ఏ రైలు ఎక్కడుందన్న సమాచారాన్ని ఇక క్షణాల్లో తెలుసుకోవచ్చు. ముంబైలోని సబర్బన్ రైళ్లు తప్ప దేశ వ్యాప్తంగా సుమారు 9,700 ట్రైన్లకు సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలానికి అనుసంధానం చేసేలా ‘ట్రైన్‌ఎంక్వయిరీ డాట్‌కామ్’ను రైల్వే శాఖ తీర్చిదిద్దింది. ‘రైల్‌రాడార్ ట్రైన్ ఎంక్వయిరీ డాట్‌కామ్’ వ్యవస్థ కారణంగా దేశం మొత్తమీద ఏ రైలు ఎక్కడుందో మ్యాపులో చూసే అవకాశం లభిస్తోంది. ఇప్పటికే అన్ని రైళ్లకు సంబంధించిన రాకపోకల వివరాలను ఆన్‌లైన్ ద్వారా లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పొందే వీలుంది. ఇదిగాక, ఏ రైలు ఎక్కడుందని తెలుసుకునేందుకు (కొంకణ్ రైల్వే మినహా) మ్యాపులు ఎంతగానో సహకరిస్తాయి. సంబంధిత రైలు నిర్ణీత వేళల ప్రకారం నడుస్తున్నదా? లేక ఆలస్యంగా నడుస్తున్నదా? వంటి సమాచారం ఇచ్చేందుకు మ్యాపులో రంగుల్లో తగిన సంకేతాలు కనిపిస్తాయి.
ఎంపిక చేసిన ముఖ్యమైన రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు గతంలోనే ఎంక్వయిరీ విభాగం ప్రారంభించినప్పటికీ దానిని కాలానుగుణంగా ఆధునీకరిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు సమాచారం పంపే అవకాశాన్ని గత మేలో కల్పించారు. తాజాగా ‘రైల్ రాడార్’ వ్యవస్థతో మ్యాపుల్లో రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునే వీలు ఏర్పడింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక కొద్ది నెలల్లోనే దాదాపు కోటిమంది తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపారు. ప్రతి రోజూ కనీసం 3.5 లక్షల మంది వినియోగదారులు ‘ట్రైన్ ఎంక్వయిరీ డాట్ కామ్’, ‘రైల్ రాడార్’ వెబ్‌సైట్లను వాడుతున్నారు. దాదాపు 20 శాతం మంది సెల్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని పొందుతున్నారు. రైల్వే సమాచార వ్యవస్థను ఆధునీకరించేందుకు ‘రైల్ యాత్రి’ సంస్థ సహకారంతో ఈ వెబ్‌సైట్లను ఏర్పాటు చేశారు.
‘ట్రైన్ ఎంక్వయిరీ డాట్ కామ్’లో రైలు నెంబర్ లేదా రైలు పేరు లేదా రైల్వే స్టేషన్ల పేర్లను ఎంటర్ చేసి తగిన సమాచారాన్ని పొందవచ్చు. సంబంధిత రైలు ఏ స్టేషన్‌ను దాటింది? ఏ స్టేషన్‌ను చేరబోతోంది? ఆలస్యం వివరాలు, స్టేషన్ల మధ్య దూరం తదితర వివరాలను ఈ సైట్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది తెలుసుకుంటున్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఈ సమాచారాన్నంతా 139 నెంబర్‌కు మెసేజి పంపి తెలుసుకునే వీలుంది. ఇక, ‘రైల్ రాడార్’ వెబ్‌సైట్‌లో సంబంధిత ట్రైన్ ఎక్కడుందో మ్యాపుల ద్వారా తెలుసుకోవచ్చు. రైళ్ల రాకపోకలు, నిర్ణీత వేళలు, ఆలస్యానికి సంబంధించిన వివరాలు వంటి సమస్త సమాచారాన్ని మ్యాప్‌లపై కనిపించే రంగుల సంకేతాల మేరకు మనం అర్థం చేసుకోవచ్చు. ‘రైల్ రాడార్’కు ప్రజల నుంచి మన దేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తున్నట్లు సంబంధిత అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ప్రారంభించిన అనతికాలంలోనే ఇంతటి ఆదరణ లభించినందున, ఈ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేస్తామని వారు చెబుతున్నారు.
ఏ రైలు ఎక్కడుందన్న సమాచారాన్ని ఇక క్షణాల్లో తెలుసుకోవచ్చు.
english title:
mee
Date:
Tuesday, November 6, 2012