ఆదోని, ఫిబ్రవరి 14:ఉల్లి ధర మార్కెట్‌లో ఒకేసారి క్వింటాల్‌కు రూ. 1300 తగ్గిపోవడంతో ఉల్లి పంటలు పండించిన రైతులకు తగ్గిన ధరలు కంట నీరు పెట్టిస్తున్నాయి. అయితే రిటైల్ ఉల్లి వ్యాపారస్థులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు ఉల్లి గడ్డలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారుల మాయాజాలంతో ఉల్లి రైతులు విల విలాడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉల్లిరైతులు తీవ్రంగా నష్టపోవడం ఖాయమని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం వరకు బహిరంగ మార్కెట్‌లో రైతులు పండించిన ఉల్లి ధరకు క్వింటాల్ రూ.2వేల ప్రకారం ఉండడంతో రైతులు ఎంతో సంతోషంగా పంట కోతలను మొదలు పెట్టి మార్కెట్‌కు ఉల్లిగడ్డలను అమ్మకానికి తీసుకు వస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.700లకు పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఉల్లి రైతులు పేర్కొన్నారు. క్వింటాల్‌కు రూ.1300లు ధర తగ్గడంతో ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గత రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.100లకు చేరింది. తీరా రైతులు మార్కెట్‌కు అమ్మకానికి తీసుకు వచ్చే సరికి ధర పడిపోవడంతో రైతులు వ్యాపారుల చర్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రైతులు వద్ద క్వింటాల్‌కు రూ.700లు కొనుగోలు చేసిన వ్యాపారులు అవే ఉల్లిగడ్డలను ప్రజలకు కిలో రూ.20ల ప్రకారం అమ్ముతున్నారు. ఈ విధంగా చూసుకుంటే రైతుల వద్ద కొనుగోలు చేసే ఉల్లిగడ్డల ధరలు కనీసం రూ.1500ల నుంచి రూ.1600లకు క్వింటాల్ ప్రకారం కొనుగోలు చేయాలి. కాని రైతుల వద్ద మాత్రం క్వింటాల్ రూ.700ల ప్రకారం వ్యాపారులు కోనుగోలు చేస్తున్నారు. ప్రజలకు మాత్రం కిలో రూ.20ల ప్రకారం అమ్ముతూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఉల్లి వ్యాపారులు ఏకమై రైతులను నష్ట పరుస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈసమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలో దిగి రైతుల వద్ద ఉన్న సరుకులను కనీసం రూ.1500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి గడ్డలను చౌక దుకాణాల ద్వారా లేదా కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో రూ.10లేదా రూ.15లకు కిలో ప్రకారం సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల వ్యాపారుల మాయ జాలానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. అంతేకాకుండా ఉల్లి వ్యాపారులు, మధ్య దలారులు తక్కువ ధరకు రైతులకు కొనుగోలు చేసి, స్టాక్ పెట్టి ధరలు వచ్చినప ఉప్పుడు అమ్మెందుకు సన్నద్దం అవుతున్నారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో అన్ని గ్రామాలల్లో బావుల కింద ప్రతి సంవత్సరం 20వేల ఎకరాలలోఉల్లి పంట వేయడం జరుగుతుంది. ఇప్పుడు కోతకు రావడం జరిగింది. ఇలాంటి సమయంలో ఉల్లి గడ్డల వ్యాపారులు ధరలు తగ్గించి రైతుల కడుపుతున్నారు. మార్కెట్‌లో ప్రజలకు అధిక ధరలకు అమ్మిప్రజలను దోపిడి చేస్తున్నారు. కావున ఉల్లిగడ్డల వ్యాపారుల అక్రమ దందాకు ప్రభుత్వ రంగ సంస్థలనుప్రభుత్వం రంగంలోకి దింపి ఉల్లిగడ్డల వ్యాపారుల అక్రమార్జనకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉల్లి రైతులకు ఆత్మహత్యాలే శరణ్యం.
సంజీవయ్య ఆశయాలను
స్ఫూర్తిగా తీసుకోవాలి
* జయంతి సభలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
కర్నూలు, ఫిబ్రవరి 14:మహామేధావి, సున్నిత మనస్కుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని డిప్యూటీ సిఎం, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి సూచించారు. దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని నంద్యాల రోడ్డు చెక్ పోస్టు 3 రోడ్ల కూడలిలో సంజీవయ్య చిత్రపటానికి కెఇ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెఇ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య జన్మంచిన పెద్దపాడు గ్రామాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మంచిన సంజీవయ్య స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి, ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ఆయనతో కలిసి మా నాన్న కెఇ మాదన్న అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. చాలా మంది సభ్యులు కర్నూలు జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చాలని కోరుతున్నారన్నారు. నంద్యాల చెక్‌పోస్టును దామోదరం సంజీవయ్య సర్కిల్‌గా మార్చేంకుకు గెజిట్‌లో రూపొందించాలని కలెక్టర్ విజయమోహన్‌ను ఆదేశించారు. వెనుకబడిన వర్గాలు, హరిజనులు, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంజీవయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు హెచ్‌ఆర్‌డి మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంజీవయ్య ఉత్సవాలు నిర్వహించామన్నారు. చదువే అన్నింటికీ మూలమని పిల్లలను బాగా చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మంత్రి సూచించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అనేక కష్టనష్టాలకోర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడని కొనియాడారు. సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్న సమయంలో దళితులకు లక్షల ఎకరాల బంజరు భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్ పెంపునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వృద్ధాప్య పింఛను, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకాలు అందజేయడంలో విశేష కృషి చేశారన్నారు. ఆయన జన్మించిన పెద్దపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సంజీవయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుచుకోవాలన్నారు. జిల్లాలో దళిత అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. జోహరాపురం ఎస్సీ కాలనీని తాను దత్తత తీసకున్నానని రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు కలెక్టర్ సహకరించారన్నారు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు సంజీవయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి మాట్లాడుతూ నీతి, నీజాయితీ, పరిపాలనాదక్షతకు సంజీవయ్య స్ఫూర్తి అన్నారురు. అలాగే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మేయర్ బంగి అనంతయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు చంద్రప్ప, సుగంధమ్మ, సంజీవరావు, డేవిడ్ విల్సన్, మద్దయ్య, గుర్రాల శ్రీనివాసులు, సుబ్బరాయుడు, ఇడుపుల రాజు, గడ్డం రామకృష్ణ, వేల్పుల జ్యోతి, ఆనంద్, సలోమి, కైలాస్‌నాయక్, సోమసుందరం, త్యాగరాజు, అనంతరత్నం, చిన్నలక్ష్మన్న, షడ్రక్, బాలసుందరం, నాగరాజు, దండు వీరయ్య తదితరులు సంజీవయ్య సేవలను కొనియాడారు. అనంతరం సంజీవయ్య జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రోత్సాహకాలు అందజేశారు.
‘ఉపాధి’ కూలీలకు ప్రత్యేక అలవెన్సు
* డ్వామా పిడి పుల్లారెడ్డి
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 14:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఉపాధి కూలీలకు ప్రత్యేకంగా వేసవి అలవెన్సు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పిడి పుల్లారెడ్డి తెలిపారు. ఆ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సర్క్యులర్ నెం.685ని విడుదల చేశారన్నారు. ఈ సర్క్యులర్ ప్రకారం జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ గరిష్ట వేతనం కంటే అదనంగా వేతనం ఇస్తారన్నారు. అయితే వేసవి అలవెన్సు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మే నెలల్లో 30, జూన్ నెలలో 20 శాతం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి పథకంలో పని చేస్తున్న వికలాంగుల శ్రమశక్తి సంఘాలకు గరిష్ట వేతనం కంటే ప్రత్యేకంగా 30 శాతం ఇస్తామన్నారు. ఉపాధి కూలీ శ్రమ శక్తి సంఘాల్లోని సభ్యులు పని చేసే గ్రామం నుంచి 5 కి.మీ దాటినట్లయితే గ్రూపులోని సభ్యులకు రవాణా భత్యం కింద ఒక్కో సభ్యుడికి రూ. 15, వికలాంగుల శ్రమశక్తి సంఘాల్లోని సభ్యులకు దూరంతో సంబంధం లేకుండా రవాణా భత్యం రూ. 10 ఇస్తామన్నారు. ఉపాధి కూలీలు తమ వెంట గడ్డపార, గంపతో పాటు వాటర్ బాటిల్ తీసుకువచ్చినట్లయితే ప్రతి రోజూ గడ్డపారకు రూ. 10, గంపకు రూ. 3, వాటర్ బాటిల్‌కు రూ. 5 అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే పని చేసే ప్రదేశంలో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌కు రూ. 3, షెడ్ సెట్‌కు రూ. 10 ప్రతి రోజూ అదనంగా ఇస్తామన్నారు. కావున కూలీలు తమ గ్రామంలో జరిగే ఉపాధి పనుల్లో పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిడి కోరారు.
భారతీయ సంస్కృతిని
పరిరక్షించుకుందాం..
* విద్యార్థులు కలాం, వివేకానందల బాటలో నడవాలి
* రథసప్తమి వేడుకల్లో డిఐజి రమణకుమార్
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 14:్భరతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు రేంజ్ డిఐజి బివి.రమణకుమార్ పేర్కొన్నారు. నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఇండస్ పాఠశాలలో ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు రేంజ్ డిఐజి బివి.రమణకుమార్ హాజరై రథసప్తమి వేడుకలను ప్రారంభించారు. అలాగే ఉద యం 6.30 గంటలకు విద్యార్థులతో కలిసి భక్తిశ్రద్ధలతో సామూహిక సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించేతత్త్వం భారతీయుల సొంతమని, సమస్త జీవరాశికి మేలు కల్గించేది దైవ శక్తి అన్నారు. భారతీయ యోగాపై నేడు విశ్వమంతా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. మానవుడు సంఘజీవి కాబట్టి పరోపకారం అలవర్చుకోవాలన్నారు. సూర్యుడు సమస్త జీవరాశుల కోసం తన కిరణాలను ప్రసరింప జేస్తున్నాడన్నారు. అలాగే నదులు సమస్త జీవరాశికి ప్రాణాధారంగా, వృక్షాలు పరుల కోసమే ఫలించినట్లుగా మానవ జీవితం కూడా పరుల కోసమేననే పరమార్థాన్ని మరువరాదని సూచించారు. ఇన్ని ఇచ్చిన నా దేశానికి నేను ఏమి చేశానని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, సద్గురు నారాయణతీర్థులు, ఆదిశంకరులు వంటి మహనీయుల బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమస్త జగతికి సూర్యుడు వెలుగు ఇచ్చినట్లే విద్యార్థులు కూడా కష్టపడి చదివి పరిశోధనలు చేసి ఆధునిక రుషులు కావాలని కోరారు. అనంతరం మరో అతిథి జిల్లా చిన్మయా మిషన్ ఆచార్య విభాచైతన్యజీ సౌరశక్తి విశిష్టతను సోదాహరంగా వివరించారు. అన్నమాచార్య కీర్తనలను కుమారి సాయిహారిక బృందం అలపించింది. సామూహిక సూర్య నమస్కారాలు ఆహుతులను అకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు రాగయుక్తంగా చేసిన ఆదిత్య హృదయం వీనుల విందు చేసింది. కార్యక్రమంలో టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు సుబ్బారావు, వనజ, విష్ణు సహస్రనామ మండలి సభ్యులు విఠల్‌శెట్టి, సుధాకర్, పాఠశాల ప్రధానాచార్యులు బి.మీనాక్షి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది, ఫిబ్రవరి 14:మహానందిలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆదివారం రథ సప్తమి సందర్బంగా మూలవిరాట్‌లు అయిన శ్రీ కామేశ్వరిదేవి సమేత మహానందీశ్వరస్వామి వార్లకు ప్రత్యేక అభిషేకార్చనలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా వచ్చే ఈ రథసప్తమి వేడుకలను వేద పండితులు రవిశంకర్ అవధాని, శాంతారామ్ భట్‌ల వేదమంత్రాలతో చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఎఇఓ మధు, దర్మకర్తలు శివారెడ్డి, మునయ్య, బండి శ్రీనివాసులచే పూజలు నిర్వహించారు. అనంతరం రథశాల వద్దకు చేరుకుని రథాధిపతి సూర్యభగవానుడికి కలశ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మత్సవాలకు ముస్తాబు అయ్యేందుకు రథాన్ని బయటకు లాగారు. నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రారంభిస్తారు. కాగా మండలంలోని నవనందులలో ఒక క్షేత్రమైన సూర్యనందీశ్వర స్వామి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను నిర్వహించారు. రథ సప్తమి సూర్యభగవానుడికి ప్రత్యేకం కావడంతో సూర్యనందీశ్వరస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న సూర్యనందిలో పాలక మండలి, అధికారులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక వేత్త అయిన శాంభవి ఆ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వైభవంగా భద్రావతి భావనాఋషి
కల్యాణోత్సవం
నంద్యాల, ఫిబ్రవరి 14:పట్టణంలోని భద్రావతి భావనాఋషి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు వైభవంగా కల్యా ణం నిర్వహించారు. నంద్యాల పట్టణ పద్మశాలీయ సంఘం ఆద్వర్యంలో స్వామి వారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వార్ల ఉత్సవ మూర్తులను రమణీయంగా అలంకరించి వేదమంత్రాలతో వైభవంగా కల్యాణం జరిపించారు. కల్యాణదాతలుగా చెన్నా శ్రీనివాసులు దంపతులు, వాసి వెంకటస్వామి దంపతులు, శేపూరి వెంకటేశ్వర్లు, పాలపాటి శ్రీనివాసులు, మాడా శివశంకర్, కట్టా నర్సయ్య దంపతులు ఉభయ చారులుగా కల్యాణం నిర్వహించారు. పద్మశాలీయ సంఘం అధ్యక్షులు చెన్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుల భాంధవ్యాలు కల్యాణ కార్యక్రమానికి విశేష సంఖ్యలో హాజరుకావడం సంతోషదాయకమన్నారు. స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాయంత్రం స్వామి వారికి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పురవీదుల్లో స్వామి వారి రథాన్ని పద్మశాలీయులు ఉత్సాహంగా పాల్గొని మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భీమునిపల్లె వెంకటసుబ్బయ్య, పబ్బు తులసికృష్ణ, సుధాకర్, సోమా చంద్రశేఖర్, గాజుల శంకర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
కుమ్మర్లను బిసి-ఎలోకి మార్చాలి
* కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 14:కుమ్మర శాలివాహనులను బిసి-బి నుంచి బిసి-‘ఎ’ గ్రూపులోకి మార్చాలని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని బి.క్యాంపులో ఉన్న బిసి భవన్‌లో ఆదివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దయ్య అధ్యక్షతన జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుగ్గలి నాగేంద్ర, జిల్లా గౌరవ అధ్యక్షుడు పుల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ నెల్లూరులోని సిరామిక్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేసి కుమ్మర్లను ఆదుకోవాలని కోరారు. కుమ్మర్లు ఆర్థిక, రాజకీయ, విద్య తదితర రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే బిసి-ఎ గ్రూపులోకి చేర్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుమ్మర శాలివాహన సొసైటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని పుల్లయ్య డిమాండ్ చేశారు. గని గ్రామంలోని కుమ్మరి ఈశ్వరమ్మ నుంచి ప్రభుత్వం లాక్కున్న ఐదెకరాల భూమిని ఆమెకు తక్షణమే అప్పగించాలని కె.మద్దయ్య డిమాండ్ చేశారు. అనంతరం నూతన జిల్లా, నగర కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రీశైలం శాలివాహన అన్నదాన సత్రం అసోసియేషన్ అధ్యక్షుడు పిఎస్.అనంతరమణ, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కె.చిన్నరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బజారాప్ప, జిల్లా కోశాధికారి కె.బలరాముడు, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం నందికొట్కూరు, కోడుమూరు అధ్యక్షులు సుబ్బరాయుడు, కె.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి
* ఆత్మగౌరవం దెబ్బతీస్తే రాజకీయ సమాధే..
* బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఆలూరు, ఫిబ్రవరి 14:రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే సాధ్యం పడుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆ దివారం ఆలూరు మండలం మూసనహళ్ళి గ్రామంలో ప్రత్యేక రాష్ట్రం కోస ం బైరెడ్డి బస్సుయాత్ర ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అన్నివిధాలుగా అన్యాయం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర విభజన జరగక ముందే రాయలసీమను ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని విన్నవించిన కేంద్రం పెడచేవిన పెట్టిందని అన్నారు. కర్నూలుకు రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించడం వల్ల రాయలసీమకు తీర ని అన్యాయం జరిగిందని అన్నారు. కర్నాటకలో అక్రమ ప్రాజెక్టులను కడుతున్న ముఖ్యమంత్రి కేంద్రానికి ఒక్కసారైన ఉత్తరం రాశారాని బైరెడ్డి ధ్వజమెత్తారు. 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నా రాయలసీమపై పాలకులు దృష్టి సారించకపోవడం తగదన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు బస్సు యాత్ర ద్వారా వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు. ప్రతి ఒక్కరు రాయలసీమ అభివృద్ధికై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. హైకోర్టు ఏఐఎంఎస్ వంటివి కూడా గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు తరలించడం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. పక్కనే తుంగభద్ర, వేదావతి నదులు ఉన్నా తాగడానికి నీరు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. స్వార్థరాజకీయ నాయకులు ప్రతిసారి టమోట జ్యూస్ ప్యాక్టరీ కడుతామని ఆపద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రెండవ ముంబాయిగా ఉన్న ఆదోని నేడు పరిశ్రమలు మూతపడి కళావిహీనంగా ఉందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు రాఘవేంద్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తగ్గిన ఉల్లిధర..
మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు
నెల్లూరు, ఫిబ్రవరి 14: పేద విద్యార్థులకు పోషకాహారాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం తదితర కారణాలతో పథకం ఆశించిన మేర అమలు కావడం లేదు. ఫలితంగా చాలా పాఠశాలలో నాణ్యమైన భోజనం అందటం గగనమవుతోంది. విద్యార్థులకు ముద్ద అన్నం, నీళ్ల చారే గతి అవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించటానికి పథకం అమలులో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ తాజాగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు ఈ పథకాన్ని పక్కాగా పర్యవేక్షణ చేస్తే మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 2985 ప్రాథమిక పాఠశాలలు, 536 ప్రాథమికోన్నత పాఠశాలలు, 359 ఉన్నత పాఠశాలలు మొత్తం 3880 సర్కారు పాఠశాలలుండగా దాదాపు 2.6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 4.6 రూపాయలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 6.38 రూపాయల చొప్పున భోజన ఏజెన్సీ నిర్వాహకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే చాలామంది విద్యార్థులు పాఠశాలకు వచ్చిన భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటంతో తినడంలేదు. కొంతమంది ఇంటి నుండి తెచ్చుకొంటుండగా, మరికొంత మంది భోజనానికి ఇంటికి వెళుతున్నారు. పలు పాఠశాలల్లో ప్రధానోఫాధ్యాయులు, వంట నిర్వాహకులు కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల హాజరును లెక్కిస్తున్నారు. దీంతో పథక లక్ష్యం నీరుగారుతోంది. ఈనేపథ్యంలో అక్రమాలనను అరికట్టడానికి పథకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సంకల్పించింది.
నూతన నిబంధనలు ఇవీ
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని ఒక ఉఫాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పకుండా రుచి చూసి నాణ్యతను పరిశీలించాలి. వారి అభిప్రాయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుస్తకంలో భోజనం తీరుతెన్నులను నమోదు చేసి సంతకం చేయాలి. అనంతరమే భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలి. ప్రతిరోజూ తల్లిదండ్రుల్లో ఒకరు పాఠశాలకు వచ్చేలా అవగాహన కల్పించాలి. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోఫాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. ఉన్నతాధికారులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పకడ్బందీగా అమలు చేస్తే మేలు
ప్రభుత్వం అనుక్ను లక్ష్యాల మేరకు నాణ్యత చూశాకే విద్యార్థులకు వడ్డించాలన్న ఆలోచన బాగున్నా క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుందోనన్న విషయమై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉఫాధ్యాయులు పాఠశాలలోనే ఉంటారు కాబట్టి భోజనం రుచి చూస్తారు కానీ విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు ఎలా తీసుకరావాలనేది సందేహంగా మారింది. వారు నిత్యం వచ్చి పథకాన్ని పరిశీలిస్తేనే నిర్వాహకులు కూడా నాణ్యమైన వంటను వండుతారు. అయితే భోజన నిర్వాహకులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు కాకపోవటంతో పాటు నిత్యం పెరుగుతున్న ధరలకనుగుణంగా నాణ్యమైన భోజనం అందించాలంటే ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో ఒక్కో విద్యార్థికి అందించాల్సిన ఆహార పదార్థాలను కూడా ప్రభుత్వం నిర్ధేశించింది. వాటి ప్రకారం నిర్వాహకులు భోజనం అందించాలి.
జికా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ జానకి ఆదేశం
నెల్లూరు సిటీ, ఫిబ్రవరి 14: రోగ నిరోధకశక్తిని నిర్వీర్యం చేసే జికా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జానకి అధికారులను ఆదేశించారు. జికా వైరస్‌పై ఆదివారం నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాలులో జరిగిన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జికా వైరస్ ప్రాణాంతక వ్యాధి కానప్పటికి వాటి దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి డెంగ్యూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుందన్నారు. నిల్వ ఉన్న మంచినీళ్లు, పాత టైర్లు, కొబ్బరిబొండాలలో లార్వా జనించి వాటి ద్వారా వచ్చే దోమల వల్ల ఈ జికా వైరస్ వ్యాప్తి చెందుతుందని వివరించారు. బ్రెజిల్, చైనా దేశాలలో వ్యాప్తి చెందిన ఈ వ్యాధి మన దేశంలో లేదన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు పారిశ్రామిక పనులపై వచ్చే విదేశీయులను గమనించాలని ఆమె పోర్టు అధికారులను ఆదేశించారు. చర్మంపై దద్దుర్లు, ఒళ్ళునొప్పులు, ఎముకలు, కీళ్ళనొప్పులతో ప్రారంభమై తెల్లరక్త కణాలను ఈ వైరస్ నిర్వీర్యం చేస్తుందని అన్నారు. దోమల బారిన పడకుండా రక్షించుకోవడమే నివారణ మార్గమని తెలిపారు. పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, మునిసిపల్ అధికారులు సమన్వయంతో డెంగ్యూ వ్యాధి అరికట్టడంలో చేసిన కృషి ఇప్పుడు కూడా ప్రారంభించాలని ఆమె ఆదేశించారు. టాస్క్ఫోర్స్ అధికారులు, మండలస్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వరసుందరం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి
ఎమ్మెల్యే కోటంరెడ్డి ధ్వజం
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 14: నారాయణ మెడికల్ కళాశాల కోసం జిల్లాకు మణిహారమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధిని జిల్లా మంత్రి నారాయణ అడ్డుకుంటున్నారని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలోని తన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి అయిన నారాయణ తన స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 360 ఉద్యోగాలకు అవకాశం ఉన్నప్పటికీ నియమించకపోవడం ఆయన ధోరణికి నిదర్శనమని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా వెయ్యి నర్సింగ్ ఉద్యోగాల నియామకాలు జరిగాయన్నారు. అన్ని జిల్లాల్లో కలిపి 785 పోస్టులు భర్తీచేయగా, మిగతా 215 జిల్లాకు రావల్సిన పోస్టులను భర్తీచేయకుండా జిల్లా మంత్రి నారాయణ అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. 264 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ మెడికల్ కళాశాల అధికారులు ప్రభుత్వానికి సమాచారం పంపించారని అనంతరం జీవో నెంబరు 44, 53 విడుదల చేసిందన్నారు. ఆ జీవోల ప్రకారం జిల్లాకు రావల్సిన నర్సింగ్ ఉద్యోగాలు ఎవరు ఎత్తుకుపోయారని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంలో చూపిస్తున్న శ్రద్ధ జిల్లా విద్యార్థులపై ఎందుకు చూపించడం లేదని ఆయన నిలదీశారు. ఇలాంటి మంత్రి వల్ల జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో జరుగుతున్న ఘోరాలను బయటకు రానివ్వకుండా అధికారబలంతో అణగదొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని సంవత్సరాలపాటు పోరాటం చేసి జిల్లాకు తెచ్చుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేయాలని మంత్రి నారాయణ ధృడసంకల్పంతో ఉన్నారని ఆయన అన్నారు. ఎవరిమీద బురద చల్లవల్సిన అవసరం తనకు లేదని, పక్కా ఆధారాలతో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను చూసి మాట్లాడుతున్నానని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలను అన్నివిధాల అభివృద్ధి చేయాలని, లేనిపక్షంలో భారీస్థాయిలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు
వేదాయపాళెం, ఫిబ్రవరి 14: రథసప్తమి పండుగను పురస్కరించుకొని నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ స్వామివారు సూర్యప్రభ వాహనంపై నేత్రపర్వంగా ఊరేగారు. సాయంత్రం శ్రీ్భదేవి శ్రీదేవి సమేత శ్రీస్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నదీస్నానాలు ఆచరించి పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. ఈకార్యక్రమాలను ఆలయ ఇఓ శ్రీనివాసులరెడ్డి, ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు పర్యవేక్షించారు.
మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి
నెల్లూరు, ఫిబ్రవరి 14: నగరంలో ఓ హోటల్‌లో పనిచేస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు స్థానిక హరనాథపురం ప్రాంతానికి చెందిన కామాక్షమ్మ (37) కొంతకాలంగా ఆచారివీధిలోని ఓ ప్రముఖ హోటల్‌లో స్వీపర్‌గా పని చేస్తోంది. ఆదివారం తన విధులకు వచ్చిన ఆమె హోటల్‌లోని పైఅంతస్తులో శుభ్రం చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురై హఠాత్తుగా పడిపోయింది. ఇది గమనించిన హోటల్ సిబ్బంది ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించే క్రమంలో సదరు మహిళ మృతదేహంపై గాయాలు కనిపించడంతో ఆమె మృతిపై అనుమానంతో బంధువులు ఆమె పనిచేస్తున్న హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయాన్ని తెలుసుకున్న నాలుగో నగర సిఐ సీతారామయ్య ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని మహిళ మృతిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలపటంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రధాన వైద్యశాలకు తరలించి నాలుగో నగర పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా శ్రీవారి కల్యాణం
వేదాయపాళెం, ఫిబ్రవరి 14: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్డులో గల నారాయణ హైస్కూలు ఎదుటనున్న ప్రాంగణంలో అత్యంత వైభవంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించారు. దేవస్థానం నుండి విచ్చేసిన అర్చకులు విష్ణువర్థన్ బృందం వేదపఠనం, విష్వక్సేన ఆరాధన కల్యాణ హోమం, అన్నమాచార్య సంకీర్తనల మధ్య వేడుకగా జరిగింది. సుమారు రెండు వేల మంది దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణం అనంతరం స్వామివారికి పండితులు శ్రీ శ్రీనివాస గద్యం చదివి సంతృప్తిపరిచారు. భక్తులకు మహాప్రసాదం వితరణ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
ఆత్మకూరు ఎండిఓపై అధికారపార్టీ నేతల ఆగ్రహం
ఆత్మకూరు, ఫిబ్రవరి 14: ఆత్మకూరు ఎండిఓ ఏ నిర్మలాదేవిపై సాక్షాత్తు అధికార పార్టీ నేతల నుంచి అసంతృప్తి పెల్లుబికింది. ఆదివారం ఉదయం తెలుగుదేశంపార్టీ ఆత్మకూరు పట్టణ, రూరల్ మండలశాఖల నెలవారీ సమావేశాల్ని నిర్వహించారు. పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భాగంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అమలుతీరులో ఆత్మకూరు ఎండిఓ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. వయోవృద్ధులు మరెవరిపైనా ఆధారపడకుండానే ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేలా ప్రభుత్వం ప్రవేశపెడితే అనర్హులకు, అందునా వైఎస్‌ఆర్‌సి శ్రేణులు సూచించిన వారికి పింఛన్లు అందుతున్నాయన్నారు. అదే అర్హులైనా తాము చెపితే మాత్రం మంజూరు కావడం లేదని వాపోయారు. అర్హులై పింఛన్లు పొందని అభాగ్యులకు లబ్ధి చేకూరేలా పార్టీ తరపున తోడ్పాటు అందిద్దామని ప్రయత్నిస్తుంటే ఎండిఓ గుదిబండలా మారారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు, పార్టీ నేతలుగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నా ఎండిఓ వైఖరి వల్ల ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నట్లు వాపోయారు. ఈ సమస్యను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూటూరు కన్నబాబు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సమావేశంలో టిడిపి ఆత్మకూరు పట్టణ శాఖ అధ్యక్షులు, పార్టీ మున్సిపల్‌పక్ష నేత తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఉప చైర్మన్ చండ్రా వెంకటసుబ్బయ్య, పార్టీ రూరల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దావా పెంచలరావు, గొర్ల రవి, మహిమలూరు నాయకులు వల్లూరు రమణారెడ్డి, మద్ది నారాయణ, తెలుగుమహిళ మండల అధ్యక్షురాలు రమణమ్మ, ఎల్వీ రమణయ్య, , మండలపార్టీ ఉపాధ్యక్షులు మోహనరెడ్డి, కౌన్సిలర్ ఖాదర్‌బాషా, మండల పార్టీ మైనారిటీ అధ్యక్షులు చాంద్‌బాషా, ప్రధాన కార్యదర్శి నజీర్, బిసిసెల్ మండల అధ్యక్షులు ఉంటా దొరస్వామియాదవ్, యువత అధ్యక్షులు జనార్ధననాయుడు, యస్దానీ, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఓటర్ల సవరణ జాబితాపై ప్రభుత్వం దృష్టి
ఒంగోలు,్ఫబ్రవరి 14: రాష్ట్ర ఎన్నికల సంఘం ఒంగోలు నగరంలోని మున్సిపల్ ఓటర్ల జాబితా సవరణపై దృష్టిసారించిన నేపధ్యంలో త్వరలో ఎన్నికలకు శ్రీకారం చుడతారన్న ప్రచారం ప్రధాన రాజకీయపక్షాల్లో జోరుగా సాగుతుంది. ఏప్రిల్ 11న ఓటర్ల జాబితాను ముద్రించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్‌ను ఆదేశించిన నేపధ్యంలో జిల్లాయంత్రాంగం ఓటర్ల జాబితా సవరణలో ఇక నుండి మునిగి తేలనుంది. ఈ నేపధ్యంలో ఓటర్ల జాబితా సవరణలపై ప్రధాన రాజకీయపక్షాల నేతలు ఇప్పటి నుండే దృష్టిసారించే అవకాశాలున్నాయి. ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ పూర్తిఅయిన వెంటనే ఒంగోలు నగర కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలుండటంతో ప్రధానరాజకీయపక్షాలకు సవాల్‌గా మారనున్నాయి. తొలిసారిగా ఏర్పడే పాలకవర్గానికి ఎస్‌సి మహిళా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం ఒంగోలు నగరమేయర్ ఎస్‌సి మహిళా కేటగిరికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఎస్‌సి మహిళల కోసం ప్రధానరాజకీయపక్షాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈపాటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరుపున జిల్లా వైకాపా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశంపార్టీ పక్షాన పేరు వెల్లడికావాల్సి ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీతో బిజెపి మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొన్ని కార్పొరేటర్లను ఆ పార్టీకి తెలుగుదేశంపార్టీ అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరపున మేయర్ అభ్యర్థిని, పూర్తిస్థాయిలో కార్పొరేటర్లను రంగంలోకి దించుతుందో లేదో వేచిచూడాల్సి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఘోరపరాజయంపాలైన సంగతి విధితమే. అప్పటి నుండి జిల్లాలోనే కాకుండా ఒంగోలు నగరంలోను కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొననుంది. కాగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ నగరాభివృద్ధి ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో సమస్యకాని డంపింగ్ యార్డు సమస్యను తీర్చి నగరాన్ని సుందరంగా తీర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్ పరిధిలోని పనులను సైతం తన అనుంగ శిష్యులకు ఇప్పించటంలోనూ సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. గుండ్లకమ్మ నుండి తాగునీటిని నగరప్రజలకు తీసుకువచ్చే విషయంలోను దామచర్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోని 50డివిజన్లల్లోను పార్టీకి సంబంధించి కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలకు ఎప్పటికప్పుడు దామచర్ల దిశనిర్దేశం చేయటం జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికలసంఘం ఎన్నికల షెడ్యూలు తేదీలను ప్రకటిస్తే రాష్ట్రంలోని మంత్రులు, పార్లమెంటుసభ్యులు, శాసనసభ్యులందరు ఇక్కడే తిష్టవేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఒక్కొక్క డివిజన్‌కు ఒక్కొక్క మంత్రి లేదా ఎంపిలు, శాసనసభ్యులను నియమించే అవకాశం ఉంది. తొలిసారిగా జరిగే నగర ఎన్నికలను దామచర్ల ప్రతిష్టాత్మాకంగా తీసుకోవటంతో అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. దీనికితోడు దామచర్లకు తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలు నగరంలోని ప్రజలతోసన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మాగుంట రాఘవరెడ్డి ఛారిటబుల్ ట్రస్టు తరపున ప్రతిరోజు వందలాదిమందికి మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని ఉచితంగా సరఫరా చేయటం జరుగుతుంది. లోతట్టుప్రాంతాలకు చెందిన ప్రజలకు నిత్యం ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో ఆప్రాంతాల్లో మాగుంట కుటుంబం పట్ల సానుభూతి ఉందనే చెప్పవచ్చు. మొత్తంమీద ఎన్నికలు జరిగితే తమపార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడకేనన్న ధీమాలో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం.
ఇదిఇలాఉండగా తొలిసారిగే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో తమపార్టీ జెండాను ఎగురవేయాలనే తలంపుతో ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత బాలినేని తన మకాంను హైదరాబాదుకు మార్చటం జరిగింది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమైన పనుల నిమిత్తం మాత్రమే బాలినేని ఒంగోలుకు వచ్చి వెళ్తున్నారు. కాగా నగర ఎన్నికల షెడ్యూలువిడుదల చేసిన తరువాత బాలినేని ఒంగోలు నగరంలో పూర్తిస్ధాయిలో తిష్టవేస్తే ఎలా అని ముందుగానే నగరంలోని అన్ని డివిజన్లల్లో పర్యటించాలి కదా అని కొంతమంది వైకాపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాత్రం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై దృష్టిసారిస్తునే ఉన్నారు. ముఖ్యంగా వైకాపానాయకులు,కార్యకర్తలకు ఆరోగ్యబాగా లేకపోయినా వారిని ఆసుపత్రుల వద్దకు వెళ్ళి పరామర్శించటంపై ఆయనకు పార్టీలోని నాయకులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి హోదాలో సుబ్బారెడ్డి ఉండి కూడాతమ ఆరోగ్యక్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారన్న సంతోషంలో వైకాపా నేతలు ఉంటున్నారు. ఈవిషయాలు వైవికి పెద్దప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒంగోలు నగరానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే సుబ్బారెడ్డి, బాలినేని సంయుక్తంగా రంగ ప్రవేశం చేస్తేనే పార్టీ మనుగడ సాధ్యవౌతుందని ఆ పార్టీకి చెందిన నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తంమీద నగర కార్పోరేషన్‌కు తొలిసారిగా జరిగే ఎన్నికలు ప్రధానరాజకీయపక్షాలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీల నేతలకు అగ్నిపరీక్షగా మారనున్నాయి.
మార్కెట్ కమిటీల నియామకానికి
కాలయాపన ఎందుకో..?
* తెలుగు తమ్ముళ్ల ఆవేదన
మార్కాపురం, ఫిబ్రవరి 14: మార్కెట్ కమిటీల నియామకంలో తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం ఎందుకు కాలయాపన చేస్తుందో అర్థం కావడం లేదని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోనికి వచ్చి 20 నెలలు పూరె్తైనా కమిటీల నియామకానికి అధిష్ఠానం దృష్టి సారించకపోవడం అన్యాయమని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. మార్కాపురం డివిజన్‌లోని గిద్దలూరు, యర్రగొండపాలెం, పొదిలి, స్వయాన రాష్టమ్రంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు నియోజకవర్గంలోని దర్శి మార్కెట్‌యార్డుల నియామకంలో జాప్యం జరుగుతున్నప్పటికీ స్థానిక నేతలు కూడా పట్టించుకోవడం లేదని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మార్కెట్‌యార్డు అధ్యక్ష పదవికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి శ్రావణి వెంకటేశ్వర్లు పేరు ప్రతిపాదించగా పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కోసం కష్టపడిన గుడిపూడి భాస్కర్ ఈ పదవిని ఆశిస్తూ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం ఢిల్లీలో ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. గిద్దలూరు మార్కెట్‌యార్డు అధ్యక్ష పదవి కోసం పలు సామాజికవర్గాలకు చెందిన నేతలు పోటీ పడటంతో ఎవరికి ఇస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న భయంతో టిడిపి ఇన్‌ఛార్జి ఎవరిపేరును ప్రతిపాదించకపోవడం విశేషం. మంత్రి నియోజకవర్గ పరిధిలోని దర్శి మార్కెట్‌యార్డుకు కూడా మంత్రి శిద్దా సామాజిక వర్గాలకు న్యాయం చేయకపోతే ఇబ్బంది వస్తుందని భావించి పేరును ప్రతిపాదించడంలో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో అజితరావు ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో పలువురి పేర్లను పరిగణలోనికి తీసుకొని ఒకరి పేరు ప్రతిపాదించాలనుకునే సమయంలో ఆమెను ఇన్‌ఛార్జిగా తొలగించడం, ఆ స్థానంలో త్రిసభ్య కమిటీని వేయడం, అనంతరం త్రిసభ్య కమిటీ నలుగురికి లేఖ ఇవ్వడం, దీనితో వైశ్య సామాజికవర్గానికి చెందిన గోళ్ల సుబ్బారావు ఈ లేఖను అడ్డుపెట్టుకొని కమిటీ ఏర్పాటుకు ప్రయత్నించడం, చివరి సమయంలో ఆ విషయం బయటపడటంతో ఆశావాహుల్లో కొందరు వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అధిష్ఠానానికి స్థానిక నేతలు పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపకపోవడం, ఒకటి రెండుచోట్ల పంపినప్పటికీ కొన్ని ఆరోపణలు రావడంతో అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని పలువురు టిడిపి నేతలు అంటున్నారు. ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే నియామకాలను భర్తీ చేసి ఉంటే మరో రెండేళ్లు మరికొందరికి అవకాశం లభించి ఉండేదని, పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి అధికారంలోనికి వచ్చినా ఫలితం లేకపోవడంతో పార్టీ తీరుపై నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నేను టిడిపికి చెందినవాడినే!
తనను సస్పెండ్ చేసే అధికారం ఎవరికిలేదు
నూకసాని సీటు విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరించా
జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర వెల్లడి
ఒంగోలు,్ఫబ్రవరి 14: తాను తెలుగుదేశంపార్టీకి చెందినవాడినేనని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు వెల్లడించారు. ఆదివారం తన క్యాంపుకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను తెలుగుదేశంపార్టీకి చెందినవాడినేనని తనను తెలుగుదేశంపార్టీ నుండి సస్పెండ్ చేసే అధికారం ఏవరికి లేదన్నారు. తెలుగుదేశంపార్టీ నుండి మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా అన్న పాత్రికేయులు అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశంలో జిల్లా వైస్ చైర్మన్ నూకసాని బాలాజి సీటు విషయంలో తాను చట్టబద్ధంగానే మాట్లాడినట్లు తెలిపారు. జిల్లా,మండల పరిషత్ సమావేశాల్లో సీటింగ్ ఏర్పాటు ప్రభుత్వం జారీచేసిన సూచనలకు కొనసాగింపుగా సాధ్యమైనచోట పార్టీలవారీగా సీటింగ్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆ ప్రకారమే సీట్లను సమావేశంలో ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అయితే జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ నూకసాని ముందువరసలో కూర్చోవటంలో తాను ఆవిధంగా మాట్లాడాల్సివచ్చిందని అయితే నూకసాని తనకు వ్యక్తిగత కక్షలేదన్నారు. తాను జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కారుఖర్చు అయితేనేం ఇతరత్రఖర్చులు బాగా తగ్గించుకోవటం జరిగిందని ఆయన వివరిస్తూ నూకసాని బాలాజి చైర్మన్‌గా ఉన్న సమయంలోను అదేవిధంగాను తాను బాధ్యతలు తీసుకున్న తరువాత ఉన్న ఖర్చు వత్యాస్యాన్ని కూడా ఆయన వివరించారు. అదేవిధంగా అప్పట్లో ఉన్న జడ్‌పి సిఇఒ ప్రసాదు హయాంలోను ప్రస్తుతం తన హాయంలోపనిచేస్తున్న సిఇఒ బాపిరెడ్డి హాయంలో ఏమేరకు ఖర్చుపెట్టిందన్న వత్యాసాలను కూడా పాత్రికేయులకు వివరించారు. తాను నీతినిజాయితీగా పనిచేస్తూ అధికారులు అదేవిధంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి
- ఎంపి మాల్యాద్రి
పంగులూరు, ఫిబ్రవరి 14: రామకూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి జరుగుతుందని బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రి అన్నారు. రామకూరు గ్రామాన్ని ఎంపి దత్తత తీసుకున్న నేపధ్యంలో ఆదివారం గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒంగోలు ఆర్డీఒ కె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపి మాట్లాడుతూ గత సమీక్షా సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ముందుకు సాగాలన్నారు. అందుకు ప్రజాసహకారం కూడా అవసరమన్నారు. గ్రామంలో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రికార్డులకు, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాల్లో చెప్తున్న అంకెలు పొంతన లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కచ్చితమైన సమాచారం అందించకుంటే గ్రామాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఆర్డీఒ కలుగజేసుకుని మార్చి నాటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. రామకూరు, వలపర్ల రహదారి అధ్వాన్నంగా ఉందని, చాలా కాలంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్ మానం సుబ్బారావు, హరిబాబు ఎంపి దృష్టికి తెచ్చారు. ఆర్‌అండ్‌బి అధికారులు ఎక్కడ అని అడిగిన ఎంపి ఆ శాఖ అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి సమగ్ర నివేదికనివ్వాలని పంచాయతీ రాజ్ అధికారులకు అదేశించారు. గ్రామంలో 70 అంతర్గత రహదారులున్నాయని, వాటికి సైడు కాలువలతో సహా నిర్మాణానికి రూ.5.75కోట్ల ఖర్చుతో అంచనాలు తయారు చేసినట్లు అధికారులు ఎంపికి నివేదిక ప్రతిని అందించారు. గ్రామంలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సేవలందించాలని డాక్టర్ ప్రమోద్‌కు సూచించారు. గ్రామంలో ఎస్సీ, బిసిలకు నివేశన స్థలాలు కావాలని సర్పంచి త్రివేణి, ఎంపిటిసిలు రామయ్య ఎంపిని కోరారు. త్వరలో సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ, స్థానిక తహశీల్దార్ నిర్మలను ఆదేశించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపిడిఒ శ్యాంప్రసాద్ ఎంపికి నివేదిక సమర్పించారు. సమావేశంలో అద్దంకి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కరణం వెంకటేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు తప్పని పాట్లు
ఆదిత్యా.. మన్నించు.. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం భక్తుల పాలిట శాపంగా మారి పిల్లలు, వృద్ధులు, వికలాంగులు పాపం ఇబ్బందులకు గురయ్యారు. పైన ఎండవేడిమి, తాగుదామంటే నీటిచుక్క లేదు. నీరు అందించే నాధుడు కింద కానరావడం లేదు. వెనక్కు వెల్దామంటే కిలోమీటర్ల నిడివి క్యూలైన్లు నిండుకున్నాయి. దైవ దర్శనానికి గంటల కొలది సమయం పట్టడంతో సొమ్మశిల్లి పోతున్నా కనీసం ఆదరించే వారే కరువైనారు. ఇంతటి దారుణం చరిత్రలో చూడలేదు. అయినా యంత్రాంగాన్ని కరుణించు..్భవిష్యత్‌లోనైనా ఇటువంటివి జరగకుండా దీవించు.. ఇవీ ఆరోగ్య ప్రధాత ఆదినారాయణుడు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలకు విచ్చేసిన భక్తుల ఉవాచ. ఆదివారం నాడు రథసప్తమి వేడుకల్లో ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంలు ఎవరికి వారు వేర్వేరుగా గత కొద్దిరోజులుగా రథసప్తమి వేడుకల పట్ల యంత్రాంగంతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కానరానీయకూడదని పదే పదే చెప్పడం మినహా ఆచరణలో మాత్రం కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు యంత్రాంగం మొత్తం ఘోర వైఫల్యం చెందింది. దీంతో ఆదిత్యుని తనివితీరా దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులు ఆలయ ఆవరణలోనే యంత్రాంగం తీరుపట్ల దారుణాతి దారుణంగా తిట్లు, దీవెనలతో దుమ్మెత్తి పోసారు. శనివారం అర్థరాత్రి నుంచి క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు ఆదివారం ఉదయం ఆరు గంటలైనా ఆదిత్యుని దర్శనం కానరాక సొమ్మశిల్లారు. పగటి పూట అయితే మరీ దారుణం, చెప్పనలవి కానిరీతిలో పోలీసు అయితే చాలు వివిఐపి అన్న రీతిలో వ్యవహరించిన తీరు ఎమర్జెన్సీని తలపించింది. ఓ పక్క ప్రజాప్రతినిదులు వారివెంట వందల మందిని వెంటేసుకురావడం, మరోపక్క పోలీసులు హోంగార్డు నుంచి సిఐ స్థాయి వరకు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులను, బంధువులను డజన్ల కొద్దీ వివిఐపిలుగా సాగనంపడంతో క్యూ లైన్లలో వేచివున్న భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఒక్కో క్యూ లైను సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల మీర ఉందంటే వారి పరిస్థితి చెప్పనలవి కాదు. ఇదిలావుంటే పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని చెప్పిన జిల్లా కలెక్టర్ మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. కనీసం మంచినీటి ప్యాకెట్లు సైతం అందించలేకపోయారంటే యంత్రాంగం పనితీరు ఏపాటిదో బేరీజు వేసుకోవచ్చు. దీనిపై ఆలయ ఈవో శ్యామలాదేవిని కొంతమంది వ్యక్తులు నిలదీస్తే 500 బస్తాలు తెచ్చామని చెప్పారు. అయితే ఆ బస్తాలను భక్తుల చెంతకు మాత్రం చేరవేసేందుకు పోలీసులు మోకాలడ్డారు. ఇదీ అధికారుల మద్య సమన్వయం. దీనిపై ఇదేనా యంత్రాంగం భక్తులకు కల్పించిన సదుపాయాలు అంటూ క్యూలైన్లలో వేచివున్న వృద్ధులు, పిల్లల కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని తిట్లు, దీవెనలతో దుమ్మెత్తిపోసారు. ఒకానొక సమయంలో భక్తుల ఆగ్రహాన్ని అదుపుచేయడం పోలీసులకు సాధ్యం కాదనిపించింది. ఈ పరిస్థితిలో జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి కొంతమేర వివిఐపిలను రానీయకుండా చేయగలిగారు. అయినప్పటికీ ఇటువంటి సమయంలో సైతం పోలీసు, రెవెన్యూ, జుడీషియల్ సిబ్బంది తమతమ కుటుంబ సభ్యులను, బంధువులను ప్రత్యేక క్యూ లైన్లలో దర్శనం కోసం తీసుకువెల్లడం విశేషం. కాగా విధులు నిర్వర్తించాలనుకునే మీడియాను భక్తులు అధికంగా ఉండే క్యూ లైన్లలో పంపించేందుకు అక్కడి యంత్రాంగం ప్రయత్నించడం ఒకింత ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనిపై పోలీసులను మీడియా నిలదీయగా, కసురుకోవడం మినహా పరిస్థితిలో మార్పుకానరాలేదు. దేశంలోనే కోణార్క్ తరువాత ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం చరిత్రలో, ఇంతటి దారుణంగా యంత్రాంగం వైఫల్యం చెందడం కానరాలేదని భక్తులు అనేక మంది విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా పసగాడ సూర్యనారాయణ మిల్లు కూడలి నుంచి ట్రాపిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వారి సిబ్బందికి మాత్రం దేవాలయ ముఖద్వారం వరకు ఎటువంటి ఆంక్షలు లేకపోవడం విశేషం. ఆఖరుకు పోలీసుల తీరు ఎంతలా ఉందంటే విధులు నిర్వహించాలనుకునే సిబ్బందిని సైతం లోపలికి పోనీకుండా అడ్డుకున్నారంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనిపై అధికారులు చెబుతున్న వాదన మరోలా ఉంది. అంచనాకు మించి భక్తులు వచ్చారన్నది వారి వాదన. ఇదే నిజమనుకుందాం. అయినప్పటికీ, గోదావరి పుష్కరాలు, మహోదయంలో బాగంగా కళింగపట్నం ఘటనలపై వారు అనుభవ పాఠాలు నేర్చుకోపోవడం వారి వైఫల్యం కాదా అన్నది ప్రశ్న. అంచనాలకు మించి భక్తులు దర్శనాలకు విచ్చేస్తారని ముందుగా అందరూ ఊహించిందే, ఈ మేరకు భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ యంత్రాంగం తప్పిదమే. దీనిపై ఎవరు ఏమనుకున్నా దేవాదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ అధికారుల మద్య సమన్వయం లేకపోవడం కూడా యంత్రాంగం వైఫల్యానికి కారణం. ఎవరికి వారు పొరపొచ్చాలకు పోకుండా భక్తులకు ఆధిత్యుని దర్శన భాగ్యం సజావుగా కలిగించే రీతిలో భవిష్యత్‌లోనైనా ఇటువంటి అనుభవాలనుండి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది.
ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: ఆరోగ్య ప్రధాత ఆదిత్యుడని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రధసప్తమి పర్వదినాన్ని పురష్కరించుకొన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని సతీసమేతంగా ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈసందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ ముఖద్వారం నుండి ఆలయ గర్భగుడి వరకు వేదమంత్రాలు, ఆలయ మర్యాదలతో, పూర్ణకలశంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనివెట్టి మండపం వద్ద గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వామివారి విశిష్టతను తెలియజేయగా జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.శ్యామలాదేవి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు. ఈసందర్భంగా గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఏకైక దైవం శ్రీసూర్యభగవానుడని పేర్కొన్నారు. అరసవల్లిలోగల శ్రీసూర్యనారయణస్వామి క్షేత్రం మహాపుణ్యక్షేత్రమని కొనియాడారు. స్వామివారిని పూజించడం ద్వారా సర్వరోగాలు నివారణ అవుతాయని అటువంటి మహిమగల దైవమైన శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకోవడం ద్వారా చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనతోపాటు ముఖ్యకార్యదర్శి ఎస్ రమేష్ దంపతులు, హెచ్ ఆర్డి డైరెక్టర్ జనరల్ చక్రపాణి సతీమణి, ఎస్పీ ఎఎస్‌ఖాన్, డిఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్డివో దయానిధి తదితరులు పాల్గొన్నారు.
ఆటో-బస్సు ఢీ : ఇద్దరు మృతి
పాలకొండ(టౌన్), ఫిబ్రవరి 14: మండలం వెలగవాడ పంచాయతీ సిరికొండ గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసరావు ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట మండలం బుడ్డుగూడ, తొత్తడి గ్రామాలకు చెందిన గిరిజనులు బూర్జ మండలం లక్కుపురంలో ఒక బంధువు ఇంటికి శుభ కార్యాయానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సీతంపేట- పాలకొండ రహదారిలో సీతంపేట నుంచి పాలకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జుకాగా బుడ్డుడు గూడ గ్రామానికి చెందిన సవర జమ్మయ్య (25), గొయిది గ్రామానికి చెందిన సవర సన్నాయి (42) అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పెట్టారు. వీరితోపాటు ప్రయాణిస్తున్న సవర చంద్రరావు, గంగయ్య, సవర తుంబలి, నర్సమ్మ, వసంతరావు ( అనేబాలుడు), ఇప్పమానుగూడకు చెందిన సవర శిమ్మయ్యలు గాయపాలకాగా, వీరిలో తుంబలి, గంగయ్యలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. ప్రమాదం జరిగిన విషయంపై స్థానికులు గుర్తించి 108 వాహానానికి సమాచారమివ్వడంతో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఆటో డ్రైవరు సవర రామారావుకు కూడా గాయాలు కావడంతో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు డ్రైవరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
* ఏజెన్సీలో విషాధం
సీతంపేట మండలం మండ పంచాయతీ సరిహద్దు గూడ గ్రామానికి ముగ్గురు గిరిజనులు రెండ్రోజుల కిందట జరిగిన ట్రాక్టరు బోల్తా ప్రమాదంలో మృతి చెందారు. ఇంకా ఆ ఘటన మరువక ముందు సిరి కొండ మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు గిరిజనులు మృతి చెందటం ఏజెన్సీలో విషాధ అలముకుంది. ఈ ప్రమాదానికి రెండు వివాహనాలు అతి వేగం కారణమని, అలాగే మలుపు వద్ద పలు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆర్ అండ్‌బి అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సంఘటన వద్ద ఆటో నుజ్జుకావడం, మృతి చెందిన వారి దేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో చూసిన వారికి ప్రమాద తీవ్రత అర్థవౌతుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భక్తులతో కిటకిటలాడిన అరసవల్లి
పాతశ్రీకాకుళం, ఫిబ్రవరి 14: శ్రీ ఉషా పద్మినీ ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంత్యుత్సవం (రథసప్తమి)ను సూర్యనారాయణా...వేదపారాయణా అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. భానుడికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం రథసప్తమీ కావడంతో లక్షలాదిగా భక్తులు స్వామి నిజరూపదర్శనం కొరకు తరలివచ్చారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సూర్యనారాయణస్వామివారి మహాక్షీరాభిషేకం సేవను ప్రారంభించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పానకం వంటి పంచామృతాలే కాకుండా వివిధ రకాల ఓషధులు,పళ్ళ రసాలు, సముద్రజలాలతో అత్యంత వైభవంగా క్షీరాభిషేకం కొనసాగింది. స్వామివారి నిజరూపాన్ని కన్నులారా వీక్షించి భక్తజనం భక్తిపారవశ్యం చెందారు. అనంతరం స్వరూపానందేంద్రస్వామి మాట్లాడుతూ రధసప్తమి నాడు స్వామి వారిని దర్శించుకొన్నవారికి పునర్జన్మ ఉండదన్నారు. ఈ ఏడాదిలో ఉన్న సర్పదోషాల కారణంగా రాష్ట్రంలో ఒడిదుడుకులు ఏర్పడతాయన్నారు. ప్రత్యక్షనారాయణుని దర్శించుకొనేందుకు మంత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సాంప్రదాయ దుస్తులతో తరలివచ్చారు. రాష్టక్రార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సూర్యభగవానిని దర్శించుకొని భక్తులు పునీతులు కావాలన్నారు. రాష్టమ్రంతటా ఆరోగ్యంగా ఉండాలంటే అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి అనుగ్రహం కావాలన్నారు. అందుకు అందరూ ఆయన నిజరూపం దర్శించుకోవాలన్నారు. ఆలయాన్ని మరింతగా అభివృధ్ది చెందేలా కృషి చేస్తామన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ఎక్కడాలేని సూర్యదేవాలయం మనజిల్లాలోనే ఉందని, అంతటి ఆలయ విశిష్టతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గతంలో జిల్లా చుట్టుపక్కలవారు మాత్రమే వచ్చేవారని, కానీ ఇప్పుడు వివిధ జిల్లాలనుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకొనేందుకు వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ రధసప్తమీ నాడు సూర్యభగవానుని దర్శనం మహద్భాగ్యమన్నారు. శ్రీకాకుళం శాసనసభ సభ్యురాలు గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.అప్పారావు మాట్లాడుతూ దేవాదాయశాఖతో పాటు పోలీసుశాఖ చక్కటి ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్ డా.పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ భక్తులు ప్రశాంత మనస్సుతో స్వామి దర్శించుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ ఎన్నో పురాణాలలో ఆలయ విశిష్టతను తెలియచేశారని అంతటి పురాతన ఆలయం మన జిల్లాకు చెందడం అదృష్టమన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రోజు ప్రారంభంలోనే కాకుండా చివరివరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్, అరసవల్లి దేవస్థానం ఇ.ఒ శ్యామలాదేవి మాట్లాడుతూ రూ. 216 క్షీరాభిషేకం టిక్కెట్లను రెండేవేల పైగానే విక్రయించామని తెలిపారు.
న్యాయమూర్తులు పద్మావతి, సాయిసుధ, శ్రీనివాసరావు, నాగమణి, సోంపేట సీనియర్ సివిల్ జడ్జి బబిత, ఏలూరు మెజిస్ట్రేట్ ఉషాసింగ్, డి. ఐ.జి రవిచంద్ర, విజయనగరం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ, గొర్లె హరిబాబు, శాసనసభ సభ్యురాలు కళావతి, బగ్గు రమణమూర్తి తదితరులు స్వామి వారిని దర్శించుకొన్నారు. ఇక అర్ధరాత్రి నుంచే ఇంద్రపుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. వేకువఝూమున ముందు గంటల నుంచే భక్తులు పుష్కరిణిలో స్నానాలను ఆచరించి భానుడికి అర్ఘ్యలను వదిలి నమస్కరించారు. పిడకలతో మట్టికుండల్లో పాలు పొంగించి పరమాన్నం చేసి సూర్యనారాయణుడికి నివేదన చేసి జంగమదేవరుల దీవెనలు పొందారు.
శ్రీముఖలింగానికి పోటెత్తిన భక్తులు
జలుమూరు, ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగం మధుకేశ్వర పంచాయతన దేవుళ్లను భక్తులు ఆదివారం దర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుండి పలు ప్రాంతాలనుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగాణ కిటకిటలాడించి. ప్రధానాలయం గర్భగుడిలో కొలువైయున్న సూర్యనారాయణస్వామిని భక్తులు క్షీరాభిషేకాన్ని చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వారాహి అమ్మవారిని, నారాయణస్వామి(వెంకటేశ్వర)కి పూజలు నిర్వహించారు. అర్చకులు రామ్మూర్తి, శ్రీకృష్ణలు భక్తులకు దాని ప్రాధాన్యతను వివరించారు.
ఇంద్ర పుష్కరణి వద్ద పూజలు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 14: రధసప్తమి వేడుకను పురస్కరించుకొని శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు ఇంద్రపుస్కరిణి వద్ద పూజలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. ఆదిత్యునికి అతి ప్రీతికరమైన రోజు ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ జిల్లాలు, ఒడిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందు పూజలు నిర్వహించారు. పితృదేవతలను సంతృప్తిపరిచేలా ఆవుపేడ పిడకలతో మట్టికుండలో పొంగలి తయారుచేసి ఆముదం ఆకులలో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లిచేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. అలాగే జంగమ దేవరులకు కానుకలు ఇచ్చి పొగిడించుకునేందుకు కూడా భక్తులు క్యూకట్టారు. ఈ పూజలతో ఇంద్రపుష్కరిణీ పరిసరాలు కిటకిటటలాడాయి. భక్తులుపూజాసామాగ్రికి ధరను పెంచి చిరువ్యాపారులు సొమ్ముచేసుకోవడం కనిపించింది.
టిటిడి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు
బలగ, ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కరబట్ల శ్రీరాంమూర్తి పర్యవేక్షణలో ఆధిత్య హృదయం, సూర్య నమస్కారా ప్రాసస్త్యం గూర్చి ప్రసంగించారు. అనంతరం యోగా గురువు రామారావు వారిచే సూర్యనమస్కారాలు చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా, సాయికృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కు అప్పన్న, ధర్మ ప్రచార పరిషత్ మండలి ఉపాధ్యక్షులు బరాటం కామేశ్వరరావు, టిటిడి మాజీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ అధికారి రుంకు అప్పారావు, అంబేద్కర్ యూనివర్శిటీ అద్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
సాహిత్యం పట్ల మక్కువకు తార్కాణం కథానిలయం
* రచయిత రామతీర్ధ
పాతశ్రీకాకుళం, ఫిబ్రవరి, 14: సాహిత్యం పట్ల మక్కువకు కథానిలయం తార్కాణంగా నిలుస్తుందని రచయిత రామతీర్ధ అన్నారు. నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆదివారం కథానిలయ 19వ వార్షికోత్సవ ముగింపుకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడెక్కడి కథలనో సేకరించి వాటికి ఒక నిలయాన్ని కల్పించిన ఘనత కాళీపట్నం రామారావుకే దక్కిందన్నారు. సాహిత్యం పట్ల ఆయనకున్న మక్కువకు తార్కాణంగా కథానిలయం నిలుస్తుందని ఆయన చెప్పారు. అనంతరం రచయిత కాళీపట్నం రామారావు మాట్లాడుతూ ఎందరో రచయితల కధల కారణంగానే కథానిలయ స్థాపన జరిగిందన్నారు.దీనిని మరింతగా అభివృద్ధి చెయ్యాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయితలు బి.వి. ఎ.రామారావు నాయుడు,దాసరి అమరేంద్ర, దాసరి రామచంద్రరావు, చింతాడ రామారావు, జి.వి.నాయుడు,జి.గౌరీనాయుడు పాల్గొన్నారు.
అనాథలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: అనురాగ నిలయాల్లో ఉన్న చిన్నారులు అనాథలు కాదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం పట్టణంలోగల శాంతా అనురాగ నిలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఇక్కడ చిన్నారులతో భగవద్గీత చదివించి ఎంతో ఆనందించారు. ఈ చిన్నారులను ఎవ్వరూ అనాదులు అని అనవద్దని హితవుపలికారు. తల్లిదండ్రులు లేని లోటును తీర్చేవిధంగా చిన్నారులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఆనురాగనిలయం నిర్వాహకులు కృషి చేయాలన్నారు. పిల్లలనుద్దేశించి ఆయన మాట్లాడుతై చక్కగా చదువుకొని జీవితంలో పైకిరావాలన్నారు. తల్లిదండ్రులు లేరన్న భయం మీకు అక్కర్లేదని మేమంతా మీకు అండగా ఉంటామని గవర్నర్ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ అనురాగ నిలయం మరింత ఉన్నతంగా నిర్వహించేందుకు మూలధనం సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిటీ ప్రతినిధులు దాతల నుంచి సమీకరించాలన్నారు. ఇటువంటి ఆనురాగ నిలయాలు మరిన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులులేని చిన్నారులకు సామాజిక బాధ్యతగా ఉజ్వల భవిష్యత్ అందించే దిశగా ముందుకు సాగాలన్నారు. రూ.2లక్షల విరాళాన్ని ప్రకటించి మరింత స్ఫూర్తిగా నిలిచారు. అలాగే అనురాగ నిలయం సందర్శించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని గవర్నర్ నిర్వాహకులను మరింత ఉత్సాహపరిచారు. ఈయనతోపాటు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్‌కుమార్ ఈ అనురాగనిలయంలోగల ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరికి ఏడాదికి రూ.30వేలు చొప్పున చెల్లించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ముందుకు రావడం అభినందనీయం. జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, గీతా శ్రీకాంత్, నిక్కు హరిసత్యన్నారాయణ, జామి భీమశంకర్, బలివాడ మల్లేశ్వరరావులు ఉన్నారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రిని గవర్నర్ తనిఖీ చేసి వైద్యసేవలందుతున్న తీరుపై ఆరాతీశారు. ఇక్కడి నుండి ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకొని గవర్నర్ దంపతులు బస చేశారు.
* రెండవ రోజు సీతంపేట పర్యటన:
సోమవారం కూడా జిల్లాలోని సీతంపేట మండలంలో మల్లిగురుకులం విద్యార్థులతో గవర్నర్ ముకాముఖి నిర్వహించనున్నారు. పి ఎం ఆర్సీలో నర్శింగ్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడనున్నారు. యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా పరిశీలించి ఐ టి డి ఏవో భోజనం ముగించుకొని తిరిగి ప్రయాణం కానున్నారని అధికారులు షెడ్యూల్లో స్పష్టంచేశారు.
దంపతుల హత్య కేసులో వీడిన మిస్టరీ!
పామర్రు, ఫిబ్రవరి 14: విజయవాడ పటమటలంక చేపల మార్కెట్ సమీపంలో గత ఏడాది డిసెంబర్ 20న ఓ ఇంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్యకు గురైన వృద్ధ దంపతులు మునగపాటి గంగాధరరావు(55), వీరాంజమ్మ(50) కేసులో మిస్టరీ వీడింది. పామర్రుకు చెందిన మామిళ్ల విజయ్ కుమారుడైన పవన్(20), నందిపాటి (లేటు) భాస్కరరెడ్డి కమారుడైన జస్వంత్(20), బడే సుబ్బారావు కుమారుడైన వంశీకృష్ణ(22), మాచవరపు కొండయ్య కుమారుడైన శివన్నారాయణ(19)లను పోలీసులు నిందితులుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పటిష్ట బందోబస్తు నడుమ ఆదివారం పామర్రు నుంచి విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌కు పోలీసు అధికారులు తీసుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుల్లో మామిళ్ల పవన్ బంధువులు హత్యకు గురైన గంగాధరరావు ఇంట్లో అద్దెకుంటున్నారు. దీంతో పవన్ తన స్నేహితులు ఆ ఇంటికి వెళ్లినప్పుడు నగదు, నగలు దోచుకునేలా పథకానికి రూపకల్పన చేసి ఈ హత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామని, కేసును పటమట పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తారని వివరించారు.
రైతుల్ని ఆదుకోని ‘అపరాలు’!
* నీటి తడుపు లేక ఎండిపోయిన పైర్లు
* గణనీయంగా తగ్గుతున్న దిగుబడులు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 14: ఖరీఫ్ నష్టాలతో అల్లాడిన రైతాంగాన్ని అపరాలు సైతం ఆదుకోలేకపోయింది. సాగునీటి కొరత కారణంగా దాళ్వాను వదులుకుని అపరాలు సాగు చేసిన రైతన్నలకు మళ్ళీ నష్టాలే మిగిలాయి. అపరాల దిగుబడులపై సాగునీటి కొరత తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం జిల్లాలో మినుము కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. నీటి తడులు పెట్టకపోవటంతో కోతలు ముందుగానే వచ్చాయని, తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముమ్మరంగా మినుము తీత పనులు జరుగుతున్నాయి. అపరాల దిగుబడులపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి. నీటి తడులు పెట్టకపోవటంతో రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మినుము పైరు ఎండిపోతుంది. నోటికాడికి వచ్చే సరికి పంట ఇలా ఎండిపోవటంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే రెండు తడుపులు పెట్టిన మినుము పంట దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. భూగర్భ జలాలతో మినుము సాగు చేయలేని కౌలు రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసిన ఎల్‌బిజి 752తో పాటు 665, 648, నూతన విత్తనాలు అయిన 002 రకం విత్తనాలను రైతులు సాగు చేశారు. అయితే ఏ పంట వేసినా దిగుబడులు మాత్రం తగ్గనున్నాయి. ఎకరాకు రూ.30వేలు నుండి రూ.40వేలకు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు వాపోతున్నారు. 10 సార్లకు పైగా పురుగు మందులు పిచికారీ చేశామని, చివరకు దిగుబడులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాడికాయ పడ్డ చందంగా కూలీ ధరలు కూడా పెరిగాయని రైతులు వాపోతున్నారు. ఎకరా మినుము పంట కోసేందుకే రూ.4వేలు ఖర్చు అవుతుంది. అసలే ఖరీఫ్ అప్పుల్లో కూరుకుపోయిన మేము అపరాల దిగుబడులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్‌తో పాటు అపరాలను సాగునీటి సమస్య తీవ్రంగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు.
పేట నియోజకవర్గంలో
సాగునీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు
* మంత్రి దేవినేని ఉమ
జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 14: జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య లేకుండా సత్వర పరిష్కార మార్గం చూపిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాంతో కలిసి మండలంలోని ముక్త్యాల కృష్ణానదీ పరివాహక ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం ఆంధ్రా, తెలంగాణా సరిహద్దులో ఉండటం వల్ల రాష్ట్రం రెండుగా విడిపోయిన పరిస్థితుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గానికి సక్రమంగా సాగునీరు అందడం లేదని, దీనికి తోడు ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో రైతులు, ప్రజలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారని, కృష్ణానదిపై ఎత్తిపోతల పధకం నిర్మించిన సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు మంత్రి ఉమ క్షేత్రస్థాయి సందర్శన చేశారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 11వ బ్రాంచి, 19 బ్రాంచిలతో పాటు మంగాపురం మేజరు, పోలంపల్లి మునే్నరు, కాచవరం సప్లై ఛానల్ ద్వారా నీటి సరఫరాకు కావాల్సిన సదుపాయాలపై ఆయన అధికారులతో చర్చించారు. పరిష్కార మార్గంగా నియోజకవర్గ సరిహద్దులో 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరాకు అంచనాలపై పరిశీలించారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక, అంచనాలు రూపొందించేందుకు ఆ శాఖ అధికారులకు రూ.16లక్షల నిధులు మంజూరు చేశారు. తుది నివేదిక అందిన తరువాత పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు కట్టా నర్శింహరావు, జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, చింతల సీతారామయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, నీటి సంఘం అధ్యక్షుడు పాల్గొన్నారు.
నేడు గోళ్లమూడికి సిఎం చంద్రబాబు రాక
నందిగామ, ఫిబ్రవరి 14: మండలంలోని గోళ్లమూడి గ్రామంలో సోమవారం జరిగే ఒక ప్రైవేటు విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హజరు కానుండటంతో గ్రామంలోని శివాలయం సమీపంలో హెలిపాడ్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హైదరాబాదులో స్థిరపడిన గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు దేవభక్తుని నిత్యానంద ప్రసాద్ (డిఎన్) కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో సిఎం చంద్రబాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హెలిపాడ్ నిర్మాణ పనులను ఆదివారం ఎడిషనల్ ఎస్‌పి విద్యాసాగర్, సిఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఎ జోషిలు పరిశీలించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గోళ్లమూడి గ్రామానికి వస్తున్న సందర్భంలో ఆయన చేతుల మీదుగా ఎన్‌టిఆర్ విగ్రహావిష్కరణ చేసేందుకు గ్రామ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కెయును మోడల్ వర్సిటీగా తీర్చిదిద్దుతా
* రోల్డ్‌గోల్డ్, ఆక్వా కల్చర్‌పై డిప్లమో కోర్సులు
* విశ్వవిద్యాలయం సామర్థ్యం పెంపునకు కృషి
* ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రామకృష్ణారావు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 14: నవ్యాంప్రదేశ్ రాజధాని ప్రాంతానికి అతిచేరువలో ఉన్న కృష్ణా విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆదివారం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారి ఆచార్య సుంకరి రామకృష్ణారావు అన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు విశ్వవిద్యాలయం అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు తయారుచేశారని, వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. సదుపాయాలు కల్పించటంతో పాటు స్థానికంగా ఉన్న రోల్డుగోల్డు పరిశ్రమ, ఆక్వా కల్చర్‌పై డిప్లమో కోర్సులు ప్రవేశ పెడతామన్నారు. రీసెర్చ్‌కు అవసరమయ్యే వర్కింగ్ మోడల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విశ్వ విద్యాలయం సామర్ధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి సుంకరి రామకృష్ణారావును విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), విశ్వ విద్యాలయం క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందర కృష్ణ తదితరులు అభినందించారు.
ఎమ్మెల్యే ప్రతాప్‌కు సతీవియోగం
నూజివీడు, ఫిబ్రవరి 14: నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి మేకా సుజాతమ్మ (56) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావటంతో ఆమె మృతి చెందారు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుజాతమ్మ మృతదేహాన్ని పురప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, కుమారుడు వేణుగోపాల అప్పారావును పరామర్శించి, సానుభూతి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం టెలిఫోన్‌లో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సుజాతమ్మ మృతదేహాన్ని సందర్శించి దివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావును పరామర్శించారు. శాసనసభ్యులు జలీల్‌ఖాన్, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, వల్లభనేని వంశీమోహన్, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జోగి రమేష్, వైకాపా నాయకులు గౌతం రెడ్డి, నూజివీడు పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ బసవ రేవతి, మాజీ ఛైర్మన్ బసవ బాస్కరరావు, మాజీ వైస్ ఛైర్మన్ రామిశెట్టి మురళీకృష్ణకుమార్, స్నేహారైడ్సు ఛైర్మన్ బసవరాజు నగేష్‌రావు, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు అక్కినేని చందు, జగ్గవరపు వెంకటరెడ్డి, వీరమాచనేని సత్యనారాయణ, పసుపులేటి జగన్‌మోహనరావు, కౌన్సిలర్లు కందుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ చౌదరితో పాటు పలువురు పురపాలక సంఘం కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సుజాతమ్మ మృతదేహాన్ని సందర్శించి, ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఫోన్‌లో ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును పరామర్శించారు. సుజాతమ్మ అంత్యక్రియలకు వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్‌మెహనరెడ్డి హాజరౌతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
శాస్త్రోక్తంగా రథసప్తమి
కూచిపూడి, ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినాన్ని ఆదివారం మొవ్వ మండలంలో మహిళలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరోగ్యం, భాస్కరాధిత్యేత్.. అన్న వేదోక్తిని అనుసరించి సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే మానసిక, శారీరక రుగ్మతులు తగ్గుతాయని ఆయుర్వేద వైద్య గ్రంథాలు పేర్కొన్నాయని ఆచార్య రామకృష్ణమాచార్యులు తెలిపారు. మొవ్వ మండలం బార్లపూడి గ్రామంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులైన ఈయన ఆధ్వర్యంలో ఆవు పిడకల దాలిపై చిక్కుడుకాయలతో తయారుచేసిన రథాలను, ఆవుపాలతో చేసిన పర్వాన్నం పొంగించి సూర్య భగవానునికి నివేదించిన అనంతరం ప్రసాదంగా స్వీకరించారు. కాగా మండలంలోని కాజ శివారు మట్లమాలపల్లి దళితులు రథసప్తమిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మందా సుధారాణి, శ్రీనివాసరెడ్డి దంపతులు, ప్రసాదరెడ్డి, సాగరరెడ్డి దంపతుల పర్యవేక్షణలో గోకపై రామకృష్ణ, కొచ్చర్ల వెంకటేశ్వరరావు, నాగమల్లి, దుర్గ, వెంకటేశ్వరమ్మ తదితర మహిళలు భక్తిశ్రద్ధలతో రథసప్తమి పూజలు నిర్వహించారు.
ముమ్మరంగా మినుము కోతలు
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 14: మండలంలో దాదాపు 25వేల ఎకరాలలో సాగు చేసిన మినుము పంట ఆశాజనకంగానే ఉంది. గత కొద్దిరోజులుగా మినుము కోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ కూలీలకు ధరలు కూడా అనుకూలంగా ఉండటంతో కోతల పట్ల కూలీలు ఆసక్తి చూపుతున్నారు. కూలీ రూ.100 నుంచి రూ.150వరకు పెరిగింది. వేకువ జాము నుంచే పనులు చేసేందుకు వెళుతున్నారు. దీంతో మండలంలో మహిళలు పెద్దసంఖ్యలో మినుము కోత పనులకు మొగ్గు చూపుతున్నారు.
పరిహారం కోరుతూ రైతుల ధర్నా
ముసునూరు, ఫిబ్రవరి 14: ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాయమాటలు నమ్మి సీడ్ మొక్కజొన్నను సాగుచేశామని, తీరా పంట చేతికి రాకముందే పంటకు తెగుళ్లు వ్యాపించి పంట దిగుబడి రాక నష్టపోయామని తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ముసునూరు మండపం సెంటరు వద్ద సుమారు 100 మంది రైతులు ఆదివారం సాయంత్రం గంటసేపు ధర్నా నిర్వహించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ముసునూరు గ్రామానికి చెందిన రైతులు పయనీర్ సీడ్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను సాగుచేశారు. పంట దిగుబడి ఎకరానికి 4 నుండి 6 టన్నుల వరకు వస్తుందని ప్రతినిధులు చెప్పడంతో ఆశపడి పంటను సాగుచేశామని రైతులు చెప్పారు. పంటకు తెగుళ్ల బెడద ఉండదని, మందుల పిచికారి కూడా అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు చెప్పగా తాము మొక్కజొన్న పంటను వేశామని రైతులు తెలిపారు. తీరా పంట కాలం పూర్తికాకముందే పంట నిలువునా ఎండిపోతూ వేరుకుళ్లు వచ్చి మొక్కజొన్న కర్రలు పడిపోవడంతో పాటు నాసిరకం కండెలు వేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. దీంతో రైతులు కంపెనీ ప్రతినిధులతో చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోయారు. నాలుగురోజుల క్రితం విత్తన సంఘం ప్రతినిధులు వచ్చి పంటను పరిశీలించి పంట నష్టపరిహారంగా ఎకరానికి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయని పక్షంలో విత్తన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శనివారం రాత్రి రైతులు కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు సాగాయి. చర్చలు విఫలం కావడంతో రైతులు ఆదివారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాతో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఉద్యమానికీ వెనుకాడం
మోపిదేవి, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమానికి సైతం వెనుకాడేది లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దివి లీలా మాధవరావు హెచ్చరించారు. ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా డీలర్లు రూ.1970 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం నిర్వహిస్తుండగా సుమారు రూ.3కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల హామీల మేరకు డీలర్లు నష్టాలు భరించాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం డీలర్లకు న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్టవ్య్రాప్తంగా 266 ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయన్నారు. జగ్గయ్యపేట, తదితర ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తూనికల్లో మోసం రుజువు అయితే రూ.30వేలు మాత్రమే జరిమానా విధించారని, కిలో, అరకిలో తేడా వస్తే రేషన్ డీలర్‌పై రూ.10వేల వరకు జరిమానాలు విధిస్తున్నారన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రేషన్ డీలర్లకు న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి డీలర్ల సంఘం అధ్యక్షులు కొమ్ము మోహనరావు, డీలర్లు బి తాతారావు, కోసూరు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
నగల కోసమే.. హతమార్చారు
* దంపతుల హత్యకేసు చేధించిన పోలీసులు
* నలుగురు అరెస్టు.. సొత్తు రికవరీ
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 14: గత డిసెంబర్‌లో పటమట లంకలో జరిగిన దంపతుల దారుణహత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. బంధువులు, సన్నిహితులు, తెలిసినవారే ఈఘాతుకానికి పాల్పడి ఉంటారని, మరోవైపు కరుడుగట్టిన దోపిడి దొంగలు నగల కోసమే మట్టుబెట్టి ఉంటారని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే హతుల ఇంట్లో అద్దెకు ఉన్న ఓ మహిళ కుమారుడు అతని స్నేహితులు కలిసి ఈదారుణానికి ఒడిగట్టారు. నగల కోసమే అయినా రెండు నిండు ప్రాణాలను బలిగొన్న నిందితులు కేవలం మూటకట్టుకెళ్లింది నామమాత్రమే కావడం గమనార్హం. సుమారు రెండు మాసాల దర్యాప్తు అనంతరం ఎట్టకేలకు నిందితులను గుర్తించి నలుగురిని అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు వారి నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు రికవరీ చేశారు. సిసిఎస్ స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో క్రైం అదనపు డిసిపి జి రామకోటేశ్వరరావు పూర్తి వివరాలు వెల్లడించారు. పటమటలంక చేపల మార్కెట్ సమీపంలో నివాసముంటున్న సూపర్ మార్కెట్ ఉద్యోగిని మునగపాటి వీరాంజమ్మ (50), భర్త గంగాధరరావు (55)లు తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురైన ఘటన గత ఏడాది డిసెంబర్ 20న వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన మామిళ్ళ పవన్‌కళ్యాణ్ అలియాస్ పవన్ (20), నందిపాటి జస్వంత్ (21), బడే వంశీకృష్ణ (23), మాచవరపు శివనారాయణ (24)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 4లక్షల రూపాయలు విలువైన 130 గ్రాముల బంగారు నగలు, రెండు సెల్‌ఫోన్లు, 40గ్రాముల వెండి సామగ్రి, హత్యకు ఉపయోగించిన ఆటో, ఒక బైక్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు నలుగురు స్నేహితులే. వీరిలో ప్రధాన నిందితుడు పవన్ తల్లి గంగా ఆరేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడి పటమటలంక చేపలమార్కెట్ సమీపంలోని మునగపాటి వీరంజమ్మ ఇంటి కింద అద్దెకు ఉంటోంది. పవన్ మాత్రం పామర్రులో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చి వెళ్తుంటాడు. ఈక్రమంలో పవన్ అతని స్నేహితుడు జస్వంత్‌లు నవంబర్‌లో నగరంలోని మెట్రోలో పనికి కుదిరారు. దీంతో మెట్రోలో పని చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో ఇంటి యజమాని దంపతులపై కనే్నశాడు. బాగా డబ్బు కలిగినవారుగా భావించారు. కొద్దిరోజుల తర్వాత మెట్రోలో పని మానేసి డిసెంబర్‌లో తిరిగి పామర్రు వెళ్లిపోయారు. తల్లి మాత్రం ఇక్కడే ఉంటోంది. జల్సాలకు డబ్బు అవసరం పడిన పవన్ దృష్టి ఇంటి యజమానులు వీరాంజమ్మ దంపతులపై పడింది. వారిని మట్టుపెట్టి దోచుకోవాలని భావించిన పవన్ తన స్నేహితులైన వంశీకృష్ణ, జస్వంత్, శివనారాయణలకు చెప్పి హత్యకు వ్యూహరచన చేశారు. గత ఏడాది డిసెంబర్ 18న బైక్‌పై పామర్రు నుంచి వచ్చి రెక్కీ చేశారు. మరుసటి రోజు 19న రాత్రి ఇంటికి వచ్చి తలుపుకొట్టగా తలుపు తీసిన వీరాంజమ్మను లోనికి నెట్టి భార్య భర్తలను కత్తితో పొడిచి, బ్లేడ్లతో గాయపరిచి హతమార్చారు. ఇంట్లో లభించిన బంగారు నగలు, వెండి వస్తువులు, ఏటిఎం కార్డులు, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లు తీసుకుని ఆటోలో ఉడాయించారు. వెళ్తూ.. దొరక్కూడదని కారం చల్లి వెళ్లారు. ఎట్టకేలకు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు అదనపు డిసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో క్రైం ఏసిపిలు వర్మ, పోతురాజు, సుందరరాజు, సిఐ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అడ్డుగా ఉన్న
ఇళ్ల తొలగింపు.. ఉద్రిక్తత...
విజయవాడ రూరల్, ఫిబ్రవరి 14: ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రైవస్ కాల్వగట్టుకు అడ్డుగా ఉన్న ఇళ్లు తొలగింపు ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ గ్రామీణ మండలంలోని రామవరప్పాడు గ్రామంలో ఆదివారం ఉదయం రైవస్ కాల్వగట్టుపై ఉన్న ఇళ్ల తొలగింపునకు రెవెన్యూ అధికారులు చేరుకోగానే నిర్వాసితులు, పిల్లలు, పెద్దలు అధికార్లతో వివాదానికి దిగారు. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ కుటుంబ సభ్యులతో సహా జాతీయ రాహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ విషయం తెలుసుకొన్న శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ చేరుకొని నిర్వాసితులను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఈ విషయం చర్చిస్తానని అప్పటి వరకు ఇళ్ల తొలగింపు నిలిపివేయాలని చెప్పటంతో రెవెన్యూ అధికారులు అక్కడ నుండి వెనుదిరిగి వెళ్లారు. దీంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. అనంతరం వల్లభనేని వంశీమోహన్, పార్లమెంట్ సభ్యులు నారాయణలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ పిలిపించి అధికారులు దూకుడుగా వెళితే సహించేది లేదని, ఎక్కడా లేని విధంగా గన్నవరం నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా 14రకాల భూసేకరణ జరగాల్సి ఉందని, ఎలాంటి భూసేకరణ విషయంలోనైనా ఎమ్మెల్యే, ఎంపితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించిన తరువాత తగిన పరిష్కారం లేదా ప్రత్యామ్నాయం చూపి భూసేకరణ జరుగుతుందని వంశీ భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే వంశీపై కేసు
విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడు రైవస్ కాలువ కట్టపై అధికారులు ఇళ్లు కూల్చివేతకు సిద్ధం కాగా కోపోద్రిక్తులై బాధితులు రాస్తారాకోకు దిగారు. అక్కడకు చేరుకొన్న ఎమ్మెల్యే వంశీ ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎవరూ ఆందోళన చెందవద్దు అని భరోసా నేపథ్యంలో ధర్నా విరమించారు. అయితే రాస్తారాకోలో పాల్గొన్నారనే అభియోగంతో పటమట పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు అత్యుత్సాహానికి కోపోద్రిక్తులైన పేద ప్రజలకు అండగా నిలిచి వారిని శాంతపరచి ఆందోళనను విరమింపజేసిన తనపై కేసు నమోదు చేయటాన్ని నిరసిస్తూ శాసన సభ్యులు వల్లభనేని వంశీమోహన్ తనకు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు అంగరక్షకులను వెనక్కి పంపారు.
ఆంధ్రరత్న భవన్‌కు మహర్దశ
* పిసిసి కార్యాలయంగా రూపుదిద్దుకుంటున్న ఆంధ్రరత్న భవన్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 14: శిథిలావస్థలో ఉన్న ఆంధ్రరత్న భవన్ సుమారు రూ.50 లక్షల రూపాయలతో హంగు, ఆర్భాటంగా రూపుదిద్దుకుంది. సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్లీ పిసిసి కార్యాలయంగా అవతరించబోతోంది. దశాబ్దాల తరబడి మూతబడి గబ్బిలాలకు నిలయంగా కొనసాగుతూ వస్తున్న ఆంధ్రరత్న భవన్ నేటి అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా మారుతోంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో పూర్తి ఎయిర్ కండిషనర్‌తో పిసిసి అధ్యక్షుని ఛాంబరుతో పాటు మీటింగ్ హాలు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ సంస్థలు అయిన యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, ఎస్‌సి, బిసి, ఎస్‌టి సెల్స్‌కు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటవుతున్నాయి. 30 ఏళ్లుగా ఒక చిన్న గదిలో నివసిస్తున్న ఒక కుటుంబానికి రూ.6 లక్షలు పరిహారంగా చెల్లించడం జరిగింది. వంగవీటి మోహనరంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో నిరుపేదలైన ఆ కుటుంబానికి పార్టీ కార్యాలయంలో ఆశ్రయం కల్పించటం జరిగింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు పిసిసి క్యాంప్ కార్యాలయంగా ఆంధ్రరత్న భవన్ పనిచేసింది. 1962 ప్రాంతంలో పిసిసి అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డి, ఆచార్య రంగా మధ్య ఇదే భవన్‌లో హోరాహోరీ పోరు జరిగింది. సీనియర్ నేతలు కల్లూరి చంద్రవౌళి, కాకాని వెంకటరత్నం నీలం సంజీవరెడ్డికి మద్దతునివ్వటంతో కేవలం రెండు ఓట్ల ఆధిక్యతతో గెలువగల్గారు. ఓటమిని జీర్ణించుకోలేని రంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కృషికార్ లోక్‌పార్టీని స్థాపించారు. 1962 ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అయ్యదేవర కాళేశ్వరరావు హయాంలో ఆంధ్రరత్న భవన్ నిర్మాణానికి పునాది ఏర్పడింది. ఇందులో పిసిసి కార్యాలయం ఏర్పాటుకు తొలి ఎంపి బోడె మురహరి కృతకృత్యులయ్యారు. హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి కాగా అయ్యదేవర స్పీకర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాకరపర్తి భావనారాయణ మొదటి అంతస్తును నిర్మించారు. 2004 ఎన్నికల సమయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న కడియాల బుచ్చిబాబు గన్నవరం నుంచి పోటీచేస్తున్న సమయంలో ఎంపి పర్వతనేని ఉపేంద్ర ఆంధ్రరత్న భవన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. విష్ణుకు నగర కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి ఆంధ్రరత్న భవన్‌లో కార్యకలాపాలు చురుగ్గా జరిగేలా గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గదులను అనుబంధ సంస్థలకు అప్పగించారు. రాజగోపాల్ ఎంపిగా ఉన్న సమయంలో ఆంధ్రరత్న భవన్ పూర్తిగా కూల్చివేసి బహుళంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడుతో కలిసి వ్యూహరచన చేశారు. రాజగోపాల్ పదేళ్లు ఎంపిగా ఉన్నప్పటికీ పాడుబడిన ఆ భవనానికి కనీసం రంగు కూడా పడలేదు. పైగా ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడింది. అలాంటి శిథిలావస్థలో ఉన్న ఆంధ్రరత్న భవన్ ప్రస్తుతం ‘అదరహో’ అనిపిస్తోంది.
19న ప్రారంభోత్సవం
రథసప్తమి సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొబ్బరికాయలు కొట్టి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అయితే అధికారికంగా ఈనెల 19న ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇదే సందర్భంలో పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరుగబోతోంది.
కులాల కుంపట్లకు మొదటినుంచి కాంగ్రెస్ దూరం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 14: 125 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా ఏనాడూ తమ రాజకీయాల కోసం కులాలను ఓట్ల యంత్రాలుగా వాడుకోలేదంటూ దళిత వర్గానికి చెందిన దామోదర సంజీవయ్యే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం జరిగిన దామోదర సంజీవయ్య 95వ జయంతి వేడుకల్లో రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అధ్యక్షత వహించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ నేడు అనేక జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా అధికారమే పరమావధిగా భావిస్తూ కొన్ని కులాలను ఓటు బ్యాంక్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తున్న రోజుల్లోనే ఏ ఒక్కరూ నోరుతెరచి అడక్కుండా దళిత వర్గానికి చెందిన అతి సామాన్య వ్యక్తి దామోదర సంజీవయ్యను శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా చివరకు కాంగ్రెస్ పార్టీకి అఖిల భారత అధ్యక్షునిగా కూడా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఆయన మరణించే సమయానికి స్వంత ఇల్లు, వాకిలి కూడా లేదని, 1500 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, శిథిలావస్థలో ఉన్న కారు మాత్రం ఉన్నాయన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం తొలిసారిగా ఇందిరాగాంధీ గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లోకి అడుగుపెట్టేలా జాతీయకరణ చేశారన్నారు. మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ దామోదర సంజీవయ్య లాంటి మహోన్నత వ్యక్తులు నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ అతి సామాన్యులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కాపులను బిసిలుగా గుర్తించేందుకు చంద్రబాబు జగన్నాటకం ఆడుతున్నారన్నారు. సభలో పిసిసి ఉపాధ్యక్షుడు ఎంజె రత్నకుమార్, సీనియర్ నేత బాబూరావు, కొరగంజి భాను, ఎస్‌సి సెల్ చైర్మన్ రాజకమల్ తదితరులు ప్రసంగించారు.
మన ఆలయాలకు మహర్దశ
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 14: రానున్న కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ఆలయాలకు కొత్త హంగులను ఏర్పాటు చేసేందుకు దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ వైవి అనూరాధ రూ.13.47కోట్లు విడుదల చేశారు. త్వరలో రానున్న కృష్ణ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కృష్ణమ్మ నదీతీరం వెంబండి ఉన్న సుమారు 150 ఆలయాలను జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ దుర్గాప్రసాద్ గుర్తించి వాటికి కొత్త హంగులను ఏర్పాటు చేయటంతోపాటు, ఈ ఆలయాల్లో భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వౌలిక సదుపాయాలను కల్పించటం వంటి అంశాలు వివరిస్తూ నివేదికను పంపించటంతో నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఈ విలేఖరితో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని రూ.50లక్షల ఆదాయం పైబడిన 4 ఆలయాలు, 5లక్షల నుండి 20 లక్షల మేరకు ఉన్న 8 ఆలయాలు, 10లక్షలనుండి 20లక్షల మేరకు ఆదాయం కలిగిన 20 ఆలయాలు, 5లక్షలనుండి 10లక్షల ఆదాయం కలిగిన 28 ఆలయాలు, 2లక్షల ఆదాయం కలిగిన 45 ఆలయాలను తొలుత గుర్తించటం జరిగిందన్నారు. వాటిలో ప్రత్యేకంగా కొన్ని ఆలయాలకు మరమ్మతులు, రంగులు వేయించటం, ఆలయాల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేసేందుకు మాత్రమే ఈనిధులు ఖర్చు చేయటం జరుగుతోందని ఆయన వివరించారు. పనులకు ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక పరమైన అంశాలను ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేసిన వెంటనే ఈ పనులను ప్రారంభించి కృష్ణ పుష్కరాల మహోత్సవాలకు సుమారు 20 రోజుల ముందుగానే ఈఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయనున్నట్లు ఎసి దుర్గాప్రసాద్ చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన ఇవోలు, సిబ్బందికి పలుసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించటం జరిగిందన్నారు. ఈప్రత్యేకంగా ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బందిని వెంటబెట్టుకొని జిల్లాలోని అన్ని ఆలయాలను పరిశీలించటం జరిగిందని ఎసి వివరించారు.
హుషారుగా మిస్ ఎపి 2016 గ్రాండ్ ఫినాలే
లబ్బీపేట, ఫిబ్రవరి 14: హుషారెత్తిన గీతాలతో సినీ సింగర్స్ దీపు, దినకర్ పాటల పల్లకిలో ప్రేక్షకులను ఉరేగించారు. వీనులకు వినసొంపైన సంగీత కచేరి డాన్ మాస్టర్ సందీప్‌గ్రాప్ దృశ్యకేలి ఎంతగానో అలరించాయి. నికిత, పరిణిక యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. జబర్దస్త్ టీం సభ్యులు చలాకి చంటి, భాస్కర్ గాలిపటాల సుధాకర్ హాస్యం ప్రేక్షకులను కడుపుఉబ్బ నవ్వించింది. హిరోయిన్ మిత్ర తన నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అర్ధరాత్రిదాకా జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంది. నేటి యువతలో ఉన్న ఆలోచలను వెలికితీయాలనే లక్ష్యంతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో తొలిసారిగా ప్యూచర్ ఆల్ సంస్ధ ఆధ్వర్యంలో శ్రీ సాయి క్రియేటివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్ధ ప్యూచర్ ఆల్ మిస్ ఎపి 2016 గ్రాండ్ ఫినాలే ఆదివారం సిద్ధార్ద కళాశాల హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఘనంగా జరిగాయి. ఉత్తర భారతదేశంతో పాటు కర్ణాటక రాష్ట్రం కంటే తెలివైన అందమైన, యువతీ,యువకులు మన రాష్టల్రో ఉన్నారని, అంతే కాకుండా దీనికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించటానికి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దామని సంస్ధ ఎండి గొట్టిపాటి సాయి అన్నారు. మిస్ విజయవాడ, మిస్ గుంటూరు, మిన్ నెల్లూరు, మిస్ వెస్ట్ గోదావరి, మిస్ రాజమండ్రి, మిస్ విశాఖపట్నం విజేతలందరితో ఫినాలే ఏర్పాటు చేసామని తెలిపారు. పి గీతికా రతన్, ఎన్ దివ్య, జెబి సురేఖ, టి కుష్మ, ఆర్ శ్రవాణి, ఎం సుజశ్రీ, టి తేజశ్వనీ, ఎండి సుమ్య, ఎంఎ తేజ సుమ్య, ఎ సంజన, ఎం తనుర్య, జెనిష పారుఖ్, జి హరిక, ఎస్ దివ్య, డి దేవి ప్రియ, ఎం శ్రీ సత్య, ఎస్ ప్రసన్న రాంఫ్ ఫో ప్రేక్షకులను ఎంతోగానో అకట్టుకుంది. వీరికి జడ్జీలుగా సినీ హీరోయిన్ పూనమ్ కౌర్, డమరుకం సినిమా డైరక్టర్ శ్రీనివాసరె
స్పినే్నశారు..
విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 14: వైఎస్సార్ విడిసిఎ - ఎసిఎ స్టేడియంలో మరో సారి భారత్ క్రికెట్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోను భారత్ విజయం సాధిస్తూ వచ్చింది. ఇదే స్టేడియంలో ఆదివారం జరిగిన టి-20 మ్యాచ్‌లో భారత్ గెలుపొందడం ద్వారా తన విజయాల పరంపరను కొనసాగించింది. ఇప్పటికే 1-1తో సిరీస్ సమం చేసిన భారత్, చివరి మ్యాచ్‌లో విజయం ద్వారా సిరీస్‌తో పాటు ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. దాదాపు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఆరు ఓవర్లకు ముందే పూర్తి కావడం గమనార్హం. ఇరు జట్లు కలిసి 40 ఓవర్లు ఆడాల్సి ఉండగా కేవలం 31.5 ఓవర్లలోనే ముగియడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంతో ఉత్కంఠత కనబరచిన ప్రేక్షకులు శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ల వికెట్లు పడిపోగా, తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు సైతం క్రీజులో నిలదొక్కుకోలేక పోయారు. ఇక భారత్ బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ హిట్టింగ్ చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. కేవలం 13 పరుగులకే రోహిత్ పెవిలియన్‌కు చేరుకోగా శిఖర్ ధావన్, అజ్యింక రహానే మ్యాచ్‌ను ముగించేశారు. దీంతో ధోనీ, రైనా, యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌లో మెరుపులు చూద్దామనుకున్నా అవకాశం దక్కలేదు.
వైభవంగా
శ్రీశారదాపీఠం వార్షికోత్సవం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: చినముషిడివాడ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షా ధారణతో కార్యక్రమం మొదలైంది. సినీనటుడు నందమూరి బాలకృష్ణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిష్ణాతులైన పండితులచే గణపతి హోమం, చతుర్వేత సంహిత యాగం, స్కంధయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హిందూధర్మ పరిరక్షణకై స్వామివారు చేస్తున్న కృషిని అభినందించారు. లోకకల్యాణార్థం విశాఖ శారదాపీఠం అధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెసుకున్నానని, అయితే స్వయంగా పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. గ్రహదోషాలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో దైవానుగ్రహం కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం లోకకల్యాణంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఐఎఎస్ అధికారి ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లోకకల్యాణం కోసం స్వరూపాస్వామి చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ సినీ హీరోగా ఖ్యాతి గాంచిన బాలకృష్ణ ఒక ఆధ్యాత్మిక వేత్తగా, బసవరామ తారకం ట్రస్టు నిర్వహణ ద్వారా ఒక సామాజిక కార్యకర్తగా సేవలందించడం హర్షణీయమన్నారు. అనంతరం భక్తులకు స్వామి వారు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద్, ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు.
స్మార్ట్ విశాఖ ఇంకెంత దూరం?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: స్మార్ట్‌సిటీగా విశాఖ నగరం రూపుదిద్దుకునేందుకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆదేశాధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో మూడు ప్రధాన పట్టణాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. గతేడాది జనవరిలో ఇరు దేశాధినేతలు ఒకే వేదికపై నుంచి విశాఖ స్మార్ట్‌సిటీని ప్రకటించారు. అయితే స్మార్ట్‌సిటీ రూపలక్పనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విధాలా సహకారం అందించేందుకు అమెరికా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఎ)కి బాధ్యతలు అప్పగించింది. ఇది జరిగి దాదాపు 13 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి యుఎస్‌టిడిఎ విశాఖ స్మార్ట్‌సిటీ ప్రతిపాదలను తయారు చేసేందుకు మూడు సంస్థలను ఎంపిక చేసింది. ఎయికాం, ఐబిఎం, కెపిఎంజి సంస్థలు విశాఖ భౌగోళిక, వాస్తవ పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సమగ్ర పథక నివేదిక అందించాల్సి ఉంది. దీనికి అవసరమైన ఆర్థిక సాయం యుఎస్‌టిడిఎ అందజేస్తుంది. నిరంతర నీటి సరఫరా, విద్యుత్, ఘన వ్యర్థాలు, మురునీటి పారుదల వ్యవస్థల నిర్వహణ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థ రూపకల్పన, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సేఫ్టీ, సెక్యూరిటీ తదితర అంశాలపై యుఎస్‌టిడిఎ అనుమతించిన మూడు కంపెనీలు సమగ్ర పథక నివేదిక (డిపిఆర్)లు సమర్పించాల్సి ఉంది. స్మార్ట్‌సిటీ రూపకల్పనకు సంబంధించి ఐబిఎం, కెపిఎంజి, ఎయికాం సంస్థలు డిపిఆర్‌లకు రూపకల్పన చేయడంతో పాటు అందుకు అవసరమైన నిధుల లభ్యతపై కూడా సూచనలు చేస్తాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకోసం ఎదురు చూడకుండా, సొంతంగా నిధులను సమకూర్చుకునే మార్గాలను కూడా ఈ సంస్థలు సూచిస్తాయి. దీనిలో అగ్రభాగం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) విధానంలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పన విషయంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న విస్తృత కసరత్తు ఒక ఎత్తయితే భవిష్యత్‌లో ఎంపిక చేసిన సంస్థలు డిపిఆర్‌లు తయారు ఇచ్చే నివేదికలపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం జివిఎంసికి ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో అధికారులే అంతా తామై నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారుల నివేదిక మేరకు ప్రభుత్వం కూడా తన అంగీకారం తెలుపుతూ వస్తోంది. జివిఎంసికి ఎన్నికలు జరిగి, పాలకవర్గం ఏర్పడితే ప్రతి అంశాన్ని కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంశాలపై చర్చ అనంతరం మెజార్టీ సభ్యులు నిర్ణయాలను ఆమోదించాల్సి ఉంటుంది. పిపిపి ప్రాజెక్టులు, ఆస్తుల బదలాయింపు తదితర అంశాలపై పాలకవర్గం నిర్ణయమే శిరోధార్యమవుతుంది. యుఎస్‌టిడిఎ ఎంపిక చేసిన సంస్థల డిపిఆర్‌లపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ జోక్యం అధికమైతే నివేదికలు కార్యరూపం దాల్చేందుకు ఇంకెంతకాలమైనా పట్టొచ్చు. ఇదే జరిగితే విశాఖ స్మార్ట్‌సిటీ కల సాకారం కావాలంటే దశాబ్ధాలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నిజమైన భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతిబింబిస్తుంది
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: నిజమైన భారత దేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతిబింబిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. గ్రామీణ విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంపొందించేందుకు కృషి చేయాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. సత్యసాయి విద్యా సంస్థల జాతీయ సదస్సు ఇక్కడి గీతం విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మానవతా విలువలతో కూడిన విద్యను అందించాల్సి ఉందని తెలిపారు. ఈ దిశగా సత్యసాయి విద్యా సంస్థలు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యా, వైద్య రంగాల్లో సత్యసాయి సంస్థలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని విలువలను బోధించే విద్య నేటి తరానికి అవసరమన్నారు. నైతిక విలువలతోనే ఇతరలకు మనుషులకు తేడా గుర్తించగలమన్నారు. ఈ దిశగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి మరో 10 మంది విద్యార్థులను ఈ దిశగా ప్రభావితం చేస్తే, సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా భగవాన్ సత్యసాయిలో ఆయన తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. భగవాన్ ఎప్పటికీ మనల్ని ఆశీర్వదించుగాక అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్‌పై గవర్నర్ నరహింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ సంతకాలు చేశారు. సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నిమిష్ పాండ్యా సత్యసాయి సేవా సంస్థల కార్యకలాపాలను వివరించారు. దాదాపు 102 విద్యా సంస్థల ద్వారా ఉత్తమ బోధన అందిస్తున్నామని తెలిపారు. 3.5 లక్షల బాలవికాస్ స్టూడెంట్స్, 12 లక్షల సేవాదళ్ ఉందని వివరించారు.
విద్య, వైద్యం, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కోట్లాది రూపాయలను తమ సంస్థల ద్వారా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. భారత విద్యా వ్యవస్థలో కనుమరుగువుతున్న విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు, విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఒక అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సత్యసాయి కేంద్రీయ ట్రస్టు ట్రస్టీ కె.చక్రవర్తి మాట్లాడుతూ సత్యసాయి విద్యా సంస్థల్లో విలువలతో కూడిని విద్యను అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని కమిటి సభ్యులను కోరారు. సత్యసాయి విద్యా వాహిని డైరెక్టర్ సత్యజిత్ మాట్లాడుతూ విద్యా బోధనలో మెరుగైన విధానాలు అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టీలు ఆర్‌జె రత్నాకర్, కె.చక్రవర్తి, ఎస్.ఎస్.నాగానంద్, మాజీ డిజిపి హెచ్.జె.దొర. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జి చలం, విశాఖ నగర పోలీస్ కమిషనర్ అమిత్ గర్గ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. భగవాన్ సత్యసాయి వారసత్వాన్ని కొనసాగించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు.
దైవారాధనతోనే గుండె నిబ్బరం
సింహాచలం, ఫిబ్రవరి 14: దైవారాధనతో ధైర్యం చేకూరుతుందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఐఎల్ నరసింహన్ అన్నారు. ఆదివారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. రథంపై పూజలందుకుంటున్న శ్రీమన్నారాయణుడి దర్శనం కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడారు. నరసింహస్వామి ఉన్నచోట భయానికి తావులేదని, భక్తితో భగవంతుడిని సేవించి తరించాలని ఆయన అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు నరసింహన్ చెప్పారు. అంతకుముందు ఆలయంలో నరసింహన్ దంపతులు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో నరసింహన్ పేరిట అర్చకులు సంప్రదాయ పూజలు చేశారు. ఆస్థాన మండపంలో వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు గవర్నర్‌ను ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్ గవర్నర్‌కి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. డిసిపి రామ్‌గోపాల్ నాయక్, ఎసిపిలు భీమారావు, కింజరాపు ప్రభాకరరావు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక్కటే మార్గం
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చక్కటి సాధనమని, ప్రశాంత జీవితానికి ఇదొక ఆధారమని యోగాచార్యులు శంకర గురూజీ అన్నారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో తెనే్నటిపార్కు వద్ద నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సూచనలు చేశారు. దీనివల్ల అనేక రుగ్మతులను సైతం పారదోలవచ్చన్నారు. మానసిక, శారీరక స్థితులను సమతుల్యతలో ఉంచుతూ వత్తిళ్ళను జయిస్తూ ఆరోగ్యకరమైన, ప్రశాంత జీవితం గడపటానికి యోగా ఒక అద్భుత సాధనంగా ఆయన పేర్కొన్నారు. శ్రీ నవ చైతన్య యోగా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ శంకర గురూజీ అధ్యక్షతన రవిశంకర్ రామేశ్వరరావుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వంద మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా సూర్యోదయ సమయంలో ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని స్తుతిస్తూ సూర్య నమస్కారాలు చేశారు.
జాతీయ స్థాయి టెన్నికాయిట్ ఓవరాల్ చాంపియన్ తమిళనాడు
గోపాలపట్నం, ఫిబ్రవరి 14: గ్రేటర్ విశాఖ నగరం 68వ డివిజన్ పరిధి గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన 40వ జాతీయ స్థాయి టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ 2015 పోటీల్లో తమిళనాడు బాల బాలికల జట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నాయి. ఈ నెల 10 నుంచి ఇక్కడి హైస్కూల్ క్రీడా మైదానంలో ప్రారంభమైన సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ టెన్నికాయిట్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. 23 రాష్ట్రాలకు చెందిన జట్లు గత నాలుగు రోజులుగా హోరాహోరిగా ఎంతో ఉత్కంఠగా పోటీలు జరిగాయి. అన్ని విభాగాల్లో తమిళనాడు జట్లు అజేయంగా నిలిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాయి. ముఖ్య అతిథిగా నగర జాయింట్ కలెక్టర్ నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, తదితరులు సంయుక్తంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
విజేతలు: పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో కేరళ విన్నర్స్ కాగా రన్నరప్‌గా తమిళనాడు క్రీడాకారుడు. స్ర్తిల టీమ్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు క్రీడాకారిణి విన్నర్ కాగా, కేరళ క్రీడాకారిణి రన్నరప్‌గా నిలిచారు. మెన్ సింగిల్ చాంపియన్‌గా తమిళనాడుకు చెందిన కె అరివాజన్ విన్నర్ కాగా పాండిచ్చేరికి చెందిన క్రీడాకారుడు కె గోవిందరాజన్ రన్నరప్‌గా నిలిచారు. ఉమెన్ సింగిల్ చాంపియన్‌గా తమిళనాడుకు చెందిన అరమ్య విన్నర్ గాగా కేరళకు చెందిన అమృత రన్నరప్‌గా నిలిచారు. మెన్ డబుల్స్‌లో కేరళకు చెందిన సంతోష్ కుమార్, లక్ష్మణ్ విన్నర్స్ కాగా, తమిళనాడుకు చెందిన శీలం బరసన్, జేసుదాస్ రన్నరప్‌గా నిలిచారు. ఉమెన్ డబుల్స్‌లో తమిళనాడుకు చెందిన కీర్తన, ఐశ్వర్య విన్నర్స్ కాగా, కేరళకు చెందిన షాన్‌ఫ్రీక్, ఐశ్వర్య రన్నరప్‌గా నిలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో కేరళకు చెందిన మణికంథన్, అనూజ విన్నర్స్ కాగా తెలంగాణాకు చెందిన కె రంజిత్, శిరీష రన్నరప్‌గా నిలిచారు.
సాంస్కృతిక కళలంటే
ఎంతో ఇష్టం
ఆరిలోవ, ఫిబ్రవరి 14: సాంస్కృతిక కళలంటే తనకెంతో ఇష్టమని ముఖ్య అతిథి, తమిళనాడు గవర్నర్ కె రోశయ్య అన్నారు. ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ అయిదు రోజుల పాటు నిర్వహించిన అకాడమీ 16వ వార్షిక సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం సాయంత్రం ముగింపు సభ జరిగింది. పూజ్య గురువు, సద్గురు కందుకూరి శివానందమూర్తి ఆశీస్సులతో ప్రారంభించిన అకాడమీ సేవలను కొనసాగించాలని ఆయన అన్నారు. దేశ విదేశాలలో ఖ్యాతినార్జించిన సంగీత కళాకారిణి కన్యాకుమారిని సత్కరించడం ముదావహమన్నారు. ఖాళీ సమయంలో మానసిక ప్రశాంతతకు సాహితీ విలువలున్న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటుంటానన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత వయొలిన్ విద్వన్మణి, పద్మశ్రీ, కళైమామణి ఎ కన్యాకుమారిని ‘సంగీత విద్యానిధి’ బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, ప్రఖ్యాత గాయకుడు, నటుడు డాక్టర్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఆమెను శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మనం సంగీతంలో వెనుకబడి ఉన్నామన్నారు. సంగీతం పట్ల మరింత అభిరుచి పెరగాలన్నారు. గురుదేవులు సద్గురు కందుకూరి శివానందమూర్తి సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి కృషి చేసే సంస్థల నిర్వాహకులను, కళాకారులను ప్రోత్సహించేవారన్నారు. గాయకుడు, నటుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంగీతం, భక్తి, సాహిత్య సంబంధ సంస్థలను, వ్యక్తులను సద్గురు శివానందమూర్తి ప్రోత్సహించేవారన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ప్రభాకర్, కార్యదర్శి పివిఎస్ శేషయ్య శాస్ర్తీ పాల్గొన్నారు. డాక్టర్ జి ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. అనంతరం పద్మశ్రీ, కళైమామణి, సంగీత విద్యానిధి అవసరాల కన్యాకుమారి వయొలిన్ కచేరి నిర్వహించారు. కృతులు, కీర్తనలను వయొలిన్‌పై ఎం రాజీవ్, మృదంగంపై ప్రతి సతీష్‌కుమార్ చక్కని లయవాద్య సహకారమందించి కచేరీని రక్తికట్టించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న సంగీతప్రియులు ఆద్యంతం కృతులు, కీర్తనలను ఆసక్తిగా విన్నారు.
చట్ట సవరణలతో యాజమాన్యాలకే మేలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 14: చట్ట సవరణలు చేయడం వలన కార్మికలోకానికి ఒరిగేదేమీ లేకపోగా పరిశ్రమల యాజమాన్యాలకు మేలు చేసేవిగా ఉంటున్నాయని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్ట సవరణలు చేస్తే అభ్యంతరాలు ఉండేవి కాదని, అయితే వీరికి తీరని అన్యాయం చేసే విధంగా యాజమాన్యాలకు కొమ్ముకాసే విధంగా ఇవి ఉన్నాయన్నారు. చట్ట సవరణలతో యాజమాన్యాలకు స్వేచ్ఛ ఉంటే కార్మికులకు సమ్మె చేసే అవకాశం ఉండదన్నారు. సమ్మె చేసినట్లైతే ఐదు లక్షలు జరిమానా, ఐదేళ్ళపాటు శిక్షను అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇది ఏకపక్షంగా ఉన్న చట్ట సవరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే చట్ట సవరణతో జీవితాంతం తాత్కాలిక కార్మికునిగానే ఉండిపోయే ప్రమాదం ఉందన్నారు. అప్రంటీస్‌యాక్ట్‌ను సవరించారని, కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. దొడ్డిదారిన చట్టం చేయడం ప్రారంభించిందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో కార్మిక వ్యతిరేక చట్టాలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంతో కార్మికలోకం నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేందుకు హక్కుల రక్షణ కోసం వచ్చేనెల 10వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దినం పాటిస్తున్నామన్నారు. అలాగే ఏప్రిల్ 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఆయన ప్రకటించారు. రైల్వే, రక్షణ రంగ కార్మికులు చేపట్టనున్న సమ్మెను ఐఎన్‌టియుసి బలపరుస్తుందన్నారు. ఐఎన్‌టియుసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఐఎన్‌టియుసి అఖిలభారతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ఏపీ రాష్ట్ర ఇంటక్ చీఫ్ వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ కెఎస్ మోహన్‌కుమార్, చీఫ్ వైస్-ప్రెసిడెంట్ గడసాల అప్పారావు, జిల్లా ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి భోగవల్లి నాగభూషణం, ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు, గందం వెంకటరావులు పాల్గొన్నారు.
కాటేసిన మృత్యువు!
యలమంచిలి రూరల్, పిబ్రవరి 14:మండలంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో విషాదం నింపింది. విధి వక్రీకరించిందో.. డ్రైవర్ నిర్లక్ష్యమో తెలియదు. ఎర్రవరం సమీపంలో అంబులైన్సు బోల్తాపడిన ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రగాయల పాలయ్యారు. అంబులైన్సు డ్రైవర్లులో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఆదివారం జరిగిన దుర్ఘటన పలువురిని కలచివేసింది. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్‌కు చెందిన నిరంజన్ గిరి హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి చెందారు. మృతదేహంతో అంబులైన్సులో వారు స్వగ్రామానికి బయలుదేరారు. యలమంచిలి సమీపంలో అంబులైన్సు అతివేగంతో అదుపుతప్పి గోతిలో పడి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నిరంజన్ గిరి భార్య పవిత్ర గిరి, కుమారుడు రవికుమార్, కుమార్తె మణితి, డ్రైవర్ వెంకట రమణలు మృతి చెందారు. కోడలు స్వర్ణలత, ద్వితీయ కుమారుడు సీతారామ్, మనమరాళ్లు మమత, నమతలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన యలమంచిలి, కశింకోట 108ల్లో యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. అంబులైన్సు ముందుభాగం నుజ్జు నుజ్జు అవడంతో మృతదేహాలు, క్షతగాత్రులు ఇరుక్కు పోయారు. యలమంచిలి పోలీసులు సహాయంతో ట్రాఫిక్ ఎస్‌ఐ రోహిణిపతి బయటకు తీయించారు. యలమంచిలి సిఐ కె. వెంకట్రావు సంఘటన స్థలం చేరుకొని పొక్లైన్ సహాయంతో అంబులైన్సును పైకి తీయించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.
మరో ఇద్దరు
మండలంలోని పెదపల్లిలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాద వివరాలు ఇలావున్నాయి. యలమంచిలికి చెందిన చేబ్రోలు ప్రభాకరరావు(55) పెదపల్లిలో నుండి బైక్‌పై జాతీయ రహదారిని దాటుతుండగా అనకాపల్లి నుండి తుని వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభాకరరావు అక్కడికి అక్కడే వృతి చెందాడు. పురుషోత్తపాలెం వద్ద జాతీయ రహాదారిపై ఆదివారం రాత్రి నడిచి వెలుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో
పాదచారి అక్కడికి అక్కడే మృతి చెందాడు. దీనిపై యలమంచిలి రూరల్ ఎస్‌ఐ సిహెచ్. వెంకట్రావు కేసులు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నారు.
అయ్యో పాపం... !
యలమంచిలి, పిబ్రవరి 14: ముక్కుపచ్చలారని పసిబాలుడు బుడిబుడి అడుగులు వేయాల్సిన వయస్సులో రోడ్డు ప్రమాదంలో మృత్యువుఒడిలోకి చేర్చింది. ఆదివారం జరిగిన అంబులైన్సు ప్రమాదంలో నిరంజన్ గిరి మనుమడు జాగా మృతి పలువురిని కలచివేసింది. శిశువు తండ్రి ప్రమాదంలో అక్కడికి అక్కడే మృతి చెందగా తల్లి కొన ఊపిరితో మృత్యువుతో పోరాడుతుంది. 108లో జాగా మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తండ్రి, తల్లి అయిన వాళ్లు ఎవరు లేకపోవడంతో దొండ పండులాంటి శిశువును చూసి పలువురు దిగ్భ్రాంతి చెందారు. అనాదిగా ఆసుపత్రిలో ఉన్న శిశువు మృత దేహంను చూసినవారికి అయ్యోపాపం అని పించింది.
పీలాకు త్రుటిలో తప్పిన ప్రమాదం
అనకాపల్లిరూరల్, ఫిబ్రవరి 14: అనకాపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు ఆదివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సినీనటుడు బాలకృష్ణను కలిసి వస్తున్న ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ అనకాపల్లి మండలం సిరసపల్లి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఆటో అదుపుతప్పి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం వెనుకభాగంగా ద్వంసమైంది. వాహనంలో ఎమ్మెల్యేతోపాటు తెలుగుయువత అధ్యక్షులు మళ్ల సురేంద్ర, డిసిసిబి డైరక్టర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, తెలుగుయువత నాయకులు మలసాల కుమార్‌రాజా, బాలకృష్ణ అభిమానులు ఉన్నారు. ఆటో డీ కొట్టడంతో ఎమ్మెల్యేతో పాటు అందరూ ఒక్కసారిగా హుళిక్కిపడి షాక్‌కు గురయ్యారు. ఆ క్షణంలో ఎంజరిగిందో ఎవరికీ తెలియకుండా పోయింది. ఎమ్మెల్యే వాహనంలో ప్రయాణిస్తున్న ఫ్రోటోగ్రాఫర్ రవ్వా శ్రీనివాసరావుకు స్వల్పగాయం తప్ప ఎవరికీ ఏమికాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వాసులు ఎమ్మెల్యే పీలా ఆరోగ్యపరిస్థితిపై అడిగితెలుసుకున్నారు.
త్వరితగతిన రుణాల మంజూరు
చోడవరం, ఫిబ్రవరి 14: ఖరీఫ్ సీజన్ నుండి రైతాంగానికి తక్కువ సమయంలో రుణ సదుపాయాన్ని కల్పిస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ సుకుమార వర్మ హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని గోవాడ పిఎసిఎస్‌లో సభ్యరైతులకు వివిధ పధకాల ద్వారా సుమారు మూడులక్షల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వాణిజ్య బ్యాంక్‌లకు ధీటుగా పిఎసిఎస్‌లను తీర్చిదిద్దుతున్నామన్నారు. సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు పరపతేతర వ్యాపారాలను సాగించడం ద్వారా పిఎసిఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, పిఎసిఎస్ అధ్యక్షులు శానాపతి సత్యారావు, బీరా సత్యారావు పాల్గొన్నారు.
రైవాడ నీటిపై జివిఎంసి పెత్తనం ఏమిటి?
దేవరాపల్లి, ఫిబ్రవరి 14: రైవాడ నీటిపై కార్పొరేషన్‌కు పెత్తనం ఏమిటని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరిశింగరావు ప్రశ్నించారు. ఆదివారం రైవాడ లింక్ కెనాల్ వద్ద పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తే రైవాడ నీరు రైతులకు అందుతుందన్నారు. కార్పొరేషన్ బకాయిపడ్డ రూ.112 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైవాడ నీటిపై జివియం పెత్తనం ఏమిటని దీనిపై రైతులు తేల్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రోజెక్టులు అభివృద్ది చేస్తే అందరూ అభివృద్ది చెందుతారన్నారు. ప్రభుత్వానికి డబ్బులు వచ్చే పనిని తప్ప రైతులకు పనికి వచ్చే పనిచేయరు సరికదా రైతులపై మమకారం ఉన్నట్లు రైతుల అభివృద్దే ధ్యేయం అని గొప్పలు చెప్పుకుని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రోజెక్టులు పూర్తి చేస్తే దేశం రైతులు అభివృద్ది చెందుతారన్నారు. వెయ్యి టిఎంసిల నీరు సముద్రంలో వృధాగా పోతోందన్నారు. తక్షణమే అదనపు ఆయకట్టు ఆరువేల ఎకరాలకు నీరు విడుదల చేయాలని, రైతులకు ఇవ్వవలసిన నీటిని వెంటనే ఇవ్వాలని పైపులైన్లు ప్రతిపాదన పూర్తి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైవాడ ప్రోజెక్టు రైతులకే అంకితం చేసి కార్పొరేషన్ బకాయి పడ్డ రూ.112 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీశెట్టి బాబ్జి, లెక్కల అవతారమూర్తి, లెక్కల శ్రీను, ఆదిరెడ్డి చినకన్నబాబు ఉన్నారు.
సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి గంటా
అనకాపల్లి(నెహ్రూచౌక్), ఫిబ్రవరి 14: రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆదివారం మండలంలోని రాజుపాలెం సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుండి భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుండే తరలివచ్చి స్వామివారి ని దర్శించుకునేందుకు బారులు తీరా రు. ఈ సందర్భంగా విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జెడ్పీటిసిలు పల్లెల గంగాభవానీ, టిడిపి నాయకులు మళ్ల సురేంద్ర, గుత్తా ప్రభాకర చౌదరి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ చైర్మన్ కొణతాల బా బూరావు ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని ఘ నంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని వారికి అందజేసారు. రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు కొణతాల బాబూరావు ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఆల య పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ఈ కార్యక్రమంలో కర్రి కోటేశ్వరరావు, గొల్లవెల్లి రామకోటేశ్వరరావు, చేబోలు సత్యనారాయణ, బుజ్జి, అంజిబాబు పాల్గొన్నారు.
రైవాడ రైతుల పాదయాత్ర
వేపాడ,్ఫబ్రవరి 14: రైవాడ ప్రాజెక్టు రైతులకే పునరంకితం కావాలన్న డిమాండ్‌తో రైవాడ సాధన కమిటీ ఆదివారం సాగునీటి సాధనకు కమిటీ సభ్యులు సారధ్యంలో మొదటి రోజు ప్రారంభించిన పాదయాత్ర విజయవంతం అయ్యింది. రైవాడ జలశాయం దగ్గరనుంచి ప్రారంభమైన పాదయాత్ర విశాఖ జిల్లాకు చెందిన సీతంపేట, నాగయ్యపేట గ్రామాలతో పాటు విజయనగరం జిల్లా వావిలాపాడు, చామలాడివి, వీలుపర్తి తదితర గ్రామాల్లో సుమారు 17 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించి రైతాంగాన్ని సాగునీటి బోరుకు సిద్ధం చేసారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు సిహెచ్ రామునాయుడు మాట్లాడుతూ రైతుల కోసం నిర్మించిన జలాశయం నీటిని రైతుల సాగు భూములకు ఇవ్వకుండా విశాఖ నగరానికి తరలించుకు పోవడం దారణమన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు, ఎపి రైతు సంఘం కార్యదర్శి నర్సింహరావులు మాట్లాడుతూ సాగునీటి సాధన కోసం రైవాడ సాధన కమిటీ చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే ఇరిగేషన్ శాఖ రిటైర్డు చీప్ ఇంజనీర్ సాగునీటి వనరుల ప్రభుత్వ సలహాదారుడు సత్యనారాయణ మాట్లాడుతూ రైవాడ నీటిని 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న 15 వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తు అదే అయకట్టు ఆరువేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. రైవాడ ప్రాజెక్టు సామర్థ్యం 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అనువుగా ఉందని అన్నారు. నిర్మాణ దశలో దీని సామర్థ్యాన్ని కల్పించారని అన్నారు. అయినా ప్రభుత్వ పాలకులు సాగునీరు అందించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని అర్థం కాకుండా ఉందని అన్నారు. సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, పైపులైను నిర్మాణాన్ని శాశ్వతంగా విరమించుకోవాలని, జివిఎంసి బకాయి పడ్డ రూ.112 కోట్లు వసూలు చేయాలని, తక్షణం సాగునీటి పంటకాలువలను ఏర్పాటు చేసి సాగునీరు అందించాలి అన్న డిమాండ్లతో సాధన కమీటి పాదయాత్ర నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా లోక్ సత్తాపార్టీ అధ్యక్షుడు బాబ్జీ వెంకన్న, దండునాయుడుబాబు,విశాఖ రైతు సంఘ నాయకుడు అప్పరావు, సతీష్,శ్రీను,పెదనాయుడు, తదితరులతో పాటు వందలాది మంది రైతులు, రైతునాయకులు పాల్గొన్నారు. ఈ రాత్రికి నాయుడుపేట గ్రామంలో బస చేస్తున్నట్లు తెలిపారు.
==================
మహిళపై అత్యాచారం కేసులో
నలుగురు నిందితుల అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: సంచలనం కలిగించిన మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో నాలుగు రోజుల కిందట జరిగిన దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ తెలిపిన వివరాల ప్రకారం మూలపాడు గ్రామానికి చెందిన వివాహిత మహిళ కూలీపనుల కోసం చెన్నై వెడుతున్న తన భర్తను పంపించేందుకు గత బుధవారం రాత్రి ఆండ్ర గ్రామానికి వచ్చి తిరిగి వెడుతున్న సమయంలో నలుగురు యువకులు ఆమెను సమీపంలోని జనసంచారం లేని పొదల ప్రాంతానికి బలవంతంగా తీసుకువెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేసారు. దాంతోపాటు ఆ మహిళ వద్ద ఉన్న మూడువేల రూపాయల నగదును కూడా బెదిరించి తీసుకున్నారు. ఇదే సమయంలో ఆ మార్గంలో ఎవరో రావటం గమనించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంటికి చేరుకున్న వివాహిత మహిళ తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహాయంతో మరుసటి రోజు రాత్రి పెదమానాపురం పోలీసు స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆండ్ర పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేయగా, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బొబ్బిలి డిఎస్పీ రమణమూర్తి విచారణాధికారిగా కేసు దర్యాప్తు చేపట్టారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం మేరకు ఆండ్ర గ్రామానికి చెందిన సవరిల్లి లక్ష్మణ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తనతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. లక్ష్మణ ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు నిందితులు యెలుసూరి ఆదినారాయణ, సవరిల్లి శంకర్‌రావు, రాయుడు చిన్నారావు ఇప్పలవలస-కొండ లింగాలవలస గ్రామాల మధ్య ఉన్న మామిడితోటలో దాక్కుని ఉండగా డిఎస్పీ రమణారావు, గజపతినగరం సిఐ విజయనాథ్, ఎస్సైలు మహేష్, వరప్రసాద్, తారకేశ్వర్‌రావు తమ పోలీసు సిబ్బందితో శనివారం సాయంత్రం దాడిచేసి పట్టుకున్నారు. నిందితులను ఆదివారం గజపతినగరం కోర్టుకు రిమాండ్ చేస్తున్నామని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో అదనపు ఎస్పీ రమణ, డిఎస్పీలు రమణమూర్తి, త్రినాథ్, గజపతినగరం సిఐ విజయనాథ్ తదితరులు పాల్గొన్నారు.
==================
ఫెర్రో పరిశ్రమను ఆదుకోవాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలతోపాటు వివిధ సమస్యలతో మూతపడిన ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను తిరిగి తెరిపించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల యజమానుల సంఘం రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. తక్షణ చర్యగా విద్యుత్ చార్జీలను తగ్గించి ఆదుకోవాలని సంఘం కోరింది. ఆదివారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎస్‌ఆర్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 35 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉండగా ప్రస్తుతం 29 పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. విజయనగరం జిల్లాలోనే 16 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉండగా అందులో కేవలం నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. ఫెర్రో పరిశ్రమలు మూతపడటానికి ప్రధాన కారణంగా విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలని తెలిపారు. ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసిన ప్రారంభంలో అవసరమైన విద్యుత్ ఎన్టీపిసి నుంచి సరఫరా జరిగేదని, కానీ నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు సరసమైన ధరలకే విద్యుత్ అందిస్తామని 2002లో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపిసితో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని తెలిపారు. మొదటి పదేళ్లలో 53పైసల ధర పెరిగితే, కేవలం ఈ నాలుగేళ్లలో యూనిట్ విద్యుత్ ధరను రెండు రూపాయలకుపైగా పెంచారని ఆందోళన వ్యక్తం చేసారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఫెర్రో పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్తు యూనిట్ ధర 2.65రూపాయలు ఉండగా ప్రస్తుతం ఈ ధర 4.81రూపాయలకు పెరిగిందని చెప్పారు. దీనికితోడు విద్యుత్ సెస్సు పేరిట అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. దీనికితోడు ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకు కొనుగోలు ధరలు, ఉత్పత్తుల తయారీ అనంతరం అమ్మకం ధరలు ప్రపంచ మార్కెట్‌తో ముడిపడి ఉండటంతో ఈ పరిశ్రమలు విపత్కర పరిస్థితులు ఎదర్కుంటున్నాయని అన్నారు. ఫలితంగా దేశీయంగా ఉత్పత్తుల అమ్మకాలు, విదేశాలకు ఎగుమతి విషయంలో వెనకబడిపోతున్నామని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పుల్లారావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేసారని, మంత్రులు పలు దఫాలుగా సమావేశమై ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను ఆదుకునే చర్యలో భాగంగా ఈ పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌పై ఒక రుపాయి ధర తగ్గించాలని సిఫారసు చేస్తున్నట్లు సమాచారం ఉందని, కానీ ఈ తగ్గింపు ఫెర్రో పరిశ్రమలకు ఏ మాత్ర ఊరట కలిగించేది కాదన్నారు. కనీసం యూనిట్‌కు 1.80రూపాయలు తగ్గిస్తేనే నష్టాలను పూరించుకోవటంతోపాటు పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. విలేఖరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు ఎంఎస్‌ఎస్ శర్మ, ఎఎస్‌వి ప్రసాద్, గోపి, ఎస్‌వి రావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పుస్తకపఠనం తప్పనిసరి
*కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: ప్రస్తుత పోటీప్రపంచంలో విద్యార్థులకు పుస్తకపఠనం తప్పనిసరిగా మారిందని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపల్ గ్రూప్ కెప్టెన్ రవికుమార్ అన్నారు. ఆదివారం సైనిక్ పాఠశాలలో ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్టణానికి చెందిన ఒక పుస్తక ప్రచురణ సంస్థ ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్ధేశించి ప్రిన్సిపల్ కెప్టెన్ రవికుమార్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడంవల్ల మేధోశక్తి పెరుగుతుందని, విద్యార్థుల మధ్య పోటీని తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో పాఠశాల మ్యాగజైన్‌ను కెప్టెన్ రవికుమర్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రవీణ్‌కుమార్, పరిపాలన అధికారి స్క్వాడ్రన్ లీడర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూళ్లను వినియోగించుకోవాలి
గజపతినగరం, ఫిబ్రవరి 14: అర్హులందరు ఓపెన్ సూళ్లను వినియోగించుకోవాలని ఓపెన్ స్కూల్ రాష్ట్ర సమన్వయ కర్త రవికుమార్ కోరారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్‌ను రాష్ట్ర కో- ఆర్డినేటర్ రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అందిస్తున్న విద్యా అవకాశాలను అర్హులు వినియోగించుకోవాలని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ ఆరునుండి 19 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు ఈనెల 17వ తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఎనిమిదవ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసామని తెలిపారు. 14 ఏళ్లునిండిన ప్రతి ఒక్కరు నేరుగా ప్రవేశం పొందవచ్చని చెప్పారు. గ్రామ సర్పంచ్, విద్యాకమిటీలు, అంగన్వాడి, డ్వాక్రా సంఘాల సభ్యులు, ఉపాధ్యాయులు గ్రామాల్లోని అర్హులను గుర్తించి విద్యయొక్క ప్రాముఖ్యత తెలిపి ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని మండల సమన్వయ కర్తను ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రంలో విద్యార్థుల హాజరు శాతం, వివిధ రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త రమేష్‌నాయుడు, మండల సమన్వయ కర్త సూర్యారావు, ఉపాధ్యాయులు రమేష్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రథసప్తమి వేడుకలు
విజయనగరం (పూల్‌బాగ్), ఫిబ్రవరి 14: పట్టణంలో ఆదివారం పలు ఆలయాల్లో రథసప్తమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు.బాబామెట్టలో ఉన్న శివపంచాయతన ఆలయం రథసప్తమి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువజామున స్వామివారికి పంచామృతాభిషేకం ,అర్చనలు, అభిషేకపూజలు జరిపారు.అనంతరం స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. పట్టణంలోని టిటిడి కళ్యాణమండపంలో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో టిటిడి, హిందూధర్మ ప్రచారపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రధసప్తమి వేడుకలను నిర్వహించారు. యోగా ఉపాధ్యాయులు రవికుమార్ ఆధ్వర్యంలో వందమంది బాలబాలికలు సూర్యనమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం చేసారు. ఈసందర్భంగా టిటిడి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్యామసుందరం మాట్లాడుతూ రథసప్తమి రోజున సూర్యుని ఆరాధిస్తే మానసిక రుగ్మతులు, కంటివ్యాధులు తగ్గుతాయని పేర్కొన్నారు.తిరుమల తిరుపతి దేవస్ధానములు ఆదేశానుసారం ఈకార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు నరసింహాచార్యులు పాల్గొన్నారు.
కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాల్సిందే..
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 14: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం, కంటింజెంట్, డైలీవేజ్ తదితర ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఉద్యోగుల సమాఖ్య జిల్లాకమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ టిడిపి, బిజెపి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తమ స్థితిగతులు మారుతాయని అశించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం, ఇప్పటికే వివిధ పద్దతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడం అటుంచి ఉన్న ఉద్యోగాలనే పీకివేసే పరిస్థితులు ఏర్పడటంపట్ల ఆందోళన వ్యక్తం చేసారు. కొన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులకు నెలల తరబడిగా వేతనాలు చెల్లించడం లేదని, దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రాష్ట్రప్రభుత్వ ఉగ్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పైసాకూడా పెంచకపోవడం శోచనీయమని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ తదితర ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన మాదిరిగా వేతనాలను ప్రారంభ తేదీనుంచి అమలు చేయాలని కోరారు. తొలగించిన హౌసింగ్ వర్కు ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యమిత్రలను ఉద్యోగాలలో కొనసాగించాలని డిమాండ్ చేసారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన మాదిరిగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలోని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాలని, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, హెచ్‌ఆర్‌ఎ, కరువుభత్యం తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో ఎపిఎన్‌జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణమూర్తి, వివిధ సంఘాల ప్రతినిధులు కాంతారావు, మాధవి, శంకర్‌రావు, విజయ్‌కుమార్, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
రాత మారని గిరిజనం
గంట్యాడ, ఫిబ్రవరి 14: నాగరిక ప్రపంచానికి దూరంగా తాటిపూడి జలాశయం అవతల కొండకోనల్లో నివసిస్తున్న గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ గ్రామంలో తిష్టవేసిన సమస్యలకు దశాబ్ధాల నుంచి మోక్షం కరవయింది. ఎందరో నేతలు మారుతున్నా గిరిజనుల రాతలో మాత్రం మార్పులు కానరావడంలేదు. జలాశయం ఆవల ఉన్న గిరిజన గ్రామాలు ఇప్పటికీ ఐటిడిఎలో విలీనం కాలేదు. సబ్‌ప్లాన్ ఏరియాగా గిరిజన గ్రామాలకు గుర్తింపు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇచ్చిన హామీలు ఎన్నికల వాగ్ధాన బంతిగానే మిగిలాయి. మండలం పరిధిలో తాటిపూడి జలాశయం ఆవల ఎగువ కొండపర్తి, జడ్డేర్, దిగువ కొండపర్తి,వ భీమవరం, అడ్డతీగ, మొసలిఖండి తదితర గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి డికె పర్తి కేంద్రంతో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసారు. ఈ గిరిజన గ్రామాలు ఐటిడిఎలో విలీనం కానందున ఆ సంస్థనుంచి నిధులు అందక అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది. గిరిజన ప్రజలు మైదాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు పక్కా రహదారి లేదు. చిన్నపాటి మట్టిరోడ్డు మీదుగా కాలినడకన మైళ్లదూరం నడిచి బౌడేర జంక్షన్‌కు చేరకుని అక్కడ వాహనల్లో మండల కేంద్రానికి, మైదానప్రాంత గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రోడ్డుమార్గంలో మధ్యలో పెద్ద ఏరు ఉంది. వర్షాకాలంలో ఆ ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనుల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీనిపై వంతెన నిర్మించాలని గిరిజనులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికి సమస్య షరిష్కారం కాలేదు. తాటిపూడి నుంచి గిరిజన గ్రామాలకు గిరిజన బోటు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే రోజుకు రెండుసార్లు తిప్పుతున్నారు. గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం లేనందున గిరిజనులకు అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందడం లేదు. విద్యుత్ సౌకర్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు తరుచూ మొరాయించడంతో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. పలు గిరిజన గ్రామాల్లోని గిరిజనులు ఇప్పటికే పూరిపాకల్లో నివాసం ఉంటున్నారు. గతంలో కొందరు గిరిజనులకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లు మూన్నాళ్లకే శిథిలం అయ్యయి. గిరిజనులకు ప్రభుత్వం పక్కాఇళ్లు మంజూరు చేసినా వాటిని నిర్మించడం తలకు మించిన భారం అయ్యింది. పక్కారోడ్డు సౌకర్యం లేని కారణంగా ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇనుము, సిమెంటు తదితరాలను గిరిజన బోటులో అడ్డతీగకు తరలించేందుకే రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. అడ్డతీగ నుంచి లభ్ధిదారులు గ్రామాలకు గిరిజన కూలీలతో తరలించడానికి మరికొంత ఖర్చు అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులో సామాగ్రి రవాణ ఖర్చు ఎక్కువగా ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి గిరిజనులు వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వమే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని గిరిజన గ్రామాల్లో అదనంగా రక్షిత మంచినీటి పథకాలు, బోర్లు నిర్మించి మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. తమ గ్రామాలకు సబ్‌ప్లాన్ గుర్తింపు తీసుకువచ్చి తిష్టవేసిన సమస్యలను పరిష్కరం ఏ నాయకుడు చూపుతారా అని గిరిజనులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు పూడిక తొలగించారు!
