29 సెప్టెంబర్ 2010- ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్ డేటా బేస్‌గా అవతరించిన ‘ఆధార్’ తొలి నెంబర్‌ను మన దేశంలో ఇచ్చిన రోజు అది. మహారాష్టల్రోని తెంబ్లి గ్రామ నివాసి రంజన సోనావానేకి ఆధార్ నెంబర్‌ను కేటాయిస్తూ తొలి ఆధార్ కార్డ్‌ను ఇచ్చారు. ఈ ప్రత్యేకమైన సంఖ్యను కేటాయించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనేది ఆధార్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. వివరాల నమోదుపై తొలి దశ కార్య్రకమంగా ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. మార్చి 2012 నాటికి 200 మిలియన్ల భారతీయుల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నమోదు కేంద్రాలను భాగస్వామ్య సంస్థలతో కలిసి ప్రారంభించడం జరిగింది. రోజుకు సుమారు పది లక్షల మంది వివరాలను నమోదు చేయగల సామర్ధ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
యుఐడిఎఐ రెండవ దశలో భాగంగా 2014 నాటికి మరో 400 మిలియన్ల మంది వివరాలను నమోదు చేయనున్నారు. రెండవ దశలో శాశ్వత నమోదు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆధార్ కార్డులలో వివరాలలో తప్పులు ఉంటే వాటిని సవరించేందుకు కూడా ఇప్పుడు అవకాశం లభిస్తోంది. మహిళలకు వివాహానంతరం ఇంటి పేరు మారడం, వలస పోవడం కారణంగా చిరునామా మారడం, మొబైల్ నెంబరు మారడం, పేర్లలో తేడా లేదా జన్మ తేదీలో తప్పులు రావడం వంటివి జరిగినపుడు తగిన ఆధారాలను చూపించడం ద్వారా వీటిని సవరించే అవకాశం కల్పిస్తున్నారు. భారతీయులైన ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను ఇవ్వడం తొలి లక్ష్యం కాగా, ఈ సంఖ్యను ఆధారం చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య రక్షణ, సామాజిక సంక్షేమం, పన్నులు, భూమి రికార్డులు, సబ్సిడీ పథకాల నిర్వహణ వంటి పలు అంశాలకు సంబంధించిన సేవలను సమర్ధవంతంగా అందించేందుకు చర్యలు చేపట్టడం మరో ముఖ్యమైన లక్ష్యంగా ఉంది.
డిసెంబర్ 2011లో జార్ఖండ్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను, వృద్ధాప్య పించన్లు, విద్యార్థుల ఉపకార వేతనాలను ఆధార్ సంఖ్య ఆధారంగా ఇవ్వడం మొదలుపెట్టారు. మధ్య దళారులతో ప్రమేయం లేకుండా ఆధార్ నెంబర్‌తో ముడిపడిన బ్యాంక్ ఖాతాలలోకి నేరుగా ఈ మొత్తాలను జమ చేయడం మొదలుపెట్టారు. నగదును తీసుకోవడం, జమ చేయడం, మైక్రో ఎటిఎం సహాయంతో నగదు నిల్వలను తెలుసుకోవడం వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు కూడా దీనివలన లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. మైక్రో ఎటిఎంలు లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఎఇపిఎస్)లను ఆధార్ బయోమెట్రిక్ (వేలిముద్రలు) అథెంటిఫికేషన్ ద్వారా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ శాఖలు లేకపోవడం, బ్యాంకు ఖాతాలు లేని వారు ఎక్కువగా ఉండడం వలన తలెత్తే సమస్యలకు దీనివల్ల పరిష్కారం లభించినట్టయింది. బ్యాంకుల కోసం గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం తప్పింది. జార్ఖండ్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశంలోని మరో యాభై జిల్లాలలో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జి (ఎపిబి)ని ప్రారంభించడం ద్వారా కేవలం ఆధార్ నెంబర్‌ను పేర్కొంటూ వారి ఖాతాలోకి నగదును బదిలీ చేయడం సులభమైంది. సంక్షేమ పథకాల నగదును మాత్రమే కాకుండా ఉద్యోగుల జీతాలను సైతం ఆధార్‌తో జతపడిన బ్యాంక్ ఖాతాలోకి మార్చే పద్ధతి కూడా అమలులోకి వస్తుంది. ఈ పద్ధతుల వలన అర్హత లేకున్నా ప్రభుత్వ అధికారులు నిధులను విత్‌డ్రా చేయడం సాధ్యం కాకుండా చేయవచ్చు. కర్నాటకలోని మైసూర్‌లో మరో కొత్త ప్రయోగానికి ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. ఐఓసిఎల్, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ కంపెనీలు పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖతో కలిసి ఆధార్ సంఖ్యను ఉపయోగిస్తూ ఎల్‌పిజి సిలిండర్ల డెలివరీలో అవకతవకలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని ప్రకారం గ్యాస్ ఏజెన్సీలను సిలెండర్‌ను ఇంటివద్ద ఇస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల ఆధార్ బయోమెట్రిక్‌ను ధృవీకరించాల్సి వుంటుంది.
