సూర్య, కాజల్ జంటగా వచ్చిన ‘బ్రదర్స్’ సైంటిఫిక్ ప్రయోగాత్మక చిత్రంగా బావుంది. కాజల్ 100% హీరోయిన్ అనే పాత్రలో జీవించింది. కె.వి.ఆనంద్ దర్శకత్వ ప్రతిభ బాగుంది. అవిభక్త కవలలుగా సూర్య (విమల్, అఖిల్) పాత్రల్లో ఒదిగిపోయాడు. పీటర్ హెయిన్స్ స్టంట్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటల చిత్రీకరణ, అందమైన లొకేషన్లలో బాగున్నాయి. సినిమాలో విమల్ క్యారక్టర్‌ను ఇంటర్వెల్‌లో ముగించడం ఒక్కటే సినిమాకు పెద్ద మైనస్. మిగతా అన్ని అంశాల్లో మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలిగింది. సినిమాలోని పాత్రలు వేటికి అవే సహజంగా ఉన్నాయి.
- బి.కృష్ణమాచారి, హైద్రాబాద్
విషం చిమ్ముతున్నారు
సినిమాతో సదరు వ్యక్తులు ప్రేక్షకుల మనసుల మీద విషం చిమ్ముతున్నారు. సినిమాలు ఏనాడో భ్రష్టుపట్టిపోయాయి. ఇంకా ఏదో ఉందని ఆశించి వెళ్ళటం మన భ్రమ. ఆ వరుసలో ‘బ్రదర్స్’ ఒకటి.
- జి.మురళీకృష్ణ, రేపల్లె
ప్రేక్షకులు ఆలోచించాలి!
సినీ నిర్మాతలకు, దర్శకులపై ‘బండ్ల’కొద్దీ అభిమానం పొంగి పొరలితే ఎవరికీ అభ్యంతరం వుండదు కానీ, 39 లక్షల రూపాయల ఖర్చుతో సిగరెట్ లైటర్ కొనిచ్చిన వార్తలు ప్రేక్షకులు ఆలోచన చేయవలసిన అవసరాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మనం వినోదంకోసం పెట్టిన ఖర్చుతో వారికి మిగిలిన సొమ్ము ఇలా దుబారా అవడంతోనైనా కాసింత మనకున్న మెదడుకు పదునుపెట్టవలసి వుంది. ‘పూరీ’ముక్కకోసం అలమటించే వారిని గూర్చి ఆలోచించవచ్చు.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్
అమూల్యమైన వ్యాసాన్ని అందించారు
12.10.2012వ తేదీ వెన్నెలలో ఫ్లాష్‌బ్యాక్ శీర్షికన సి.నారాయణరెడ్డిగారి సినీ స్వర్ణోత్సవంలో ఎన్ని సినిమాలకు పాటలు వ్రాసింది, ఆయనను గురించి అమూల్యమైన వ్యాసాన్ని పాఠకులకు అందించిన సి.వి.ఆర్.మాణిక్యేశ్వరిగారికి హృదయ పూర్వక ధన్యవాదములు. ‘గుళేబకావళి కథ’కు వ్రాసిన పాటలన్నీ రాగరంజితంగా, సాహిత్య కుసుమాలుగా వెదజల్లబడినవి. అందులో ‘నన్నుదోచుకుందువటే వనె్నల దొరసాని’ పాట ఈరోజుల్లో కూడా పాపులర్ అయిందంటే అతిశయోక్తికాదు. ‘ఆత్మబంధువు’ సినిమాలోని నాలుగు పాటలు సాహిత్యానికి విలువకట్టలేము. చిన్న పిల్లలకు కథలు చెప్పినప్పుడు అనగనగా! అని మొదలుపెట్టడం ఆనవాయితీ. ఆత్మబంధువులో ‘అనగనగా ఒకరాజు అనగనగా ఒక రాణి’ అనే పాటతో మొదలవుతుంది. ‘ఏది చదివి పక్షులు పైకి ఎగురగలిగెను, ఏ చదువువల్ల చేప పిల్ల ఈదగలిగెను..’ పాటకు సాహిత్య గుబాళింపుతోడై సత్యాన్ని చాటి చెప్పింది. యాభై వసంతాల రచయితగా ఇంకా కొనసాగాలని కోరుకుందాం.