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 14: ఉడాకాలనీ, ఆర్టీసీ కాలనీల సరిహద్దులోని మురికి కాలువలోపేరుకుపోయిన చెత్తను ఎట్టకేలకు మున్సిపల్ శానిటరీ సిబ్బంది తొలగించారు. ఆంధ్రభూమిలో ఈమురికి కాలువ దుస్థితి గురించి వెలువరించిన కథనానికి స్పందించిన యంత్రాంగం ఆదివారం ఉదయం పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకుంది. శానిటరీ ఇనస్పెక్టర్ రామారావు దగ్గరుండి కాలువలోని చెత్తను జెసిబితో తొలగింపచేసారు. దాదాపు నాలుగు లారీల చెత్త ఈకాలువనుండి వెలికితీసారు. కాలువలో పేరుకు పోయిన మురికి కారణంగా సమీపంలో నివాపం ఉంట్ను వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , దుర్గంధంతో ముక్కులు మూసుకుంటున్నారని వచ్చిన వార్తా కథనం వారి కళ్లు తెరిపించింది. ఎట్టకేలకు కాలువ ను కింద వరకు శుభ్రం చేసారు. దీంతో ఆయా ఆకాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
కిరోసిన్‌కు చెల్లుచీటి
ఏలూరు, ఫిబ్రవరి 14 : రేషన్ సరుకుల పంపిణీ విధానంలో భారీ సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రేషన్ విధానంలో వస్తున్న సరికొత్త మార్పులు కొన్ని సార్లు డీలర్లను ఇబ్బందుల్లో పడేస్తుంటే మరికొన్ని సార్లు వినియోగదారులను గందరగోళంలో పడవేస్తూ వస్తున్నాయి. అయితే తాజా పరిణామాల్లో దీపం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య పెరిగినందున రానున్న రోజుల్లో ఇక కిరోసిన్ అవసరాలు కుటుంబాలకు ఉండవని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. దానికి తగ్గట్టుగా రానున్న మే నెల నుంచి రేషన్ కార్డులపై ఇస్తున్న కిరోసిన్‌ను పూర్తిస్థాయిలో నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లోనూ రేషన్ డీలర్లకు సూత్రప్రాయమైన నిర్ణయాన్ని వెలువరించినట్లు సమాచారం. వాస్తవానికి జిల్లాలో దాదాపు 11 లక్షలకు పైగా రేషన్‌కార్డులు వున్నాయి. వీటికి తోడు ఇటీవల కొత్త కార్డులను కూడా మంజూరు చేశారు. వీటితో ఈ సంఖ్య మరింతగా పెరిగింది. మరోవైపు గ్యాస్ కనెక్షన్ వున్న వారికి ఒక లీటరు, లేనివారికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు లీటర్లు చొప్పున కిరోసిన్‌ను ఇంతకాలం సరఫరా చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా చూస్తే సరాసరిన కార్డుకు రెండు లీటర్లు చొప్పున వేసుకున్నా దాదాపు 22 లక్షల లీటర్ల మేరకు జిల్లా వ్యాప్తంగా కిరోసిన్ వినియోగం రేషన్ దుకాణాల నుంచి జరుగుతున్నట్లు భావించవచ్చు. అయితే ఈ మొత్తంలో కొన్ని సందర్భాల్లో తగ్గుదల, పెరుగుదల వున్నప్పటికీ సరాసరిన ఆ స్థాయిలో కిరోసిన్‌ను పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వున్న సామాజిక పరిస్థితుల్లో కిరోసిన్ అవసరంపై ఎన్నో ప్రశ్నలు రేగడం తెలిసిందే. కిరోసిన్‌ను వినియోగించి కుటుంబ అవసరాలను ముందుకు తీసుకువెళుతున్న కుటుంబాలు ఎన్ని వుంటాయన్న అంశంలోనూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుతం టిడిపి ప్రభుత్వ హయాంలోనూ కూడా దీపం పధకాన్ని జోరుగా అమలు చేస్తూ రావడం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను పెద్ద ఎత్తున మంజూరు చేశారు. ఇక పట్టణ ప్రాంతాల్లో దీపం పధకం కింద కనెక్షన్లు తీసుకున్న వారూ అధిక శాతం మంది వుండగా ప్రైవేటుగా కూడా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారి సంఖ్య కూడా భారీగానే వుంది. ఆ విధంగా గ్యాస్ కనెక్షన్లు వున్న వారి సంఖ్య గత కొద్దికాలంలోనూ భారీ ఎత్తున పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే గ్యాస్ కనెక్షన్లు వున్న వారికి కిరోసిన్‌ను సరఫరా చేయడం ఎంత వరకు సహేతుకం అన్న అంశంలో అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. దీపం పధకం కింద సబ్సిడీని అందిస్తూ గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పంపిణీ చేస్తూ వస్తున్నారు. అలాగే గ్యాస్ సిలెండర్ల విషయంలోనూ సబ్సిడీ అమలవుతూనే వుంది. మరోవైపు అవే కుటుంబాలకు పూర్తిస్థాయి సబ్సిడీతో పంపిణీ చేసే కిరోసిన్‌ను సరఫరా చేయడంలో హేతుబద్దత లేదన్న అంశం తెరపైకి వచ్చింది. ఆ విధంగా చూస్తే జిల్లాలో దీపం పధకం భారీ ఎత్తున అమలు కాగా దీనిలోనూ బయట కూడా గ్యాస్ కనెక్షన్లు పొందిన వారి సంఖ్య దాదాపు రేషన్‌కార్డుదారుల సంఖ్యతో సరిపోలే విధంగా వుండటం గమనార్హం. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం కనెక్షన్లు వున్న వారికే మళ్లీ కిరోసిన్ కూడా అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావించింది. అంతేకాకుండా డబుల్ సబ్సిడీగా కూడా ఈ వ్యవహారం మారుతుండటాన్ని గమనించింది. దీంతో ప్రస్తుతం వున్న సామాజిక పరిస్థితుల్లో లీటరు కిరోసిన్ సరఫరా చేయడం వల్ల ఆయా కుటుంబాలకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా మరోవైపు దీనివల్ల సబ్సిడీ భారం మాత్రం ప్రభుత్వంపై భారీగా ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే జిల్లా యంత్రాంగం రానున్న మే నెల నుంచి కిరోసిన్ పంపిణీని నిలిపివేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒక విధంగా చూస్తే ఏజెన్సీ, మరికొన్ని మెట్ట ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల విస్తృతి అంతగా లేదన్న విషయం బహిరంగ రహస్యమే. అలాంటి చోట్ల కిరోసిన్ వాడకం అధికంగానే వుంటుంది. ఆ ప్రాంతాల్లోనూ దీని పంపిణీ నిలిపివేస్తే సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రాధమికంగా తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి వచ్చే సరికి ఎన్ని మార్పులకు లోనవుతుందో వేచి చూడాలి.
అంతర్వేది ఉత్సవాలు ప్రారంభం
నరసాపురం, ఫిబ్రవరి 14: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి అంతర్వేది పుణ్యక్షేత్రానికి వెళ్ళే యాత్రికులు స్థానిక మాధవాయిపాలెం రేవు నుంచి పంటుపై సఖినేటిపల్లి చేరుకుంటున్నారు. యాత్రికులను అంతర్వేది చేరవేసేందుకు ఆర్టీసి సుమారు 100 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వసిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి
కేంద్రం సుముఖత
నరసాపురం ఎమ్మెల్యే బండారు
నరసాపురం, ఫిబ్రవరి 14: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ పట్టణంలో వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వెల్లడించారు. ఆదివారం స్థానిక నీటి పారుదల శాఖ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రూ.1800 కోట్ల వ్యయంతో డ్రెడ్జింగ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుల మధ్య రూ.200 కోట్ల వ్యయంతో వంతెన నిర్మిస్తారన్నారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అందించారన్నారు. దీనిపై మంత్రి గడ్కరీ సూత్రపాయంగా అంగీకరించారన్నారు. పూర్తి ప్రభుత్వ అనుమతులు, టెండర్ ప్రక్రియలతో ఈ ఏడాది మే, జూన్ నెలల్లో వంతెన నిర్మాణానికి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అలాగే కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటుపై కూడ సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారు పటేల్‌రాజా నాయడు, టిడిపి నాయకులు కొప్పాడి రవీంద్ర, పొనమండ నాగేశ్వరరావు, పసుపులేటి సాయి, కొల్లు పెద్దిరాజు, కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఆస్తులంటే అంతే!
*ఆస్తుల వివరాల నిక్షిప్తంపై అలక్ష్యం*రూ.కోట్లాది విలువైన స్థలాలకు జియోట్యాగింగ్*పురపాలికల్లో పూర్తికాని నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 14: పురపాలక సంఘాల్లో రూ.కోట్లు విలువజేసే ఆస్తులను గుర్తించి వాటి ఉనికి, వివరాలు, విస్తీర్ణం ఇతరత్రా పూర్తి వివరాలను ఫొటోలతో సహా ఇంటర్నెట్‌లో నమోదుజేసి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియోట్యాగింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఏడాది గడిచినా ఈ ప్రకారం జిల్లాలో పూర్తికాలేదు. పురపాలక, ప్రభుత్వ ఆస్తులను రక్షించి భావితరాలకు మిగిలేలా తీసుకోవాల్సిన చర్యలు ముందుకు సాగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం జియోట్యాగింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పురపాలక సంఘాల్లో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ, పురపాలక సంఘ స్థలాలను రక్షించుకునేందుకు శాటిలైట్ ద్వారా వాటి సరిహద్దులను గుర్తించి ఫోర్ ఫిగర్, సిక్స్ ఫిగర్‌లో వాటిని ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదుజేసి వాటి వివరాలను నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నోచోట్ల పురపాలక ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయన్న సంగతి తెలిసిందే. అధికారుల వైపునుండి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తుల, భూ వివరాలు ప్రభుత్వం ఆదేశించిన విధంగా నిక్షిప్త ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు. పూర్తయిన వాటి వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాల్సి ఉంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఇంకా ఆస్తుల గుర్తింపే పూర్తి కాలేదు. ఏడాది దాటినా ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఆరంభంలోనే హడావుడి..
జియోట్యాగింగ్ చేయాలని వెంటనే వెబ్‌సైట్‌లో వాటి వివరాలు పొందుపర్చాలని పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. దీంతో ఏడాది క్రితం హడావుడిగా వారి దగ్గరున్న వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అంతే ఇక అక్కడ నుండి జియోట్యాగింగ్ అంశం మూలకు చేరింది. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తోపాటు నగర పంచాయితీగా ఉన్న జంగారెడ్డిగూడెం తదితర పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఏదో తమకు తెలిసిన సమాచారాన్ని ఒక ఫొటో తీసి వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇక పురపాలక సంఘాలకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వాణిజ్య దుకాణాలను జియోట్యాగింగ్ పూర్తిస్థాయిలో చేయలేదు. ఏలూరు, నరసాపురంలలో ఇంకా ఈ ప్రక్రియ చేయాల్సి ఉంది. పాఠశాలల భవనాలను గుర్తించడంలో భీమవరం, ఏలూరు, నరసాపురం, తణుకు పురపాలక సంఘాలు జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. పురపాలక భవనాలు జియోట్యాగింగ్ చేయడంలో భీమవరంతోపాటు నరసాపురం, ఏలూరు, నీటి సరఫరా కేంద్రాలు, మొక్కల పెంపకం కేంద్రాలు, మతపరమైన నిర్మాణాలను, క్రీడా స్థలాలు, ఆసుపత్రులను ఇంకా జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఏదేమైనా ఆయా పురపాలక సంఘాల్లోని పట్టణ ప్రణాళిక అధికారులు మాత్రం ప్రభుత్వ, పురపాలక సంఘం ఆస్తులను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు పుర ప్రజలు ఆరోపిస్తున్నారు.
సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహరించిన శ్రీవారు
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 14: సప్త ఆశ్వాలను అధిరోహించిన చినవెంకన్న ఉదయం వేళ సూర్యప్రభ వాహనంపై అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై క్షేత్ర తిరువీధుల్లో ఉభయ దేవేరులతో విహరించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం జరిగిన ఈ తిరువీధి సేవ ఆద్యంతం భక్తులను అలరించింది. మాఘమాస శుద్ధ సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు అవతరించిన రోజు కావడంతో ఈ రథసప్తమి వేడుకను క్షేత్రంలో వైభవంగా జరిపారు. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. అలాగే రాత్రి చంద్ర ప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు పర్యవేక్షించారు.
పారిజాతగిరిపై వైభవంగా చక్రస్నానం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయ తిరువీధులలో పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్‌ను మేళతాళాలతో, గోవిందనామ స్మరణలతో ఊరేగింపుగా స్వామివారి కోనేరు వరకు తీసుకు వెళ్లి వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవం తరువాత కోనేరులో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన్ పెరుమాళ్‌తో కలసి భక్తులంతా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమ ఏర్పాట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాథరాజు (శివ) పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, బిక్కిన సత్యనారాయణ, కాకాని శ్రీహరిరావు, రాజాన సత్యనారాయణ, కంది బాలకృష్ణారెడ్డి, దుగ్గిరాల వెంకట సుబ్బారావు, రెడ్డి రంగప్రసాదరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బిసిలకు అన్యాయంచేస్తే ఉద్యమిస్తాం
* రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు నౌడు
ఉంగుటూరు, ఫిబ్రవరి 14: బిసిలకు అన్యాయంచేస్తే సహించేది లేదని, ఉద్యమిస్తామని బిసి జెఎసి జిల్లా ఛైర్మన్ నౌడు వెంకటరమణ అన్నారు. ఆదివారం యర్రమళ్ల గ్రామంలో నాలుగు గ్రామాలకు చెందిన బిసిలతో సదస్సు నిర్వహించారు. సదస్సుకు బిసి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పివి పెద్దిరాజు అధ్యక్షత వహించగా, నౌడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. బిసిలు శ్రామికులుగా పనిచేస్తూ దేశ సంపదను సృష్టిస్తున్నారని, బిసిలుగా ఉన్న ఈ వర్గాలకు ప్రభుత్వాలు, పార్టీలు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బిసిలు ఐక్యతగా ఉద్యమించాలన్నారు. లక్షమందితో పెట్టబోయే బిసిల సింహగర్జన విజయవంతం చేసేందుకు బిసిలు సిద్ధంగా ఉండాలని నౌడు పిలుపునిచ్చారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వి కాశి మాట్లాడుతూ బిసిలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు బిసిలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 15వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షకు బిసిలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షుడు పివి పెద్దిరాజు మాట్లాడుతూ బిసిలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీల కతీతంగా ఆయా పార్టీలలోని బిసి నేతలంతా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బిసి నాయకులు చిటికిన ప్రసాదు, తాడిశెట్టి ఎంబిస్వామి, వై త్రిమూర్తులు, బి రాంబాబు, బి రామకృష్ణ, అనుపోజు బ్రహ్మం, శ్రీను, నెరుసు పుల్లయ్య, పొన్నాడ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా పార్కు నిర్మాణ పనులు నిలిపివేతకు సిఎం ఆదేశం
నరసాపురం, ఫిబ్రవరి 14: తుందుర్రు ఆక్వా పార్కు నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్కును ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఎక్సయిజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి సిఎంకు వివరించామన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పార్కు నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారని తెలిపారు.
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం
ఆకివీడు, ఫిబ్రవరి 14: కార్యకర్తలంతా సమిష్ఠిగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం అన్నారు. ఆకివీడు మండల టిడిపి కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక ఎఎంసి కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవర్గాల కోసం ప్రతిష్టాత్మకంగా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. వాటిని ప్రజలకు చేరవేసే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పలువురు కార్యకర్తలు వాణిజ్య బ్యాంకులు లబ్ధిదారులకు సహకరించడంలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు రుణ సదుపాయాలు అందించడంలో ఆయా బ్యాంకు మేనేజర్లు సహకరించడం లేదన్నారు. ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రూ. 1.2 కోట్ల నిధులు పుంతరోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయన్నారు. రూ.60 లక్షలు ఎఎంసి, రూ.60 లక్షల ఉపాధి హామీ నిధుల నుండి వెచ్చించనున్నట్లు తెలిపారు. సాగునీటి విషయంలో ఎమ్మెల్యే శివరామరాజు ప్రత్యేక శ్రద్ధతీసుకుని ప్రతీ ఎకరాకు నీరందేలా చర్యలు చేపడుతున్నారన్నారు. సమావేశంలో బొల్లా వెంకట్రావు, సర్పంచ్ గణపతి, బచ్చు సరళకుమారి, చుండూరి సత్యనారాయణ, బచ్చు కృష్ణ, నగేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లులో సూర్యనమస్కార పోటీలు
పాలకొల్లు, ఫిబ్రవరి 14: స్థానిక వాసవీ క్లబ్, పంతంజలి నిత్య యోగ సాధనా కేంద్రం సంయుక్తంగా శ్రీసరస్వతీ శిశుమందిర్ ప్రాంగణంలో సూర్య నమస్కారాల పోటీ నిర్వహించారు. 400 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. 8 సంవత్సరాల నుండి 90 సంవత్సరాలు వయస్సు వారు పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థులు 410 సూర్యనమస్కారాలు నిర్వహించి పట్టణ రికార్డును అధిగమించారు. 7 విభాగాలలో బహుమతీ ప్రదానం మండల విద్యాశాఖాధికారి గంగాధరశర్మ, వాసవీ మాజీ గవర్నర్ శ్రీఖాకొల్లు మైథిలి అందించారు. వాసవీ క్లబ్ అధ్యక్షుడు రవికుమార్, పంతంజలి యోగ సాధన కేంద్ర వ్యవస్థాపకుడు బోడా చక్రవర్తి, శ్రీసరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నరసింహరాజు తదితరులు వేదికనలంకరించారు. రవీంద్ర ఆధ్వర్యంలో సూర్యయజ్ఞం నిర్వహించారు. లింగరాజు సూర్య శతనామావళితో తొలి 108 మంత్రాలతో సూర్యనమస్కారాలు చేయించారు.
పాలకొల్లు రూరల్ టిడిపి సమావేశం
పాలకొల్లు, ఫిబ్రవరి 14: పాలకొల్లు మండలం తెలుగుదేశం సమావేశం ఆదివారం శివదేవునిచిక్కాలలో మండల అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొని కార్యకర్తలు నిత్యం పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదార్లకు అందేవిధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయో, లేదో చూడాలని ఆయన పిలుపునిచ్చారు. మండల ఉపాధ్యక్షుడు దిడ్ల రామాంజనేయులు, జడ్పీటిసీ కోడి విజయలక్ష్మి, ఉంగరాల నరసింహారావు, అందే కోటి వీరభద్రం, పచ్చగల్ల సైమన్, బెజవాడ మహలక్ష్మి, కె.రామచంద్రరావు, మండలంలోని టిడిపి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన పేరిట ఖజానాకు రూ.2600 కోట్లు గండి
తిరుపతి, ఫిబ్రవరి 15: విభజనతో రాష్ట్రంలో ఆర్థికలోటని ఒకవైపు చెబుతూనే విద్యుత్ ఉత్పాదనలో కమీషన్ల కోసం కక్కుర్తిపడి అయినవారికి మేలు చేయడం కోసం ఇచ్చిన టెండర్లతో రాష్ట్ర ఖజానాకు రూ.2600 కోట్ల రూపాయలు గండి కొట్టించిన ఘనుడు సిఎం చంద్రబాబు నాయుడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 800 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ఇందులో కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, స్టేజ్ 5లో 1, నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో మరొకటి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించిందన్నారు. వీటిని రెండు భాగాలుగా విభజించారని తెలిపారు. ఇందులో బాయిలర్‌లు, టర్భన్‌లు, జనరేటర్లు, అసోసియేటడ్ అక్సెలరీ సప్లై, ఎలక్షన్, కమీషనింగ్ మరొకటన్నారు. ఈ పనుల విలువ రూ.4614 కోట్లుగా నిర్థారించారన్నారు. ఈ పనులను నామినేషన్ విధానంతో బిహెచ్‌ఇఎల్ సంస్థకు అప్పగించారని తెలిపారు. ఈ నిర్ణయంతో ఒక్కో మెగావాట్‌కు అయ్యే వ్యయం రూ.2.88 కోట్లుగా నిర్ధారించారని ఆయన వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో రెండో భాగం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్. ఈపనులు చేపట్టడానికి ఎల్ అండ్ టి, ఇన్‌ఫ్రా, రిలయన్స్ ఇనఫ్రా, ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా వంటి 9 అతి పెద్ద కంపెనీలు ఉన్నాయన్నారు. ఈ పనులు అప్పగించడానికి టెండర్లు ఆహ్వానించే సమయంలో ఎన్‌టిపిసి నిబంధనలను మార్గదర్శకాలుగా నిర్దేశించాలన్నారు. తమకు కావాల్సిన సంస్థలకు పనులు అప్పగించి వేల కోట్లు దండుకోవడం కోసం ఈ నిబంధనలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనే సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకాని, లేదా పభ్రుత్వ రంగ సంస్థల పరిధిలోకాని అనుభవం ఉండాలని నిబంధనలు సృష్టించారన్నారు. వాస్తవానికి ఎన్‌టిపిసి నిబంధనలు మేరకు ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలకు ప్రైవేట్ రంగంలో అనుభవం ఉంటే చాలని ఆయన చెప్పారు. వీటిని గాలికి వదిలి అయినవారి కోసం నిబంధనలను సృష్టించడంతో మూడు కంపెనీలు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనే అర్హత కల్గిందన్నారు. ఎన్‌టిపిసి నిబంధనలు పాటించడమంటే 9 సంస్థలు టెండర్లలో పాల్గొని పోటీలో పాల్గొనేవని, తద్వారా వ్యయభారం గణనీయంగా తగ్గేదన్నారు. అలా కాకుండా కుట్రపూరితమైన నిబంధనలు అమలు చేయడంతో బిటిజీని బిహెచ్‌ఇఎల్‌కు అప్పజెప్పి, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్రాజెక్టు బిఒపిని బిజిఆర్‌కు అప్పగించారని అన్నారు. ఇక కృష్ణపట్నం వద్ద ఏర్పాటుచేసిన ప్రాజెక్టు బిఒపి పనులు టాటా ప్రాజెక్టుకు అప్పగించారని ఆయన తెలిపారు. దీంతో బిజిఆర్‌కు ఒక మెగావాట్ తయారీకి రూ.2.97 కోట్లు, టాటాకు రూ.3.42 కోట్ల ఒప్పందంతో కాంట్రాక్ట్ అప్పగించారని చెప్పారు. ఈక్రమంలో ఇబ్రహీంపట్నంలో చేపట్టే ఒక మెగావాట్‌కు రూ.5.8కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టు వద్ద చేపట్టే ఒక మెగావాట్‌కు రూ.6.3కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే 1600 మెగావాట్లకు 9,720 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక మెగావాట్ ఉత్పత్తికి 4.40 కోట్లు మాత్రమే వ్యయం చేస్తోందని రామచంద్రయ్య చెప్పారు. అంటే ఏపి తయారు చేస్తున్న విద్యుత్ ఉత్పాదన తెలంగాణ ప్రభుత్వం రూ.3536 కోట్లకే తయారుచేస్తోందని అన్నారు. దీంతో రాష్ట్రానికి రూ.2600 కోట్ల రూపాయలు గండిపడుతోందన్నారు. మధ్యప్రదేశ్‌లో బరేటి వద్ద నిర్మాణం అవుతున్న థర్మల్ ప్రాజెక్టులో రూ.0.83 కోట్లు మాత్రమే ఖర్చు అవుతోందని అన్నారు. అదే సంస్థ ఏపిలో రూ.2.97 కోట్ల రూపాయలు వసూలు చేస్తోందన్నారు. అంటే ఒక మెగా వాట్‌కు రూ.2.14కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొనిందన్నారు. అనంతపూర్ సోలార్ ప్రాజెక్టు ఎంపికలో కూడా అవినీతి విచ్చలవిడిగా సాగిందని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఇక్కడ కూడా నిబంధనలకు తూట్లు పొడిచి టైగర్ మేల్ నిబంధనలు ఏర్పరిచి 5 కంపెనీలు మాత్రమే అర్హత సాధించేలా చేశారన్నారు. అందుకే ప్రభుత్వం థర్మల్, సోలార్ టెండర్లను వెంటనే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టెండర్లపై జరిగిన ఒప్పందాల ఫైల్‌ను స్పీకర్ టేబుల్‌పై ఉంచి అన్ని రాజకీయపార్టీలు పరిశీలనకు ఉంచాలన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి అశోక్ సామ్రాట్ యాదవ్, నైనార్ శ్రీనివాసులు, నాయకులు నాగభూషణం, వెంకటనరసింహులు తదితరులు పాల్గొన్నారు.
వరకట్నం వేధింపులకు వివాహిత బలి
* పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
కలికిరి, ఫిబ్రవరి 15: మద్యానికి బానిసైన భర్త వరకట్నం కోసం వేధిస్తూ భార్యను బలిచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన సంఘటన కలికిరి మండలంలో చోటు చేసుకుంది. వాల్మీకిపురం సిఐ శ్రీ్ధర్‌నాయుడు, ఎస్‌ఐ మల్లికార్జునల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలికిరి మండలం, టి.సండ్రవారిపల్లె పంచాయతీ, దూదేకులవారిపల్లెలో నివాసం ఉంటున్న రసూల్ కుమారుడు మహ్మద్ ఆలీ, మండల కేంద్రంకలికిరి పట్టణం బీడికాలనీకి చెందిన అబ్బాస్ కుమార్తె అయిషాకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిస్బా ఉంది. భర్త మహ్మద్ ఆలీ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల పనులకెళ్లకుండా నిత్యం మద్యం సేవించి అదనపుకట్నం తీసుకురావాలని భర్త, అత్త ఫాతిమాలు అయిషాను వేధింపులకు గురిచేసేవారు. 3 మాసాల క్రితం అబ్బాస్ బీడికాలనీ నుంచి ఇందిరమ్మకాలనీలోకి నివాసం మార్చాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి భార్యను హతమార్చిన భర్త వాల్మీకిపురం సిఐ శ్రీ్ధర్‌నాయుడు ఎదుట లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని వాల్మీకిపురం ఎస్‌ఐ మల్లికార్జున పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాల్మీకిపురం ఎస్‌ఐ తెలిపారు.
గల్ఫ్ పేరిట ఏజెంట్ మోసం
* టిటిడిలో ఉద్యోగమిప్పిస్తానంటూ మరో మోసం
* బాధితులు పోలీసులకు ఫిర్యాదు
కలకడ, ఫిబ్రవరి 14: మహిళలను గల్ఫ్‌కు పంపించి మంచి జీతం ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ ఏజెంట్ మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కె.దొడ్డిపల్లె గ్రామం, గోపాలపురంకు చెందిన వరదంశెట్టి రమణయ్య తన భార్య రాసమ్మ (50), కుమార్తె దీపిక(27)లను వాల్మీకిపురం మండలం, విఠలం గ్రామానికి చెందిన పూజారి రమేష్ ద్వారా ఇరువురిని గల్ఫ్‌కు పంపాలని గతంలో ఆశ్రయించాడు. ఏజెంట్ రమేష్ 2014 ఫిబ్రవరిలో రాసమ్మను సౌదీ అరేబియాకు పంపాడు. కుమార్తె దీపికను గల్ఫ్‌కు పంపుతున్నట్లు నమ్మబలికాడు. ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున వసూలుచేసి గల్ఫ్‌కు పంపుతున్నట్లు బాధితుడు రమణయ్య తెలిపాడు. తన భార్యను సౌదీ అరేబియాకు పంపాడని, జీతం రూ.16వేలు అని చెప్పి కేవలం రూ.10వేలు ఇప్పించి మోసం చేశాడని రమణయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు రెండు నెలలుగాటెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించగా, తాను ఏజెంట్ రమేష్‌కు తిరిగి వచ్చేందుకు విమాన టిక్కెట్టుకు రూ.12వేలు చెల్లించారని, అయినా రమేష్ అందుబాటులో లేడని రమణయ్య వాపోయాడు. తన కుమార్తె దీపికను ఏ గల్ఫ్ దేశానికి పంపాడో తెలియదని, వ్యభిచార గృహాలకు ఏజెంట్ అమ్మేశాడనే అనుమానం కలుగుతోందని ఆయన వాపోయాడు. ఏజెంట్ రమేష్ గంటకో మాట, పూటకో అబద్దం చెడుతూ తన కుమార్తె ఆచూకీ చెప్పడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మాతో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకొని రొంపిచెర్లకు చెందిన వినోద్‌కుమార్‌కు టిటిడిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.2లక్షలు వసూలుచేసి ఆ తరువాత కనిపించకుండా పోయాడని బాధితుడు కలకడ పోలీసులను ఆశ్రయించాడు. మహిళలను గల్ఫ్‌కు పంపిస్తామని మాయమాటలు చెప్పి మోసాగిస్తున్న ఏజెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలకడ పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కాపులను బిసిలో చేర్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలి
* కలెక్టరేట్ ఎదుట బిసి సంక్షేమ సంఘం రిలే దీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 15: కాపులను బిసిలో చేర్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని బిసిల జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్దమన్నారు. రిజర్వేషన్ అనేది సాంఘిక వివక్షత అణచివేతకు సంబంధించినదే గానీ ఆర్థిక అంశంకాదన్నారు. రాజ్యాంగ పరంగా బిసిలకు కేటాయించిన రిజర్వేషన్లను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం బిసి జాబితాలో ఉన్న కులాలు సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారన్నారు. బిసిలు చేతి వృత్తులు, చాకిరీలు చేస్తూ సాంఘిక వివక్షతకు గురైన వారేనని తెలిపారు. కాపులు అలాంటి సాంఘిక వివక్షతకు అణచివేతతనానికి గురి కాలేదని, అలాంటి వారు బిసిలు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి అట్లూరి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బిసి కులాలకు సంబంధించి కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని, నిష్పక్షపాతంగా కాపు కులాలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులపై సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాపులను బిసిల్లో చేరిస్తే తీవ్రమైన అన్యాయం బిసిలకు జరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బిసిలకు నష్టంజరిగే ప్రమాదం ఉందన్నారు. బిసిలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామనడంలో వాస్తవం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం కాపులను బిసిలో చేర్చే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నేతలు రమేష్, కృష్ణమూర్తి, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
నత్తనడకన శివరాత్రి పనులు
* సమన్వయలోపంతోనే ఆలస్యం
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 2 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకోసం నెలరోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేసి తుది మెరుగులు దిద్దాల్సిన అధికారులు ఇప్పటి వరకు ఒక్క పనిని కూడా పూర్తి చేయలేదు. దేవస్థానం అధికారులకు, ధర్మకర్తల మండలికి మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో శివరాత్రి ముంచుకొస్తున్నా పనులు ఏ ఒక్కటి పూర్తికాలేదు. ఆలయం గోపురాలకు రంగులు వేయడం, ఆలయం లోపల, బయట విద్యుత్ దీపాలంకరణలు చేయడం, స్వాగత తోరణాలు ఏర్పాటు, తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు, రంగవల్లులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక క్యూలైన్లు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా నేటికి ఏ పనిని పూర్తి చేయకపోవడంపై ప్రజలు, భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు పురమాయించడంలో దేవస్థానం అధికారులకు, ధర్మకర్తల మండలికి మధ్య అభిప్రాయభేదాలు రావడమే ఇందుకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల పనులు కాంట్రాక్టర్లకు కేటాయించడంపై జనవరి నెలాఖరులో ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న పనులను గత పదిరోజుల క్రితమే ప్రారంభించారు. ఇప్పటి వరకు ఊరేగింపు వాహనాలకు రంగులు వేయడం, ఆలయంలోపల విద్యుత్ దీపాలు అమర్చేపనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆలయం వెలుపుల చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, గోపురాలకు వెల్లవేయడం, స్వాగత తోరణాల ఏర్పాటు గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఆలయం లోపల 10 ప్రాంతాల్లో రంగవల్లికలు తీర్చిదిద్దాల్సి ఉంది. ఈ పనులు పూర్తయ్యాకే క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. ఈపాటికే అన్ని పనులు పూర్తచేసి తుది మెరుగులు దిద్దాల్సిన సిబ్బంది ఏపని పూర్తికాక సతమతమవుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు మాత్రం ఉత్సవాలు ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. పనుల ప్రారంభంలో ఆలస్యం జరిగినమాట వాస్తవమేనని, శివరాత్రి నాటికి అన్ని పనులు పూర్తిచేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.
హామీలను విస్మరించిన చంద్రబాబు
* ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ
పుంగనూరు, ఫిబ్రవరి 15: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా విస్మరించారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మండల పర్యటనలో భాగంగా కొండచెర్లలో విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు టిడిపి మేనిఫెస్టోలోని హామీలు ప్రజలకు గుప్పించి రైతులు, మహిళలవద్ద ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రుణమాఫీ కింద సుమారు నాలుగు వేల కోట్లుచ్చి ఏడాదికి వడ్డీకి కూడా సరిపోలేదన్నారు. ప్రస్తుతం బంగారం రుణమాఫీ తాను చెప్పలేదని అయినా రుణం మాఫీ చేశానని అబద్ధాలు ఆడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. అర్హులైన పేదలకు పింఛన్లు, ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పంచాయతీకి ఐదు నివాసాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. పూటకో ప్రకటన, రోజుకో జీవోతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బాబు జిమ్మికులను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారనీ, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. తెలంగాణాలో ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు నోటీసులు జారీ చేస్తుందన్నారు. ఈకేసులో చంద్రబాబు జైలుకెళ్లడం తథ్యమన్నారు. ఎవరూ బాబును కాపాడలేరని, అవినీతి, అక్రమాల్లో పీకలలోతు కూరుకుపోయారని విమర్శించారు. ఈసమావేశంలో ద్వారకనాథరెడ్డి, జెడ్పీటిసి వెంకటరెడ్డియాదవ్, భాస్కర్‌రెడ్డి, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాడికి పాల్పడ్డ ఆర్‌ఎస్‌ఎస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య డిమాండ్
తిరుపతి, ఫిబ్రవరి 15: ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఆర్‌ఎస్‌ఎస్ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ దాడిని నిరసిస్తూ సోమవారం స్థానిక గాంధి విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులను బిజెపి ప్రోత్సహించడం సరైందని కాదన్నారు. ప్రతిపక్షపార్టీల నేతలపై దాడులు చేయించడం కన్నా అవినీతిని తరిమికొట్టడానికి ప్రయత్నించాలన్నారు. దాడులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు రాజకీయ పోరాటం చేస్తారన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గాలపైన, లౌకిక తత్వంపైన దాడులు పెరిగాయని, దీనిని దేశంలోని మేధావులు, ప్రజాస్వామ్య వాదులు గమనిస్తున్నారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జెఎన్‌యులో విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడాన్ని సిపిఎం జాతీయ కార్యదర్శి ఏచూరి ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉసిగొల్పి బిజెపి భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సిపిఐ నాయకుడు హరికృష్ణ మాట్లాడుతూ బిజెపి అప్రజాస్వామిక దాడులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పీలేరు అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 15: పీలేరు అటవీ ప్రాంతాల్లో సోమవారం నుంచి పోలీసులు క్యూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఈ అటవీ పరిసర ప్రాంతాల్లో తమిళనాడు కూలీలు సంచరిస్తున్నారన్న సమాచారంతో పీలేరు అటవీ సరిహద్దు ప్రాంతాలైన ఎర్రావారిపాళ్యం, కలకడ, కెవిపల్లి తదితర ప్రాంతాల్లో ఈ క్యూంబింగ్ కొనసాగుతోంది. గతరాత్రి పోలీసులు పీలేరు సమీపంలో నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఎఎస్పీ రత్న ఆదేశాల మేరకు అదనపు బలగాలు తరలి వెళ్లాయి.
ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
* ముగ్గురిపై కేసు నమోదు
కలకడ, ఫిబ్రవరి 15: మండలంలోని కె.దొడ్డిపల్లెకు చెందిన ఎన్.్భస్కర్‌నాయుడుకు చెందిన ఉలవ పొలంలో అదే గ్రామానికి చెందిన చంద్రబాబునాయుడు పశువులు పంటను తిన్నాయి. దీంతో భాస్కర్‌నాయుడు, చంద్రబాబునాయుడు భార్య మాధవిపై దాడిచేసి గాయపరిచాడు. బాధితురాలు మాధవి ఫిర్యాదుమేరకు భాస్కర్‌నాయుడుపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం చంద్రబాబునాయుడు, అతని తండ్రి రాజేంద్రనాయుడు కలిసి భాస్కర్‌నాయుడుని కొట్టి గాయపరిచారు. దీంతో భాస్కర్‌నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన ముగ్గురిపై కేసునమోదు చేసినట్లు ఎఎస్‌ఐ రాజేంద్ర తెలిపారు.
18మంది బైండోవర్
పెద్దమండ్యం, ఫిబ్రవరి 15: గతంలో సారా కేసులో ఉన్న 18మందిని తహశీల్దార్ సుబ్బరాజు ఎదుట సోమవారం బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. సారా కాసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.
బ్యాంకులో పట్టపగలు చోరీ
గుర్రంకొండ, ఫిబ్రవరి 15: మండల కేంద్రమైన గుర్రంకొండలో పట్టపగలు 20వేలు రూపాయలు చోరీ జరిగింది. వివరాల మేరకు గుర్రంకొండలో సోమవారం మధ్యాహ్నం ఓప్రైవేటు బ్యాంకులో పెద్దమండ్యం మండలం వెలిగల్లు పంచాయతీ నడిమి బురుజుపల్లెకు చెందిన రెడ్డిమల్‌రెడ్డి గతంలో పంట రుణం తీసుకున్నాడు. సోమవారం రుణం చెల్లించాలని 45వేలు రూపాయలు బ్యాంకుకు తీసుకొచ్చాడు. రెడ్డిమల్‌రెడ్డికి చదువు రాదు. కాగా బ్యాంకు అధికారులకు తాను పంటరుణం వడ్డితో సహా చెల్లిస్తానని చెప్పగా బ్యాంకు అధికారులు 45వేలు రూపాయలు కట్టాలని తెలిపారు. రెడ్డిమల్‌రెడ్డికి చదువు రాకపోవడంతో పారం నింపేందుకు ఆలోచిస్తుండగా ఆయన పక్కనే తిరుగుతున్న ఇద్దరు యువకులు తాము రాసిస్తామని చెప్పారు. రెడ్డిమల్‌రెడ్డి ఆ యుకులను నమ్మి 45వేల రూపాయలు ఇచ్చాడు. ఆ నగదులో 20వేల రూపాయలు కాజేసి మిగిలిన నగదు, వివరాలు నింపిన ఫారం రెడ్డిమల్‌రెడ్డికి ఇచ్చి బ్యాంకులో కట్టమని చెప్పి బ్యాంకు నుండి పరారయ్యారు. బాధితుడు బ్యాంకులో చలాను పేపరుతో పాటు డబ్బులు ఇచ్చాడు. ఆనగదును లెక్కించిన క్యాషియర్ ఇందులో 25వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో బాధితుడు ఉలిక్కిపడ్డాడు. వెంటనే బ్యాంకు మేనేజరు సహదేవ నాయుడుని ఆశ్రయించాడు. మేనేజరు సిసి కెమెరాల పుటేజ్‌లను పరిశీలించగా దొంగలు బాధితుడి వెంటవున్న దృశ్యాలు సిసికెమెరా బట్టబయలు చేసింది. బ్యాంకుమేనేజరు బాధితుణ్ని పోలీసులకు ఫిర్యాదు చేయమని పంపారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సిసికెమెరాల్లోని దృశ్యాలను ఫొటోలు తీసుకుని పరిశీలించారు. కాగా దొంగలు మధ్యప్రదేశ్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించి కేసు నమోదుచేశారు.
కొండ్రాజుపట్టెడలో కనీస వసతులు కల్పించాలి
* నగరపాలక సంస్థ కమిషనర్‌కు ఎంపి వరప్రసాద్ విజ్ఞప్తి
తిరుపతి, ఫిబ్రవరి 15: ఎమ్మార్‌పల్లి సర్వేనెంబర్ 301, 296 సర్వేనెంబర్లలోని నిరుపేదలకు వెంటనే కనీస వసతులు కల్పించాలని తిరుపతి ఎంపి వరప్రసాద్, కొండ్రాజుపట్టెడ వీకర్స్ సెక్షన్స్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ప్రజలకు అవసరమైన వౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఎంపి కోరడంతో వెంటనే తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ వినయ్‌చంద్ తెలిపారు. ఈకార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు టి.గుణశేఖర్, నాయకులు జ్యోతిశ్వర్, రామమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, శరత్‌బాబు, విక్టర్, సుబ్బరామయ్య, బాలకృష్ణ, శరత్‌బాబు, మీనాకుమారి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
టెండర్ల అంశంపై తిరుమల స్థానికులకు హైకోర్టు ఊరట
తిరుమల, ఫిబ్రవరి 15: తిరుమల్లో టిటిడికి చెందిన దుకాణాలను టెండర్ల ద్వారా ఇవ్వాలని అధికారులు నిర్ణయించడంతో స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఈ టెండర్లు నిర్వహించకూడదని స్టే ఇవ్వడంతో ఊరట చెందారు.
ఇసుక వేలానికి బ్రేకు!
కాకినాడ, ఫిబ్రవరి 15: జిల్లాలోని ఐదు ఇసుక రీచ్‌లలో మంగళవారం నుండి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. అర్ధంతరంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మళ్ళీ ఇసుకాసురులకు కాసులు కురిపించనున్నది. కొత్త ఇసుక విధానానికి రూపకల్పన పేరుతో ఇసుక రీచ్‌లలో తవ్వకాలను గత నెల 31వ తేదీ నుండి ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో ఆయా రీచ్‌లలో తవ్వకాలకు బిడ్డర్ల ఎంపికకు సంబంధించిన జరగాల్సిన ఇ-వేలం ప్రక్రియ ఈనెల 13నుండి ప్రారంభమైంది. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇ-వేలంకు బ్రేక్ పడింది. నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చేవరకు జిల్లాలోని ఐదు రీచ్‌లలో తవ్వకాలకు తాజాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. జిల్లాలో ఈనెల 13న ప్రారంభమైన ఇ-వేలం ప్రక్రియ సోమ, మంగళవారాలతో పూర్తికావల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అర్ధంతరంగా వాయిదా పడింది. కొత్త ఇసుక విధానానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉండటం, ధర విషయంలో కచ్చితమైన నిర్ణయం జరగకపోవడం తదితర కారణాలతో ఇ-వేలం ప్రక్రియను అర్ధంతరంగా వాయిదా వేసినట్టు తెలిసింది. వెనువెంటనే జిల్లాలోని ఐదు రీచ్‌లలో తవ్వకాలను ఆయా డ్వాక్రా సంఘాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ రీచ్‌లలో తవ్వకాలు కూడా తక్షణమే ప్రారంభమయ్యేలా జిల్లా ఇసుక వేలం కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ముగ్గళ్ళ, కేతవానిలంక, జొన్నాడ, మందపల్లి, అంకంపాలెం రీచ్‌లలో తవ్వకాలను ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు అందేవరకు ఈ తవ్వకాలు కొనసాగుతాయి. వారానికి ఒక్కొక్క రీచ్ నుండి 7వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేలా నిబంధన విధించారు. ప్రస్తుతం జిల్లాలో ఆర్డీఓల ద్వారా సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ అవసరాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటునట్టు జిల్లా ఇసుక ఆక్షన్ కమిటీ ఛైర్మన్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిర్మాణాలకు ఇసుక కొరత అధికంగా ఉన్న కారణంగా జిల్లాలోని 5 రీచ్‌లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఐదు రీచ్‌ల తవ్వకాల బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించడంతో మళ్ళీ బినామీల చేతుల్లోకి రీచ్‌లు వెళ్ళే ప్రమాదం ఉంది కదా అన్న ప్రశ్నకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వెళ్తున్నట్టు ఆయన చెప్పారు. ఇ-వేలం ప్రక్రియ నిలిచిపోయినట్టేనా? అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఐదు రీచ్‌లలో తవ్వకాలు జరుగుతాయని ఆయన తెలిపారు.
కమల దళంలో కదన కుతూహలం
*మిత్రపక్షం తీరుతో కేడర్‌లో అసహనం
*రాజమహేంద్రవరంలో బలప్రదర్శన సభ
*పాల్గొంటున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకుంటున్న భారతీయ జనతాపార్టీ నెమ్మదిగా పట్టుసాధించే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టిన బిజెపి, నవ్యాంధ్రలో బలపడేందుకు వ్యూహాత్మకంగా కదులుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గతానికి భిన్నంగా విజయవంతంగా సాగించిన బిజెపి నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాలకు చెందిన వారిని పార్టీ సభ్యులుగా చేర్పించటంలో మంచి ఫలితాలను సాధించారు. అందులోనూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం మేరకు వైవిధ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాగించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ బిజెపి తన బలాన్ని పెంచుకోగలిగింది. బూత్‌ల వారీ కమిటీల ఏర్పాటు నుండి పార్టీని నిర్మించుకోగలిగిన బిజెపి అసలు తన బలమేమిటో ఒకసారి పరీక్షించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే మార్చి 6న రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లోను, నామినేటెడ్ పదవుల్లోను సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవటం వంటి కారణాలు కూడా బిజెపిలో పట్టుదలను పెంచినట్టు కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మద్దతునివ్వటంవల్లే స్వల్ప ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరచిపోయారని, అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి కార్యకర్తలు, నాయకులను నిర్లక్ష్యంచేస్తున్నారన్న అసంతృప్తి బిజెపి క్యాడర్‌లో ఉంది. జన్మభూమి కమిటీల్లో బిజెపి కార్యకర్తలకు చాలాచోట్ల కనీసం ప్రాతినిధ్యం కల్పించకపోవటం, నామినేటెడ్ పదవుల్లో బిజెపి కార్యకర్తలకు స్థానం లేకుండాచేసి అవమానాలకు గురిచేయటం వంటి విధానాల పట్ల బిజెపి నాయకత్వం తెలుగుదేశం పట్ల చాలాకాలంగా గుర్రుగానే ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా హెచ్చరికలను జారీచేయటంతో పాటు, బిజెపి నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని కలిగించాలన్న లక్ష్యంతో పార్టీ అధినాయకత్వం రాజమహేంద్రవరం బహిరంగ సభను మంచి అవకాశంగా వినియోగించుకోవాలని భావిస్తోంది.
రాజమహేంద్రవరంలో జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో కూడా ఇవే అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పార్టీ పట్ల కార్యకర్తలను ఆకర్షించటం, ఆకర్షితులయిన వారిని పార్టీలో కొనసాగేలా కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోర్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించటం, ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, బిజెపికి ప్రజలు దగ్గరయ్యేలా చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చజరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని బహిరంగ సభ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియచేయటం ద్వారా రాష్ట్ర ప్రజల మద్దతును కూడగట్టాలన్న బిజెపి ప్రయత్నాలకు మార్చి 6న రాజమహేంద్రవరం వేదిక కానుంది.
‘ఉపాధి’ కూలీల సంఖ్య పెరగాలి
నెలాఖరుకల్లా రెట్టింపు కావాలి:సమీక్షా సమావేశంలో కలెక్టర్ అరుణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 15: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎస్)లో పెద్ద ఎత్తున కూలీలను చేర్చుకోవాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 75వేల మంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారన్నారు. వీరి సంఖ్యను లక్షా 50వేలకు పెంచాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం ఆయన తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పథకం తదితర పథకాల అమలుతీరు, ప్రగతిపై సమీక్షించారు. ఈనెల 29వ తేదీలోగా ఉపాధి కూలీల సంఖ్యను లక్షా 50వేలకు పెంచేందుకు లక్ష్యం విధిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు ఈ పథకం కింద మేలు చేయడంతో పాటు కూలీలకు కూడా ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదన్నారు. జిల్లాలోని 140 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పనులు జరగడం లేదని, తక్షణం ఆయా ప్రాంతాల్లో వివిధ పనులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు లేని పంచాయతీలు తీర్మానంచేసి పంపాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తానన్నారు. జిల్లాలో సుమారు 150 కోట్ల రూపాయలతో చేపడుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఆర్‌డిఒలు సీజ్‌చేసిన ఇసుకను ప్రభుత్వ శాఖల అవసరాలకు కేటాయించాలన్నారు. ఇసుకను ప్రభుత్వ పథకాలకు సరఫరా చేయడంలో అధికారులు తగుచర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
ఎన్టీఆర్ షెల్టర్ అప్‌గ్రేడేషన్ కింద జిల్లాలో మరమ్మతులకు గురైన ప్రభుత్వ గృహాలకు మరమ్మతులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 1994-2004 మధ్య నిర్మించిన ఇళ్లకు సంబంధించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జిల్లాలో శానిటేషన్ పనులకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె పద్మ, డ్వామా పిడి నాగేశ్వరరావు, హౌసింగ్ పిడి సెల్వరాజ్, వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపిడిఒలు పాల్గొన్నారు.
యథేచ్ఛగా కోడి పందాలు!
-చేతులు మారుతున్న లక్షలు
రాజానగరం, ఫిబ్రవరి 15: రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో యధేచ్ఛగా కోడి పందాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వెళ్లి నెలరోజులు గడిచినా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి మండల కేంద్రమైన రాజానగరంలో సుమారు భారీ కోడి పందాలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ప.గో. జిల్లాకు చెందిన రెండు వర్గాలు రాజానగరంలో కోడి పందాలు ఆదివారం రాత్రి నిర్వహించారు. దీంట్లో పది జతల కోళ్లపై వేసిన పందాలు పది లక్షల రూపాయలు కాగా, పైగా వేసుకున్న పందాలు మరో ఆరు లక్షల రూపాయలు వుండవచ్చని అంచనా. అలాగే సోమవారం కూడా కోడి పందాలు యధేచ్ఛగా నిర్వహించారు. రాజానగరం మండలంలోని భూపాలపట్నం గ్రామం, ముక్కినాడ గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ పందాల్లో సుమారు మాడులక్షల రూపాయల మేర చేతులు మారినట్టు తెలియవచ్చింది.
