Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కొన్ని పనులు...

$
0
0

కొన్ని పనులు అనుకుంటాం కానీ వెంటనే చేయం. ఆ తరువాత పరిస్థితి దాటిపోతుంది. అనారోగ్యంగా వున్న వ్యక్తులని కలిసి రావాలని అనుకుంటాం. కానీ ఏదో కారణాల వల్ల కుదరదు. ఆ తరువాత పలకరించే పరిస్థితి ఉండదు.
ఈ మధ్య అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మా పెద్దనాయన కొడుకు అంటే మా అన్నయ్య ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. చూడాలని అనుకున్నాను. ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఇల్లు మారారు. కానీ తెలుసుకోవాలని అనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ ప్రయత్నం చేయలేదు.
మా మేనకోడలు ఇందిరా, ఆమె భర్త శ్రీనివాసులు ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు మా అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆమె కూడా కలిసి రాలేదు. కానీ నాకు ఆయన కొత్త చిరునామా చెప్పింది. ఒకసారి చూసి రావాలని అనుకున్నాను. కానీ నా పనులు, ఒత్తిడులు నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. మరీ సీరియస్‌గా ఉందని నేను అనుకోకపోవడం బలమైన కారణం కావొచ్చు.
చివరికి ఒకరోజు ఉదయమే మా చిన్నన్న ఫోన్ చేసి మా కజిన్ చనిపోయాడని చెప్పాడు. చిరునామా తెలుసుకొని నేనూ, మా ఆవిడా వెళ్లి వచ్చాం.
బతికి వున్నప్పుడు రాకపొయ్యామన్న బాధ ఎక్కువ వేసింది. మా మేనకోడలు ఇందిర కూడా కలిసింది.
‘మామా! మిమ్మల్ని వెళ్లి చూడమని చెప్పాను. కానీ నేను కూడా వచ్చి చూడలేదు’ అంది.
ఇద్దరమూ అనుకున్నాం.
కానీ వెళ్లి చూడలేదు. ఎవరి కారణాలు, ఒత్తిడులు వారికి ఉండవచ్చు. కానీ ఆ బాధ అలా కొనసాగింది.
చనిపోయినప్పుడు వెళ్లి చూడటం ఎంత ముఖ్యమో అనారోగ్యంగా వున్నప్పుడు వెళ్లి పలకరించడం అంతకన్నా ముఖ్యం. చనిపోయినప్పుడు ఆఖరి చూపు చూడటం వాళ్ల పట్ల మన గౌరవాన్ని వ్యక్తీకరిస్తుంది. కుటుంబ సభ్యులకి కొంత ధైర్యాన్ని ఇస్తుంది. బతికి వున్నప్పుడు కలిసి వస్తే ఆ అనారోగ్యంగా వున్న వ్యక్తి బతుకు మీద భరోసా కలిగిస్తుంది. ఆత్మీయులని సన్నిహితులని చూశానన్న తృప్తి మిగులుతుంది.


మాయ జింకను చంపాల్సిందేనని లక్ష్మణుడికి చెప్పిన రాముడు ( అరణ్యకాండ)

$
0
0

సీతాదేవి కోరిన విధంగా మృగాన్ని పట్టుకోవాలని భావించిన శ్రీరామచంద్ర మూర్తి సంతోషంగా లక్ష్మణుడితో అన్నాడిలా: ‘లక్ష్మణా! చూశావా! ఈ జింక మీద సీతకు ఎంత ఆశ కలిగిందో? ఆడవారి మాటలకు, కోరికలకు ఏముంది అంటావా? అది వేరే సంగతి. మనం కూడా ఇలాంటి సౌందర్యంకల జింకను చూశామా? మున్ముందు చూడగలమా? ప్రపంచమంతా మనం చూశామా? ఎక్కడేముందో ఎవరికి తెలుసు అంటావేమో? చూడకపోతే పోనివ్వు. ఈ లోకంలో కాకపోతే పోనీ. ఇంద్రుడి నందనవనంలో కుబేరుడి చైత్ర రథం ఉందని ఎవరైనా చెప్పగా విన్నామా? లేదు కదా? దీని (జింక) కాంతి ఆకాశాన్ని తాకుతున్నది కదా? బంగారు వనె్నతో ప్రకాశించే చుక్కల సమూహంతో అందంగా వుంది కదా? వెంట్రుకలు కొన్ని అనులోమంగా, కొన్ని ప్రతిలోమంగా ఉన్నాయి కదా? అది ఆవలిస్తే మేఘం నుండి వెలువడ్డ మెరుపు లాగా అగ్నిజ్వాల లాంటి నాలుక నోటి నుండి బయటకు వస్తున్నది.’
‘ఈ జింక ముఖం ఇంద్రనీల కాంతిలాగా, కడుపు శంఖం లాగా ముత్యంలా తెల్లగా, ఠీవి సౌందర్యంలో అతి గొప్పగా ఉంది. ఇలాంటిది ఎవరి మనసు హరించదు? అనేకమైన రత్నకాంతులతో నిండి, బంగారు వనె్నతో కూడి, రూపం చూడగానే సీత మాట ఎలా వున్నా, ఏ మనుష్యుడి మనస్సు కరగకుండా ఉంటుంది? రాజులు మాంసం కొరకు వేటలో మృగాలను చంపుతారు. ధాతువులనే మణులను, బంగారాన్ని, ధన సమూహాన్ని, వేటలోనే సంపాదిస్తారు. రాజుకు సర్వం అడవిలోనే దొరుకుతుంది. ఈ మృగాన్ని చంపడం వల్ల ఏ విధంగా విశేషార్థ లాభం కలుగుతుంది అంటావా? బంగారుమయమైన ఈ శ్రేష్టమైన జింక చర్మం మీద సీతాదేవి నాతో కలిసి కూర్చోవాలని ఆశ పడుతున్నది. మృగ జాతుల్లో భూమీదఈ జింక, ఆకాశంలో చంద్రుడిలోని జింక, రెండే మనోహరమైనవి కానీ మిగతావన్నీ కావని నా అభిప్రాయం. ఇది మాయామృగం. జీవితంలో పట్టుబడదు. అందుకే దీన్ని చంపాలి.’
శ్రీరాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ‘ఈ కారణాన పరాక్రమంతో దీన్ని చంపడమే తగిన పని. ఈ ప్రదేశంలోనే పూర్వం వాతాపి అనే రాక్షసుడు మునుల కడుపుల్లో ప్రవేశించి తేలులాగా వాళ్ల పొట్టలు పగులచీల్చి హింసా మార్గంలో నడుస్తుండే వాడు. ఒకనాడు అగస్త్య ముని వాడిని తిన్నాడు. అతడి కడుపులోంచి లేవడానికి ప్రయత్నించే సమయంలో అగస్త్యుడు వాడు భయపడేట్లు, రాక్షసుడు బ్రాహ్మణులంటే లక్ష్యం లేకుండా దయాహీనుడై పాపం పనులు చేస్తున్నాడనీ, శాశ్వతంగా తన కడుపులో జీర్ణమై పొమ్మనీ అన్నాడు. ఆ విధంగా అగస్త్యుడు వాడిని చంపాడు. వీడూ ఆ వాతాపి అంతటివాడే! అగస్త్యుడి వల్ల వాడు ఎలా చచ్చాడో, వీడు కూడా మనల్ని మోసగించడానికి వచ్చాడు కాబట్టి, వీడూ చావాల్సిన వాడే. నేను వేట కోసం పోతాను. నువ్వు దృఢ ప్రయత్నంతో సీతకు అపాయం కలగకుండా కాపాడాలి. మన ప్రయత్నాలన్నీ ఈమె మీదే ఆధారపడి వున్నాయి. కాబట్టి శ్రద్ధగా రక్షించు. ఈ మృగం నువ్వు చెప్పినట్లు రాక్షస మాయ అయితే చంపుతాను. లేక సహజ మృగమే అయితే జాగ్రత్తగా పట్టి తెస్తాను. వీటిలో ఏదో ఒకటి చేస్తాను. లక్ష్మణా! సీతాదేవిని చూస్తుండు జాగ్రత్తగా. ఆ మృగం చర్మం మీద ఎంత మోహం పెట్టుకుని చూస్తున్నదో కదా!’
‘కాబట్టి ఒక్క బాణంతో ఈ జింకను చంపి చర్మం తీసుకుని శీఘ్రంగా వస్తాను. ఒక బాణ ప్రయోగానికి ఎంతసేపు పట్తుందో, అంతసేపట్లోనే వస్తాను. నేను బాణం ప్రయోగించడమే ఆలస్యం. నేను వచ్చేదాకా ఈ సీతను నువ్వు హెచ్చరిక తప్పకుండా ఏకాగ్ర మనస్సుతో సర్వదా కాపాడు తమ్ముడా. పక్షిరాజైన జటాయువు కార్యసాధన సమర్థుడు. మంచి బలవంతుడు. కార్యాలోచన, కార్యదక్షణ, ధైర్యం కలవాడు. ఆయన నీకు సహాయకుడుగా ఈ సీతాదేవిని ప్రతిక్షణం, ఏ మూల ఏం జరుగుతుందో అన్న ఏమరుపాటుతో, ఏ మాత్రం పొరపాటు చేయకుండా ఒక వ్రతంగా భావించి రక్షిస్తాడు.’
(శ్రీరాముడి చర్య వలన గ్రహించాల్సిన నీతి ఉంది. ఆయన భ్రమ పడడమే కాకుండా, లక్ష్మణుడు చెప్పినా వినలేదు. మారీచుడి మాయ అని నమ్మితే, ఉన్నచోటే వుండి బాణ ప్రయోగం చేయవచ్చు కదా? జింక వెంట పోవాల్సిన పని లేదు. కాకాసురుడి వెంట పడిపోలేదు కదా? కాబట్టి అది నిజమైన జింకే అన్న భ్రాంతి వదలలేదు. సీతాదేవి లోకమాన్య స్ర్తి అవుతుందా? ఆమెకు తెలియని విషయాలు లేవు కదా? బంగారు జింక లోకంలో వుండదని తెలియదా? పరమ భక్తిగల సీత ఎందుకు ఒక క్షుద్ర మృగానికై భర్తను వదిలి వుండాలని అనుకుంది? కాబట్టి కర్మానుసారం బుద్ధి అనే నీతి బలపడుతున్నది.
పరమార్థం విచారిస్తే.. మనుష్యులకు కోరికలు కోరే స్వాతంత్య్రం ఉంది. దాన్ని నెరవేరుస్తాడు. కాని దాని ఫలం అనుభవించమని అంటాడు. కాబట్టి మంచి కోరికలు కోరే వారికి మంచి ఫలమే కలుగుతుంది. చెడు కోరికలు కోరేవారికి కలిగేది చెడు ఫలమే! ప్రకృతి విషయమైన కోరికలు కోరేవారందరికీ సీతాదేవికి పట్టిన గతే పడ్తుంది. మారీచుడి మాయే ప్రకృతి. ప్రపంచంలో మనం చూసేవి, వినేవి అన్నీ ప్రకృతి చిత్రాలే! సీతాదేవి మాయ జింకను చూసి భ్రమించి ఆశ పడినట్లు మనం కూడా చిత్ర విచిత్రమైన ప్రకృతి పదార్థాలను చూసి సత్యమని భ్రమ పడుతున్నాం. ఇవి సత్యం కావు. క్షణభంగురాలు. ఆ జింక వల్ల సీతాదేవి ఎలా సుఖపడాలని కోరుకుందో అలాగే మనం ప్రకృతి పదార్థాలవల్ల ఆనందపడాలని కోరతాం. రామచంద్రమూర్తి సీతాదేవి కోరిక నెరవేర్చినట్లే మన కోరికనూ నెరవేరుస్తాడు. సీతాదేవి అనుభవించిన ఫలం మనం కూడా అనుభవించబోతున్నాం. సీతకు ఏం ఫలం కలిగింది? అది మున్ముందు తెలుసుకుంటాం.)

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690
-సశేషం

వెంటాడే క్షణాలు..

$
0
0

ఫరిచయాలు వ్యసనాలు కావు. జ్ఞాపకాలు ముండ్ల గులాబీల్లాంటివి; ముండ్లు, తొడిమలు, దళాలు వాడిపోయినా - వాడి’ పరిమళాలు శాశ్వతానుభూతులు! ఆశావాదులు ఎల్లవేళలా ఎదురుచూడటం - బలవంతంగానైనా అలవర్చుకుంటారు. నిరాశావాదులు ‘వర్రీ’ అవడం హాబీగా పెట్టుకుంటారు. లాటరీ టిక్కెట్ కొనడం, ఉద్యోగం కోసం అప్లికేషన్ పంపడం ఒక్కలాంటివే ననిపించింది. ఆ ప్రయత్నం చెయ్యలేదు.
మా పినతండ్రి భార్య పార్వతి (కక్కి) మా నాయనమ్మకి స్వయానా మేనకోడలే. మా నాన్నగారిని అంటే పెద్ద బావగారిని కూడా ‘ఏరా, బావా!’ అని పలకరించేది. ఆమె ఒక కథల పుట్ట. ‘కక్కి’ అని పిల్చేవాళ్లం - విజయనగరం ‘చిక్కోల్ ప్రాంతపు సంప్రదాయాన్ని బట్టి - ఆమె అరేబియన్ నైట్స్ కథలు - బేతాళ కథలు కూడా వరస తప్పకుండా - ‘టెంపో’ సడలకుండా విసుక్కోకుండా చెప్పేది. కాశీ మజిలీ కథలు ఎంత బాగా చెప్పేదీ అంటే ‘మధిర సుబ్బన్న దీక్షితులుగారు మా పిన్ని దగ్గరే విన్నాడా?’ అన్నట్లు చెప్పేది. శ్రద్ధగా ఆలకించేవాడ్ని. అలా శ్రద్ధగా ఆలకించే అలవాటు, నాకు ఆనక స్కూల్లో చాలా బాగా పనికొచ్చింది. సరే, పోయిన సారి మద్రాసు వెళ్లినప్పుడు ‘కనె్నమెరా’ లైబ్రరీకి వెళ్లాను. వెతుక్కుంటూ, తెలుగు సెక్షన్‌కి పోయాను. అక్కడ శిథిలమైన కొన్ని మ్యాగజీన్లు దొరికాయి. ‘పాపాయి’ అన్న మాసపత్రికలు దొరికాయి. ఈ పత్రిక ‘బాల’కి సమకాలీన పత్రిక. ‘సింహబలుని సాహస యాత్రలు’ అన్న సీరియల్ రాశాను. దీనికి ఆడబోయిన తీర్థం ఎదురొచ్చినట్లు.. ఆ పత్రికలు ఎదురొచ్చాయి. అట్లాగా పిల్లల కథలు చెప్పడం అన్నది అలవాటు అయిపోయింది.
‘శ్రీవాత్సవ’గారు ఎలా పరిచయమయ్యారో జ్ఞాపకం లేదు గానీ - మరీ చిన్నప్పుడే ఆయన రాసిన ఉత్తరాలు ఒకటి రెండు దొరికాయి.
‘అబ్బాయ్! భావోద్రేకం నీలో జలపాతం అంత వున్నది. కానీ దాన్ని పట్టుకునేందుకు ఆల్చిప్పలంత ‘మాటలు’ చాలవు. పద సంపద ముఖ్యం’ అన్నాడాయన. గొప్ప కోపం వచ్చింది నాకు. కానీ పర్యాయ పద కోశాలు, అర్థానుస్వార, పూర్ణానుస్వార పరిచ్ఛేదాలు వగైరాలు తిరగేయడం - తెలుగులోను, ఇంగ్లీషులోనూ అలవాటు అయింది. ఈ సన్నివేశం ఎందుకు జ్ఞాపకం వచ్చిందీ అంటే అరవై - అరవై ఒకటీకి మధ్య - ‘అంటే అప్పుడు ఈ ఎపిసోడ్ అన్న మాట) అభిమాని, స్టూడెంట్ ఐన ఆరాధన ఉత్తరం రాస్తూ... ‘కొంతమంది పెద్దలకి నా మీద ప్రిజుడిస్ ఏర్పడింది’ అన్నారు కదా, మీరు అని ప్రస్తావించింది.
‘ఎవరికి? భద్రిరాజు వారికా? శ్రీవాత్సవ గారికా? పోతుకూచి వారికా? మా ‘తెలుగు సార్‌కా?’ అంటూ హైద్రాబాద్ కాలేజీ పిల్లలు లెటర్సు రాశారు నాకు.
‘అయ్యయ్యో! భద్రిరాజు వారు చాలా పెద్దవాడు. ఆయన రాసిన భాషా చరిత్రయే చదువుకుంటున్నాను. సాంబశివరావు గారింక ‘యమా’ క్లోజయిపోయాడు. ‘విశ్వరచన’ ‘యూనిలిట్’ వగైరాలు - తన విశ్వసాహితీ ప్రచురణలు అన్నీ టంచన్‌గా టపాలో వస్తున్నాయి. ఇక ‘మంజుశ్రీ’ జిగ్రీ దోస్త్ అయినాడు’ అంటూ సమాధానాలు రాశాను.
ఇప్పుడు పెద్దయినాక రేడియో స్టేషన్‌కి తరచు పోయి రావడంతో శ్రీవాత్సవగారు - అనగా యండమూరి సత్యన్నారాయణ గారు నేరుగా పరిచయం అయి, ‘క్లోజ్’ అయ్యాడు. మా ఇంటర్‌మీడియెట్‌లో కాబోలు (1956)లో ‘ఖాసా’ వారు స్వర్గస్థులైనారు. తరువాత వారి తెలుగు ‘స్వతంత్ర’ని స్వంతంగా, నాన్నా తంటాలూ పడి తీసుకొచ్చిన వారిలో శ్రీవాత్సవ గారున్నారు.
అరవైలో వచ్చిన తెలుగు స్వతంత్ర నవలలు మీద వార్షిక సమీక్ష ఆంధ్రజ్యోతి, డైలీలో - ఎనిమిది కాలమ్స్ వెడల్పున - ‘ఈ ఏడాది పలువురిని ఆకర్షించిన పది నవలలు’ అంటూ సమీక్ష రాశాడాయన. అందులో నావి రెండు నవలలు, అలా ‘సన్మానం’ అందుకున్నాయి (ఓహోయ్!)
అప్పట్లో చాలా స్పీడుగా నవలలు రాస్తున్న వేళ - నారీమణి ‘లత’ అను తెనే్నటి హేమలత - ఆకాశవాణిలో అనౌన్సర్ గానీ, ఆమె గ్లామర్, పేరు ప్రఖ్యాతులు ఇంకా అదనంగా ఉండేవి. నాకు అభిమానులయిన ఆరాధనా, సుభద్ర, శశికళా, విక్టోరియా, బాబూరావు, ఆనందమోహన్ లాంటి కళాశాలల యువతరం - లతగారికి కూడా ఫ్యానే్స - పరిచయం లేకపోయినా.
నేను మద్రాసు నుంచి తిరిగి 1965 తర్వాత బెజవాడ తిరిగి వచ్చేశాక నేనూ, లతా జిగ్రీ దోస్తులై పోయాం. కానీ, 14.11.1960న ఆరాధనా - నాకు లెటర్ రాస్తూ, హిందూ పేపర్‌లో ‘వాంటెడ్ కాలమ్స్’ చూడమని సలహా ఇచ్చింది. ‘అన్నట్లు’ అంటూ, అండర్‌లైన్ చేసి అదే లెటర్‌లో ఇలా రాసింది. ‘విశాలాంధ్ర పత్రిక సండే పేపర్‌లో మహీధర రామ్మోహన్ గారు లత నవల (రాగజలధి) మీద రాసిన అభిప్రాయాన్ని చదివాను. మిమ్మల్ని పొగుడుతూ ‘లత దిగజారిపోతున్నది’ అన్నారు. మరి ఆవిడెందుకలా చేసిందో అర్థం కావడంలేదు’ అంటూ బాధపడింది.
ఆ అమ్మాయి రిఫర్ చేసిన నవల లతగారి ‘రాగజలధి’ అన్న కొత్త నవల. రామ్మోహన్ గారి దగ్గరకు పరిగెత్తాను - విశాలాంధ్ర ఆఫీసుకి. ఆయన రాసిన రివ్యూలని కత్తిరించి ఒక నోట్‌బుక్‌లో అంటించే వారాయన. నేనూ ఆయనని ఇమిటేట్ చేశాను అటు తర్వాత. ఆయన నవ్వుతూ క్లిప్పింగుల బుక్ నా చేతికిచ్చి, ‘తిట్టింది నేను రాసింది నేను. నువ్వెందుకలా చలికి వణికే పిల్లికూనలాగా ముడుచుకు పోతున్నావ్?’ అన్నారు ఇలా నవ్వేసి. ‘గర్వపడు. గానీ గర్వం ప్రదర్శించకు - ఎందుకంటే, లత మంచి పేర్గాంచిన రచయిత్రి. టాలెంట్ వున్న ‘తెంపరి’ అటువంటిది, ఆమె నీ నవల తొలి మలుపుని చదవటమే కాదు - మెచ్చి - ఆ నవలలోని యాభై రెండవ ఛాప్టర్‌లోని రెండు పేజీలు ఇంచుమించు ఎత్తి రాసేసుకుంది’ అన్నారు.
వసంతం తొడిగింది, కోకిలలు కూసేయి.. గత శిశిరంలో రాలిన ఆకులెన్ని?’ అని ఏ వసంతాన్ని అడుగుతావ్.. ఇప్పుడు తొడుగుతున్న చిగుళ్లు చూడు.. ఇదే జీవితం...’ అంటూ నేను రాసిన ఓ పది పదిహేను లైన్లు ‘రాగజలధి’లో కూడా, అచ్చం అట్లాగే వున్నాయి.
లత రచనని ప్రశంసిస్తూనే, గట్టి చురకలు అంటించాడాయన. ‘వీరాజీకిది గొప్ప. లతకి పతనం’ అన్న అర్థంలో సాగింది ఆ రివ్యూ. స్వతంత్రమైన కథలు, నవలలూ రాజ్యం ఏలే రోజులవి. అప్పటికే ఆమె ‘ఊహాగానం’ కాలమ్ ప్రభలో రాస్తున్నట్లు వుంది. సరే, నాటికి పత్రికలే రాజులు. లత దగ్గరికి రుూ ‘వివాదం’, వెళ్లింది. ఆమె స్పందించింది యిలా - (రివ్యూలు అందరూ చదివారు) -కుర్రాడు వీరాజీ. అతడే నన్ను కాపీ కొట్టి వుండొచ్చును అనుకోవచ్చునుగా. ఆ ‘ముసిలాడు’ (రా.మో.గారు) అలా, ఎంతో పరుముకుందిట. రేడియో కేంద్రం ‘టాక్ సెంటర్’ అయింది. ‘ఏమో ఓ ప్రెస్‌లో నా నవల రాసిన కాయితాలు చాలా కాలం పడేశాను. ఈ కుర్రాడు అక్కడికి పోయి, ఆ పేజీలు చూశాడేమ? ‘ఎత్తేశాడు కాబోలు’, అన్నదిట. ఇలా ‘్ఫడ్ బ్యాక్’ వస్తున్నా నేను చలించలేదు. తొలి మలుపు అచ్చయి, పాఠకుల నోళ్లలో నలిగిపోయింది. అటు తర్వాత ‘రాగజలధి’ వచ్చింది. ఈ వాస్తవం లత వంటి ప్రతిభావంతురాలు గ్రహించడానికి ఎంతోకాలం పట్టలేదు.
‘ఏమిటోనయ్యా! అదేదో స్టూడెంట్ లైఫ్ కదా పడుక్కొని, అలా చదువుతూ, ఇలా మగతగా, నిద్దరొస్తోందని చిన్న కునుకు తీశాను. ఆనక లేచి, ఈ ‘రాగజలధి’ పేజీలు రాయడం చేశాను. పోనిద్దురూ’ అంటూ దొడ్డ మనసుతో సర్దుకున్నది.
రేడియోలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌స్ (ట్రాక్స్0 అంతా మా వాళ్లే కొండముది, ప్రసాదరావు, మా రూమ్మేట్ గోపాలం అంతా ఆంధ్రా యూనివర్సిటీ వాళ్లే. (సుత్తి) వీరభద్రరావు, జలసూత్రం వారు, నండూరి రామ్మోహన్, సుబ్బారావులు, రామవరపు, వోలేటి వారు - ఇలా పెద్దలు అందరికీ నా మీద వాత్సల్యమే. దాంతో రాయడమే పని!
ప్రభలో ‘ఎద్దు’ కథ రాశాను. ఒక్క పేజీ కథ పడ్డది (1961) అది చదివి వైజాగ్ నుంచి రావిశాస్ర్తీగారు (ఓ కార్డు) ‘ప్రభ’కి రాశారు. రావూరు సత్యన్నారాయణ రావుగారు ‘మా వాళ్లు దీన్ని (వీక్లీలో) వెయ్యడం లేదుట. మీ అన్నయ్యకియ్యి తీసుకుపోయి’ అంటూ తమ్ముడి చేత, ఆ కార్డు పంపించారు. రావిశాస్ర్తీ గారు ‘వీరాజీ రాసిన గిత్త కథ, శానా బాగుంది’ అంటూ ఇంకా మంచి రెండు వాక్యాల కార్డు రాశారు. ఎగిరి గంతేశాను. క్యాంపస్‌లో ‘జ్యేష్ట’ కారణంగా నాకు కూడా ఆయన ఫ్రెండయిపోయాడు, గతంలో రావూరు గారు ‘ఆషామాషీ’ రాసేవారప్పుడు. చెయ్యి తిరిగిన కాలమిస్టు కూడానూ ఆయన. ‘చంద్రవంక’ అన్న నవల కాబోలు విజయ సాహితీలో చదివాక ప్రచురణ అయింది. రావూరుగారూ, నేనూ గాంధీనగర్‌లో శాంతికేఫ్ (వెల్‌కమ్ ప్రక్కనే)లో కలిసేవాళ్లం. ఓ కప్పు కాఫీ తాగేవాళ్లం, ఆయన ‘ఇంటర్‌వెల్’లో. నాకయితే అంతా ఇంటర్ వెల్లేగా!..
* * *
రాధాకృష్ణగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అంటే ఆంధ్రపత్రిక వీక్లీ ఎడిటర్‌గారు రచయిత వీరాజీకి రాశారు - ‘ఆంధ్ర పత్రిక వీక్లీ - ఒక కథల ప్రత్యేక సంచిక తెస్తున్నాం. అందులో కేవలం మేము అడిగి తీసుకున్న వారి ప్రత్యేక కథలు మాత్రమే వేస్తాము. వేరే కథలు, శీర్షికలు అన్నీ ఎత్తేసి - కథలకి ఒక స్పెషల్ ‘ట్రీట్’గా ఇది వేస్తున్నాం. మీరు తప్పక ఫలానా తేదీలోగా మీ కథ పంపండి’ అని. కంగారుపడ్డాడు ఈ ‘వీరాజీ’. లెటర్ పట్టుకొని మాబడే సాయిబు వీధిలోకి - మా ‘జాఫ్రీ’లో నుంచి ఇలా - ‘స్టెప్ అండ్ జంప్’ చేసి, సందు కొసదాకా, గబగబా - అర్జెంట్ పని వున్నవాడిలా నడిచి,తిరిగి ‘పరుగున’ తిరిగి ఇంట్లోకి వచ్చేశాను.
కథ అడిగారో? అప్పట్నుంచీ మస్తిష్కంలో సాగర మధనం షురూ. గడువు తీరే వేళకి - సిజేరియన్ బేబీ లాగ ‘సుఖం’ కథ బయటపడ్డది - పైలా పచ్చీస్ రూమాన్సు కాదది. సమాజంలో - వ్యవసాయ సంపన్నుల జాగాలో చాలా భాగం పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ బడా ఆసాముల ‘హవా’ వీస్తున్నది అప్పుడు.. లక్షాధికారి సుందరయ్య - కష్ట్ధాకారి ‘సీతారాముల’కీ మధ్య - ‘టెండర్ ఫీలింగ్స్’ని ‘బొమ్మ కట్టే’ ఈ కథ పేరు ‘సుఖం’. ఆ రోజుల్లో ఆంధ్రసచిత్ర వారపత్రికలో - సెంటర్ స్ప్రెడ్‌లో - బాపు డబుల్ స్ప్రెడ్ బొమ్మతో కథ రావడం మా కథకులకు పండుగే! దాంతో ఈ కథ నన్నొక అంతస్తు పైకి తీసుకుపోయింది.
ఈ థీముని ‘నవల’గా ‘సుఖం కోసం’ పేరిట రాయడానికి నాకు ఇంచుమించు ఐదేళ్లు పట్టింది. మద్రాసు లొకేల్‌గా రాశాను. చాలా శ్రమపడ్డాను. ఫలితం దక్కింది. నా మీద ‘ఎగ్జిస్టెన్సిలిజమ్ మోజు, గతి తార్కిక భౌతిక వాదం ప్రభావం పడ్డాయి. - ఇక్కడో ‘కామా’ పెట్టాలి. ‘సుఖం కోసం’ (కథ) కన్నా ముందే ‘విడీవిడని చిక్కులు’ నవల ఆంధ్ర పత్రిక కోటలో - ‘పాగా’ వేసింది. తదుపరి ఏం జరిగిందంటే..

