లైట్లు ఆరుతున్నాయి ---- కథానిక
- జోగారావు గుండాన,
6-342, శ్రీ సాయినగర్, సింహాచలం పోస్టు,
విశాఖపట్నం, సెల్ : 9490185708.
ఆ వంద నోటు అంటే ముకుందానికి ఎంతిష్టమో.
దాని కోసం ఏమైనా చేస్తాడు. ఎన్ని సన్నాయి నొక్కులైనా నొక్కుతాడు.
కాకమ్మ కబుర్లు చెబుతాడు. కథలు అల్లుతాడు.
అవును మరి ఒక్క నిముషం పనికి పచ్చని వంద నోటు అమాంతం వచ్చి పడుతుంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ఆనందో బ్రహ్మ.
ముకుందం రాయగడలో రైల్వే విద్యుత్ విభాగంలో టెక్నీషియన్‌గా షిప్పువైజు డ్యూటీపై పని చేస్తుంటాడు. ముకుందానికి పెళ్ళయి ఇరవై ఏళ్ళయింది. ప్రప్రథమ సంతానం కుమార్తె. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా రెండో బిడ్డకు పదిహేనేళ్ళు పట్టింది. నిండుగా బొద్దుగా పుట్టిన కొడుకంటే ముకుందానికి అమితమైన ప్రేమ. వాడు ఆడిందే ఆట. పాడిందే పాట.
కుమార్తె పుష్పవతి అయిన వెంటనే పెళ్ళి సంబంధాలు వెదకడం ప్రారంభించిన ముకుందం అమ్మాయికి పద్దెనిమిది నిండే నాటికి తన తాహతుకు తగ్గట్టు ఒక సంబంధం చూసి ఖాయం చేసి పెళ్ళి జరిపించేసాడు. అల్లుడు పార్వతీపురం స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో అసిస్టెంట్.
ముకుందానికి ఫస్ట్‌నైట్ అంటే ఎంతో ఇష్టం. మార్నింగ్ డ్యూటీ నాలుగు రోజులూ కొడుక్కి స్కూలుకు తీసుకువెళ్ళి తేవడానికి ఇబ్బంది అని సహోద్యోగుల్ని బ్రతిమాలి ఫస్ట్‌నైట్ డ్యూటీ మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది వరకు డ్యూటీకి మార్చుకుంటాడు. సెకండ్ నైట్ డ్యూటీ పడితే చాలు రాత్రి పది నుండి ఉదయం ఆరు వరకు నా ఆరోగ్యానికి పడదని, పైగా భార్య రోగిష్టి అని అందమైన అబద్ధాలు చెప్పి సహోద్యోగులకు నైట్‌డ్యూటీ అలవెన్స్ ఎర చూపించి ఫస్ట్‌నైట్ డ్యూటీకి మార్చుకుంటాడు. లొంగని వారిని వడ్డీ లేని చేబదుళ్ళతో అవసరంలో ఆదుకుని మోహమాట పెట్టేస్తాడు.
ఇంత తాపత్రయం, అభిమానం ఫస్ట్‌నైట్ డ్యూటీపై ఎందుకు?
ఎందుకంటే ఫస్ట్‌నైట్ డ్యూటీలో పచ్చని వంద నోటు పలకరిస్తుంది. ఒక్క నిముషం పనికి ఎవరిస్తారు?
రైల్వే విద్యుత్ విభాగంలో టెక్నీషియన్ ముకుందం పని రాయగడ రైల్వే స్టేషన్‌లో విద్యుత్ విభాగం సరఫరా చూసుకోవడం.
ఆరోజు ఫస్ట్‌నైట్ డ్యూటీలో సాయంత్రం అయిదు గంటలకు మల్లేశు సోమేశు వచ్చి ముకుందానికి వంద నోటు అందించారు.
‘‘ ఈరోజు వంద నోటిస్తే సరిపోదు. పండగ మామూలు కాస్త ఎక్కువ ఇవ్వాల్సిందే’’ అన్నాడు ముకుందం.
మల్లేశు బృందం రెండు వందలు ముకుందం చేతిలో పెట్టింది.
సాయంత్రం ఆరు గంటల ఇరవై నిముషాలకు రాయగడ రైల్వేస్టేషన్లో మైకులో ప్రకటన...
