న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఇకపై టీచర్లు తరగతి గదిలో పిల్లలను కఠిన దండనలకు గురిచేసినా లేక తాము సూచించిన దుకాణంలోనే పుస్తకాలు, యూనిఫామ్‌లు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాలని పిల్లల్ని బలవంత పెట్టినా ఏడాదినుంచి మూడేళ్ల వరకూ జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేయడం కోసం రూపొందించిన ముసాయిదా బిల్లులో ఈమేరకు నిబంధనలు చేరుస్తున్నారు. అంతేకాకుండా ఏ తరగతిలోనైనా అడ్మిషన్ల సమయంలో పాఠశాలలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా క్యాపిటేషన్ ఫీజు తీసుకోవడం లేదా డొనేషన్లు డిమాండ్ చేయడంకానీ చేయరాదని ‘పాఠశాలల్లో అనైతిక పద్ధతుల నిరోధక బిల్లు-2012’ స్పష్టం చేస్తోంది. అలాగే హెచ్‌ఐవి, ఎయిడ్స్‌లాంటి తీవ్రమైన వ్యాధులున్నట్టు నిర్ధారణ అయిన ఏ విద్యార్థిని కానీ పాఠశాలలో చేర్చుకోకపోవడం, లేదా బహిష్కరించడం చేయరాదని కూడా బిల్లు స్పష్టంగా పేర్కొంటోంది. వచ్చే నెల 1న ఇక్కడ జరగనున్న కేంద్రీయ విద్యా సలహా మండలి (సిఏబిఇ) సమావేశం ముందుకు ఈ ముసాయిదా బిల్లు రానుంది. చదువులో వెనుకబడ్డారన్న కారణంగా పిల్లలను స్కూలు నుంచి పంపించేయడం, మళ్లీ అదే తరగతిలో కొనసాగించడం కానీ చేయడానికి వీల్లేదని కూడా బిల్లులో నిర్దేశించారు. పాఠశాలల్లో అనైతిక విధానాల పట్ల ఇటీవల ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా రావడంతో ఈ ముసాయిదా బిల్లును రూపొందిస్తున్నారు. ఆరు, తొమ్మిది, పదో తరగతిలో అడ్మిషన్లను పరీక్షల ద్వారా జరపాలని కూడా బిల్లులో సిఫార్సు చేశారు.
ముసాయిదా బిల్లులో ప్రతిపాదన
english title:
v
Date:
Monday, October 29, 2012