విజయనగరం, ఏప్రిల్ 2: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒప్పంద కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించకపోవడంతో వివిధ శాఖల్లో ప్రత్యేకించి వైద్య విధాన పరిషత్‌లో పలు రకాల సేవలు నిలిచిపోయాయి. ఒక్క ఎపి వైద్యవిధాన పరిషత్‌లోనే కాంట్రాక్ట్ విభాగంలో 540 మంది, ఔట్ సోర్సింగ్ కింద 1480 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం మార్చి 31తో ముగిసింది. కొంతకాలం పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నప్పటికీ, అందుకు సంబంధించిన జీవో రాకపోవటంతో వీరంతా విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వీరిలో వైద్యుల నుంచి అంబులెన్స్ డ్రైవర్లు, పోస్టుమార్టం నిర్వహించే సిబ్బంది, ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు వంటి కీలకమైన సేవలు అందించే సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నవారే ఎక్కువ మంది కావడంతో ఆసుపత్రులు బోసిపోతున్నాయి, అంబులెన్స్‌లు పడకేశాయి. ప్రతి జిల్లాలోను సిటి స్కాన్ టెక్నీషియన్, రేడియాలజిస్టులు, తదితర ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిలో కూడా ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్‌వారే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప ఈ సేవలు కొనసాగించే అవకాశం లేకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలావుండగా, పశుసంవర్థక శాఖ, విద్య, రెవెన్యూ ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పదేళ్లుగా తాము సేవలు అందించామని, ఇపుడు తమ భవితవ్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రభావం కూడా దీనిపై పడటంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అయోమయంలో పడ్డారు.
రు.