సీత తానుకూడా చిన్నపోయి ‘‘హృదయేశ్వరా! ఇది ఏమి? నీ వదనాంబుజం ఇంతగా వసివాడిపోయింది? పుష్యనక్షత్ర లగ్నం తప్పకుండా రాజు పట్ట్భాషేకం చేశారా? చంద్రమండలానికి జోడయిన వెల్లగొడుగు నీకు పట్టలేదేమి? జోడువింజామరలు ఇరుప్రక్కల తనరుచుండగా పట్టపేనుగు ఏలరాదు? శ్రీరామచంద్రా! నీ ఔదల సేసఖాలు కనపడవేల? పౌరులు నిన్ను చుట్టుముట్టి కొలుస్తూ రారు ఏల? దుందుభీ పటహాదుల తూర్య ధ్వనులు వంగి మాగధుల కైవారాలు ఎక్కడ? అధేపా! నేడు పట్ట్భాషేక దినం. నీలో మంగళకర రాజ చిహ్నాలేవీ కానరావు ఏమిటి? సౌమిత్రి మోమున ఉల్లాసమేది? ఇది యేమి? అంతా నాకు తెలియ చెప్పండి’’ అని పలికే సీత ముగ్ధమోహనాలైన ఆలాపాలకి మనస్సు కుంది రామభద్రుడు మునులకు రాజచిహ్నలజోలి ఎందుకు? విను. వివరిస్తాను. కైకేయి ఎన్నడో వెనుక మా తండ్రి మెచ్చి యిచ్చిన వరాలు ఇప్పుడు కోరింది. తన భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యమని తొలి వరం, కాననాలకు నన్ను పంపమని రెండోవరం.
కావున ధరణిని పాలింపగా నా తమ్ముడికి భరతుడికి పట్టం కడతారు. తండ్రి మాట జవదాట నొల్లక నేను పదునాలుగేండ్లు వనములందు ఉండవలసె. తల్లిదండ్రుల మాట జవదాటని ధీరుడికి కీర్తి, సంపద, స్వర్గలోక వాసం మొదలైన పుణ్యలు అరచేతి ఉసిరికలుకదా!
సీతతో రాజ్యాభిషేక భంగ మెరిగించుట
కువలయ లోచనా! సీతా! రాజాజ్ఞ నెరవేర్చి నేను వచ్చేవరకు తల్లిదండ్రుల్ని వ్యధలనొందకుండ పరిచర్యలు చేసి భక్తితో కొలుస్తూ ఉండు. నీ మనమునందు క్షేమం కోరుతూ ఉండు. ఉచిత ధర్మములు అనువర్తిస్తూ మసులుతూ ఉత్తమశీలవు కావాలి. అమ్మల దగ్గర వసించు అని బోధించాడు. అపుడు జానకి పెనుగాలికి అల్లల్లాడి పోవు కదళీవృక్షం చందంగా గడగడ వణికిపోయి, బెదరిపోయి, వగలతో కుందుతూ డగ్గుత్తికతో అంతకంతకి తెలతెల్లపోయి ఈ క్రియ పలికింది.
‘‘మీరన్న మాటయే నిక్కం అయితే నేను మీ వెంట ప్రయాణమై ఏతెంచుతాను. నిన్ను విడిచి నేను మనజాలను. ప్రాణనాథా! నా ప్రాణాలు నన్నంటి నిలువవు, అడవులకు నేనున్నూ వస్తాను, తోడుకొని పొమ్ము’’.
సీత మాటలు విన్న రాముడు తూలిపడి ‘‘వనజాక్షీ! కానలలో కందమూలాలు తింటూ, రాతి నేలల మీద నడుస్తూ నారలు కట్టి, దుఃఖాలు పడుతూ, మండుటెండలకి ఓర్వాలి. శీతల వాయువులకి గడ్డకట్టుకొని పోవాలి. కటిక నేలలపై పవళించాలి. పర్ణశాల్లో నివసించాలి. అయ్యో! సుకుమారీ శరీరవు. బేలవు. గోలవు. ఎప్పుడు ఏ యిక్కట్టు ఎరుంగవు.
అంతేకాదు, మదగజాలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, బెబ్బులులు, పాములు, గ్రపోలు, ఒడలుపైన ప్రాకే ఎర్రచీమలు అడుగడుగునా బాధిస్తాయి. ఓ అవనిజా! కొండ గుహల్లోనూ దరుల్లోనూ ఝరుల్లోనూ, లతాగుల్మాలలోను సంచరించాలి. ఘోరకాంతారాల్లో సంచరించడం ప్రాణసంకటం.
కావున నవ్వు కౌసల్యతో ఉండు. ఆమె మనస్సుకి వచ్చినట్టు, నచ్చినట్లు సేవించు. ఇలువేల్పులను కొలువు. ప్రతిదినం నీ మామగారి పాదాలకి మ్రొక్కుతూ ఉండు. భరతుడు నిన్ను మాతృదేవతవని పూజిస్తాడు. అతనితో పరుష వాక్యాలు పలుకకు. ఇదుగో! ఈ క్షణమే కానలకేగి పధ్నాలుగేండ్లు కన్నుమూసి తెరచేలోపల గడపి తిరిగి వస్తాను, మీ అందరికి మోదం కలిగిస్తాను’’ అని పలికాడు.
అప్పుడు సీత ప్రణయ శోకంతో రాముణ్ణి వీక్షించి నిజము చెప్పింది ‘‘పతులు చేసుకొన్న భాగ్యములైన సతులను రక్షించుట వారి ప్రథమ కర్తవ్యము. ఓ నరనాథా! రామా! నా పాలి విభుడన్నా, నా దైవం అన్నా, నా పుణ్యగత అన్నా నువ్వే, తీవ్ర తప్ఫఃలాలు, స్వర్గ భోగాలు అనుభవించడం కంటె కడు భక్తితో నిత్యమూ నీ పదబ్జాలు మనమారా అర్చించడమే నాకు సుఖం.
- ఇంకాఉంది