మధ్యప్రదేశ్ ఎంపి కారుకు ప్రమాదం
-వెనుక నుండి వేరే కారుతో ఢీ
- రెండో కారులోని దంపతులకు గాయాలు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడి కారు సోమవారం ప్రమాదానికి గురైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం చందన్ మిత్రా అనే రాజ్యసభ సభ్యుడు ప్రయాణిస్తున్న కారు సోమవారం జాతీయ రహదారిపై బెస్ట్‌ప్రైస్ వద్ద ఎదురుగా వెళుతున్న నిడదవోలుకు చెందిన విఆర్వో దాపర్తి రాజేశ్వరరావు దంపతులు కుటుంబ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. రాజేశ్వరరావు కారు అదుపుతప్పి పక్కనే ఉన్న గోతిలోకి దూసుకుపోయింది. ఈసంఘటనలో రాజేశ్వరరావు దంపతులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న బిజెపి అగ్రనేతలు, జిల్లా అధికారులు బొమ్మూరు పోలీసులకు ఫోన్‌చేసి సంఘటనపై ఆరా తీశారు. అర్బన్ ఎస్పీ ఎస్ హరికృష్ణ, అధికారులు బొమ్మూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బొమ్మూరు పోలీసులు రాజ్యసభ సభ్యుడి కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కాగా, నందంగనిరాజు జంక్షన్ వద్ద వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఆటో ఎదురుగా వెళుతున్న పాదచారిని ఢీకొంది. ఈసంఘటనలో ఆటోడ్రైవర్ కోరుకొండ ప్రసాద్, పాదచారి పుట్టా లోవరాజు గాయపడ్డారు.
రాజమహేంద్రవరంలో నేడు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం రాజమహేంద్రవరంలో జరగనుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కె హరిబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపిలు, బిజెపి ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2గంటలు వరకు గోదావరి గట్టున ఉన్న ఒక హోటల్‌లోని సమావేశపు హాలులో రాష్ట్ర కార్యవర్గసమావేశం జరుగుతుందని, మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5గంటలు వరకు చందా సత్రంలో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. మార్చి 6న రాజమహేంద్రవరంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాలని చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
గృహనిర్మాణ పథకానికి శంకుస్థాపన?
కేంద్రప్రభుత్వ నిధులతో చేపట్టనున్న అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు నిర్మించతలపెట్టిన గృహ సముదాయానికి అమిత్‌షాతో శంఖుస్థాపన చేయించే కార్యక్రమాన్ని కూడా ఇదే సందర్భంగా ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం నగరం సమీపంలోనే గృహనిర్మాణ సముదాయాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించే ప్రయత్నాలు ప్రారంభమయినట్టు తెలుస్తోంది. తొలి దశలో కనీసం 500మంది లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం అందించనున్న రాయితీతో ఇళ్లు నిర్మించి ఇవ్వటం ద్వారా కేంద్రప్రభుత్వం ప్రకటించిన అందరికీ ఇళ్లు పథకం ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలని ఆయన భావిస్తున్నారు.
‘హౌసింగ్ ఫర్ ఆల్’ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సెల్వరాజ్
సామర్లకోట, ఫిబ్రవరి 15: హౌసింగ్ ఫర్ ఆల్ పథకాన్ని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డి సెల్వరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం సామర్లకోట మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పిడి సెల్వరాజ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్లమ్, లే అవుట్, బెనిసిసరీ సైట్, ఎల్‌ఐజి రూ.50 వేల లోపు ఆదాయం గల వారికి నాలుగు విభాగాలుగా ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో పాటు మిగిలిన వారంతా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈ పథకంపై మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని పిడి సూచించారు. అందరికీ ఇళ్లు పథకం కింద తొలి విడతగా సామర్లకోటకు 1200 ఇళ్లు ప్రభుత్వం మంజూరుచేసినట్టు చెప్పారు.
నేడు ఐహెచ్‌ఎస్‌డిపి ఇళ్లకు లాటరీ
కాగా సామర్లకోట జగ్గమ్మగారిపేటలో ఐహెచ్‌ఎస్‌డిపి గృహ సముదాయాలు నిర్మాణం పూర్తికాగా, త్వరలో సిఎం చంద్రబాబుచే ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ ప్లాట్లను లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు గృహసముదాయాల వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా నిర్వహించనున్నట్టు పిడి సెల్వరాజ్ చెప్పారు. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మొత్తం 912 ప్లాట్‌లకు గాను పూర్తిగా నగదు చెల్లించిన సుమారు 760 ప్లాట్లను ఆయా లబ్ధిదారులకు మంత్రి రాజప్ప ఆధ్వర్యంలో లాటరీ తీసి ప్లాట్లు కేటాయిస్తారని వివరించారు. సుమారు 120 పైబడి ప్లాట్‌లు పలు సాంకేతిక కారణాలు, నగదు పూర్తిగా చెల్లించకపోవడం వంటి సమస్యలపై పెండింగ్‌లో వున్నట్టు కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నకు పిడి జవాబుగా చెప్పారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణ తదితరులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, హౌసింగ్ ఇఇ కె ఆది సుబ్రహ్మణ్యం, పెద్దాపురం డిఇ ఎస్ చంద్రశేఖర్, హౌసింగ్ ఎఇలు అప్పారావు, సువర్ణరాజు, జిఎస్ రంగనాధ్, ఎల్ శ్రీనివాస్, కౌన్సిలర్లు యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, చుండ్రు బలరామ్, పిల్లాడి సత్యవతి, పాగా శిరీష, రెడ్నం సునీత తదితరులు మాట్లాడారు.
ప్రభుత్వ పనుల కోసంమూడు ర్యాంపుల్లో తవ్వకాలు
ప్రత్యేక సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
రావులపాలెం, ఫిబ్రవరి 15: కొత్త విధానంలో ఇసుక ర్యాంపులకు ఈ వేలం పూర్తిచేసి తవ్వకాలు ప్రారంభించేందుకు కొంత సమయం పడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం జిల్లాలోని ముగ్గళ్ల, జొన్నాడ, మందపల్లి ర్యాంపుల్లో తవ్వకాలకు అనుమతులిచ్చినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో కోనసీమలోని ఇసుక ర్యాంపులున్న మండలాల తహసీల్దార్లు, ఎంపిడిఒలు, ఎస్సైలు, గ్రామ కార్యదర్శులతో జెసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పనులకు సుమారు 30వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు అంచనాలు రూపొందించారన్నారు. ఈ ఇసుక తవ్వకాలను సోమ లేదా మంగళవారం నుండి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇసుక అవసరాలు తెలుసుకుని తద్వారా మరికొన్ని ర్యాంపుల్లో తవ్వకాలు ప్రారంభించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కోరారు. అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడితే మొదటి దఫాగా ట్రాక్టర్‌కు రూ.25వేలు, లారీకి రూ.75వేలు, రెండవ దఫా పట్టుబడితే ట్రాక్టర్‌కు రూ.50వేలు, లారీకి రూ.1.5లక్షలు జరిమానా విధిస్తామని చెప్పారు. కొత్త విధానం ద్వారా నిర్వహిస్తున్న ఈ వేలంలో శనివారం ఏడు రీచ్‌లకు వేలం పూర్తిచేశామని, అయితే సోమ, మంగళవారాలలో నిర్వహించాల్సిన వేలం ప్రక్రియ వాయిదాపడినట్లు తెలిపారు. ఈ వేలంలో గరిష్ఠంగా రూ.500ల్లోపు టెండరు వేయవలసి ఉండగా, దానికంటే అధికంగా కొన్ని ర్యాంపుల్లో టెండర్లు పడ్డాయని, వీటిపై ప్రభుత్వం సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ఇసుక అక్రమాలపై తమకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, అయితే మండల స్థాయి రెవెన్యూ అధికారులు తమకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల రావులపాలెం మండలం మీదుగా వేరే ప్రాంతాల నుండి వెళుతున్న ఇసుక లారీలను బాధ్యతగా తనిఖీచేసి బిల్లులు లేని ఏడు లారీలను సీజ్ చేసిన ఎస్సై పివి త్రినాధ్‌ను ఆర్డీవో అభినందించారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తే అక్రమాలకు తావుండదన్నారు. అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య మాట్లాడుతూ ర్యాంపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ప్రతి ర్యాంపులో ఇద్దరేసి చొప్పున పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. అలాగే కోనసీమలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల వల్ల శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని, వీటిని జీవో ప్రకారం గ్రామ, మండల స్థాయి అధికారులు తొలగించాలని ఆయన సూచించారు. సమావేశంలో మైనింగ్ ఎడి ఆర్ గొల్ల, తహసీల్దార్ సిహెచ్ ఉదయ్‌భాస్కర్, ఎంపిడిఒ వై ఉమామహేశ్వరరావు, ఎస్సై పివి త్రినాధ్, వివిధ మండలాల రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
చౌకగా కొరత లేకుండా అందాలి
నూతన ఇసుక విధానంపై ఎమ్మెల్యే ఆకుల
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: ప్రజలకు తక్కువ ధరకు, కొరత లేకుండా ఇసుక లభించే విధానాన్ని రాష్ట్రప్రభుత్వం రూపొందించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పాత విధానాల వల్ల ఇసుక కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని, ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్న ఉద్దేశ్యంతో కొత్త ఇసుక విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అది కూడా విఫలమయిందన్నారు. ఇసుక మాఫియా కొత్త ఇసుక విధానాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. సరయిన ఇసుక విధానాన్ని అమలుచేయాలని మొదటి నుండి తాము రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నామని, కానీ ఇంత వరకు అమలుచేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్త ఇసుక విధానంలో క్యూబిక్ మీటరు ఇసుకను రూ.500కు అమ్మాలన్న నిబంధనను విధించి, నిర్వహించిన ఇ వేలంలో కొంత మంది క్యూబిక్ మీటరు ఇసుకకు ఏకంగా రూ.500 నుండి రూ.2000 వరకు రాష్ట్రప్రభుత్వానికి చెల్లించే విధంగా ఇ వేలంలో ధరను కోట్‌చేశారని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న కొత్త ఇసుక విధానాన్ని అవహేళన చేసేవిధంగా కొంత మంది అసలు ధర కన్నా అధిక మొత్తాలకు కోట్‌చేశారన్నారు. టెండర్లను రద్దుచేయటమే కాకుండా అధిక ధరలకు టెండర్లు కోట్ చేసిన వారి ఆస్తులను జప్తుచేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. అసలు కన్నా అధిక ధరకు టెండరు కోట్ చేయటమంటే ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేయటమే అవుతుందన్నారు. పెట్టుబడులు కోసం విదేశీ పర్యటనలు చేయటంతో పాటు, రాష్ట్రంలో నిర్మాణ రంగానికి కొరత లేని ఇసుక విధానాన్ని అమలుచేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ఇసుక విధానాన్ని రూపొందించాలని, రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానం వల్ల ప్రజలకు నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని, నిర్మాణరంగంపై ఆధారపడ్డ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే ఆకుల పేర్కొన్నారు.
అస్తవ్యస్తంగా రెవెన్యూ సేవలు
చింతూరు మండల వాసుల అవస్థలు
చింతూరు, ఫిబ్రవరి 15: చింతూరు తహసీల్దార్ కార్యాలయం పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. తహసీల్దార్, విఆర్వోలు అందుబాటులో లేకపోవడంతో గత ఇరవై రోజుల నుండి సర్ట్ఫికెట్లు జారీకాక నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీనుండి నేటి వరకు మీసేవలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులన్నీ పెండింగులోనే వున్నాయి. చింతూరు తహసీల్దారుగా బదిలీపై వచ్చిన వ్యక్తి నేటివరకు విధుల్లో చేరలేదు. డిప్యూటీ తహసీల్దారు మాధవరావుకు ఇన్‌ఛార్జి తహసీల్దారుగా బాధ్యతలు అప్పగించారు. కానీ సర్ట్ఫికెట్లు జారీచేసే అర్హతను అతనికి ఇవ్వలేదు. దీంతో మీసేవలో దరఖాస్తు చేసుకున్న సుమారు 300 దరఖాస్తులు నిలిచిపోయాయి. మరోవైపు చింతూరు మండలానికి 17 మంది విఆర్వోలు వుండవలసి వుండగా, ఎనిమిది మంది విఆర్వోలను కేటాయించారు. వీరిలో నలుగురు ఆర్‌ఐ ప్రమోషన్ సర్వే ట్రైనింగుకు వెళ్లారు. మిగిలిన నలుగురు విఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 23 నుండి ట్రైనింగ్‌కు వెళ్లిన నలుగురు విఆర్వోలు మార్చి 10 వరకు విధులకు హాజరుకారు. దీంతో మిగిలిన నలుగురు విఆర్వోలు ఒక్కొక్కరు నాలుగైదు పంచాయతీలను చూసుకోవలసిన పరిస్థితి నెలకొంది. పనిభారం ఎక్కువైందని, విధులు నిర్వహించడం కష్టమైపోతోందని విఆర్వోలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో సమస్య జటిలంగా మారింది. మండలంలో విఆర్వోలను సత్వరమే నియమించాలని, ఇన్‌చార్జి తహసీల్దారుకు సర్ట్ఫికెట్లు జారీ చేసే అర్హత ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి చింతూరు తహసీల్దార్ కార్యాలయం సక్రమంగా పనిచేసేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పార్నపల్లెలో విషాదఛాయలు..
నంద్యాల/బండి ఆత్మకూరు, ఫిబ్రవరి 15: దేశరక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీరజవాను ముస్తాక్ అహ్మద్ పార్థివదేహం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత పార్నపల్లె చేరుకుంది. వీరజవాను సయ్యద్ ముస్తాక్ అహ్మద్ మరణవార్త తెలియగానే కుటంబసభ్యులతో పాటు పార్నపల్లె గ్రామస్థులు తల్లడిల్లిపోయారు. గత 11 రోజులుగా గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇబ్రహీం, నజీమున్సీసా చివరి సంతానం సయ్యద్ ముస్తాక్ అహ్మద్ సియాచిన్ గ్లేసియార్‌లో మంచుతుఫానులో చిక్కుకుని వీరమరణం పొందిన వార్తతో పార్నపల్లె ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రానికి ముస్తాక్ పార్థివదేహం పార్నపల్లె చేరుకుంటుందని తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వేయి కళ్లతో ఎదురుచూడసాగారు. అయితే సైనిక లాంఛనాలు పూర్తి చేసుకుని హైదరాబాదు నుండి బయలుదేరే సమయానికి చీకటి పడడంతో హెలిక్యాప్టర్ తరలించడం వీలుకాదని అధికారులు చెప్పడంతో రోడ్డు మార్గంలో ప్రత్యేక వాహనంలో పార్నపల్లెకు తరలించారు. అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామానికి చేరుకున్న వీరసైనికుడు ముస్తాక్ పార్థివదేహాన్ని అధికారులు సైనిక లాంఛనాలతో అందుకున్నారు. మంగళవారం ముస్తాక్ అంత్యక్రియలు గ్రామంలో ముస్లిం సంప్రదాయంలో జరుగనున్నాయి. ఆరు నెలల క్రితం సెలవుల్లో వచ్చిన ముస్తాక్ తల్లిదండ్రులు, సోదరులు, అక్కతో ఆప్యాయంగా గడిపాడు. మళ్లీ ఆరు నెలలకు సెలవులో వస్తానని భార్య నసీమున్నీసాకు మాటిచ్చి వెళ్లిన ముస్తాక్ అహ్మద్ నిర్జీవంగా రావడంతో అంతా ఖిన్నులయ్యారు. ముస్తాక్ మరణవార్త విన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఏడ్చిఏడ్చి అలసిపోయారు. భార్య దుఖః వర్ణించడం అలవికానిది. మరో ఆరు నెలల్లో వచ్చి మూడు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకుందామని మాటిచ్చి పోయిన భర్త నిర్జీవంగా రావడంతో గుండెలవిసేలా విలిపించింది.
ఇబ్రహీం, నజీమున్నీసా దంపతుల చివర కొడుకు ముస్తాక్ అహ్మద్ దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి గ్రామస్తుల్లో దేశభక్తి రగిల్చాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామానికి చెందిన మరో 8 మంది సైన్యంలో చేరి సేవలందిస్తున్నారు. మంచి విద్యార్థిగా పేరు పొందిన ముస్తాక్ అహ్మద్ 2002లో బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. నంద్యాల పట్టణంలోని నేషనల్ జూనియర్ కళాశాలలో 2004లో ఇంటర్ పూర్తి చేశాడు. మద్రాసు రెజిమెంట్‌లో 2004లో సైనికుడుగా చేరారు. 2014లో నంద్యాల పట్టణంలోని సాదిక్‌నగర్‌కు చెందిన నసీమున్నీసాతో సాదిక్ పెళ్లి జరిగింది. వారికి ప్రస్తుతం నెలల బాబు ఉన్నాడు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి
వీర జవాను ముస్తాక్ అహ్మద్ పార్ధీవదేహం సోమవారం సాయంత్రానికి హెలికాఫ్టర్‌లో నంద్యాల చేరుకుంటుందన్న సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే రోడ్డుమార్గంలో వస్తున్నట్లు సాయంత్రం సమాచారం అందడంతో అధికారులు పార్నపల్లె చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో కర్నూలు, నంద్యాల మీదుగా పార్నపల్లె గ్రామానికి పార్థివదేహం చేరుకుంది. మంగళవారం జరిగే వీరజవాన్ అంత్యక్రియలకు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సైతం వస్తున్నట్లు సమాచారం. ఎంఎల్‌సి, జిల్లా టిడిపి అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, డిఐజి రమణకుమార్, కలెక్టర్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
వీర జవాన్ ముస్తాక్ అహ్మద్ అంత్యక్రియలకు పార్నపల్లె గ్రామంలో ఏర్పాట్లు చేసినట్లు ఆర్మీ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. వీరజవాన్ బౌతికకాయాన్ని హైదరాబాదు నుంచి ఆర్మీ వాహనంలో తీసుకువస్తున్నారన్నారు. నంద్యాల ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డిఎస్పీ హరినాధరెడ్డిలు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కలెక్టర్ విజయమోహన్, డిఐజి రమణకుమార్ నంద్యాలకు చేరుకున్నారు. సుమారు వంద మంది ఆర్మీ సిబ్బందితో అంత్యక్రియలకు రిహార్సల్స్ నిర్వహించారు.
‘హౌస్ ఫర్ ఆల్’ కింద
దరఖాస్తుల స్వీకరణ
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 15:ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా ఇల్లు లేని పేద వారందరికీ గృహాలు నిర్మించేందుకు నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ సిహెచ్. విజయమోహన్ ఆదేశించారు. నగర పాలక సంస్థ సమావేశ భవన్‌లో సోమవారం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, హౌసింగ్ పిడి రాజశేఖర్, ఆర్‌డిఓ రఘుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగన్నాథగట్టు ప్రాంతంలో ఫేస్-3 కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నగరంలో గృహాలు లేని పేదలందరికీ జీ+3 2 పడక గదుల అపార్టుమెంట్ తరహాలో నిర్మించే గృహాలకు దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. అలాగే జగన్నాథగట్టు ప్రాంతంలో వెడల్పు రోడ్లు, తాగునీరు, పాఠశాల, ఆసుపత్రి, బస్టాప్‌తో పాటు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను స్వీకరించేందుకు హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బందితో 47 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే చేసి అర్హుల నుంచి ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ గ్రాంటు కింద రూ. 1,50,000లు, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు కింద రూ. 80,000లతో పాటు బ్యాంక్ రుణం కింద రూ. 2 లక్షలు, లబ్ధిదారుని వాటా కింద రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తూ సొంత ఇల్లు లేని పేద వారందరూ రేషన్ కార్డు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా కేటాయించిన బృందాల్లో ఒక్కో బృందం రోజుకు 50 గృహాల చొప్పున ఇంటింటికీ తిరిగి పేద ప్రజల్లో సొంత ఇంటిపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,618 ఇళ్లు నిర్మించడం లక్ష్యం కాగా, వాటి నిర్మాణం కోసం రూ. 354 కోట్లు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు తహశీల్దార్లు, నగర పాలక సంస్థ, హౌసింగ్ సిబ్బంది, విఆర్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.
సీమ భవిష్యత్తు కోసమే ఉద్యమం
* బస్సు యాత్రలో బైరెడ్డి
ఆస్పరి, ఫిబ్రవరి 15: రాయలసీమ భవిష్యత్తు కోసమే ఉద్యమం చేస్తున్నామని రాయలసీమ పరీరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రాయలసీమ రాష్ట్రం కోసం సాగిస్తున్న బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆస్పరికి చేరుకున్న బైరెడ్డి నాలుగు రోడ్లు కూడలీలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. జపాన్ స్థాయి అభివృద్ధి పేరుతో ఇక్కడి నిధులు తరలిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో ఉన్న వనరులను వదిలి అభివృద్ధి చెందిన ప్రాంతాలవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి పెట్టడం శోచనీయమన్నారు. రాయలసీమలో ఎలాంటి వనరులు లేకపోవడంతో 10 లక్షల మంది వలసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సీమలోని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి చేసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడితే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. తమకు అన్ని వనరులు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే అభివృద్ది చేసుకుంటామన్నారు. సీమ రాష్ట్రం ప్రత్యేకతను గురించి ప్రజలకు వివరించడానికే బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
సిల్వర్‌జూబ్లీ విద్యార్థి
ఆత్మహత్యపై నిరసన
* బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కర్నూలు అర్బన్, ఫిబ్రవరి 15:నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆర్‌విఎన్‌ఎస్‌ఎస్.హరిరావు ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. దీంతో సోమవారం ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థి మృతికి కళాశాల అధికారుల నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్. నాయక్ మాట్లాడుతూ విద్యార్థి హరిరావు తన సూసైడ్ నోట్‌లో కళాశాలలో నెలకొన్న అసౌకర్యాలపై ప్రశ్నించినందుకు కళాశాల ప్రిన్సిపాల్, మరో ఏడుగురు అధ్యాపకులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తామని భయబ్రాంతులకు గురి చేశారని, దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాశాడని తెలిపారు. కావున విద్యార్థి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, మృతికి బాధ్యులైన ప్రిన్సిపాల్, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్‌జెడిని అడ్డుకున్న ఎబివిపి కార్యకర్తలు
విద్యార్థి హరిరావు మృతిపై విచారణకు వచ్చిన కడప ఆర్‌జెడి మల్లేశ్వరి వాహనాన్ని ఎబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ విద్యార్థి హరిరావు మృతి ముమ్మాటికీ ఆత్మహత్యేనని స్పష్టం చేశారు. అయి తే సూసైడ్ నోట్‌లో రాసిన విధంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులపై నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారిణి విద్యార్థులను చూసి వెనక్కి వెళ్లడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధర్నా లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్, నగర సంఘటనా కార్యదర్శి సుమన్, ప్రశాంత్, మహేంద్ర, రవి, మల్లికార్జున, నంద, ఖాజా, నరేష్ పాల్గొన్నారు.
చనుగొండ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
* జెడ్పీ చైర్మన్ మల్లెల, కెఇ ప్రతాప్
డోన్, ఫిబ్రవరి 15:ముఠా కక్షలు, కార్పణ్యాలకు నిలయంగా వున్న చనుగొండ్ల గ్రామంలో శాంతి కపోతాలను ఎగురవేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రజలంతా కలిసికట్టుగా జీవించి, అబివృద్ధి వైపు పయనించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ స్పష్టం చేశారు. వారు సోమవారం మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామ వీధుల్లో కలియ తిరిగి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తాగునీరు, టీచర్ల కొరత, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సర్పంచ్ లక్ష్మిదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ ఫ్యాక్షన్ గ్రామమైన చనుగొండ్లను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు కెఇ ప్రతాప్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధికి తమ వంతుగా జెడ్‌పి నిధుల కింద రూ. 10 లక్షలను మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో నిరుపయోగంగా వున్న దిగుడుబావిని ఇంకుడు గుంతగా మార్చి గ్రామంలోని మురికినీటిని వాటిలోకి వదలాలని కోరారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా తిరుగుతున్నారని విమర్శించారు. కెఇ ప్రతాప్ మాట్లాడుతూ చనుగొండ్ల గ్రామాభివృద్ధికి రూ. 1.5 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామన్నారు. చనుగొండ్ల నుంచి ఇందిరాంపల్లెకు తారురోడ్డు, పత్తికొండ నియోజకవర్గంలోని పెండేకల్లు నుంచి జాతీయ రహదారి వరకూ వున్న రోడ్డును ఆర్‌అండ్‌బిలోకి కలిపేసి బిటి రోడ్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, మాజీ ఎంపిపి టిఇ శేషఫణిగౌడ్, వైస్ ఎంపిపి చలం, తహశీల్దార్ మునికృష్ణయ్య, పిఆర్ డిఇ మల్లికార్జునమూర్తి, మండల ఇంజినీర్ నారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ శివ, ఇఓఆర్డీ మణిమంజరి, ఏపిఓ రమణ, నాయకులు కృష్ణమూర్తి, దేవేంద్ర పాల్గొన్నారు.
ప్రతి పొలంలో
ఫారంపాండ్ తవ్వుకోవాలి
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, ఫిబ్రవరి 15:ప్రతి రైతు తన పొలంలో ఫారంపాండ్ తవ్వుకోవడం ద్వారా డ్రిప్ ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందవచ్చునని, దీనిపై ఉద్యమరీతిలో అవగాన కల్పించాల్సిన గురుతర బాధ్యత నోడల్ అధికారులదే అని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మండలాల్లో నోడల్ అధికారులు చేపట్టాల్సిన అత్యంత ప్రాధాన్యతాంశాలకు సంబంధించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, లేబర్ బడ్జెట్ పెంపు, ఫారంపాండ్ల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సిసి రోడ్ల నిర్మాణాలు, పశుగ్రాసం, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ స్థాయిలో పర్యటించి ఆయా అంశాలపై పరిష్కార చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ప్రైమరీ మిషన్ అమలులో భాగంగా వ్యవసాయం, ఇరిగేషన్, ఉద్యానశాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని మండల స్థాయి అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. లేబర్ బడ్జెట్‌కు సంబంధించి లక్ష్యాలు సాధించాలని సూచించారు.
ప్రతి మండాలనికి 1.73 లక్షల మంది కూలీలు పనుల్లో ఉండి తీరాలని ప్రస్తుతం 70 వేల మంది కూలీలు పనిలో వున్నారని, సోమవారం నాటికి లక్ష మందికి పనులు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రైతులు తమ పొలాల్లో సొంతంగా లేదా ఒకరిద్దరు జాబ్‌కార్డు కూలీల సాయంతో పారంపాండ్లు తవ్వుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా కుటుంబ జీవనం గడుస్తుందని, వలసలు వెళ్లే అవసరం వుండదన్నారు. సమావేశంలో జెసి-2 రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సిపిఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో
అనంతపురం ఎంపి జెసి
శ్రీశైలం, ఫిబ్రవరి 15: శ్రీశైలంలో కొలువైన శ్రీభ్రమరాంబిక అమ్మవారు, శ్రీమల్లికార్జున స్వామి వార్లను అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనాది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఎంపిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ భోజనం తినలేకపోతున్నాం..
* శేషారెడ్డి హైస్కూల్ విద్యార్థుల ఆవేదన..
బేతంచెర్ల, ఫిబ్రవరి 15:ప్రతిరోజూ నీళ్ల చారు, పురుగుల అన్నం తినలేక పస్తులుంటున్నామని పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు వాపోయారు. శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యన్నాభార్గవ్, జిల్లా కా ర్యవర్గ సభ్యులు అశోక్, ఉదయ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. దీంతో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పాఠశాలలో తయారు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి అక్కడి నుంచే మధ్యా హ్న భోజన పరిశీలన కమిటీ సభ్యులైన ఎంపిడిఓ, ఎంఇలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే అధికారుల నుంచి స్పందన కరువైందని ఏఐఎస్‌ఎఫ్ నా యకులు తెలిపారు. దీంతో పాఠశాల హెచ్‌ఎం ఆదినారాయణకు ఆహార పదార్థాలను చూపించామన్నా రు. మధ్యాహ్న భోజనంపై గతంలో కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి వంట ఏజెన్సీని రద్దు చేసి విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలని, లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిరణ్, శ్రీకర్, జగదీష్, మురళీ, షేక్షావలి, సురేష్, మాధవ్, ఇమామ్, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
వీర జవానులకు నివాళి
మంత్రాలయం, ఫిబ్రవరి 15: సియాచిన్‌లో వీరమరణం పొందిన వీర జవాన్ లకు సోమవారం రాత్రి మంత్రాలయం యువసేన సేవా సమి తి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. హాస్టల్ విధ్యార్థులతో కలిసి జడ్పీ పాఠశాల నుంచి రాఘవేంద్ర కూడలివరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీర మర ణం పొందిన వీర జవానులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవానులకు నివాళులర్పించడం మన కర్తవ్యమన్నారు. బండి ఆత్మకూరు మండ లం పార్నపల్లికి చెందిన జవాను ముస్తాక్ అహ్మద్ సేవలను మరవవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మునిస్వామి, మంత్రాలయం యువ సేన సేవా సమితి అధ్యక్షులు రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు ఎంఆర్‌వి రెడ్డి, కార్యదర్శి భాస్కర్, ప్రధానకార్యదర్శి రామాంజినేయులు, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. ఒకని మృతి
* ఐదుగురికి గాయాలు
ఆస్పరి, ఫిబ్రవరి 15: మండల పరిధిలోని చిగిలి బసుస్టాప్ సమీపంలో సోమవారం జరిగిన ఆటో ప్రమాదంలో చాకలి హంపయ్య(65) మృతి చెందినట్లు ఆస్పరి ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. చిన్నహుల్తి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి బోల్తాపడిందన్నారు. దీంతో ఆటోలో ఉన్న చిన్నహుల్తి గ్రామానికి చెందిన హంపయ్య అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఆటోలోని మరో ఐదుగురికి గాయాలయ్యాయన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురి ఆత్మహత్యాయత్నం
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 15: నంద్యాల మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని విశ్వాసపురానికి చెందిన వసంత, కిశోర్‌కుమార్, ఫరూక్‌నగర్‌కు చెందిన ముస్తాక్ సోమవారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పితో బాధపడుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మట్కారాయుళ్ల అరెస్టు
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 15: నంద్యాల వన్‌టౌన్ ప్రాంతంలో మట్కా రాస్తున్న షేక్ హుసేన్, అక్బల్‌బాషాను అరెస్టు చేసినట్లు డిఎస్పీ హరినాధరెడ్డి తెలిపారు. సోమవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరినాథరెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతానికి చెందిన హుసేన్, అక్మల్‌ను అరెస్టు చేసి వారినుంచి రూ.31,150 నగదు, మట్కా చీటీలను, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మట్కా, సారా, పేకాటపై నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ సాయినాధ్, హరిప్రసాద్, సుధీష్, చంద్రశేఖర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.
నెరవేరని లక్ష్యం!
నెల్లూరు, ఫిబ్రవరి 15: పాఠశాల పిల్లవాడి నుండి ప్రధానమంత్రి వరకు నేడు అందరి నోట వినిపిస్తున్న నినాదం స్వచ్ఛ భారత్. అదే సమయంలో అధికారుల నుంచి నేతల వరకు ప్రతిఒక్కరు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రకోసం శ్రమించాలి, సహకరించాలని అనే ప్రసంగాలు రోజు వినిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న స్వచ్ఛ్భారత్ సాకారంలో కీలకమైన మరుగుదొడ్లను మాత్రం అందరు విస్మరిస్తున్నారనే చెప్పాలి. నేటికీ ఏ గ్రామం చూసినా, శివారు ప్రాంతాలు గమనించినా దుర్గంధం వెదజల్లుతుంటుంది. రహదారి వెంబడే బహిరంగ మలవిసర్జన దర్శనమివ్వడం బాధాకరం. ఈ పరిస్థితిపై ఒక సంవత్సరం కాలం నుంచి నేతలు తీవ్రంగా స్పందించి ముఖ్యంగా స్వచ్ఛ భారత్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ లక్ష్యాలు మాత్రం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని లక్ష్యం లక్షణంగా చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పించడం లేదు. పాలకులు, అధికారులు బహిరంగ మలవిసర్జనను నివారించాలని వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతిఒక్కరు వినియోగించాలని సూచనలు చేస్తున్నారు. వీరు తీసుకున్న లక్ష్యాలు కాగితంపైనే కన్పిస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం కన్పించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ మరుగుదొడ్లు ఉన్నా అసంపూర్తిగా మిగిలాయి. గత 15 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం మొక్కుబడిగానే మిగిలింది. ఆ కాలంలో మంజూరైన మరుగుదొడ్లు ఎక్కడా కానరావడం లేదు. గ్రామాలకు ప్రజాప్రతినిధులు వెళ్లినప్పుడు లబ్ధిదారుల పేర్లు రికార్డులో ఉన్నప్పటికి మరుగుదొడ్లకు సంబంధించిన ఏవిధమైన నిర్మాణాలు జరిగినట్లు దాఖలాలు కన్పించడంలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మొదటి ప్రణాళిక మరుగుదొడ్లకేనని లక్ష్యంగా చేసుకుని సమయాత్తం అయ్యింది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే ఏకైక లక్ష్యంగా తీసుకుని కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసింది. జిల్లా అధికారుల సమావేశంలో 100 రోజుల్లో లక్ష మరుగుదొడ్లు నిర్మిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. నేటికి 300 రోజులు పూర్తయినా లక్ష మరుగుదొడ్లు పూర్తయ్యాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, జిల్లా కలెక్టర్లను మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మిచాల్సిందేనని ఆదేశాలు ఇచ్చి ఏడాదిన్నర కాలం దాటినా ఆ లక్ష్య సాధనలో ఎంతవరకు విజయవంతం అయ్యారన్నది డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది. మరుగుదొడ్ల నిర్మాణం రిజిస్ట్రేషన్ మాత్రం పెద్దఎత్తున ప్రోత్సాహం చేశారని నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా మారింది. 20 శాతం మాత్రం అధికారుల ఒత్తిడికి తలొగ్గి కొంతమంది లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించారు. 10 శాతం లబ్ధిదారులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో మిలిగిన రిజిస్ట్రేషన్ చేయించుకున్న వినియోగదారులు నిర్మాణానికి ముందుకు రావడం లేదు. దీంతో ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మరుగుదొడ్ల నిర్మాణం తయారైంది. తొలుత జిల్లా కలెక్టర్ జానకి మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కిందిస్థాయి అధికారులు సహకరించకపోవడంతో ఇద్దరు ముగ్గురు ఎంపిడిఓలపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. పలువురు అధికారులకు మెమోలు కూడా జారీచేశారు. అయినా వారి పనితీరులో మార్పు రాకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడంలేదు.
నిరక్షరాస్యత నిర్మూలించాలి
ఓపెన్ స్కూల్ రాష్ట్ర పరిశీలకుడి సూచన
బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 15: నిరక్షరాస్యతను పూర్తిస్థాయిలో నిర్మూలించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర పరిశీలకులు విద్యాసాగర్ అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండల సాక్షరతా భారత్ కార్యకర్తలతో సోమవారం స్థానిక ఎక్స్‌లెన్సీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగానే విద్యను మధ్యలో మానివేసిన వారికోసం ప్రభుత్వం మొత్తం ఐదు దశలలో పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. సాక్షరతా భారత్ కార్యకర్తల ఆధ్వర్యంలో 3,5 తరగతి పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంపిక చేసిన పాఠశాలలలో 8,10, ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ పాఠశాలలలో పైతరగతులకు ప్రవేశాలు పొందవచ్చన్నారు. 2 సంవత్సరాల ఇంటర్ పరీక్ష ఒక సంవత్సర కాలంలో పూర్తిచేసే అవకాశముందన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ జారీ చేసే సర్ట్ఫికెట్లు సెకండరీ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసే సర్ట్ఫికెట్లతో సమానమన్నారు. ఈ సర్ట్ఫికెట్లు పైచదువులు కొనసాగించడానికి, ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడతాయన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు కనీస విద్యార్హత 8వ తరగతి పాస్‌గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే ప్రతి చిన్న ఉద్యోగం పొందేందుకు సైతం 8వ తరగతి కనీస విద్యార్హతగా ఉందన్నారు. స్థానిక ఎక్స్‌లెన్సీ స్కూల్‌లో 8వ తరగతి అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపి ఓపెన్ స్కూల్ మెంబర్ అజయ్‌బాబు, సాక్షరతా భారత్ సూపర్‌వైజర్ పోలేపెద్ది రమేష్, ఎక్స్‌లెన్సీ స్కూల్ కరస్పాండెంట్ అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
ఉదయగిరి, ఫిబ్రవరి 15: అప్పసముద్రంలో షేక్ రంజాన్‌బీ (21) అనే వివాహిత సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన బాదుల్లా, నూర్జహాన్‌ల పెద్దకుమార్తె రంజాన్‌బీకి ఐదేళ్ల క్రితం వింజమూరుకు చెందిన మస్తాన్‌తో వివాహమైంది. మస్తాన్ బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తరుణంలో గత రెండు నెలల క్రితం మస్తాన్ బేల్దారి పనుల నిమిత్తం విజయవాడకు వెళ్లాడు. రంజాన్‌బీ వింజమూరులోని అత్తమామల ఇంటి పక్కనే ఉండేది. కాగా రంజాన్‌బీ ఇంటిలో ఉరేసుకుని వేలాడుతుండటంతో స్థానికులు గమనించి కిందకు దించేసరికే ఆమె విగతజీవిగా మారింది.
ఐక్యపోరాటంతోనే వేతన సవరణ:ఎన్‌ఎంయు
వెంకటగిరి, ఫిబ్రవరి 15: ఆర్టీసీలోని అన్ని యూనియన్‌ల ఐక్యపోరాటంతోనే కార్మికులకు 43 శాతం వేతన సవరణ సాధించామని, దానిని ఎంప్లాయిస్ యూనియన్ సాధించినట్లు చెప్పుకోవడం అవివేకమని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె రమణరాజు తెలిపారు. ఈనెల 18న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెంకటగిరి విచ్చేసిన ఆయన వెంకటగిరి డిపో ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మరలా ఎంప్లాయిస్ యూనియన్ గెలిస్తే కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఉంటాయన్నారు. ఎన్‌ఎంయూ గెలిస్తే కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించడం, మహిళా ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృషి సారిస్తామన్నారు. కార్మికుల పలురకాల రుణాల కోసం నెలల తరబడి తిరుగుతున్నారని అదే ఎన్‌ఎంయూను గెలిపిస్తే వారం రోజుల లోపలే రుణం తీసుకొనే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. రీజనల్ కార్యదర్శి లుక్స్‌న్ మాట్లాడుతూ ఎంప్లాయిస్, ఎస్‌డబ్ల్యుఎఫ్ నాయకులు ఇతర యూనియన్ నాయకులను విమర్శించే పద్ధతి మానుకోవాలన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ గత ఎన్నికల్లో గెలిచినా కార్మికుల కోసం చేసింది ఏమీలేదన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ అధ్యక్షులు శ్రీనివాసులు, వెంకటగిరి డిపో అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సెక్రటరీ కెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
అవసరం మేరకే ఆక్రమణలను తొలగించండి
* అధికారులకు ఎమ్మెల్యే సూచన
గూడూరు, ఫిబ్రవరి 15: గూడూరు పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి సర్వీసు రోడ్డు ఏర్పాటుకు ఐసిఎస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను అవసరం మేరకే తొలగించాలని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఐసిఎస్ రోడ్డులో తొలగించనున్న ఆక్రమిత స్థలాలను ఆయన అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బి అధికారులు వేసిన మార్కింగ్‌లను చూసి అవసరమైన మేరకే ఆక్రమణలను తొలగించాలని కోరారు. స్థానికులు తమకు పట్టా ఉందని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇంటి పన్నులు, కొళాయి పన్నులు చెల్లిస్తున్నామని, తమ భవనానికి మార్కింగ్ వేశారన్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్ సెంటర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో చిరు వ్యాపారాలు నిర్వహించుకొంటున్నారని, వారి ఉపాధికి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ స్థలం చూపాలని ఆయన ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు. మున్సిపల్, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ రికార్డుల ప్రకారం రోడ్డుమ్యాప్‌ను దగ్గర పెట్టుకొని ఆక్రమణల తొలగింపును ఒక క్రమపద్ధతిలో నిర్వహించాలన్నారు. ఈక్రమంలో పేదలకు అన్యాయం జరిగితే వారి పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాగే ఆక్రమణదారులు కూడా అధికారులతో సహకరించి తమ తమ ఆక్రమణలను తొలగించుకోవాలని ఆయన ఆక్రమణదారులకు సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రతిఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం ఆర్‌అండ్‌బి అధికారులు మండల తహశీల్దార్ సత్యవతిని కలసి వారి దగ్గర ఉన్న మ్యాప్‌ను కోరారు. అది ఇచ్చినట్టయితే తమ వద్ద స్కెచ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అంఢ్‌బి జెఇ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతతో కూడిన విద్యను అందించండి
కోట, ఫిబ్రవరి 15: నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని వరంగల్‌కు చెందిన ఎన్‌ఐటి విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ పి గంగాధర్‌శాస్ర్తీ కోరారు. కోట మండలం విద్యానగర్‌లోని నేదురుమల్లి బాలక్రిష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఫలిత ఆధారిత సాంకేతిక విద్యపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా గంగాధర్‌శాస్ర్తీ మాట్లాడుతూ ప్రతి అధ్యాపకుడు విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే ఆ విద్యార్థి ఉన్నత శిఖరాన్ని అధిరోహించగలడన్నారు. ఎన్‌బికెఆర్‌లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కల్పించారని, వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అధ్యాపకులదేనన్నారు. అధ్యాపకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వి విజయకుమార్‌రెడ్డి, అధ్యాపకులు రవీంద్రారెడ్డి, శ్రీనివాస్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
మనుబోలు, ఫిబ్రవరి 15: ఓ వ్యక్తి మద్యంలో పురుగుల మందు కలుపుకుని సేవించి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మడ క్రాస్‌రోడ్డు సమీపంలోని బస్టాండులో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా వున్నాయి. నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన మామిడాల మాల్యాద్రి (45) రియల్ ఎస్టేట్ రంగంలో మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. చిత్తూరులో భూమిని అమ్మించడం వల్ల తనకు 25 లక్షల రూపాయలు రావలసి వుందని భార్య అరుణతో చెప్పి అదివారం రాత్రి వెళ్లాడు. ఈసమయంలో వద్దని తాను వారించినా తన స్నేహితులతో కలసి వెళ్తున్నానని చెప్పి వెళ్లినట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం తనకు ఫోను చేసి భోజనం చేశావా? పిల్లలు ఎలా ఉన్నారంటూ అడిగారని తెలిపింది. అయితే తన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు సాయంత్రం పోలీసులు సమాచారం అందించారంటూ వాపోయింది. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరిలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం అరికట్టాలి’
మనుబోలు, ఫిబ్రవరి 15: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యాన్ని అరికట్టాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఎంపిడిఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం బిసిలకు అందించిన రుణాలపై ఎంపిడిఓ కె.హేమలతను నిలదీశారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ నాయకుడు వి.రామరాజు మాట్లాడుతూ జన్మభూమి కమిటీల ముసుగులో టిడిపి కార్యకర్తలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. పేద ప్రజలు కార్యాలయాలు చుట్టు తిరుగుతూ తమను ఆదుకోవాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రుణాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాతోపాటు రుణాలు ఇచ్చిన వారిపేర్లు నోటీసు బోర్డులో ఉంచాలని ఎంపిడిఓను కోరారు. రుణాలు అందించడంలో పారదర్శకత పాటించాలన్నారు. జన్మభూమి కమిటీకి కన్వీనర్‌గా ఎంపిడిఓ వ్యవహరిస్తున్నారని, జన్మభూమి కమిటి సభ్యులు ఇచ్చిన పేర్లను గుడ్డిగా ధ్రువీకరించడం తప్పని మండిపడ్డారు. ఎంపిడిఓలు కేవలం పోస్టుమేన్ జాబ్‌ను వదిలి పేదలకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలన్నారు. అర్హులైన వారిని వదిలేసి అధికారపార్టీకి తొత్తులుగా అధికారులు పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈకార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి చైతన్య, సిపిఐ నాయకులు షాన్‌వాజ్, పడాల నరసయ్య, అల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్మశానానికి దారి చూపండి మహాప్రభో..
దళితుల నరకయాతన
వెంకటాచలం, ఫిబ్రవరి 15: శ్మశానానికి వెళ్లేందుకు దారి చూపండి మహాప్రభో అంటూ పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కాకుటూరు గ్రామ దళితులు అర్జీలు సమర్పించారు. కాని వారి మొరను అధికారులు పట్టించుకోకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. మండలంలోని కాకుటూరు గ్రామ దళిత కాలనీకి చెందిన సనుగూరి మణెమ్మ కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతూ సోమవారం మృతి చెందింది. అయితే దళితుల శ్మశానం పొలాల మధ్యలో ఉండటం, గ్రామస్థులు వరి పైర్లు వేసి ఉండటంతో వారి కష్టాలు మొదటికొచ్చాయి. శ్మశానానికి వెళ్లే మార్గంలో పంటకాలువ, వరి పైర్లు ఉండటంతో దళితులు అతికష్టంమీద వరి పైర్ల గుండా నీటిలో నడుచుకుంటూ మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ తాము గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను మండల, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్లామని, అయినా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు తమ సమస్యను పట్టించుకొని శ్మశానానికి దారి కల్పించాలని వారు కోరుతున్నారు.
‘రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలి’
వేదాయపాళెం, ఫిబ్రవరి 15: రైతులు తక్కువ పెట్టుబడులతో సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టినట్లయితే నష్టాలు తక్కువతోపాటు అధిక లాభాలు పొందేందుకు అవకాశాలున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హేమమహేశ్వరరావు అన్నారు. సోమవారం నగరంలోని టౌన్‌హాలులో జరిగిన ‘రైతు ఆనంద యజ్ఞం’ అనే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతులు అధిక పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోతూ, ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరమన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వాడకం, పెట్టుబడులు లేని వ్యవసాయం రైతులు చేపట్టాలని, దీనిపై ప్రభుత్వం రైతులకు తగు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. పాలేకర్ ఆధ్వర్యంలో ఇటీవల కాకినాడలో జరిగిన ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమంలో జిల్లా నుండి 250 మంది రైతులను ఎంపికచేసి పంపించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎఆర్‌ఎఫ్ ప్రధాన శాస్తవ్రేత్త మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు తీసుకోవాలని సూచించారు. వరి సాగులో అనుసరించాల్సిన మెళకువలను రైతులకు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘ నేతలు పాల్గొన్నారు.
ఆక్వా చెరువులను నిబంధనల మేరకు అనుమతించాలి:కలెక్టర్
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 15: జిల్లాలో ఆక్వా రైతుల ప్రయోజనార్థం కొత్తగా ఏర్పాటు చేసుకునే ఆక్వా చెరువులకు సంబంధించిన దరఖాస్తులను తీసుకుని నిబంధనల మేరకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జానకి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో ఆక్వా చెరువుల అభివృద్ధిపై జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా జిల్లాలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిబంధనలను అనుసరించి మంచినీటి ఆక్వా చెరువులు, ఉప్పునీటి ఆక్వా చెరువుల వారీగా సర్వే చేసి రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియలో నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఆయా మండలాల పరిధిలో నియమించిన కమిటీల ప్రకారం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యశాఖ జెడి సీతారామరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు మంచినీటి ఆక్వా చెరువులకు సంబంధించి 104 దరఖాస్తులు, ఉప్పునీటి ఆక్వా చెరువులకు సంబంధించి 60 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ సమావేశంలో భూగర్భజలం డిడి రమేష్ కుమార్, ఫిషరీస్ ప్రొఫెసర్ డాక్టర్ హరిబాబు, పర్యావరణ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం మురళీధర్, నెల్లూరు డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఆక్వారైతుల సంఘం అధ్యక్షుడు షబీర్ తదితరులు పాల్గొన్నారు.
