తెలంగాణ రాష్ట్రం వస్తేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూములపై ఈ నేలకు హక్కులు కలుగుతాయి. అలాగే తన నేలపైన తమదే స్వపరిపాలన అన్న కలలు నెరవేరుతాయి. ప్రధానంగా ఇప్పటిదాకా అణ చివేయబడిన తెలంగాణ కళలు, సంస్కృతి ప్రపంచం నలుదిక్కులకు విలసిల్లుతుంది. జన జీవితాలకు మానవ సంబంధాలు, అనుబంధాల గూళ్లతో అత్యంత అద్భుతమైన సాహిత్యం సృష్టించబడింది. కానీ ఇంత గొప్ప సాహిత్యాన్ని, కళలను ఆధిపత్య సంస్కృతి కమ్మేసింది. తెలంగాణ సాహిత్యాన్ని కప్పివేసిన ఆధిపత్య సంస్కృతిని తొలగిపోతేనే ఇక్కడి సాహిత్యానికి మనుగడ ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు సాహిత్యం, కళల పేర కొనసాగినదంతా ఆధిపత్య సంస్కృతేనని తేటతెల్లమైంది.
తెలంగాణ మట్టిలోనే మానవతా విలువలు, మానవత్వం గుబాళిస్తుంది. అసలు తెలంగాణ అంటేనే సృజనాత్మకత అని అర్థం. తెలంగాణలో ఉన్న సాహితీవేత్తలు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులకంటే ఎత్తయిన వారున్నారు. ఆధిపత్య సంస్కృతి, సాహిత్య రంగంపైన కూడా కొనసాగింది. అందుకే తెలంగాణ సాహితీవేత్తలను అణిచివేశారని ఆరోపణలు వెల్లివిరిశాయి. అవార్డులు, పురస్కారాలే గీటురాళ్లుకాదు కానీ అర్హత ఉన్నవారిని వదిలేసి ఆధిపత్య పైరవీ సంస్కృతే తెలుగు సాహిత్యమంతా ఆవరించిందన్న భావనలు గుప్పుమన్నాయి. అయినా తెలంగాణ సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు, వాగ్గేయకారులు, చిత్రకారులు, ఛాయాచిత్రకారులు ఎన్నడూ పదవులకోసం దేబిరించలేదు. పైరవీ సంస్కృతికి తల ఒగ్గలేదు. ఏ ప్రాంతాన్నయినా ఆక్రమించుకోవటానికి ఆధిపత్యవాదులు చేసే తొలి దాడి సాంస్కృతిక రంగంపైననే జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని అదిమిపెట్టే ఆధిపత్య సంస్కృతిని ఇక్కడి సమాజం గుర్తించింది. అందుకే మలి దశ తెలంగాణ రాష్టస్రాధన ఉద్యమంలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగమే కీలక భూమికను పోషించింది. కవిత్వం, పాట కవిత్వం, కళలు, కళారూపాలు, కథలు మలి దశ ఉద్యమానికి వూపిరిపోశాయి.
తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగా న్ని ఒక్కసారి కదిలిస్తే వందల సంఖ్యలో పద్మశ్రీ, పద్మవిభూషణ్‌లకు అర్హులు ఉన్నా రు. కానీ వీరందరికి ఇప్పటివరకు ఆ పురస్కారాలు ఎందుకు లభించలేదన్నది పెద్ద ప్రశ్న. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడ్డ దగ్గరనుంచి ఇచ్చిన పురస్కారాలను చూస్తే వీటిలో మూడొంతులు సీమాంధ్ర సాహితీవేత్తలకు ఒకవంతు మాత్రమే తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగానికి దక్కాయి. ప్రతి పురస్కారం వెనుక పైరవీలే కనిపిస్తున్నాయి. తెలుగు యూనివర్సిటీ పురస్కారాల దగ్గరనుంచి హంస అవార్డులు, నంది అవార్డుల వరకు ఆ పైరవీల సంస్కృతే కనిపిస్తుంది. అంటే జీవిత సాఫల్య అవార్డులన్నీ పైరవీ సాఫల్య అవార్డులన్నదాకావచ్చింది. ఇందులో ప్రాంతం ఆధిపత్యంతో పాలకుల ఆధిపత్యాలు కూడా ఉన్నాయి.
ఈ సంస్కృతి రాష్టస్థ్రాయి నుంచి దేశస్థాయి దాకా ఎగబాకింది. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు కూడా తమవారికి కాకపోతే ఆధిపత్య సంస్కృతి అడుగులకు మడుగులొత్తే వారికేనని తెల్సిపోయింది. ఇప్పటివరకు వచ్చిన పద్మశ్రీ అవార్డులను, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి వచ్చిన అవార్డులు చాలా తక్కువగా ఉన్నా యి. అర్హత వున్న అనేకమందికి ఈ అవార్డులు దక్కలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇక్కడి కవులకు, రచయితలకు, సాహితీవేత్తలకు, కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పడబోతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కళలు, సాహిత్యానికి స్వరాష్ట్రంలో ఏ రకమైన స్థానాన్ని కల్పిస్తారో చూడవలసి ఉంది. అలాగే తెలుగు సాహిత్యానికి, తెలంగాణ కవులూ, రచయితలూ రాసిన పుస్తకాలకు కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వం ఆదరించాలి. ఒక కవి, రచయిత రాసిన పుస్తకాలను ప్రభుత్వమే కొనే విధంగా చూడాలి. భాష, సంస్కృతులు విలసిల్లే 29వ రాష్ట్రంగా తెలంగాణ నిలవగలగాలి. పాట, మాట, ఆట ద్వారా తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. మరి ఆ పాట, మాట, ఆటలకు ఆ కవులకు, రచయితలు, కళాకారులకు సముచిత స్థానం కల్పించాలి. కళలు, సంస్కృతులను పోషించినప్పుడే తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతుంది.
సాంస్కృతిక అస్థిత్వం లేని జాతి మనుగడ చాలా కష్టం. చరిత్రను పరిశీలిస్తే పురాతన కాలంలో మనదేశంపై దండయాత్రలు చేసిన వారు, ఇక్కడి సంస్కృతితో మమేకమై పోవ డాన్ని గమనిస్తాం. కానీ భారతీయ సంస్కృతీ వికాసం దెబ్బతినడం విధ్వంసానికి గురికా వడం మధ్య యుగాలనుంచే ప్రారంభమై, బ్రిటిష్ వారి హయాంలో అది పరాకాష్టకు చేరుకుంది. దేశంలోని అన్ని ప్రధాన భాషల ప్రాధాన్యత పడిపోయ, ఇంగ్లీషు మాత్రమే భారతీయుల నెత్తిన నాట్యమాడింది.. నాట్య మాడుతోంది కూడా. భాష, సంస్కృతి ఉపాధితో బలీయమైన సంబంధాన్ని కలిగి ఉండటం వల్లనే ఆంగ్లభాష అంతగా ప్రాచు ర్యం పొందిందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలంగాణ విషయానికి వస్తే రాబోయే ప్రభుత్వం, సంస్కృతిని, భాషను ఉపాధికి అనువుగా మలిస్తే తప్పనిసరిగా తెలంగాణ సంస్కృతి మనగలుగుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు పైరవీలు, పెత్తం దారీ తనం కింద నలిగిపోయన తెలంగాణ సంస్కృతి, నవ ఉషస్సుతో శోభిల్లగలు గుతుంది.
తెలంగాణ రాష్ట్రం వస్తేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూములపై ఈ నేలకు హక్కులు కలుగుతాయి.
english title:
s
Date:
Thursday, April 3, 2014