(ఇంకా బోలెడుంది)

లక్ష్యానికి చేరువ కావాలంటే...

$
0
0

పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధపడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి. అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల.
విద్యార్థులు నిరాశకు లోనుకాకండి. మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి. పరీక్షలలోని మార్కులే జీవితానికి ప్రామాణికం కాదని, మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యకు ఎదురొడ్డి నిలిచినపుడే జీవితం పరమార్థకం అవుతుందని, ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు.
బాధ్యత
పిల్లల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు ‘ఫ్రస్ట్రేషన్’కు లోనవుతారు. తోటి విద్యార్థులతో పోల్చకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకు జీవిత విలువను గుర్తించేలా ప్రోత్సహించాలి. కళ్ల ముందు లక్ష్యాలెన్నో ఉన్నాయి. ఒక్కసారి ఓడినంత మాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు. నిరంతరం సమస్యలతో పోరాటం చేస్తూనే జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, స్నేహితులపై ఉంది.
లక్ష్యానికి చేరువ
‘జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహజం.’ నేటి పోటీ ప్రపంచంలో తాము అనుకున్నది సాధించాలనే కాంక్ష మరియు ప్రస్తుతమున్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఎదగాలనుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, వైఫల్యాల మూలంగానే భావోద్వేగాలకు లోనై వాటిని పరిష్కరించుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనలకు లోనవుతూ నిరాశా నిస్పృహలకు లోనయ్యే వారెందరో ఉన్నారు. ఫలితంగా వారి జీవన విధానంలో అపసవ్యత నెలకొంటుంది. ఆశించిన జీవితానికి, అనుభవిస్తున్న జీవితానికి మధ్య వ్యత్యాసం ఎక్కువైనపుడు కలిగే ఆందోళన, ఒత్తిడి మూలంగా మానసిక, శారీరక అనారోగ్యాలకు లోనవుతున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు విద్యార్థులలో తక్కువ మార్కులు వచ్చాయనే ఆందోళనను దూరం చేయాలి. సాధించాలనే కాంక్షతో లక్ష్యానికి చేరువవుతారు.
భరోసా
విద్యార్థులలో పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా జీవితంలో సాధించడానికి, ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని మానసికంగా నిరంతరం మెదడుకు కావల్సిన శక్తిని అందించుకోవాలి. తల్లిదండ్రులు, మిత్రులు మేమున్నామనే నిరంతర ప్రోత్సాహంతో భరోసాను కల్పించాలి. ఈ భరోసాతో జీవితంలో ఏదైనా సాధించవచ్చు.
శ్రమే ఆయుధం
మానసిక ఆందోళలను తగ్గించుకోవాలి. మిమ్మల్ని, మీ శ్రమని నమ్మండి. సానుకూల ఫలితం వస్తుందనే భావంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మంచి మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తిని మెంటారుగా స్వీకరించడం, అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేయాలి. లక్ష్యసాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహకారం తీసుకోవడం, సీనియర్స్ సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది. నీ వెనక ఏముంది? ముందేముంది? అనేది నీ కనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తిసామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు. మనమూ సాధిద్దాం. ఇతరులకూ స్ఫూర్తినిద్దాం.

వైద్యం - విద్య

$
0
0

-రాతి మీద కాలి గుర్తులా? ఎంత బాగుంది! ఎంత వింతగ ఉంది! అన్నాడట ఎడ్వర్డ్ హిచ్‌కాక్. ఈయన సినిమాల మనిషి కాడు. అతను వేరు. పేరు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్.
* * *
తిరుపతి నుంచి మనుమరాలు వచ్చింది. ఆమె మా అన్నయ్యగారి మనమరాలు. వాళ్ల అమ్మగారి పెళ్లి నేను పక్కనే ఉండి చేయించాను. అంటే అన్నయ్యకు సాయంగా అన్నమాట. కవలలలో ఒకరైన ఈ పాప పుట్టినప్పుడు ఊయల పండుగ నేనే పక్కనే ఉండి చేయించాను. అన్నయ్య ఉద్యోగం కారణంగా ఆ పండుగకు రాలేక పోయి నాకు బాధ్యత అప్పగించాడు. ఇప్పుడు ఆ పాప ఎంబిబిఎస్ పరీక్షలు పూర్తి చేసుకుని తరువాత చదువుల ప్రయత్నంలో భాగంగా పట్నం వచ్చింది. మా ఆవిడగారు డాక్టర్. నా కూతురు డాక్టర్. ఇప్పుడు నా మనమరాలు డాక్టర్. బంధువులలో మరి కొందరు కూడా వైద్యులు ఉన్నారు. మొన్న ఒకసారి పాలమూరు వెళ్లే ప్రయత్నంగా దారిలో ఉంటే చాదర్‌ఘాట్ ప్రాంతం నుంచి చూస్తే అటు వేపు తెల్లని గుంబద్‌లు అంటే గోపురాలు కనిపించాయి. క్షణం పాటు అవి ఏమిటో అర్థం కాలేదు. ఆ తరువాత దారిలో ఉస్మానియా ఆసుపత్రి కనిపించింది. పట్నంలో వైద్యం చదువు గురించి ఒకచోట చదివిన అంశాలను కళ్ల ముందు సినిమా లాగా తిరుగసాగాయి. హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ, అలాగే గాంధీ మెడికల్ కాలేజీ చాలా పేరున్న సంస్థలు. నా కూతురు ఉస్మానియా, మా ఆవిడ గాంధీలో చదువుకున్నారు. ఈ సంస్థల చరిత్రను ఒకసారి చూద్దాం అనుకుంటే ఉస్మానియా గురించి ఎన్నో విచిత్రమైన విషయాలు ముందు కనపడ్డాయి. నిజానికి తరాలుగా హైదరాబాద్‌లో రకరకాల వైద్య విద్య కొనసాగింది. చాదర్‌ఘాట్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వెళుతూ వుంటే, ఎడమ పక్కన దారుల్‌షిఫా అనే ఒక ప్రాంతం వస్తుంది. అది వైద్య సంస్థ అన్న సంగతి ఎవరికీ గుర్తు రాదు. అది ఒకనాటి ఆసుపత్రి. అక్కడ నిజాం బంధువర్గం వారంతా వైద్యం చేయించుకునేవారు. ఈ సంగతి మొదట్లో నాకు కూడా తెలియదు. దార్ అన్న మాటకు ఒక ఇల్లు ఒక స్థలం అని అర్థం అని తెలుసు. షిఫా అన్న మాటకు చికిత్స అని అర్థమట. ఈ సంగతి తరువాత ఎప్పుడో తెలిసింది.
1842 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఆధునిక వైద్య విద్య మొదలైంది. గన్‌ఫౌండ్రీ అనే చోట మొదటి వైద్య బోధనాలయం ఏర్పడింది. అప్పటికే అది ఉస్మానియా కాలేజీ కాదు. ఆ కాలేజీలో పట్టుమని పది మంది కూడా విద్యార్థులు ఉండేవారు కాదు. వారికి చదువు ఉరుదూ భాషలో జరిగేది. ఈ కాలంలో పై చదువులు మొత్తం ఇంగ్లీషులోనే సాగాలి అన్న వాదన వింటుంటే నాకు ఇటువంటి విషయాలు గుర్తొస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ మొదలైనప్పుడు కూడా అక్కడ చదువులు ఉరుదూలో సాగినవి అంటే ఇప్పటి వారికి ఆశ్చర్యం కలుగుతుంది ఏమో?
మెడికల్ కాలేజీ ప్రారంభం వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. ఆసఫ్ జాహీ వంశంలో నాలుగవ నిజాం నవాబ్ నజీర్ ఉద్దౌలా గారికి అర్థంకాని ఒక అనారోగ్యం మొదలైంది. హకీములు అనే సంప్రదాయ వైద్యులు చాలామంది ఉండేవారు. వారంతా ప్రభువులకు వైద్యం చేయాలని ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. బ్రిటిష్ రెసిడెంట్‌గా అప్పటికి ఫ్రేజర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రభువుకు చాలా సన్నిహితుడు. ఆయన నిజామ్ గారిని చూడడానికి ఒక వైద్యుడిని పంపడానికి అనుమతి కావాలని అడిగాడు. నిజాంకు అది ఇష్టం లేదు. మైత్రి కొద్ది ఒప్పుకున్నాడు కానీ, వచ్చిన పెద్ద మనిషి తనకు ఎటువంటి మందు ఇవ్వకూడదని ముందే నిర్ణయించాడు. ఇంగ్లీష్ మందులు తినడం ఆచారానికి వ్యతిరేకం. మొత్తానికి ఒక వైద్యుడు వచ్చాడు. ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కొన్ని పరీక్షలు కూడా చేశాడు. మందు ఇవ్వడానికి మాత్రం లేదు. కనుక ప్రభువుల వారి తిండి విషయంగా ఆ వైద్యుడు కొన్ని మార్పులు సూచించాడు.
జీవన విధానంలో కూడా ఏవో కొన్ని మార్పులు చెప్పినట్టు ఉన్నాడు. మందులు ఇవ్వనందుకు నిజాం ప్రభువు పద్ధతులను సులభంగానే పాటించాడు. మూడు మాసాలు గడిచాయి. ఆయన ఆరోగ్యం ఎంతో బాగుపడింది. బహుశా ఆ పెద్ద మనిషి షుగర్ వ్యాధితో బాధపడి ఉంటాడని చాలామందికి అర్థమై ఉంటుంది. వైద్యుడు కేవలం తిండిలో మార్పులు సూచించాడు. దాన్ని పడమటి వైద్యంగా స్వీకరించి ప్రభువు ఎంతో సంతోషించి ఆ చదువును ఇక్కడి వారికి కూడా చెప్పించాలి అనుకున్నాడు. ఫర్మాన్ అనే రాజశాసనం విడుదల చేశాడు. గన్‌ఫౌండ్రీలో హైదరాబాద్‌లోని మొదటి వైద్య బోధన సంస్థ ప్రారంభమైంది. నిజానికి అదే తరువాత ఉస్మానియా మెడికల్ కాలేజీగా మారింది. ఆ విద్యాసంస్థ మరొక చోటికి మారింది. గన్‌ఫౌండ్రీకి పక్కనే తరువాతి కాలంలో గాంధీ మెడికల్ కాలేజీ నడిచింది. కానీ ఆ మార్పులు జరిగేలోగా ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగాయి.
మెక్లీన్ అనే వైద్యుడు నిజాంగారి డయాబెటిస్ తగ్గించాడు. కనుక కొత్త మెడికల్ స్కూల్‌కి ఆయనే అధిపతి. వెంటనే అతను నెలకు 30 రూపాయల బాడుగతో వసతి తీసుకున్నాడు. ఒకరిద్దరు సహాయకులను కూడా నియమించుకున్నాడు. ప్రభువుల భాష తనకు రాదు కనుక ఒక దుబాసీని కూడా పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఆ సంస్థలో చదువుకోవడానికి ఎవరు రావాలి? అది ప్రశ్న! అష్టకష్టాలు పడ్డ మీదట ఒక నలుగురు వచ్చి చేరారు. కానీ ఆ నలుగురితో కోర్సు నడిపిచడం కష్టం అని తెలిసింది. ఇప్పట్లో అటు ఇంజనీరింగ్‌లోను ఇటు వైద్యంలోనూ చేరడానికి ముందు నుంచే బడి పిల్లలంతా పథకాలు వేసుకుని ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లందరికీ లోకాభిరామంలో నేను రాస్తున్న ఈ నాలుగు సంగతులు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుంటుంది. మొదటి వైద్య బోధన సంస్థలో విద్యార్థుల కోసం ఏకంగా ప్రభువు ప్రయత్నించాల్సి వచ్చింది. మరేదో చదువుకుంటున్న తెలివిగల పిల్లలలో నుంచి నిజాం ప్రభువు ఒక పది మందిని ఎంపిక చేశాడు. వారందరినీ వైద్యం చదవాలని పంపించాడు. మరి వారికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? 25కన్నా తక్కువ వయసు ఉంటే చాలు. మర్యాద తెలిసిన కుటుంబం వారై ఉండాలి. చదివినంత కాలం ఖర్చులు భరించగలిగే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఏమీ అడగలేదు. సరే అని పిల్లలు అంగీకరించారు. ప్రభువు సంతోషించి వారికి తలకొక కత్తి, రాసుకోవడానికి కలము, కాగితాలు మొదలైనవి కానుకలుగా ఇచ్చి వైద్య విద్యార్థులు అన్న గుర్తింపును కూడా ఇచ్చాడు. చిత్రంగా మొదటి జట్టులో నుంచే ముగ్గురు పిల్లలు జారిపోయారు. అస్తిపంజరం తెచ్చి ఎదురుగా నిలబెడితే భయపడి వాళ్లు మూర్ఛపోయారు. మరునాడు రమ్మంటే రాము పొమ్మన్నారు. చదువుల పరిస్థితి అట్లా ఉండేది అప్పట్లో. డాక్టర్ మెక్లీన్ ఆసుపత్రికి కూడా ఉన్నతాధికారి. అన్ని రకాల తగిన అర్హతలుగల మనిషి. ఎడింబరోలో ఎం.డి. చదువుకుని వచ్చాడు. మద్రాసులో వైద్య విభాగానికి అధిపతిగా పని చేశాడు. కలరా గురించి ఎంతో పరిశోధించాడు. చివరకు హైదరాబాద్ రెసిడెన్సీలో వచ్చి చేరాడు. ఆయనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి బాగానే ఉంది. కానీ అనుకున్న పని అంత సులభంగా జరుగుతుందా? స్థానిక విద్యార్థులకు ఇంగ్లీష్ రాదు. అసలే పాఠ్య పుస్తకాలు కరువు. కనుక దుబాసీ పాఠాలను ఉర్దూలోకి తర్జుమా చేసి ఎప్పటికప్పుడు అందించాడట. చదువు కొనసాగింది. ఏడు సంవత్సరాల తర్వాత పది మంది విద్యార్థులు బయటికి వచ్చారు. వాళ్లకు హకీం అన్న పట్టా దొరికింది. 1854లో మరింత మందికి కూడా ఈ గౌరవం దొరికింది. మొత్తానికి పడమటి వైద్యం తెలిసిన వాళ్లు ప్రభుత్వం అందుబాటులోకి వచ్చారు. సర్ సాలార్‌జంగ్ లాంటి వారు ఈ కొత్త వైద్యులను రకరకాల చోట్ల పనిలో పెట్టారు. చిత్రంగా అప్పట్లోనే ఇద్దరు ముగ్గురు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా పెట్టుకున్నారు.
డాక్టర్ మెక్లీన్ తరువాత డాక్టర్ స్మిత్ వైద్యాధికారిగా వచ్చాడు. విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, సర్జరీ మొదలైనవి కూడా వివరంగా చెప్పాలనే అతను నిర్ణయించాడు. క్లాసులు మాత్రం ఉర్దూ భాషలోనే కొనసాగాయి. ఆశ్చర్యంగా అప్పట్లోనే ఒక వైద్య పత్రిక కూడా మొదలైంది. 300 కాపీలు అచ్చు చేసి కలకత్తా, మద్రాసు లాంటి చోట్లకు కూడా పంపేవారట. పత్రిక చేయడానికి కావలసిన ఖర్చును కూడా సాలార్జంగ్‌తో పాటు ప్రధానమంత్రి హోదాలో ఉన్న ముక్తార్ వంటి వారు ఇచ్చేవారట. డాక్టర్ స్మిత్ ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించాడు. అది మూసీ నది పక్కన వెలిసింది. అప్పటి ప్రభువు అఫ్జల్ ఉద్దౌలా పేరున దానికి అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి అని పేరు పెట్టారు అదే ప్రస్తుతపు ఉస్మానియా ఆసుపత్రి అని అందరికీ అర్థం అయి ఉంటుంది. ఇనే్నళ్ల తరువాత ఆసుపత్రిని మెరుగుపరచాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్టు విన్నాము. కానీ ఆ పని జరగలేదని కూడా తెలిసింది. అది చరిత్ర గల ఆసుపత్రి. ఎనె్నన్నో సంఘటనలను చూచింది. నగరంలో వరద వచ్చినప్పుడు చాలామంది ఆసుపత్రి ఆవరణలోని చెట్టు మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారట. చెట్టు ఇంకా ఉందట. వందేళ్లో మరెంతో అయ్యిందని మిత్రులు కొంత మంది మళ్లా ఆ చెట్టు కిందకు వెళ్లి జ్ఞాపకాలు నెమరు వేసుకుని వచ్చినట్టు తెలుసు. అవి తమ జ్ఞాపకాలు రావు. గతం గుర్తులు. ఆసుపత్రిని మరమ్మతు మరొకటి చేయాలంటే ఇటువంటి చరిత్ర చెదిరిపోతుంది. అందుకేనేమో కొందరు మార్పు వద్దంటారు. కానీ నగరం పెరిగింది. ఆబాది అంటే జనాభా కూడా పెరిగింది. వైద్య సమస్యలు పెరిగాయి. కానీ అలనాటి ఆసుపత్రి మాత్రం అట్లాగే ఉండిపోవడం ఆశ్చర్యకరం. అంతకన్నా ఆశ్చర్యకరమైన మరొక విషయం చెబుతాను. నాకు 66 సంవత్సరాలు వచ్చాయి. కానీ నేను ఆ ఆసుపత్రిలోకి ఇప్పటికీ ఒకే ఒక్కసారి ప్రవేశించాను.
పట్నంలో వైద్య విద్య గురించిన విశేషాలు నిజానికి ఒక పుస్తకానికి సరిపడా వున్నాయి. అన్ని కాకున్నా మరికొన్ని అంశాలు మరోసారి చెప్పుకుందాము.