ఘరానా దొంగ అరెస్ట్
* భారీగా సొత్తు స్వాధీనం
నెల్లూరు, ఫిబ్రవరి 15: చెడు వ్యసనాలకు బానిసై, కరడుగట్టిన దొంగగా మారిన వ్యక్తిని సూళ్లూరుపేట పోలీసులు పట్టుకొని అతని వద్ద నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం జిల్లా ఎఎస్పీ రెడ్డి గంగాధర్, గూడూరు డిఎస్పీ శ్రీనివాస్‌తో కలసి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన ఈరి మహేష్ (29) వృత్తిరీత్యా కారుడ్రైవర్. అక్రమ సంబంధాలకు అలవాటు పడి సంపాదన సరిపోకపోవడంతో దొంగదారి పట్టాడు. సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలలో పలు దొంగతనాలకు ఇతను పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. తడ మండలంలోని చేనిగుంట, సున్నపుబట్టి ప్రాంతాల్లోనూ, సూళ్ళూరుపేట మండల పరిధిలోని సూళ్ళూరుపేట, సోనియాగాంధీ నగర్, బజారువీథి, చేనిగుంట తదితర ప్రాంతాల్లో గత కొంతకాలంగా చోరీలు చేశాడన్నారు. ఇతని కదలికలపై నిఘా ఉంచిన సూళ్లూరుపేట పోలీసులు గూడూరు డిఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో సూళ్లూరుపేట స్వతంత్రపురం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 42.5 సవర్ల బంగారు ఆభరణాలను, 750 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ. 9 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సూళ్లూరుపేట సిఐ టి.విజయకృష్ణ, ఎస్సై జి.గంగాధరరావు, హెడ్ కానిస్టేబుల్ పి.శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుళ్లు ఆదినారాయణ, ఎం.శ్రీనివాసరెడ్డి, జి.మాధవరావు, హోంగార్డులు మురళి, సుదర్శన్‌లను ఆయన అభినందించారు.
జలసిరి అమలుకు కార్యాచరణ ప్రణాళిక
జిల్లా కలెక్టర్ ఎం జానకి వెల్లడి
నెల్లూరు, ఫిబ్రవరి 15: మెట్ట ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ జలసిరి-2 పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎం.జానకి అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో ఈ పథకం అమలు తీరుతెన్నులపై ఆమె అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం కింద జిల్లాలో 15,249 బోర్లు వేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు. కమాండ్ ఏరియాలోని రైతులకు బొగ్గు, విద్యుద్దీకరణ, మోటార్లు అందించడంతో పాటు బిందు సేద్యం చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. ఈ ప్రాంతాల్లోని సన్నకారు రైతులు ఈనెల 18 నుండి తమ దరఖాస్తులను ఏపి ఆన్‌లైన్ మీసేవ ద్వారా చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఉపాధిహామీ జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్, అడంగల్ సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ఈ పథకం కింద ఒక్కొక్క బోరుకు రూ.24 వేలు, ఇంకుడుగుంతకు రూ.5వేలు, విద్యుత్ సరఫరాకు రూ.50వేలు వెరసి లక్షా 19వేలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. లబ్ధిదారుని వాటా కింద రూ.18వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.4,500 వంతున నిర్ణయించినట్లు తెలిపారు. వీటన్నింటికి అనుగుణంగా లబ్ధిదారుల గుర్తింపు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పిడి రామచంద్రారెడ్డి, భూగర్భజల డిడి రమేష్‌కుమార్, ఏపి ఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తీవ్రవాద కార్యకలాపాలు బాధాకరం
బిజెపి నేత సన్నపురెడ్డి ఆవేదన
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 15: దేశానికి స్వాతంత్య్రం వచ్చి అరవై ఏళ్లు గడుస్తున్నా ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని రామ్మూర్తినగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెఎన్ యూనివర్శిటీలో పాకిస్తాన్ జందాబాద్ అంటూ ఆ యూనివర్శిటీ విద్యార్థులు భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఇది ఏమాత్రం ఉపేక్షించాల్సిన సమయం కాదన్నారు. అలాంటి దేశ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న వారిపై వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో దేశంలోని దేవాలయంలాంటి పార్లమెంట్ మీద దాడిచేసిన ఘనటపై అఫ్జల్‌గురుపై అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఉరిశిక్షకు మద్దతునిచ్చిన విషయం విధితమేనని అన్నారు. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాది సంస్మరణ సభను జెఎన్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అఫ్జల్‌గురు, కాశ్మీర్ లిబరల్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థ సభ్యుడు బట్‌లాంటి వాళ్లు ఇంటికొకరు పుడతారనడం సరికాదన్నారు. భారతదేశంలో ఉంటూ దేశ విద్రోహక చర్యలకు పాల్పడేవారని ఎంతమాత్రం ఉపేక్షించడం సరికాదని బిజెపి తరఫున హెచ్చరిస్తున్నామన్నారు. అలాంటి చర్యలకు పాల్పడుతున్న బట్‌ను అరెస్టు చేసి శిక్షించడం సరైనదేనన్నారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ పరామర్శించడం, వారికి మద్దతునివ్వడం కూడా విద్రోహక చర్యేనన్నారు. వారికి మద్దతునిచ్చిన రాహుల్‌గాంధీని కూడా అరెస్టుచేసి తగు శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా మేకిన్ ఇండియా పేరుతో ముందుకు వెళుతుంటే దేశద్రోహాన్ని ప్రోత్సహిస్తున్న రాహుల్‌గాంధీ మోదీని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
6న రాజమండ్రిలో సభ
మార్చి 6న రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని బిజెపి నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్యోద్దేశ్యంగా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కార్యకర్తలు, నాయకులు బిజెపిని బలమైన శక్తిగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో బిజెపి నాయకులు మిడతల రమేష్, ముద్దు శ్రీనివాసులు, కోటేశ్వరమ్మ, బి సురేష్‌నాయుడు, ప్రసన్న, శివ, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నగర ప్రజల తాగునీటి అవసరాలకే గుండ్లకమ్మ నీరు..!
మద్దిపాడు,్ఫబ్రవరి 15:గుండ్లకమ్మ ప్రాజెక్టు రిజర్వాయరు నుండి విడుదల చేసిన నీరు కేవలం ఒంగోలు నగరప్రజల తాగునీటీ అవసరాల కోసమేనని, ఆ నీటితో పంటలు పండించుకునేందుకు వీలులేదని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయరు నుండి విడుదల చేసిన నీటిని పరిశీలించారు. రిజర్వేయరు కట్టపై పర్యటించి ఒకవైపు అడుగుకు చేరిన నీటిమట్టం, మరోవైపు ఎండిపోయిన రిజర్వాయరును పరిశీలించారు. దిగువున మోటారు ఇంజన్లతో నీరు పెట్టుకున్న రైతును ఆమె గమనించారు. వెంటనే జిల్లాకలెక్టర్ స్పందిస్తూ ప్రస్తుతం గుండ్లకమ్మ రిజర్వాయరులో 1.5 టిఎంసిల నీరు ఉందని, డెడ్‌స్టోరేజి 1.36 టిఎంసిలు అయినందున ఒంగోలు నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు చుట్టు ఉన్న మంచినీటి పథకాలను భూగర్భజలాల రీచార్జ్‌కోసం సోమవారం ఉదయం తొమ్మిదిగంటల నుండి వంద క్యూసెక్కులు నీటిని రిజర్వాయరు నుండి దిగువకు వదిలినట్లు చెప్పారు. వరి లేదా మిర్చి పంటలు పండించుకునేందుకు నీరు వదలలేదనే విషయం రైతులకు వివరించి చెప్పాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.నీటిపారుదలశాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో నీటిప్రవహాం వెంబడి గట్టి నిఘా ఏర్పాటుచేసి రైతులు తమ పంటలకు ఇంజన్ మోటార్లతో తోడెయ్యకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మల్లవరంలో వరిపైర్లను పరిశీలించారు. వెల్లంపల్లి వెంటనే వద్ద గుండ్లకమ్మప్రాజెక్టు నీరు వచ్చిందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. చీరాల - నాగులుప్పలపాడు మార్గం వరకు కాల్వలను పరిశీలించారు. ఆ మార్గంలో తొమ్మిది చోట్ల రైతులు ఆయిల్ ఇంజన్ మోటార్లతో పొగాకు, మిరప పంటలకు కాల్వలనీటితో తడుపుకుండటాన్ని ఆమె గమనించివెంటనే వాటిని నిలుపుదల చేయించి రైతులకు ఇకపై అక్రమంగా నీటినితొడితే కఠిన చర్యలుతప్పవన్నారు. రాత్రిపూట పోలీసు నిఘా ఉంచి అక్రమ నీటి వాడకాన్ని నిరోధించాలని సూచించారు. కలెక్టర్ పర్యటనలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మరుగునపడ్డ మానవత్వం
రాజకీయ రంగుతో తెరమరుగైన
పూర్ణచంద్రరావు మృతి ఘటన
ఆ కుటుంబాన్ని ఆదుకునేవారేరి?
ఈ సృష్టిలో అన్నిటి కంటే విలువైనది మనిషి ప్రాణం. ఐచ్ఛికంగా గానీ, యాదృచ్ఛికంగా గానీ ఒకరి ప్రాణం పోవడానికి కారకులైన వారు అందుకు బాధ్యత వహించాల్సిందే. బాధ్యులను తగిన విధంగా శిక్షించాల్సిందే. బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆదుకునేలా సమాజంలోని వివిధ వర్గాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు దాని గురించే ఆలోచించే వారు గానీ, మాట్లాడే వారు గానీ లేక పోవడం శోచనీయం.
చీరాల, ఫిబ్రవరి 15:
ఓ దొంగతనం కేసులో నిందితుడుగా భావిస్తున్న పూర్ణచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకుని కారంచేడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ అనుమానాస్పద స్థితిలో అతను మృతి చెందడంతో గత నాలుగు రోజులుగా చీరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ప్రజా సంఘాలు కూడా కారణంగా భావించవచ్చు. వ్యక్తిగత కారణాలతో, అర్ధం లేని భేషజాలతో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వారు వేడెక్కించారు. ఎవరికి వారే ఇతోధికంగా అగ్నికి ఆజ్యం పోసి చిచ్చు రాజేశారు. ఫలితంగా చనిపోయిన వ్యక్తి తాలూకు మానవ హక్కుల అంశం మరుగున పడిపోయింది.
న్యాయ నిపుణులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు ఎవరైనా వ్యక్తిని అదుపులోకి తీసుకునే ముందు వారికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నేటి సమాజంలో రాజకీయ వత్తిళ్లు, వివిధ కారణాలతో అది అమలు కావడం లేదు. విచారణలో భాగంగా అదుపు లోకి తీసుకున్న వ్యక్తి ఆరోగ్యానికి ఏ విధమైన హాని జరిగినా అందుకు అధికారులే బాధ్యత వహించాలి. అదుపు లోకి తీసుకున్న వ్యక్తిని విడిచిన పెట్టిన తర్వాత రెండు గంటల వరకు అది వర్తిస్తుంది. కస్టోడియన్ డెత్ జరిగితే అందుకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వెలువరించిన మార్గదర్శకాలు చాల స్పష్టంగా ఉన్నాయి.
కారంచేడుకు చెందిన పూర్ణచంద్రరావు మృతికి రాజకీయ రంగు పులుముకోవడం మరో అంశం. కాకతాళీయం కానప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మృతుని కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అది కస్టోడియన్ డెత్ అని తాము అనుమానిస్తున్నందున న్యాయ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ వెనుక అతని వ్యక్తిగత కారణాలు ఉంటే ఉండొచ్చు గాక. అతని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నట్లుగా ఎమ్మెల్యేకి, కొంత మంది పోలీసు అధికారులతో విభేదాలున్నంత మాత్రాన ఆయన మద్దతిచ్చారనే కారణంతో మానవ హక్కుల ప్రస్తావన చేయకపోవడం సహేతుకం కాదు. ఈ విషయంలో ఎమ్మెల్యే సైతం సరైన పంథాలో వ్యవహరించలేదనే భావన వ్యక్తమవుతోంది. పూర్ణచంద్రరావుని విజయవాడలో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కారంచేడు పోలీసు స్టేషనుకి తరలించినట్లు పోలీసు అధికారులే చెప్పారు. అలాంటప్పుడు ఆరోపణకు కేంద్రమైన కారంచేడు పోలీసు స్టేషన్‌ను కాదని వేటపాలెం పోలీసు స్టేషన్‌ను ఈ వ్యవహారం లోకి లాగడంతో అసలు సమస్య పక్కదారి పట్టింది. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక పోలీసు అధికారులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అది చాలదన్నట్టు మాజీ మంత్రి పాలేటి రామారావు ఒంగోలులో విలేఖరుల సమావేశం పెట్టి ఆమంచికివ్యతిరేకంగా మాట్లాడడంతో మొత్తం వ్యవహారం పతాకస్థాయికి చేరింది. మరుసటి రోజే ఆమంచి, పాలేటి అనుచరులు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి పరస్సర ఆరోపణలకు దిగారు. మరో వైపు కొన్ని ప్రజా సంఘాలు ఆమంచి దిష్టిబొమ్మ దగ్ధానికి పూనుకోవడం... వెరసి చీరాల్లో 144 సెక్షన్ విధించడానికి దారి తీసాయి. ఇంత జరుగుతున్నా అసలు సంఘటన గురించి, బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యల గురించి, మృతుని కుటుంబానికి అందించాల్సిన చేయూత గురించి ఎవరూ పెద్దగా మాట్లాడక పోవడాన్ని మానవతావాదులు ఖండిస్తున్నారు. దొంగతనం కేసులో నిందితుడుగా ఉన్న పాపానికి తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించుకున్న పూర్ణచంద్రరావు కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఈదరకు మతి భ్రమించింది
* మండిపడ్డ తెలుగుతమ్ముళ్లు
ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 15:జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఎవరు ఓట్లు వేస్తే జిల్లాపరిషత్ చైర్మన్ అయ్యారో ప్రజలందరికి తెలుసునని జిల్లా తెలుగుదేశంపార్టీ ప్రధానకార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ తరపున జడ్‌పిటిసిగా గెలిచిన ఈదర పదవీకాంక్షతో చివరి నిమిషంలో వైకాపా పార్టీతో కుమ్మకై వారి జడ్‌పిటిసి సభ్యుల ఓట్లతో జడ్‌పి చైర్మన్‌గా ఎన్నిక అయిన విషయం గుర్తులేదా అనిప్రశ్నించారు. తెలుగుదేశంపార్టీ జడ్‌పిటిసి సభ్యులు ఎవరు కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదనేది జగమెరిగిన సత్యమన్నారు. ఈదర అనే వ్యక్తి ఎప్పటికి తెలుగుదేశం సభ్యుడు కాదన్నారు. ఒంగోలు వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ శింగరాజు రాంబాబు మాట్లాడుతూ ఈదర మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశంపార్టీ నాయకులు బొమ్మినేని మురళీ, పఠాన్‌హానీఫ్ ఖాన్, కోటా రాంబాబు, కమ్మా వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు పక్కదారి పడితే
కఠిన చర్యలు
- జిల్లా కలెక్టర్ సుజాత శర్మ -
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 15 : జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందించే నిత్యావసర సరుకులు పక్కదారిపడిత చర్యలు తప్పవని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుండి తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్, గృహనిర్మాణ శాఖ అధికారులతో జన్మభూమి- మా ఊరు అర్జీల పరిష్కారం, గృహనిర్మాణ, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పధకం క్రింద సిమెంట్ రోడ్ల నిర్మాణం, పంట సంజీవిని వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కంభం మండల కేంద్రంలో బియ్యం బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై రెవిన్యూ అధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఈ-పాస్ యంత్రాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నప్పటికీ ప్రతి నెలా సరుకులు నిల్వ ఉంటున్నాయన్నారు. తహశీల్థార్లు షాపుల వారీగా విచారించి అర్హత లేని కార్డులను తొలగించి అర్హత కలిగిన వారందరికీ సరుకులు పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జన్మభూమి- మా ఊరు మూడో విడత అర్జీల పరిష్కారం 30.5 శాతం పూర్తి అయ్యిందని, ఈ నెల 20న జన్మభూమి మా ఊరు అర్జీలు , రెవెన్యూ, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి స్కానింగ్ పూర్తి చేసి కంప్యూటర్ ఆన్‌లైన్‌లో నూరుశాతం నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు బాధ్యులు కాబట్టి అర్జీలు ఆన్‌లైన్ చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్‌టిఆర్ గృహ నిర్మాణం క్రింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ నెల 20వ తేది నాటికి జాబితాను సిద్దం చేయాలన్నారు. కనిగిరి, సిఎస్‌పురం, దొనకొండ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నందున గృహనిర్మాణ శాఖ వారు గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ప్రదర్శన
ఒంగోలు, ఫిబ్రవరి 15: సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఢిల్లీలో ఎబివిపి, బిజెపి దాడిని నిరసిస్తూ సిపియం ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవావరం ఒంగోలులో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన స్థానిక సుందరయ్య భవన్ నుండి బయలుదేరి కర్నూలురోడ్డు మీదుగా సాగర్ హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి సుబ్బారావు మాట్లాడుతూ బిజెపి అనుబంధ సంస్థలు ప్రజాస్వామ్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. హెచ్‌సియు విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన బిజెపి విధానాల వలన దేశవ్యాప్తంగా లౌకిక, ప్రజాస్వామిక, సామాజిక శక్తుల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుందన్నారు. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బిజెపి జెఎన్‌యులో ఆగడాలు సృష్టిస్తుందన్నారు. లౌకిక ప్రజాస్వామిక శక్తులకు నేతృత్వం వహిస్తున్న సిపిఎంను బిజెపి సహించలేక పోతుందన్నారు. అందులో భాగమే ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడి అని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిజెపి దుశ్ఛర్యలను ప్రజాస్వామిక వాదులందరూ నిరశించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ఘటనకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య, నగర కార్యదర్శి జివి కొండారెడ్డి, జిల్లా , నగర నాయకులు పి హనుమంతరావు, ఎస్‌కె మాబు, కె ఆంజనేయులు, పివి శేషయ్య, ఎస్‌కె మున్వర్ సుల్తానా, జి రమేష్, బి వెంకట్రావు, దామా శ్రీనివాసులు, కె రమాదేవి, ఎ శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘దాడిని ఖండించాలి’
టంగుటూరు : ఢిల్లీలో సిపిఎం కార్యాలయంపై సోమవారం జరిగిన దాడిని ఖండిస్తూ సిపిఎం, సిపిఐ, ఎంఆర్‌సిఎస్, కెవిపిఎస్, ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం నాయకులు టి రాము మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతోన్మాద దాడులు పెరిగాయన్నారు. జెఎంసిలో విద్యార్థుల అక్రమ అరెస్టులకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు పాల్గొన్నాయన్నారు. దీనిని జీర్ణించుకోలేని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి గుండాలు లౌకికవాదులపై, సిపిఎం కార్యాలయంపై భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పి ప్రభాకర్, ఎంపిఆర్‌పిఎస్ నాయకులు తిరుమలరావు, ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు ఎంకెబేగ్, వి మోజస్, బి సతీష్, నరసింహారావు, పి సుబ్బారావు, కె వెంకట్రావు, కె శ్రీను, ఎన్ ముత్యాలు, అంకయ్య, ఎస్‌కె మస్తాన్, కోటయ్య, మలేష్ పాల్గొన్నారు.
సిక్కోలును తాకిన ‘కాపు’ చిచ్చు!
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
రాష్ట్ర రాజకీయాల్లో కారుచిచ్చుపెట్టిన ‘కాపు’.. సిక్కోల్ బిసి నేతలకు కూడా ఎసరపెట్టేలా మారుతోంది. టిడిపి రాష్ట్ర చీఫ్ కిమిడి కళావెంకటరావు జిల్లా తెలుగుదేశం పార్టీలో కాపు సామాజికవర్గం పెద్దగా పార్టీ పనులు చూస్తుంటే... మరో బిసి నేత అచ్చెన్నాయుడు రాష్ట్ర కేబినేట్‌లో కీలక నిర్ణయాలకు కింగ్‌మేకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు కార్పొరేషన్ పాలకమండలి నియామకంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఎల్.ఎల్.నాయుడుకు చోటివ్వడం రాజకీయ సమతుల్యతకు సవాళ్ళుగానే కన్పిస్తోంది. ఉద్దండులైన సిక్కోల్ బిసి నేతల మధ్య ‘కాపు’ డైరక్టర్ కథ కంచికేనన్న విషయం తెలిసినప్పటికీ, జిల్లాపై ప్రేమతో ముఖ్యమంత్రి కింజరాపు సిఫార్సులకు సై చెప్పినా.. జిల్లా ఓటర్లలో 18.7 శాతం ఉన్న కాపు సామాజికవర్గం కంటే 11 శాతం గల వెలమ సామాజికవర్గం, 10.8 శాతం కలిగిన కళింగ సామాజికవర్గాలను మించి రాజకీయాలు చేసే పరిస్థితులు కళింగ రాజ్యంలో కన్పించదు. అందుకే బిసీలదే హవా అంటూ రాజకీయ ఉద్దండులు చెబుతుంటారు. తాజాగా బిసీల్లో చేరిన కళింగకోమట్లు, శిష్టకరణాలు సైతం కీలక గెలుపు, ఓటములకు కీలకం కాదన్నది ఇక్కడ ఎన్నికలు చెప్పే నిజాలు. ఈ నేపథ్యంలో ‘కాపు’కారుచిచ్చు బిసి నేతలపై పడనుంది.
రాష్ట్ర కాపు-బి.సి. కార్పొరేషన్లకు ప్రభుత్వం సోమవారం పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినట్టు బి.సి.కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ బి.శ్రీహరిరావు తెలిపారు. ఇందులో రాష్ట్ర కార్మికశాఖమంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యఅనుచరుడు ఎల్.ఎల్.నాయుడుకు ప్రభుత్వం స్థానం కల్పించిందని చెప్పారు. కాపు, బిసి కార్పొరేషన్‌కు అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన పి.రంగనాయకులు ఛైర్‌పర్సన్‌గా నియామకం కాగా, ఎల్.ఎల్.నాయుడు (శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం), పీచెట్టి చంద్రవౌళి (తూర్పుగోదావరి), బోళ్ళ వెంకటరమణ(పశ్చిమ గోదావరి) వేలుపుల సింహాద్రి యాదవ్(కృష్ణ), ఇనుకొండ సుబ్రహ్మణ్యం(చిత్తూరు) పాలకమండలి డైరక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. ఆ విధంగా కాపు కార్పొరేషన్‌కు చలమశెట్టి రామానుజయ(కృష్ణ) అధ్యక్షుడిగా ఉంటారని, ఎర్ర వేణుగోపాల రాయుడు(తూర్పుగోదావరి), ఎర్ర నవీన్(పశ్చిమ గోదావరి), నారుపుశెట్టి పాపారావు (ప్రకాశం), వడ్డెలి సాంబశివరావు(కృష్ణ), మెదుగుల పెంచలయ్య(వైఎస్సార్ కడప), వెదుర్ల రమాచంద్రరావు (కర్నూలు), కంట మురళీమోహన్(అనంతపురం), సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో పది నియోజకవర్గాల్లో 2014 సార్వత్రిక ఎన్నికలకు 19,28,527 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. తొలుత నుంచి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో బిసీల ఆధిపత్యం కొనసాగుతోంది.
జిల్లా జనాభాలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గాలైన కళింగ, తూర్పుకాపు, పోలినాటి వెలమ కులాలకు చెందిన వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. సంఖ్యాపరంగా అత్యల్పంగా ఉన్న కొన్ని కులాలవారికే అధికార పగ్గాలు అప్పగించి వారి అందలాలకు నిచ్చెనలుగా ఉపయోగపడుతున్న బలహీన వర్గాలకు ఈ జిల్లా రాజకీయాలు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. సామాజికంగా బలహీనవర్గాలకు చెందినవారే అయినా ఈ జిల్లా నేతలు రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కూడా తమదై ముద్ర వేస్తున్నారు. గౌతు లచ్చన్న ఈ జిల్లా రాజకీయాలను ఉద్యమాల బాట పట్టించి రాష్ట్ర రాజకీయ చిత్రపటంలోనే సుస్థిర స్థానం పొందారు. జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్‌కు పటిష్ఠ స్థానం సాధించి పెట్టినది బొడ్డేపల్లి రాజగోపాలరావునాయుడు. ఈ ఇద్దరు ఉద్దండులు బిసీలే! వర్తమానానికి వస్తే.. టిడిపి నేతలు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు, రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, అంతా బిసి నేతలే... అయితే, బిసీల్లో గెలుపు ఓటమీలకు కీలక నిర్ణయం చేసే శ్రీశయన, యాదవులు, మత్స్యకారులకు మాత్రం తగిన ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. మరల తాజాగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెరపైకి తీసుకువచ్చే ‘కాపు’కారుచిచ్చు రాష్ట్రంతోపాటు సిక్కోల్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది. తూర్పుకాపులకే స్థానం ఉన్న సిక్కోల్‌లో కాపు కార్పొరేషన్ నియామకాలు, నిధులు కేటాయింపులు ప్రభావితం చేయవంటూ సీనియర్ బిసి నేతలంతా గుండబద్దలుకొట్టినట్టు చెబుతున్నా బిసి కార్పొరేషన్ నుంచి కాపు కార్పొరేషన్ వరకూ పాలకమండలిలో సిక్కోల్‌కు స్థానం కల్పించేలా బిసి నేతలు పావులు కదిపారంటే... భవిష్యత్తు రాజకీయాల్లో ‘కాపు’లెక్కలు ఇక్కడ రాజకీయాలపై ప్రభావితం చేస్తాయన్న దూరదృష్టేనంటూ రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.
ప్రభుత్వ పథకాల వినియోగంతో
ఆర్థిక స్థిరత్వం సాధించాలి
సీతంపేట, ఫిబ్రవరి 15: ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్థిరత్వం సాధించాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. సోమవారం సీతంపేట ఏజెన్సీలో గవర్నర్ సతీసమేతంగా పర్యటించారు. మల్లి గురుకుల పాఠశాల మైదానం నుండి నేరుగా సీతంపేటకు విచ్చేసిన గవర్నర్ దంపతులకు ఐటిడిఎ అధికారులు ఘనస్వాగతం పలికారు. పిఎంఆర్‌సి కేంద్రంలో పలు శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. వ్యవసాయ పరిశోధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ ఎక్కువ సమయం పరిశీలించారు. పంటల రకాలు, ఒక ఎకరాకు రాగులు ఎంత దిగుబడి వస్తుంది, మార్కెటింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆచార్య ఎన్‌జి రంగ విశ్వవిద్యాలయం అధికారులను అడిగితెలుసుకున్నారు. చిరుధాన్యాలతో వండిన వంటకాలను రుచిచూశారు. గిరిజన ప్రాంతాల్లో చైతన్యపంటలు ఎన్ని ఉన్నాయని అడిగారు. ఉద్యానవనం, వనమూలికలు, మహిళా శిశుసంక్షేమశాఖ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులు, ఛాయ చిత్ర ప్రదర్శనశాలలను గవర్నర్ దంపతులు పరిశీలించారు.అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యాలను తిలకించారు. స్థానిక పిఎంఆర్‌సి కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి వారి ఆర్థిక పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు పనిచేయాలని తద్వారా ఆర్థికంగా స్థిరపడాలని అన్నారు. మద్యం సేవించే వారు ఆ అలవాటును మానుకొని ఆరోగ్యంగా జీవించాలన్నారు. ప్రభుత్వం మీ కోసం మంచి కార్యక్రమాలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పిల్లలందరూ బడిలో ఉండాలని, పిల్లలను చదువుకు దూరం చేయకూడదని హితవుపలికారు. మరోసారి తాను వచ్చేనాటికి పరిస్థితుల్లో మార్పులు చూడాలన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారం మేలు
గిరిజన చిన్నారులు ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. సీతంపేట ఏజెన్సీ పర్యటనలో భాగంగా స్థానిక పోలీస్‌స్టేషన్ రోడ్డులో ఉన్న సీతంపేట-1 అంగన్‌వాడీ కేంద్రాన్ని గవర్నర్ పరిశీలించారు. చిన్నారులకు ఈ రోజు ఏం పెడుతున్నారని, పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా? లేదా అని నిర్వాహకురాలను ప్రశ్నించారు. గర్భిణిలు ఎంత మంది ఈ అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ఉన్నారు? వంటగది ఎక్కడ ఉందని అడిగితెలుసుకొని వంటగదిని పరిశీలించారు. అక్కడి నుండి నేరుగా మల్లి గురుకుల పాఠశాలకు చేరుకొని విద్యార్థుల విద్యాప్రమాణాల స్థాయిని పరిశీలించారు. పిల్లలు నేలమీద ఎందుకు చదువుతున్నారు? కార్పెట్‌లు వేయాలని కలెక్టర్ లక్ష్మినృసింహంకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
కలెక్టర్ దంపతులకు జ్ఞాపికలు
సీతంపేట ఏజెన్సీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ దంపతులు ఇఎస్‌ఎల్ నరసింహన్, విమలానరసింహన్‌లకు కలెక్టర్ లక్ష్మినృసింహం, ఐటిడిఎ పిఒ జల్లేపల్లి వెంకటరావులు జ్ఞాపికలను అందజేశారు. గిరిజన సంప్రదాయ కళలతో కూడిన ఛాయాచిత్రాలను అందజేశారు.గవర్నర్ సతీమణి విమలానరసింహన్‌కు డిఆర్‌డిఎ పిడి తనూజరాణి దుస్సాలువ కప్పి సత్కరించారు. ఈ పర్యటనలో గవర్నర్ వెంట గవర్నర్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.రమేష్‌కుమార్, విప్ కూన రవికుమార్, పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యే కళావతి, కలమట వెంకటరమణ, జిల్లా ఎస్పీ ఎఎస్‌ఖాన్, పాలకొండ ఆర్డీఓ రెడ్డి గున్నయ్య, డిడి ఎంపివి నాయక్,ఇఇ శ్రీనివాస్, తహశీల్దార్ సావిత్రి పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
సక్రమంగా పనిచేస్తేనే సజావుగా పాలన
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 15: సక్రమంగా పనిచేస్తే పాలన సజావుగా సాగుతుందని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. ఎస్‌ఎం పురం పరిధిలోని గల 21వ శతాబ్దపు గురుకుల భవనాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులకు ఈనెల 17వరకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులు బాధ్యతలు కీలకమని గుర్తెరగాలన్నారు. ఈ రెవెన్యూ వ్యవస్థ పురాతనమైనదని దీనిని కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. చెరువులకు సంబంధించిన ఆయకట్టు, సరిహద్దులు పరిరిక్షించాలన్నారు. మంచినీటి వివరాలు సేకరించి వర్షాధార భూములు వివరాలు కూడా రికార్డుల్లో పొందుపరచాలన్నారు. చెరువులు ఆక్రమణలు తొలగింపుపై ప్రత్యేకదృష్టిసారించాలని ఈ క్రాఫ్ విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ టోటల్ సిస్టమ్‌లో భూములు సర్వేపై మరింత పరిజ్ఞానం అవసరమన్నారు. డి పట్టా భూములు చేతులు మారే అంశాలను ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వాలన్నారు. వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. విశ్రాంతి ఎఎఎస్ అధికారి డి.చక్రపాణి మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులు సిసిఏ రూల్స్‌కు అనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. నీటి తీరువాపై ప్రత్యేక దృష్టిసారించి ప్రభుత్వ ఆధాయాన్ని పెంచాలన్నారు. ఈశిక్షణా కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుండి 37మంది, విజయనగరం నుండి 28, విశాఖపట్నం నుండి 3మంది గ్రామ రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. రెండో విడత శిక్షణా కార్యక్రమం 18నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో బలివాడ దయానిధి, తహశీల్దార్లు బి.వెంకటరావు, మోహన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ జోగారావులు ఉన్నారు.
దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు!
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 15: నేరాలు, ఘోరాలకు నిలయంగా శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ మారిపోయింది. లక్షలాది రూపాయల దొంగనోట్లు చలామణీకి కేంద్రంగా చేసుకుని కోల్‌కతా నుంచి ఫేక్ కరెన్సీ బోకర్లు జిల్లాలో వ్యాపారం సాగిస్తున్నారు. మూడు మాసాల కిందట సరుబుజ్జిలికి చెందిన కొంతమంది యువకులు దొంగనోట్ల సంచులతో ఆమదాలవలస పోలీసులకు దొరికిపోవడంతో అప్పటి నుంచి అక్కడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ నిఘా పెంచారు. దీంతో సోమవారం రాత్రి శ్రీకాకుళం రోడ్డులో 17 లక్షల 50 వేల దొంగనోట్లు సంచులతో పాకిస్థాన్‌కు చెందిన కొరియర్‌తోపాటు కొత్తూరు-హిరమండలంకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బంధువు, జి.సిగడాం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన అనుచరుడు, ఆమదాలవలసకు చెందిన ఒక టీచర్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, పాకిస్థాన్ నుంచి ఫేక్ కరెన్సీ కోల్‌కతాకు కంటైనర్లలో వస్తున్నట్టు, అక్కడ నుంచి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో పోలీసుల నిఘా తక్కువ కావడంతో రైలు దిగి ఇక్కడ నుంచి కేంద్రాల వారీగా సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఆమదాలవలసలో ఒక ముఠా పనిచేస్తున్నట్టు పట్టుబడిన ఆ నలుగురు వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో కోల్‌కతా పోలీసులకు ఈ సమాచారం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అందించినట్టు సమాచారం. వీరిని మంగళవారం అరెస్టులు చూపించి కోర్టులో హాజరుపర్చనున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, రాజకీయ నేతల బంధువులు, అనుచరులు దొంగనోట్ల ముఠాలో పనిచేయడంతో పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతున్నట్టు ఉంది. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు మార్చాల్సిన పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇటువంటి ఒత్తిళ్ళుతో పోలీసులు ఎంతో కష్టపడి, కాపుకాసి పక్కా ప్లాన్‌తో పట్టుకున్నా ఫలితం ఉండడం లేదన్న ఆవేదన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ పాకిస్థాన్ నుంచి దొంగనోట్లు వయా కోల్‌కతా- చిక్కోల్‌లో పంపిణీ కేంద్రంగా మార్చేయడంతో మున్ముందు గన్ కల్చర్ కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటూ స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూర్మనాథుని దర్శించుకున్న గవర్నర్
గార, ఫిబ్రవరి 15: మండలంలోని ప్రఖ్యాతమైన కూర్మనాథ క్షేత్రాన్ని రాష్ట్ర ఇ.ఎస్.ఎల్ నరసింహన్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులను ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.శ్యామలాదేవి, ఆలయ ప్రధానార్చకుడు చామర్తి సీతారామ నృసింహాచార్యులు నేతృత్వంలో అర్చక స్వాములు సాదరంగా ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ముందుగా శే్వత పుష్కరిణిని సందర్శించారు. అనంతరం స్వామి వారి గర్భగుడి శిఖరాగ్రాన్ని తిలకించి నమస్కరించారు. అదేవిధంగా స్వామి వారి ఆస్థాన మండపంలో గోడలపై ఒడిశా ఆకుపసర్లతో నాడు వేసిన చిత్రాల చరిత్రను అర్చక స్వాములు చామర్తి మురళీకృష్ట వివరించారు. అదేవిధంగా క్షేత్ర విశిష్టతను పలువురు అర్చక స్వాములు వివరించారు. బేడా మండపంలో కప్పస్తంభంగా భావించే స్థంభాన్ని గవర్నర్ దంపతులు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా లక్ష్మీ సన్నిధిలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బేడా మండపంలో గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు పలికిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గవర్నర్‌తో పాటు జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనృసింహం దంపతులు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, ఆర్డీవో బలివాడ దయానిధి, స్థానిక సర్పంచ్ బరాటం రామశేషు, తహశీల్దారు సింహాచలం, నీటి సంఘం అధ్యక్షుడు గిరి, ఎం.పి.టి.సి. కోరాడ వెంకటరావులతో పాటు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు ఉన్నారు.
ఆదర్శపాఠశాలల్లో ఐదు తరగతులు, ఐదుగురు ఉపాధ్యాయులు
సారవకోట, ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభించిన ప్రతీ ఆదర్శ పాఠశాలలో ఐదు తరగుతులు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలన్న లక్ష్యంతో ప్రణాళికను రూపొందించి పటిష్ఠంగా అమలు చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వెల్లడించారు. మండలంలోని గుమ్మపాడు ఆదర్శపాఠశాలను సోమవారం ఆకస్మీకంగా తనిఖీ చేసిన సమయంలో విలేఖర్లతో మాట్లాడారు. జిల్లాలో 214 ఆదర్శపాఠశాలలను ప్రారంభించగా సమీపంలోని 153 ప్రాథమిక పాఠశాలలను ఇందులో విలీనం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ పాఠశాలలో సమగ్రాభివృద్దికి విద్య అభివృద్ధి కోసం 29 అంశాలతో స్పష్టమైన ప్రణాళికను అమలు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 37,840 మంది విద్యార్థులు హారవుతున్నారని వీరు కాకుండా 2500మంది ప్రైవేటుగా పరీక్షలు రాయనున్నారని ఆయన వివరించారు. వీరికోసం 175 ప్రభుత్వ పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రైవేటు విద్యార్థుల కోసం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
జిల్లాలోని భామిని, గంగన్నపేట, ఈదులవలస ఉన్నత పాఠశాలలో కొత్తగా పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలలో 60 కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు రాయడానికి బెంచీలు లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కేంద్రాలకు కూడా బెంచీలు సమకూర్చడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. జిల్లాలో ఒక్క విద్యార్థి కూడా నేలమీద కూర్చుని పరీక్ష రాయకూడదన్న లక్ష్యంతో దాతలు, స్వచ్ఛందసంస్థలు సహకారంతీసుకొని వౌలిక సదుపాయాలు కల్పించాలని కృషి చేస్తున్నట్లు డిఇవో వివరించారు. ఈనెల 10వ తేదీ నుండి నెలాఖరులోగా అన్ని పాఠశాలలో వార్షికోత్సవాలు నిర్వహించినట్టు ఆదేశించినట్లు ఆయన స్పష్టంచేశారు. ఈయనతోపాటు మండల విద్యాశాఖాధికారి కె.రాంబాబు, అభివృద్ది కమిటి అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ ఉన్నారు.
‘రైతు బంధు’ను సద్వినియోగం చేసుకోండి
నరసన్నపేట, ఫిబ్రవరి 15: రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తోందని ఎఎంసి ఏడి శ్యాంకుమార్ తెలిపారు. ప్రతీ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలులో హెచ్చుతగ్గులు వస్తుంటాయని ధరగాని తగ్గినట్లయితే రైతులకు అందుబాటులో ఈ రైతు బందు పథకాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ గోదాములల్లో రైతులు నిల్వ ఉంచిన ధాన్యానికి సంబంధించి ఆరునెలల వరకు ఎటువంటి రుసుం వసూలు చేయడం జరగదని అంతే కాకుండా నిల్వ ఉంచిన ధాన్యంపై 75శాతం మేర రుణాలను కూడా అందజేస్తామని తెలిపారు.
ఈ రుణాలకు సంబంధించి సుమారు 2లక్షల వరకు ఆరుమాసాల వరకు వడ్డీలేకుండా ఈ సదుపాయం పొందవచ్చునని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 14 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు 49 మంది రైతులుమాత్రమే తమ ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారని తెలిపారు.
నరసన్నపేటలో ఎక్కువ సంఖ్యలో 20మంది రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచగా ఏడులక్షల మేర రుణం కూడా మంజూరు చేసినట్టు తెలిపారు. సంబంధిత రైతులు ఈ పథకం ద్వారా గుర్తింపు కార్డును తీసుకోవాలని దీని కాలపరిమితి ఐదు సంవత్సరాల వరకు ఉంటుందని స్పష్టంచేశారు. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
పొందూరు, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విప్ కూన రవికుమార్ కోరారు. ఆయన మండలంలోని చినబొడ్డేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ 13వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరయిన రూ.5లక్షలతో నాగావళి నది నుండి సురక్షిత మంచినీటిని అందించే పైపులైన్లు కార్యక్రమానికి ప్రారంభిస్తూ మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని ముందుకు సాగుతున్న చంద్రబాబునాయుడుకు ప్రతీ ఒక్కరు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. జెడ్‌పిటిసి శ్రీరాములునాయుడు, మండల దేశం అధ్యక్షుడు రామ్మోహనరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇఇ ఆశాలత, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బొడ్డేపల్లి సర్పంచ్ ప్రతినిధి బొడ్డేపల్లి సత్యం అధ్యక్షత వహించారు.
మహాలక్ష్మి యాత్రకు విస్తృత ఏర్పాట్లు
రణస్థలం, ఫిబ్రవరి 15: మహాలక్ష్మమ్మ యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీకాకుళం డిఎస్పీ భార్గవరావునాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన యాత్ర జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యాత్ర ఏర్పాట్లు గురించి ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రసాదరావు, ఈశ్వరరావులతో చర్చించారు. దుకాణాలు, భక్తులు వచ్చే ఏర్పాట్లు గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలు రాకపోకలు భక్తులకు ఇటువంటి ఇబ్బందులు రాకుండ చూడాలని ఎస్‌ఐ సత్యనారాయణకు ఆదేశించారు. యాత్రలో ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
బయోమెట్రిక్‌ను అమలు చేయాలి
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 15: ప్రభుత్వాదేశాల మేరకు అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హెచ్.లజపతిరాయ్ ఆదేశించారు. సోమవారం సెమినార్ హాల్‌లో జిల్లాలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడారు. వందమంది విద్యార్థులకు ఒక్క బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు హాజరుపట్ల మరింత శ్రద్ధ కనబర్చాలన్నారు. ర్యాగింగ్ లేకుండా మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కళాశాలల వెబ్‌సైట్లను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ల్యాబ్ సిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యనందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలవారీ నివేదికలు విశ్వవిద్యాలయానికి విధిగా పంపాలన్నారు. ఈ సమావేశంలో రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, డీన్ చిరంజీవులు, శ్రీకాకుళం, టెక్కలి, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్స్ బాబూరావు, తిరుపతిరావు, అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
నేడు విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 15: జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం ఈనెల 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన పంపిన ఓ ప్రకటనలో పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, గిరిజన వ్యవహారాల శాఖ నిధులతో అమలవుతున్న పథకాలపై సమీక్ష ఉంటుందన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో విద్యుత్ సమస్యలు పరిష్కారం
గార, ఫిబ్రవరి 15: గ్రామ స్థాయిలో నెలకొంటున్న విద్యుత్ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఆర్.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం విద్యుత్ సమస్యలు ఇతరత్రా అంశాలపై వినియోగదారులతో ప్రజావాణిని ఆ శాఖాధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన పలువురు ప్రజా ప్రతినిధులుతో పాటు వినియోగదారులు విద్యుత్ సమస్యలతో పాటు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారానికి నివేదికలు సిద్ధం చేస్తున్నామని, అదేవిధంగా విద్యుత్ సరఫరాను సైతం మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
కథా నిలయానికి రూ.10వేల విరాళం
శ్రీకాకుళం(కల్చరల్), ఫిబ్రవరి 15: పట్టణంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న కథానిలయానికి గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ గీత రూ.10వేల విరాళాన్ని సోమవారం అందించారు. ఈమేరకు కథానియలం వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావుకు గీతాశ్రీకాంత్ రూ.10వేల చెక్కును ఆయన స్వగృహంలో అందించి దుస్సాలువాతో సత్కరించారు. కథానిలయం మరింత అభివృద్ధి చెంది సాహితి అభిమానులు, రచయితలకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా గీతాశ్రీకాంత్ ఆకాక్షించారు. కథానిలయం అభివృద్ధికి దాతలు స్పందిచడం సాహితీ ప్రియులకు మరింత శక్తినిస్తుందని కాళీపట్నం రామారావు అన్నారు.
విద్యల నిలయంగా నవ్యాంధ్రప్రదేశ్
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏడు జాతీయ స్థాయి విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ళ నారాయణరావులతో కలిసి కృష్ణా విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ విశ్వ విద్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకు జవసత్వాలు తీసుకువచ్చామన్నారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి కోట్లాది రూపాయలు కేటాయింపులు చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయాన్ని దేశంలోని గొప్ప విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే విద్యా రంగంలో అపారమైన అనుభవం కలిగిన ఆచార్య ఎస్ రామకృష్ణారావును ఉపకులపతిగా నియమించినట్లు తెలిపారు. రామకృష్ణారావు సారథ్యంలో విశ్వ విద్యాలయం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయంలో నెలకొన్న ఫ్యాకల్టీ కొరత తన దృష్టికి వచ్చిందని త్వరలోనే నిష్ణాతులైన వారిని ఫ్యాకల్టీలుగా నియమించనున్నట్లు చెప్పారు. వచ్చే యేడాది నుండి డిమాండ్ ఉన్న కోర్సును ప్రవేశ పెట్టనున్నట్లు వివరించారు. రుద్రవరం గ్రామంలోని 102 ఎకరాల్లో యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకు అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామన్నారు. తొలుత అకడమిక్, అడ్మ్రినిస్ట్రేటీవ్ బ్లాక్‌లను నిర్మించడం జరుగుతుందన్నారు. తొలుత విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ ఉమెన్ టోర్నమెంట్ పోటీలను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ఎంపి నారాయణరావులు తిలకించారు. క్రీడాకారుణులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్ వైకె సుందర కృష్ణ, పిఆర్‌ఓ వినయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
21, 22 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
* రెండు రోజుల్లో ప్రభుత్వ శాఖల లక్ష్యాలు, పురోగతిపై నివేదికలు ఇవ్వాలి
* ‘మీకోసం’లో జిల్లా కలెక్టర్ బాబు.ఎ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 21, 22తేదీల్లో విజయవాడలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ కోర్ డాష్ బోర్డు ఆధారంగా ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ శాఖలు పురోగతి డాష్ బోర్డులో ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తమ తమ శాఖలకు సంబంధించి సాధించిన ఫలితాలను అప్‌లోడ్ చేస్తే సిఎం డాష్ బోర్డులో నమోదవుతుందన్నారు. నాలుగైదు రోజుల్లో అప్‌లోడింగ్ పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అవసరమయ్యే శాఖల వారీగా లక్ష్యాలు, పురోగతిపై, రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాలు, వాటికి బడ్జెట్ వివరాలను రెండు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శాఖాధికారులంతా తమ శాఖ డబుల్ డిజిట్ గ్రోల్ లక్ష్యంగా నివేదికలు రూపొందించాలన్నారు. అలాగే తమ తమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల వివరాలు కూడా తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిఆర్‌ఓ చెరుకూరి రంగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలందించండి
* ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జెడ్‌పి చైర్‌పర్సన్
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాజువాలిటి, అత్యవసర చికిత్సా విభాగం, మెడికల్ వార్డుతో పాటు పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 1 నుండి ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటి వరకు 50 శాతం మంది మాత్రమే వినియోగించుకోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కుక్క కాటు మందు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విధిగా ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో కుక్క కాటు మందు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మరమ్మతు పనులను ఆమె పరిశీలించారు. వంటశాలను పరిశీలించిన ఆమె రోగుల కోసం తయారు చేస్తున్న ఆహార పదార్థాల రుచి చూశారు. రోగులకు రుచికరమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. నర్సింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులను వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల తరగతులు, హాస్టల్ ఎంసిహెచ్ బ్లాక్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారని, కనీస సౌకర్యాలు కొరవడ్డాయని, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్ట్ఫా కూడా లేరని, డిప్యుటేషన్‌పై ప్యాకల్టీని వేశారని పలువురు విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, ఆర్‌ఎంఓ డా. అల్లాడి శ్రీనివాసరావు, డిఇ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ట్రైనీ కలెక్టర్ల బృందం
* 4 రోజుల పాటు జిల్లాలో శిక్షణ పొందనున్న బృందం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పాలనా విధానాన్ని తెలుసుకునేందుకు 18 మందితో కూడిన ట్రైనీ కలెక్టర్ల బృందం సోమవారం కలెక్టరేట్‌ను సందర్శించారు. నాలుగు రోజుల పాటు ఈ బృందం జిల్లాలో పర్యటించి వివిధ శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై శిక్షణ పొందనున్నారు. తొలుత కలెక్టరేట్‌కు చేరుకున్న ట్రైనీ కలెక్టర్ల బృందానికి జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బాబు.ఎను కలిశారు. ‘మీకోసం’లో ప్రజల అర్జీల స్వీకరణ, వాటి పరిష్కారాలపై జాయింట్ కలెక్టర్ చంద్రుడు, జిల్లా ట్రైనీ కలెక్టర్ సలోని శిక్షణ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసిని సందర్శించి కృష్ణాజిల్లా వెబ్‌సైట్‌ను పరిశీలించారు. 16వతేదీన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పుర పరిపాలనపై శిక్షణ పొందనున్నారు. 17వతేదీన ఎస్‌హెచ్‌జి పెన్షన్‌ల పంపిణీ, ఇక్రాప్ బుకింగ్ సబ్ సెంటర్, పిహెచ్‌సి, ఇ-పోస్, ఎఫ్‌సిఐ గోడౌన్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల పనితీరును ఈ బృందం పరిశీలించనుంది. 18వతేదీన సాలీడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, గ్రీనరీ, బ్యూటిఫికేషన్ అంశాలపై శిక్షణ పొందుతారు.
