న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఆలస్యమైనా అనుభవానికి, కొత్తదనానికి పట్టంగట్టే దీటైన మంత్రివర్గాన్ని ప్రధాని మన్మోహన్ ఏర్పాటు చేశారు. తాజా పునర్వ్యవస్థీకరణ 17మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడంతోపాటు, ఆయా శాఖల ప్రాధాన్యతలను బట్టి అనుభవానికి పెద్దపీట వేసింది. అయితే, కొత్తవారిలో ఆశలు, పదోన్నతులు ఆశించిన వారిలో నిరాశ ఈ పునర్వ్యవస్థీకరణలో కొట్టొచ్చినట్టు కనిపించాయి. పాతకొత్తల మేలు కలయికతో 2014 ఎన్నికల టీంను ప్రధాని మన్మోహన్ సిద్ధం చేసినట్టయ్యింది. 22మందికి ప్రాతినిథ్యం కల్పిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. వీరిలో ఏడుగురు కేబినెట్, ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన వారున్నారు. మిగిలిన వారంతా సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కెఆర్ రెహమాన్ ఖాన్, దిన్షాపటేల్, అజయ్ మాకెన్, ఎంఎం పల్లంరాజు, అశ్వనీకుమార్, హరీష్‌రావత్, చంద్రేష్‌కుమారీ కలోబ్ కేబినెట్ మంత్రులుగా నియమితులయ్యారు. మనీష్ తివారీ, చిరంజీవి స్వతంత్ర హోదాతో వ్యవహరించే సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కాగా శశిథరూర్, కె సురేష్, తారిఖ్ అన్వర్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాణినీరా, అధిర్‌రంజన్ చౌదరి, ఎహెచ్ ఖాన్‌చౌదరి, సర్వే సత్యనారాయణ, నిరాంగ్ ఇరింగ్, బలరామ్ నాయక్, కిల్లి కృపారాణి, లాల్ చంద్ కఠారియా సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వీరితోప్రమాణం చేయించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తదితరులు మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ముద్ర స్పష్టంగా కనిపించిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో యువతకే పెద్దపీట లభించింది. కొంతమంది సీనియర్లకు కేబినెట్ హోదా లభించగా, ఊహించినట్టే రెండు మూడు శాఖలు నిర్వహిస్తున్న వారి పనిభారం తగ్గిస్తూ శాఖల పంపిణీ జరిగింది. అత్యంత కీలకమైన విదేశాంగ శాఖ అవినీతి అభియోగాలు ఎదుర్కొంటోన్న న్యాయ శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు దక్కడం గమనార్హం. కెజి బేసిన్‌లో అవకతవలకు పాల్పడిన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌పై కొరడా ఝళిపించిన నేరానికి రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఎస్ జైపాల్‌రెడ్డి శాఖ మారిపోయింది. ఆయన శాఖ మారినప్పటికీ జైపాల్ స్థాయికి తగిన శాఖ లభిస్తుందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఏమాత్రం ప్రాధాన్యం లేని సైన్స్ అండ్ టెక్నాలాజీ శాఖకు ఆయన్ని బదిలీ చేశారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు పార్టీ, అటు ప్రభుత్వానికి కొత్తరూపం, ఊతం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మంత్రివర్గంలో చేరతారని జరిగిన ఊహాగానాలు గాలికి ఎగిరిపోయాయి. ఆయన పార్టీ వ్యవహరాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నందున ప్రభుత్వంలో చేరటానికి ఇష్టపడలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. యువతకు, అనుభవానికి ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గాన్ని తయారు చేసినట్టు ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చిట్టచివరి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కావచ్చునని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తమకు లభించిన పదవులతో రాష్ట్భ్రావృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతామని కేంద్ర కేబినెట్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులు హామీ ఇచ్చారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళకు కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని కిల్లి కృపారాణి అన్నారు. జిల్లా, రాష్ట్రానికి ఉపయోగపడే పథకాల అమలుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఫథకాలపై పూర్తి వివరాలను సేకరించి నెమ్మది నెమ్మదిగా కొన్నింటికైనా మోక్షం సాధించటానికి ప్రయత్నిస్తానని రైల్వే శాఖ సహాయ మంత్రిగా నియమితులైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలియచేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రహదారులు ఇతర ప్రాథమిక సదుపాయాల విస్తరణకు పాటుపడతానని బలరామ్ నాయక్ చెప్పారు. కాగా తనకున్న పాలనా అనుభవంతో రాష్ట్రానికి చెందిన రహదారుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు.
17 కొత్త ముఖాలు.. 22 మందితో ప్రమాణం చేయించిన ప్రణబ్ ఖుర్షీద్‌కు విదేశాంగ శాఖ మొయిలీ చేతికి పెట్రోలియం పల్లంరాజుకు మానవ వనరులు స్వతంత్ర హోదాతో చిరుకు టూరిజం ప్రాధాన్యం లేని పోస్టుకు జైపాల్ పురంధ్రీశ్వరికి దక్కని కేబినెట్ హోదా
english title:
b
Date:
Monday, October 29, 2012