పాపం, దిల్ రాజుకు రోజులు బాగున్నట్లు లేదు. వరసగా దెబ్బలు తగులుతున్నాయి. దిల్‌రాజు అంటే లక్ అనుకున్నవారు సైతం, పరిస్థితి రివర్స్ కావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ సినిమా హక్కులు కొంటే అదే ఫట్ మంటోంది. తూనీగ తూనీగ, శిరిడిసాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రెబల్, తాజాగా కె జి రాంబాబు ఇవన్నీ దిల్‌రాజుకు తగుల్తున్న షాక్‌లే. కె.జి.రాంబాబును ఏకంగా పది పనె్నండు కోట్లకు పై మొత్తానికే నైజాం హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు గగనం, ఓ మై ఫ్రెండ్ కూడా పెద్దగా ఒరగబెట్టింది లేదు. వాటికి ముందు ఆకాశమంత, జోష్, మరోచరిత్ర, రామరామ కృష్ణకృష్ణ గట్టిదెబ్బలే తీసాయి. ఇక ఢమరుకం ఒకటి మిగిలి వుంది. మరోపక్క పెద్ద మల్టీస్టారర్‌గా పేరుపడుతున్న సి.వా.సి.చెట్టు రెడీ అవుతోంది. చూడాలి వీటితోనైనా అదృష్టం తిరుగుతుందేమో?
పాటల గోదారి
గుండెల్లో గోదారి మంచి టైటిల్. తెలుగింటి ఆడపిల్ల మంచులక్ష్మి నిర్మాత. ఇళయరాజా సంగీతం. ఇటీవల ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. అందరూ ఇళయరాజాని, లక్ష్మిని గాల్లోకి ఎత్తేస్తున్న సమయంలో, ఇళయరాజా స్వరపరచిన ఆనాటి పాట ‘మావయ్య వస్తాడంట’ పాటకు కొత్త సాహిత్యంతో మరో పాట తయారుచేసి, ఈసినిమాలో వుంచిన సంగతి, దాని క్లిప్పింగ్ ప్రదర్శించారు. కొద్ది క్షణాలే అయినా, ఆ పాటలో సెక్సీఅమ్మడు ఊపులు చూసి, అంతవరకు సినిమా గురించి ఏదో అనుకున్నవారు కాస్తా ఒక్క క్షణం నిట్టూర్చాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే, సినిమాలోని ఆరు పాటలకు రెండు ఐటమ్ సాంగ్స్‌లాంటివే కావడం.
పూరీజీ - స్ట్రాటజీ
దూకుడు హిట్ కాగానే మహేష్‌తో బిజినెస్‌మన్, గబ్బర్‌సింగ్ హిట్‌కాగానే కెమేరామెన్ గంగతో రాంబాబు, జులాయి హిట్ తరువాత అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలు, ఇవీ పూరి జగన్నాథ్ సినిమాలు. సహజంగానే పూరి సినిమాలో కథ, స్క్రిప్ట్ కన్నా, మాటలు, చమక్కులు తదితర హడావుడి ఎక్కువ వుంటాయి. హీరో చరిష్మా తోడయితే అలా బండి నడిపించి సులువుగా హిట్ తీరాలకు చేరుకోవచ్చు. వేగంగా సినిమాలు తీస్తాడని పేరూ సంపాదించుకోవచ్చు. ఇదేనా పూరీ జీ..స్ట్రాటజీ?
ఆర్‌ఆర్‌కూ ఇబ్బందులే
ముందు వెనుక చూడకుండా ఫ్లోలో వెళ్లిపోతే సినిమా రంగంలో కష్టాలు తప్పవు. సినిమాలు తీసినంతకాలం ఆర్ ఆర్ మూవీస్‌కు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. చాలా శాతం సినిమాలు హిట్ కావడంతో బాగానే డబ్బులొచ్చాయి. కానీ అక్కడితో ఆగకుండా పంపిణీ రంగంలోకి దిగడంతో చేతులు కాల్చుకోవడం ప్రారంభమైంది. సినిమాలన్నీ హిట్ కొట్టగా వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ ఖర్చయిపోతున్నాయని టాలీవుడ్ టాక్. దీనికి తోడు డమరుకం కోసం సుమారు నలభై కోట్లకు పైగా వెచ్చించాల్సి వచ్చింది. మరో పక్క ఆటోనగర్ సూర్య నిర్మాణంలో వుంది. ఇవి చాలక కృష్ణారెడ్డి ఇంగ్లీషు సినిమా డైవోర్స్ ఇన్విటేషన్ విషయంలో కూడా చాలా కోట్లు బ్లాక్ అయిపోయాయని వినికిడి. దీంతో పైసలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని, డమరుకం విడుదల ముందు వెనుకలు కావడం వెనుక ఈ వైనం కూడా వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.