సౌత్ జోన్ వాలీబాల్ టోర్నీ విజేత ‘కాలికట్ యూనివర్శిటీ’
* విజేతలకు ట్రోఫీలు అందజేసిన జడ్‌పి చైర్‌పర్సన్ అనూరాధ, ఎంపి కొనకళ్ళ
మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 15: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ వాలీబాల్ ఉమెన్ టోర్నీ విజేతగా యూనివర్శిటీ ఆఫ్ కాలికట్ నిలిచింది. స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో గత ఐదు రోజులుగా కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చివరి రోజైన సోమవారం జరిగిన లీగ్ పోటీల్లో కాలికట్ యూనివర్శిటీ జట్టు ప్రథమ స్థానం, మహాత్మ గాంధి యూనివర్శిటీ (కొట్టాయం) ద్వితీయ స్థానం, హిందుస్థాన్ యూనివర్శిటీ (చెన్నై) తృతీయ స్థానం, యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ (చెన్నై) నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సాయంత్రం జరిగిన ముగింపు సభలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలను అందజేశారు. టోర్నీ ప్లేయర్‌గా కాలికట్ యూనివర్శిటీ జట్టు కెప్టెన్ శృతి, బెస్ట్ స్పైకర్‌గా ఎంజి యూనివర్శిటీ జట్టుకు చెందిన శరణ్య, బెస్ట్ సెట్టర్‌గా హిందుస్థాన్ యూనివర్శిటీకి చెందిన దీనా పైలోచన్, బెస్ట్ లీబ్రోగా హిందుస్థాన్ యూనివర్శిటీకి చెందిన పి శరణ్య బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, రిజిస్ట్రార్ ఆచార్య డి సూర్యచంద్రరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. వైకె సుందర కృష్ణ, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. ఎన్ శ్రీనివాసరావు, కన్వీనర్ బిఆర్ విజయారావు, డా. జయశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రతాప్‌ను పరామర్శించిన జగన్
నూజివీడు, ఫిబ్రవరి 15: నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతమ్మ పార్ధివ దేహాన్ని వైకాప అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి సోమవారం ఉదయం సందర్శించి, నివాళులు అర్పించారు. ప్రతాప్ సతీమణి సుజాతమ్మ సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం 11.30 గంటలకు సుజాతమ్మ భౌతికకాయాన్ని వైకాప అధినేత జగన్‌మోహనరెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటూరు 1 శాసనసభ్యుడు షేక్ మహ్మద్ ముస్త్ఫా అలీ, తిరువూరు శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, బొబ్బిలి శాసనసభ్యుడు సుజన కృష్ణ రంగారావు, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, మాజీ శాసనసభ్యుడు డివై దాసు, జోగి రమేష్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తదితరులు సుజాతమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
* సబ్ కలెక్టర్ లక్ష్మీశ
నూజివీడు, ఫిబ్రవరి 15: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మీకోసం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని కంప్యూటరీకరణ చేస్తున్నామని, అనంతరం ఆ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్జీదారుని సమస్య పరిష్కార దశలను కూడా అర్జీదారునికి తెలిసే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని సూచించారు. మీకోసం కార్యక్రమంలో 20 అర్జీలు వచ్చాయని లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
21న రెండవ విడత పల్స్ పోలియో:కలెక్టర్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 15: రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పల్స్ విజయవంతానికి అధికారులు పట్టుదలతో పని చేయాలన్నారు. మొదటి విడతలో 4లక్షల 10వేల మందికి పోలియో చుక్కలు వేయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా కృష్ణాజిల్లాలో తల్లి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తూ పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వాక్సిన్ నిల్వ ఉంచడానికి కోల్డ్‌చైన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి పాఠశాలలో ముందుగానే విద్యార్థులకు పల్స్ పోలియో గురించి తెలియచేయాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు.
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
జి.కొండూరు, ఫిబ్రవరి 15: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి జి.కొండూరులో వైసిపి శ్రేణులు సోమవారం ఘన స్వాగతం పలికాయి. నూజివీడులో ఒక కార్యక్రమానికి హాజరైన వైఎస్ జగన్ అక్కడి నుంచి మైలవరం మీదుగా జి.కొండూరుకు చేరుకున్నారు. జగన్ వస్తున్నారనే ప్రచారంతో వైసిపి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు జి.కొండూరు ప్రధాన సెంటర్‌లో జగన్ కోసం వేచి నిలిచారు. జగన్ బయటకు వచ్చి అందరికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. జోగి రమేష్, కాజ రాజ్‌కుమార్, జిల్లా ముఖ్య నేతలు జగన్‌తో పాటు ఉన్నారు.
విద్యుదాఘాతానికి యువకుడు మృతి
బంటుమిల్లి, ఫిబ్రవరి 15: కృత్తివెన్ను మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చిగురుపల్లి భరత్‌కుమార్(18) స్థానికంగా ఉన్న ఒక ఇంట్లో వివాహానికి సంబంధించి విద్యుత్ దీపాలంకరణకు పనులు చేపట్టాడు. విద్యుత్ సెట్టింగ్ చేస్తుండగా వైర్లు పక్కనే ఉన్న 11కెవి వైరు తగలటంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన సిఎం చంద్రబాబు
నందిగామ, ఫిబ్రవరి 14: మండలంలోని గోళ్లమూడిలో సోమవారం జరిగిన దేవభక్తుని నిత్యానంద ప్రసాద్ (డిఎన్) కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న సిఎం చంద్రబాబును చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా కార్యకర్తలు, స్థానిక నేతలు, గ్రామస్థులను పోలీసులు దూరంగా ఉంచారు. అభిమానులకు సిఎం చంద్రబాబు కారు నుండి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిఎం చంద్రబాబు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని, జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం తదితర నేతలు వధూవరులు భరత్, తేజశ్విని ఆశీర్వదించారు. ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్, ఎస్‌పి విజయకుమార్‌ల పర్యవేక్షణలో డిఎస్‌పి రాధేష్ మురళి అదనపు పోలీస్ బలగాలతో గ్రామంలో బందోబస్తు పర్యవేక్షించారు. వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వధూవరుల బంధువులు, సన్నిహితులను సైతం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అయ్యే వరకూ భద్రతా కారణాల దృష్యా పోలీసులు అడ్డుకున్నారు.
నగరంలో ఆహార తనిఖీ అధికారులు
మెరుపు దాడులు
* కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్‌తోపాటు స్వీట్ షాపుల్లో తనిఖీలు
* నమూనాల సేకరణతోపాటు 5వేల కేజీల బొప్పాయిల ధ్వంసం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: ఆహార పదార్థాల్లో నానాటికీ అధికమవుతున్న కల్తీలను నిరోధించేందుకు ఎట్టకేలకు ఆహార తనిఖీ అధికారులు స్పందించారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పలువురు ఫుడ్ సేఫ్టీ అధికారులు బృందంగా ఏర్పడి నగరంలో కేదరేశ్వరపేట పండ్ల దుకాణంతోపాటు నగరంలోని పలు స్వీట్ షాపులపై జరిపిన దాడులు సంచనలనం సృష్టించాయి. ఈ దాడులలో గుర్తించిన ఆహార కల్తీ పదార్థాలను గుర్తించి పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించారు. అంతేకాకుండా మనిషి ఆరోగ్యాన్ని హరించే కార్బైడ్‌తో మగ్గపెడుతున్న బొప్పాయి పండ్లను గుర్తించి వాటిని ధ్వంసం చేసిన ఘటనలు వ్యాపారులలో కలకలం రేపాయి. ఇప్పటివరకూ తమను పట్టించుకునే వారు లేరన్న నెపంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరించిన వ్యాపారులు ఊహించని విధంగా జరిగిన మెరుపుదాడులతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా వివిధ రకాల పండ్ల ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంతో ప్రఖ్యాతి గాంచిన నగరంలోని కేదరేశ్వరపేట పండ్ల మార్కెట్‌లో వివిధ రకాల పండ్ల నమూనాలను సేకరించారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కార్బైడ్ లేకుండా మగ్గపెట్టిన పండ్లను విక్రయిస్తామంటూ బోర్డు పెట్టిన దుకాణంలోనే కార్బైడ్‌తో మగ్గపెట్టిన ఐదు వేల కేజీల బొప్పాయిలు అధికారుల తనిఖీలలో దొరికాయంటే వ్యాపారులు పాల్పడుతున్న మోసపూరిత చర్యలను అంచనా వేయవచ్చు. కార్బైడ్‌తో మగ్గపెట్టిన బొప్పాయిలను గుర్తించి ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారని చెప్పవచ్చు. అలాగే ఆకర్షణీయమైన రంగులతో మిఠాయిలను తయారు చేసి విక్రయిస్తున్న ప్రముఖ స్వీట్ షాపులపై కూడా ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు. ఈ తనిఖీలలో స్వీట్ మ్యాజిక్, స్వగృహ, ఆంధ్ర, చెర్రి, అలంకార్ వంటి మొత్తం 9 దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జోనల్ ఆఫీసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేయడమే కాకుండా అనారోగ్యకారకమైన రంగులు, ఇతర పదార్థాలను వినియోగించి ప్రజారోగ్యానికి చేటు కలిగించే ఎటువంటి దుకాణాలపైన అయినా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు ముమ్మరం చేసి ఆహార కల్తీ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెటీవ్ మెడిసిన్ డెప్యూటీ డైరెక్టర్ మంజరి, జోనల్ అధికారి పూర్ణచంద్రరావుతోపాటు కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పలువురు పాల్గొన్నారు.
ఉసురు తీసిన నిర్లక్ష్యం
ప్రహరీ గోడ కూలి
తల్లీకూతురు మృతి
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 15: కాలంచెల్లిన ఓ ఇంటి ప్రహరీ గోడను పట్టించుకోని యజమాని నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలు తీసింది. గోడ కూలటంతో పొరుగు ఇంట్లో నివాసముంటున్న తల్లీకుమార్తె బలయ్యారు. శిథిలాల కింద ఇరుక్కున్న తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కుమార్తె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా స్థానికులను తీవ్ర వేదనకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమానూరు వద్ద నివాసముంటున్న ముదిగొండ రాంబాబు(45)కు భార్య రాధ(35), కుమార్తె శిరీష(14), కొడుకు గణేష్ ఉన్నారు. పెయింటింగ్ పనిచేస్తూ రాంబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం భార్య రాధ, కుమార్తె శిరీష కలిసి ఇంటి వెలుపల పంపు వద్ద పాత్రలు కడుకుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న శిరీష తల్లికి చేదోడుగా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా ఉన్న మద్దాల ప్రసాదరావు అనే వ్యక్తికి చెందిన ఇంటి ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపడింది. ఎప్పటి నుంచో నెర్రలున్న ఈ గోడను తొలగించి పునర్నిర్మించడంలో ఇంటి యజమాని నిర్లక్ష్యం కనపరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కూలి పడిన గోడ శిథిలాల కింద చిక్కుకుపోయిన రాధ అక్కడికక్కడే మృతి చెందగా శిరీష తీవ్ర గాయాలపాలైంది. కూలిన పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న రాంబాబు పరుగున బయటకు వచ్చాడు. శిథిలాలను తొలగించి చూడగా రాధ విగతజీవిగా కనిపించింది. గాయపడిన కుమార్తెను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆమె కూడా మృతి చెందింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులను శోకసముద్రంలోకి నెట్టింది. మృతదేహాలను మార్చురీకి తరలించి రాంబాబు ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని మంచినీటి చెరువులను తక్షణం నింపాలి
* చేపల చెరువులకు మళ్లిస్తే కఠినచర్యలు
* కలెక్టర్ బాబు.ఎ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: జిల్లాలోని అన్ని మంచినీటి చెరువులను నింపి తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సోమవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపిడివోలు, అన్ని శాఖల అధికారులతో అటవీ భూముల గుర్తింపు, తాగునీరు, జాతీయ ఉపాధి హామీ పథకం, ఎన్‌టిఆర్ వైద్య పరీక్షల నిర్వహణ వంటి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో వుంచుకొని జిల్లాలో 370 చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. కాలువలకు నీరు విడుదల చేసినందున మొదటి ప్రాధాన్యతగా మంచినీటి చెరువులను నింపుకోవాలని ఇందుకు అవసరమైతే ఆయిల్ ఇంజన్లు, 500 హాల్స్ పవర్ ఇంజన్లతో యుద్ధప్రాతిపదికన నింపుకోవాలన్నారు. కాలువలకు విడుదల చేసిన నీరు చేపల చెరువులకు వినియోగించినట్లయితే సంబంధిత చెరువులను ధ్వంసం చేయటం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. నింపవలసిన చెరువుల్లో ఎటుంవటి చెత్త లేకుండా శుభ్రం చేసుకోవాలని పంచాయతీ శాఖ అధికారులకు సూచించారు. 14వ ఆర్ధిక సంఘం నిధులు తాగునీటి నిలుపుదల వినియోగించాలన్నారు. తాగునీటి అవసరాలకు ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన బిల్లులు నిలుపుదల చేయకుండా తక్షణమే విడుదల చేయాలని జిల్లా ఖజానా శాఖ అధికారిని ఆదేశించారు. కాలువ చివరి గ్రామాల్లోని చెరువులు కూడా నీటిని నింపే విధంగా కాలువలపై తహశీల్దార్లు, ఎంపిడివోలు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ, పోలీస్ అధికారులు పహారా నిర్వహించాలని ఆదేశించారు.
పల్స్‌పోలియో రెండోదశ ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్నందున వైద్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్‌టిఆర్ వైద్య పరీక్షలు జిల్లాలో సరిగా నిర్వహించకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు వైద్య పరీక్షలపై ప్రగతి లేకపోవటం పట్ల వైద్య అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని తల్లిబిడ్డ, 102, ఇ-ఔషధి, బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎన్‌టిఆర్ కాంప్లెక్సుకు మహర్దశ
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 15: నగరంలోని ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సు అభివృద్ధితోపాటు తూర్పు పరిధిలోని 14రోడ్లతోపాటు హైటెన్షన్ వైర్ రోడ్డుగా ఉన్న ఆయూష్ హాస్పటల్ రోడ్డు అభివృద్ధికి మరో రూ.22 కోట్ల రూపాయల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఆర్ కరికల్ వలవేణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయనను కలిసిన నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ నగరాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సమీక్షించారు. ఎంతో కాలంగా పరిష్కృతంగా ఉన్న ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సుపై రెండో అంతస్థు నిర్మాణం చేపట్టి షాపులను లీజుకివ్వడం ద్వారా గణనీయమైన ఆదాయం పొందాలని చూస్తున్న నగర పాలకులకు నిధుల లేమితో ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తున్న వైనం అందరికీ తెలిసిందే. కాగా ఈవిషయంపై ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్‌తో చర్చించిన మేయర్ శ్రీ్ధర్ రెండో అంతస్తు నిర్మాణానికి అవసరమైన అనుమతులకు సంబంధించిన జీవోను మరో రెండు రోజుల్లో విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఇందులో నిర్మాణ వ్యయానికి సంబంధించిన నిధుల మంజూరుపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే తూర్పు నియోజకవర్గం పరిధిలోని 14 ప్రధాన రహదారుల అభివృద్ధికి గాను 7 కోట్ల రూపాయలు, దీనితోపాటు ఎంతోకాలంగా అసంపూర్తిగా ఉన్న ఆయూష్‌హాస్పటల్ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధిపరచేందుకు మరో 22 కోట్లను కూడా మంజూరు చేసామని, త్వరలోనే వీటిని విఎంసి ఖజానాకు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరికల్‌ను కలిసిన వారిలో ఇఇ ధనుంజయ పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎన్నికల్లో టిడిపి, వైకాపా జోక్యం తగదు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైకాపాల జోక్యం తగదని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. ఈ గుర్తింపు ఎన్నికలను అధికార, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ రెండు పార్టీలు రాజకీయ వేదికలుగా మార్చుతున్నాయని, దీనివల్ల కార్మికుల ఐక్యతకు భంగం కలిగి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటువేసే అధికారాన్ని కోల్పోతారని ఆయనన్నారు. సోమవారం స్థానిక పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ ఆవరణలోని ఇయు కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గుర్తింపు యూనియన్ ఎన్నికలనేవి ఓ సంస్థకు చెందినవని, ఇక్కడ పోటీచేసే యూనియన్ల వెనుక రాజకీయ పార్టీలు, బలమైన కార్మిక సంఘాలున్నప్పటికీ వాటి జోక్యం ఉండదన్నారు. సాధారణ ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓట్లువేసే స్వేచ్ఛ ఇక్కడ ఉందని, అయితే ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల విషయానికొస్తే కార్మికుల సంక్షేమానికి ఏ యూనియన్ అయితే పాటుపడిందో దానికి స్వేచ్ఛగా ఓటువేసే అధికారం కార్మికుడికుందన్నారు. ఈ సమావేశంలో ఇయు రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు, ఉపాధ్యక్షులు బర్మా ప్రభాకర్, కోశాధికారి టివి భవాని, జోనల్ కార్యదర్శి ఎండి ప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వంశీపై అక్రమ కేసులు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 15: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆయన తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి ఆరోపించారు. రామవరప్పాడు వద్ద ఇళ్ల తొలగింపు వ్యవహారంలో రాస్తారోకో సందర్భంగా ఎమ్మెల్యే వంశీతో పాటు మరో 200 మందిపై పటమట పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ అధికారుల విధులకు అడ్డుతగిలిన ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఇటు అధికార పార్టీలో ప్రభుత్వపరంగానూ వివాదంగా మారుతోంది. అయితే ఈ కేసులో పటమట పోలీస్టేషన్‌లో వంశీ లొంగిపోతారనే ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో ఆయన వ్యక్తిగత న్యాయవాది చిరంజీవి సోమవారం పటమట పోలీస్టేషన్‌కు వచ్చి కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ కాపీలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే పలుమార్లు ఆయన్ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించకపోవడం సరికాదన్నారు. పైగా ఎమ్మెల్యే పేదల పక్షాన నిలబడితే దాన్ని తప్పుగా చూపుతూ పోలీసులతో అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. వెంటనే ఈ వ్యవహారంలో కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. అదేవిధంగా కలెక్టర్ వైఖరిపై హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు చిరంజీవి వివరించారు.
ఎమ్మెల్యే వంశీ వ్యవహారంపై సిఎం సమీక్ష
విజయవాడ : శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌పై కేసు నమోదు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయాలు చూపకుండా ఆక్రమణలను తొలగించవద్దని అధికారులను ఆదేశించారు. వంశీ వివాదంపై స్పందిస్తూ కలెక్టర్ బాబు.ఎ, ఎంపి కేశినేని నాని, వంశీ ముగ్గురూ ఒకచోట కూర్చుని చర్చించుకుని వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: నవ్యాంధ్రప్రదేశ్‌లో 2019 జాతీయ క్రీడలు నిర్వహించేందుకు జాతీయ ఒలంపిక్స్ అసోసియేషన్ అంగీకరించిన విషయం విదితమే. ఈ క్రీడోత్సవ నిర్వహణ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపడంతో ఆటు నిర్వహణ ఏర్పాట్లపై చర్చించడానికి కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్‌తో శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ సోమవారం సమావేశం కావడం జరిగింది. క్రీడల నిర్వహణకు అ వసరమైన సహాయ సహకారాలు అందించడంతోపాటు కార్యక్రమం విజయవంతానికి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రి సోనోవాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఏపిలో 2019లో జాతీయ క్రీడలను విజయవంతం చేస్తామని తెలిపారు.
అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి
రూ. 379 కోట్లు కేటాయింపు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 15: నవ్యాంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 379 కోట్ల రూపాయల నిధులను అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయించారని ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్ తెలిపారు. స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రానున్న కాలంలో మసీదులు, షాదీఖానాల నిర్మాణానికి, సమాధి స్థలాల్ని మెరుగుపరచడానికి తగిన నిధులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఎపి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.125కోట్లు మంజూరు చేశారన్నారు. ఉర్దూ అకాడమీలో సిబ్బందికి జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందనే సమస్యను సిఎం దృష్టికి తెచ్చామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించి ఉర్దూ అకాడమీని ఆర్థికంగా పరిపుష్టం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
త్వరలో 4శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో వాదనలకు రానుందని, కనుక అనుభవజ్ఞులైన, న్యాయనిపుణులైన న్యాయవాదులను నియమించాలని ముఖ్యమంత్రిని కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని షరీఫ్ తెలిపారు. హజ్ కమిటీ భవనాలను కడప, హైదరాబాద్‌లో కట్టడానికి సిఎం సుముఖత వ్యక్తం చేశారని షరీఫ్ తెలిపారు. ఈ నెల 11న రాష్ట్ర ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో మైనార్టీ పెద్దలు హైదరాబాద్‌లో సమావేశమై వివిధ సమస్యలపై చర్చించినట్లు షరీఫ్ వివరించారు.
మద్యం విక్రయాల పెంపుపై ఆబ్కారీ శాఖ దృష్టి
విశాఖపట్నం, పిబ్రవరి 15: రాష్ట్రంలో మద్యం విక్రయాలను పెంచే దిశగా ఆబ్కారీ శాఖ కసరస్తు చేస్తున్నది. మద్యం విక్రయాల వివరాలను కంప్యూటరీకరించడంతో పాటు నాటు సారా తయారీ నిరోధంపై దృష్టి సారించింది. మద్యం విక్రయాల్లో హెచ్చుతగ్గులపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా నిశితంగా పరిశీలించారు. సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ కమిషనర్ మీనా సోమవారం ఇక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి తదితర జిల్లాల నుంచి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ శ్రీకాకుళం అధికారులు సాఫ్ట్‌వేర్‌లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. చిన్న సవరణలను కూడా చేయలేకపోతున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన దుకాణాల వివరాలు తమ జిల్లాలో నమోదు అవుతున్నాయని తెలిపారు. పలాస పరిధిలో బైండోవర్ కేసుల గురించి మీనా స్పందిస్తూ అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు నవోదయం కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లాకు సంబంధించి మద్యం విక్రయాల వివరాలు గురించి ఒక అధికారిని కమిషనర్‌ను ప్రశ్నించారు. పార్వతీపురం, కురుపాంలో జనవరి నెలలో మద్యం విక్రయాల్లో వృద్ధి తిరోగమనంలో ఉండటంపై కమిషనర్ ప్రశ్నించారు. పార్వతీపురంలో సారా తయారీ ఎక్కువగా ఉందని, ఒడిశా సరిహద్దులో ఉండటం వల్ల దీని ప్రభావం ఆ రెండు ప్రాంతాల్లో ఉందని ఆ అధికారి వివరించారు. విక్రయాలు తగ్గడంపై సరైన సమాధానం చెప్పకపోవడాన్ని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి సిబ్బందితో వివరాలను విశే్లషించకుండా రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాలను తెలుసుకోకుండా సమావేశానికి వస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. గత సమావేశంలో చెప్పినా, పనితీరులో మార్పులేకపోవడాన్ని తప్పుపట్టారు. షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే జిల్లాకు చెందిన మరో అధికారి కూడా మద్యం విక్రయాలు ఏవిధంగా జరుగుతున్నాయన్న వివరాలను సరిగా చెప్పకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. విక్రయాల వివరాలు తెలియచేయాలని వీడియో కాన్ఫరెన్సులో చెప్పినట్టు గుర్తు చేశారు. తనకు ఫోన్ చేసి వివరాలు తెలియచేయాలని చెప్పినా, ఫోన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు వివరించానని, సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. విశాఖ 1, 2, నర్సీపట్నం సర్కిళ్ల పరిధిలో మద్యం విక్రయాల్లో వృద్ధి లేకపోవడాన్ని అధికారులను ప్రశ్నించారు. నాటు సారాతయారీదారులపై కఠినంగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, అమలాపురంలో కూడా అమ్మకాల శాతం తగ్గడంపై వివరణ కోరారు. సారా తయారీ నిరోధానికి చర్యలు చేపట్టి, మద్యం విక్రయాలపై దృష్టి సారించాలని అధికారులకు పిలుపునిచ్చారు. కింది స్థాయి ఉద్యోగులకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలని, సమష్టిగా లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.
ఈ ఏడాది ఆశాజనకంగా మామిడి దిగుబడి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఈ ఏడాది మామిడి దిగుబడి ఆశాజనంగా ఉండనుంది. దీంతో మామిడి పండ్ల ప్రియులకు ఈ ఏడాది ధరలు అందుబాటులో ఉండనున్నాయి. దిగుబడులు తగ్గడంతో గత రెండు సంవత్సరాలుగా మామిడి పండ్ల ధరలు ఎక్కువగా ఉండటం తెలిసిందే. హుదూద్ తుపాను ప్రభావం మామిడి దిగుబడులపై ప్రభావం చూపినా, రైతులు తీసుకున్న సస్యరక్షణ చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. మార్చి నెలాఖరు నాటికి మామిడి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని ఇక్కడి ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో దాదాపు 15 హెక్టార్లలో మామిడి పంటను సాగు చేస్తున్నారు. సువర్ణరేఖ, తోతాపురి, బంగినపల్లి, చెరకు రసం, పంచదార కలాస, పనుకులు రకాలను ప్రధానంగా సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖ తీసుకుంటున్న చర్యల కారణంగా ఏటా సాగు వీస్తీర్ణం పెరుగుతున్నది. తుపాను ప్రభావం వల్ల మామిడి చెట్లు నేలకొరిగినా, మిగిలిన చెట్లను సంరక్షించడం వల్ల దిగుబడి పెరిగేందుకు దోహదపడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం మామిడి పూత దశలో ఉందని ఆయన తెలిపారు. దాదాపు 40 శాతం వరకూ పిందె దశకు చేరుకుంది. ఈ దశలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం, నీటి తడులు పెట్టడం వల్ల కాయ సైజు పెరగడమే కాకుండా తెగుళ్ల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. పురుగు మందులను పిచికారి చేసే సమయంలో వేపనూనే చేర్చి చల్లాలని సూచించారు. ఈ దశలో వేపనూనె కలిపి పిచికారీ చేయడం వల్ల కాయ, టెంక తొలిచే పురుగులను గుడ్ల దశలోనే నివారించవచ్చని తెలిపారు. గత ఏడాది కురిసిన వర్షాలు, ఈ ఏడాది వాతావరణం అనుకూలించం వల్ల దిగుబడులు బాగానే ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంచు సమస్య ఈ ఏడాది లేదని, దీని వల్ల ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరుకు కొన్ని రకాల మామిడి పండ్లు అందుబాటాలోకి వస్తాయని తెలిపారు. ఏప్రిల్‌లో సువర్ణరేఖ, మేలో బంగినపల్లి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
టిడిపి ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలుగుదేశం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు తెలిపారు. సోమవారం ఉదయం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను రాహుల్ గాంధీ సమీక్షించారని తెలిపారు. విశాఖ అర్బన్, రూరల్ జిల్లాకు సంబంధించి సమీక్ష చేశారని తెలిపారు. ఈ సమీక్షకు జిల్లా నాయకులు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న వివిధ పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. పార్టీ మనుగడ, స్థితి గతులపై అడిగారని తెలిపారు. ప్రజాహిత కార్యక్రమాలతో పాటు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సూచించారని తెలిపారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల్లో విజయానికి ఆయన సలహాలను అందచేశారని తెలిపారు. రానున్న రోజుల్లో నగర పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంగళరావు, గరికిన గౌరి, భారతి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పకొట్టండి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: అధికారంలో ఉన్న తెలుగుదేశం, బిజెపీలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంధ్రనాథ్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై చేస్తున్న దాడులను నిరసిస్తూ కార్మిక సదస్సును ఇక్కడి పౌర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించి, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను అణచివేతకు వ్యతిరేకించేందుకు ఐక్య ఉద్యమాలను నిర్వహించాలని కోరారు. బాబు వస్తే జాబు అని ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక, కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, ముఠా కళాసీలు, భవన నిర్మాణ కార్మికుల జీవన భద్రతకు విఘాతం కల్గించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల హామీలను నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చిలో నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎఐటియుసి జిల్లా ఉపప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 28 వరకూ తమిళనాడు కొయంబత్తూరులో తమ యూనియన్ జాతీయ మహాసభులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెడ్డు వెంకటేశ్వరరావు, పడాల గోవింద్, లక్ష్మణ్, కోట సత్తిబాబు, పిల్లి వీర్రాజు, సోంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసికి స్వచ్ఛ సిటీ అవార్డు
* జాతీయ స్థాయిలో ఐదో స్థానం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సీటీల ఎంపిక కోసం నిర్వహించిన సర్వేలో మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఐదో స్థానం దక్కించుకుంది. దేశంలో అన్ని ప్రధాన పట్టణాల్లో స్వచ్ఛతపై స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించింది. దాదాపు 100 పట్టణాల్లో నిర్వహించిన సర్వేలో కర్నాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పట్టణానికి ప్రధమ స్థానం దక్కింది. వరుసగా చండీఘడ్, తిరుచ్చి, న్యూఢిల్లీ పట్టణాలు తరువాత స్థానాలను దక్కించుకున్నాయి. గతేడాది స్వచ్ఛ సర్వేలో 235 స్థానంలో నిలిచిన విశాఖ వందల స్థానాలను ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోవడం గమనార్హం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఇటీవల కాలంలో విశాఖలో చేపట్టిన పలు కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీగా కేంద్రం ఎంపిక చేసిన విశాఖలో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
18న కేంద్ర హోం మంత్రి రాక
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 18న విశాఖ రానున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గం గుండా వసతిగృహానికి చేరుకుంటారు. అదే రోజు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్, డిజిపి జెవి రాముడు, ఇతర ప్రభుత్వాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాత్రికి విశాఖలో బసచేసి మరుసటి రోజు ఉదయం హెలికాప్టర్‌లో బయలుదేరి ఒడిశా రాష్ట్రం కోరాపుట్ చేరుకుంటారు.
మే నాటికి నూతన భవనం పూర్తి చేయాలి
- లా వర్శిటీ ఇన్‌ఛార్జి విసి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం నూతన భవనాన్ని మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇ.ఎ.నారాయణ అన్నారు. సోమవారం ఆయన వర్శిటీలో నూతన భవన నిర్మాణం పనుల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభాని కంటే ముందర భవన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. ఈ పనులను చేపడుతున్న సిపిడబ్ల్యుడి విభాగం వారు జూన్ నాటికి భవనాన్ని అప్పగిస్తామని తెలుపగా, మే నాటికి పూర్తి చేయాలని నారాయణ ఆదేశించారు. ఈ సందర్భంగా ఏయే పనులు ఏ మేరకు పూర్తయ్యాయో అడిగి తెలుసుకున్నారు. బాల, బాలికలకు సంబంధించి వసతి గృహం పనులు పూర్తయ్యాయన్నారు. అకడమిక్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. సిపిడబ్ల్యుడి, శిల్పాకృతి సంస్థ పనులు చేపడుతుందన్నారు. ఇదిలా ఉండగా వర్శిటీ ప్రాంగణంలో దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. అకడమిక్ బ్లాక్‌కు 10కెవి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నూతన భవన నిర్మాణ కమిటీ సభ్యులు, ఇంజనీర్లు పలు సూచనలు చేశారు.
ఓర్పుతోనే సంగీత సాధన
- పద్మశ్రీ కన్యాకుమారి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఎంతో ఓర్పుతోనే సంగీత సాధన సాధ్యమవుతుందని పద్మశ్రీ అవసరాల కన్యాకుమారి అన్నారు. సోమవారం సాయంత్రం ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు సంగీతం అంటే చెవులు కొరుక్కునే వారని, నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. విదేశాల్లో వాద్యకారులకు ఆదరణ పెరుగుతుండగా, ఇక్కడ తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కళాకారులు, సంగీతకారులను సత్కరించే సంస్కృతి ఎయులో అనాదిగా వస్తుందన్నారు. ఎయు సంగీత విభాగానికి కన్యాకుమారి తమ విలువైన నైపుణ్యాన్ని, సేవలు అందించాలని కోరారు. రంగస్థలాన్ని ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సంగీత, నృత్య, రంగస్థల విభాగాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. శాంతిని చేకూర్చడానికి సంగీతం ఎంతగానో దోహదపడుతుందని మాజీ రెక్టార్ ప్రసన్నకుమార్ అన్నారు. సంగీత, సాహిత్యకారులను అనాదిగా ఆదరించి, సత్కరించే సంస్కృతి ఎయులో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత విభాగాధిపతి అనురాధ, మండపాక శారద, సంగీత విభాగ విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.
స్మార్ట్‌సిటీలో ఎయు భాగస్వామి
- ఇన్‌ఛార్జి విసి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: విశాఖను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం భాగస్వామిగా ఉంటుందని ఇన్‌ఛార్జి విసి ఇఎ నారాయణ అన్నారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో పిట్స్‌బర్గ్ వర్శిటీ ప్రొఫెసర్ ఆల్బర్ట్ ప్రెస్టోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని పర్యావరణ శాస్త్రం, సివిల్ ఇంజనీరింగ్, ఆర్చిటెక్చర్ వంటి విభాగాల భాగస్వామ్యంతో అవసరమైన సహకారం అందించాలన్నారు. పట్టణీకరణ విధానాలు, నిర్వహణను విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధిస్తున్నామన్నారు. విభిన్న శాస్త్రాలలో ఎయు ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణానికి అవసరమైన అన్ని మానవ వనరులు వర్శిటీలో ఉన్నాయన్నారు. నిర్థిష్ట ప్రణాళికతో రావడం ద్వారా సంయుక్తంగా పనిచేయాలన్నారు. వర్శిటీ ప్రగతి, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, విభాగాలు, విద్యార్థుల సంఖ్య తదితర వాటి గురించి వివరించారు. ఈ సందర్భంగా ముందుగా ఎయు పర్యావరణ శాస్త్ర విభాగ ఆచార్యులతో ప్రొఫెసర్ ఆల్బర్ట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ భౌగోళిక స్వరూపం, పర్యావరణం, కాలుష్యం, ప్రజల జీవనశైవి వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఎయుతో సంయుక్తంగా పనిచేసి విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో యుఎస్‌డిపి సమన్వయకర్త ఎన్ శ్రీనివాసరాజమణి, ప్రొఫెసర్ ప్రసాదరావు, విభాగాధిపతి ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, ఉదయ్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇఇ కోర్సుకు ఉపాధి అవకాశాలు మెండు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: నేడు రిఫైనరీ రంగంలో వస్తున్న మార్పుల కారణంగా రానున్న కాలంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సుకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గీతం ప్రిన్సిపల్ కె.లక్ష్మిప్రసాద్ అన్నారు. సోమవారం గీతంలో ఇంజనీరింగ్ విద్యార్థుల జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాన్ని ‘ఇంటర్ ఫేస్-2016‘ పేరిట నిర్వహించిన ముగింపు సదస్సుకు ఆయన విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక విస్తరణతోపాటు రిఫైనరీ రంగంలో నూతన సంస్థలు అనేకం ప్రవేశిస్తున్నాయన్నారు. అందువల్ల రానున్న కాలంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని వివరించారు. ఇదిలా ఉండగా గీతంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగం పరిశ్రమలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంపై అవసరమైన శిక్షణను అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతున్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్ చంద్రకాంత్ పాండే మాట్లాడుతూ ప్రొపెసింగ్ పరిశ్రమల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుల అవసరం ఎక్కువగా ఉందన్నారు. అందువల్లనే రిఫైనరీ రంగంలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉందన్నారు. ఇదిలా ఉండగా పరిశ్రమల్లో భద్రతకు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీర్లు ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. దేశంలో డిసిఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న ఏకైన పరిశ్రమ హెచ్‌పిసిఎల్ ఒక్కటేనని అన్నారు. ఐఐమింట్ వ్యవస్థాకుడు విన్నీ పాత్రో మాట్లాడుతూ యువత పారిశ్రామిక వేత్తలుగా మారడానికి అనుకూలమైన వాతావరణం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ విలేజీ వంటి వాటితో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందన్నారు. కాగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ సేవలు అందించే విధంగా యువత ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.ఎలిజబెత్ రాణి, విద్యార్థి వ్యవహారాల కోర్డినేటర్ యుగంధర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాబ్ వ్యూ టెక్నాలజీపై వర్కుషాప్, సినిమాటోగ్రఫీ, గేమింగ్, ట్రెజర్ హంట్, టెక్నికల్ క్విజ్, పోస్టర్ మేకింగ్, లాజికల్ థింకింగ్, ఇంజనీర్స్ ఐ వంటి అంశాలలో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు వ్యవసాయ కమిషన్ ప్రజాభిప్రాయసేకరణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో సమ్మిళిత, సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించనుంది. అందులో భాగంగా మంగళవారం జిల్లాలో పర్యటించనుంది. ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలోని జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన రైతులు, మత్స్యకారులు, పాడిపరిశ్రమ, పశుగణాభివృద్ధి రంగాలకు సంబంధించి ఆయా రంగాల్లో అభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలు, చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించనుంది. అలాగే వ్యవసాయ, ఉద్యాన రంగంలో అధిక దిగుబడులు, ప్రొసెసింగ్, రవాణా, మార్కెటింగ్ తదితర అంశాలపై సలహాలు స్వీకరించనుందని ఇన్‌ఛార్జి కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. ఈ కమిషన్‌కు టాస్క్ఫోర్సు కమిటీ అధ్యక్షుడు ఎస్.గలాబ్, రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి.విజయ్‌కుమార్ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొంటారని ఇన్‌ఛార్జి కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అధిక ఉత్పత్తులు, రైతుల ఆదాయ మార్గాలు పెంచడమే లక్ష్యంగా కమిషన్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలతో కూడిన నివేదికను అందజేయనుంది.
తీరప్రాంతంపై పర్యావరణ ప్రభావం
- ప్రిన్సిపల్ సివి రామన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: తీర ప్రాంతంలో పర్యావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉందని ఎయు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి రామన్ అన్నారు. సోమవారం ఎయు మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ విభాగంలో ‘ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మెరైన్ ఏరియా మేనేజ్‌మెంట్ (ఐసిఎంఎఎం), ఎంఒఇఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి విపత్తులు, సముద్ర సహజ వనరులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విభాగాధిపతి కెవిఎస్‌ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకులతోపాటు ప్రత్యక్షంగా కార్యక్షేత్రంలో పనిచేసే వారికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. రిమోట్ సెన్సింగ్, జిఐఎస్, జిపిఎస్ వంటి అంశాలపై ప్రత్యక్షంగా శిక్షణ అందించనున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని గంగవరం పోర్ట్ సహకారంతో చేపడుతున్నట్టు తెలిపారు. ఐసిఎంఎఎం, ఎన్‌ఐఒ నిపుణులు పాల్గొన్నారు.
డబుల్ డెక్కర్ రోడ్డెక్కేదెపుడు?
* పర్యాటక ప్రాజెక్టులకు కదలిక
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేసి ఆ రంగం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తొంది. అందులో భాగంగా విశాఖ నగరం, జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేశారు. మొత్తం 41 ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయని ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. అందులో భాగంగానే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు డబుల్ డెక్కర్ బస్సుకు ప్రతిపాదనలు చేశారు. ఒక్కొ బస్సును సుమారు కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఈ ఏడాది జనవరిలో రోడ్డెక్కుతాయని భావించినప్పటికీ నేటి వరకు కదలిక కన్పించలేదు. అంతర్జాతీయ యుద్ధ నౌక సమీక్ష సందర్భంగా దానికి ముందరే వీటిని ప్రారంభించాలని భావించారు. అందుకు అనుగుణంగానే రహదారులకు మరమ్మతులు చేపట్టారు. అయితే రహదారుల మరమ్మతులు పూర్తయి నెలలు గడుస్తున్నా నేటి వరకు డబుల్ డెక్కర్ బస్సులు మాత్రం కానరాలేదు. వేసవి ప్రారంభానికి ముందర వీటిని ప్రారంభిస్తే అటు విద్యార్థులకు ఆహ్లాదంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మరోపక్క ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను సేకరించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా చారిత్రాత్మక కట్టడాలతోపాటు పురాతన ఆలయాలు, తీరప్రాంతాల అభివృద్ధికి గల అవకాశాలను గుర్తించారు. ఏ రకమైన ప్రాజెక్టులకు ఏయే ప్రాంతాల్లో నెలకోల్పాలి, ఎక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయో పరిశీలించారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. వాటిలో ఉత్తరాంధ్రలోని పర్యాటకులను ఆకర్షించేందుకు అనువైన ప్రాంతాలుగా శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం, బారువలోని కోటి లింగాల ఆలయం, బారువ బీచ్, విజయనగరం జిల్లాలో రామతీర్థ క్షేత్రం, బొబ్బిలిలోని పురాతన ఆలయం, విశాఖ జిల్లాలో లంబసింగి, కోనాం రిజర్వాయర్, రుషికొండ ప్రాంతాలతోపాటు , తొట్లకొండ, బావికొండ బౌద్ద స్థూపాలు ఉన్నాయి. ఇవి విదేశీ పర్యాటకులతోపాటు సందర్శకులను ఆకర్షించగలవని భావిస్తున్నారు. వీటి అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు ప్రాంతీయ పర్యాటక అధికారి డాక్టర్ ఎ.సిరి చెప్పారు. వీటితోపాటు బీచ్ ఫ్రంట్ రిక్రియేషనల్ కింద బీమునిపట్నం, రేవుపోలవరం బీచ్, రుషికొండ, ఎండాడ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. బీచ్ వాటర్ స్పోర్ట్స్‌లో భాగంగా భీమునిపట్నం, రేవుపోలవరం, రుషికొండ, ఎండాడ ప్రాంతాలను అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు. ఎకో టూరిజం కింద లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్నారు. అక్కడ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. అలాగే జంగిల్ రిసార్ట్స్ కింద లంబసింగి, బొర్రా గుహలు తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. మధురవాడ, కైలాసగిరి ప్రాంతాల్లో ఎమ్యూజ్‌మెంట్ పార్కును ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. అయితే ఇవన్ని కాగితాలకే పరిమితమైపోయాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.
బిజెపి దాడికి నిరసనగా సిపిఎం ప్రదర్శన
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: సిపిఎం కేంద్ర కార్యాలయంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దుండగుల దాడిని ఖండిస్తూ సోమవారం మద్దిలపాలెంలో జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టింది. సిపిఎం కేంద్ర కార్యాలయంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ దుండగుల దాడి చేయడాన్ని సిపిఎం మద్దిపాలెం జోన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి దాడులు పునారవృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శివర్గసభ్యులు ఆర్‌కెయస్‌వి కుమార్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత కమ్యూనిస్టులు, దళితులు, మైనారిటీలపై ఫాసిస్ట్ దాడులు చేయిస్తోందన్నారు. బలప్రయోగం ద్వారా నినదించే గొంతులను అణిచివేయాలని చూస్తోందన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి ఫాసిస్ట్ శక్తులకు స్థానం లేదన్నారు. ఎబివిపి నాయకులే జెఎన్‌యులో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియో సోషల్ నెట్‌వర్క్‌లో ఉందన్నారు. దానిపై రాజ్‌నాధ్సింగ్ సమాధానం చెప్పాలన్నారు. అక్రమంగా దేశద్రోహం కింద అరెస్ట్ చేసిన జెఎన్‌యు విద్యార్ధి నాయకులను తక్షణం విడుదల చేయాలన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో సిపిఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.మణి, జోన్ నాయకులు పి.అప్పారావు, అనపర్తి అప్పారావు, కె.కుమారి, సింహాచలం, జె.నాయుడు, సురేష్, రమణ, నూకరాజు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఏబివిపి ఆధ్వర్యంలో దేశద్రోహుల దిష్టిబొమ్మ దహనం
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఎంతో సైనికులు ప్రాణం త్యాగం చేసి దేశ రక్షణ కోసం పాటుపడుతుంటే ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెదంటుపై దాడి చేసిన అప్జల్‌గురుకు మరణశిక్షపై సాంస్కృతిక,సంస్మరణ సభలు నిర్వహించిన దేశద్రోహుల దిష్టిబొమ్మను అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఏబివిపి) ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. జాతీయకార్యవర్గసభ్యులు మణికంఠ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో సంస్కారం నేర్పాల్సాన వారు విద్యార్ధుల్లో దేశ విభజనకు సంబందించి దేశ నైతికతను దెబ్బతీసే విధంగా విషభీజాలు నాటుతున్నారన్నారు. ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, భరతమాతను అవమానిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. దేశభక్తి కోసం విద్యార్ధి పరిషత్ ఎంతటి పోరాటానికైనా దిగుతుందన్నారు. నగర సంయుక్త కార్యదర్శి హవినాష్ మాట్లాడుతూ నెహ్రు విశ్వవిద్యాలయంలో అప్జల్‌కి మద్దతు పలికిన విద్యార్ధి సంఘాలను ఉపేక్షించరాదన్నారు. వారి వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్నారు. వారిపై విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం సమగ్రతల విషయంలో విద్యార్ధులు, ప్రజలు అంతా ఒకేతాటిపైకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంఘటనా కార్యదర్శి టియన్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లావణ్య, నరేంద్ర మహేష్, తారక్, గణేష్, సాయి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్‌సిటీలో రోడ్లు అద్వాన్నం
* నీటి కోసం నరకయాతన
* జివివిఎంసి జోన్-1 కమిషనర్‌కు స్థానికుల వినతి
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: నగర శివారు జివిఎంసి నాల్గవ వార్డు పరిధిలోకి వచ్చే బక్కన్నపాలెం, ఎన్టీఆర్ కాలనీ, ఎస్టీకాలనీ, బిసి కాలనీల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. సరఫరా అవుతోన్న అవుతోన్న నీటిలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉంటుందంటూ ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తంచేశారు. గత కొనే్నళ్ళుగా తాగునీరు, రోడ్ల సదుపాయం లేక నానా అవస్థలు పడుతున్నామంటూ కాలనీల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు రాయిన సాయికుమార్,వాసు, శ్రీనివాస్, రామకృష్ణలు సోమవారం జోన్-1 కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇవి తీరని పక్షంలో త్వరలో ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ పేరుతో 2003లో కాలనీ ఏర్పడిందని, 2007లో జివిఎంసిలో బక్కన్నపాలెం గ్రామపంచాయితీ విలీనం అయ్యిందని అయినా ఇప్పటికీ సరైన రోడ్లు లేక పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయన వీధి దీపాలు కారణంగా చీకట్టు అలుముకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంటి కుళాయిలు పూర్తిగా మంజూరు చేయకుండానే వీధి కుళాయిలను తొలగించడంతో నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారని, గొట్టపుబావుల నీటి సదుపాయం లేకపోగా, ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా సరఫరా అయ్యే కొళాయి నీటి కాస్త చెత్తచెదారంతో ఉంటుందన్నారు. దీనివల్ల స్థానికులకు కీళ్ళనొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారన్నారు. అలాగే గత నాలుగు మాసాలుగా సిటీ సర్వీసు సరిగా తిరగడంలేదని, ఏ సమయంలో వస్తుందో తెలియడంలేదని, పాత సమయాలనే పునరుద్ధరించి నడపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీటిని పరిష్కరించని పక్షంలో త్వరలో ఆందోళనకు దిగుతామన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
* ఎంప్లారుూస్ యూనియన్
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయక తప్పదని, ఇందుకు సత్తా కలిగిన యూనియన్ ఎంప్లారుూస్ యూనియన్ మాత్రమేనని యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి పిపిఎం రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ రూరల్ డిపోలో సోమవారం నిర్వహించిన సభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వేతన సవరణ సమయంలో 24 మాసాల ఏరియర్స్ బాండ్లు రూపంలో ఇవ్వాడానికి ఎన్‌ఎంయు రాష్ట్ర కమిటీ అంగీకరిస్తూ ఎగ్రిమెంట్‌పై సంతకాలు చేసి, ఇపుడు కార్మికుల్లో తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే బాండ్ల రూపంలో ఉన్న సొమ్మును చెల్లించడానికి లేదా దీనిపై తొమ్మిది శాతం వడ్డీ చెల్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్‌ఎంయు నాయకుల అవినీతి భాగోతం విశాఖ జిల్లా కార్మికులకు తెలియందికాదన్నారు. స్థలాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసింది ఎన్‌ఎంయు నాయకులుగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో జోనల్ సహాయ కార్యదర్శి టిఎన్ మూర్తి, రీజనల్ ప్రెసిడెంట్ కెఎస్ రావు, డిపో నాయకులు డి.బంగార్రాజు, రమణ, భాస్కర్ పాల్గొన్నారు.
