కడప, నవంబర్ 3: కడప కేంద్ర కారాగారం విలాసాలకు అడ్డాగా మారుతోంది. శిక్ష పడిన పలువురు ఖైదీలు తమకున్న పలుకుబడి ద్వారా జైలులోనూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వారం రోజుల క్రితం జైలులో గంజాయి ప్యాకెట్లు లభించగా, శుక్రవారం మొద్దు శీను హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓంప్రకాష్ నుంచి ఏకంగా రెండు సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. వారం రోజుల క్రితం మూడు సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 సెల్‌ఫోన్లను అధికారులు ఖైదీల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2 కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. జైలులోని ఖైదీల నుంచి మద్యం, బిర్యానీ పొట్లాలు, గంజాయి, సెల్‌ఫోన్లను అధికారులు తరచూ స్వాధీనం చేసుకుంటున్నారు. జైలు సిబ్బంది సహకారం వల్లే ఖైదీలకు ఫోన్లు, గంజాయి అందుబాటులో ఉంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బంది, అధికారులను బదిలీ చేస్తున్నా వారి స్థానంలో వచ్చే కొత్తవారు సైతం అదే బాటలో నడుస్తుండడంతో ఖైదీల విలాసాలకు అడ్డులేకుండా పోతోంది. రాయలసీమ లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలు నేరాల్లో శిక్ష పడిన ఖైదీలను కడప కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు. ఖైదీలు శిక్ష కాలం ఇక్కడే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కడప జైలులోని ఖైదీలు బయటి కంటే లోపలే బాగుందని అంటున్నారు. గంజాయి పొట్లాలు ఎలా వచ్చాయో తమకు తెలియదని జైలు అధికారులు బుకాయించారు. ములాఖత్ సమయంలో ఓంప్రకాష్ బంధువులు అతనికి సెల్‌ఫోన్లు అందచేసి ఉంటారని, లేదా ప్రలోభాలకు లొంగి సిబ్బంది సరఫరా చేసి ఉండవచ్చని కారాగారం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు.
విలాసాలకు అడ్డాగా కడప జైలు
english title:
kadapa jail
Date:
Sunday, November 4, 2012