- మార్కస్ మణిరాజ్, ముద్దనూరు
బకెట్టు తంతున్న పాపులర్ డైరెక్టర్ల సినిమాలు
తెలుగు సినిమా రంగంలో యువ డైరెక్టర్ల సీజన్ హాట్‌గా నడుస్తున్నది. సినిమా చెయ్యడానికి వారు ఒప్పుకుంటే చాలు, వారి డిమాండుకి అంగీకరిస్తూ కోరిన హీరోగారి కాల్‌షీట్లు చేతిలోపెట్టి సినిమాలు తియ్యడానికి నిర్మాతలు వీరి ఇళ్లముందు క్యూ కడుతున్నారు. ఈ డైరెక్టర్లు అంతవరకు సందించుకున్న మంచి పేరును పక్కనపెట్టి, ఇంకా ఇమేజిని పెంచుకోవాలని మగధీర, గబ్బర్‌సింగ్, పోకిరీల రికార్డులను అధిగమించిన క్రేజీలు సృష్టిస్తున్నారు. కొందరు దర్శకుల అదృష్టం బాగుండి హీరో డైరెక్టర్లు కాంబినేషన్లుకి మోజుపడి, 50, 60 కోట్లుకి రీళ్లు అమ్ముడుపోయి, అదే టార్గెట్లును మించి వసూళ్లు రాబట్టుకుంటున్నారు. కాని తీసిన అన్నింటికీ ఈ రిటర్నులు లేక, పంపిణీదార్లు, ప్రదర్శకులు లబోదిబోమంటున్నారు. శలవులు, పండుగల సీజన్లులో వచ్చే పదింట్లో ఏడు బొమ్మలైనా ఏడిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకి 10 కోట్లుకి పైగా డిమాండ్ చేస్తున్న పాపులర్ డైరెక్టర్లు, తీసిన ప్రతిదీ వంద కోట్లు గ్యారంటీ అని నిర్మాతల్ని, పైనాన్సియర్లనూ చెట్టెక్కించకూడదు. ఎన్ని లక్షల మంది ఒక హీరోగారికి వీరాభిమానులు వున్నా బాగుండని సినిమాని 3 వారాలుకి మించి థియేటర్లు వోనర్లు నిలపలేరు. హీరోకి వున్న గొప్ప ఫాలోయింగుని దృష్టిలో పెట్టుకొని, కథ, కథనంలో కొత్తదనం, వాస్తవికత లేకుండా కొన్ని పిడికట్టు పంచ్ డైలాగులు, ఫైట్లు, విదేశాల్లో ఆ భామలతో పాటలు తెరకెక్కించితే భారీ బడ్జెట్ తప్ప సినిమా బకెట్టు తనే్నయడం ఖాయం అని ఎన్నో నిరూపించాయి.
- తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, విశాఖపట్నం
నవరాత్రితో ప్రారంభం
12-10-12న ఒక పాఠకుడు వ్రాసిన లేఖలో (పి.ఏ.పి వారి నాల్గవ చిత్రం) ‘కులగోత్రాలు’ తరువాత పి.ఏ.పి వారు నిర్మించిన చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించినట్లు పేర్కొన్నారు. కాని పునర్జన్మ (1963) మరియు మనుష్యులు -మమతలు (1965) ప్రత్యగాత్మ దర్శకత్వంలో నిర్మించిన తరువాత 1966లో తీసిన నవరాత్రి చిత్రంతో దర్శకుడిగా తాతినేని రామారావు సినీ జీవితంలో మలుపు తిరిగింది అని గమనించాలి.
