
పుణె, ఏప్రిల్ 4: ఇంకా దేశంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్లు లేవని, ఇది సిగ్గుచేటని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కెవైసి నిబంధనలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్మెంట్ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అక్కడ బ్యాంక్ ఖాతాను తెరవడంలో ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్న మీడియా వార్తాలను ఆయన గుర్తుచేశారు. బ్యాంక్ ఖాతాలను ప్రారంభించేందుకు కావాల్సిన కెవైసి నిబంధనలను రూపొందించిన దువ్వూరికే ఇలాంటి పరిస్థితి వస్తే ఆ నిబంధనలు ఎలా ఉన్నాయో, వాటి అమలు ఏ తీరులో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక్కడ ఆర్‌బిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ 10వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు అకౌంట్లు అందరికీ లభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కొత్త బ్యాంకుల ఏర్పాటు కోసం 25 దరఖాస్తులు వస్తే కేవలం రెండు సంస్థలకే లైసెన్సులు దక్కిన నేపథ్యంలో రఘురామ్ రాజన్ దీనిపై స్పందించారు. ఇటీవల లైసెన్సులు దక్కని సంస్థల్లో కొన్ని ఇప్పుడున్న బ్యాంకింగ్‌కు పూర్తి భిన్నంగా ప్రత్యేక బ్యాంకింగ్ సేవలను అందించేందుకు అనువైనవని భావించినట్లు చెప్పారు. అందుకే మరోసారి వాటికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించామన్న ఆయన వాటికి లైసెన్సులను భిన్నమైన విధానంలో అందిస్తామని తెలిపారు. ప్రత్యేక బ్యాంకుల ఏర్పాటుకు వీలుగా అవి ఉంటాయని విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు అందని చోటకు కూడా సమర్థవంతమైన బ్యాంకింగ్ సేవలను డిఫరెన్షియేటెడ్ బ్యాంకుల ద్వారా తీసుకెళ్లవచ్చన్నారు. కాగా, ప్రజల కనీస అవసరాలను తీర్చడం కోసం, అల్పాదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలను దగ్గర చేయడానికి, చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఇప్పుడున్న బ్యాంకులకు భిన్నంగా కొత్తతరహా బ్యాంకులను ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ యోచిస్తోంది. ఈ యోచనకు తగ్గట్లుగానే ఇటీవలి దరఖాస్తులను పరిశీలించిన బిమల్ జలాన్ కమిటీ వీటిలో డిఫరెన్షియేటెడ్ బ్యాంకులకు అనువైనవి ఉన్నాయని అభిప్రాయపడిందని రాజన్ చెప్పారు. దశాబ్దకాలం తర్వాత ఆర్‌బిఐ కొత్త బ్యాంకింగ్ లైసెన్సుల కోసం ఆహ్వానించడంతో 27 సంస్థలు దరఖాస్తు చేసుకోగా, టాటా సన్స్, విడియోకాన్ గ్రూప్ ఉపసంహరించుకున్నాయి. దీంతో బరిలో 25 సంస్థలు నిలవగా, ఇందులో వౌలికరంగ రుణాల సంస్థ ఐడిఎఫ్‌సి, సూక్ష్మ రుణాల సంస్థ బంధన్‌కు లైసెన్సులు దక్కాయి. తపాలా శాఖ లైసెన్సుపై ప్రభుత్వంతో చర్చిస్తామని ఆర్‌బిఐ ప్రకటించింది. మిగతా 22 సంస్థల్లో ఉన్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌తోపాటు ఆదిత్యా బిర్లా, బజాజ్ గ్రూప్ తదితర సంస్థలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఐడిఎఫ్‌సి, బంధన్ సంస్థలు 18 నెలల్లోగా, మార్గదర్శకాలకు లోబడి బ్యాంకుల ఏర్పాటుకు సన్నద్ధం కావాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27 ప్రభుత్వరంగ, 22 ప్రైవేట్‌రంగ బ్యాంకులతోపాటు దాదాపు 50 విదేశీ బ్యాంకులున్నాయి.