వినియోగదారుల రక్షణ (సవరణ) చట్టం 2002 ప్రకారం జిల్లా వినియోగదారుల రక్షణ సమితులను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. గతంలో ఏర్పాటు చేసిన జిల్లా సమితుల పదవీ కాలం డిసెంబర్ 2006లోనే ముగిసింది. అప్పటినుంచి జిల్లాలలో వినియోగదారుల రక్షణ సమితులు లేకుండా పోయాయి. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వినియోగదారుల రక్షణ సమితులను ఏర్పాటు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే సమితులు మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా ఈ సమితులు ఏర్పాటవుతాయి. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్, ఫుడ్ ఇన్స్‌పెక్టర్, ఎపిఎస్‌ఆర్‌టిసి రీజినల్ మేనేజర్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండెంట్ ఇంజనీర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ డి ప్యూటీ కమిషనర్, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ కమిషనర్‌లు అధికారిక సభ్యులుగా ఈ సమితిలో ఉంటారు. మరో పదిమంది అనధికార సభ్యులు కూడా ఉంటారు.
ప్రకటనల అనుమతికి
లంచం తీసుకుని...
కృష్ణా జిల్లాకు చెందిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. పెడన మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న ఎస్.రాంబాబు తన కార్యాలయంలో ఆరువేల రూపాయలను లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మున్సిపల్ విద్యుత్ స్తంభాలపై ప్రకటనల బోర్డులు ఉంచేందుకు అనుమతి ఇవ్వడం కోసం ఆయన లంచాన్ని డిమాండ్ చేసారు. ఆయన రెండు చేతుల వేళ్లు రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు ఇచ్చాయి. టేబుల్‌పైన వున్న ఫైలులో నుంచి లంచం మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ఉంది.
ఫిర్యాదుల కోసం డ్రాప్ బాక్స్‌లు
ముంబాయి నివాసితులు ఇకపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎక్కువ కష్టపడనవసరంలేదు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన డ్రాప్ బాక్సులలో తమ ఫిర్యాదులను వేసేయవచ్చు. డ్రాప్ బాక్స్‌ల ద్వారా పోలీసులు ఫిర్యాదులను స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టడం మన దేశంలో ఇదే మొదటిసారి. రైల్వే స్టేషన్లు, బస్‌డిపోలు, ప్రధానమైన బస్ స్టాండ్లు, ప్రార్ధనాలయాలు, ఎటిఎం సెంటర్లు, మల్టీప్లెక్స్‌లు వంటి పలు బహిరంగ ప్రదేశాలలో దాదాపు వేయి ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేస్తారు. మామూలు తెల్లకాగితంపై ఎవరైనా ఫిర్యాదులను రాసి ఈ డ్రాప్ బాక్సులలో వేయవచ్చు. బాక్సులను ప్రతిరోజూ తెరిచి ఫిర్యాదు లేఖలను సేకరించడం జరుగుతుంది. ఈ డ్రాప్ బాక్సుల ద్వారా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం ఇచ్చేవారికి ప్రత్యేకంగా బహుమతులను ఇచ్చేందుకు కూడా పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ డ్రాప్‌బాక్స్‌ల తాళాలు స్థానిక పోలీసుల వద్ద కాక స్పెషల్ బ్రాంచి పోలీసుల వద్ద ఉంటాయి. దీనివలన పోలీసు అధికారులకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను కూడా నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలు వుంటుంది.
నగరాల్లో 600 మిలియన్ల ప్రజలు!
మరో పది సంవత్సరాలలో దేశంలో నగర వాసుల జనాభా ఆరు వందల మిలియన్లను అధిగమించనుంది. 53 నగరాల్లో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉంటారు. ఈ పది సంవత్సరాల్లో నగర జనాభా అనూహ్యంగా అరవై రెట్లు పెరగనుంది. 2001వ సంవత్సరంలో 27.8 శాతంగా ఉన్న భారతీయ నగర జనాభా 2011వ సంవత్సరం నాటికి 31.16 శాతానికి పెరిగింది. 2010 నుంచి 2050 సంవత్సరాల మధ్య కాలంలో భారతీయ నగరాలలో అదనంగా 497 మిలియన్ల ప్రజలు పెరగనున్నారని యుఎస్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2050 సంవత్సరం నాటికి 6.3 బిలియన్ల నగర జనాభా ఉంటారని ఒక అంచనా. ప్రపంచం మొత్తం మీద 2010వ సంవత్సరం నాటికి 3.5 బిలియన్ల ప్రజలు నగరాల్లో నివశిస్తున్నారు. 2000వ సంవత్సరం నుంచి 2030 సంవత్సరం మధ్య కాలంలో నగర విస్తీర్ణం మూడు రెట్లు పెరుగుతుంది. కాగా, నగర జనాభా మాత్రం రెండింతలు పెరగనుంది.
సంప్రదాయ మత్స్యకారులకు రక్షణేది?
అంతర్జాతీయ సమాఖ్య అయిన ఇంటర్నేషనల్ కలెక్టివ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఫిష్ వర్కర్స్ (ఐసిఎస్‌ఎఫ్), వరల్డ్ ఫోరం ఆఫ్ ఫిషర్ పీపుల్స్ (డబ్ల్యుఎఫ్‌ఎఫ్‌పి) నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం (ఎన్‌ఎఫ్‌ఎఫ్)ల ఆధ్వర్యంలో సముద్ర ప్రాంతాల సంరక్షణా ప్రక్రియలు స్థానిక మత్స్యకారుల జీవితాలపై చూపుతున్న ప్రభావాలపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. సముద్ర, తీరప్రాంత సహజ వనరులను సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆ వనరులపై ఆధారపడిన చిన్న తరహా, సంప్రదాయక మత్స్యకారుల జీవనోపాధులను కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
‘అభివృద్ధి పేరుతో మత్స్యసంపదను నాశనం చేయవద్దు. సంరక్షణ పేరుతో వారి మనుగడను దెబ్బ తీయవద్దు. తీరం వెంట చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వలన మత్స్యకారులు నిరాశ్రయులవుతున్నారు. వారు జీవనోపాధులు కోల్పోతున్నారు. తీరప్రాంత, సముద్ర ప్రాంత వనరులను అటువంటి అభివృద్ధి కార్యక్రమాల బారినుంచి కాపాడుకునేందుకు కమ్యూనిటీలు పోరాడుతుంటే సంరక్షణ పేరుతో సాంప్రదాయకంగా చేపల వేటకు వెళ్లే చిన్న తరహా మత్స్యకార కమ్యూనిటీలకు వనరులను అందుబాటులో లేకుండా చేస్తున్నారు’’- ఇదీ ఈ సంస్థల ప్రతినిధుల ఆవేదన. మత్స్యకారుల జీవనోపాధులు దెబ్బతినడం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతుంది.
వినియోగ సమాచారం
english title:
viniyoga samacharam
Date:
Tuesday, November 6, 2012