‘‘ ఎల్లెప్పీ నుండి టాటా పోవు బొకారో ఎక్స్‌ప్రెస్ కొద్ది నిముషాల్లో ఒకటో నెంబరు ప్లాట్‌ఫారం పైకి వచ్చును’’
ప్రయాణికుల్లో కలకలం... అంతా హడావుడి.
బొకారో ఎక్స్‌ప్రెస్ ఒకటో నెంబరు ప్లాట్‌ఫారంపైకి వస్తుండగా స్టేషన్లో లైట్లు ఆరిపోయాయి. అంతా చీకటి. బండి ప్లాట్‌ఫారంపై ఆగింది.
జనరల్ బోగీల దగ్గర అరుపులు, కేకలు.
‘‘అమ్మో నా చెయిను... నాయనో నా నెక్లెసు’’
ఒక్క నిముషం తర్వాత లైట్లు వచ్చాయి. ఏడుపులు, గుండెబాదుడు.
మెళ్ళో వస్తువులు పోగొట్టుకున్న వారు వెక్కివెక్కి ఏడుస్తున్నారు.
* * *
డబుల్ ధమాకా రెండొందల రాబడితో ఆనందంగా ఉన్న ముకుందానికి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. విషయం తెలుసుకుని కుప్పకులిపోయాడు. పండగకు కన్న వారింటికి వస్తున్న ముకుందం కుమార్తె రాయగడలో జనరల్ బోగి దిగుతున్న సమయంలో లైట్లు ఆరిపోగా మెడలో చెయిన్ ఎవరో లాగేసారట.
ముకుందం మల్లేశు బృందాన్ని కలసి చెయిన్ ఇచ్చేయమని కోరాడు. వారు మాకు తెలియదని, ఇది మా పని కాదని పండగ సమయాల్లో బొకారో ఎక్స్‌ప్రెస్‌లో మునిగుడ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుందని తెలిపారు. ఇది వారి పని అయి ఉండవచ్చని చెప్పి చల్లగా జారుకున్నారు. రాయగడ రైల్వేస్టేషన్ జిఆర్‌పి రిపోర్టు ఇవ్వడానికి ముకుందానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే ప్రతిరోజు రాయగడ రైల్వేస్టేషన్‌లో బొకారో ఎక్స్‌ప్రెస్ వచ్చే సమయంలో ఒక్క నిముషం పాటు లైట్లు ఆరడం వెనుక మతలబు హస్తం పోలీసులకు తెలుసు. ఏ ముఖం పెట్టుకుని ఫిర్యాదు చేస్తాడు.
మరుసటి రోజు ముకుందం పాతిక వేలు లోను కోసం ప్రావిడెంట్ ఫండ్‌కు అప్లయ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే కూతురు వేసుకుని వచ్చిన చెయిన్ అత్తగారిది. కోడలు కన్నవారింటికి వెళుతోందని, బోసి మెడలో తన చెయిను వేసి పంపించింది. మళ్ళీ అటువంటి చెయిను తయారు చేయించి ఇవ్వకుండా కూతుర్ని అత్తగారింటికి ఎలా పంపగలడు? పంపలేదు!
ముకుందం షిఫ్ట్‌డ్యూటీ మార్చుకోవడం మానేసాడు.
తేరగా వచ్చే వంద నోటుకు శతవందనాలు పెట్టి చెంపలు వాయించుకున్నాడు. షిప్టు ప్రకారం డ్యూటీలో బొకారో ఎక్స్‌ప్రెస్ రాయగడ ప్లాట్‌ఫారం పైకి వచ్చే ముందు విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా ఉన్నదీ లేనిదీ తనిఖీ చేసుకుంటున్నాడు.
సాయంత్రం ఆరు నుండి ఆరున్నర వరకు ఇప్పుడు రాయగడ రైల్వే స్టేషన్లో లైట్లు నిరాటంకంగా వెలుగుతున్నాయి.
శ
మనోగీతికలు
ప్రియతమా!
నిన్ను ఎలా విడువగలను?
