దుష్టశిక్షణ, శిష్టరక్షణకై పలు అవతారాలను ధరించిన శ్రీ మహావిష్ణువు సకల లోక వాసులకూ ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు ధరించిన ఆయుర్వేద వైద్య ప్రవక్త రూపమే ‘్ధన్వంతరి’.
శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిలో ఆదివైద్యుడిగా, ఆయుర్వేద వైద్య శాస్త్రానికి అధిదేవుడైన ధన్వంతరిగా ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు అవతరించినందున ఆశ్వీజ బహుళ త్రయోదశిని ‘్ధన్వంతరీ జయంతి’గా జరుపుకోవాలని శాస్త్ర వచనం. ధన్వంతరికి సంబంధించిన ప్రస్తావన శ్రీ మద్భాగవతం, బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ వైవర్త పురాణాలతోపాటు రామాయణ మహాకావ్యంతోపాటు హరివంశంలో కూడా కనిపిస్తుంది. పై తెలిపిన వాటిలో ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఎన్నో ఉన్నాయి.
కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సాగరాన్ని మధించారు. పాల సముద్రాన్ని మధించేందుకు భూమధ్యభాగంలో ఉన్న మందరగిరిని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని ఆ కవ్వమునకు తాడుగా చేసుకున్నారు. సాగర మధనానికై మందర పర్వతాన్ని సాగరంలోకి దించగానే పట్టు తప్పి అది నీట మునిగిపోయింది. దానిని పైకి లేపేందుకు శ్రీహరి కూర్మావతారం ధరించి సముద్రంలోనికి వెళ్లి తన మూపుతో పర్వతాన్ని ఎత్తేసరికి దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సాగరాన్ని మధించారు. ఆ సమయంలో మొట్టమొదట అందులోంచి హలాహలం జనించగా దానిని పరమ శివుడు కంఠంలో ధరించి లోకాన్ని రక్షించడంతోపాటు గరళ కంఠుడయ్యాడు. అనంతరం అమృతకలశం, కల్పవృక్షం, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి వరుసగా ఉద్భవించడం జరిగింది.
అటుపై ఓషధులు, ఆయుర్వేద గ్రంథం, జటాకమును ధరించిన ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. శ్రీమన్నారాయణుడే మోహినీ అవతారం ధరించి దేవతలకు అమృతాన్ని పంచిన విషయం జగద్విదితమే. ఈ విధంగా క్షీరసాగరం నుంచి ఉద్భవించిన ధన్వంతరి ‘‘దేవా! నేను మీ కుమారుడి వంటివాడిని కదా నాకు ఈ లోకంలో స్థిరనివాసాన్ని, శాశ్వత స్థానాన్ని కల్పించండి. అలాగే మిగతా దేవతలతోపాటు యజ్ఞ్భోగాలను పొందునట్లుగా వరం కూడా ప్రసాదించండి’’ అంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అందుకు శ్రీ మహావిష్ణువు ‘‘కుమారా! ఇప్పటికే అష్టదిక్పాలకులు వివిధ విధులకై నియమింపబడి ఉన్నారు. నీకు కూడా యజ్ఞ హవిర్భాగాన్ని స్వీకరించే స్థానాన్ని ప్రసాదిస్తూన్నాను. నీవు సూర్యుని నుండి వైద్యాన్ని అధ్యయనం చేసి ఆదివైద్యుడిగా భాసిల్లు. అంతేకాదు నీవు ద్వాపరయుగంలో భూలోకమున జన్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతావు’’ అని ధన్వంతరికి వరం ప్రసాదించాడు నారాయణమూర్తి.
అటుపై ధన్వంతరి సూర్యభగవానుడి వద్ద నుండి ఆయుర్వేద విద్యను పొంది అన్ని లోకాలలో దానిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా దేవతలకు వైద్యం చేశాడు. ఒకసారి అగ్నిదేవుడికి అజీర్తి కలిగితే ధన్వంతరే వైద్యం చేసి నయం చేసినట్టు పురాణ కథనం. ద్వాపరయుగంలో కాశీరాజ్యాన్ని పరిపాలించిన దీర్ఘతప్తునికి చాలా కాలంగా సంతు కల్గకపోవడంతో మహర్షుల సలహామేరకు ఆయన శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. అటుపై పుత్ర కామేష్టియాగం చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగగా అందుకు దీర్ఘతప్తుడు ‘‘దేవదేవా! మీ అంశతో ఒక పుత్రుని ప్రసాదించండి’’ అని కోరాడు. శ్రీ మహావిష్ణువు ‘తథాస్తు’ అన్నాడు. ఆ వరబలంతో శ్రీ మహావిష్ణువే ధన్వంతరి రూపంలో కాశీరాజుకి కుమారుడిగా జన్మించాడు. భారద్వాజ మహర్షి వద్ద విద్యనభ్యసించాడు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేద వైద్యమును ధన్వంతరి ప్రచారం చేసి ప్రజలకు ఆయుర్వేద వైద్యం ద్వారా ఆరోగ్యం ప్రసాదించినట్లు పురాణ కథనం. అట్టి వైద్య దేవుడైన శ్రీ ధన్వంతరి జయంతినాడు ధన్వంతరికి షోడశోపచారాలతో పూజించడం చాలామంచిది. ఆయన్ని గుర్తుచేసుకొంటూ విష్ణుదేవాలయాలకు వెళ్ళడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మరింత మంచిది. ఇలా ధన్వంతరిని పూజించడంవల్ల రోగభయాదులు నశించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
మంచిమాట
english title:
manchimaata
Date:
Monday, November 12, 2012