విశాఖపట్నం, నవంబర్ 3: దేశంలో ముందస్తు ఎన్నికలకు సంకేతాలు వస్తున్నాయని బిజెపి జాతీయ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ నగరంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుపిఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కనపడుతోందన్నారు. ఆలస్యమైన కొద్దీ మరిన్ని కుంభకోణాలు బయటపడి పార్టీ ప్రతిష్ఠ అడుగంటిపోతుందనే భయం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ధరలు మరింత అదుపు తప్పుతాయనే అనుమానాలతో మధ్యంతర ఎన్నికలకు యుపిఏ స్పష్టమైన సంకేతాలిస్తోందన్నారు. తృణమూల్ తప్పుకోగా, సమాజ్‌వాది పార్టీ దూరంగా ఉందని, యుపిఏలో ఉంటూనే ప్రతిపక్షాల బంద్‌కు డిఎంకె మద్దతు ఇచ్చిందన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మిత్రులు ఎంత వరకు నిలబడతారనే విషయం యుపిఏకు అగ్ని పరీక్షగా మారనుందన్నారు. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్’ ద్వారా జనాకర్షక పథకాలను ప్రకటించాలని చూస్తోందన్నారు. ఎన్నికలొస్తే కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. యుపిఏ మంత్రివర్గ విస్తరణకు మెరుగులు దిద్దినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సంకీర్ణ సర్కార్‌ను నడిపించే కాంగ్రెస్‌కు సత్తాలేదన్నారు. అవినీతి మంత్రులను ఇంటికి పంపుతారనుకుంటే అలాంటి వారిని మంత్రి వర్గ విస్తరణలో అందలం ఎక్కించారని ఎద్దేవా చేశారు. జైపాల్‌రెడ్డి విషయంలో కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందన్నారు. ఎల్‌పిజి సిలిండర్లు కుటుంబానికి ఆరు సరిపోతాయని దేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ చెబుతుంటే యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తొమ్మిది సిలిండర్ల అవసరాన్ని తెలియజేశారన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలను దృష్టిలోపెట్టుకునే ఈమె ఇటువంటి ప్రకటన చేస్తున్నారన్నారు. ఏ విషయంలోనూ స్పష్టత లేదని, జిమ్మిక్కులు చేస్తున్న ఈ ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అవసరాలు తీర్చే విశాఖలోని కెజిహెచ్‌ను నిమ్స్ తరహాలో పూర్తిస్థాయి వైద్య పరికరాలతో విస్తరించాలన్నారు. దేశ ప్రజలు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.
వెంకయ్యనాయుడు
english title:
venkaiah naidu
Date:
Sunday, November 4, 2012