా పనిచేసినవారే. వీరప్ప మొయిలీ (చిక్కబల్లాపూర్), ధరమ్‌సింగ్ (బీదర్), దేవెగౌడ (హసన్) తమ నియోజకవర్గాల్లో ప్రజాతీర్పును కోరనున్నారు. ఉడిపి-చిక్‌మగలూర్ నుంచి సదానందగౌడ, బెంగళూరు రూరల్‌నుంచి కుమారస్వామి 2009లో పార్లమెంటుకు ఎన్నికైనా తమ పదవీ కాలం పూర్తికాకుండానే రాజీనామా చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2011 సెప్టెంబర్‌లో సదానందగౌడ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2009లో జరిగిన ఎన్నికల్లో 28 పార్లమెంటు స్థానాలకు గాను 19 సీట్లను బిజెపి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లోనూ, జెడి-ఎస్ మూడు స్థానాల్లోనూ విజయం సాధించాయి. గత ఏడాది మేలో కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలను ఎడ్యూరప్ప నాయకత్వంలోని కొత్త పార్టీ కెజెపి దెబ్బతీసింది. ఎడ్యూరప్ప సొంత గూటికి చేరడంతో పాటు ఈసారి జరగబోయే ఎన్నికల్లో తొలిసారిగా ఆయన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. షిమోగానుంచి బరిలో దిగిన ఎడ్యూరప్పకు ముక్కోణ పోటీ తప్పేలా లేదు. దేవెగౌడ, మొయిలీ, ధరమ్‌సింగ్ సొంత నియోజకవర్గాలనుంచే పోటీ చేస్తున్నారు.
కాగా, కర్నాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా అభ్యర్థులను పోటీకి దింపింది. మొయిలీ, ఎడ్యూరప్ప, కుమారస్వామిలను అత్యంత అవినీతిపరులుగా ఆప్ గుర్తించిందని, వీరిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆప్ బల్లగుద్ది మరీ చెబుతోంది. వీరితో పాటు అనంతకుమార్, బి.ఆర్.శ్రీరాములు సైతం అవినీతిపరులుగా ఆప్ జాబితాలో చేరారు.
రంగంలో ఆరుగురు మాజీ సిఎంలు
english title:
r
Date:
Wednesday, April 2, 2014