Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రండ్రండి... వారసులొచ్చారోచ్ ...!

$
0
0

అవును. ఆల్రెడీ సినిమాల్లోకి ‘నట’ వారసులొచ్చేసారు! మరి మీ వాయింసేంటి? అనుకుంటున్నారా? ఆగండాగండి. మీరక్కడే ‘రీలు’లో ‘వేలు’ పెట్టేసినట్టు! మీరు మరీనూ...! ‘పాత చింతకాయ పచ్చడి’ తోనే సరిపెట్టేసుకుంటే ఎట్లా? ‘కొత్తావకాయ’ రుచులు చూడొద్దూ?! ఏంటండీ మీరొట్టి పప్పుసుద్దల్లా ఉన్నారు. కాలం మారింది కదండీ! పిజ్జాలు, బర్గర్లు నమిలేద్దాం రండ్రండి...! మీ సొమ్మేం పోయింది? టేస్ట్ చూడ్డమేగా? చూసేయండి...!
‘నట’ వారసులెందరో వచ్చారు నిజమే! (రాబోయే రోజుల్లోనూ ఈ వలస వచ్చేస్తుంది !) కానీ ఈ సినీ వారసులు తమ తమ వారి అలవాటి సినిమాలకు కూడా... ‘సినిమా’ వారసత్వపు పట్టా బిగించేసుకొని.... రాబోతున్నారు మరి. అద్గదీ కొత్త పాయింట్!
‘లవకుశులు’ అప్పుడే ‘శ్రీరామరాజ్యం’లోకి దిగిపోయారుగా! అంటే ‘రామారావు’ గారి వారసుడిగా ‘బాలకృష్ణ’, తండ్రి సినిమాని ఈ కాలం కుర్రాళ్ళకోసమంటూ మళ్లీ తీసేసాడు. ఫ్యూచర్‌లో ‘నర్తనశాల’ తీసి, చూసే భాగ్యం కూడా ప్రేక్షకులకి కల్పిస్తానని అభిమానులకు హామీ ఇచ్చేసాడు. అన్నీ బాలకృష్ణే తీసేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గతేం కాను, అందుకే ముందుచూపుతో అబ్బాయికోసం ఈ బాబాయ్ వదిలిపెట్టేసాడు.
జూనియర్ కోసం ‘పాతాళభైరవి’ రెడీ చేసేస్తానని ‘రాజవౌళి’ అన్నట్టో వార్త అప్పట్లో గుప్పుమంది. ఇదే జూనియర్ ‘గుండమ్మకథ’ని ఒప్పుకుంటే నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటాననే న్యూస్ బాహాటంగానే పేపర్లో మారుమ్రోగింది. ఇవే కావు. మిగతా నందమూరి ప్రస్తుత వారసులు కళ్యాణ్‌రామ్, తారకరత్నం (నందీశ్వరుడు ఫేం) వంటి వాళ్ళు చేయడానికి కూడా పాత ఎన్టీఆర్ సినిమాలు బోలెడున్నాయి. మల్లీశ్వరి, పాండవ వనవాసం, దేవత, రక్తసంబంధం, గులేబకావళి కథ లాంటి బ్లాక్ బస్టర్‌లున్నాయి. ఆ మధ్యే బాలకృష్ణతో ‘పాండురంగ మహాత్మ్యం’ కూడా వచ్చేసిందిగా! కాబట్టి ప్రేక్షకులు మీరేం బెంగెట్టుకోకండి! బాలకృష్ణ గారబ్బాయి మోక్షజ్ఞకి కూడా ఫ్యూచర్‌లో లోటేం లేదు. తన తండ్రి సినిమాలు ముద్దుల మావయ్య, మంగమ్మగారి మనవడు, భైరవద్వీపం, ఆదిత్య 369, నరసింహనాయుడు... ఓ బోలెడున్నాయి.
‘నాగేశ్వరరావు’ సినిమాలు చేయడానికి ‘నాగార్జున’ సిద్ధపడడం లేదు గానీ గతంలోనే ‘మూగమనసులు’ని రాఘవేంద్రరావు ‘జానకీరాముడు’ని చేసేసాడు. నాగార్జున సినిమా ‘మజ్నూ’ ప్రారంభోత్సవ సమయంలో ‘నాగార్జునతో ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ తీస్తా!’నని దాసరి తెగ ఊదేసాడు. ఆ న్యూసెప్పుడో ఆరి, ఆవిరైపోయిందనుకోండి! ఇక రచయిత భారవి నాగార్జునకోసం ‘విప్రనారాయణ’ని మళ్ళీ వండానని అన్నాడప్పట్లో. మరి అప్పుడే ‘నాగచైతన్య’ వచ్చేసాడు. అలాగే రేపటి ‘అఖిల్’ (నాగార్జున రెండవ తనయుడు) కోసం కూడా ఏం చేద్దాం? ఓ పని చేద్దాం! దసరాబుల్లోడు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, దేవదాసులని... నాగచైతన్య, అఖిల్‌కి పంచేద్దాం. వారసులు కదా సినిమా పంపకాల్లో తేడాలు రావొద్దు! అన్నమయ్య, శ్రీరామదాసు, శివ, నినే్న పెళ్ళాడతాల్ని ఇచ్చేద్దాం.. పంపకాలే కదా! మరి సుమంత్, సుశాంత్‌ల కేవీ అంటారా? పాపం ప్రేక్షకులేమీ ఆశపడ్డం లేదు లెండి. వదిలేద్దాం.
