హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఏర్పాటు చేసింది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, బంగారు పంపిణీని అడ్డుకునేందుకు నడుంబిగించింది. అభ్యర్థుల ఎన్నికల వ్యయం వంటి వాటిని నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. అందులో భాగంగా రాష్ట్ర ఐటి శాఖ అదనపు డిజి బి వెంకటేశ్వర్‌రావును రాష్ట్రానికి నోడల్ అధికారిగా నియమించింది. ప్రచారం సందర్భంగా జరిగే లోటుపాట్లపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకుగాను 24 గంటలపాటు పనిచేసే ఓ టోల్‌ఫ్రీ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, ఈ మెయిల్ ఐడి ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మద్యం, డబ్బు పంపిణీకి దిగితే ప్రజలు సమాచారం అందించాలని ఐటి శాఖ కోరింది. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో 10 మంది డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. వీరితోపాటు మరో 67 మందిని ఐటి అధికారులను అసిస్టెంట్ నోడల్ అధికారులను నియమించింది. వీరు జిల్లా నోడల్ అధికారికి సహాయంగా ఉంటారు. ప్రతీ అసిస్టెంట్ అధికారికి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించనున్నారు. ఈ అధికారులంతా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాల తీరును పర్యవేక్షిస్తారని తెలిపింది. వీరంతా నిరంతరం జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ అధికారులతో అందుబాటులో ఉంటారు.
రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఆదాయపు పన్ను శాఖ
english title:
nodal officers
Date:
Friday, April 4, 2014