- పులకేశి, హైదరాబాద్
ఓ భారీ ఫ్లాప్
ఎన్నో రోజులుగా ఊరించిన లారెన్స్ ‘రెబల్’ తీరా విడుదలయ్యాక ఉస్సురోమనిపించింది. ఈ సినిమాకు ‘రెబల్’ అని కాక ‘స్టీఫెన్ రాబర్ట్’ పేరు పెట్టి ఉంటే బావుండేది అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం స్టీఫెన్ రాబర్ట్ పేరుతోనే సినిమా మొత్తం సాగింది. తమన్నా బాగా నటించింది. దీక్షాసేథ్ పర్వాలేదు. బ్రహ్మనందం, కోవై సరళల కామెడీ ఓ మాదిరిగా వుంది. బ్రహ్మానందం ప్రభాస్‌తో ఆటలాడుకున్నాడు. కృష్ణంరాజు వేషధారణ ఆహార్యం, నప్పలేదు. కృష్ణంరాజు భూపతిగా రౌద్ర రసాన్ని కురిపించాడు. ప్రభాస్, అలీల నృత్య, గాన ప్రదర్శన ఓ ప్రహసనంలా మారింది. పాటల్లో ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. దర్శకుడు లారెన్స్ తన తమిళ మార్కుని చూపించాడు. రామ్‌లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ చాలా బావున్నాయి. మొత్తానికి ప్రభాస్ చిత్రాలలో ఒక భారీ ప్లాప్ మిగిలిపోయింది.
- జి.గౌరీగాయత్రి, హైదరాబాద్
‘రెబల్’ పర్వాలేదు
ప్రభాస్, తమన్నాలు జంటగా నటించిన ‘రెబల్’ చిత్రం పర్వాలేదు. హీరో ప్రభాస్ నటన బావుంది. ప్రభాస్ మేనరిజం భలే బావుంది. అలాగే తమన్నా కూడా అద్భుతంగా నటించింది. లారెన్స్ దర్శకత్వ ప్రతిభ అంతగా కన్పించలేదు. సంగీతం కూడా యావరేజ్‌గానే వుంది. ఏదిఏమైనా హీరోగా ‘ప్రభాస్ టాప్’ చక్కని ఫిజిక్ కుటుంబ కథాచిత్రాలకు కూడా అమరిపోతాడు. ఆయన మంచి ‘నేటి రెబల్‌స్టార్’ అవుతాడనటంలో మాత్రం సందేహం లేదు. సరైన డైరెక్టర్ చేతిలో పడితే ‘బంపర్ హిట్’ చిత్రాలు వస్తాయి.
- ఈ.వేమన, శ్రీకాకుళం
శేఖర్ దర్శకత్వం ఎప్పుడూ బ్యూటిఫుల్
శేఖర్ కమ్ముల ఏ సినిమాతీసినా అది తన సినిమాగా గుర్తింపు పొందుతుంది. సినిమా ఆసాంతం హాయిగా సాగుతుంది. నటీనటులనుండి మంచి నటన రాబట్టుకుంటాడు. నాగరాజు పాత్ర బాగుంది. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ‘అటుఇటు’ అమ్మా...పాటలు బాగున్నాయి. అమ్మతనం గురించి బాగా చెప్పాడు. తెలుగు గురించి ఉపన్యాసంలో చిట్టితో చెప్పించినప్పుడు మరి ఈ సినిమాకి ఇంగ్లీషు పేరు ఎందుకు పెట్టినట్టు... ‘బి’బ్లాక్‌లో ఈ నలుగురే కాకుండా ఇంకా యువకులు లేరా? బి బ్లాక్ గ్రూపును పదిపదిహేను మందినయినా పెట్టి ఈ నలుగురుని హైలెట్ చేయాల్సింది. గణేష్ ఉత్సవం సిటీలో అంత పేలవంగా చేస్తారంటే నమ్మబుద్ధికాదు. అంజలాఝవేరి, మెయిన్ హీరో పెద్ద చెల్లెలి పాత్ర లేకున్నా ఏమీకాదు. శ్రీయ బి బ్లాక్ అబ్బాయి లవ్వు ఫిజికల్‌గా కుదరలేదు.
