హైదరాబాద్, ఏప్రిల్ 2: విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా గురువారం డిస్కాంల పరిధిలో విద్యుత్ పొదుపుపై అవగాహనను పెంచేందుకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సిపిడిసిఎల్ తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి అన్ని జోనల్, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో కార్యక్రమాలు ఉంటాయని సిపిడిసిఎల్ సిఎండి ఎస్‌ఎఎం రిజ్వీ తెలిపారు. వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బాబు వాగ్దానాల విలువ
లక్షన్నర కోట్లు: రుద్రరాజు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 2: చంద్రబాబు నాయుడు కురిపిస్తున్న వాగ్దానాల విలువ ఇప్పటికే లక్షన్నర కోట్ల రూపాయలు దాటిందని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారో బాబు చెప్పలేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌బిఐ వద్దకు పరుగు తీశారని ఆయన గుర్తు చేశారు.
అనేక సంస్ధలతో తీసుకుని వచ్చిన అప్పులు కుప్పలుగా మారాయని ఆయన విమర్శించారు. అధికారం కోసం ఇప్పుడు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారని ఆయన విమర్శించారు. సినీ నటుడు బాలకృష్ణను ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలనుకుంటున్నారని, ఇప్పటి వరకు ఆయన ఏ పదవి ఇచ్చారని రుద్రరాజు పద్మరాజు ప్రశ్నించారు.
టిడిపి, కాంగ్రెస్ వర్గీయుల కొట్లాట
దేవరకొండ, ఏప్రిల్ 2: జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో బుధవారం జరిగిన ప్రచారంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ వర్గీయులు పరస్పరం దాడిచేసుకోవడంతో ఎంపిటిసి అభ్యర్థికి, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. టిడిపి జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ కంబాలపల్లి గ్రామంలో జడ్పీటిసి, ఎంపిటీసి అభ్యర్థుల తరపున ప్రచారం చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపి నాయకులు, కార్యకర్తలపై రాళ్ళను విసిరారు. ఇరువర్గాలు దాడులకు పాల్పడడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దాడుల్లో టిడిపి ఎంపిటిసి అభ్యర్థి బొమ్ము అనిత భర్త గోవింద్, కాంగ్రెస్ కార్యకర్తలు మల్యాల భిక్షం, మల్యాల శ్రీరాములు, ఏర్పుల శ్రీకాంత్‌లకు తీవ్రగాలయ్యాయి.
దాడుల్లో టిడిపి జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ తృటిలో తప్పంచుకున్నారు. దేవరకొండ డిఎస్‌పి మనోహర్, సిఐ వెంకటేశ్వర్లు, చందంపేట ఎస్‌ఐ నాగభూషణ్‌లు కంబాలపల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కంబాలపల్లిలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. ఇరువర్గాలకు చెందిన వారు ఫిర్యాదు అందడంతో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.