హైదరాబాద్, ఏప్రిల్ 2: మేనిఫెస్టోల్లో రైతులకు చోటేది అంటూ రైతాంగ సంఘాల నాయకులు రాజకీయ పార్టీలను నిలదీశారు. ఎన్నికల ప్రణాళికల్లో రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళిల్లో రైతాంగ సమస్యలను ప్రస్తావించినా, వాటి అమలును మాత్రం పట్టించుకోవడం లేదని, అలా ఎన్నికల వాగ్దానాల్లో అంశాలను చేర్చి వాటిని అమలుచేయని రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటి గుర్తింపును కూడా రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళిల్లో పొందుపరచాల్సిన అంశాలపై అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
వ్యవసాయ రంగంలో ఉన్న రుణాలు ఏ మేరకు ఉంటాయో పరిశీలించి అందులో లక్ష రూపాయిల వరకూ ఉన్న రుణాలను మాఫీ చేయాలని అన్నారు. వ్యవసాయ రంగానికి న్యాయమైన విద్యుత్ 9 గంటలు సరఫరా చేయాలని, ఐదు కిలోవాట్ల సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవడానికి రైతులకు 90 శాతం సబ్సిడీ అందించాలని అన్నారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించాలని, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అమలుచేస్తూ ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరించి సీజన్ ప్రారంభంలోనే రైతులకు రుణాలు అందేటట్టు చర్యలు తీసుకోవాలని, కౌలు రేట్లను ఖచ్చితంగా అమలుచేయాలని అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీలను కౌలు రైతులకు నేరుగా అందించాలని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డుల సంఖ్య పెంచి ప్రభుత్వ ఆధీనంలోనే మార్కెటింగ్ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్కయ, రైతు సంఘం (జవహర్‌నగర్) అధ్యక్షుడు బి చంద్రారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ నేత ఎం కోదండరెడ్డి, వైఎస్సాఆర్‌సిపి రైతు విభాగం కన్వీనర్ ఎంవిఎస్ నాగిరెడ్డి, టిడిపి రైతు నేత ఎస్ వెంకటేశ్వరరావు, బిజెపి కిసాన్‌మోర్చ నేత శ్యాం కిశోర్, ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి గాదె దివాకర్, చైతన్య సొసైటీ నాయకులు నర్సింహారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు పాల్గొన్నారు.
దానంపై కేసులకు
సిట్ ఏర్పాటుచేయాలి
హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 2: మాజీ మంత్రి దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేయాలని తిరుపతి వర్మ అనే న్యాయవాది హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వివిధ ఐపిసి సెక్షన్ల కింద గత మూడేళ్లుగా దానంపై కేసులు నమోదైన విషయాన్ని ఆయన కోర్టుకు వివరించారు. ఈ కేసులు నాన్ బెయిలబుల్ కేసులని, కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తప్ప పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు వెల్లడించారు.