న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అణ్వస్త్ర రహిత ప్రపంచం ఆవశ్యకత ఎంతయినా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రపంచాన్ని సురక్షిత ప్రాంతంగా చేయడానికి అణ్వాయుధాలను ముందుగా ఉపయోగించకుండా ఉండడానికి సంబంధించి ఒక అంతర్జాతీయ ఒడంబడికను కుదుర్చుకోవలసిన అవసరం ఉందని అన్నారు. భారత దేశం అణ్వస్త్రాలకు సంబంధించి ముందుగా ఉపయోగించబోమన్న విధానాన్ని పాటిస్తోందని ఆయన గుర్తుచేస్తూ, అయితే ఏ ఒక్క దేశం కూడా ఒంటరిగా ఈ ప్రయాణం సాగించజాలదని, అందువల్ల అణ్వస్త్రాలను కలిగిన అన్ని దేశాల భాగస్వామ్యంతో ఒక ఆమోదయోగ్యమైన అంతర్జాతీయ ఒడంబడిక అవసరమని అన్నారు. ‘దాదాపు అర్ధశతాబ్దంగా ప్రపంచ దేశాలు ఈ అంశంపై రకరకాల విధానాలను ప్రయత్నించాయి. అయితే అవన్నీ కూడా పక్షపాతం, వివక్షతతో కూడుకున్నవిగా మాత్రమే మారాయి’ అని బుధవారం ఇక్కడ ‘అణ్వస్త్ర రహిత ప్రపంచం; ఆలోచన నుంచి ఆచరణదాకా’ అనే అంశంపై జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ మన్మోహన్ అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి ఆలోచనలకు ముగింపు పలకడం ఇప్పుడు మనకు నిజంగా కావాలి. అణ్వస్త్రాలు కలిగిన అన్ని దేశాలు పాలు పంచుకునే పరస్పర అంగీకారంతో కూడిన అంతర్జాతీయ ఒడంబడిక ఇప్పుడు మనకు అవసరం. భద్రతా సిద్ధాంతాల్లో అణ్వస్త్రాలకు ప్రాధాన్యత తగ్గించడం ద్వారా అణు ముప్పులను తగ్గించే ఆచరణాత్మక చర్యలపై దృష్టి పెట్టడం ఇప్పుడు అవసరమని ఆయన అన్నారు. అణ్వస్త్ర దాడిని తిప్పికొట్టడమే అణ్వస్త్రాల ఏకైక ఉద్దేశంగా ఉండాలనే మాటలు రానురాను ఎక్కువవుతున్నాయని ఆయన అన్నారు. అణ్వస్త్రాలను కలిగి ఉన్న అన్ని దేశాలు కూడా దీన్ని గుర్తించి ఆ మేరకు ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయని ప్రధాని అన్నారు. అందువల్ల మనమంతా ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా అణ్వస్త్రాలను ముందుగా ఉపయోగించబోమనే నిబంధనను కలిగి ఉన్న ప్రపంచాన్ని నెలకొల్పడానికి నడుం బిగించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. అణ్వస్త్రాలను క్రమంగా తగ్గించుకోవడానికి, చివరిగా అణ్వస్త్రాలకు సంబంధించి ఒడంబడికను కుదుర్చుకోవడం ద్వారా వీటిని నిర్మూలించడానికి ఒక మార్గాన్ని తెరవడానికి ఇది చాలావరకు తోడ్పడుతుందని ఆయన అన్నారు.
ప్రధాని మన్మోహన్ పిలుపు
english title:
a
Date:
Thursday, April 3, 2014