ఆకర్షణలో వికసించే ప్రేమ
ఆచరణలో విరజిల్లే ప్రేమ
ఆలోచనలో అంకురించే ప్రేమ
ఆరు కాలాలు పాటు నిలిచే ప్రేమ
నువ్వు నన్ను మరచిన క్షణాన
నా కన్నీటి బొట్టులో నువ్వు కనిపించావు
ఆ కన్నీరు ఆవిరైపోతుంటే
తట్టుకోలేని నా హృదయం,
ఊపిరి విడవనుంది
ప్రపంచానికి నీవు ఒక్కడివే కావచ్చు
కాని నాకు మాత్రం నువ్వే ప్రపంచం
ప్రియతమా క్షణకాలం నీ విరహం
నూరు వసంతాల దరహాసం
మరపురాని నీ మృదుహాసం
మరుజన్మ దాకా మధుమాసం
ఊపిరి లేక మనిషి లేడనేది ఎంత నిజమో
నీవు లేక నేను లేదనేది అంత నిజం
నా ఊపిరివైన నిన్ను ఎలా మరువగలను?
జన్మజన్మలకీ నాకే కావాలి నీ ప్రేమ
- వి.వి. సుజాత, విశాఖపట్నం
నువ్వే నేను
ఆశ్చర్యం
నిశీథిలో వెలుగు
నీ రాకతో
మల్లెతీగ
ఆకాశానికి
ఎగబ్రాకుతోంది
నీ వల్ల నేనూ
నేనెందుకు
నువ్వధిరోహించు
నువ్వే నేను కదా!
-గగనం శ్రీనుకుమార్,
తెలుగు పండిట్, పాతవీధి,
యలమంచిలి, విశాఖ.
సెల్ : 8008262514
నువ్వే నేను
ప్రతి మనిషి ఆశ పడడం తప్పు కాదు కానీ దురాశే కూడదు
ఎంత చెట్టుకు అంతగాలి... మన శక్తి సామర్ధ్యాలను బట్టే ఫలితం
ఈ సత్యం తెలుసుకోనంత కాలం ఎవరికైనా జీవితం దు:కభిరతమే
అందుకే ఎవరైనా తొలుత నేర్చుకోవలసింది ప్రాపంచిక జ్ఞానమే
అది తెలిసిన నాడు ఈ లోకంలో అన్నీ ఇట్టే అర్ధమవుతాయి
అప్పుడు మనల్ని ఏదీ బాధించదు... ఏదైనా సంతషమే కలిగిస్తుంది
సూర్యోదయం సూర్యాస్తమయం వెలుగు చీకట్ల భ్రమణం
అంతా ఆ ఈశ్వరేచ్ఛ అని, సామాన్యులమైన మన చేతిలో ఏమీ లేదని
అవగాహన కలిగించుకున్న నాడు మనలో వ్యథ తొలగిపోతుంది
అప్పుడు జీవన యానంలోని లోతుపాతులు స్పష్టంగా అవగతమై
అంతా ఈశ్వరుడే అని బోధపడుతుంది... మానసిక గ్లాని తగ్గుతుంది!
- రాగసుధ, విశాఖపట్నం
జీవితమొక సుందర స్వప్నం
తరలి వెళ్ళిన కోయిల తిరిగి రాదు
తీరం దాటిన అల మరలిపోదు
ప్రపంచమొక రసరమ్య కావ్యం
జీవితమొక సుందరస్వప్నం
కాని అనుభవాల కొలిమిలో
అనుభూతి నిప్పు ఆరిపోతుంది
ఆనందానే్వషణలో హృదయం నిండా
మురికి పేరుకుపోతోంది
అనుమానాలు అపార్థాలు భయాలతో
జీవితాలు కూలిపోతున్నాయి
మాధుర్యం పంచాల్సిన మనసులు
విరిగిన పాలయి నేల పాలవుతున్నాయి
ఏ వ్యక్తీ ఏ వ్యక్తికీ మిత్రుడూ కాదు శత్రువూ కాదు
అవసరాలకు తగ్గట్లు ఆయా స్థానాలను అలంకరించేవారే
జీవన పద్మవ్యూహంలో జనునలందరు అభిమన్యులే
అనే సత్యం జీవితం రుజువు చేస్తున్నపుడే
వ్యక్తుల మధ్య బంధం, వ్యాపార సంబంధం కాదు
అది మమతల మణిహారం అంటూ
మానవతావాదుల స్ఫూర్తి మనసులో నిలుపుకోవాలి
స్వప్నం దర్శించాలి సాకారం చేసుకోవాలి
మనిషిగా నడవాలి మనిషిగా గెలవాలి
జీవనయానం సంతృప్తం చేయాలి
సుందర స్వప్నాలు పరిమళాలై లోకమంతా పరుచుకోవాలి
- శివలెంక ప్రసాదరావు,
రామాకాలనీ, సాలూరు.
