న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కాంగ్రెస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం సాధ్యం కాదన్న విషయం ఆదివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో మరోసారి ధ్రువపడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు స్థానం లభిస్తుందని ఆశించి భంగపడిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, శనివారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. కెఎస్ రావు రాజీనామా చేసే సమయానికి విశాఖ ఎంపీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పురంధ్రీశ్వరి తనకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి వాణిజ్యం పరిశ్రమల శాఖకు మారుస్తున్నట్టు తెలియజేశారని మీడియాకు వెల్లడించారు. శాఖ మార్పును పదోన్నతిగా భావించి ఆమెకు కేబినెట్ హోదా లేదా స్వతంత్ర శాఖ దక్కవచ్చని అందరూ భావించారు. ఇదేక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎంఎం పల్లంరాజు స్వతంత్ర హోదా కలిగిన మంత్రి అవుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే శనివారం నాటి అంచనాలు తెల్లారేసరికి రివర్స్ అయ్యాయి. కావూరి ఎఫెక్ట్‌తో సీన్ మొత్తం మారింది. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితాలో పల్లంరాజు పేరు నాల్గవ స్థానంలో ఉంటే, పురంధ్రేశ్వరి పేరు కనిపించ లేదు. ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత ప్రధాని సలహామేరకు రాష్టప్రతి కేటాయించిన శాఖల జాబితాలో పురంధ్రీశ్వరి పేరు స్వతంత్య్ర హోదాలో వ్యవహరించే మంత్రుల జాబితాలోకాక ఎప్పటి మాదిరిగా సహాయ మంత్రుల జాబితాలోనే ఉంది. పురంధ్రీశ్వరికి పదోన్నతి దక్కాల్సిన సమయంలో ఆమె సామాజిక వర్గానికే చెందిన ఏలూరు ఎంపీ కెఎస్ రావు తన విధేయత, సీనియారిటీని హైకమాండ్ గుర్తించలేదని మనస్థాపానికి గురయ్యారు. మంత్రి పదవి ఇవ్వనందుకు ఆగ్రహించి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయటంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. సొంతవారిని విస్మరించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తారా? అంటూ కావూరి అన్యాపదేశంగా తెలుగుదేశం నుంచి ఫిరాయించిన రేణుకాచౌదరి, తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పురంధ్రీశ్వరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ మార్పునకు దారి తీసి ఉండొచ్చని అంటున్నారు. పల్లంరాజుకు కేబినెట్ హోదా ఇవ్వటం, బంజారా కులానికి చెందిన బలారామ్ నాయక్, వెనుకబడిన తరగతులకు చెందిన కిల్లి కృపారాణి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు చెందిన సూర్యప్రకాష్ రెడ్డి, చిరంజీవికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించటం ద్వారా తమకు దూరం అవుతున్న సామాజిక వర్గాలకు చేరువ కావటానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని చెప్పక తప్పదు.
పురంధ్రీశ్వరికి దక్కని కేబినెట్ హోదా అనూహ్యంగా పల్లంరాజు పరం
english title:
kavoori
Date:
Monday, October 29, 2012