సప్తగిరిలో ‘ఆణిముత్యాలు’ పేరిట పాత చిత్రాల డెయిలీ ప్రసారం మళ్లీ మొదలయింది. వరుసగా ‘మనసే మందిరం, పెళ్లికాని తండ్రి, దీక్ష’ చిత్రాలు చూసేశాం. సంతోషం. ‘బైస్కోప్’లో ప్రసారం చేసే చిత్రాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. సప్తగిరిలో ‘పునరపి జననం’ అనే డైలీ సీరియల్ 29.10.12 సోమవారం నుండి ఉదయం 8.30కు ప్రసారమవుతున్నది. ఇది కొత్తదో, పాతదో తెలియడంలేదు. తారాగణాన్ని చూసి బహుశా పాత సీరియల్ అయి వుంటుందని అనుమానించాల్సి వస్తుంది. ఇది హఠాత్తుగా మంగళవారం మాయమయింది. బుధవారం నుండి మళ్లీ వస్తున్న ఈ సీరియల్ అచ్చు తెలుగు సినిమా మూసలో తయారయిందే. ఇందులో హీరోను ప్రేమిస్తున్న అమ్మాయి ఏకంగా హీరో హాస్టల్ గదికి వచ్చి అల్లరి పెట్టడం, హీరో తను మేనమామ కూతుర్ని పెళ్లిచేసుకోవడమే కర్తవ్యంగా చెబితే - ఆ అమ్మాయి ‘ముందే చెబితే వేరే ఎవరినైనా లైన్లో పెట్టేదాన్ని కదా’ అని చెప్పడం, ఇక చిన్నపిల్లల నోట ముదురు మాటలు, సినిమాల్లోనే కాదు చిన్నితెరమీద కూడా చూడాల్సి రావడం ఇబ్బందిగా, వెగటుగా ఉంది.
31-10-12 బుధవారం తొమ్మిది గంటలకు ప్రసారమయ్యే జానపద కార్యక్రమంలో ఒక తెలుగు జానపద కళారూపం ప్రదర్శితమయింది. టైటిల్ మిస్సయ్యాం. తీరా ఆ జానపద కార్యక్రమాన్ని చూస్తే ప్రదర్శనా రీతులను బట్టి అది డక్కలివాళ్ళ ప్రదర్శనయా, చిందుభాగవతులా అన్నసంగతి అర్థం కాలేదు. ఈ అరగంట కార్యక్రమంలో ఆ ప్రదర్శనా రూపం ఏమిటో ఆ వివరాలను తెలియజేయలేకపోయారు. కనీసం కార్యక్రమం ముగిసిన తర్వాత మీరు ఫలానా కార్యక్రమం చూశారనే స్లయిడు కానీ, చెప్పడం కాని లేకపోవడం వీరి నిర్లక్ష్యానికి, నిరాసక్తతకు నిదర్శనం. ప్రదర్శించే గ్రూపుపేరు, వారి ఊరు పేరు కూడా చెప్పాలి. మిగతా ఛానెల్స్ తాము ప్రసారం చేసే కార్యక్రమాలను ముందుగా అనేకమార్లు ప్రకటించడం, మీరు ఫలానా కార్యక్రమం చూస్తున్నారని, స్లైడు వేయడం చేస్తుంటారు. మరి ఈ అలవాటు సప్తగిరిలో ఎందుకు లేవో అర్థం కాదు. ఏ కార్యక్రమం అయినా చూస్తే చూడండి, లేకపోతే మీ ఖర్మ అనే ధోరణి నుండి బయటపడినప్పుడే ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోగలుగుతారు.
సప్తగిరిలో 1.11.12 గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమైన ‘తెలుగింటి అమ్మాయి’ కార్యక్రమం చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియలేదు. మన సభ్యత, సంస్కారం గురించి తెలియజేయడానికి ఉద్దేశించినదని ఈ కార్యక్రమం గురించి యాంకర్ చాలా గొప్పగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అమ్మాయిలకు డ్రెస్ కోడ్ వున్నట్టుగా వుంది. అందరూ నిండుగా చీరెలు, తలలో పూలు పెట్టుకుని కనిపించారు. ఈ కార్యక్రమంలో కనిపించినవారికంటే, ‘స్వర సమరం’లో కనిపించే అమ్మాయిలే సహజంగా కనిపిస్తారు. ఇక కార్యక్రమంలో కుమ్మరి సారె గురించి, ధర్మవరం పట్టుచీరల గురించి క్విజ్- చిక్ చిక్ పుల్ల ఆట- సినిమా పాటల మీద ఆట- ఇదా మన సంస్కృతి? ఔత్సాహిక స్థాయిలో వున్న ఈ కార్యక్రమం చూడటమే టైం వేస్ట్.