వంకాయ కథ

$
0
0

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి భార్యామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే
అంటూ ఒక కవి వంకాయని కొనియాడేడు కదా. పేర్ల మీద పిచ్చి ఉన్న నాకు వంకాయకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.
వంకరగా ఉన్న కాయని వంకర కాయ లేదా వంకాయ అనొచ్చు. కాని మెట్ట వంకాయలు గుండ్రంగానో, గుడ్డు ఆకారంలోనో ఉంటాయి. నీటివంకాయలైతే కోలగా ఉంటాయి; కాని వంకర టింకరగా ఉన్న వంకాయలు నాకు తారసపడలేదు.
వంగపండు, వంగనార వంటి మాటలని బట్టి వంకాయ అంటే వంగ కాయ అయి ఉండొచ్చు. అంటే, వంగ దేశపు కాయ కాబోలు. బంగాళా దుంపలకీ, బెంగాలుకీ మధ్య బాదరాయణ సంబంధమే (బంగాళా దుంపలు దక్షిణ అమెరికా ఖండపు పంట) కాని, వంకాయకీ, వంగ దేశానికీ దగ్గర సంబంధమే ఉందనవచ్చు.
వంకాయని బెంగాలీలో ‘బేగున్’ అంటారుట. దీన్ని ‘బే గుణ్’ అని విడగొడితే ‘గుణం లేనిది’ అనే అర్థం వస్తుంది. ఇక్కడ ‘గుణం’ అంటే ‘నీతి, నియమం, శీలం, సత్ప్రవర్తన’ వంటి అర్థాలు కాకుండా ఒక ప్రత్యేకమైన లక్షణం అని అర్థం చెప్పుకోవచ్చు. కందకి దురద వేసే గుణం ఉంది. కాకర కాయకి చేదు అనే గుణం ఉంది. కనరు పట్టిన వంకాయలు చేదుగా ఉంటాయి కాని ఆ చేదు వంకాయ గుణం కాదు. తనకి స్వగుణం లేదు కనుక మనం ఎలా వంచితే అలా వంగుతుంది. ఎలా వండితే అలా మొగ్గుతుంది. అందుకే వంకాయ - మెంతి కారం, వంకాయ - కొత్తిమీర కారం, వంకాయ - ఉల్లికారం, వంకాయ వేపుడు, వంకాయ బజ్జీలు పచ్చడి (వంకాయని కాల్చి చేసే పచ్చడి), హైదరాబాదీ వంకాయ కూర, ఇలా ఎనె్నన్ని విధాలుగానో వంకాయని వాడుకోవచ్చు.
ఈ ‘బేగున్’ హిందీలో బైంగన్ అయింది.
హిందీ కంటె పాతది సంస్కృతం కదా. సంస్కృతంలో వంకాయని ‘వృంతాకం’ అనీ, ‘పీతఫలం’ అనీ అంటారు. వృంతం అంటే తొడిమ కనుక వృంతాకం అంటే తొడిమ ఉన్నదనే అర్థం వచ్చింది. ఎందుకైనా మంచిదని నిఘంటువులో చూస్తే వంకాయని ‘వార్తాకీ’ అంటారని ఉంది. ఏది ఏమైతేనేం, ఈ మాట ‘వతింగన్’ అయి, దరిమిలా పారశీక భాషలో ‘బదింగన్’ అయింది. పారశీకం నుండి అరబ్బీలోకి వెళ్లి అక్కడ ‘ఆల్ బదైన్జన్’ అయింది. అరబ్బీలో ‘ఆల్’ అనే ప్రత్యయం మన తెలుగులో డు, ము, వు,లు లాంటిది; తరచు కనిపిస్తూ ఉంటుంది. అరబ్బీ నుండి కేటలీనా వెళ్లి అక్కడ ‘ఆల్బర్జీనా’ అయింది. అక్కడ నుండి ఫ్రెంచి భాషలోకి వెళ్లి ‘ఔబర్జీన్’ అయింది. ఈ ఫ్రెంచి మాట ఆఫ్రికాలో ఉన్న ఐబీరియా వెళ్లి అక్కడ ‘బెరింజెలా’ అయింది. బుడతగీచులు ఈ మాటని బ్రింజెల్లా చేస్తే, బ్రిటిష్ వాళ్లు ‘బ్రింజాల్’ చేసి ఇండియా తీసుకొచ్చేరు. వంగ కాయ కాస్తా ప్రపంచం అంత తిరిగి పేరు మార్చుకుని ఇంటికొచ్చింది.
మన తెలుగు వాడికి వంకాయని వంకాయ అనటానికి సిగ్గు; బ్రింజాల్ అనే ఇంగ్లీషు మాటనే వాడతానంటాడు. బ్రిటీష్ వాడు మాత్రం తక్కువ తిన్నాడా? వాడికి బ్రింజాల్ ని బ్రింజాల్ అనటానికి సిగ్గు; వాడు ఫ్రెంచి మాట ‘అబర్జీన్’ అనే అంటానంటాడు (‘అబర్జీన్’ అంటే ముదురు బక్కలిపండు రంగు అని అర్థం) అందుకని లండన్‌లో బ్రింజాల్ అంటే ఎవ్వరికీ అర్థంకాదు; ఫ్రెంచి మాట వాడాల్సిందే!
తెలుగు వాడు మాత్రం తక్కువ తిన్నాడా? బ్రిటిష్ వాడి దగ్గర శిష్యరికం చేసి ఉన్నాడేమో ‘అమెరికాలో ఉన్న మీ అగ్రవర్ణాలు ఇంగ్లీషు నేర్చేసుకుని మంచి మంచి జాబ్స్ కొట్టేసి మనీ చేసేసుకుంటున్నారు. ఇండియాలో ఉన్న మాకు తెలుగు నేర్పేసి మమ్మల్ని దళితలుగా నొక్కేద్దామని చూస్తున్నారు. కనుక మేం ఛస్తే తెలుగు నేర్చుకోం. ఇంగ్లీషులోనే ‘బ్రింజాల్’ అంటూ శంకరాభరణం సినిమాలో లాల్చీ మేష్టారు లాంటి వ్యక్తి ఒకడు దబాయించేడు.
కాని ఈ అమెరికావాడు ఉన్నాడే వీడు నా పాలిట ఒక తంటసుడు; అంటే తంటసం తెచ్చిపెట్టినవాడు. ఇంగ్లీషు మరిగిన తెలుగు వాడికి తంటసం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. తంటసం అంటే ముల్లు. ఈ ముల్లు ఒక ప్రత్యేకమైన శరీర భాగంలో గుచ్చుకుంటే కూర్చోలేం, నిలబడలేం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈ అమెరికావాడు, ఈ తంటసుడు, వంకాయ పేరులోని పూర్వ చరిత్రని పూర్తిగా విస్మరించి ఒక కొత్త పేరు పెట్టేడు. అమెరికాలో వంకాయని ‘ఎగ్‌ప్లేంట్’ అంటారు. దీన్ని తెలుగులో ‘గుడ్డు చెట్టు’ అనో, ‘గుడ్డు మొక్క’ అనో గాడిద గుడ్డు అనో అనుకోవచ్చు. నేను అమెరికా వెళ్లిన కొత్తలో ‘ఎగ్‌ప్లేంట్’ అన్న మాట విని ఈ అమెరికా వాళ్లు గుడ్లని చెట్ల మీద కాయింపిస్తారు కాబోలని అనుకునేవాడిని. వీళ్లంటే నాకంత గురి. నిఝం! ‘హాట్ డాగ్’ అన్న మాట విని వీళ్లు కుక్కల్ని కాల్చుకుని, కారం జల్లుకుని తింటారు కాబోలు అని కూడ అనుకునేవాడిని.
ఇంతకీ అమెరికా వాడు ‘ఎగ్‌ప్లేంట్’ అని పేరు పెట్టటానికి కారణం లేకపోలేదు. అప్పట్లో అమెరికాలో ఉన్న వంగ మొక్కలకి గుండ్రంగా, తెల్లగా, కోడిగుడ్డు ఆకారంలో, అదే పరిమాణంలో ఉన్న కాయలు కాసేవి. చూట్టానికి అచ్చం గుడ్లలా ఉంటాయి. నేను అమెరికా వచ్చిన కొత్తలో ఈ రకం కాయలు చూసేవాడిని. ఈ రోజుల్లో కనిపించటం లేదు. (ఈ రోజుల్లో కూరగాయలు కొనే బాధ్యత నాది కాకపోవడమే దీనికి కారణం) వీటిని చూసి మొక్కలు గుడ్లు పెడుతున్నాయనుకొని ఆ మొక్కలని ‘ఎగ్‌ప్లేంట్’ అని పిలిచేవారు. వాటికి కాసిన కాయలకీ అదే పేరు స్థిరపడిపోయింది.
నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏమిటంటే మన తెలుగు వాడు, ఈ అమెరికా వాడిని చూసి నిక్షేపంలాంటి బ్రింజాల్ అన్న టెలుగు పేరుని మార్చేసి ‘గుడ్డు మొక్క’ అనకుండా ఇంకా బ్రింజాల్ అనే అంటున్నాడేమిటా అని!

ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం

$
0
0

పరమశివుడు భక్తుల శ్రేయస్సును మదిలోనెంచి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రకటితుడైనాడు. వాటిలో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం. 2. శ్రీశైలంలో మల్లికార్జున, 3. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం, 4. ఓంకారేశ్వర లింగం, 5. కేదారేశ్వర లింగం, 6. భీమేశ్వర జ్యోతిర్లింగం, 7. కాశీలో శ్రీ విశే్వశ్వర లింగం, 8. త్య్రంబకేశ్వర లింగం, 9. వైద్యనాథేశ్వర లింగం, 10. దారుకవనంలో శ్రీనాగేశ్వర లింగం, 11. శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం, 12. ఘుశే్మశ్వర జ్యోతిర్లింగం.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర అద్భుతం. మహనీయం. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం - నిత్యస్మరణం భవసాగర తరుణోపాయం, ముక్తిదాయకం. పరమేశ్వరుని అనుగ్రహపాత్రం. ఒక్కొక్క జ్యోతిర్లింగావిర్భావం ఒక్కో అద్భుత ఘట్టం.
సోమనాథ జ్యోతిర్లింగం
పురాణోక్తి ననుసరించి దక్ష ప్రజాపతికి 27గురు కన్యలు. యుక్త వయస్సు రాగానే చంద్రునికిచ్చి పెండ్లి చేశారు. 27 మందిలో రోహిణి అందగత్తెయని అభిమానంతో చంద్రుడు ఒక్క రోహిణితోనే గడుపుతున్నాడు. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటే, వారు తండ్రి దక్షునితో మొర పెట్టుకున్నారు. మామగారు చంద్రుని పిలిచి రెండుసార్లు మందలించాడు. చంద్రుని తీరు మారలేదు. కోపంతో క్షయ రోగివై పొమ్మని దక్షుడు అల్లుడైన చంద్రుని శపించాడు. చంద్రకాంతి తరిగిపోతుండగా దుఃఖించి చంద్రుడు దీనుడై బ్రహ్మ నాశ్రయించగా, బ్రహ్మ కరుణించి చంద్రా! ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడ పార్ధివ లింగారాధన చేయి అంటూ మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆరు నెలలు చంద్రుడు అలాగే చేశాడు.
శివుడు ప్రత్యక్షమై ఇక నుండి కృష్ణ పక్షంలోని దినాలలో నీ కళలు తగ్గి తిరిగి శుక్ల పక్షంలో దినాదినాభివృద్ధి చెందుతాయి అని దక్ష శాపాన్ని సంస్కరించి దీవించాడు. ఆ వేళకు బ్రహ్మేంద్రాదుల కోరికపై చంద్రుడి పేరు మీద సోమనాథమనే జ్యోతిర్లింగంగా మారాడు. అక్కడ చంద్రకుండ ఉంది. ఆరు నెలలు ఆపకుండా ప్రతి దినము స్నాన మాచరిస్తే సకల రోగాలు నశించిపోతాయి. క్షేత్ర ప్రదక్షిణం వలన భూప్రదక్షిణ ఫలం సిద్ధిస్తుంది. సోమనాథుని ఆరాధిస్తే కుష్టు, క్షయాది రోగాలు నశిస్తాయి.
శ్రీశైల మల్లికార్జున లింగం
శివపార్వతుల ప్రేమ పుత్రుడైన కుమారస్వామి తల్లిదండ్రులపై అలిగి క్రౌంచ పర్వతం చేరాడు. కైలాస వాసులకు ఆయన లేని లోటు బాధగా అనిపించింది. పార్వతి పుత్ర వియోగం భరించలేక పోయింది. శివుని వేడుకొంది. ఇద్దరూ కలిసి క్రౌంచ పర్వతం చేరారు. అక్కడ శివుడు మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అమ్మవారు భ్రమరాంబగా మారింది. పుత్ర వ్యామోహంలో ఇద్దరూ చాలాకాలం అక్కడే వున్నారు. ప్రతి అమావాస్యనాడు ఆదిదంపతులు వెళ్లి పుత్రుని చూసి వస్తుంటారు.
మహాకాళేశ్వరం
అవంతీ నగరంలో వేద విప్రుడనే ద్విజుడు నిత్యం పార్థివ లింగార్చనం చేస్తూ శివానుగ్రహం పొందాడు. ఆయనకు దేవప్రియుడు - ప్రియ మేధుడు, సుకృతు, ధర్మవాహి అని నలుగురు కుమారులు. దూషణుడనే రాక్షసుడు తన సేనతో వచ్చి అవంతీ నగరాన్ని నాల్గు వైపుల నుండి ముట్టడించాడు. ప్రజలను హింసించాడు. దిక్కుతోచని జనులు వేద ప్రియుని పుత్రుల నాశ్రయించారు. ఆ సమయంలో వారు పార్థివ లింగారాధనలో వున్నారు. ప్రజల గోడు విన్నారు. మనందరికీ, సమస్త జగతికీ ఆ మహాశివుడే రక్ష గాన మాతోబాటు మీరు కూడా శివుని ధ్యానించండి అని చెప్పగా అందరూ శివధ్యానంలో వున్నారు.
దూషణుడు వచ్చి నల్గురు బ్రాహ్మణులనూ చంపబోగా వెంటనే పార్థివ లింగానికి వున్న ఒక చిన్న బొరియ వంటి దాని నుంచి వికట రూపంతో ‘మహాకాలుడి’గా శివుడు ఆవిర్భవించాడు. దూషణునీ, వారి సమూహాన్నీ దగ్ధం చేశాడు. ప్రజలూ - బ్రాహ్మణులు ఆ వికట రూపునికి మోకరిల్లి ప్రార్థించి, అక్కడే వెలసి వుండమని కోరగా, ఆ కోర్కె ననుసరించి శివుడు అక్కడ మహా కాళేశ్వరుడనే పేరున జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి ఆరాధింపబడుతున్నాడు.
ఓంకారేశ్వర లింగం
నర్మదా కావేరీ పవిత్ర సంగమ ప్రదేశంలో సజ్జన సంరక్షణే ధ్యేయంగా మహేశ్వరుడు మాంధాతృపురంలో వసంతంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా వెలసి పూజింపబడుతున్నాడు.
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం
కర్మ పరిపాకం వలన విష్ణుమూర్తి ఒకసారి ధర్ముడనే వానికి నర నారాయణులనే పేరుతో పుత్రద్వయంగా అవతరించాడు. నర నారాయణులిద్దరు ‘బదరికా’ వనంలో తపస్సు చేశారు. నిత్యం వారు పార్థివ లింగార్చన చేసేవారు. ఇద్దరూ విష్ణ్వంశ సంభూతులుగాన ఆరాధనా వేలకు రుద్రుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఒకసారి వారి అర్చనానంతరం శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నారు. వారు ఆనందంతో ఆ తావున నిలిచి వుండమని కోరారు. నర నారాయణుల కోరిక మేరకు హిమ శిఖరాగ్రమున కేదార ఖండమున ‘కేదారేశ్వరుడు’ అనే పేరుతో నిలిచి జ్యోతిర్లింగమై వెలసి పూజలందుకుంటున్నాడు.
వాంఛలను తీర్చే స్వామి.
భీమేశ్వర జ్యోతిర్లింగం
పురాణాల్లో సుదక్షిణా - కామరూపేశ్వరులు సంపూర్ణ శివభక్తులు. నిత్య శివారాధకులు. కాల ప్రభావం వలన వారు చెరసాల పాలై, పరస్పరం సాయం చేసుకుంటూ అనుదినమూ పార్థివ లింగార్చన చేసేవారు. ఆ రాజ్యంలోని దండ నాయకుడది చూసి భయపడి రాజుకు విన్నవించాడు. రాజు వచ్చి ఆగ్రహంతో మట్టి కుప్పగా వున్న ఆ పార్థివ లింగాన్ని తన ఖడ్గంతో ఒక్క వేటు వేశాడు. వెంటనే విచ్ఛిన్నమైన ఆ మృత్పిండం నుండి శివుడు ఉద్భవించాడు. రాజు భీమాసురుని గాంచి ‘్భమాసురా! భక్త రక్షణే నా వ్రతం, ఆశయం - రూపం అంటూ ఒక్క హుంకారం చేశాడు. భీమాసురుడూ, వాడి సైన్యము శివాగ్నిలో బూడిదై పోయారు. పారిపోయే రాక్షసులను తరిమింది అగ్ని. అడవులూ, పర్వతాలు ఆక్రమించింది. కాలాంతరంలో ఓషధులుగా మారింది.
భక్తులైనను దక్షిణాకామ రూపుల సంరక్షణార్థం వెలసిన ఆ స్వామిని కొలువుండమని కోరగా, భీమేశ్వరుడనే పేర జ్యోతిర్లింగంగా వెలసి సమస్త బంధన విమోచకుడు అయినాడు పరమశివుడు.
శ్రీ విశే్వశ్వరలింగం
సకల జీవులను ఉద్ధరించే నిమిత్తం ఏర్పరచిన ప్రాంతం కాశీ క్షేత్రం. పంచక్రోశాత్మకమైనది పాపనాశి. ఇక్కడ ఒకప్పుడు విష్ణుమూర్తి ఆశ్చర్యంతో తలపంకించగా ఆయన కర్ణకుండలాలున్న మణి తృళ్ళిపడిందట. ఆ మణిపడ్డ ప్రాంతం మణికర్ణికా ఘట్టంగా ప్రసిద్ధమైనది కాశీలో. కాశీ వరుణ, అసి నదుల సంగంగాన వారణాసిగా నామం స్థిరపడింది. సదాశివుడు తానే ఒక లింగాన్ని స్వయంగా ప్రతిష్టించి కాశీని విడవరాదని శాసించాడు. ఆ కారణంగా ఆ లింగం అవి ముక్తేశ్వరుడుగానూ, కాశీ అవిముక్తంగానూ పిలువబడుతున్నాయి. ‘కర్మణాం కర్షణాచ్చైవ - కాశీతి పరిపఠ్యతే’ అని నానుడి. ప్రకృతి పురుషులిద్దరూ ఆదిదంపతులై తమ జననీ జనకులు చాలాకాలంపాటు కాంచలేక చింతించసాగారు. శివవాణి వారిని తపస్సు చేయమన్నది. తగిన తావునిమ్మని కోరగా శివతేజస్సారము ఐదు క్రోసులు పొడవు, 5 క్రోసులు వెడల్పు గల ప్రదేశాన్ని నిర్మించి సుందర నగరంగానూ, మలచి పంపడం జరిగింది. పురుషుడైన శ్రీహరి అక్కడే తపస్సు చేశాడు. ఆ తపోలింగమే కాశీని అలరించినది. నాటి నుండి ప్రపంచ జీవుల పాపాలను నశింపచేస్తూ ‘కాశీ’ క్షేత్రం ప్రఖ్యాతి వహించినది. ఇది ముక్తి క్షేత్రం.
త్య్రంబకేశ్వర లింగం
పరోపకారం కొఱకు గౌతమమహర్షి బ్రహ్మగిరి మీద భార్య అహల్యతో కలిసి తపస్సు చేస్తుండగా వంద సంవత్సరాలు కరువు సంభవించింది. వానలు లేక పంటలు లేవు. జనులు అపమృత్యువు పాలైనారు. గౌతముడి మనస్సు కరుణతో నిండింది. వరుణుడి కోసం తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమైనాడు. శివేచ్ఛాపరంగా సాగే ప్రకృతిని నిరోధించరాదనీ, వర్షించడం తప్ప మరేదైనా వరం కోరుకోమనగా కరువు రోజులలో దాహార్తిని తీర్చమన్నాడు. ఒక గుంట త్రవ్వమన్నాడు వరుండు. గౌతముడు తవ్విన గుంటను దివ్యజలంతో పూరించాడు. అది అక్షయ తీర్థమైనది. పిదప గౌతమ శిష్యులకూ, మునుల భార్యలకూ మధ్య వివాదం చెలరేగింది. గౌతమ శిష్యులు విషయాన్ని అహల్యకు విన్నవించారు. ఆమె వచ్చి ముని భార్యలను మందలించి కావల్సిన జలాన్ని తానే కొనిపోయింది. మునుల భార్యలు అవమానంగా భావించి భర్తలకు తెలుపగా మునులు గౌతముడికి కీడు తలపెట్టి గణపతిని ఆరాధించారు. గణపతి ఆవు రూపంలో వచ్చి గౌతముని చేలో ధాన్యాన్ని మేశాడు. గౌతముడు చూసి నాలుగు గడ్డిపరకలను ఆవుపై కోపంతో విసరగా ఆ మాయా గోవు మరణించింది. బ్రహ్మ హత్యాపాతకానికి ప్రాయశ్చిత్తంగా ఋషులు గౌతముని బ్రహ్మగిరికి 11 ప్రదక్షిణలు చేయమన్నారు.
దివ్యకుండంలో స్నానం చేసి కోటి పార్థివ లింగార్చనలు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. అహల్యా గౌతములు ప్రార్థించారు ఆది దంపతులను. గంగను అనుగ్రహించమని కోరారు. వెంటనే అఖండ గంగ అతివ రూపంలో కన్పించి గౌతమీ - గోదావరిగా పేరొంది, ఆగామవైవ స్వతమన్వంతరంలోని 28వ కలియుగం వరకూ భూమి యందుండమని శివుడు శాసించగా, ఆమె ఓరకంటితో చూసి నువ్వు నా తీరంలో సౌందర్య రూపుడవై వెలసి వుండాలని కోరింది. సరేనన్నాడు. ఈ విషయం తెలిసి దేవతలు వచ్చి శివ పార్వతులను ఏకకాలంలో ఆరాధించారు. గౌతముడు దర్భకొనతో చేసిన గుండమేకు శావర్తం అయింది. శివుడు త్య్రంబకేశ్వరుని లింగరూపంలో వెలసినాడు. గౌతమీ నామంతో నదిగా వర్థిల్లి, గోదావరిగా ప్రసిద్ధి చెందింది.
వైద్యనాథేశ్వర లింగం
రావణాసురుడు శివభక్తులలో గొప్పవాడు. ఒకసారి కైలాస పర్వతానికి వెళ్లి ఒక సిద్ధి స్థానాన్ని ఎన్నుకొని, అక్కడ చెట్టు నీడలో అగ్నిగుండం పేర్చుకొన్నాడు. దగ్గరలో శివలింగం స్థాపించాడు. శివపంచాక్షరితో యజ్ఞం చేస్తున్నాడు. శివుడు కరుణించలేదు. కోపంతో రావణాసురుడు (మిగతా 13వ పేజీలో)

ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం
(7వ పేజీ తరువాయ)
అగ్నికుండంలో ఒక్కొక్క తలనీ ఆహుతి చేయసాగాడు. తొమ్మిది తలలను ఆహుతి చేసి, 10వ తలను ఆహుతి చేయబోగా శివుడు ప్రత్యక్షమై తెగిన తలలన్నిటినీ తిరిగి వచ్చేలా చేశాడు. సాటిలేని బలాన్ని వరంగా ఇచ్చాడు. తృప్తిలేని రావణాసురుడు శివుని లంకకు రమ్మన్నాడు. అంగీకరించిన హరుడు లింగాన్ని సృష్టించి ఇచ్చి, రావణా ఇది చేతులలోనే ధరించాలి. పొరపాటున మరే ప్రదేశంలో ఉంచినా అక్కడే స్థాపితవౌతుంది. ఇదెక్కడ ఉంటే నేను ఉన్నట్లే లెక్క. ఇంత గొప్ప లింగం ఎవరికీ ఇవ్వలేదు. జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు. ఆనందంతో లింగాన్ని తీసికొని పయనమైనాడు. లఘుశంక ఏర్పడితే, దూరంగా వున్న పశువుల కాపరిగా ఉన్న పిల్లవానిని పిలిచి లింగాన్ని ఇచ్చాడు. తను వచ్చేదాకా పట్టుకోమనీ, ఎక్కడా పెట్టవద్దనీ చెప్పి వెళ్లాడు. శివలింగాన్ని మోయలేని ఆ పామర బాలకుడు ఆ లింగాన్ని అక్కడే దించాడు. అది భూస్థాపితమైంది. రావణుడు వచ్చి ఇరవై చేతులతో పెళ్లగించబోయాడు. అది వీలు కాలేదు. ఇంటి ముఖం పట్టాడు రావణాసురుడు. అంతటి శివలింగం పశువుల కాపరి చేత ప్రతిష్ఠింపబడినది గాన భారతదేశం వదలి వెళ్లలేక వైద్యనాథేశ్వర నామంతో స్వదేశంలోనే స్థిరపడి ఆరాధింపబడుతున్నాడు.
నాగేశ్వర జ్యోతిర్లింగం
పూర్వం దారుక - దారుకుడనే రాక్షస దంపతులుండేవారు. దారుక దేవీ భక్తురాలు. పశ్చిమ సముద్ర తీరంలోని అడవుల్లోకి వచ్చేలా పార్వతి అనుగ్రహించింది. ఆ దంపతులిద్దరు ఆ ప్రాంతం వారిని హింసించేవారు. అక్కడి ప్రజలు ‘ఔర్వముని’ని ఆశ్రయించారు. ఆ ముని కరుణించి ఇది మొదలు జనులు ఉన్న భూమిపై జన పీడ చేసే రాక్షసులు అక్కడికక్కడే మరణిస్తారని శపించాడు. రాక్షసుల బలం తగ్గింది. దేవతలు సాయుధులై రాక్షసులతో రణానికి భూమిపైకి వచ్చారు. దారుఖ దంపతులు దేవీ వరబలంతో అడవిని సముద్ర మధ్యానికి కొనిపోయి నీటిలో స్థాపించారు. ముని శాపం వల్ల భూమిపైకి వెళ్లే వీలులేని రాక్షసులు సముద్ర యాత్రికులపై పడి పీడింపసాగారు. చంపసాగారు. కొందరిని బంధించారు. బంధితులలో సుప్రియుడనే శైవుడున్నాడు. శివారాధనను మానేవాడు కాదు. అందరినీ ప్రోత్సహించాడు. శివుడు సంతృప్తి చెందాడు. రాక్షసుడు శివారాధకులపై దమనకాండకు దిగగా వారు శివుని రక్షణ కోరారు. వెంటనే నాలుగు ద్వారాలు గల ఆ ప్రాంగణంలో జ్యోతిర్లింగం కనపడింది. సుప్రియుడు అర్చించాడు. అందులో నుండి శివుడు వచ్చి రాక్షసులను చంపి, భక్తులను కాపాడాడు. ఇకపై ఈ దారుకా వనం వర్ణాశ్రమ ధర్మాలతో వర్థిల్లుతుందని వరమిచ్చి ‘నాగేశ్వరుడ’నే పేరుతో జ్యోతిర్లింగాన్ని అర్చించిన వారికి రాచరికం సిద్ధిస్తుందని చెప్పాడు. ఆ యుగాంతంలో వీరసేనుడనే రాజు శివభక్తుడై ఆ లింగాన్ని ఆరాధించి, పాశుపతవిదుడై దారుకా వంశాన్ని నాశనం చేశాడు. ఆ వీరసేనుని కుమారుడే నల చక్రవర్తి. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ చరితము.
శ్రీరామేశ్వర లింగం
రావణ వధార్థమై విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా మానవావతారం దాల్చినాడు. సీతను పెండ్లాడి వన వాసానికి పయనమై తనతో సీతను తీసికొని వెళ్లినాడు. రావణుడు వనం నుండి సీతను అపహరించి లంకా నగరానికి కొనిపోయినాడు. రాముడు యుద్ధం ప్రకటించాడు. లంకా నగరం ఎలా వెళ్లాలా అని ఆలోచించాడు. శివార్చనే తరుణోపాయంగా భావించి ఆ సముద్రతీరాన పార్థివ లింగార్చన చేశాడు. శివుడు కరుణించి వరం కోరుకోమన్నాడు. కోరినవన్నీ ఇచ్చాడు. శ్రీరాముని అనుగ్రహించి కోరిక మేరకు స్థిరపడమన్నాడు శివుని. శివుడక్కడ ‘రామేశ్వరుడ’నే పేరున జ్యోతిర్లింగమై ఆవిర్భవించాడు. ప్రయాగ నుండి గంగాజలం తెచ్చి రామేశ్వర లింగాన్ని అర్చిస్తే జీవన్ముక్తులౌతారని శివుడు అనుగ్రహించాడు. భక్తులకైనా, అమరులకైనా లభించని భోగభాగ్యాలు లభిస్తాయని పరమేశ్వరుడే ప్రకటించాడు.
శ్రీ ఘుశే్మశ్వర లింగం
భారతదేశ దక్షిణ దిశలో దేవగిరి పర్వతం ఉంది. అక్కడికి దగ్గరలో సంపన్న గ్రామంలో సుధర్ముడు అనే విప్రుడున్నాడు. భార్య సుదేహ. వారికి సంతానం లేదు. సుదేహ తన చెల్లెలు ‘ఘుశ్మ’ను ఇచ్చి భర్తకు మారు మనువు చేసింది. ఘుశ్మ శివభక్తురాలు. ప్రతి దినం 101 పార్థివ లింగాలను అర్చించేది. గర్భం దాల్చింది. కుమారుని కన్నది. గ్రామస్థులు సుదేహను గొడ్రాలు అని నిందించేవారు. సుదేహ చెల్లెలి పుత్రుని పట్ల అసూయ పెంచుకున్నది. పిల్లవానికి యుక్త వయసు రాగానే తగిన కన్యతో పెండ్లి చేశారు. సుదేహ ఈర్ష్యగా వున్నప్పటికీ కొడుకు కోడలు సుదేహను గౌరవించేవారు. సుదేహ ఒకరోజు రాత్రి కుమారుని చంపింది. ఆ శరీరాన్ని ఖండాలుగా చేసి మూటగట్టి తీసికొని వెళ్లి ఘుశ్మ - పార్థివ లింకాలను పడవేసే కూపంలోకి విసిరేసి ఏమీ తెలియనట్లు ఇల్లు చేరింది.
ఘుశ్మ పార్థివ లింగార్చనలో పడింది. వంట గదికి సుదేహ వెళ్లి చూస్తే మాంసపు ఖండాలు కనిపించాయి. కోడలు దిగులు పడింది. దుఃఖించి అత్తగారినీ మామగారినీ ఆశ్రయించింది. శివలాంగారాధనను పూర్తిచేసి అత్తగారు మధ్యాహ్నం వేళ లింగాలను రోజూ నిక్షిప్తం చేసే బావిలో పెట్టి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో చెరువుగట్టున మరణించిన కుమారుడు సజీవుడై కన్పించాడు. ఆశ్చర్యపడింది. శివుని ప్రార్థించింది. శివుడు దర్శనమిచ్చాడు. వరం కోరుకోమన్నాడు. ఘుశ్మ తన పేరున అక్కడ వెలసి వుండమన్నది. దీవిచి వెంటనే ‘ఘుశే్మశ్వరుడ’నే పేరున జ్యోతిర్లింగంగా వెలిశాడు. లింగాలతో నిండిన కుండం ‘శివాలయం’ అనే పేరున పుష్కరిణిగా మారింది.
శివపురాణం ఆధారంగా ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పరమేశ్వరుడు ప్రపంచానికి అందించిన మహిమల చరితం, జ్యోతిర్లింగాల దర్శనం - ఆరాధనం - శ్రవణం - భక్తిముక్తి దాయకాలు. పరమేశ్వర అనుగ్రహ ఆశీస్సులు.
‘ఓం నమశ్శివాయః’

వందే శివం శంకరమ్

$
0
0

సీ.రుద్రుడై కరుణాసముద్రుడై నిత్యస
త్యానంద ముద్రుడై యలరునెవడు?
ఈశుడై సర్వలోకేశుడే, తాండవ
కేళీ విలాసుడై క్రాలునెవడు?
త్రిభువన భర్తయై, దివిజ గంగావేగ
హర్తయై వర్థిల్లు కర్త ఎవడు?
శూలియై ఘనకీర్తి శాలియై సంచిత
పాప నిర్మూలియై పరగునెవడు?

తే.గీ.శంకరుండై నిరంతర కింకర సువ
శంకరుండై విమోచనా శంకరుండు
నై, ఫణి విభూషితుండునై యడరు నెవడు?
వాని కర్పింతు నతులెన్నొ భక్తిమీర

సీ.హిమశైల పుత్రికా హృదయాధినాథుండు
రజత శైలాగ్ర విరాజితుండు
తారకాసుర ముఖ్యదైత్య సంహరణుండు
భావజ ఘనగర్వ భంజనుండు
ఫణిరాజ మణితేజ భాసిత కంఠుండు
పంచాక్షరీ మంత్ర పాలకుండు
శీతాంశు శోభిత శీర్ష సంయుక్తుండు
పావనుండౌ నంది వాహనుండు
మహిమ కారుణ్య పూరిత మానసుండు
భక్త హృణ్మందిరా రామ భాసితుండు
ఘనగుణోద్భాసితుండు గంగాధరుండు
శంకరుండు ఘోరాఘనా శంకరుండు


శివరాత్రి

$
0
0

శిరసుపై నెలవంక దీపమై వెలుగగా
మారేడు త్రిదళాల నీ పూజ చేయగా
గంగమ్మ తలపైన
గిరి తనయ సగమైన
జంగమయ్యా నువ్వు జగమేలు దేవుడవు.
శివశివా
నీవు త్రిపురసంహారివి
త్రిజగ సంచారివి
కైలాస గృహ నిలయ
గిరిజాంతరంగా
కామన్న పున్నమన నీ ధవళ కాంతి
ఎప్పుడూ నిను చూచు భాగ్యాల నంది
ముప్పొద్దులా నిన్ను మ్రొక్కేము మేము.
నీ ఆన లేనిదే చీమైనా కుట్టదా
శివధనస్సు విరవ రామునికి వరమిచ్చి
‘సీతారాముల’ను ఆదర్శ దంపతుల
రమణీయ రామకథ రచియింపజేశావు.
జగతికే పితరులు
మీ పాదాల సాక్షిగా మిము వేడుతున్నాము
అన్న పానాదులకు లోటు లేకుండా
అన్నపూర్ణమ్మ ఆదరిస్తే చాలు
కడుపు నిండా బువ్వ, కంటి నిండా నిద్ర
కలిమి కాదా శివా కలిగినోడికన్న
ఉంటాను ఈ రాత్రి నీ దేవళాన
కన్నోళ్ల కలలను కళ్లతో చూడాలని
ఓ శివయ్యా
ఓం నమః శివాయ

ప్రాచీన శిల్పకళకు ప్రతిరూపం ధర్మపురి శివాలయం

$
0
0

భారత దేశ ప్రాచీన సంస్కృతీ సభ్యతలకు నిలయంగా, సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా, వేదవేదాంగ, శాస్త్రాగమ, నృత్య గీత నాట్యాది సకల కళలయందు నిష్ణాతులైన ధార్మిక కార్యాచరణాసక్తులైన ప్రజానీకంతో, మరెచ్చటా కానరానన్ని ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్న పలు దేవాలయాల సముదాయం కలిగి, రాష్ట్రంలో సుప్రసిద్ధ ప్రాచీన పవిత్ర గోదావరీ తీరస్థ తీర్థంగా, పుణ్య క్షేత్రంగా మిగుల ప్రాచుర్యం పొందింది నాటి అవిభక్త కరీంనగర్, నేటి నూతన జగిత్యాల జిల్లాలోని ధర్మపురి క్షేత్రం. శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వరస్వాముల దేవాలయాలు, మసీదూ పక్కపక్కనే కలిగి అనాదిగా వైష్ణవ, శైవ, ముస్లిం మత సామరస్యానికి సాక్షీభూతంగా నిలిచియుందీ క్షేత్రరాజం. గంభీర గౌతమీనదీ తీరాన వెలసి, అలనాటి శిల్పకళా చాతుర్యానికి ప్రతిబింబమై పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకుని దక్షిణ కాశిగా పేరెన్నికగనుటకు మూలకారణమైనది ఈక్షేత్రంలోని శ్రీరామచంద్ర స్థాపిత శ్రీరామలింగేశ్వరాలయం. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించిన నేపథ్యంలో, కైలాసమేగిన సందర్భంలో, నిత్యానందంలో మునిగి తేలుతూ ఆ మహర్షి రాకను గమనింపని పార్వతీ పరమేశ్వరులను గాంచిన భృగు మహర్షి, శివుడు లింగరూపులోఉంటూ, ఎవరిచేతా పూజింపబడకుండునట్లు శాపమిచ్చెనని పురాణాలు విశదీకరిస్తున్నాయి. తన శాప విముక్తికై పరమ శివుడు, మహా విష్ణువును గురించి ఘోర తపస్సుచేయగా రామావతారంలో, ధర్మపురి క్షేత్రంలో స్వయంగా తాను లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించి శాపవిమోచనం కలిగించగలనని మహా విష్ణువు వరమిచ్చినట్లు స్థానిక పురాణాలు స్పష్టపరుస్తున్నాయి. రామావతారంలో దశరథుని ఆజ్ఞానుసారం వనవాస దీక్షలో, దండకారణ్యంలో సంచరిస్తూ, ధర్మపురి క్షేత్రానికి ఏతెంచిన శ్రీరాముడు అలనాటికే వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఈశాన్యాన సైకత (ఇసుక) లింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లు, శ్రీరామునిచే స్థాపించ బడినందున శ్రీరామలింగేశ్వరుడని నామాంకితుడైనట్లు స్థల పురాణం స్పష్టం చేస్తున్నది. ఆరవ శతాబ్ధంలో స్థాపించబడి, ఎనిమిదవ శతాబ్దాంతం వరకూ వర్థిల్లిన చాళుక్య రాజుల ప్రాభవంలో పునర్మించబడిన రామేశ్వరాలయంలోని గణేశ విగ్రహములు అలనాటి శిల్పకళకు అద్దం పడుతున్నాయి. క్రీ.శ.973నుండి 1140 వరకు పాలించిన కల్యాణి చాళుక్యుల వంశానికి చెందిన విక్రమార్క బిరుదాంకితుడగు ఆరవ విక్రముని (1076-1126) నాటి శిలాశాసనం ఈఆలయంలో ఉంది. ఇందులో ఈ చాళుక్యరాజు పరమేశ్వర, రణరంగభైరవ, మార్వల భైరవ, ఆయ్తగంధ వారణ, విక్రమాదిత్య బిరుదులతో ప్రశంసింప బడినాడు. శాలివాహన శకం 1168 పరాభవ నామ సంవత్సర కాలం నాటి కాకతి గణపతి దేవుని శిలాశాసనం రామేశ్వరాలయంలో పూర్వపు చాళుక్య స్థంభంపైనే చెక్కబడి ఉంది. గణపతి దేవుడు ఇచటి రామేశ్వర, చండికల అంగరంగ వైభోగములకు గావించిన కొన్ని దానములు శాసనములలో పేర్కొనబడినవి. చాళుక్య శైలిలో బొజ్జ ఎత్తుగానుండి, సహజమైన ఏనుగు తలను కలిగి, మానవరూపంలేని గణపతి విగ్రహం ఆలయ సముదాయంలోనుంది. శివాలయ శిఖర నిర్మాణంలో చాళుక్య శైలి ఉంది. శిఖరం చాపాకృతిని పోలి, కిందనుండి పైకి ఎక్కుపెట్టిన విల్లులా ఉంది. శిఖర సౌందర్యానికి పైన అమలకములు వృత్తకారంలో చుట్టూరా కలిగి ఆపైన భాండాకృతి అంతకుపైన చిన్న కలశం, తూర్పున శుకనాసం ఉన్నాయి. శుకనాసం చిలుక ముక్కులాగా ముందుకు పొడుచుకు వచ్చిన గూడు. శిఖర నిర్మాణం ఉత్కళ శైలిలో, లింగరాజ స్వామి ఆలయం (్భవనేశ్వర్) దేవాలయ శిఖరాకృతిని పోలి ఉంది. ప్రవేశ మంటపం తర్వాత దూరంగాగల ఆలయంలో మొదట ముఖ మంటపం ఉంది. మధ్యన గల రంగశిల ప్రాచీనంగా నర్తకీమణుల వేదిక, నేడది వల్లుబండ. తర్వాత చీకటిగానుండే అంతరాళము. ఆపైన గర్భగృహము, అందు శ్రీరామచంద్ర స్థాపిత సైకత (ఇసుక) లింగం. ముఖ మంటపము, ప్రవేశ మంటపము, గర్భగృహములు దాటితే శివుని దర్శనం. ఆలయ ప్రాంగణంలో మూడు ద్వారాలకు అభిముఖంగా మూడు నల్లరాతితో నిర్మించిన ఆభరణాలు అధికంగాగల, పీఠంపై ఉబ్బెత్తు హారాలు గలిగి, కాకతీయ శివాలయాలలోవలె అధ్భుతమైన శిలాకృతులు, జిలుగు నగిషీలు, మెడలో గంటలు, మువ్వల పట్టి, మెడ పట్టెడలు, గంగడోలు, వంపు తిరిగిన మెడ, వృహణాలతో నందులు ఉన్నాయి. పైకప్పుపై అపురూపాలైన ఏకముఖ ద్విదేహ నందులు నాలుగు మూలల ఉండేవి. సాలహార పునర్నిర్మాణ సమయంలో కూల్చి వేయడం జరిగింది. దేవాలయం కప్పుకన్నా ఎత్తుగా, నిటారుగా 15అడుగుల ఎత్తు ఉన్న ధ్వజస్థంభం (విజయ స్థంభం) ఉంది. శివాలయంలో ఈశాన్య భాగాన గణపతికి ప్రత్యేక గుడి ఉంది. ఇది కూర్చోని ఉన్న భారీ విగ్రహం. చాళుక్యుల కాలంనాటి విగ్రహానికి కుడి చేతులో గద ఉంది, నాగభంధం కలదు. ఎడమ చేతిలో గండ్రగొడ్డలి వంటి ఆయుధం, ఎడమ కింది చేతిలో మోదకాలు (ఉండ్రాళ్ళు) ఉన్నాయి. చెవులు చేటలవలె విశాలంగా ఉన్నాయి. శివాలయంలో రెండు వీర గల్లుల శిల్పాలున్నాయి. పదాతిదళపు వీరుడు శతృవులను చీల్చిచెండాడుతున్న దృశ్యం. ప్రాంగణం బయట నాగిని విగ్రహముంది. పైన నాగుల ఐదు పడగలతోకింద స్ర్తిమూర్తి. చివర తోక, కాళ్ళు లేకుండా ఉంది. ఎనిమిది చేతుల మహిషాసుర మర్ధిని విగ్రహం ఉంది. అలాగే అపురూపాలైన బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ లేదా వరాహ పురాణంలో చెప్పబడిన యోగీశ్వరి ఆదిగా సప్తమాతృకల విగ్రహాలున్నాయి. ఒకే పీఠంతో చతురస్రాకార శిల్పమిది. ఇరు పార్శ్వాలలో గణపతి వీర భద్రుని విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన దైవత లింగంకాక ముఖ మంటపంలో వాయవ్యాన కాశీ విశ్వనాథుడనే పేరుతో పూజలందుకునే అందమైన నాలుగడుగుల ఎత్తుగల లింగం ఉంది. దండకారణ్యంలో సంచరిస్తూ, ధర్మపురి గోదావరిలో స్నానమాచరించి, శివుని పూజించేందుకు, హనుమంతుని లింగం తెమ్మని కాశీకి పంపగా, ప్రతిష్ఠించే సమయానికి ఆంజనేయుడు రాని స్థితిలో, సైకత లింగ ప్రతిష్ఠ గావించారని, ఆలస్యంగా ఏతెంచిన హనుమ సేవలు వ్యర్థం కాకుండా, హనుమల్లింగాన్ని ప్రతిష్ఠచేసి, ఆ లింగాన్ని పూజింజాకే, గర్భాలయంలోకి వెళ్ళేలా నియమం శ్రీరాముడు ఏర్పరచారని స్థల పురాణం స్పష్ట పరుస్తున్నది. ఆలయంలో 13శతాబ్దికాలంనాటి చండిక విగ్రహం కలదు. ఈవిగ్రహంలో అమ్మవారు చక్రస్తని, త్రిశూల, ఖడ్గహస్త, మకుట ధారిణి, చతుర్భుజ, శూల ధారిణిగా ఉంది. కాశీ విశ్వనాథుని పక్కన ప్రాచీన పార్వతీదేవి శిల్పం, మహిషాసుర మర్ధిని, షణ్ముఖుడు (కుమార స్వామి), ఉమా మహేశ్వరులు విడివిడిగా నల్ల శిలపై మలచబడి ఉన్నాయి. ఆలయంలో విక్రమాదిత్యుని, గణపతిదేవుని, ప్రధాన ద్వార కడప ముందర, బంకుళ్ళలో, దక్షిణ ప్రవేశ ద్వార స్థంభం, నైరుతి దిశలో ప్రహారీగోడ బాహ్యాది ఆరు శాసనాలున్నాయి. చుట్టూ రథం తిరిగేంత ప్రాంగణం, 10 అడుగుల ప్రహారీ కలిగి ఉన్నదీ ఆలయం. చారిత్రిక నేపథ్యం ప్రకారం, క్రీ.శ.1309లో ఢిల్లీనేలిన అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ నాయబ్ కాపూర్, ఇందూరు (నిజామాబాద్ ) మీదుగా ధర్మపురి మార్గంలో కాకతీయులపైకి దండెత్తివెళ్ళిన సమయంలో క్షేత్రంలోని రామేశ్వర, నృసింహాలయాలు ధ్వంసం చేయబడినవి. క్రీ.శ.1332-1367 మధ్యకాలంలో తెలంగాణాలోని వెలమ వీరుల సాయంతో, ముస్లింలనుండి దాస్య విముక్తి కలిగించిన ముసునూరి కాపయామాత్యుని పాలనా కాలంలో, పరమహంస పరివ్రాజకాచార్య నారాయణాశ్రమ స్వామి ఉభయ దేవాలయాలకు చేయూతనిచ్చి తిరిగి అర్చనాదులకై కట్టుదిట్టం చేశారు. అబుల్ హసన్ తానాషా(1674-1687) మంత్రియగు మాదోభానూజీ సూర్యప్రకాశ రావుమజుందార్ (మాదన్నమంత్రి) ఉభయ ఆలయాల అర్చనకు సహకరించారు. నాటినుండి స్థానిక దాతలైన విప్రవరుల, ఆర్యవైశ్యుల, భక్తుల సహకారంతో పూజా నైవేద్యాది విధివిదాన కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తూ, కొంతకాలం క్రితం దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలోనికి తీసుకోబడింది. ఫలితంగా లక్ష్మీనరసింహ దేవస్థానంలో అంతర్భాగమైంది. వివిధ ధర్మకర్తల మండలుల కృషితో, దాతల చేయూతతో నిధులను ప్రోగుచేసుకుని ముఖ్యమంత్రి సర్వశ్రేయోనిధి ద్వారా ప్రత్యేక నిధులుపొంది దేవాలయ పునరుద్ధరణ, సాలహార నిర్మాణం, అమ్మవారు, నంది, కలష, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠలు పూర్తి చేసుకుని , శృంగేరి శంకరాచార్య బహూకృత ఆదిశంకర, శారదామాత మూర్తులను ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. శివరాత్రి, శివ కళ్యాణం, రథోత్సవం, గణపతి, నవగ్రహ పూజలు, శంకర జయంతి, శరన్నవరాత్రుల ఉత్సవాలను, నరసింహ స్వామివారల బ్రహ్మోత్సవ వేడుకలలో అంతర్భాగంగా ఉత్సవాలను ఈఆలయంలో ఏటా సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

శివోహం.. నీలాద్రీశ్వరాలయం!

