
దక్షిణాదిన నలభై సీట్లతో కూటమి గట్టి భాజపా యన్డీఏ వేగాన్ని నిరోధించడానికి లోక్‌సభ ముగియనున్న మూడు రోజుల ముందు ఎన్నికల ప్రాంగణం చేరే సమయాన రాష్ట్ర విభజన చేపట్టి, అదిరింపు బెదిరింపులతో ఉభయ సభలు నింపి ప్రధాన ప్రతిపక్షంను మెడలు వంచగలగడమే కాంగ్రెసుకు రాజకీయ మనిపిస్తే- మునగనున్న ఓడ కాంగ్రెస్‌లలో విలీనమవకుండా ఒడ్డుకు చేరువగా వున్న కమలం తెరచాపకిందకు తెరాస చేరాలనుకోవడమూ అంగీకరించవలసిన పరిణామం కాగలదు. ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ రాష్ట్రం, ఈ దేశం నాదనుకునేవారికి మనోభావాలుంటాయి. నాకు, నా కొడుకు నా కుటుంబానికే అధికారం అనుకునే వారికి ఏముంటాయి. ఎవరెలా ఛస్తేనేం అనుకుని విభజనను ఆముద్రితం కాకుండా ఆపగలసత్తా కూడా కాంగ్రెస్‌కే వుంది. రాజకీయం!! కమలం ఒకచోట సైకిలెక్కుతోంది. కారెక్కుతుందా..లేదా అనేది తేలలేదు. కానీ కేవలం రాజకీయం కోసమే రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలి.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్
ఆలోచింప జేసిన వ్యాసం
గురువారంనాటి వ్యాసం ‘బాధ్యులెవరు?’ అంశం పిల్లలుగల తల్లిదండ్రులను ఆలోచింపచేసేలా వుంది. టీ.వి. నుంచి విష సంస్కృతి వ్యాప్తిచెంది పల్లెల్లో ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఐటమ్‌సాంగ్ ప్రదర్శించటం నేడు ఆధునిక ఆచారం అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పే పంతుళ్లు అదే ప్రతిభగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లల పట్ల సభ్యత పెంపొందించాల్సిన తల్లి కూడా ఒక స్ర్తిమూర్తి అయివుండి టీ.వి సీరియల్ చూసి డాన్స్ బేబి డాన్స్‌లు చూసి తమ పిల్లలను ఆకాశానికి ఎత్తాలని ఆశపడుతున్నారు. ఇది వారిమానసిక ప్రవృత్తి దెబ్బతింటుందనే విషయం మరచిపోతున్నారు. లోగడ దీని పట్ల మహిళా సమాజంవారు కూడ గొడవ లేవదీశారు. ఫలితం శూన్యం. ఈ జాడ్యం విస్తరిస్తే రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా వుంటాయనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేటి బాలికే రేపటి మహిళ. సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో వున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, జానపదం, మిమిక్రీ, మమ్, ఏక పాత్రాభినయం వాటిపట్ల పిల్లల అభిరుచినెరిగి ఆ దిశగా వారిని తీర్చిదిద్దాలి. సమాజంలో మనమూ ఒకరం. ఆ నియంత్రణ మనతోనే ప్రారంభం కావాలి. ఇతర దేశాలకి ఆదర్శం కావాలి.
- ఎన్.సత్యానంద్, సెంటనరీకాలనీ