ఇక మన రాష్ట్రంలో ఆహార, పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్‌ను వినియోగించడం ప్రారంభించింది. 1 సెప్టెంబర్ 2012 నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని 47 చౌక ధరల దుకాణాలకు వర్తించేలా పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు కింద 1.25 లక్షలమంది ప్రయోజనం పొందుతారు. బియ్యం, పంచదార, పమాయిల్ వంటి నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు పొందే వినియోగదారులు ఆధార్ కార్డును పొంది ఉండాలి. సామాన్యుడి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ఎక్కువగా అనర్హులకే పోతున్నాయనే ప్రచారం ఉంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో 14 శాతం సబ్సిడీలకే వెచ్చిస్తున్నారు. సబ్సిడీగా ఇచ్చేందుకు ఉద్దేశించిన కిరోసిన్‌లో 39 శాతం అనర్హులకే చేరుతోందని ఒక అంచనా. కనుక సబ్సిడీలను చేరవలసిన వారికే చేరేలా చేయడం కోసం ఆధార్ ఉపయోగపడుతుంది.
ఆధార్ రెండు దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం పెరగనుంది. బ్యాంకులకు సంబంధించిన కెవైసి-నో యువర్ కస్టమర్, రేషన్ కార్డుల జారీ, బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం, మొబైల్ కనెక్షన్ పొందడం వంటి పనులకు ఆధార్ ఉపయోగపడుతుంది. మున్ముందు మెడికల్ రికార్డులు, క్రెడిట్ బ్యూరోలకు కూడా ఇది ఆధారంగా ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్‌గా కూడా ఆధార్‌ను అన్ని ప్రభుత్వ విభాగాలు అంగీకరించనున్నాయి.
ఏ ఒక్క కాగితాన్ని వెంట తీసుకువెళ్లకుండానే మనం ఆధార్ ద్వారా ఎన్నో రకాల పనులను చక్కబెట్టుకోవచ్చు. ఉదాహరణకు బ్యాంకు ఖాతా తెరవాలనుకుంటే మన కనుపాప లేదా వేలి ముద్రలను స్కాన్ చేసిన వెంటనే మన వివరాలన్నీ కూడా అక్కడ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతాయి. దాంతో వెనువెంటనే బ్యాంకు ఖాతాను ప్రారంభించేయవచ్చు. మొబైల్ కనెక్షన్ తీసుకోవాలన్నా ఇదే విధానం అనుసరిస్తారు.
గత నెలలో ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్నిపెద్ద ఎత్తున వినియోగించుకుంటూ పాలనలో పారదర్శకతను, బాధ్యతాయుతతత్వాన్ని పెంపొందించాలని భావిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఇదే సమయంలో ఆయన 21వ కోట్ల ఆధార్ సంఖ్యను ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన వలీ అనే మహిళకి అందచేసారు. సబ్సిడీలను మధ్యవర్తుల ద్వారా కాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే ప్రయత్నాలు కూడా దీనితో మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థను కంప్యూటరీకరించే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. లబ్ధిదారుల డేటాబేస్‌ను తయారుచేయడం ద్వారా బోగస్ రేషన్ కార్డులను తొలగించడం సులభతరమవుతుంది.
29 సెప్టెంబర్ 2010- ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్ డేటా బేస్‌గా అవతరించిన ‘ఆధార్’ తొలి నెంబర్‌ను మన దేశంలో ఇచ్చిన రోజు అది.
english title:
adaar
Date:
Tuesday, November 6, 2012