
విజయవాడ, ఏప్రిల్ 4: హైదరాబాద్ నుంచి నర్సాపురం బయల్దేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో విజయవాడలో బస్సెక్కిన స్థానిక వ్యాపారి ఆరిపాక శ్రీనివాసరావు(42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. 30మంది గాయపడగా వీరిని వేర్వేరు వాహనాల్లో విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన 12మంది చికిత్స పొందుతుండగా 18మంది ప్రాథమిక చికిత్స అనంతరం తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. వేగంగా దూసుకెళ్తున్న ఈ బస్సు రోడ్డు మలుపులో మొదట తాటిచెట్టును, తర్వాత వరుసగా మూడు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టి పక్కనే పంటబోదెలో రెండు పల్టీలు కొట్టింది. ఉదయం దట్టంగా పొగమంచు ఉండటంతో డ్రైవరుకు దారితెలియకనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుండి నర్సాపురానికి ఒకే డ్రైవరు బస్సును నడుపుతున్నట్టు తెలిసింది. పోలీసులు పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం... బోల్తా పడిన కావేరీ ట్రావెల్స్ బస్సు