$
0
0

ప్రశాంత వాతావరణం.. కాలుష్యానికి, జనవాసాలకు దూరంగా అభయారణ్యం. పక్షుల కిలకిలారావాలు.. పురివిప్పి ఆడే నెమళ్ల కేరింతలు. చుట్టూ కొండల మధ్య నుండి జాలువారే సెలయేరు.. ఆధ్యాత్మికత ప్రతిఒక్కరిలో ఉట్టిపడి భక్త్భివం ఉప్పొంగే ప్రాంతం. ఎతె్తైన గుట్టల నడుమ భారీ వృక్షాలు. ఆహ్లాదం, భక్తుల పారవశ్యం మధ్య విశిష్టత కలిగిన శివాలయం. భక్తుల కోర్కెలు తీర్చే శివుడు కొలువుదీరిన కొండలన్నీ నీలిరంగులో ఉండటంతో స్వామివారు నీలికంఠుడని, ఆలయం నీలాద్రీశ్వరాలయమని పేరుగాంచింది. దేశంలో ప్రసిద్ధ శివాలయాలు ఎన్నో ఉన్నా ఒక్కో ఆలయానిది ఒక్కో చరిత్ర. అలాంటి ఆలయాల్లో ఒకటైన నీలాద్రీశ్వరాలయానికీ వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
కాకతీయ రాజులపై శత్రురాజ్యం వారు దండెత్తిన సమయంలో కాకతీయులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొనే్నళ్లు విడిది చేశారు. శివభక్తులైన కాకతీయులు నిత్యం శివారాధన చేసేవారు. వీరు నిత్య పూజలు చేసేందుకు కొండల మధ్య ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం పక్కనే కొండల మధ్య నుండి ఎవ్వరికీ కన్పించకుండా ఓ జలధార నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. జలధార ఎక్కడి నుండి వచ్చేది ఇప్పటికీ తెలియకపోవటంతో ఇదంతా శివమహిమేనని భక్తులు విశ్వసిస్తారు. మరో విశేషమేటంటే ఆలయం చుట్టూ ఉన్న కొండలపై కొంతదూరంలో మరో పెద్ద కొండ ఉంది. ఈ కొండ అచ్చం నాగేంద్రుని పడగ రూపంలో కనిపిస్తుంటుంది. ఇక్కడ పూజలు నిర్వహించిన తరువాత కాకతీయులు శత్రువులపై విజయం సాధించారు. అనంతరం వారు ఈప్రాంతాన్ని వీడి వెళ్లారు. అప్పటి నుండి శివాలయంలో పూజలు లేక శిథిలావస్థకు చేరింది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాక ఈ ప్రాంతానికి సమీపంలోని భవన్నపాలెం గ్రామ జమీందారు ఇనుగంటి పట్ట్భారామయ్యకు ఓరోజు రాత్రి శివుడు కలలో దర్శనమిచ్చి గుడి ఆనవాళ్లు స్ఫురింపజేశాడు. తెల్లవారాక ఆయన గుర్రంపై అడవిలో అనేక రోజులు గాలించగా ఒకరోజు సమీప ప్రాంతం నుండి ఓంకార నాదం వినిపిస్తుండటంతో ఆ దిశగా వెళ్లారు. అక్కడ శిథిలావస్థలోని గుడి కనిపించింది. గుడిలోకి వెళ్లి చూస్తే అక్కడ శివలింగానికి ఓ నాగుపాము పెనవేసుకొని పడగవిప్పి దర్శనమిచ్చింది. జమీందారు తన అనుచరులతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉండి ఆలయాన్ని శుభ్రపరిచి అడవిపూలు, మారేడు దళాలతో పూజలు చేశారు. అడవిలో చెట్లకున్న ఫలాలను కోసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా ఆ ప్రాంతవాసులు నెలరోజులకోసారి వచ్చి శివుడికి పూజలు చేయటం ప్రారంభించటంతో అప్పటి వరకున్న కరవు కాటకాలు తొలగిపోయి సుభిక్షంగా జీవించసాగారు. వారి సమస్యలన్నీ ఇక్కడి శివారాధనతో ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. అప్పటి నుండి ఇదంతా ఆ పరమేశ్వరుడి మహత్యమేనని భక్తులు అడవిలో బాటవేసి రోజూ పూజలు చేయటం ప్రారంభించారు. ఆలయానికి వెనుక వైపు ఉన్న పెద్దపుట్టలోని ఓ నాగుపాము కూడా రోజూ శివుడికి పూజలు చేసేదని కథనం. ఇలా వందల సంవత్సరాలు పైగానే జరిగింది. ఆలయం చాలా పురాతనమైనది కావటంతో ఇక్కడి రాజులు గుప్త నిధులు దాచి ఉంటారనే భావనతో కొందరు దుండగులు ఆలయ పరిసరాలతో పాటు గర్భగుడిని కూడా తవ్వారు. ఈ క్రమంలో అక్కడున్న నాగుపాము అడ్డుపడగా దాన్ని చంపేసి అక్కడే పడేసి వెళ్లిపోయారు. తెల్లారి భక్తులు పూజలు చేసేందుకు వెళ్లినపుడు ఆలయంలో తవ్వి శివలింగాన్ని పక్కన పెట్టి ఉంచటం, అక్కడే నాగుపాము చనిపోయి ఉండటాన్ని చూశారు. ఈ ఘటనపై వీఎం బంజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. దీంతో భక్తులు విరాళాలు పోగుచేసి ఆలయ అభివృద్ధికి నడుం బిగించారు. ప్రభుత్వం కూడా ఆలయ విశిష్టతను గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకుంది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మరింత అభివృద్ధి చేసింది. అప్పటి నుండి నిత్యం ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. కార్తీక మాసంలో వేలాది మంది మహిళా భక్తులు దీక్షలు చేస్తూ కార్తీక దీపాలను వెలిగించి తరిస్తుంటారు. మహాశివరాత్రి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు వచ్చి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు. ఖమ్మం జిల్లా పెనుబల్లికి సుమారు 20కిలోమీటర్ల దూరంలోని భవన్నపాలెం సమీపంలో ఈ మహిమాన్విత ఆలయంలో నీలకంఠుడు భక్తుల పాలిట కొంగుబంగారమై నీలికొండల మాటున విలసిల్లుతున్నాడు.
బ్రహ్మ-విష్ణువుల తగవు తీర్చిన వైనం!
ఒకనాడు బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే విషయమై కలహం మొదలైంది. నేను గొప్పంటే.. నేను గొప్పంటూ ఇద్దరూ గొడవపడి పరమేశ్వరుడి వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు. వీరి వాదన విన్న శివుడు చిరునవ్వు చిందిస్తూ ఇద్దరూ సమానమేనని, ఎవ్వరూ ఒకరి కంటే ఒకరు ఎక్కువా కాదు, తక్కువా కాదని సర్దిచెప్పాడు. అయినప్పటికీ ఇద్దరూ సంతృప్తి చెందకపోవటంతో వారికి ఓ పరీక్ష పెట్టాడు. ‘విశ్వం ఆదీ, అంతాన్ని మీలో ఎవ్వరు కనుక్కుంటే వారే గొప్ప’.. అని శివుడు వివరిస్తాడు. దీంతో బ్రహ్మ, విష్ణువులిద్దరూ విశ్వమంతా తిరగటం మొదలెడతారు. ఎంత తిరిగినా ఆదీ, అంతం దొరక్కపోవటంతో విష్ణువు తిరిగివెళ్లి శివుడి వద్ద తన ఓటమిని అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను గెలవాలనే అత్యాశతో విశ్వం ఆదీ, అంతాలను తాను చూశానని, ఇందుకు మొగిలి పూవు, కామధేనువు సాక్ష్యం చెప్పాలని వాటిని బలవంతంగా ఒప్పిస్తాడు. వీరిద్దరినీ వెంటబెట్టుకొని శివుడి వద్దకు వెళ్లిన బ్రహ్మ తాను పోటీలో గెలిచానని, ఇందుకు సాక్ష్యం మొగిలి పూవు, కామధేనువులేనని చెప్తాడు. శివుడు ముందుగా ‘ఇది వాస్తవమేనా?’ అని మొగిలి పూవును అడిగితే, ‘అవును! బ్రహ్మ విశ్వం ఆదిని, అంతాన్నీ చూశాడు’ అని అబద్ధం చెపుతుంది. కామధేనువును ఇదే ప్రశ్న అడిగితే ఓపక్క తలతో అవునని చెప్తూనే, తోకతో కాదని చెపుతుంది. దీంతో విషయాన్ని గ్రహించిన శివుడు బ్రహ్మతో ‘నీవు అబద్ధం చెప్తున్నావు. వాస్తవానికి విశ్వానికి ఆదీ, అంతం లేవు’ అని వివరిస్తాడు. దైవస్వరూపంగా ఉండి అబద్ధం ఆడినందుకు నువ్వు పూజలు అందుకునే అర్హత కోల్పోయావని బ్రహ్మను శపిస్తాడు శివుడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగిలి పూవుకు ఎంత సువాసన ఉన్నప్పటికీ నీవెప్పటికీ పూజకు పనికిరావంటూ శపిస్తాడు. వాస్తవాన్ని తెలియజేసిన కామధేనువు తోకను ఎవ్వరు తలపై పెట్టుకుంటే వారి పాపాలు తొలగిపోతాయంటూ కామధేనువుకి శివుడు వరమిస్తాడు.
విశ్వబ్రాహ్మణుడు, అగస్త్య మహాముని శాపాలు!
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఆగస్త్య మహాముని అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. నిత్యం శివారాధనతో జీవించేవాడు. ఈయన పరమ శివభక్తుడు. ఏడాదంతా కటిక ఉపవాసంతో ఉంటూ కఠోర నియమ నిబంధనలతో శివన్నామ స్మరణే ఊపిరిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ మహాముని ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే భోజనం చేసేవాడు. ఆ ఊరికి ఎంతోదూరంగా ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో మహా శివరాత్రి రోజు మాత్రమే పూజలు, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటాయి. అనంతరం అక్కడికి వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేస్తుండేవారు. అగస్త్య మహాముని నియమనిష్టలతో రోజూ అడవికి వెళ్లి జమ్మిచెట్టుకున్న ఆకులు కోసుకొచ్చి ఏడాదంతా తాను భుజించేందుకు విస్తరిని జమ్మి ఆకులతో తానే స్వయంగా కుట్టుకునేవాడు. ఇలా శివరాత్రి రోజు నాటికి ఓ పెద్ద విస్తరిని తయారు చేసుకొని ఎడ్లబండెక్కి గుడికి ఏటేటా వెళ్లేవాడు. ఆలయంలో నిర్వాహకులు మాత్రం అన్నదానానికి వండిన పదార్థాలన్నీ అగస్త్య మహామునికే సరిపోతాయని, భక్తులకు సరిపోవని ఆందోళన చెందేవారు. ఈ సమయంలో విశ్వకర్మ అక్కడికి వెళ్లి అగస్త్య మహామునిని కల్యాణం, అన్నదానానికి రాకుండా తాను ఆపుతానని, ఇందుకు తనకు ఓ సోలెడు గిద్దెడు బియ్యం, ఓ రూపాయి పావలా, పిడికెడు పప్పు ఇవ్వాల్సిందిగా కోరతాడు. ఇందుకు నిర్వాహకులు విశ్వకర్మకు ఆయనడిగినవన్నీ ఇచ్చి పంపుతారు. ఆ శివరాత్రి రోజు ప్రతి ఏటా మాదిరిగానే అగస్త్య మహాముని ఎడ్లబండిపై తాను కుట్టుకున్న జమ్మి ఆకుల విస్తరిని తీసుకొని గుడికి బయలుదేరతాడు. కొంతదూరం వెళ్లాక విశ్వకర్మ ఎదురుగా వస్తుండటం చూసి బండిని ఆపి ‘ఏమిటి విశ్వకర్మా? కల్యాణమవ్వకుండానే తిరిగి వస్తున్నావే?’ అంటూ ప్రశ్నిస్తాడు. ఇందుకు విశ్వకర్మ ‘ఇంకేమి కల్యాణం మహామునీ.. కల్యాణం, అన్నదానం కూడా ఎప్పుడో అయిపోయాయిగా! ఈ ఏడాది శివపార్వతుల కల్యాణం కన్నులపండువగా, అన్నదానం మహా కమ్మదనంగా జరిగాయి’ అని చెపుతాడు. ఇందుకు మహాముని ‘ఇంకా సమయమున్నది కదా! ఇప్పుడే అయిపోవడమేమిటి?’ అని అంటాడు. ‘మీరే ఆలస్యంగా వెళుతున్నారు. నేను కల్యాణాన్ని కళ్లారా తిలకించి, కడుపునిండా సుష్టుగా భోజనం కూడా చేశాను’ అని విశ్వకర్మ అబద్ధం చెపుతాడు. తనకు నిర్వాహకులు స్వయంపాకం కూడా ఇచ్చారని, తనదగ్గరున్న సోలెడు గిద్దెడు బియ్యం, రూపాయి పావలా, పిడికెడు పప్పును చూపిస్తాడు. ఇది నమ్మిన మహాముని తనపై తనకే కోపమొచ్చి తాను తినేందుకు తెచ్చుకున్న విస్తరిని ముక్కలు ముక్కలుగా చించిపారేస్తాడు. కొద్దిసేపటి తరువాత తానెప్పుడూ ఆలస్యంగా వెళ్లేవాడిని కాదనుకుంటూ అనుమానం వచ్చి తిరిగి గుడికి బయలుదేరతాడు. మహాముని వెళ్లే సమయానికి అప్పుడే కల్యాణం పూర్తయి, అన్నదానం తుది ఘట్టానికి చేరుకుంటుంది. అంటే, విశ్వకర్మ తనను మోసం చేశాడని మహాముని గ్రహిస్తాడు. ఆగ్రహించిన ఆయన విశ్వకర్మ వద్దకు వెళ్లి.. ‘శివుడ్ని ఆరాధించే నాకు శివపార్వతుల కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని దూరం చేసి, ఆకలితో ఉన్న నన్ను పస్తులతో ఉండేట్లుగా చేస్తావా? ఏ సోలెడు గిద్దెడు బియ్యానికి, రూపాయి పావలాకు, పిడికెడు పప్పు కోసం నీవిలా చేశావో... నీవెంత కష్టపడ్డా ఆ సోలెడు గిద్దెడు బియ్యం, రూపాయి పావలానే నీకు దక్కుతాయి’ అంటూ శపిస్తాడు. ఇందుకు విశ్వకర్మ కూడా ‘నీకంటే నేనేమీ తక్కువకాదు. నన్ను శపించిన నీకు అన్నం దొరకదు. నువ్వు గొయ్యి తవ్వి తీసిన మట్టే భుజించి కడుపునింపుకోవాలి’ అంటూ అగస్త్య మహామునిని శపిస్తాడు. ఆ శాప ప్రభావమే ఎక్కడ గొయ్యితీసి పూడ్చినా కొంచెం మట్టైన తగ్గుతుందని, ఆ తగ్గిన మట్టే ఆ మహాముని భుజించేవాడని ఇప్పటికీ నానుడి!

భక్తుల కొంగు బంగారం అల్లాదుర్గం

$
0
0

అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే అల్లాదుర్గం గ్రామ శివారులో వెలసిన శ్రీ బేతాళ స్వామి నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఇక్కడ ప్రతియేటా నిర్వహించే ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ లక్షలాది మందిని తన్మయత్వానికి గురిచేస్తాయి. బేతాళుడు అంటే భూత, ప్రేత, పిశాచాలకు అధిపతి. అలాంటిది ఆయనను దైవ స్వరూపంగా ఎందుకు పూజిస్తారనే ప్రశ్నలు తలెత్తడం సహజం. బేతాళుడి చరిత్రను తంత్ర శాస్త్రం అపూర్వంగా తెలియజేస్తోంది. బేతాళుడు అంటే రాత్రిళ్లు కాపలా కాసేవాడు అని అర్థం. బేతాళుడు వాస్తవంగా భూతం కాదని, శివుడి వద్ద ఉండే రుద్రగణాలలో నాగ, గరుడ, గంధర్వ అనే ఉప జాతులలో ఒక వర్గానికి అధిపతిగా, రాజుగా ఉన్నాడని తంత్ర శాస్త్రం ద్వారా అవగతమవుతోంది. బేతాళుడిలో కేవలం మగవారు మాత్రమే ఉండగా, స్ర్తి జాతి లేకపోవడం మరో విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో గ్రామ దేవతల సోదరుడు పోతురాజుగా ఆరాధించేది కూడా బేతాళ స్వామినే. తమిళనాడు, కేరళ, కర్నాటక, శ్రీలంక తదితర ప్రాంతాల్లో బేతాళ స్వామిని కర్పస్వామిగా పూజిస్తారు. మహారాష్టల్రో బేతాళ్‌గా విఠోభగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బేతాళుడు అసూయ, కోపం ఇతర దుర్గుణాలను తొలగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ స్వామిని మనసా, వాచా, కర్మణా పూజిస్తే భూత, ప్రేత, పిశాచ, అనారోగ్య బాధలను నుండి విముక్తి కల్పిస్తాడని నమ్మకం. పచ్చని పొలాలకు, కొత్తగా నిర్మించే గృహాలకు దిష్టి తగులకుండా బేతాళుడి స్వరూపంలో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి మనకు తెలియకుండానే మొక్కులు చెల్లించుకుంటున్నాం. బేతాళ స్వామిని వశపర్చుకోవడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో అఘోరీలు కర్ణకఠోరమైన పూజలు నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. మహారాష్ట్ర కొంకణ్ తీరంలో సింధూదుర్గ్ జిల్లా వెంబుర్ల తాలుకాలోని హరావళిలో 17వ శతాబ్దంలో బేతాళుడి దివ్య మందిరాన్ని నిర్మించారు. ‘హరా’ అంటే శివుడు...‘వళి’ అంటే గ్రామం. శివుడు కొలువైన ఆ గ్రామంలో కాపలాదారుగా బేతాళుడు ఉంటాడని పురాణాల ద్వారా స్పష్టమవుతోంది. హరావళి ఆలయ విశేషం, చరిత్ర ఎంతటి అపూర్వమో అదే స్థాయిలో మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గంలో గ్రామానికి దక్షిణ భాగాన బేతాళ స్వామి వెలిసి లక్షలాది మంది భక్తులకు శుభాలు కలిగిస్తున్నాడు. ఇక్కడ స్వామి వారు చేతిలో కొరడా పట్టుకుని భక్తులకు నిజదర్శమిస్తాడు. అల్లాదుర్గంలోని బేతాళ స్వామి మందిరాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించి ఉండవచ్చని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పాడ్యమి రోజున ప్రారంభమయ్యే బేతాళ స్వామి జాతర మహోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. గ్రామ పొలిమేర్లలో ఉన్న ఇల్లింత చెట్టు వద్ద బేతాళ స్వామి విగ్రహం ఉందని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తే సర్వరోగాలకు ప్రాప్తి లభిస్తుందని ఓ స్వామి చెప్పినట్లు గ్రామస్థులు చర్చించుకుంటారు. బేతాళ స్వామి మందిరానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. పునాదులు తీసి గోడలు కట్టకుండా కేవలం 16 రాతి స్తంభాలపైన పైకప్పును నిర్మించారు. మందిరంపై కూడా ఎలాంటి గోపురం లేకపోవడం మరో విశేషం. స్వామివారి విగ్రహానికి వెనుకభాగం పడమటి దిక్కులో మాత్రం గోడను నిర్మించగా, తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులు ఖాళీగా ఉన్నాయి. వైద్యం అంతంత మాత్రంగా ఉన్న నాటి కాలంలో ప్రజలు కలరా, మశూచి లాంటి వ్యాధుల బారిన పడటం, పశువులకు సోకే గాలికుంటు వ్యాధిని నివారించడానికి దైవాన్ని నమ్ముకునే వారు. ఇందులో భాగంగానే ప్రజలు సుభిక్షంగా ఉండాలనే తలంపుతో అల్లాదుర్గం సంస్థానాదీశుడైన ఈర్ల రాఘవరెడ్డి మొట్టమొదటి సారిగా బేతాళ స్వామి ఉత్సవాలను ప్రారంభించినట్లు ఆయన మనవడు ఈర్ల అనిల్‌కుమార్‌రెడ్డి వివరించారు. అనంతరం ఈర్ల లక్ష్మారెడ్డి, ప్రస్తుతం అనీల్‌కుమార్‌రెడ్డిలు జాతరను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. బండ్ల ఊరేగింపు రోజున స్వామి వారికి కావల్సిన పూజా సామాగ్రి, పట్టు వస్త్రాలను సంస్థానాదీశుల ఇంటి నుంచి తీసుకువెళ్లడం నేటికి ఆనవాయితీగా వస్తోంది. ఈర్ల అనిల్‌కుమార్‌రెడ్డి కమిటీ అధ్యక్షునిగా ఉంటూ ప్రతియేటా ఉత్సవాలను ఘనంగా చేపడుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్టల్ర నుండి లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అరటి పండ్లను (రంభాఫలాలు) నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు. ఈ యేడాది ఏప్రిల్ మూడవ వారంలో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగడం గమనార్హం. మొదటి రోజు పోలేరమ్మ, రెండవ రోజు పోచమ్మ, మూడవ రోజు దుర్గమ్మ, నాలుగవ రోజు బేతాళ స్వామికి బోనాల ఊరేగింపులతో పూజలు నిర్వహించారు. ఐదవ రోజు బేతాళ స్వామికి బండ్లతో చేపట్టిన ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకప్పుడు సంస్థానాదీశుల ఎడ్ల బండి ముందుంటే దాని వెంబడి చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన దాదాపు 150 వరకు బండ్లను ఊరేగించే వారు. కాలక్రమేణా ఊరేగింపులో బండ్ల సంఖ్య తగ్గినా ఇప్పటికీ 50కి పైగానే పాల్గొంటుండటం గమనార్హం. తెలంగాణకే తలమానికమైన ఏడుపాయల జాతర ఎడ్ల బండ్లకంటే అల్లాదుర్గం బేతాళ స్వామికి నిర్వహించే ఎడ్ల బండ్ల అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరవ రోజు భాగోతము, ఏడవ రోజు భజనలు, ఎనిమిదవ రోజు లంకా దహనం, తొమ్మిదవ రోజు పాచిబండ్ల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. శివ సత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బేతాళస్వామి ఆవహించిన శివ సత్తులు భక్తులకు భవిష్యవాణిని తెలియజేడం, వాతావరణం, పాడిపంటల ఏవిధంగా ఉంటాయో వివరించడం విశేషం. ప్రతి సంవత్సరం వేసవి కాలం ఆరంభంలో వచ్చే ఈ ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాగడానికి, స్నానాలకు అవసరమైన మంచినీటి వసతి కల్పించనున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలు, ఖాళీ స్థలంలో భక్తులు నిర్మించుకునే తాత్కాలిక గుడారాలు దర్శనమిస్తాయి. బంధు, మిత్రులు, సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చే భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాక విందులు, వినోదాలతో ఆనందోత్సవాల మధ్య కాలక్షేపం చేస్తారు. జాతర ప్రారంభమైందంటే అల్లాదుర్గం గ్రామంలోని దాదాపుగా అన్ని కుటుంబాలు బంధువులతో సందడిగా కనిపిస్తాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బంధువులను ఆహ్వానించుకుని ఉల్లాసంగా కాలం వెళ్లదీస్తారు. ఈ జాతర ఉత్సవాల నాటికి వ్యవసాయ పనులు కూడా ముగియనుండటంతో బంధువులు రావడం పరిపాటి. గ్రామీణ ప్రాంత ప్రజల పాలిట నమ్మిన ఇలవేల్పుగా విలసిల్లుతున్న బేతాళస్వామి జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం చిరు వ్యాపార సంస్థలు, తినుబండారాల దుకాణాలు, టీ కొట్లు వెలుస్తాయి. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ భారీ ఎత్తున పోలీసులను మోహరించి బందోబస్తును పర్యవేక్షిస్తోంది. *

వారం వారం గోచారం (3-3-2019 నుంచి 9-3-2019 వరకు)

$
0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. ఆధ్యాత్మిక వ్యవహారాలు, ప్రయాణాలకు అనుకూలం. నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. తొందరపాటు కూడదు. శారీరకమైన సమస్యలకు, ప్రమాదాలకు అవకాశం. ధ్యానం, దానం వల్ల కొంత మేలు కలుగుతుంది. క్రమంగా లాభాలపై దృష్టి. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. సౌకర్యాదుల విషయంలో కొంత జాగ్రత్త. విద్యారంగంలో శ్రమతో అనుకూలత. ప్రయాణాలకు అవకాశం అధికం. కొన్ని అనుకోని సమస్యలు, గౌరవ లోపాలకు అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. రుణ రోగాలపై విజయం సాధిస్తారు. చికాకులను అధిగమిస్తారు. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. మానసికమైన అప్రశాంతత. ఖర్చులు పెట్టుబడులుంటాయి. విందులు వినోదాలపై దృష్టి. ఉన్నత లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి. కొంత అసంతృప్తి. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. క్రమంగా భాగస్వామ్యాలపై దృష్టి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్తగా మెలగాలి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలకు అనుకూలం. విద్యాత్మకాంశాల్లో వృద్ధి. అనుకున్న పనులు పూర్తవుతాయి. వారాంతంలో అనుకోని ఇబ్బందులుంటాయి. ఊహించని సంఘటనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ ఆర్థికాంశాలపై ప్రత్యేక దృష్టి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. మాట విలువ పెంచుకుంటారు. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలూ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశం. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. నూతన ప్రణాళికల విషయంలో జాగ్రత్త. క్రమంగా ఇతరుల సహకారం లభిస్తుంది. సేవక వర్గంతో సంప్రదింపులుంటాయి. ఊహించని ఇబ్బందులకు అవకాశం. కమ్యూనికేషన్స్‌లో అంతరాయం. కొన్ని వార్తల వల్ల మనస్తాపాలు. ధార్మికమైన ఖర్చులు పెంచుకోవడం వల్ల మేలు కలుగుతుంది. వారాంతంలో ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. అనుకూలత. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి. సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. విద్యాత్మకాంశాల్లో వృద్ధి. పరిశోధనల్లో పురోగతి. సుదూర ప్రయాణ భావనలు. సంప్రదింపులకు అనుకూలం. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే అవకాశం. విశ్రాంతి లోపించవచ్చు. క్రమంగా వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వ్యాపార వ్యవహారాల్లో రాణిస్తారు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. అనుకోని సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. కమ్యూనికేషన్స్‌లో జాగ్రత్త. సహకారం తెచ్చుకోవడంకన్నా అందించడం మంచిది. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దలతో పరిచయాలు పెంచుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో అనుకూలత. లాభాలు ప్రభావితం చేస్తాయి. సృజనాత్మకత. నూతన కార్యక్రమాలపై దృష్టి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. అనుకోని సమస్యలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. శ్రమాధిక్యం. క్రమంగా వ్యతిరేకతలు పెరిగే అవకాశం ఉంటుంది. పోటీలు ఒత్తిడులుంటాయి. కార్యక్రమాల నిర్వహణలో గుర్తింపు లభిస్తుంది. విజయం సాధిస్తారు. వృత్తిలో నైపుణ్యం పెంచుకుంటారు. పోటీ రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవహారాల్లో అనుకూలత. లాభాలున్నా జాగ్రత్త అవసరం. పెద్దల సహకారం లభిస్తుంది. సంప్రదింపుల వల్ల సంతోషం పెరుగుతుంది. వారాంతంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాల్లో శుభ పరిణామాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నిర్ణయాదులు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల బాధ్యతలు తప్పవు. భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఆహార విహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు వల్ల సౌఖ్య లోపాలకు అవకాశం అధికం. క్రమంగా కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక నిర్ణయాదుల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. అనుకోని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. వ్యర్థంగా కాలం, ధనం పోకుండా జాగ్రత్త వహించాలి. పరిచయాలు, భాగస్వామ్యాల్లో ఊహించని సంఘటనలు. సామాజిక గౌరవం. వారాంతంలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శుభ వార్తలుంటాయి. పెద్దల సహకారం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ఊహించని సంఘటనలకు అవకాశం. అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో అనుకూలత. ఎక్కువ లాభాలను ఆశించకుండా జాగ్రత్త పడాలి. క్రమంగా ఉన్నత వ్యవహారాలపై దృష్టి. పోటీల్లో విజయం సాధిస్తారు. కీర్తిప్రతిష్టలకు అవకాశం. విద్యా వ్యవహారాల్లో అనుకూలత. సుదూర ప్రయాణాలు. ఆధ్యాత్మికమైన ఆసక్తి ఉంటాయి. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఆర్థిక నిల్వలను కోల్పోయే అవకాశం. అధిక సంపాదపై దృష్టి. వ్యతిరేక ప్రభావాలు పడకుండా దైవధ్యానం చేయాలి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. అన్ని పనుల్లోనూ అనుకూలత.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాల గూర్చిన చర్చలు, నిర్ణయాలుంటాయి. సౌఖ్యంగా కాలం గడిపే ప్రయత్నం. శ్రమతో విద్యారంగంలోనూ అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. క్రమంగా మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త పనుల గూర్చిన ప్రణాళికలుంటాయి. సంతాన వర్గం వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. బాధ్యతల నిర్వహణలో శ్రమ ఉంటుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలు ప్రభావితం చేస్తాయి. పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. వ్యతిరేక ప్రభావాలు అధికం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు తప్పకపోవచ్చు. విందులు వినోదాల కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త అవసరం. వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించి విజయం సాధిస్తారు. శ్రమాధిక్యం. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. క్రమంగా నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు అధికం. భాగస్వామ్యాల్లోనూ శుభ పరిణామాలుంటాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోటీ రంగంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో గౌరవం, గుర్తింపులు లభిస్తాయి. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. వారాంతంలో కుటుంబంలో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో పరిచయాలు, స్నేహానుబంధాలను పెంచుకుంటారు. వ్యతిరేకతల వల్ల గుర్తింపు కలుగుతుంది. సేవారంగంలో దృష్టి కేంద్రీకరిస్తారు. నిర్ణయాదులు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. అధికారులతో సమస్యలకు అవకాశం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. క్రమంగా అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. నిర్ణయాదుల్లో లోపాలకు అవకాశం. తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాస లోపాలుంటాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గంతో సంతోషం. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ కొనసాగుతుంది. తృప్తిగా వ్యవహరిస్తారు. వ్యతిరేకతలున్నా అధిగమిస్తారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. సేవక వర్గంతో పరిపూర్ణమైన అనుకూలత. దగ్గరి ప్రయాణాలు ప్రభావితం చేస్తాయి. ఉన్నత విద్యలు, ఉద్యోగాదులపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. ఇతరులకు సహకరించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. క్రమంగా ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు. గృహ వాహనాది సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి. విద్యా వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సుదూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. వారాంతంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గంతో కలిసి గడిపే అవకాశం. క్రియేటివిటీ ఉంటుంది. ప్రణాళికలు ఫలిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో తొందరపాటుకు అవకాశం. జాగ్రత్త. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతి. సౌఖ్యం కోరుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యతిరేకతలు అధికవౌతాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. విద్యాత్మక, పరిశోధనాత్మక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. వారాంతంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలు అధికం.