- బి.రాజు, హైదరాబాద్
కాంజీ వర్సెస్ గాడ్
‘ఓ మైగాడ్!’ ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఓ మంచి హిందీ సినిమాను చూడగలిగాము. చక్కటి సింపుల్ కథ భగవంతునికి మరియు ఓ సామాన్య నాస్తికుని మధ్య జరిగే సంఘర్షణనే ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. పరేష్‌రావల్ ఓ నాస్తికుడిగాను కాంజీ- భాయ్‌గాను, అక్షయ్‌కుమార్ కన్నయ గాను అద్భుతంగా సింపుల్‌గా నటించారు. ఈ సినిమాకు ప్రాణం డైలాగ్సే. కోర్టుసీన్లు చూడదగ్గవి. సోనాక్షిసిన్హా, ప్రభుదేవాల డాన్స్ పాట ఈ సినిమాకు హైలెట్. అందరూ చూడదగ్గ సినిమా ఓమైగాడ్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బావుంటుంది. కాంజీ భాయ్ పాత్రకు మోహన్‌బాబు సరిగ్గా ఫిట్ అవుతాడు. కన్నయ్యగా బాలకృష్ణను తీసుకుంటే బావుంటుంది. బాలకృష్ణ మీసాలు లేకుండా నటిస్తే కొత్తదనం కన్పిస్తుంది.
- మహమ్మద్ యూసుఫ్, కాజీపేట
అనుబంధాల విలువను తెలియజేసింది
నేడు వస్తున్న అప్రయోజక, అశ్లీల, అసభ్యతా చిత్రాల నడుమ ఏమాత్రం అశ్లీలత లేకుండా, ఒక సత్ప్రయోజనంతో విడుదలైన చిత్రం ‘ఓనమాలు’. పోటీ ప్రపంచంలో ఒకరికి ఒకరు ఏమీకాకుండా పోతున్న మనకు అనుబంధాల విలువను తెలియజేసిన చిత్రం ‘ఓనమాలు’. మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాల్ని ఎన్నటికీ మరువకూడదని హితబోధ చేసిన చిత్రం ‘ఓనమాలు’. మొత్తంమీద చూస్తున్నంతసేపు దీనంగా చూస్తున్న కన్నతల్లి లాంటి సొంత ఊరుని గుర్తుకుతెచ్చిన చిత్రరాజం ‘ఓనమాలు.’
- శ్రీరామ్, అనంతపురం
గీత దాటిన తెలుగు సినిమా!
ప్రస్తుతం తెలుగు సినిమా దశాబ్దాల క్రితం తనకుతానుగా సృష్టించుకున్న సరిహద్దులు దాటుతుంది. దశాబ్దం క్రితం తెలుగు సినిమా అంటే ఒక అందమైన హీరో, ఒక అందమైన హీరోయిన్, ఐదు వినసొంపైన డ్యూయెట్స్, ఒకింత సెంటిమెంట్ మరియు హాస్యం. వీటన్నింటి కలబోతతో సకుటుంబ సమేతంగా చూడదగ్గట్లుగా ఉండేది. కానీ నేడు కాలం మారింది. ఆ సరిహద్దులు, గీసుకున్న గీతలని తెలుగు సినిమా ప్రస్తుతం దాటేసింది.
