అమలాపురం, అక్టోబర్ 30: తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు సముద్రతీరంలో ఒఎన్‌జిసి బావి నుండి గ్యాస్ లీకేజీని అరికట్టే కార్యక్రమం విశాఖ తీరం నుండి జరుగుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన గూట్స్ అండ్ కూట్స్ సంస్థ ముంబై కేంద్రంగా చేసుకుని విశాఖ తీరం నుండి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఓడలరే తీరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒఎన్‌జిసికి చెందిన జి-1-9 బావి నుండి గ్యాస్ లీకవుతున్న విషయం తాజాగా వెలుగు చూసిన సంగతి విదితమే. ఈ ఏడాది ఆగస్టు 31 నుండి గ్యాస్ లీకవుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని సుమారు పది రోజుల అనంతరం ఒఎన్జీసీ గుర్తించినట్టు సమాచారం. రోజుకి సుమారు లక్ష క్యూబిక్‌మీటర్లు పైబడి గ్యాస్ నిరాటంకంగా లీకవుతోంది. దీనిని అదుపుచేయడానికి ఒఎన్‌జిసి సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుమారు 8 ఏళ్ల క్రితం ఓడలరేవు సముద్రగర్భంలో తవ్విన ఈ బావిలో అపారమైన గ్యాస్ నిల్వల్ని కనుగొన్న ఒఎన్‌జిసి అధికారులు డ్రిల్లింగ్ అనంతరం కేపింగ్ వేసి ఉంచారు. త్వరలోనే ఈ బావి నుండి గ్యాస్‌ను బయటికి తీయాల్సి ఉన్న తరుణంలో ఈ ఏడాది ఆగస్టు 31నుండి ఈ బావి నుండి అపరిమితంగా గ్యాస్ వీకవుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ బావి వద్ద లోతు 260 మీటర్లుగా ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ లీకవుతున్న ప్రదేశం బావికి చుట్టూ 50 మీటర్లు మేర విస్తరించి ఉండటంతో ఉద్ధృతంగా జరుగుతున్న లీకేజీని అదుపుచేయడానికి ఒఎన్‌జిసి క్రైసిస్ మేనేజిమెంట్ టీములు సర్వశక్తులు ఒడ్డాయి. రిలయన్స్, కెయిర్న్ ఎనర్జి సంస్థలు కూడా సహకరించాయి. అయితే ఫలితం లేకపోవడంతో ఆస్ట్రేలియాకు చెందిన గూట్స్ అండ్ కోట్స్ అనే సంస్థను సంప్రదించినట్టు సమాచారం. రంగంలోకి దిగిన ఈ సంస్థ ప్రతినిధులు ముంబై కేంద్రంగా విశాఖపట్నం తీరం నుండి సముద్రంలో పైపులైన్ల ద్వారా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. గ్యాస్‌తో పాటు లీకవుతున్న చమురు మూలంగా వచ్చే తెట్టు జలసంపదకు ముప్పు తెస్తుందని, పర్యావరణం దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు
english title:
gas
Date:
Wednesday, October 31, 2012