అత్యంత వేగంగా ‘తెలుగు’

$
0
0

ప్రపంచవ్యాప్తంగా సుమారు ఏడు వేల భాషలు మాట్లాడుతున్నారు. వీటిలో కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే తెలిసిన భాషలు 46 ఉన్నాయి. అంటే ఆయా ఆయా భాషల్లో మాట్లాడేవారు ప్రస్తుతం ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు. అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భాష మాండరిన్.. ఈ భాషను దాదాపు వందకోట్ల మంది మాట్లాడుతున్నారు. ఇన్ని వేల భాషల్లో అత్యంత సమర్థమైన భాష ఏదన్నది కనుగొనేందుకు కొందరు పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ భాషను వేగంగా మాట్లాడుతారో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేశారు. ఆస్ట్రియాలోని క్లాగెన్‌ఫర్ట్ యూనివర్శిటీ లింగ్విస్టిక్ ప్రొఫెసర్ గెర్ర్టాడ్ ఫెంక్- ఒక్టలాస్ మాట్లాడే విషయానికి వస్తే ప్రపంచంలో ఏ భాష అత్యంత వేగంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధనలో దక్షిణ భారతదేశంలో ఎనిమిది కోట్లమందికి పైగా మాట్లాడే తెలుగుభాష అత్యంత వేగంగా మాట్లాడే భాషగా తేలింది. ఈ పరిశోధన కోసం ఫంక్ ఓక్లాస్ 51 భాషలు మాట్లాడే ఆయా ప్రాంతాల వారిని ఒకే ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆ భాషల్లో 19 ఇండో-యూరోపియన్ భాషలు, 32 నాన్ ఇండో యూరిపియన్ భాషలు ఉన్నాయి. ‘సూర్యుడు మెరుస్తున్నాడు, నేను టీచర్‌కు థాంక్స్ చెప్పాను, స్ప్రింగ్ కుడివైపున ఉంది, తాతగారు నిద్రపోతున్నారు’ వంటి కొన్ని సులభమైన పదాలను వారి వారి భాషల్లో అనువదించమన్నారు. ఆ తర్వాత అందరూ తాము అనువదించిన పదాలను సాధారణ వేగంతో చదవాలని చెప్పారు. అన్ని భాషల్లోకి తెలుగు భాషలో ఆ పదాలను త్వరగా చెప్పగలిగారు. దాంతో ప్రపంచంలో అత్యంత వేగంగా మాట్లాడే భాషగా తెలుగు భాషను గుర్తించారు. ఈ పోటీలో జపనీస్ తెలుగు కంటే కొద్దిగా వెనకబడింది. ఇక ఈ జాబితాలో థాయ్‌లాంట్, వియత్నాంలు చిట్టచివరన నిలిచాయి.
అన్ని భాషల ప్రధాన ఉద్దేశం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే. ఒక్క నిముషానికి ఎక్కువ పదాలు చదివినంత మాత్రాన ఆ భాష ద్వారా ఎక్కువ సమాచారం చేరవేస్తున్నట్టు మనం భావించలేం. ఒకే సమాచారాన్ని వేర్వేరు భాషలు ఎంత బాగా అందిస్తున్నాయి అని గుర్తించే ప్రయత్నం చేశారు. లాజికల్‌గా సంబంధం ఉన్న ఐదు వాక్యాలను పరిశోధకులు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్, మాండరిన్, చైనీస్, జన్మన్‌లో అనువదించారు. తర్వాత ఆయా భాషలవారిని 59మందిని ఆహ్వానించి రాసిన ఐదు వాక్యాలను చదవమని చెప్పారు. ఒక్కో అక్షరం చదువుతూ వారు అందించే సగటు సమాచారాన్ని, మామూలుగా మాట్లాడేటప్పడు వారు సెకనుకు మాట్లాడే సగటు అక్షరాల సంఖ్యను లెక్కపెట్టారు. ఈ లెక్కల ప్రకారం వేగంగా మాట్లాడినంత మాత్రాన ఆ సమాచారాన్ని అత్యున్నత స్థాయిలో అనువదించలేకపోయారనే నిర్ణయానికి వచ్చారు. జపనీస్ మాట్లాడేవారు సెకనుకు ఎనిమిది అక్షరాలు చెబితే, చైనీస్ కేవలం ఐదు అక్షరాలే చెప్పగలిగారు. కానీ మాండరిన్‌తో పోలిస్తే జపనీస్‌లో ఒక అక్షరం సగం సమాచారం మాత్రమే ఇవ్వగలిగింది. ఇక సమాచారం వేగం విషయానికి వస్తే ఇంగ్లీష్ అన్నిటికంటే అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాతి స్థానంలో ఫ్రెంచ్, జర్మన్ నిలిచాయి.
లియాన్‌లో పరిశోధకులు తమ అధ్యయనాన్ని మరింత విస్తరించేందుకు ఆ జాబితాలో మరో పదకొండు భాషలను చేర్చారు. ఈ 18 భాషలు పది రకాల భాషా వర్గాలకు చెందినవి. భాష సగటు మాట్లాడే వేగం విషయానికి వస్తే థాయ్‌లో సెకనుకు 4.7 అక్షరాలు, జపనీస్ 8.03 అక్షరాలు చదవచ్చు. సమాచారం చేరవేసే విషయానికి వస్తే, ఒక్కో అక్షరం చేరవేసే సగటు సమాచారం, అంటే సమాచార సాంద్రత జపనీస్‌కు తక్కువ ఉన్నట్లు తేలింది. అత్యధిక సమాచార సాంద్రత ఉన్న గ్రూప్ భాషల్లో నిలిచినప్పటికీ, థాయ్ చాలా నెమ్మదిగా మాట్లాడే భాషగా నిలిచిందని న్యూజిలాండ్ కాంటెర్‌బరీ యూనివర్శిటీ పరిశోధకులు యూన్ మి ఓ చెప్పారు. మాట్లాడే వేగం లేదా సమాచారం చేరవేయడాన్ని పోల్చి చూస్తే మన భాషలన్నీ చాలావరకు ఒకే సమాచార వేగం కలిగున్నాయని ఆమె తెలిపారు. వివిధ భాషలను మనం ఎంత వేగంగా లేదా మెల్లగా మాట్లాడుతాం అనే విషయంతో పాటు, వేర్వేరు భాషల్లో ఒక అక్షరం ద్వారా ఎంత సమాచారం చేరవేస్తున్నాం అనేది కూడా వారు పరిశీలించారు. ఈ పరిశోధన ప్రకారం మానవ భాషల్లో సమాచారం అందించే వేగం సెకనుకు సుమారు 39 బిట్స్ ఉంటుంది.
అంతుపట్టని సమాధానాలు.. అత్యంత సమర్థమైన భాష ఏదో గుర్తించాలని పరిశోధకులు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కొందరు గణిత మోడల్స్ ఉపయోగిస్తున్నారు. ఎంఐటి లాంగ్వేజ్ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్ టెడ్ గిబ్సన్ వంటి పండితులు ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలో కచ్చితమైన సమాధానాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఏది ఏమైనా ఈ అధ్యయనం చాలా కష్టం. ఎందుకంటే.. వీరు భాషా రూపాలనే కాదు, వాటి అర్థాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇలా పరిశోధన చేయడం చాలా కష్టం. కొంతమంది మరికొన్ని ప్రయోగాలు చేశారు. కానీ ఈ ప్రశ్నకు ఇంకా సమాధానాలు తెలుసుకోలేకపోతున్నారు. సమీప భవిష్యత్తులో ఏది సమర్థమైన భాష అనేది తెలుసుకోవచ్చు అనుకుంటున్నారు కానీ అత్యంత శక్తివంతమైన భాష ఏది? అన్న ప్రశ్నకు మాత్రం వీరు సులభంగానే సమాధానాలు చెబుతున్నారు.
అబుదాబి పరిశోధకులు కై చాన్.. భాష శక్తి ఎలా ఉంటుంది అనేదానిపై పరిశోధనలు చేశారు. ఆయన తన పరిశోధనలు ఐదు పారామీటర్స్‌ని ఉపయోగించారు. అవి..
భౌగోళికశాస్త్రం: ప్రపంచమంతా ప్రయాణించే సామర్థ్యం
ఆర్థికశాస్త్రం: ఆర్థిక వ్యవస్థలో భాగం అయ్యే సామర్థ్యం
కమ్యూనికేషన్: చర్చలను కొనసాగించే సామర్థ్యం
నాలెడ్జ్ అండ్ మీడియా: మీడియాను ఆకట్టుకునే సామర్థ్యం
డిప్లొమసీ: అంతర్జాతీయ సంబంధాల్లో నిర్వహించే సామర్థ్యం
ఈ ఐదు పారామీటర్స్‌ని అనుసరించి అత్యంత శక్తివంతమైన భాష ఇంగ్లీష్ అని పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీని తర్వాత మాండరిన్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ నిలిచాయి. చైనా భారీ ఆర్థిక విజయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ.. 2050 వరకు ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషగా నిలిచి ఉంటుందట. కానీ అప్పటికి స్పానిష్ మూడో స్థానానికి చేరుకుంటుందని ఫ్రెంచ్, అరబిక్ తర్వాత రెండు స్థానాలు ఆక్రమిస్తాయని అంటున్నారు.

‘యోగి’ అమృతోత్సవం

$
0
0

భగవాన్ విశ్వయోగి విశ్వంజీ 75 వ జన్మదినోత్సవం
మహారుషులు, యోగులు, గురువులు, ఆచార్యులు నెలవైన స్థలం భారతదేశం. వేల సంవత్సరాల నుండి ఆచార్య పరంపర, గురువుల పరంపర భారత్‌లో కొనసాగుతూ వస్తోంది. భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న శక్తి ఆచార్యపరంపరనే. మహారుషులు, యోగుల చల్లని చూపుల వల్లనే ఈ దేశం ప్రశాంతంగా నడుస్తోంది. ఇది కాదనలేని సత్యం. భగవంతుడు ఈ భువిపైకి ఏ రూపంలో వస్తాడో ఎవరికీ తెలియదు. మనుషుల రూపంలో అవతారం ఎత్తిన భగవంతుడు తానే భగవంతుడిని అంటూ ఏ యుగంలోనూ చెప్పుకోలేదు. రాయి రూపంలో ఉన్న ‘వజ్రాన్ని’ గుర్తించే శక్తి వజ్రం గురించి నైపుణ్యం, అవగాహన ఉన్నవారికే ఉంటుంది. అలాగే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో, ఏ రూపంలో జన్మించాడో గుర్తించగలవారు కొందరే. అలాంటి వారి ద్వారా మొత్తం సమాజం భగవంతుడి గురించి తెలుసుకుంటోంది. శ్రీకృష్ణుడు భగవత్ రూపమే అని కౌరవులు మరీ ముఖ్యంగా దుర్యోధనుడు మొదటనే గుర్తించి ఉంటే మహాభారత యుద్ధమే జరిగేది కాదు. దుర్యోదనుడి అహంకారం కారణంగానే మహాభారత యుద్ధం జరిగింది. సమాజాన్ని చక్కటి మార్గంలో నడిపేందుకు, అధర్మానికి హాని జరిగిన ప్రతి సారి భువిపై జన్మిస్తుంటానని భగవంతుడే స్వయంగా వెల్లడించారు. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లోనే కాదు కలియుగంలో కూడా భగవంతుడు వివిధ రూపాల్లో జన్మిస్తున్నాడు.
దత్తుడి అవతారంగా భక్తులు భావించే ‘విశ్వయోగి విశ్వంజీ’ అమృతోత్సవం ఇప్పుడు జరుగుతోంది. 2019 మార్చి 5 న ‘విశ్వ యోగి’ 75 వ జన్మదినోత్సవం. తన జన్మదినోత్సవాన్ని ‘విశ్వసమైక్యతా శాంతి దినోత్సవం’గా స్వామి స్వయంగా ప్రకటించారు.
గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్లే జాతీయ రహదారి 16 (పాత జాతీయ రహదారి 5) లో ఉన్న చినకొండ్రుపాడు వద్ద ఉన్న ‘విశ్వనగర్’ విశ్వంజీ ఆశ్రమం. విశ్వనగర్ లోనే స్వామి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ‘నా జీవితమే నా సందేశం’ అంటారు విశ్వంజీ. మహానుభావుల అడుగుజాడల్లో నడవడం, వారి బోధనలను అమలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయనడంలో అతిశయోక్తిలేదు. ప్రకృతిని ప్రేమించాలని, ఆరాధించాలని, ప్రకృతిని కలుషితం చేయవద్దని స్వామి చెబుతుంటారు. భగవంతుడితో నేరుగా సంబంధం కలిగి ఉండాలని విశ్వంజీ బోధిస్తుంటారు.
‘‘బ్రహ్మభూతః ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌॥
(్భగవద్గీత 18 వ అధ్యాయం 54 వ శ్లోకం ఇది)..‘దివ్యస్థితియందు జీవించే వారు పరబ్రహ్మానుభవనాన్ని పొంది, దేని కొరకు శోకింపక, దేనినీ వాంఛింపక, సర్వజీవుల యందు సమత్వభావనను కలిగి ఉంటారు, భగవంతుడి పాదాలపై మనస్సు నిలపకపోతే ఎవ్వరు కూడా బ్రహ్మభావనలో నిలిచి ఉండలేరు..అంటూ శ్రీకృష్ణపరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెబుతారు. విశ్వంజీ కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు.
ప్రకృతి పంచభూతాలతో కూడుకుని ఉంది. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలు మన జీవనానికి మూలమైనవి. మనిషి కూడా పంచభూతాలతో కూడుకుని ఉన్నాడు. మనదేహం పంచభూతాలతో కూడుకుని ఉన్నందు వల్లనే ‘దేహమే దేవాలయం-హృదయమే దైవపీఠం’ అంటున్నారువారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ది అనేవి మనిషి దేహంలో పంచభూతాలకు కేంద్రాలని చెబుతున్నారు. పంచభూతాలతో కూడిన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, దేవాలయంలా పవిత్రంగా మార్చుకోవాలని విశ్వంజీ చెబుతుంటారు. నీతి, న్యాయం, ధర్మం, సత్యం అనే మార్గాల్లో నడిస్తే మనిషి ఉన్నత శిఖరాలవైపు పయనించేందుకు వీలవుతుందని విశ్వ యోగి చెబుతుంటారు. అదేవిధంగా భగవంతుడి సృష్టి అయిన పంచభూతాలు స్వచ్ఛంగా, కల్తీలేని విధంగా ఉండాలి. పంభూతాలను ఎట్టిపరిస్థితిలో కలుషితం చేయ కూడదని, అలా చేయడం వల్ల వాటి మధ్య సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని గత మూడు దశాబ్దాల నుండి విశ్వంజీ చెబుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు నేడు పకృతి వైపరీత్యాలను చవిచూస్తున్నాయి. భూకంపాలు, తుపాన్లు, టోర్నిడోల వల్ల అనేక దేశాలు ఇక్కట్లకు గురవుతున్నాయి. హిమాలయాలతో పాటు అనేక మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి. వేలాది సంవత్సరాల నుండి హిమపర్వతాలు కరగడం అన్నది లేదు. అంతరిక్షంలో ఓజోన్ పొర బలహీనం అవుతోంది. దాంతో ఎండలు విపరీతమై మండుతున్నాయి. వైపరీత్యాల వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో పాటు ఆస్తులకు కూడా నష్టం జరుగుతోంది.
అందుకే పంచభూతాలు శాంతిగా ఉండాలంటూ భగవంతుడి పూజ తర్వాత శాంతి మంత్రం చదవడం భారతీయ సాంప్రదాయం.
‘పృథ్వి శాంతిః
ఆపస్ శాంతిః
అగ్నిశాంతిః
వాయు శాంతిః
ఆకాశ శాంతిః
అంటూ శాంతి మంత్రం చదువుతారు. పంచభూతాలను కలుషితం చేయవద్దంటూ విశ్వంజీ మహారాజ్ చేస్తున్న బోధనలు ప్రపంచంలోని అన్నిదేశాలకు ఆచరణ యోగ్యమైనవి. భారత్, అమెరికా, రష్యా, చైనా, కొరియా, జపాన్ తదితర దేశాల అధినేతలకు అనేక పర్యాయాలు ఈ అంశంపై యోగి లేఖలు రాశారు. పంచభూతాలను సంరక్షించడం కేవలం ఒక భారతదేశంపైనో, అమెరికాపైనో మాత్రమే లేదని ప్రపంచంలోని అన్ని దేశాలు ఇందుకు నడుం కట్టాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని విశ్వంజీ చెబుతున్నారు.
ప్రపంచ దేశాలన్నీ మేల్కొనాలని, చైతన్యం కావలసిన అవసరం ఉందంటున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఐక్యంగా పనిచేయాలని (అవేక్, అరైజ్ అండ్ యూనైట్) ఈ విశ్వానికి విశ్వంజీ సూచించారు. గత ఇరవై ఏళ్లుగా విశ్వంజీ అమెరికా వెళుతున్నారు. అమెరికాలోని పాలకులు, విశ్వవిద్యాలయాలు, మేధావులతో జరుపుతున్న చర్చల్లో పంచభూతాల పరిరక్షణ, విశ్వశాంతి అనే విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
మూడు అంశాలు
పంచభూతాలను కలుషితం కాకుండా కాపాడుకోవడంతో పాటు, ప్రపంచాన్ని భయభ్రాంతులను చేస్తున్న భయంకర వ్యాధులను నివారించడం, యువత తప్పుడు మార్గాల్లో పయనించకుండా చూడటంపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి కేంద్రీకరించాలని విశ్వంజీ సూచిస్తున్నారు.

విశ్వనగర్
విశ్వయోగి విశ్వంజీ ప్రధాన ఆశ్రమంగా ఉపయోగిస్తున్న కేంద్రమే ‘విశ్వనగర్’. విశాలమైన స్థలంలో విస్తరించి ఉన్న విశ్వనగర్ ప్రకృతి రమణీయతకు మారుపేరుగా విరాజిల్లుతోంది. ఏపీలోని గుంటూరు పట్టణం నుండి చిలకలూరిపేట వెళ్లే జాతీయ రహదారిలో 16వ కిలోమీటర్ వద్ద విశ్వనగర్‌ను ఏర్పాటు చేశారు. భగవంతుడి ప్రతిరూపమే ప్రకృతి అన్నట్టు విశ్వనగర్ ప్రకృతి మధ్య ఓలలాడుతోంది. విశ్వనగర్‌లోని ‘గురుపీఠం’లో స్వామి ఉంటారు. గురుపీఠం సమీపంలో ‘విశ్వ మానవ సమైక్యతా స్థూపం’ (విశ్వ మందిరం) నిర్మించారు. ప్రపంచంలోని అన్ని మతాలు సమానమే అని చాటిచెప్పేందుకే విశ్వ మానవ సమైక్యతా స్థూపాన్ని నిర్మించినట్టు స్వామి చెబుతున్నారు. హిందూ, ముస్లిం, క్రిష్టియన్, జోరాష్ట్ర, శిక్కు, బౌద్ద, జైన్ మతాలతో పాటు మతం అంటే నమ్మకం లేని నాస్తికుల పేర్లతో ద్వారాలను ఏర్పాటు చేశారు. ఏ ద్వారం నుండి వెళ్లినా చివరకు చేరేది ఒకే చోటికి అని చాటి చెప్పడమే విశ్వ మానవ సమైక్యతా స్థూపం నిర్మాణం ఉద్దేశం. విశ్వనగర్ ఆవరణలో విశాలమైన ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మాతా, శిశు చికిత్సా కేంద్రంగా ప్రత్యేకంగా దీనికి పేరుపెట్టారు.
గణేశుడి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం ఉన్నాయి. హనుమంతుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాల నిర్వహణకు ఆడిటోరియం నిర్మించారు. హోమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా హోమమందిరాన్ని నిర్మించారు. స్వామి వద్దకు వచ్చే భక్తులు నివాసం ఉండేందుకు గెస్ట్‌హౌజ్‌లు ఉన్నాయి. గోశాల ప్రత్యేకంగా ఉంది. దత్తాత్రేయుడి అవతారాలను తెలియచేసే నిర్మాణాలు ఉన్నాయి.
విశ్వశాంతికి కేంద్రంగా విశ్వనగర్‌ను విశ్వయోగి మారుస్తున్నారు.