‘బిజినెస్‌మేన్’ ఆడియో లాంచింగ్‌లో రాజవౌళి తెగ ఊదరగొట్టేసాడు. ‘మహేశ్‌తో తప్పక సినిమా తీస్తా! అల్లూరినో, గూఢచారి 116 లాంటివో ప్లానేస్తా!’’ అని. అది వింటూ ‘మహేశ్’ ముసిముసి నవ్వులు నవ్వేసాడు. అంటే ఆయనకి ఇంట్రస్ట్ ఉందన్న మాటేగా! సో ‘కృష్ణ’ వారసుడిగా ఆయనకీ లెక్క సరిపోయింది. రాబోయే మహేశ్ కొడుక్కి ‘గౌతమ్’కి కూడా మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు లాంటివి ఎన్నో ఉంటాయిగా!
ఇక ‘చిరంజీవి’ వారసుడు ‘రామ్‌చరణ్’ని ‘ఖైదీ’గా చూపించాలని, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో నటింపచేయాలని కొందరు నిర్మాతలు ఉబలాటపడుతున్నారని వార్త ‘రాంగ్‌టోన్ కోడై’ కూసిందా! ఇంకా పున్నమినాగు, ఘరానా మొగుడు, ముఠామేస్ర్తీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడులున్నాయిగా! ఫర్వాలేదు.
రామ్‌చరణ్‌తో లాగించేయచ్చు! మరి పవన్ మాటేంటంటారా? పాయింటే! అప్పట్లో ‘నా నట వారసుడు మా అబ్బాయి చరణ్’ అని చిరంజీవి అన్నట్టు గుర్తు. చికొచ్చిపడిందే! పోనీలెండి. ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారుగా! పవన్‌ని పక్కన పెట్టేద్దాంలెండి. కానీ పవన్‌కో వారసుడున్నాడుగా! బద్రి, ఖుషీ, తొలిప్రేమ, తమ్ముడు తదితరాల్ని ఆ కుర్రాడికి రేపటికోసం పంచేద్దాం. అప్పటికవి మళ్లీ ఫ్రెష్‌గా ఉంటాయిగా!
‘వెంకటేశ్’ తర్వాత ఆ కుటుంబం నుండొచ్చిన ‘రానా’, అప్పుడే ఉత్సాహపడుతున్నాడు. బాబాయ్ ‘బొబ్బిలిరాజా’ని నే చేస్తానంటూ! వెంకటేశ్‌కి కూడా ఇబ్బందేం లేదుకదా! ఆయన కూడా అన్నగారబ్బాయి చేస్తే చూడాలని సరదా పడుతున్నాడు. ఇంతటితో ఫుల్‌స్టాప్ పెడితే ఓకే! లేకపోతే అర్జున్ (వెంకటేశ్ గారబ్బాయి) అలిగిపోడూ? అందుకే ఆ కుర్రాడికి ఓ చంటిని, రాజాని, పవిత్రబంధాన్ని, రాబోయే ‘వివేకానంద’ని వదిలేద్దాం. సర్దుకుపోతాడు.
ఇవండీ ఫ్రెష్ ఫ్రెష్ ముచ్చట్లు.
మంచి మంచి కథల్లేవంటూ డైరెక్టర్లు తెగ బాధపడి పోతుంటేనూ! ఇంకేం కొత్త కథలు రాయమంటారని రైటర్లు వాపోతుంటేనూ...! ప్రేక్షకులుగా మీకూ ‘బాదే’స్తోంది కదూ? మరి మనం ఖుషీగా ఉండాలంటే ఇలాంటిలాంటి ఉచిత సలహాలు సినిమా వాళ్ళకిచ్చేయాల్సిందేగా!
ఇంకేం!
నిర్మాతలూ రండ్రండి... పాత సినిమా రీళ్ళు బయటకు లా....గండి! కొత్త స్క్రిప్ట్‌లతో తోమించేసి తళతళ మన్పించండి.
వ్యాపారం కదా! నాణ్యమైనది అందిస్తే... నిర్మాతలుగా మీకు, ప్రేక్షకులకు లాభం! లేదంటే... ప్రేక్షకులకి తల నొప్పి, మీ జేబుకి నొప్పి...!

అవును. ఆల్రెడీ సినిమాల్లోకి ‘నట’ వారసులొచ్చేసారు
english title: 
vaarasulu
author: 
- ఎనుగంటి వేణుగోపాల్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>