మత్స్యకారుల భారీ ప్రదర్శన
* కలెక్టరేట్ వద్ద నిరసనల హోరు
* భారీగా పోలీసుల మోహరింపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ఫిషింగ్ హార్బర్ వద్ద నున్న జెట్టీనీ పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన మత్స్యకారులు, సంఘాల ప్రతినిధులు, మత్స్యకార మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఇక్కడ నుంచి కోస్టల్ బేటరీ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలా గురువులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పర్యాటకంగా దీనిని అభివృద్ధి చేయాలనుకోవడం మత్స్యకారులకు ఉపాధిని కోల్పోయినట్టు చేయడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ఇటువంటి ప్రయత్నాలను మానుకోవాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమించాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోలా గురువులు మాట్లాడుతూ కోట్లాది రూపాయల మేర పన్నులు వసూలు చేసే ప్రభుత్వం గత కొనే్నళ్ళుగా నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా, మత్స్యకారుల న్యాయమైన కోర్కేల పరిష్కారానికి చొరవ చూపకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారులు శాశ్వతంగా ఉపాధి కోల్పోతారన్నారు. అసలే ఇక్కడి స్థలం ఇరుక్కా ఉందని, మత్స్యకార మహిళలకు ఎండి చేపలు వేసుకునేందుకు ఇబ్బందులున్నాయన్నారు. ఇటీవల జరిగిన ఐఎఫ్‌ఆర్ సందర్భంగా దీనిని విదేశీ నౌకలు, అధికారుల కోసం ఓ కేంద్రంగా ఏర్పాటు చేసారన్నారు. అటువంటిది ఏకంగా పర్యాటకంగా అభివృద్ధి చేయాలనుకోవడం మత్స్యకారులకు తీరని అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు.
* భారీగా పోలీసుల మోహరింపు
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించిన మత్స్యకారులు పెద్దఎత్తున కలెక్టరేట్‌కు తరలిరావడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు వైపుల పోలీసు బలగాలు మోహరించాయి. ప్రశాంత వాతావరణంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధపడటంతో మధ్యాహ్నం వరకు బందోబస్త్ నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మత్స్యకారుల ఆందోళనలతో ఈ మార్గంలో నడిచే సిటీ సర్వీసులు, వాహనాలను దారి మళ్ళించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
గుదిబండ!
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 15: పట్టణంలో ఆస్తిపన్ను వసూలు నత్తనడకగా సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగిం పు గడువు మరో 45రోజులు మాత్రమే ఉండగా, పన్నుల వసూలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇంతవరకు 32.28 శాతం మాత్రమే పన్ను వసూలు చేశారు. మిగతా మున్సిపాలిటీలతో పోల్చితే విజయనగరం మున్సిపాలిటీలో చాలా తక్కువ శాతంలో పన్ను వసూలు జరిగింది. ముఖ్యం గా మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులు నిర్లక్ష్యం వల్ల పన్నుల వసూలులో ప్రగతి కనిపించడంలేదు. ఏడాది చివరి వరకు దృష్టి సారించకపోవడం వల్ల పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పన్నుల వసూలు మందకొడిగా జరుగుతుండటంతో పట్టణంలో అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. మున్సిపాలిటీలో 2465.57 లక్షల రూపాయల పన్నులను వసూలు చేయవలసి ఉండగా, ఇంతవరకు 795.84 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేశారు. ఇంకా 1669.73 లక్షల రూపాయలు వసూలు చేయవలసి ఉంది. అయితే పన్నుల వసూలు మున్సిపాలిటీకి గుదిబండగా మారింది. ముఖ్యంగా మున్సిపల్ రెవెన్యూ విభాగం బిల్లుకలెక్టర్లు నిర్లక్ష్యవైఖరి వల్ల పన్నుల బకాయిలు పేరుకుపోతున్నాయి. పది నెలల నుంచి కేవలం ఏనిమిది కోట్ల రూపాయల మేరకు పన్ను వసూలు చేయడం బిల్లుకలెక్టర్ల అశ్రద్ధకు నిదర్శనంగా కనిపిస్తోంది. పట్టణంలో 49,411 అసెస్‌మెంట్లు ఉన్నారు. వీరిందరికీ డిమాండ్ నోటీసులను జారీ చేసి ఆస్తిపన్ను వసూలు చేయవలసి బిల్లు కలెక్టర్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతీ రోజూ 36.30 లక్షల రూపాయ పన్ను వసూలు చేయవలసి ఉంగా నాలుగైదు లక్షల రూపాయలకు మించి వసూ లు చేయడం లేదు. వారానికి 210.34 లక్షల రూపాయల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్థేశించగా, తొమ్మిది లక్షల రూపాయల మించి వసూలు కావడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ రెవెన్యూ విభా గం అధికారులు, ఉద్యోగులు మొద్దు నిద్ర నుంచి బయటపడితే ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు పన్నులు వసూలు చేసే అవకాశం ఉంది.
పన్నుల వసూలుకు 18 ప్రత్యేక బృందాలు
పట్టణంలో ఆస్తిపన్ను వసూలుకు 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని మున్సిపల్ రెవెన్యూ అధికారి డేవిడ్ తెలిపారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్లుకలెక్టర్ల కు ప్రతీరోజూ పన్ను వసూళ్ల లక్ష్యాలను నిర్థేశించామని చెప్పా రు. మార్చినెలాఖరు నాటికీ వందశాతం పన్ను వసూలు చేస్తామని అన్నారు.
మొదలైన తాగునీటి సమస్య
* శిథిలమైన పైపులు * అడుగంటుతున్న భూగర్భ జలాలు
* గజపతినగరంలో సరఫరాకు అంతరాయం
గజపతినగరం, ఫిబ్రవరి 15: గజపతినగరం మండలకేంద్రంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగడంలేదు. 10వేలు జనాభాగల గ్రామ పంచాయతీలో వీధుల్లోని పురాతన పైపులైను పునరుద్ధరణ చేపట్టక పోవడంతో ఎక్కడ పడితే అక్కడ లీకులు ఏర్పడి తాగునీరు కాలువల్లోకి పోయి నీరు కలుషితం అవుతున్నది. జాతీయ రహదారికి సమీపంలో కొత్త నీళ్ల ట్యాంకు నిర్మాణం జరిగిన నాలుగున్నర దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన సిమెంటు గొట్టాల ద్వారా సరఫరా జరుగుతున్నది. పైపులైనులో అమర్చిన గొట్టాలు శిథిలమై పోయాయి. పైపులైన్లు పునరుద్ధ రణ పనులకు 10 ఏళ్ళ కిందటే నిధులు మంజూరు అయినా పనులు ప్రారంభించక పోవడంతో నిధులు మురిగిపోయాయి. విజయనగరం జిల్లా ఏర్పాటుకాక ముందు 1970లో ఇక్కడ ఎల్‌ఐసి రుణసదుపాయంతో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసారు. నీరు సరఫరా కోసం చంపావతి నదిలో నిర్మించిన బావిచుట్టు గల చప్టా శిథిలమై పోతున్నది. వర్షాకాలం ఏ మాత్రం వర్షం కురిసిన నదిలో ప్రవహించే నీరు బావిలోకి చేరుతున్నది. వరదనీరు చేరడంతో నీరు ఎర్రగా మారుతున్నది. అబ్బులు రేవులో గల నీళ్ల ట్యాంకు శిథిలమై పోయింది. వీధుల్లో కుళాయిలు అవసరమైన మేరకు ఏర్పాటు చేసిన కుళాయి నిబందనలకు విరుద్ధంగా మంజూరు చేయడం, పైపులైన్లకు మోటార్లు అమర్చడం వలన సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. అక్రమ కుళాయి కనెక్షన్లు, మోటార్లను తొలగించవలసిన అవసరం ఉంది. నవంబర్‌నుండి వర్షాలు కురవనందున భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయింది. బావిలో నీరు అవసరమైన మేరకు లభ్యంకాకపోవడం ట్యాంకు నిండుగా నింపలేక పోతున్నారు. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాల సామెత చందంగా ఇక్కడ తాగునీరు సరఫరాకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయి. నదిలో గల బావిలోని పూడికను తీయించి పైపులైన్లకు ఏర్పడిన రంద్రాలు మరమ్మతులు జరిపి మోటారును తొలగిస్తే వీధి కుళాయిల ద్వారా పుష్కలంగా నీరు సరఫరా జరుగుతుందని అంటున్నారు. వేసవి రాకముందే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
సమాన పనికి
సమాన వేతనం ఇవ్వాలి
* కాంట్రాక్టు ఎఎన్‌ఎంల డిమాండ్
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 15: కాంట్రాక్టు ఎఎన్‌ఎంలకు సమానపనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎపి కాంట్రాక్టు (రెండవ) ఎఎన్‌ఎంల యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ ఎఎన్‌లు ఏవిధుల నిర్వహిస్తున్నారోఅవే విధులు దాము నిర్వహిస్తున్నప్పటికీ కేవలం రూ.10 వేలే ప్రభుత్వం ఇస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. పైపెచ్చు ట్యాబ్‌లో గర్భిణులు సమాచారం సేకరించి ఇవ్వాలని ఇటువంటి అదనపు పనులకు ఎటువంటి పారితోషికాలు ఉండవని, ఇతర ఉద్యోగుల మాదిరిగాయూనిఫాం అలవెన్సులు కూడా లేవని ఆమె ఆరోపించారు. ట్యాబ్‌ల్లో గ్రామాల్లో ఆయా సమాచారం నమోదుకు 40 నిముషాలు పడుతున్నదని అదీ నెట్ కనెక్టు అయితేనే అంటూ, పనిభారంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పారు. మహిళా కాంట్రాక్టు ఉద్యోగులుగా తాము ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నప్పటికి కనీసం ప్రసూతి సెలవుకు నోచుకోలేదని ఆమె పేర్కొన్నారు. పదవ పి ఆర్‌సి అమలు తరువాత కనీస వేతన జిఓ 3కింద కాంట్రాక్టు ఎఎన్‌ఎంలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి ఎన్నికల ముందర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మార్చి మూడున తల పెట్టిన ఛలో విజయవాడకు కాంట్రాక్టు ఎఎన్‌ఎంలు అంతా తరలిరావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొత్ససుధారాణి, సిఐటియూ జిల్లా కార్యదర్శి టివి రమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి నైతిక
విలువలు అలవర్చుకోవాలి
* ఎయు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు
కొత్తవలస, ఫిబ్రవరి 15:విద్యార్థులు నైతిక విలువలు కలిగి ఉండాలని, ఆ విధంగా విద్యార్థులను అధ్యాపకులు తయారు చేయాలని ఎయు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం ఇక్కడ రక్తదానం శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు విలువలు నేర్చుకోవాలని కోరారు. సుమారు ఐదుకోట్లతో ఏయులో యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ సౌజన్యంతోవృత్తివిద్యా కోర్సులకు సంబంధించి నైపుణ్యంపై శిక్షణ అందజేస్తామని చెప్పారు. 18- 60 ఏళ్ల వయస్సు గల వారు రక్తదానం చేయవచ్చని చెప్పారు. ఏయు పరిధిలో మంచి ప్రతిభ కనబర్చినందుకు యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో వాగ్థేవి విద్యసంస్థల యాజమాన్యం మహేశ్వరరావు పాల్గొన్నారు.
అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 15: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు భర్తీ చేసేందుకు యం త్రాంగం సోమవారం నుండి శ్రీకారం చుట్టింది. రిటైర్‌మెం ట్లు, ఖాళీలు, రాజీనామాచేసిన కారాణంగా ఏర్పడిన ఖాళీలు ఇతర కారణాలతో నెలకొన్న వాటిని భర్తీచేసేందుకు యూత్ హాస్టల్‌లో ఏర్పాట్లు చేసారు. సోమవా రం ఉదయం ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు పలువురు విజయనగరం డివిజన్ అభ్యర్థులు వచ్చారు. అయితే గ్రీవెన్సుకారణంగా ఉదయం నిర్వహించాల్సి న ఇంటర్వ్యూలు మధ్యా హ్నం వరకు ప్రారంభం కాలేదు, కలెక్టర్ చైర్మన్‌గా ఇవి నిర్వహిస్తారు. ఆయన హాజరు కావల్సి ఉండగా ఇతరపనుల వత్తిడి కారణంగా అయన బదులుగా డిఆర్వో జితేంద్ర ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను ఐసిడిఎస్ అధికారులు చేపట్టారు. మూడు రోజులు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్ వాడీలు లింక్ వర్కర్లు పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది.
తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి
* ఎమ్మల్యే మీసాల గీత
విజయనగరం(టౌన్) ఫిబ్రవరి 15: తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందని విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత చెప్పారు. 28 అంచనా వ్యయంతో మండలం గుంకలాంగ్రామంలో నిర్మించిన 40 వేల లీటర్ల రక్షిత నీటి పథకాన్ని ఆమె జడ్పీటీసీ తుంపల్లి రమణతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అందుబాటులో ఉన్న నిధులతో రక్షిత నీటిని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆమె అన్నారు. తాగునీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిఇ మాధవరావు, ఎంపిడిఒ శ్రీరామూర్తి, సర్పంచ్, ఎంపిటిసి, ఆర్‌డబ్యుఎస్ జెఇ నాగేశ్వరరావు కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
ఆదాయం పెంపునకు మొబైల్ చెక్‌పోస్టులు
చీపురుపల్లి, ఫిబ్రవరి 15: ఆదాయం పెంచేందుకు మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసామని ఎఎంసి చైర్మన్ సీతారామరాజు అన్నారు. సోమవారం స్థానిక ఎఎంసి కార్యాలయంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కృషి చేస్తూ ఆదాయవనరులు పెంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మొబైల్ చెక్ పోస్టుల ద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతు బజారు నిర్మాణం, ప్రహరి నిర్మాణం గోదాముల మరమ్మతు తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా 34.38 లక్షలు అద్దె ఎఎంసికి రావాల్సి ఉందని చెప్పారు. గరివిడిచ, చీపురుపల్లి, మెరకముడిదాం, మండలాల్లో మారుమూల గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించి పశుపోషణకు అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పారు. అనంతరం కొత్తబడ్జెట్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో కార్యదర్శి కుమారి, డైరెక్టర్లు సురేష్, నరసింహమూర్తి, శ్రీను పాల్గొన్నారు.
ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలి
* పాలవలస వేతనదారుల ఆందోళన
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 15: గత ఏడాదిలో చేసిన ఉపాధిహామీ పని వేతనం చెల్లించాలని వేతన దారులు వేదనతో కలెక్టరేట్ గుమ్మం ముందు కదం తొక్కారు. గుర్లమండలం పాలవలస గ్రామానికి చెందిన సుమారు 450 మంది వేతన దారులు గత ఏడాది 5,6 వనెలల్లో రెండు వారాలు గ్రామంలోని నల్లచెరువు పని నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మండల ,గ్రామ అధికారులు ఈపనిని ఎం బుక్‌లో నమోదు చేసారు. ప్రతిరోజు 450 మంది వేతన దారులు ఈపనిలో పాల్గొని చెరువును బాగు చేసారు. 10 రోజులు చేసిన కూలిపనికి దాదాపు ఐదు లక్షలరూపాయలు వారికి వేతనం అందాలి. కానీ ఇంతవరకు రూపాయి కూడా చెల్లింపుజరగలేదు. రెండుమూడుసార్లు బిల్లు కోసం మండల కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఉపాధికూలీ జిలక్ష్మి, భాస్కరరావులు ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో కలెక్టర్ గ్రీవెన్సులో ఈసమస్యపై ఫిర్యాదు చేసామని కాని ఎటువంటి న్యాయం జరగలేదని వారు తెలిపారు. ఈనేపథ్యంలో ఉపాధిహామీ వేతనదారులంతా కలెక్టరేట్ తరలి వచ్చి గోడు చెప్పుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికయినా చేసిన పనికి ఉపాధి వేతనం చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం గ్రీవెన్సులో వినతిపత్రం అందచేసారు.
ఓసీలను బిసిల్లో చేర్చొద్దు
* కలెక్టరేట్ వద్ద బిసిల దీక్ష
విజయనగరం(టౌన్),్ఫబ్రవరి 15: ఆర్థికంగా, సామాజికంగా సమాజంలో మందున్న కొందరు ఒసిలను ప్రభుత్వం బిసిలుగా గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ రాష్టబ్రిసి సంఘం అధ్యక్షుడు శంకర్రావు ఆదేశాలతో బిసి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద దీక్ష నిర్వహించారు. ఈశిబిరాన్ని మాజీ శాసనసభ్యుడు బడుకొండ అప్పలనాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం ప్రభుత్వం బిసిల కడుపుకొట్టే పనులు చేయరాదని ఆయన హితవు పలికారు. ఈకార్యక్రమంలో సంక్షేమసంఘం నాయకులు వెంకటరమణ, మజ్జిఅప్పారావు, ముదిలినాగభూషణం, మలిచర్ల దుర్గారావు తదితరులుపాల్గొన్నారు.
పింఛన్ దరఖాస్తులపై సర్వే చేయాలి
గజపతినగరం, ఫిబ్రవరి 15: జన్మభూమి - మా ఊరు సభల్లో ఫించన్ దరఖాస్తులను గ్రామాల్లో సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని ఎంపిడిఒ రమామణి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ పింఛన్‌కోసం వచ్చిన దరఖాస్తులను సర్వే చేసి ఆర్హులైన వారి దరఖాస్తులు ఆన్‌లైన్ చేయాలని అన్నారు. అం గన్వాడీ కేంద్రాలను ప్రతివారం తనిఖీ చేసి హాజరు పట్టికతో పాట లబ్ధిదారులు అందిన పౌష్టికాహారాన్ని చూడాలని అన్నారు. అదే విధంగా డంపింగ్ యార్డులకు స్థలాలు గుర్తించి నివేదికలు ఇవ్వాలని అన్నారు. 100శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు గల గ్రామాల్లో నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌నూ రిజిస్టర్ చేసేస్తారా
ఏలూరు, ఫిబ్రవరి 15: ఏలూరులోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘానికి చెందిన స్ధలం అమ్మకం అంశం ఇప్పుడు తీవ్రస్ధాయి వివాదానికి దారితీస్తోంది. ఇప్పటికే ఈవిషయంలో చేనేత జౌళి శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయటం తెల్సిందే. అయితే ఈవ్యవహారంపై జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్‌కు ఫిర్యాదు అందటంతో ఆయన ఈ అంశాన్ని సీరియస్‌గానే పరిగణించారు. సొసైటీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని ఏ నిబంధనలు పాటించకుండా విక్రయాలు ఎలా జరిగాయి, ఆ స్ధలాల రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు అన్న అంశంపై ఆయన సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మీకోసం కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన కలెక్టరు ఈ వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ చేనేత శాఖ ఎడి, జిల్లా సహకార అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌లను వెనువెంటనే పిలిపించారు. వారితో సొసైటీ భూమి అమ్మకంపై మాట్లాడారు. 80ఏళ్ల చరిత్ర ఉన్న సొసైటీకి చెందిన 3825.64 గజాల స్ధలం ఏవిధంగా విక్రయం చేశారు, దీనిలో అనుసరించిన విధానాలు ఏమిటి, అసలు ఏవిధమైన నిబంధనలు అంగీకరించకపోయినా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి అన్న వివరాలపై అధికారులను నిలదీశారు. చేనేత శాఖ అనుమతి లేకుండా ఈవ్యవహారం అసలు ముందుకు ఎలా వెళ్లిందని సంబంధిత ఎడిని నిలదీశారు. ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఈస్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఏవిధంగా విక్రయించే నిర్ణయం జరిగింది, దానికి తగ్గట్టు రిజిస్ట్రేషన్లు ఎలా పూర్తయ్యాయి అని ప్రశ్నించారు. ఈసందర్భంగానే జిల్లా కలెక్టరు భాస్కర్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్రస్ధాయిలోనే విరుచుకుపడ్డారు. పదిమంది వ్యక్తులకు ఈ స్ధలాన్ని ముక్కలుగా విడగొట్టి విక్రయించి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని పలుమార్లు ప్రశ్నించారు. తక్షణం రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. అయితే దీనికి జిల్లా రిజిస్ట్రార్ నుంచి సానుకూలస్పందన రాకపోగా రద్దు చేయడానికి నిబంధనలు ఇప్పుడు అంగీకరించవని చెప్పేందుకు ప్రయత్నించగా రిజిస్ట్రార్‌పై కలెక్టరు తీవ్రస్దాయిలో మండిపడ్డారు. ఈవిధంగా చూస్తుంటే ఎవరైనా వస్తే జిల్లా కలెక్టరేట్‌ను కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తారా అంటూ ప్రశ్నించారు. ఉన్న నిబంధనలను పరిశీలించి అవసరమైతే ఉన్నతాధికారులను సంప్రదించి ఈ స్ధలం రిజిస్ట్రేషన్లను మాత్రం తక్షణం రద్దు చేయించాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టరు ఆదేశించారు. అంతేకాకుండా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలకు కూడా శ్రీకారం చుట్టాలన్నారు. మొత్తంమీద కోట్ల రూపాయల విలువైన స్ధలాన్ని రోజుల వ్యవధిలోనే పదిమందికి ముక్కలుగా విడగొట్టి అప్పనంగా అప్పగించిన వ్యవహారం అటు రాజకీయంగాను, ఇటు అధికారవర్గాల్లోనూ కూడా పెద్దఎత్తున సంచలనంగా మారింది.
ఇదిఇలాఉండగా సొసైటీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయించిన సంఘం అధ్యక్షులు మత్సా శాంతారావు పైనా, నిబంధనలను పాటించకుండా అక్రమపద్దతుల్లో రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపైనా కఠినచర్యలు తీసుకోవాలని దేవాంగుల సంఘం నాయకులు స్ధానిక పద్మశాలీల సంఘం భవన్‌లో సమావేశమై ఈమేరకు తీర్మానించారు. అలాగే కుట్రపూరితంగా ఈ స్ధలాన్ని కబ్జా చేసేందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారిపై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టాలని నాయకులు కొమ్మన వెంకటరమణ, యర్రా వీర్రాజు, వీరా సోమసుందరం, వీరా సుబ్బారావు, తిప్పాని రాజారామ్మోహనరావు, కోటంశెట్టి రామారావు, పిచ్చుక ఆదిశేషు తదితరులు డిమాండ్ చేశారు.
హాలోగ్రామ్ అమలయ్యేనా?
తప్పనిసరిగా అమలు చేయాలంటున్న కమిషనర్: సాకులు చెబుతున్న నిర్వాహకులు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 15: హాలోగ్రామ్.. ఈ పదం కార్పొరేట్ షాపింగ్ మాల్స్‌లో విని ఉంటాం. అయితే ఇప్పుడు మద్యం దుకాణాల్లోకి ప్రవేశించింది. షాపింగ్ మాల్స్‌లో వారి వ్యాపార విస్తరణకు ఈ ప్రక్రియ ఉపయోగపడితే.. మద్యం దుకాణదారుల్లో కొందరికి మాత్రం అడ్డంకి కానుంది. గత కొనే్నళ్లుగా దీనిని అమలుచేయాలని ప్రభుత్వం.. వీలుకాదని మద్యం దుకాణదారుల నడుమ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన హాలోగ్రామ్ విధానం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను హాలోగ్రామ్ అమలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. మరి ఈ విధానం ఈసారి ఎలా అమలవుతుందో ఎక్సైజ్ అధికారులకు, దుకాణదారులకు మధ్య జరిగిన తెర వెనుక చర్చలపై ఆధారపడి ఉంది. ఇక హాలోగ్రామ్ వల్ల మద్యం సీసాపై ఉన్న లేబుల్ (చిన్నపాటి ముచ్చు)ను స్కానింగ్ చేస్తారు. తద్వారా ఆ బాటిల్ బిల్లింగ్ (విక్రయం) కావడంతో పాటు అక్రమ మద్యం విధానానికి స్వస్తి చెప్పవచ్చు. ఏ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయనేది కూడా తెలుస్తుంది. బెల్టు దుకాణాల్లో పట్టుబడిన మద్యం సీసాలు ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కూడా తెలుస్తుంది. ఈ హాలోగ్రామ్ సాఫ్ట్‌వేర్ కోసం ప్రతీనెల కొంత మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీకి నిర్వాహకులు చెల్లిస్తేనే ఈ ప్రక్రియ అమలవుతుంది.
బల్లమీద యంత్రం.. స్కానింగ్‌లో కనికట్టు
అయితే ఈ ప్రక్రియ దుకాణదారుల నిర్వహణ పైనే ఆధారపడి ఉంటుంది. హాలోగ్రామ్ అమలు చేస్తున్నాం చూడండని నమ్మించేందుకు బల్లమీద యంత్రం పెట్టి స్కానింగ్ చేయకుండా సీసాలు విక్రయిస్తే అక్రమాలు నిరోధించడం కష్టమే. కొందరు దుకాణదారులు ఇలాగే కానిచ్చేసినట్టు విమర్శలు వినిపించాయి. బల్లమీద యంత్రాన్ని పెట్టి సీసాలు మాత్రం స్కానింగ్ చేయకుండా ఇచ్చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇది కనుక అమలుచేస్తే కల్తీ మద్యం, అక్రమ మద్యం తదితర అక్రమాలు బయటకు వచ్చేస్తాయన్న ఉద్దేశంతో కొందరు నిర్వాహకులు చూసీచూడనట్టుగా పోవాలని, బల్లమీద స్కానింగ్ మిషన్ ఉందో లేదో చూసుకుని అన్నిచోట్ల ఉన్నాయని రిపోర్టులు పైకి పంపించుకోండని ఎక్సైజ్ అధికారులకు ఉచిత సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరు సైతం సరే అని తలూపినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
మద్యం దుకాణాల కన్నా రెండింతలు బెల్టు దుకాణాలు?
ప్రస్తుతం జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల కన్నా బెల్టు దుకాణాలే రెండింతలున్నాయని చెప్పవచ్చు. ప్రతి మద్యం దుకాణానికి ఆ సమీప ప్రాంతంలో ఒక బెల్టు దుకాణాన్ని ఏర్పాటుచేసి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎక్సైజ్ శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా ఇదే పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. ఇక ఆ బెల్టు దుకాణాల్లో భారీ ఎత్తున మద్యం సీసాలు దొరికినా చర్యలు శూన్యం. ఒక మనిషి దగ్గర నాలుగు సీసాలు ఉండవచ్చునని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు అంతకన్నా ఎక్కువ కొన్నిచోట్ల పట్టుబడినప్పుడు వారిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారు.
పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
*విద్యార్థులకు చేతన్ ఖజారియా పిలుపు * పారిశ్రామిక, నైపుణ్యాల, వ్యాపార విధానాలపై చర్చ * హాజరైన ఉత్తరాదికి చెందిన పారిశ్రామికవేత్తలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 15: విద్యార్థి దశలోనే సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిగత సామర్ధ్యాలు, వ్యాపార విధానాలు, తయారీ రంగంలోని నూతన ఒరవడులపై దృష్టిసారించాలని ఖజారియా సిరామిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఖజారియా విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థినులకు పారిశ్రామిక నైపుణ్యాలు, వ్యాపార రంగ విధానాలపై ఉత్తర భారతదేశంలోని ప్రముఖ సిరామిక్స్ సంస్థ ఖజారియా సిరామిక్స్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఖజారియాతో ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు, శైలి, ఆర్థిక స్థితిగతులు బట్టి వస్తురూపకల్పన, తయారీ, మార్కెటింగ్ విధానాలు ఉంటాయన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలపై అవగాహన సదస్సులు, సెమినార్లు ఎంతో అవసరమన్నారు. ఇంజనీరింగ్ లేదా మేనేజ్‌మెంట్ ఏ విభాగమైనా పారిశ్రామిక రంగంలో నూతన తయారీ విధానాలు, డిజైన్, నాణ్యత ఉన్న వస్తు రూపకల్పన కోసం పరిశోధనలు చేస్తారన్నారు. విద్యార్థులు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని సూచించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ ఔత్సాహిక విద్యార్థులు స్వయంశక్తితో వ్యాపారవేత్తలుగా రాణించవచ్చునన్నారు. ఇందుకోసం స్టార్టప్ కంపెనీల పేరిట మేకిన్ ఇండియా మిషన్‌లో కల్పించే అవకాశాలపై దృష్టిసారించాలని వివరించారు. వైస్‌చైర్మన్ ఆర్. రవిచంద్రన్ మాట్లాడారు. అనంతరం ఎంబిఎ, విఐటి విద్యార్థినులు మహేశ్వరి, వౌనిక, హర్షిత, వౌనికలు అడిగిన పలు ప్రశ్నలకు చేతన్ ఖజారియా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా చేతన్ ఖజారియాను చైర్మన్ కెవి విష్ణురాజు ఘనంగా సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు తదితరులు పాల్గొనగా, ఉత్తర భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పట్టిసీమలో పటిష్ఠ ఏర్పాట్లు
దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వేములపూడి
ఏలూరు, ఫిబ్రవరి 15 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 7వ తేదీన పట్టిసీమకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం పటిష్టమైన ఏర్పాట్లు చేశామని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వేములపూడి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు, బారికేడ్లు ఏర్పాటు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వృద్దులు, వికలాంగులు జాప్యం లేకుండా దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. బస్టాండ్‌ల నుంచి ఆలయం వరకు కూడా తమ శాఖ సిబ్బందిని ఎక్కడికక్కడ నియమించామని, భక్తులకు అసౌకర్యం కలిగితే తక్షణమే చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రతిపాదించామన్నారు. ఆలయం వద్ద భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం కలగచేస్తున్నామన్నారు. జిల్లాలోని ఎండోమెంట్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక నియామకాలు జరిపామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమతోపాటు గునుపూడి, పాలకొల్లు, లక్ష్మణేశ్వరపురం, ఆచంట, నత్తా రామేశ్వరం, ఏలూరులోని పత్తేబాద పాత శివాలయం, నగరేశ్వరాలయం తదితర ప్రాంతాల్లో వున్న శివాలయాలకు మహాశివరాత్రినాడు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారని అంచనా వుందని, ఈ మేరకు ఆయా ఆలయాల వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశామన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రపర్చడం, వెల్లలు, రంగులు వేయడం, పందిళ్లు వేయడం తదితర పనుల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆర్‌టిసి సంస్థ ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు.
‘చింతలపూడి’ కాలువ పనులు అడ్డుకున్న రైతులు
గోపాలపురం, ఫిబ్రవరి 15: చింతలపూడి పథకం కాలువ నిర్మాణాల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందజేసే వరకూ పనులు జరగనీయబోమని భీమోలు రైతులు హెచ్చరించారు. భీమోలు గ్రామ శివార్లలో అక్క దేవతల గుడి సమీపం నుండి చింతలపూడి కాలువ తవ్వకాలు చేపట్టవలసి ఉంది. నష్టపరిహారం విషయంలో రైతులు గతంలో హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులు పనులను నిలుపుదల చేశారు. సోమవారం హఠాత్తుగా అధికారులు రైతుల పంట పొలాల్లోకి ప్రవేశించి పనులు ప్రారంభిస్తుండగా 94.65 ఎకరాలకు చెందిన 33మంది బాధిత రైతులు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు అధికారులతో మాట్లాడుతూ తాము పొలాల్లో పంట సాగుచేసుకుంటున్నామని, కాలువల పేర్లతో పంటలను ధ్వంసం చేయడమేమిటని అధికారులను నిలదీశారు. తమ గ్రామానికి ఎగువన ఉన్న అన్నదేవరపేటకు చెందిన భూములకు ఎకరాకు రూ.27లక్షలు నష్టపరిహారం ఇవ్వగా, తమకు దిగువన ఉన్న గుడ్డిగూడెం గ్రామంలోని భూములకు రూ.23లక్షలు ఇచ్చారన్నారు. తమకు మాత్రం రూ.15.41లక్షలు ప్రకటించడం అన్యాయమని వాపోయారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టైనా నష్టపరిహారం సాధించుకుంటామని, అప్పటి వరకూ పనులు సాగనిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. సంఘటనా స్థలంలో ఉన్న తహసీల్దార్ ఎన్ నర్సింహమ్మూర్తి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయవలసి వచ్చింది. పోలీసు, రెవెన్యూ అధికారులు కలిసి రైతులతో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదిలేక అధికారులు వెనుతిరిగారు. నష్టపరిహారం విషయమై విలేఖర్లు తహసీల్దార్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే తాము పనులు చేసేందుకు వచ్చినట్టు చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకే నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిఇ భాస్కర రామకృష్ణ, ఆర్‌ఐ డి రవి, ఎస్సై యు లక్ష్మీనారాయణ, విఆర్వో ఏడుకొండలు, రైతులు గద్దే వెంకటేశ్వరరావు, ఆర్ అప్పారావు, కోడి దేవీప్రసాద్, మధ్యాహ్నపు గంగరాజు, వింటి రామకృష్ణ, వింటి పేరయ్య, పసుపులేటి బలరామకృష్ణ తదితరులు ఉన్నారు.
శ్రీనివాసరావు మృతి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం
ఏలూరు, ఫిబ్రవరి 15 : కాళ్ల గ్రామంలో ఒక బెల్టుషాపులో ఈ నెల 6వ తేదీన తూము శ్రీనివాస్ అనే వ్యక్తిని కొట్టి చంపి దహనం చేసిన సంఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక డిసిసిబి సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళ్ల గ్రామంలో ఒక పెట్రోలు బంకు దగ్గర ఉన్న బెల్టుషాపులో ఈ నెల 6వ తేదీన తూము శ్రీనివాస్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కొట్టి చంపి సమీపంలో ఉన్న ఒక గడ్డివాములో తగలబెట్టడం అత్యంత హేయకరమని అన్నారు. ఆ బెల్టుషాపులో తరచూ కొట్లాటలు జరగడం పట్ల అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఈ రోజు జరిగిన సంఘటనలో ఒక అమాయక వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని ఈ విషయమై జిల్లా కలెక్టరుకు, ఎస్‌పికు ఫిర్యాదు చేసామన్నారు. ఈ సంఘటనకు కారకులైన సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం చేయడమే కాకుండా ఆకుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. మద్యం షాపుల నిర్వహణ గ్రామీణ ప్రాంతాల్లోని పలు చోట్ల గుడికి, బడికి దగ్గరగా వున్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎక్సైజ్ ఉన్నతాధికారులకు, పోలీసు యంత్రాంగానికి గతంలో తాను ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ కూడా పట్టించుకోలేదని, కాబట్టే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని రత్నం పేర్కొన్నారు. ఇప్పటికైనా గుడికి, బడికి దగ్గరలో వున్న మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు.
కాపులను బీసీల్లో కలిపితే ఊరుకోం
జిల్లా బిసి సంక్షేమ సంఘ నాయకులు ఆందోళన
ఏలూరు, ఫిబ్రవరి 15 : రాజ్యాంగ పరంగా బిసిలకు కేటాయించిన రిజర్వేషన్లు పర్యవేక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని, కాపు సామాజిక వర్గాన్ని బిసిల్లో కలిపితే ఊరుకోమని జిల్లా బిసి సంక్షేమ సంఘ నాయకులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ధర్నానుద్దేశించి బిసి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ విశే్వశ్వరరావు, నగర గౌడ సంఘ అధ్యక్షులు కాసాని రమేష్ గౌడ్‌లు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదన్నారు. భారత రాజ్యాంగంలోని 340 (15) తదితర నిబంధనల స్వభావానికి విరుద్ధమైనదన్నారు. రిజర్వేషన్లు అనేవి సాంఘిక వివక్షత, అణచివేతకు సంబంధించినవేకానీ ఆర్ధిక అంశం కాదని, ఆర్ధిక వెనుకబాటు తనాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి ఆర్ధిక పరమైన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుందన్నారు. ప్రస్తుతం బిసి జాబితాలో వున్న కులాలు సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్ధికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి వున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘ నాయకులు రెడ్డి సత్యనారాయణ, పివి పెద్దిరాజు, మారగాని చంద్రకిరణ్, వీరవల్లి శ్రీనివాస్, గుత్తుల బాలా త్రిపుర సుందరి, బచ్చు పద్మావతి, బోని శివ, వేగి చిన్న ప్రసాద్, కాజుల తిలక్, తుమరాడ శ్రీనివాసరావు, ఎచ్చెర్ల సత్యనారాయణ, తెంటు సూర్యనారాయణ, వంగలపూడి పోతురాజు, చిట్టిబోయిన పవన్‌గౌడ్, లక్కోజు సాయి, బళ్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాపులను బిసిల్లో చేర్చవద్దంటూ కొద్దిసేపు నినాదాలతో హోరెత్తించారు.
రైతులకు జైపూర్ సుగర్స్ ‘చెక్’
చెల్లని చెరకు బకాయి చెక్కులు
తాళ్లపూడి, ఫిబ్రవరి 15: చెరకు రైతుల బకాయి కింద చాగల్లు జైపూర్ సుగర్స్ యాజమాన్యం రైతులకు జారీచేసిన చెక్కులు బ్యాంకులో చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన తాళ్లపూడి ఆంధ్రాబ్యాంకులో చోటుచేసుకుంది. బల్లిపాడు గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతులు తమ బకాయిల కోసం శుక్రవారం యాజమాన్యం నుంచి పొందిన చెక్కులను సోమవారం ఆంధ్రాబ్యాంకుకు తీసుకువచ్చారు. బ్యాంకు వెళ్లిన రైతులు బ్యాంకు మేనేజరు చెప్పిన సమాధానంతో అయోమయానికి గురయ్యారు. రైతులకు చెక్కులిచ్చిన జైపూర్ యాజమాన్యం ఈలోపునే బ్యాంకులకు వెళ్లి ఆ చెక్కులను చెల్లించవద్దని పేర్కొంటూ బ్యాంకు మేనేజరుకు లేఖను అందజేసింది. బ్యాంకు మేనేజర్ ఆ చెక్కులను తీసుకోకపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. గత కొన్నాళ్లుగా చెరకు బకాయిలు చెల్లించడం లేదని నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా రైతుల కష్టాలు తీరకపోగా సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
సూర్యారావును మద్యం వ్యాపారస్థులే హతమార్చారు
* సిఐ జయసూర్య
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 15: మండల కేంద్రమైన కాళ్ళ శివారులో సూర్యారావుపేట పుంత రోడ్డులో కాలి బూడిదైన తూము శ్రీనివాసరావుని చంపింది మద్యం వ్యాపారస్తులని భీమవరం రూరల్ సిఐ ఆర్‌జి జయసూర్య చెప్పారు. వ్యూహాత్మకంగానే శ్రీనివాసరావును హతమార్చి, తోట సత్యనారాయణ పొలం వద్ద పంట బోదెకు అనుకుని ఉన్న తోట పాపారావు గడ్డివామిలో శ్రీనివాసరావు శరీరానికి నిప్పు పెట్టినట్టు తెలిపారు. సోమవారం భీమవరం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 9వ తేదీన శ్రీనివాసరావు కనిపించడం లేదని అతని భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేసిందన్నారు. అదేరోజు సగం కాలిన శరీర భాగాన్ని నాగలక్ష్మికి చూపించగా ఆమె గుర్తించిందన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి ఎస్సై ఇ. ప్రసాదరావు దర్యాప్తు చేశారన్నారు. ఈ దర్యాప్తులో 5వ తేదీ రాత్రి కాళ్ళ గ్రామంలోని సత్యదేవ వైన్స్ నుండి అదృశ్యమయ్యాడని గుర్తించామన్నారు. దీంతో అదే బ్రాందీ షాపులో పనిచేస్తున్న నోఓకు, మర్రి కృపాదానం, యాళ్ళ రవీంద్రలు కనిపించకపోవడంతో వారిని వ్యూహాత్మకంగా పట్టుకున్నామన్నారు. ఈ ముగ్గురు శ్రీనివాసరావును కొట్టి చంపి గడ్డివామిలో వేసి కాల్చివేసినట్టు అంగీకరించారని తెలిపారు. శ్రీనివాసరావు గతంలో మద్యం సేవించే విషయంలో ఒకటి రెండు పర్యాయాలు మాటల యుద్ధానికి దిగాడని, ఆ రోజు కూడా మాటల యుద్ధానికి దిగిన నేపథ్యంలో బ్రాందీ షాపు వెనుక ఉన్న షెడ్డులో హతమార్చినట్టు తెలిపారని సిఐ వివరించారు. దీంతో వీరు ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఎస్సైతో పాటు ఎఎస్సైలు రామకృష్ణ, హరిబాబులను సిఐ ప్రత్యేకంగా అభినందించారు.
కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
జెసిబి, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
పోలవరం, ఫిబ్రవరి 15: పోలవరం మండలం ప్రగడపల్లి సమీపంలో కొవ్వాడ కాలువలో అక్రమంగా ఇసుక తవ్వుతున్న జెసిబి, మూడు ట్రాక్టర్లను అధికారులు సోమవారం ఉదయం సీజ్ చేశారు. సమాచారం మేరకు ఆ ప్రాంతానికి చేరుకున్న ఆర్‌ఐ ఆర్‌ఎస్ నాగరాజు, పట్టిసీమ విఆర్వో ఎంఎస్ వెంకటేశ్వరరావు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జెసిబిని, ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై తహసీల్దారుకు, పోలీస్ స్టేషన్‌కు విఆర్వో ఫిర్యాదుచేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న జెసిబిని, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తహసీల్దార్ ముక్కంటి తెలిపారు.
19న భారీ రుణమేళా!
హాజరుకానున్న సిఎం!!
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈనెల 19వ తేదీన భారీఎత్తున రుణమేళా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయా వర్గాలకు భారీఎత్తున రుణాలు మంజూరు చేసేందుకు ఈ రుణమేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రుణమేళాకు హాజరవుతారని భావిస్తున్నారు. సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ రుణమేళాకు సంబంధించి నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది. సిఎం పర్యటనకు సంబంధించి మంగళవారం స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఏలూరు, ఫిబ్రవరి 15: జెఎన్‌యులో విద్యార్ధినాయకులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్ధానిక పాతబస్టాండ్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య, అభ్యుదయవాదులపై దాడులు పెరిగాయన్నారు. వామపక్ష కార్యాలయాలపై దాడులకు సంఘ్‌పరివార్ శక్తులే కారణమన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జెఎన్‌యు విద్యార్ధిసంఘం అధ్యక్షులు కన్హయ్యకుమార్‌ను అరెస్టు చేయటం, అతనిపై దేశద్రోహం కేసు పెట్టడం దారుణమన్నారు. ఎబివిపి ఓటమిని జీర్ణించుకోలేకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నెక్కంటి సుబ్బారావు, బండి వెంకటేశ్వరరావు, మున్నీర్, శ్రీనివాసడాంగే, పుప్పాల కన్నబాబు, బి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
పూరీ ప్రశంస...

లేటెస్ట్ ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిన మెహ్రీన్ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో ఇప్పుడు తెలుగులో పలు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రెడీ అయ్యింది మెహ్రీన్. మెహ్రీన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. సాధారణంగా ఎవరైనా శుభాకాంక్షలు తెలపాలనుకుంటే మొత్తం చిత్రానికి, దర్శకునికి, హీరోకి, హీరోయిన్‌కీ.. ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలపడం సహజం. కానీ పూరి మాత్రం కేవలం ఈ కొత్త హీరోయిన్‌కు మాత్రమే తన బెస్ట్‌విషెస్‌ను తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మెహ్రీన్‌ను ఉద్దేశించి ఆయన నీ మొదటి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అని ట్వీట్ చేశాడు. కాగా త్వరలో పూరీ నందమూరి కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఏదోఒక దానిలో ఆయన మెహ్రీన్‌కు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
జయమ్ము నిశ్చయమ్మురా ఫస్ట్ లుక్
శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా ఎ.వి.ఎస్.రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘జయమ్మునిశ్చయమ్మురా’ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రముఖ హీరో నితిన్ లాంఛ్ చేశారు. వీడియో పోస్టర్ చాలా కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టీమ్‌కు నితిన్ బెస్ట్‌ఆఫ్ లక్ చెప్పారు. త్రివిక్రమ్ లాంటి గ్రేట్ డైరెక్టర్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వీడియో పోస్టర్‌పై ప్రశంసలు కురిపించటం చాలా స్ఫూర్తినిస్తోందని దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు. వంశీ, భాగ్యరాజా కలిసి ఓ సినిమా చేస్తే ఎలా వుంటుందో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అలా వుంటుందని చిత్ర కథానాయకుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రవివర్మ ఈ చిత్రానికి రచనా సహకారం అందించి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న పరమ్ సూర్యాన్షు తదితరులు పాల్గొన్నారు. 90 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.