శివరాత్రి - ఏకపాద రుద్ర దర్శనం

$
0
0

నేడే మాఘ కృష్ణ చతుర్దశి. మహాశివరాత్రిగా జగత్ప్రసిద్ధి పొందిన మహాపర్వదినం. హరహర మహాదేవ శంభో! శంకరా! నమః శివాయ అంటూ భక్త జనులందరు భక్తి పారవశ్యంతో ఎలుగెత్తి పలికే శివనామోచ్చారణలు కైలాసం వరకు వ్యాపించి ప్రతిధ్వనించే మహాశివరాత్రి పర్వదినమిదే. ఇసుమంత మారేడు పత్రి మీదకు విసిరినా, ఉద్ధరణి నీళ్లు పైన చిలకరించినా, కొడిగట్టే దీపాన్ని పైకి ఎగద్రోసి దీపం వెలిగించినా, జూదాలాడుతూ కూడ మేల్కొని ఉన్నా, ప్రీతి చెంది కోరిన కొండంత వరాలను గుప్పించే బోళా శంకరుణ్ణి కొలుచుకొనే ఈ మాఘ కృష్ణ చతుర్దశీ పుణ్య దినాన్ని పొరపాటున మరచిపోతామేమోనన్న భయంతో ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాడు ఇది మాస శివరాత్రి అని శ్రద్ధగా పరమేశ్వరుని పూజించుకొంటూ ఏ పర్వదినం కోసం ఎదురుచూడని విధంగా భక్తులందరు ఎదురుచూచే పవిత్ర దినం కాబట్టే ఇది మహా శివరాత్రిగా ప్రఖ్యాతి పొందింది.
కాలం హరిహరాత్మకం
అంతే?! ‘కాలః కలయతా మహమ్’ కాల స్వరూపంగా ఉన్నది నేనే.. అన్న భగవద్వచనానికి నిదర్శనంగా విష్ణు తత్త్వం సాకారమై కృష్ణ స్వరూపంగా భువికవతరించిన శ్రావణ కృష్ణ పక్షానికి సరిగ్గా ఆరు నెలల వ్యవధిలో వచ్చే మాఘ కృష్ణ పక్షంలో శివతత్త్వం సాకారంగా అవతరించిన విశేష పర్వదినం కావడం ద్వారా (ఈ గాథ ముందు చూడండి) హరిహరాత్మకమైన సంపూర్ణ కాల స్వరూపానికి ఈ మాఘ కృష్ణ చతుర్దశి సూచకంగా ప్రాముఖ్యం సంతరించుకొంది. కృష్ణావతారంగా విష్ణు తత్త్వం ఆధిభౌతికంగా మహిమాన్వితమైనట్లుగా మాఘ మాసం నాటి సాకారమైన శివతత్త్వం ఆధిభౌతికంగా అంటే లౌకికంగా కాక కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే మహిమాన్వితంగా ప్రసిద్ధమైంది. చిత్రమేమంటే కృష్ణ తత్త్వం బహు పురాణ - ఇతిహాస ప్రసిద్ధమైనట్లే సాకారమైన శివతత్త్వం లింగోద్భవ మూర్తిగా, ఏకపాద రుద్రమూర్తిగా విశిష్ట నామాలతో శివ - వాయు - లింగ - శివ - బ్రహ్మాండ పురాణ భారతాది గ్రంథాదుల యందు బహుదా వర్ణింపబడటమే గాక విశేషించి వేద ప్రతిపాదితమై ప్రాముఖ్యం వహించి ఉంది. అయితే కృష్ణ లీలలుగా విష్ణు మహిమ జగత్ప్రసిద్ధమైనట్లు వివిధ రీతులుగా శివలీలలు జగత్ప్రసిద్ధమై ప్రకటనం కాకపోయినా శివలీలల సమస్త సమాహారంగా శివమహిమ లింగోద్భవ లీలగా సమావిష్కృతమయింది.
లింగోద్భవ గాథ
సృష్ట్యాదిలో రజోగుణ స్వభావుడైన బ్రహ్మయందు సృష్టికర్తనైన నేనే సర్వోన్నతుడనన్న గర్వం కలిగి - యోగ నిద్రలో నున్న తండ్రిని తట్టిలేపాడు. ‘తండ్రికీ విధంగా నిద్రాభంగం చేయతగునా’ అని శ్రీహరి పలుకగా నిద్రా మత్తుడవైన నీవు నాకు తండ్రివా? అని బ్రహ్మ ధిక్కరించాడు. అప్పుడు నీకు తండ్రినైన నేను సృష్టికర్తనని నారాయణుడు పలుకగా కాదు నేనే సృష్టికర్తనని బ్రహ్మ పలికాడు. అది వివాదంగా మారి వారి మధ్య ఘోర యుద్ధంగానే మారింది. దానితో జగత్తు విలవిలలాడింది. వారి మధ్య యుద్ధాన్ని నివారించేందుకు పరమ శివుడు స్తంభాకృతిలో దివ్యజ్యోతిర్లింగంగా ఉద్భవించి నా ఆద్యంతాలను కనుగొని ముందుగా వచ్చిన వారే సర్వోన్నతులు, సృష్టికర్తలు అని ఆదేశించాడు. విష్ణువు వరాహ రూపంగా క్రింది భాగాన్ని, బ్రహ్మ హంసనెక్కి ఊర్థ్వ భాగాన్ని కనుగొనేందుకు ఉద్యమించారు. వేలవేల యేండ్లు గడిచినా లింగానికి ఆద్యంతాలు కనుగొనలేని హరి బ్రహ్మలకు సాకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు.
ఏకపాద రుద్ర రూపం
అలా లింగంలో ఆవిర్భవించిన సాకారమూర్తినే ‘లింగోద్భవ మూర్తి’గా పురాణాలన్నీ చెబుతున్నాయి.
‘ఆ మూర్తి ఇరువది ఎనిమిది కోట్ల రుద్రులలో సర్వోన్నతుడు. ఏకపాద మూర్తి. త్రినేత్రుడు. శూలాయుధుడు. ఎడమ ఒడిలో శ్రీహరి, కుడి ఒడిలో బ్రహ్మ కలిగి యుండి సర్వాంగ శోభితుడై యున్నాడు.’
అని వాయు - లింగ - శివ - బ్రహ్మాండ పురాణాలు, మహాభారతం విపులంగా వర్ణించాయి. అట్లే ఉత్తర కారణాగమం మరియు అంశుమద్భేదాగమం మొదలైన శైవాగమాలు కూడా ఇట్లే వర్ణించాయి.
శ్లో.క పాదం చతుర్బాహుం త్రినేత్రం శూల సంయుతం
సృష్ట్యాస్థితం హరింవామే దక్షిణే చతురాననం
అష్టావింశతి రుద్రాణాం కోటీః సర్వాంగ సుప్రభమ్
-లింగ పురాణం 76 అధ్యాయం 8-9 శ్లో.
(చూడు. భారతం. అనుశాసనిక పర్వం 351-352. వాయు పురాణం. పూర్వార్థం 55 అధ్యాయం)
ఈ మూర్తి లింగానికి ఆద్యంతాలను కనుగొనేందుకు ఊర్థ్వ - అధో భాగాలకు వెళ్లిన హరి బ్రహ్మలను కుడి ఎడమలలో సమాకర్షించుకొన్న దివ్యమూర్తి అని వేరే చెప్పాలా? చిత్రమేమంటే ఈ మూర్తికి పాదాలు రెండుకాక ఒకటేనట. ఇలాంటి దేవతామూర్తులను మీరెక్కడైనా చూచారా? లేదు కదా! మరి ఈ మూర్తికి ఒక పాదమేమిటి?
ఏకపాదమంటే ఏమిటి?
పాదం నడకకు సాధనం. ఇక్కడ పాద శబ్దం లోకంలోని సాధారణమైన నడకను తెలిపే పదం కాదు. నిత్యగమన శీలమైన క్రియకు సంకేతం. సంకేతితమైన ఈ గమన క్రియ కేవలం విశ్వ సంబంధియే. ఎందుకంటే విశ్వం పుట్టి (జాయతే) నడుస్తూ (గచ్ఛతి) ఉంటుంది కాబట్టి. ఈ గమనం ఒక పాదంతో సాధ్యం కాదు. అందుచేత ‘ఏకపాద’ శబ్దం గమన రహిత స్థితి అంటే సృష్టి రచన జరుగని దశకు చెందిన స్థితిని తెలిపే శబ్ద ప్రతీక అన్నమాట. దీనిని బట్టి ఏక పాదం కల ఈ మూర్తి సృష్టికి పూర్వం సృష్టి స్థితిలయలను తనలో విలీనం చేసుకొని పునః సృష్టికి మూలాధారంగా నిర్గుణమై నిరాకారమై వెలసియున్న ఊహాతీతమైన ఒకానొక అలౌకిక దివ్యమూర్తి అని స్పష్టమవుతూ ఉంది.
వేద ప్రామాణ్యాలు
గర్వించి కలహించుకొంటున్న హరి బ్రహ్మలకు దర్శనమిచ్చిన మూర్తిని, శోధించి కూడా వారు ఆద్యంతాలను కనుగొనలేని ఆ ఆద్యంత రహిత ఏకపాద రుద్ర మూర్తి, కుడి ఎడమలలో హరి బ్రహ్మలను సమాకర్షించుకొని విలీనం చేసుకొనగా అట్టి మూర్తిని ముక్తకంఠంతో వేదాలు బహుదా ఇలా కీర్తించాయి. ఆ కీర్తనలో ఏకపాద శబ్దంతోబాటు 1.అజమూర్తి అని 2.స్తంభాకృత మూర్తి అని మరో రెండు విశేష నామాలను ప్రస్తావించాయి వేదాలు.
అజమూర్తి - ఏకపాద మూర్తి - మం.తత్రశ్రీయే జ ఏక పాదో దృంహత్ ద్యావాపృథివీబలేన
- తైత్తిరీయ బ్రాహ్మణం 3-1-2-8

స్తంభాకృతి - వియస్తంభషళిమా రజాం స్యజస్యరూపే కిమపిస్విదేకమ్.
(ఋగ్వేదం 1 మండలం 664 సూక్తం. 6 మంత్ర)

ఈ విధంగా అజాయమానమై అంటే పుట్టుక లేనిదై (అజ), స్తంభాకృతిగా ఉన్న ఈ మూర్తి సృష్టి రచన కాధారభూతంగా స్థిరంగా ఒకే పాదంతో ప్రకాశిస్తూ ఉందని అధర్వణ వేదం
‘ఏకం పాదం నోక్షిదతి సవిలాద్ధం స ఉచ్చరన్ (అధర్వణ వేదం 11-4-21.) స్పష్టంగా చెప్పింది.
అరుణాచలమే లింగోద్భవమూర్తి
స్తంభాకృతిలోని ఇచటి ఏకపాద రుద్రమూర్తి ఎవరో కాదు సాక్షాత్తు అరుణాచలంలోని అరుణాచలమే. అందుకే అందు వెలసిన పరమశివుడు పంచభూత లింగాలలోని అగ్ని లింగంగా ప్రఖ్యాతి చెందాడు. అరుణాచల రూపంగా చతుర్ముఖ - నారాయణులకు పరబ్రహ్మయే సగుణ - నిర్గుణా కృతులలో (ఏకపాద రుద్ర రూపంగా - అగ్ని లింగంగా) దివ్య దర్శనమిచ్చిన మాఘ కృష్ణ చతుర్దశీ రాత్రి, పరమాత్మ సాక్షాత్ దివ్యదర్శన శుభ రాత్రిగా, శివరాత్రిగా లోక ప్రసిద్ధి గాంచింది. అందుకే అర్ధరాత్రి లింగ దర్శనం పరమాత్మ దివ్య దర్శన మహాఫలదాయినిగా నేటికీ విశ్వసింపబడుతూ ప్రాముఖ్యాన్ని వహించింది. కృష్ణుడుగా విష్ణువు, ఏకపాద రుద్రమూర్తిగా పరమ శివుడు ఉద్భవించి తమ దివ్య తత్త్వ దర్శనాన్ని భక్తుల కనుగ్రహించిన సమయం మాత్రం అర్ధరాత్రే కావడం అనుకోని సంఘటన కాదు.
జాగరణ
ఈ విధంగా రాత్రే భగవద్దివ్య దర్శనం కావడంలోని రహస్యాన్ని విచారిస్తే - రాత్రి చీకటికి పుట్టినిల్లు. ఆధ్యాత్మిక లోకంలో చీకటి అజ్ఞానానికి ప్రతీక. దానివల్ల కలిగేది అహంకారం. ఇదే, జీవుడికి పరమాత్ముడికి మధ్య అడ్డుగోడగా నిలిచేది. లోకమంతా అహంకార బీజమైన అజ్ఞానాంధకార మలముకొన్న రాత్రియందే దైవాన్ని విస్మరించి నిద్రపోతూ ఉంటుంది. జ్ఞానులు, భక్తులు అట్టి రాత్రికి వశపడక జాగరూకులై అంటే మెలకువ కలిగి ఉంటారు. మెలకువ అంటే - భగవద్ధ్యానం - భగవత్క్థాశ్రవణం - భగవద్గోష్ఠి - భగవద్భజన -మొదలైన వాటిలో కాలం గడుపుటయే. లోకులంతా సాధారణంగా అజ్ఞాన రాత్రిలో నిద్రపోతూ ఉంటే అప్పుడే జ్ఞానులు భక్తులు ఆ విధంగా భగవద్ జ్ఞానతత్పరులై జాగరూకులై (మెలకువతో) ఉంటారు.
శ్లో.యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమా
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః (్భ.గీ.2-69)
అని భగవద్గీత వచించింది. ఆ జాగరణ మార్గానే్న నిర్దేశిస్తూ శివరాత్రి ఒక్కరోజయినా ఆచరించండని శివరాత్రి నాడు ‘జాగరణ’ ముఖ్య విధిగా విధించబడింది. కారణం బ్రహ్మకు - శ్రీహరికి శివతత్త్వ జ్ఞానం బోధపడిన రాత్రి గనుక. మృత్యువు దయ లేనిది కాబట్టి మరో శివరాత్రి జీవితంలో వస్తుందో రాదో, ఈ జన్మలోనే భగవద్దర్శనం పొందాలనుకొనే వారు మాస శివరాత్రి అన్న పేరుతో నెలనెలా శివారాధన చేస్తూ లెక్కించుకొంటూ ఎదురుచూచిన ఈ మహాశివరాత్రి మన జన్మకో శివరాత్రి అని దృఢ నిశ్చయంతో జాగరణ నియమాన్ని విధిగా పాటించాలి.
ఉపవాసం
ఇక ఆ రోజు భోజనమంటారా? ఆ ఒక్కరోజు తినకుంటే ప్రాణం పోదు కదా అని ధైర్యంతో దైవ సాన్నిధ్యాన్ని విడిచిపెట్టక ఉపవాస వ్రతాన్ని పాటించాలని ఋషులు నిర్దేశించారు. ఉప - దైవ సన్నిధిలో వాస = ఉండుటయే ఉపవాస శబ్దాని కసలు అర్థం కూడా. అంటే శివ సన్నిధిలో భగవద్ధ్యాన తత్పరులు కావాలని భావం.
అభిషేకార్చనలు
నాలుగు మారేడాకులు మీద పడేసి, ద్రోసెడు నీళ్లు పైన పారబోసి, కొండెక్కే దీపాన్ని ఎగత్రోసినా కూడా ననె్నంతో భక్తితో సేవించాడని పొంగిపోయే భోళాశంకరుని సన్నిధిలో శివరాత్రి నాడు ఉపవాసం - జాగరణలను ఆచరిస్తే శ్రీహరి మరియు చతుర్ముఖ బ్రస్మలకు ఏకాదశ రుద్రులలో ప్రధానుడైన ఏకపాద రుద్రమూర్తి ఇహలోక సౌఖ్యాలతోబాటు పరలోక శివసాయుజ్య ప్రదాత కాగలడు.
ఆలయాలు ఎందుకు లేవు?
ఇట్టి ఏకపాద రుద్రమూర్తిని మేమెన్నడూ ఏ దేవాలయంలో కూడ చూడలేదే అని సందేహించకండి. ఎందుకంటే శివుడికి లింగార్చనే గాని సాకార రూపార్చన లేదు. అంతేగాక సాకార రూపార్చన కంటె లింగరూపార్చనకే మహత్వ మధికం కూడా. అదీగాక ఏకపాద రుద్రమూర్తి ఉద్భవించింది కూడ నిరాకారమైన స్తంభాకృతి గల అగ్నిలింగం నుండే కదా. అందుకే అగ్ని లింగం నుండి ఉద్భవించిన ఏకపాద రుద్రమూర్తిని మనసున స్మరిస్తూ అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ మూర్తి పేరున నిరాకార రూపమైన అగ్ని లింగానే్న పూజిస్తున్నాం.
అయినా భక్తుల దర్శనార్థంగా భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలన్నింటిలో ఈ సాకార ఏకపాద రుద్రమూర్తులు కనపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాళహస్తి, బిక్కవోలు, ముఖలింగం, త్రివేండ్రం, తిరువళ్లం - హీరాపూర్, నంజుండేశ్వరాలయం, జంబుకేశ్వరం, ఉజ్జయిని ఇలా ఎనె్నన్నో చోట్ల ఈ ఏకపాద రుద్రమూర్తులు దర్శనమిస్తున్నాయి. కాకపోతే ఈ మూర్తులకు ప్రత్యేకాలయాలు మాత్రం లేవు.
లేకపోయినా సృష్ట్యాదిలోని ఈ ఏకైక ‘ఏకపాద రుద్రమూర్తి’ యే సాకారులైన హరి - హర - బ్రహ్మ లనే త్రిమూర్తి రూపాలుగా ఉద్భవించి సృష్టి - స్థితి - లయాలను నిర్వహిస్తున్నారని అనేక కావ్యాలలో కూడా ప్రశంసింపబడ్డాడు.
శ్లో.ఏకైవమూర్తి ర్బిభిదే త్రిధాసా, సామాన్య మేషాం ప్రథమావరత్వం
విష్ణోర్హరస్తస్య హరిః కదాచిత్ వేధాస్తయోస్తావతి ధాతురాద్యౌ.
కుమారసంభవం సర్గ 7. శ్లో.44
ఇలా ప్రశంసితుడైన ఈ ఏకపాద రుద్రమూర్తి అంతర్లీనంగా అర్చామూర్తిగా ఉంటూనే నిర్గుణ భగవదారాధనా ప్రాముఖ్యాన్ని చాటుతూ ఉన్న ఈ మహాలింగ మూర్తి సకల పరమయోగి జన ధ్యానైక గమ్యుడు. నానా నామరూప ధారుడైనా నామరూప రహితుడు. ‘ప్రజ్ఞానం బ్రహ్మా’ అన్న మహావాక్య వాచ్యుడైన జ్ఞానైక మూర్తి. ముముక్షువులు సదా ఆకాంక్షించే ‘రసోవైసః’ అన్న ఉపనిషద్వచన ప్రతిపాద్యుడైన ఈ బ్రహ్మానందైక రస స్వరూపి. ఇట్టి మహాదేవమూర్తికి సదాశివమూర్తికి, ఏకపాద రుద్రమూర్తికి ఇదే అక్షరాభిషేకం. సాష్టాంగ వందనం.
శ్లో.ఆనందాయ నిరంతరాయ మహతే జ్ఞానాయ విశ్వాత్మనే
నిత్యాయాక్షత తేజసే సుమహతాంగమ్యాయవై యోగినామ్
నానాకార విధాయినే ప్యవికృతాకారాయ చిత్తాంతరే
ప్రోన్మీలద్రస రూపిణే భగవతే తసమ్మై పరస్మై నమః

ఫిలిం క్విజ్-120

$
0
0

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో బాలయ్య కృష్ణుడిగా కనిపించిన సినిమా?
3. అనార్కలిలో అంజలి/ ముఠామేస్ర్తీలో రోజా.. ఒకే పదం పాట?
4. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ/ పండంటి కాపురం- గాయకుడు?
5. ఆదిత్య 369 చిత్రానికి సినిమాటోగ్రఫీ?
6. చున్ని/ పిన్ని.. ఏపాట పాడుకుంటారు?
7. అందాల రాక్షసి/ భలే భలే మగాడివోయ్ -గుర్తొచ్చే నాయిక?
8. ... నెంబర్ 150.. / ... కన్నయ్య. ముందు ఏ పదం ఉండాలి?
9. పక్కా జెంటిల్‌మ్యాన్‌ని/ ఎర్రాని కుర్రవాణ్ని గోపాలా.. -మ్యూజిక్?
10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

సమాధానాలు- 118

1. కేశవ
2. కెబి తిలక్
3. భలే తమ్ముడు
4. వెనె్నల
5. ప్రకాష్‌రాజ్
6. కనె్నగంటి
7. రాజనాల
8. సంగీత
9. నేహా జుల్కా
10. పల్లక్ లల్వానీ

సరైన సమాధానాలు రాసిన వారు

యన్ శివస్వామి, బొబ్బిలి
అల్లాడ రాజాచంద్ర, శ్రీకాకుళం
భువనకీర్తి కె, రాజమండ్రి
కె పద్మావతి, రాజమండ్రి
బీరన కార్తీక్, సికింద్రాబాద్
తేజస్వి, బెంగళూరు
వై ప్రహ్లాదరావు, తుని
డీవీఎస్ రాజేష్, అల్లవరం
సుభద్రమణి, డి గన్నవరం
మంచిలి రత్నాకర్, తుని
తల్లావఝుల మల్లిక, నర్సాపురం
పి రత్నాకర్‌రావు, నల్గొండ
బి రాజేశ్వరి, కర్నూలు
బిట్రగుంట ప్రతాప్, అనంతపురం
ఎస్ దేవదానం, గుంటూరు టౌన్
జి కార్తీక, సికింద్రాబాద్
సీవీఎస్‌ఎస్ నర్శింహులు, హైదరాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

గ్రేట్ కల్యాణ్

$
0
0

గత వెనె్నల సంచికలో ‘కొత్తదనమే ఇష్టం’ అంటూ ప్రచురించిన కల్యాణ్‌రామ్ ఇంటర్వ్యూ బావుంది. అందరు హీరోలు చెప్పినట్టుకాకుండా -కల్యాణ్ నిజాయితీగానే చెప్పాడనిపిస్తుంది. అతని కెరీర్‌లో ఎన్నో సినిమాలు ఫ్లాపులైనా -ప్రతి సినిమాలోనూ ఏదోక కొత్తదనం చెప్పడానికి, చూపించడానికీ తాపత్రయపడతున్నట్టు ఆడియన్స్‌కి అర్థమవుతూనే ఉంది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని, మంచి కథ అనిపిస్తే సినిమా చేయడమే తనకు తెలిసిందంటూ కల్యాణ్ చెప్పిన నిజాయితీ సమాధానం మరింత నచ్చింది. అతని కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రాలు తక్కువైతే అయివుండొచ్చుకానీ, చాలామంది హీరోల కంటే కల్యాణ్ బెటర్ అన్న విషయం అతని పెర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. కొత్త దర్శకులకు ధైర్యంగా సినిమాలు చేస్తున్న హీరో కల్యాణ్‌రామ్‌ని అభినందించి తీరాలి.
-రాగసుధ, భీమవరం
వాళ్లంతే..
వెనె్నల కవర్ కథనం -ఎదురు చూసి పోసపోకుమా చాలా బావుంది. మనవాళ్లు ముఖ్యంగా యువత బ్రాండ్‌లకు బానిసలు. తమకు నచ్చిన బ్రాండ్ వస్తువులనే కొంటారు. వేరే బ్రాండ్‌వి నాణ్యమైనవైనా అటు చూడరు. అలాగే సినిమా స్టార్ల కాంబినేషన్లు కూడా. సీనియర్ హీరోలకు నయన్, అనుష్కలాంటి సీనియర్లే సరిజోడు. కాస్త స్థూలంగా కనిపించే చిరంజీవి, బాలకృష్ణలాంటి హీరోలకు తమన్నా, కాజల్‌లాంటి సన్నజాజులతో జోడీ కుదరదు. సమస్య ఏమంటే నాజూకుగా కనిపించే ఇతర భాషా నటీమణుల ముఖాల్లో ఏ భావమూ కనిపించదు. డబ్బింగ్ పుణ్యమా అని మాటల వరకూ ఓకే. నటించడం చేతకాదు. అందుకే కొత్తతారలు మెప్పించలేకపోతున్నారు.
-లంబకర్ణ, రాజేంద్రనగర్
బాలరాజు బావుంది
గత వారం వెనె్నల సంచిక చివరి పేజీలో రచయిత కె శ్రీనివాస రావు అందించిన బాలరాజు సినిమా కథనం చాలా నచ్చింది. 70యేళ్ల క్రితంనాటి విషయాలను కళ్లకు కట్టినట్టు రాసిన విధానం చదివింపదగినదిగా ఉంది. ‘ముగ్గురు మరాఠీలు’ హిట్టు తరువాత నిర్మాతగా ఘంటసాల బలరామయ్య మూడ్, మరో జానపద చిత్రాన్ని తెరకెక్కించేందుకు చేసిన ప్రయత్నాలు, హీరో హీరోయిన్ల ఎంపిక.. ఈ విషయాలన్నీ మన కళ్లముందు జరిగినట్టే రచయిత రాయడం అభినందనీయం. ఇక కొద్దిరోజుల క్రితమే మొదలైన ‘ఆనాటి హృదయాల’ శీర్షిక అద్భుతం. రచయిత ఇమంది రామారావు అప్పటి సినిమా ముచ్చట్లను అందిస్తోన్న తీరు హాయిగా అనిపిస్తోంది. ఆనాటిని ఇప్పటి పాఠకులకు హాయిగొలిపేలా అందిస్తున్న వెనె్నల బృందానికి, రచయితల బృందానికి కృతజ్ఞతలు.
-డి పద్మావతి, రాజమండ్రి
భలే చిత్రం!
ప్రేక్షకులకు దెయ్యం కథలపై ఆసక్తిని గమనించి మలయాళ రచయిత మధు చాలాకాలం క్రితం మూఢనమ్మకాల్ని ప్రోత్సహించకుండా ఒక కథ రాసి దర్శకుడు ఫాజిల్‌కి చూపిస్తే అతనికి నచ్చలేదు. దాన్ని మూలపడేశారు. తరువాత దానికి మార్పులు చేర్పులు చేసి ‘మణి చిత్ర తాళు’ (నగిషీ తలుపు గడియ) చిత్రం తీస్తే సూపర్ హిట్. దాన్ని ఆప్తమిత్ర పేరుతో కన్నడంలో తీస్తే అదీ సూపర్ హిట్. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని దర్శకుడు ఆదిత్య చిరంజీవిని కలిస్తే ఆయనకి నచ్చలేదు. తర్వాత అదే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో చంద్రముఖిగా వచ్చి సూపర్ డూపర్ హిట్టయ్యింది. నిజంగా ఇదే ఓ సినిమాలా లేదూ.
-్భస్కర్, అశోక్‌నగర్
తప్పేముంది?
ఓ పాఠకులు చెప్పినట్టు ఎఫ్2 గొప్ప చిత్రం కాదు. వినోదాత్మక హిట్ చిత్రం. వినోదం అనగానే నవ్వించే మాటలు, కామెడీ సన్నివేశాలూ ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇలాంటి చిత్రాల్లో నీతులు, సామాజిక కోణాలు వెదకనక్కర్లేదు. అలనాడు సూపర్ హిట్టయిన మిస్సమ్మ, గుండమ్మ కథల్లో సామాజిక కోణం ఉందా? మిస్సమ్మలో నిరుద్యోగ సమస్య గురించి మాటలు వినిపిస్తాయి కానీ పరిష్కారం చూపలేదు. గుండమ్మకథలో ఆపాటి సామాజిక కోణమూ లేదు. హాయిగా రెండున్నర గంటలు నవ్వించాయి. అంతవరకే ఆ చిత్రాల ప్రయోజనం. అయితే ఇలా ఔహాయిగా నవ్వించే చిత్రాలు తీయడం బహుకష్టం. సరిగ్గా డీల్ చేయకపోతే హాస్యం కాస్తా అపహాస్యం అయ్యే ప్రమాదం ఉంటుంది. చాలా హాస్య చిత్రాలు నవ్వించలేక ఫ్లాప్ అయిన సందర్భాలు కోకొల్లలు.
-పూర్ణారావు, కాకినాడ
అదీ విషయం
ఫ్లాష్‌బ్యాక్ పీచర్ కింద అందించిన సప్తస్వరాలు చిత్ర విశేషాలు బాగున్నాయి. అందులో నాకు తెలిసిన ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎవరో దుర్బోధ చేసినందున కాంతారావు ముందు మహ్మద్ రఫీ చేత పాడిద్దామనుకున్నాడట. ఆఖరు నిమిషంలో ఎవరో సద్బోధ చేసినందున జంకుతూనే ‘ఘంటసాల’ను పాడుతారా? అని అడిగితే ఆయన చిరునవ్వుతో ‘తప్పకుండా. నా వృత్తి అదేగా బాబూ’ అన్నారట. కలల రాకుమారుడు పుస్తకంలో కాంతారావు చెప్పుకున్న విషయమిది.
-శింగవిహారి, వక్కలంక
ఇంతేనా..!?
కొత్త ఏడాదిలో తెలుగు సినిమాల బండారం ఎంత గొప్పగుందో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలతో అర్థమైపోయింది. టాలీవుడ్‌లో బయోపిక్‌లపై ‘మహానటి’ మోజు పెంచితే, చస్తే బయోపిక్ ముట్టుకోకూడదన్న విషయాన్ని యన్టీఆర్ కథానాయకుడు, మహానాయకులు చిత్రాలు రుజువు చేశాయి. యన్టీఆర్‌ను ఎలా చూడ్డానికైనా ఇష్టపడేంత అభిమాన జనం ఇప్పటికీ ఉన్నప్పటికీ, ఆయనపై తీసిన సినిమాలు ఆడలేదంటే ఎంత పేలవగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ యన్టీఆర్ జీవితంలోని ‘వెన్నుపోటు’ వ్యవహారాన్ని రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించేశాడు. ‘లక్ష్మీస్ యన్టీఆర్’గా రాబోతున్న ఆ చిత్రం థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో, ఎలాంటి రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.
-పరమేశ్, పరకాల

