తిరుచానూరు, అక్టోబర్ 30: రండి.. రారండి..! అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఇదే మా ఆహ్వానం! అంటూ టిటిడి మహిళా ఉద్యోగులు, స్థానిక ప్రజలే అమ్మవారి ప్రతినిధులుగా భక్తులకు ఆహ్వానం పలకనున్నారు. శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేసేందుకు ఇంటింటికి వెళ్లి స్థానిక మహిళలను బొట్టుపెట్టి ఆహ్వానించాలని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి వెంకట్రామిరెడ్డిదంపతులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో టిటిడి వినూత్నంగా తలపెట్టిన సౌభాగ్యం కార్యక్రమం మంగళవారం అంత్యంత మంగళప్రదంగా ప్రారంభమైంది. ‘సౌభాగ్యం’ పేరుతో నవంబర్ ఒకటవతేదీ నుండి ఆరవతేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అమ్మవారి ఆస్థాన మండపంలో టిటిడి మహిళా ఉద్యోగులు, పలువురు మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాభక్తులను ఉద్దేశించి టిటిడి తిరుపతి జెఇఓ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సౌభాగ్యకరమైన పసుపు, కుంకుమ, గాజులు తదితరాలను ఈనెల 1నుంచి 6 వరకు అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహిస్తామన్నారు. అలా పూజ చేయించిన ఆ వస్తువులను తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లోని మహిళలకు అందించి నవంబర్ 10వతేదీ నుండి 18వతేదీ వరకు జరిగే నవాహ్నిక అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.
రండి.. రారండి..! అమ్మవారి బ్రహ్మోత్సవాలకు
english title:
a
Date:
Wednesday, October 31, 2012