సప్తగిరిలో ఆదివారం ఉదయం 7.30కు ‘వెండితెర వెలుగులు’ అనే కార్యక్రమంలో సినీప్రముఖుల ఇంటర్వ్యూలను ఇస్తున్నారు. 4.11.12న శేఖర కమ్ముల (దర్శకుడు) ఇంటర్వ్యూ మొదటి భాగం ప్రసారమయింది. బాగుంది. ఈ శీర్షికన సినీ ప్రముఖులను పరిచయం చేస్తారనుకున్నాను. కానీ రవి చావలి లాంటి దర్శకులు, జెన్నీ (జనార్థనరావు) లాంటి హాస్యనటులు తప్ప ఇతర ప్రముఖులు వీరి దృష్టికి వస్తున్నట్లుగా కనిపించదు. ఈ పాటి ఇంటర్వ్యూలను కూడా నెల తిరక్కుండానే పునఃప్రసారం చేయడం అవసరమా? పాతవి బోలెడు ఇంటర్వ్యూలున్నాయి. కొత్తవి లేకపోతే వాటి స్థానంలో పాతవాటిని ప్రసారం చేయవచ్చు కదా! కొత్తదో, పాతదో తెలియదు కాని కాకరాల ఇంటర్వ్యూ డిఫరెంట్‌గా వుండి ఆకట్టుకుంది.
3.11.12 శనివారం సాయంత్రం 5.30కు ‘లోక్‌సభ’ ఛానల్‌లో ‘డెంగ్యూ’పై ప్రసారం చేసిన లైవ్ కార్యక్రమం ఎంతో సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా వుంది. పలువురు వైద్య ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డెంగ్యూ అంటే ఏమిటి? దాని లక్షణాలు? ఎలా వ్యాపిస్తుందో చెప్పారు. ఫ్లూ టైపు లక్షణాలను కలిగిన ఈ వ్యాధి దశాబ్దాల నుండే కనిపిస్తుందని చెప్పడం ఆశ్చర్యం. డెంగీకి కచ్చితమైన మందులు లేకపోయినా వైద్యుల పరిరక్షణలో వుంటే త్వరగా కోలుకోవచ్చని చెప్పారు. ఈ అంశాన్ని ఆసరా చేసుకుని కార్పొరేట్ వైద్యాలయాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ఒక డెంగీ రోగి నుండి రెండు లక్షల రూపాయల వరకు ఈ ఆసుపత్రులు పిండుకుంటున్నాయి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, నిజంగా ఇంత ఖర్చు అవసరమా? అన్న సందేహాలు వున్నా, తమ మనిషి బాగుపడితే చాలనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు.
అదే రోజు 5.30కు ఇండియా న్యూస్ చానెల్ ‘వందేళ్ళ సినిమా చరిత్ర’ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. వందేళ్ళ చరిత్రలోని మైలురాళ్ళ లాంటి సినిమాల గురించి కానీ, పరిణామ చరిత్ర గురించి చెప్పకుండా దీన్ని సినీ ప్రాయోజిత కార్యక్రమంగా తయారుచేశారు. నర్గీస్, వైజయంతిమాల, మీనాకుమారి, ముంతాజ్‌లపై చిత్రీకరించిన పాటలను ప్రదర్శిస్తూ వచ్చిన ఈ కార్యక్రమం హఠాత్తుగా 18 నిముషాలకు ఆగిపోయింది.
3.11.12న న్యూస్ ఎక్స్ అనే వార్తా ఛానెల్‌లో 7.30కు వాచ్ స్టార్ శీర్షికన ‘డాన్స్ ఐకాన్స్’ అనే కార్యక్రమం ప్రసారమయింది. డాన్సింగ్ హీరోల గురించిన ప్రత్యేక కార్యక్రమమిది. ఇందులో ‘జనక్ జనక్ పాయల్ బాజే’లో గోపీకృష్ణ నృత్యాన్ని తరువాత కిశోర్‌కుమార్, షమీకపూర్, జితేంద్ర, అమితాబ్‌బచ్చన్ నాట్య గీతాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. దీని తర్వాత అనిల్‌కపూర్, జాకీష్రాఫ్, సన్నీ డియోల్, రిషికపూర్, మిధున్ చక్రవర్తి, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా, కమల్‌హాసన్‌లు నటించిన నృత్య గీతాల ప్రదర్శన చాలా బాగా వచ్చింది. అరగంట సమయం ఎలా గడిచిందో తెలియలేదు. ఇదే చానెల్‌లో రాత్రి 9.30కు ‘నిన్నటి తరం బంగారు తారలు’ అనే శీర్షికన ప్రముఖ నటి సాధనను పరిచయం చేశారు. సల్వార్ డ్రెస్, తనదైన హెయిర్ స్టయిల్‌లో ప్రత్యేకంగా కనిపించే సాధన 1960, 70వ దశకంలో ప్రేక్షకుల మీద తనదైన ముద్రను వేయగలిగింది. ‘వో కౌన్ థీ, హమ్ సాయా’ మొదలైన చిత్రాల నుండి పాటల క్లిప్పింగ్స్ వేస్తూ, అప్పటి తరం వారితో ఆమె ప్రతిభ గురించి మాట్లాడించడం బాగా వచ్చింది.
సప్తగిరిలో ‘ఆణిముత్యాలు’ పేరిట పాత చిత్రాల డెయిలీ ప్రసారం మళ్లీ మొదలయింది
english title:
y
Date:
Tuesday, November 13, 2012