సెల్ : 9949252558.
జీవితం
జీవితం ఊహించని మలుపుల ప్రయాణం
జీవితం రంగుల కలల ప్రపంచం
జీవితం నిస్సారమైన నిట్టూర్పుల నిర్వేదం
జీవితం మధురమైన జ్ఞాపకాల మణిహారం
అది అందుకుంటే అందమైన అనుభవం
- శారద, నక్కపల్లి. 9493642043.
============
జీవన కోలాహలాల స్వరం ‘కథా పార్వతీపురం’
పుస్తక సమీక్ష
ఇటీవల ఉత్తరాంధ్ర నుండి వెలువడిన బలమైన కథా సంకలనం కథా పార్వతీపురం. 2012వ సంవత్సరానికి శుభారంభమిస్తూ ఈ నాలుగు వందల నలభై పేజీల పుస్తకం, నూట పదేళ్ళ కాలంలో వెలువడిన కథలకు ప్రాతినిధ్య ప్రాధాన్యత ఇస్తూ, యాభయి రెండు మంది కథకులు, కథకురాళ్ళ రచనలను నిండుగా అందించిన సందర్భం.
ప్రముఖ కథా రచయితలు, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు సంకలనకర్తలుగా పార్వతీపురం ప్రాంత కథకుల రచనలే ఎంపికకు పరిధిగా, అలనాటి ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ గారి కథ ‘లలిత’తో మొదలుపెట్టి వర్తమాన రచయిత్రి అయిన బెలగాం గాయత్రి కథ ‘అమ్మోయ్ నందు’ వరకు ఎన్నో స్వరాలు, విలక్షణ జీవిత చిత్రణ చేస్తూ సాగిపోతాయి. కథ కథకో వ్యథ, వ్యథ వ్యథకో సొద, నూట పదేళ్ళ కాలపు ఉత్తరాంధ్ర ప్రాంతపు సామాన్య జన జీవనపు వేలాది విషయాలు తమ ఇతివృత్తాలుగా ఈ రచయితలు రచయిత్రులు తమ కథలు తీర్చిదిద్దారు.
గ్రామీణ సమాజం ఎలా నెమ్మది నెమ్మదిగా నగరీకరణకు గురైందీ, చేతివృత్తుల సమాజ చట్రం ఎలా ముక్క ముక్కలయి మనిషి కొత్త నాగరికతలు వచ్చి మీద పడుతుంటే ఎలాంటి అవస్థలు పడుతున్నాడో ప్రతి కథా తనదైన శైలిలో తెలియజెపుతాయి. ఇలా ఒక ప్రాంతం నుండే కథలు రావడం కొత్త కాకపోయినా, పలు ప్రాంతాల కథలుగా విలువైన సంకలనాలు వెలువడుతున్న తరుణంలో ఉత్తరాంధ్ర సైతం ఇలా యాభయి రెండు మంది రాసిన కథల నిలువుటద్దాన్ని ఏర్చికూర్చి గడచిన శతాబ్ద కాలం ఎలా గడిచిపోయిందో, పాఠకుల కనుల ముందు నిలిపే నిజాయితీ అయిన ప్రయత్నంగా ఈ సంకలన అలరిస్తుంది.
