తెలుగు సినిమా వెండి తెరకు పాటలు, మాటలు పూల కొమ్మకు పూసిన ఆకులు, పూల వంటివి. సినిమాలకు పాటలు కాసులు కురిపించాయి. పాటలు సినిమాకు ప్రాణం. కొన్ని చిత్రాలైతే సంగీత, సాహిత్యాలపైనే ఆధారపడి నడిచాయి. కొన్ని చిత్రాలు కథాబలం, నటీనట వర్గముల నటనా వైదుష్యం వంటి విషయాలు విజయవంతం చేసాయి. మల్లీశ్వరి, జయభేరి, సువర్ణ సుందరి, దేవదాసు, ఆరాధన, లవకుశ వంటి మహా చిత్రరాజాలు కథతోపాటు పాటకు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలుగు సినిమా పాటకు రచయితలు, సంగీత దర్శకులు, చిత్ర కళాదర్శకులెందరో జీవంపోశారు. గాయనీగాయకుల గళాలు ఖంగున మోగాయి. చెవులు రింగుమనిపించాయి. చాలా కాలంవరకు మరపురాని సాహిత్యంగా నిలిచిపోయాయి. పాటల రచయితలలో మల్లాది, సీనియర్ సముద్రాల, దాశరధి, శ్రీశ్రీ, దేవులపల్లి, సినారె, ఆత్రేయ, వేటూరి, సిరివెనె్నల, చంద్రబోసు, సుద్దాల అశోక్ వంటివారు ఎందరో విశేష కృషిచేసారు. ఆరుద్ర స్థానం శాశ్వతమైనది. చిరస్మరణీయం.
ఆరుద్ర అసలు పేరు భాగవతుల సూర్యనారాయణ శివశంకరశాస్ర్తీ. జన్మించినది విశాఖపట్టణం. తల్లిదండ్రులు సింగమ్మ, నరసింహారావు. 31-8-1925. చదివినది ఇంటర్మీడియట్ కోర్సు అయినా ప్రపంచం చదివినవాడు. కవిగా, రచయితగా, చారిత్రక పరిశోధకుడుగా, దేశభక్తుడిగా, మెజీషియన్‌గా, చెస్ ఆటపై మక్కువగల క్రీడాకారుడిగా, చిత్రకారుడిగా, వివిధ భాషాప్రవీణుడిగ, ఆస్ట్రాలజీనందు అభినివేశకుడిగ, భరతనాట్యంలో విశారదుకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించదగిన వ్యక్తి. చారిత్రక పురుషుడిగా స్మరించవచ్చు.
తెలుగు సాహిత్యంనందు ఆయన చేసిన కృషి అపూర్వం. ‘‘త్వమేవాహమ్’ - కూనలమ్మ పదాలు- వీర తెలంగాణా’-ఇంటింటి పద్యాలు, సమగ్రాంధ్ర సాహిత్యం 11 యుగాలు 13 వాల్యూములు 400 పైగా కవుల చరిత్రను 3000 పేజీలకు పైగా రచించారు. పోటీపరీక్షలకు చదువుకునే ప్రతివారికి ఒక నిఘంటువుగా, యువ రచయితలకు స్ఫూర్తిదాతగా, ఋషితుల్యుడుగా, అహర్నిశలు చరిత్రకు కావలసిన శాసనాలు, శ్రీశ్రీ పరిశోధనా వ్యాసాలుపై కృషిచేశారు. ఒక పనిని మొదలుపెడితే దాని అంతం చూసేవరకు వీడని పట్టుదలగల విక్రమార్కుడు వంటివాడు. వ్యాస పీఠమ్ ద్వారా పలు విషయాలు రంజకంగా రచించారు.
1947లో తొలిసారిగ ఎయిర్‌ఫోర్స్ బొంబాయినందు క్లర్క్‌గా చేరారు. తరువాత ఆనందవాణి అనే పత్రికకు ఎడిటర్‌గా, ఫొటోగ్రాఫర్, కథకుడు, నాటకాలు రచయిగా పాట, మాటలు, డబ్బింగ్ సినిమాలకు రచనలు సాగించారు. సాక్షాత్ శ్రీశ్రీకి మేనల్లుడు. త్వమేవాహమ్‌నకు పీఠిక శ్రీశ్రీగారు వ్రాశారు. 1947నుండి 1998 వరకు అవిరామంగా తన కలాన్ని పరుగులెత్తి సాహితీకృషివలుడికి అక్షర రాక్షసుడిగా పేరుగాంచారు.
సినీ సాహిత్యం వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందారు. సాంఘిక, పౌరాణిక, జానపద, డిటెక్టివ్ అంశాలను భార్యాభర్తల మధ్య సరసాలు, సాధికారత కల్గినవాడు. హాస్యం, విరహం, యుగళ గీతాలు, సందేశాత్మక గీతాలు రసమయములు- పండితులు, పామరులు హాయిగా పాడుకోగలిగే రచనలు చేసి ఆరుద్ర నక్షత్రానికి కొన్నంత ప్రత్యేకతను సంతరించుకొన్నారు. మచ్చుకు కొన్నిటిని పరిశీలిద్దాం.