బందిపోటు దొంగలు

$
0
0

ఏఎస్‌ఆర్ ఆంజనేయులు కృష్ణా జిల్లా కోలవెన్నులో 1933 సెప్టెంబర్ 3న జన్మించారు. సినీ నిర్మాణంపై అభిరుచితో మాధవీ పతాకంపై వీరు నిర్మించిన చిత్రం ‘పాండవ వనవాసం’ ద్వారా ‘హేమమాలిని’ని తెరకు పరిచయం చేశారు. తరువాత ఆమె హిందీ చిత్రసీమలో ఖ్యాతి గడించారు. వీరు 1967లో రూపొందించిన ‘స్ర్తిజన్మ’ తరువాత 1968లో రూపొందించిన చిత్రం ‘బందిపోటు దొంగలు’. ఆపైన వంశోద్ధారకుడు (1972), కురుక్షేత్రం, హిందీలో ‘సోలాసాల్’ (16ఏళ్ల వయసు), ‘సువేరా సంసార్’ (పండంటి జీవితం) వంటి పలు చిత్రాలు నిర్మించారు. ‘బందిపోటు దొంగలు’ చిత్రానికి ప్రముఖ నిర్మాత, దర్శకులైన కెఎస్ ప్రకాశరావు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ కథ, నవల, నాటక రచయిత ఎన్‌ఆర్ నంది (నంది నూకరాజు 1933లో రాజమండ్రిలో జన్మించారు). వీరు 200లకు పైగా కథలు, 25 నవలలు, కొన్ని నాటికలు, పలు నాటకాలు రచించటమేకాక -‘తాసిల్ధారుగారి అమ్మాయి’, ‘నోము’ చిత్రాలకు పని చేశారు. ఆ అనుభవంతోనే ఈ చిత్రానికీ ఎంతో అర్ధవంతమైన, భావోద్వేగాలతో కూడిన సంభాషణలు సమకూర్చారు.

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
కళ: సూరన్న
కూర్పు: మార్తాండ్
నృత్యం: చిన్ని, సంపత్
స్టంట్స్: రాఘవులు అండ్ పార్టీ
ఫొటోగ్రఫీ: ఎస్ వెంకటరత్నం
సహాయ దర్శకత్వం: కె రాఘవేంద్రరావు
నిర్మాతలు: జె సుబ్బారావు, జి రాజేంద్రప్రసాద్

యజమాని (ముక్కామల) వల్ల భార్య లక్ష్మి (జయంతి)కి అన్యాయం జరగటం, బిడ్డ మరణించటంతో సాధు స్వభావంకల మల్లయ్య (ఎస్‌వి రంగారావు) బందిపోటు దొంగ మల్లయ్యదొరగా మారతాడు. తూటా దెబ్బలు తగిలి డాక్టర్ చంద్రశేఖర్ (గుమ్మడి) వద్ద చికిత్స పొందుతాడు. అతని భార్య (రుక్మిణి) నుంచి వారి బాబును ఎత్తుకెళ్లి తన స్థానంలో తన కొడుకు కన్నయ్యగా పెంచుతాడు. మరో అనుచరుడు పాపన్న (త్యాగరాజు) కొడుకు నాగూ (జగ్గయ్య), వెంకన్న (సీతారాం) కూతురు మల్లి (కాంచన) అక్కడ పెరిగి పెద్దవారవుతారు. అంజి (రాజ్‌బాబు) కన్నయ్య (ఏఎన్నాఆర్)తో దోస్తీగా మసులుతాడు. ఒకసారి నాగూ, డాక్టర్ చంద్రశేఖర్ మేనకోడలు ఇందిర (జమున)ను అడ్డగించగా కన్నయ్య వారిస్తాడు. దయా దాక్షిణ్యాలు మనకు చేటు తెస్తాయని మల్లుదొర గతం చెప్పటంతో, కన్నయ్య మరింత రెచ్చిపోయి దోపిడీలు సాగిస్తాడు. పోలీసు కాల్పుల్లో గాయపడి డాక్టర్ చంద్రశేఖర్ వద్ద చికిత్సకు వెళ్తాడు కన్నయ్య. భుజంమీద పుట్టుమచ్చ చూసి తన కుమారుడని గ్రహించి అతనికి మానవత్వం, మంచితనం, గాంధీజీ ఆశయాలు బోధిస్తాడు. ఓ మంచి వ్యక్తిగా మార్చి పోలీస్ శిక్షణకు పంపుతాడు. పోలీస్ ఇన్‌స్పెక్టరుగా తిరిగి వచ్చిన కృష్ణ మల్లుదొరతో భేటీ అయ్యి లొంగిపొమ్మని కోరతాడు. తిరస్కరించిన మల్లుదొర అతని ముఠాతో సాగించిన పోరాటంలో నాగూ, అతని అనుచరులు మరణిస్తారు. మల్లుదొర మారిన మనసుతో పోలీసులకు లొంగిపోవడంతో సంస్కరించబడతాడు. చివరకు ఇందిర, కృష్ణల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో కృష్ణ తల్లిగా రుక్మిణి, ఆమె అన్న వరాహమూర్తిగా నాగభూషణం, సుందరమ్మగా సూర్యాకాంతం, ఆమె కొడుకుగా కెవి చలం, ఇన్‌స్పెక్టరుగా ప్రభాకర్‌రెడ్డి, ఇంకా జగ్గారావు, భీమరాజు, తదితరులు నటించారు.
సంఘ విద్రోహశక్తులైన బందిపోట్లను సంస్కరించి జన జీవితంలో భాగం చేయాలనే మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా కథ, సన్నివేశాలను రూపొందించారు దర్శకులు కెఎస్ ప్రకాశరావు. తన బిడ్డతో పారిపోయి, గాయపడి బిడ్డను పోగొట్టుకున్న మల్లయ్య బందిపోటుగా మారి డాక్టరు బిడ్డను తస్కరించి తనవద్ద పెంచటం, ‘కన్నయ్య పుట్టినరోజు’ వేడుక పాట, నృత్యం (రాజసులోచన బృందం)తో మొదలుపెట్టి (ఆడు దొర వేటాడు దొర -రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల, సుశీల, రాఘవులు బృందం) నాగూ చరణం, ‘కాంచన’ పాట నృత్యాలతో ముగింపునిచ్చి థ్రిల్లింగ్‌గా చిత్రీకరించారు. దొంగగా పెరిగినా కన్నయ్య, ఇందిర (జమున)ను అడ్డగించిన నాగూను ఎదిరించటం, మనకు జాలి దయ వంటివి ఉండకూడదన్న మల్లుదొర గతం విని కన్నయ్య మరింతగా రెచ్చిపోయి దొంగతనాలు సాగించటం, వాటి బీభత్సం సన్నివేశాలు బిగింపుతో సాగించారు. అలా దొంగతనాలు చేసే సమయంలో పోలీసు తూటాతో గాయపడి తండ్రివద్దకు చేరి కన్నయ్య మంచివాడిగా మారటం, డాక్టరును చంపాలని వెళ్లిన మల్లుదొరను కృష్ణవారించి అతనిలో వివేచన కల్పించటం, పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా వెళ్లి బందిపోట్లను లొంగిపొమ్మని కృష్ణ కోరటం, తన ముఠాతో ధైర్యంగా పోలీసులను ఎదుర్కొంటానని మల్లుదొర నాగూతో, కృష్ణతో చెప్పే సన్నివేశాలూ మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అనుచరులందరూ మరణించి కొద్దిమందితో నిస్సహాయంగా మిగిలిన మల్లుదొర పోలీసులకు లొంగిపోయి ధైర్యంతో మార్పును కోరుకోవటంలాంటి సన్నివేశాలను సహజత్వంతో చిత్రీకరించారు. డాక్టర్ చంద్రశేఖర్ మేనకోడలు ఇందిర తమాషా మాటలు, చేష్టలు, దొంగలంటే భయంలేదనటం, నాగూ బారినుంచి కన్నయ్య రక్షించగా అతన్ని మెచ్చుకోవటం, తిరిగి కన్నయ్యవారిని (తల్లిని, ఇందిర, ఆమె తండ్రిని) నిందించటం, కృష్ణగా మారిన కన్నయ్య ఇందిరతో పియానోపై పాట -విరిసిన వెనె్నలలో (గానం: ఘంటసాల, రచన: దాశరథి), ఆ సందర్భంలో దోపిడీకి వచ్చిన నాగూ బృందం రియాక్షన్స్, ఒక ఫైట్ అర్ధవంతంగా రూపొందించారు. ‘పగ, ద్వేషం నిప్పురవ్వల వంటివి. అవి ఆ వ్యక్తినే కాదు, ఎదుటివారినీ దహింపచేస్తాయి’, ‘్ధర్యం ఒంట్లో బలం వల్ల రాదు, మనోబలం కావాలి’, ‘తానొదులుకున్నా తన్నొదులుకోని సమస్యలు ప్రతీవారి జీవితంలో వుంటాయి’, ‘ప్రేమ మనిషిని పునీతుణ్ని చేస్తుంది’ అంటూ గాంధీజీ ఆశయాలూ, నిత్యసత్యాలు కలగలిపిన రచయిత సంభాషణలు ఆలోచింపచేస్తాయి, ఆకట్టుకుంటాయి. నటీనటులంతా పాత్రోచితంగా రాణించారు. మల్లుదొరగా ఎస్‌వి రంగారావు చిత్రం చివరి పోరాటంలో లొంగిపోయిన సన్నివేశంలో ధీర గంభీర సున్నిత ప్రదర్శనతో మెప్పించారు.
ఇతర గీతాలు: కాంచన, ఏఎన్నాఆర్‌పై చిత్రీకరణ -ఉన్నాడు ఓ చక్కని చిన్నోడు (రచన: సి నారాయణ రెడ్డి, గానం: పి సుశీల). మరో సినారె గీతం, రంగుల్లో బృందావన్ గార్డెన్స్‌లో అక్కినేని, జమునలపై చిత్రీకరించిన ఆహ్లాదభరితమైన పాట -విన్నానులే ప్రియా (గానం: ఘంటసాల, పి సుశీల). ఈ చిత్రంలో ఈ పాట హిట్‌సాంగ్‌గా నిలచి ప్రత్యేకత నిలుపుకుంది. జమునను అల్లరిపెడుతూ అక్కినేని పాడిన గీతం -కిలాడి దొంగ డియోడియో (గానం: ఘంటసాల). అక్కినేనిని ఉడికిస్తూ జమున పాడిన గీతం -కిలాడి దొంగ డియోడియో (గానం: పి సుశీల, రచన: ఆరుద్ర). అక్కినేనిని బంధించిన సమయంలో జగ్గయ్య ముందు కాంచన, జమున, రాజ్‌బాబు బృందం నృత్య గీతం -గండరగండా సోగ్గాడివంటా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పి సుశీల, రాఘవులు బృందం, రచన: ఆరుద్ర). ఇక -గాంధీ పుట్టిన దేశమురా ఇది అంటూ సాగే సాకీని ఘంటసాల గానంలో వింటాం. ఓ మంచి సందేశంతో చక్కని సంగీతం, ఎస్వీఆర్, గుమ్మడి, ఏఎన్నాఆర్ వంటి భారీ తారాగణంతో రూపొందించిన చిత్రంగా బందిపోటు దొంగలు ప్రశంసలు అందుకుంది. -విన్నానులే ప్రియా అంటూ విరిసిన వెనె్నల గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూ ‘బందిపోటు దొంగలు’ చిత్రాన్ని గుర్తు చేయటం విశేషం.

పాత స’రసమే..!

$
0
0

లుకా చుప్పి ** ఫర్వాలేదు

తారాగణం: కార్తిక్ ఆర్యన్, కృతిసనన్, పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖరానా, వినయ్ ప్రతీక్, అతుల్ శ్రీవాస్తవ..
రచన: రోహన్ శంకర్
సంగీతం: తనిష్క్ బాగ్చి, కేతన్ సోధా
కూర్పు: మనీష్ ప్రధాన్
సినిమాటోగ్రఫీ: మిలింద్ జోగ్
నిర్మాత: దినేష్ విజన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ ఉతేకర్
=================================================================================
బాలీవుడ్ కొత్త హీరోలంతా స్టార్ స్టేటస్‌కంటే -మంచి సినిమా చేయాలన్న ఆలోచనతోనే అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాంటివాళ్ల జాబితాలో ఆర్యన్ కార్తీక్‌నీ చేర్చాలి. తొమ్మిదేళ్ల క్రితం కెరీర్ మొదలెట్టిన కార్తిక్, 2012లో వినా -ఏటా ఒక సినిమా చొప్పున చేసుకొస్తున్నాడు. వాటిలో బ్లాక్‌బస్టర్ హిట్లతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలూ ఉన్నాయి. ప్యార్ క పంచనామా, ప్యార్ క పంచనామా -2, సోనూ కే టిట్టూ కీ స్వీటీ, ఆకాశవాణి, కాంచి (ది అన్‌బ్రేకబుల్) చిత్రాలు కార్తీక్‌కు మంచి పేరే తెచ్చాయి. సోనూ కే టిట్టూ కీ స్వీటీ -సినిమా అయితే అనూహ్యంగా వంద కోట్ల క్లబ్‌కు చేరింది. దీంతో బాలీవుడ్‌లో ఆర్యన్ కార్తీక్ డిమాండ్ మామూలుగా లేదు. ఇక సన్నజాజి తీగ అందంతో యూత్ కలలరాణిగా మారిన హీరోయిన్ కృతిసనన్. తన అందంతో కుర్రకారుని గ్రిప్‌లో పెట్టుకున్న కృతి -చేసిన సినిమాలు తక్కువే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా సంపాదించింది. అలాంటి వీరిద్దరి కెమిస్ట్రీతో స్క్రీన్‌కెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ -లుకా చుప్పి (దాగుడుమూతలు). పెళ్లయిన కొత్త కాపురం పెట్టిన దంపతుల ఇంటికి బంధువర్గం దిగిపడితే -ప్రైవసీ కోసం వాళ్ల యాతన ఎంత భయానకంగా ఉంటుందోనన్న కానె్సప్ట్‌తో తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి. అలాంటి కథలో పండే కామెడీని మన దర్శకులు ఎంతోమంది వైవిధ్యంగా చూపించారు కూడా. లుకా చుప్పి కూడా ఇంచుమించు అలాంటి కథే.
సహజీవనం చేస్తున్న జంట ఇంటికి -అనుకోకుండా అబ్బాయి కుటుంబం వచ్చిచేరితే వాళ్ల పరిస్థితి ఏంటన్నదే ఈ కథ. ‘సహజీవనం’ కానె్సప్ట్‌ను సామాజిక కోణంలో కామెడీగా చెప్పేందుకు దర్శకుడు లక్ష్మణ ఉతేకర్ ప్రయత్నించాడు. ఆడియన్స్‌కి ఏమేర కనెక్టయ్యిందో చూద్దాం.
కథ:
వినోద్ శుక్లా అలియాస్ గుడ్డూ (కార్తిక్) ఓ టీవీ రిపోర్టర్. అతనికి పెళ్లి పిచ్చి పట్టుకుంటుంది. అదే టైంలో మరో అందమైన రిపోర్టర్ రష్మి త్రివేది (కృతి) తారసపడుతుంది. పరస్పరం ఇష్టపడతారు. ఆటోమేటిక్‌గా పెళ్లి ప్రస్తావన వస్తుంది. గుడ్డూ ప్రపోజల్‌కు రష్మి ఎక్స్‌టెన్షన్ చెబుతుంది. పెళ్లికంటే ముందు అన్నిరకాలుగా కలిసుంటే ఒకరినొకరు అన్నిరకాలుగా అర్థం చేసుకోవచ్చని అంటుంది. లివింగ్ రిలేషన్‌షిప్ (సహజీవనం) లేటెస్ట్ ట్రెండ్ అని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఎందుకు మిస్ చేసుకోవాలని ప్రశ్నిస్తుంది. రష్మి ప్రపోజల్ గుడ్డూపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అంతే -ఇద్దరూ ఇంటినుంచి బయటపడతారు. మరో ఫ్లాట్‌లో కలిసి జీవిస్తుంటారు. అంతా హ్యాపీగా గడచిపోతున్న వారి లైఫ్‌లో చిన్న డిస్ట్రర్బెన్స్. అది గుడ్డూ ఫ్యామిలీ నుంచి ఎదురవుతుంది. గుడ్డూకి దూరంగా ఉండలేమంటూ ఫ్యామిలీ మొత్తం అతనుండే ఇంటికి వచ్చేస్తారు. గుడ్డూ దగ్గరే మకాం పెడతారు. ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానన్న విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయాందోళన గుడ్డూలో మొదలవుతుంది. చివరకు గుడ్డూ, రష్మి రహస్యం బయటపడిందా? ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా? గుడ్డూ కుటుంబం ఎలా రియాక్టైంది? లాంటి అనేక ప్రశ్నలకు జవాబులు స్క్రీన్‌పై చూడాలి.
***
నిజానికి ఇది ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ. లవ్‌నుంచి పెళ్లికి చేరిన జంటమధ్య కుటుంబం తిష్టవేస్తే వాళ్ల పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే -ఈ చిత్రంలో అలాంటి కథకు ‘సహజీవనం’ టచ్ ఇచ్చాడు దర్శకుడు. ఆ కానె్సప్ట్‌ను కామెడీగా చెప్పాలనుకున్నాడు. దర్శకుడి ఆలోచనకు మార్కులు పడతాయోమోగానీ, అలాంటి కథల్లోని సన్నివేశాల్ని ఇప్పటికే అనేక చిత్రాల్లో చూసేసిన ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమాలోని సన్నివేశాలు నవ్వు తెప్పించలేకపోయాయి. అలాగే లివింగ్ రిలేషన్‌షిప్ అనే పాశ్చాత్య ధోరణి ప్రభావం భారతీయ సామాజిక జీవన విధానంలో ఇముడుతుందా? ఎలాంటి ప్రభావం చూపనుంది -లాంటి కథను బలోపేతం చేయగల అంశాలను దర్శకుడు టచ్ చేయలేదు. బహుశ కామెడీ కోణంలోనే సినిమా చూపించాలన్న ఆలోచన కావొచ్చు. అయితే దీనివల్ల చాలా సన్నివేశాల్లో లాజిక్‌లేని భావన ఆడియన్స్‌కి కలిగింది. చిన్న పాయింట్ చుట్టూ కథను అల్లుకోవడం వల్ల -ప్రథమార్థాన్ని పూర్తిగా హీరో హీరోయిన్ల పరిచయాలు, పాటలతోనే లాగించేశాడు దర్శకుడు ఉతేకర్. అసలు కథ -గుడ్డూ, రష్మిల సహజీవనంనుంచే మొదలవుతుంది. పెళ్లికి అతీతమైన బంధాన్ని కొనసాగిస్తున్నామన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందోనన్న భయం, ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచేందుకు గుడ్డూ, రష్మిలు చేసే దాగుడుమూతల హడావుడి అక్కడక్కడ నవ్వు పుట్టించింది. ట్రెండ్‌ను ఆస్వాదించేందుకు తెగింపు చూపించినా -రహస్యం మాత్రం కుటుంబానికి, సమాజానికి తెలీకుండా వీరిద్దరూ ఆడే ఆట కాసేపు హాయిగానే అనిపిస్తుంది. పేలవమైన కథే స్క్రీన్‌మీద కనిపిస్తున్నా -ఆడియన్స్ ఎక్కువసేపు బోర్ ఫీలవ్వలేదంటే అందుకు ఒకే ఒక్క కారణం -నాణ్యత కలిగిన చిత్ర నిర్మాణం.
కార్తీక్, కృతిల కెమిస్ట్రీ అద్భుతం. సహజీవనం, ఆ విషయం బయటకు పొక్కుతుందేమోనని భయపడే సన్నివేశాల్లో ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించగలిగారు. కాకపోతే, మధుర అనే చిన్న పట్టణం బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంటే, లీడ్‌రోల్స్ వేషధారణ, హావభావాలు, మాట తీరు ఆధునికత ఉట్టిపడేలా చూపించటం నప్పలేదు. అందుకే -హీరో హీరోయిన్ల మధ్య వచ్చే అనే సన్నివేశాలు సహజత్వానికి దూరంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కార్తిక్ స్నేహితుడి పాత్రలో అపరవక్తి ఖురానా పూర్తిగా మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్. ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాడు. గుడ్డూ బావ పాత్రలో కనిపించిన పంకజ్ త్రిపాఠికి సరైన పాత్ర దక్కలేదు. వినయ్‌ప్రతీక్, అతుల్ శ్రీవాస్తవ, అల్కా అమిన్ తదితరులంతా పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతికంగా ‘లుకా చుప్పి’ చాలా ఉన్నతంగా అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి అందించిన బాణీలు ఆడియన్స్‌లో జోష్ పుట్టించాయి. కథలో కొన్నిచోట్ల బావోద్వేగాలకు తగిన బ్యాగ్రౌండ్ స్కోర్ చేయడంలో కేతన్ సోధా పనితనం మెప్పించింది. చిన్న పట్టణమైన మధర బ్యాక్‌డ్రాప్‌ను మిలింగ్ జోగ్ అద్భుతంగా చూపించాడు. మనీష్ ప్రధాన్ తన కత్తెరకు మరింత పదును చూపించివుంటే -రొటీన్ కామెడీ మాయమై కామెడీ కథలో మరింత చిక్కదనం కనిపించి ఉండేది. దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. తప్పొప్పులు సమానంగా చేయడంతో -దాగుడుమూతల కథ రోటీన్ ఎంటర్‌టైనర్‌గానే సాగిపోయింది.

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>