ఒక ప్రాంతపు కథల్ని వెలువరించే క్రమంలో సంపూర్ణ ప్రాతినిధ్యం దిశగా సంపాదకులు ఆలోచించి ఉంటే ఈ కథాపార్వతీపురంలో గురజాడ జీవిత కాలంలో అచ్చయిన రెండు కథల్లో (దిద్దుబాటు, దేవుళ్ళారా మీ పేరేమిటి?) లోకమంతా ఎరిగేలా ఒక కథయినా చోటు చేసుకుని ఉండేది. నిజానికి నూరేళ్ళ కిందటే దేవుళ్ళారా మీ పేరేమిటి? తెలుగు కథానికను పురుటి నొప్పుల వేళలోనే శిఖరాల ఎత్తుకు తీసుకెళ్ళిందనేది కథా ప్రక్రియ విమర్శకులు, మంచి సాహిత్యాభిరుచి గల పాఠక లోకం రెండో మాట లేకుండా అంగీకరిస్తారు.
గురజాడ లేని ఉత్తరాంధ్రకు చెందిన ఎంత పార్వతీపురం ప్రాంతీయుల కథలే అనుకున్నా, పార్వతీపురానికి విజయనగరం కేవలం అరవై మైళ్ళ దూరంలోనే ఉందన్నదీ వాస్తవం. పార్వతీపురానికి చెందిన ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ, గురజాడ మిత్రులు కూడా అయిన వాస్తవం కూడా ఒకటి ఉంది. అందువల్ల ఆచంట వారి తర్వాత, సరాసరి ఎస్వీ జోగారావు గారేనా కథా వారసులు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయినా ఒక బృహత్ సంకలనం తీసుకు వచ్చ క్రమంలో కొన్ని ప్రశ్నలుదయించడం సహజం అని మనం భావించవచ్చు.
ఇక నాటక రచయితలు (గణేష్‌పాత్రో), నటులు (గొల్లపూడి మారుతీరావు), ద్యమకారులు వంగపండు ప్రసాదరావు వంటి వారు కథా పార్వతీపురంలో పార్వతీపురీయులుగా కనిపించి, కథలు వినిపించి మనల్ని ఆశ్చర్యపరుస్తారు. కొన్ని తరాల తెలుగు కథకుల రూపురేఖలు, సాహిత్యమూర్తిమత్వాలు ఈ విస్తార సంకలనం ద్వారా పరిచయమవుతాయన్నది వాస్తవం.
అగ్రహారాల బ్రాహ్మణ జీవితాలు మొదలుకొని పేదవాడల బతుకు గోసల దాకా ఈ ఉత్తరాంధ్ర కలాలు, చిత్రించని విషయం, దర్శించని దృశ్యం, ఘోషించని వేదన లేవంటే ఈ కథా పార్వతీపురాన్ని పొగుడుతున్నట్లు కాదు. ఉన్న సంగతే అది.
ప్రముఖ సాహిత్యవేత్త గుడిపాటి సునిశితమైన ముందు మాటతో, అందమైన ముఖచిత్రంతో, కొన్ని తరాల కథా సంబరాల వేదికగా, చాలా కాలం సాహిత్య పరిశోధకులు, పరిశీలకులు, కథా ప్రియులు ఉపయోగించుకునేలా వెలువడింది ఈ సంకలనం.
పంతుల జోగారావు, జగన్నాథశర్మ, చింతా అప్పలనాయుడు, మల్లిపురం జగదీష్, జి. ఎస్. చలం, పక్కి రవీంద్రనాథ్, పి. కమలకుమారి, తనికెళ్ళ కల్యాణి, ఆప్తచైతన్య, దాసరి రామచంద్రరావు, కీర్తిశేషులు భూషణం, బి. వి. ఎ. రామారావు నాయుడు ఇంకా పేరు పేరునా స్థలాభావం వలన ఉదహరించలేని కథాశిల్పుల నిలువెత్తు కథా శిల్పాలు కనువిందు చేసే మన అక్షరాల పెరటితోట, ఊహలు గర్జించిన, ఊహలు గలగలా పారిన జన ఉద్యానవనం ఈ కథా పార్వతీపురం.
స్నేహకళా సాహితి, కురుపాం/పార్వతీపురం వారి ప్రచురణగా ఫిబ్రవరి 2012లో వెలువడి రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభించే ఈ సంకలనం రెండు యాభైల తెలుగు కథకు వందనం మూడు యాభైల గురజాడకు ఈ కథా పార్వతీపురం అంకితం ఇచ్చారు. రూ. 250ల వెలకు ఈ మంచి పుస్తకం అందుబాటులో ఉంది.
==========
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపించండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9. ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17.,
merupu@deccanmail.com