అలవోకగా ప్రతిరోజు వినే పదాలు రాస్తూ, ఏ ఒక్క ఇజానికి కట్టుపడక వివిధ ప్రక్రియలుచేసి ‘్భష్’అనిపించుకొన్నారు.
జానపదులు బాణి, హైలెస్సా, మరదలా, మనసు, అలకలు, ముద్దులు, ముచ్చట్లు, మురిపాలు, చిలిపిదనాలు చూపుతూ సరళమైన పదాలు, అందమైన భావానికి జోడిస్తూ పండిత పామరులు సైతం హాయిగా ఈ రేయిగా నిదురబోయే పాపల్లాగ నిదురిస్తారు. హుషారైన పాటలకు ఆబాలగోపాలం చిందువేయవలసిందే. వౌనాలు, బింకాలు, బ్రతిమలాడటాలు, విరహాలు, చక్కిలిగింతలు, కితకితలు, గలగలలు, వలపులు, నవ్వులు పువ్వులు, నదులు, సెలయేరులు, జలపాతాలు మల్లెపూల పరిమళాలు, వంపుసొంపులు, ప్రియురాలి మత్తులు ప్రియుని గమ్మత్తు పదాలు, అల్లరులు, అలకలు, జంపాలలు ఉయ్యాలలు, ఊహలు గుసగుసలు, వెచ్చని ఊపిరులు - సందేశాత్మకాలు, వినోదాలు- బాలల గీతాలు, హాస్య, విరహగీతాలు, దేశభక్తి, సాహిత్యం, సమాజహితం, వేదాంతం- చరిత్ర, పురాణం- ఒక్కటేమిటి అనేక కోణాలు, అనేక అంశాలు పొందుపరుస్తూ ఆంధ్రదేశమంతటా తన పాట మాట, మాధుర్యంతో సిరులు కురిపించారు.
రామాయణంపై శ్రీరాముడిపై వ్రాసిన గీతాలు పద్యాలు అజరామరం- స్వతహాగా కమ్యూనిస్టు అయినా ప్రాచీన సంపదకు ఎలాంటి హానిని కల్గించక, జనరంజకంగా వ్రాసి మెప్పించారు ఆరుద్రగారు.
పౌరాణిక, జానపద, సాంఘిక, డిటెక్టివ్ వేదాంతం, చారిత్రాత్మక చలనచిత్రాలకు పాటల రచయిత డబ్బింగ్ సినిమాలకు మాటల రచయితగా వాసికెక్కారు. మచ్చుకు కొన్ని ఉదా.తెలుసుకొందాం.
పురాణాలు: వీరాంజనేయ, ప్రహ్లాద, భక్తపోతన, భీష్మ, పాండవ వనవాసం, బాల భారతం, సంపూర్ణ రామాయణం, సీతారామకల్యాణం, శ్రీరామ వనవాసం, శ్రీ భీమాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణతులాభారం, శ్రీరామాంజనేయ యుద్ధం, వీరాభిమన్యు, శ్రీకృష్ణావతారం, శకుంతల- సరస్వతీ శపథం.
సాంఘిక చిత్రాలు: ‘ఉయ్యాల జంపాల’, దొరికితే దొంగలు, సాక్షి, జమిందార్, అంతస్తులు, లేతమనసులు- రాము, లక్ష్మీనివాసం, ఆత్మగౌరవం, బంగారు గాజులు, గోవులగోపన్న, నిండుసంసారం, భలే మొనగాడు, ఇద్దరు అమ్మాయిలు, ద్రోహి, పెత్తందార్లు, దేవుడుచేసిన మనుషులు, పవిత్ర బంధం, పెళ్ళిపుస్తకం, మనుషులు మారాలి, బుద్ధిమంతుడు, భలేరంగడు మొదలైనవి.
జానపదం: ప్రతిజ్ఞాపాలన, రహస్యం, బందిపోటు దొంగలు, పల్నాటి యుద్ధం, వీరకంకణం, రణభేరి, ఖడ్గవీరుడు, మర్మయోగి, బాలరాజు కథ, సుగుణసుందరి కథ, మహాబలుడు, రాజకోట రహస్యం.
డిటెక్టివ్ చిత్రాలు: గూఢచారి 116, సర్కార్ ఎక్స్‌ప్రెస్, పగ సాధిస్తా, దొరికితే దొంగలు, ఇద్దరు మొనగాళ్ళు, టక్కరి దొంగ చక్కని చుక్క, యమలోకపు గూఢచారి.
బాపు-రమణలతో అనుబంధం అధికం - వారి చిత్రాల్లో శ్రీరామునిపై పాటలు, ఆంజనేయునిపై మాటలు వ్రాశారు. ఉదా: సాక్షి, సంపూర్ణ రామాయణం, గోరంత దీపం, భక్తకన్నప్ప, పెళ్లిపుస్తకం.
హీరో కృష్ణ చలనచిత్రాలకు ఎక్కువగా వ్రాసినట్లు తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వరరావుగారంటే అభిమానం. 1947 సం.నుండి 1998 సం.వరకు అవిరామంగా తనకలం పరువులెత్తించి, తెలుగువారి హృదయాలలో నిలిచిపోయారు.
తెలుగు సినిమా వెండి తెరకు పాటలు, మాటలు పూల కొమ్మకు
english title:
telugu cinema songs
Date:
Friday, October 26, 2012