హైదరాబాద్, ఏప్రిల్ 2: సెక్యులరిజంపై దిగ్విజయ్‌సింగ్, రఘువీరారెడ్డి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. అధికారం కోసం మతాన్ని ఉపయోగించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అనవాయితీ అని విమర్శించారు. ఢిల్లీలో వందలాది మంది సిక్కులను ఊచకోత కోసింది కాంగ్రెస్ కాదా? ఢిల్లీలో మత ఘర్షణలపై సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ను చివాట్లు పెట్టిన విషయాన్ని దిగ్విజయ్ సింగ్ మరిచిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ అవిర్భావం నుంచి లౌకికవాదానికి కట్టుబడిన పార్టీ టిడిపియేనని యనమల పేర్కొన్నారు.
దళితులను అణచివేసింది తల్లి, పిల్ల కాంగ్రెస్‌లే
దళితులను అణచివేసింది తల్లి, పిల్ల కాంగ్రెస్ (వైసిపి) పార్టీలేనని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కూడేలు మండలం చోలసముద్రంలో దళితులపై టిడిపి నేతలు దాడి చేసారని వైసిపి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కాలువ ఆరోపించారు. దళితులపై టిడిపి ఎలాంటి దాడులకు పాల్పడలేదని అన్నారు. వైసిపిలో సామాజిక న్యాయం లేదని దళిత నేతలు మారెప్ప, కమలమ్మ, బుచ్చి మహేశ్వర్‌రావు తదితరులు జగన్ నైజాన్ని బయట పెట్టారని కాలువ గుర్తు చేసారు.
గాంధీ భవన్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ!
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 2: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు రాని ఆశావాహుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఫలితం పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే జరుగుతున్నది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముందు చూపుతో పార్టీ కార్యాలయంలో ప్రైవేటు సెక్యురిటీని (బౌన్లర్లను) నియమించారు. 2004, 2009 ఎన్నికల్లో గాంధీ భవన్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం జరిగింది. ఈ దఫా అటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పంజాగుట్టలోని ఎక్సెల్ సెక్యురిటీ సర్వీసెస్‌తో మాట్లాడి 10 మంది బౌన్సర్లను నియమించారు. అవసరమైతే బౌన్సర్ల సంఖ్యను మరింత పెంచుతారు. నల్లటి దుస్తులు ధరించిన ధృడకాయులు బుధవారం గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమైన ద్వారాల వద్ద వారు నిలుచొని లోపలికి వచ్చే కార్యకర్తలను చెక్ చేశారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారు విధులు నిర్వహిస్తారు.
వాస్తు దోషాలు..
సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇతర ముఖ్య నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అనేక మంది నాయకులు పార్టీని వీడి వెళుతున్నారు. దీనికి బ్రేక్ వేయలేకపోతున్నామని ముఖ్య నాయకులు బాధపడుతున్నారు. బుధవారం వాస్తు పండితులను గాంధీ భవన్ ఆవరణలో ఉన్న ఎపిసిసి కార్యాలయమైన ఇందిరా భవన్‌కు పిలిపించి వాస్తు చూపించారు. వాస్తు ప్రకారం బరువు లేదని, ఒకవైపు నిర్మాణం చేయించాల్సిందిగా సూచించడంతో హుటాహుటిన పనులు ప్రారంభమయ్యాయి.