మన దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు పస్తులుంటూనే ఉన్నాడు. అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఎందుకు దాపురించాయనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల వివరాలతో ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన నేతాజీ సుభాష్ ఫౌండేషన్ నివేదికలను ప్రచురించింది. ఈ గణాంకాలన్నీ కూడా కాకిలెక్కలు కావనీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి సేకరించినవేననని ఈ సంస్థ చెబుతోంది.
1995 నుంచి 2010 మధ్యకాలంలో మన దేశంలో 2,56,913 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 40,126 మంది మహిళలు ఉన్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మన రాష్ట్రంలో ఇదే కాలంలో 31,120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 25,462మంది పురుషులు, 5658మంది స్ర్తిలు ఉన్నారు. మహారాష్టల్రో అత్యధికంగా 50,481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నాటకలో 35,053మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లో 26,722 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, లక్షద్వీప్‌లో మాత్రం ఈ కాలంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. హరిత విప్లవం పేరిట ఆధునిక వ్యవసాయ విధానాలను, రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచడం వలన నేడు ఈ పరిస్థితి తలెత్తిందా? అనేది మనం ఆలోచించాల్సిన విషయం. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయి. దిగుబడి ఎంత వస్తుందనేది అస్పష్టం. రాకూడని సమయంలో వాన వచ్చినా, రావాల్సిన సమయంలో రాకపోయినా కష్టమే. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని పండిస్తే, చేతికందిన పంటలకు తగిన రేటు వస్తుందనే హామీ లేదు. వీటికితోడు ఇటీవల జన్యుమార్పిడి పంటలు కొత్తగా ప్రారంభమయ్యాయి. వీటివలన మున్ముందు ఎటువంటి సమస్యలు వస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రైతులు కొత్త సమస్యలు వచ్చిపడితే తట్టుకోగలరా? అనేది సందేహాస్పదం. వ్యవసాయ రంగంలో ఆచి తూ చి మార్పులను ప్రవేశపెట్టడం శ్రేయస్కరం.
మన దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు.
english title:
raitanna
Date:
Tuesday, November 6, 2012