విదిశ, ఏప్రిల్ 1: బిజెపికి కంచుకోటగా భావిస్తున్న విదిశలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌కు గెలుపు ఈ సారి అంత సులభం కాదనిపిస్తోంది. బిజెపి అగ్రనేతల్లో ఒకరైన సుష్మాస్వరాజ్ ఈ సారి కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మణ్ సింగ్‌ను ఢీకొంటున్నారు. ప్రత్యర్థి బలంకన్నా కూడా సుష్మా స్వరాజ్ పట్ల నియోజకవర్గం ఓటర్లలో ఉన్న అసంతృప్తే ఈ పరిస్థితికి ముఖ్య కారణం. విదిశకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం పంజ్‌లోని ఓటర్ల మాటలే దీనికి అద్దం పడుతున్నాయి. సుమారు 300 ఇళ్లున్న ఈ చిన్న గ్రామానికి ఇప్పటికీ సరయిన విద్యుత్ సౌకర్యం లేదు. రోడ్డు ఉందని చెప్పడానికి గుర్తుగా గతుకులు పడిన ఓ దారి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ వంతెన బయటి ప్రపంచంతో ఈ గ్రామాన్ని కలుపుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విదిశ నియోజకవర్గం ఓటర్లు తనను ఎన్నుకున్న తర్వాత సుష్మ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంది. గత ఎన్నికల్లో దాదాపు ఏకపక్షంగా అంటే 94 శాతం గ్రామాలు మూకుమ్మడిగా సుష్మకు ఓటేసాయి. అప్పట్లో ఇక్కడ రీపోలింగ్ జరుగుతుందేమోనన్న అనుమానాలు కూడా తలెత్తాయి. నిజానికి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పాటిల్ నామినేషన్ చివరి నిమిషంలో రద్దు కావడంతో అప్పుడు సుష్మ ఎన్నిక ఏకపక్షమైంది.
అయితే అయిదేళ్లు తిరిగే సరికి ఈ గ్రామంలో ఓటర్ల మూడ్ మారిపోయింది. తాము ఎంతో ప్రేమగా ‘దీదీ’ అని పిలుచుకునే సుష్మ పట్ల వీరు ఇప్పుడు మండిపడుతున్నారు. తాను ఈ సారి కాంగ్రెస్‌కే ఓటేస్తానని, సుష్మ మాకు ఏం చేసిందని గ్రామంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ఓ మహిళ ఆగ్రహంగా ప్రశ్నించడం వారి మనోభావాలకు అద్దం పడుతుంది.తాను విజయం సాధించిన తర్వాత నియోజకవర్గానికి వైద్య కళాశాలను, రైల్వే ఫ్యాక్టరీని తీసుకు వస్తానని, కొత్త రైళ్లతో పాటు, మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగేట్లు చూస్తానని సుష్మ హామీ ఇచ్చారు. అయితే వాటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. గత అయిదేళ్లలో సుష్మ ఒక్కసారి కూడా కనిపించలేదని గ్రామ పెద్ద రామచంద్ర సాహు చెప్పడం గమనార్హం. ఆమె విదిశ ఎప్పుడు వచ్చినా చుట్టూ ఆమె మనుషులే ఉంటారని, ఒక్కసారి కూడా ఆమెను కలవడానికి మాకు అవకాశం రాలేదని సాహు వాపోయాడు.
అయితే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అనుకూలంగా వీస్తున్న గాలిలో ఈ అసమ్మతి కొట్టుకు పోతుందని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1967నుంచి కూడా విదిశ బిజెపికి కంచుకోటగానే ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడు సార్లు మాత్రమే గెలుపొందింది.
హాట్ సీట్
english title:
s
Date:
Wednesday, April 2, 2014