క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక నటుల అభినయానికి ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. డ్యాన్సులు, ఫైట్లని టెక్నాలజీ సహాయంతో అద్భుతంగా చూపించగల పరిజ్ఞానం నేడు అందుబాటులోకి వచ్చింది. హీరోగారు కాలు కదపకుండానే వంద మందిని కొట్టినట్లుగా చూపించవచ్చు. ఈ విధమైన మార్పులు వచ్చాక కథని టెక్నాలజీ డామినేట్ చేయడం ప్రారంభమైంది. వీటి పర్యవసానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. సంవత్సరానికి తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ల సంఖ్య సింగిల్ డిజిట్ దాటలేకపోతున్నాయి. అయినప్పటికీ సరిక్రొత్త ట్రెండ్‌లు సంతరించుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈగలకు, దోమలకు కూడా హీరోలని మించిన స్టామినాను కల్పించారు మన తెలుగు సినీ పండితులు. ఇలాంటి క్రొత్త పోకడ నిజంగా ఆహ్వానించదగిందే. సరిక్రొత్త ప్రేమకథలు, విభిన్నత సంతరించుకున్న సస్పెన్స్ సినిమాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ విషయంలో మనం బాలీవుడ్ కంటే ముందంజలో ఉన్నాం. బాలీవుడ్ చూపు మనవైపు తిప్పుకునేలా చేయగలిగాం. మూసధోరణిలో సాగిపోతున్న తెలుగు సినిమా అనేకరకాల ట్విస్టులతో ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేసే దిశగా పరుగులు తీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు ప్రేక్షకులు విశాల హృదయంగలవారు. ఎందుకంటే విభిన్నతరహా కథ, కథనం ఉంటే స్టార్స్‌తో పనిలేకుండా తమ హృదయానికి హత్తుకొని ఆదరిస్తారు. అలాగని కుప్పిగంతులతో రీళ్లుచుట్టేస్తే మాత్రం బాక్సుల్ని మొదటి ఆటకే తిప్పి పంపిస్తారు. కథ, కథనాన్ని మరియు సినిమా ప్రాథమిక సూత్రాలని టెక్నాలజీ డామినేట్ చేస్తే మాత్రం మన ప్రేక్షకుడు నిర్ద్వందంగా తిప్పికొట్టాడు. టెక్నాలజీ, కథ సమపాళ్ళుగా ఉన్న ‘అరుంధతి’సినిమాను మనవారు అందలం ఎక్కించారు. అదే విధంగా ఈమధ్యన వచ్చిన ‘ఈగ’సినిమాను తీసుకుంటే, ఇందులో కథనం, సాంకేతిక పరిజ్ఞానం బ్యాలెన్స్‌డ్‌గా ఉండటంతో విజయం సాధించింది. ఈ రెండు ఉదాహరణలు చాలు సినిమాకు ఈరోజుల్లో కూడా టెక్నాలజీతోపాటు కథ, కథనం చాలా అవసరం అని నిరూపించడానికి. ఏది ఏమైనప్పటికీ తెలుగు సినిమా తానుగీసుకున్న లక్ష్మణరేఖనుదాటి క్రొత్త పుంతలు తొక్కడం శుభపరిణామం. అద్భుతమైన కథాకథనాలతో మన సినిమా హాలీవుడ్ స్థాయిలో వెలిగిపోవడం భవిష్యత్తులో అసాధ్యం మాత్రం కాదు.
- తీగల వేణు, గొల్లపల్లి
తారుమారు అయిన హీరోయిన్స్!
1955 సంవత్సరంలో విడుదల అయిన మిస్సమ్మ (విజయావారి) చిత్రంలో మొదట భానుమతిని ఎంపిక చేసి, కొంత సినిమా తీసిన తర్వాత చక్రపాణిగారికి భానుమతిగారికి మనస్పర్ధలు కారణంగా సావిత్రిని ఏర్పాటుచేసారు. సావిత్రి వేషధారణ, జమునగారు నటించారు. భానుమతి వేషధారణ సావిత్రికి లభించింది. అఖండ విజయం సాధించింది మిస్సమ్మ!
- కోవూరి వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
==================
‘మీ వ్యూస్’కు
మీ అభిప్రాయాలను పంపవలసిన
మా చిరునామా : ఎడిటర్, వెన్నెల,
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ ,
సికిందరాబాద్- 500003