
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఈ సారి లోక్‌సభ ఎన్నికలు ‘ఒంటి గుర్రం రేస్’లాగా ఉన్నాయని బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. ‘చాలా గుర్రాలున్నప్పుడు జాకీ రెండో స్థానంలో ఎవరున్నారని వెనక్కి తిరిగి చూడాలి. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ చుట్టూ జూసినా నంబరు టూ కనిపించడం లేదు’ అని జైట్లీ మంగళవారం తూర్పు ఢిల్లీ బిజెపి అభ్యర్థి మహేశ్ గిరి తరఫున జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ అన్నారు. ‘మొట్టమొదటిసారి లోక్‌సభ ఎన్నికలు ఒంటి గుర్రం రేస్‌లాగా ఉన్నాయి. మన ఓటర్లు చాలా తెలివైన వారు. అందువల్ల కేవలం స్పష్టమైన మెజారిటీ ఇస్తే చాలదు, అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని పూర్తి అధికారంతో, పారదర్శకంగా పాలించడానికి వీలుగా స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం మంచిది. సుస్థిర ప్రభుత్వం ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది’ అని ఆయన అన్నారు. ‘ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం అంటే అతి పెద్ద అన్యాయం అవుతుంది. సమస్యలపైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏ ప్రభుత్వమైనా బలంగా ఉండాలి. దేశాన్ని తిరిగి గాడిలోకి పెట్టాలంటే కేవలం 272 కాకుండా 300కు పైగా సీట్లు అవసరం’ అని జైట్లీ అన్నారు. ‘ప్రధానమంత్రి ఒక అర్థిక వేత్త. అయినప్పటికీ ఆయన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో విఫలమైనారు. జిడిపి వృద్ధి 4.5 శాతానికి పడిపోయింది. మదుపరులు దేశంలో పెట్టుబడులు పెట్టడం ఆపేసారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన స్తంభింపజేసారు’ అని జైట్లీ అన్నారు. పంజాబ్ రైతుల సమస్యలను అమృత్‌సర్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జైట్లీ ప్రస్తావిస్తూ, ‘పంజాబ్‌లోని మన రైతులకు సరిహద్దుకు ఆవలి వైపున కొన్ని భూములున్నాయి. వాటిని సాగు చేయడానికి వాళ్లు ఆ వలి వైపునకు వెళ్లలేక పోతున్నారు. తమకు నష్టపరిహారం కావాలని వారు చెప్పారు. నష్టపరిహారం ఎంత ఉంటుందని నేను వాళ్లను అడిగితే 50-60 కోట్ల రూపాయల దాకా ఉంటుందని వారు చెప్పారు. ప్రభుత్వం ఆమాత్రం సొమ్ము వాళ్లకు ఇవ్వలేదు కానీ వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మాత్రం చేస్తుంది’ అని జైట్లీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి సిద్ధాంతం లేదని జైట్లీ ఆ పార్టీని దుయ్యబట్టారు.‘ఇప్పుడు ప్రజలకు ఒకే ఒక అప్షన్ ఉంది. మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని జనం రెండేళ్లుగా నన్ను అడుగుతున్నారు. ఈ దేశ ప్రజలు, బిజెపి కార్యకర్తలు ఎప్పుడో దానిపై నిర్ణయించుకున్నారని, పార్టీ అధికార ముద్ర మాత్రమే వేయాల్సి ఉందని నేను నవ్వుతూ చెబుతూ ఉండేవాడిని. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రజలు నిర్ణయంచడం, ఆ తర్వాత పార్లమెంటరీ బోర్డు దానికి ఆమోదముద్ర మాత్రమే వేయడం చరిత్రలో ఇదే మొదటిసారని జైట్లీ అన్నారు.
చిత్రం... మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో
బిజెపి నీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ, మీనాక్షి లెఖి