పాలలా కమ్మగా, తేనెలా తీయగా ఉండేది ఏది? దేశ భాషలందు తెలుగు లెస్సగా కొనియాడబడేది ఏది? త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమాచార్య, రామదాసులు అద్భుతంగా వినిపించినది ఏది? కృష్ణశాస్ర్తీ కవితలా, కృష్ణవేణి పొంగులా అలరించేది, నాడునాడులా కదిలించేది, వాడవాడలా కరిగించేది ఏది, ఏది? అవును. అందుకు సమాధానమే తెలుగు. మన మాతృభాష తెలుగు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరు గాంచినది. వీనులవిందుగా ఉండేది తెలుగు. తీపితీపి తెలుగు, తేటతేట తెలుగు. చక్కెర మాటల మూట. చక్కని తేనెల ఊట. మంచి ముత్యాలపేట, మధురామృతాల తోట తెలుగు. కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగు. కూచిపూడి నృత్యంలోని అందం తెలుగు. ఎంత చెప్పుకున్నా తనివి తీరనిది - తెలుగు.
ఇంతటి గొప్ప భాష గురించి, సంస్కృతి గురించి, సాహిత్యం గురించి తెలుగు భాషలోనే రూపొందించిన వెబ్‌సైట్లు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు సైట్. ఆ సైట్ అడ్రస్: http://www.telupu.com/
తియ్యందనాల తెలుగు, ఆ తెలుగులో ప్రచురితమైన పుస్తకాలు - ఇలా ఈ రెండు పదాల కలయిక ఈ వెబ్‌సైట్ పేరుగా మారి, ‘తెలుపు’గా రూపుదిద్దుకుంది అంటున్నారు ఈ సైట్ నిర్వాహకులు. మా తెలుగు తల్లికి వేసిన మల్లెపూదండ కూడా తెల్లటి తెలుపులో ఉంటుంది కదా. అలాగే ఈ సైట్ కూడా. తెలుగు తోటలో పూసిన స్వచ్ఛమైన సాహితీ సుమాల సౌరభం అందరికీ పంచాలన్న ఉద్దేశంతో ఈ సైట్‌ని రూపొందించిన సైట్ నిర్వాహకులు వారి ధ్యేయం ఇలా వ్యక్తపరిచారు. తెలుగును ప్రపంచవ్యాప్తం చేయడం, కథలు, పద్యాలు, పాటలు, చిత్రాల ద్వారా పిల్లలకు తెలుగులో ఆసక్తి కలిగించడం, తెలుగు సంగతులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాటికి ప్రాచుర్యం కలిగించడం, కంప్యూటర్లలో సైతం తెలుగుకు స్థానం కల్పించడం, దేశ విదేశాల్లోని తెలుగు ప్రవాసులను కలపడం.
ఇటువంటి మంచి ఆశయాలతో తయారుచేసిన ఈ సైట్ వివరాలు ఇలా ఉన్నాయి:
కొత్త సంగతులు: సాహితీ ప్రపంచంలో కొత్త సంగతులు తెలిపే విభాగం ఇది. ఇందులో ‘యెంకి పాటలు’ ‘పాత చందమామ సంచికలు’ ‘సురభి నాటకాలు’ వంటి అంశాలు ఉన్నాయి.
తెలుగు తెలుసుకుందాం అన్న శీర్షికన ‘తెలుగు పరిశోధన - డా.వెల్దండ నిత్యానందరావు సౌజన్యంతో, ‘ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్’ ‘వావిలాల సంస్థ’ వంటి అంశాలు పొందుపరిచారు.
తెలుగు చూద్దాం శీర్షికలో సంక్రాంతి గ్రీటింగ్ కార్డులు, శీలా వీర్రాజు - లేపాక్షి స్కెచ్‌బుక్, అడివి బాపిరాజు - సముద్రగుప్తుడు, సి.ఎన్.వెంకట్రావు - గౌతమీ అవతరణం, రాయప్రోలు సుబ్బారావు - తృణకంకణం, దామెర్ల రామారావు - ఇలా పలువురు ప్రముఖులు వేసిన అందమైన చిత్రాలు ఇందులో ఉన్నాయి.
తెలుగు దర్శిద్దాం అంటూ గ్రంథాలయాలు, శ్రీకాకుళంలోని కథా నిలయం, విశాఖ అబ్బూరి ఆర్ట్ గ్యాలరీలపై విశేషాలు పొందుపరిచారు.
తెలుగు చదువుదాంలో వెయ్యికి పైగా తెలుగు పుస్తకాల జాబితా ఉంది. వీటిని ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకునే వీలు కల్పించారు. ఇది ముఖ్యంగా విదేశాలలో ఉంటున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ దేశంలో కూడా ఇతర ప్రాంతాలలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
తెలుగు విందాం అంటూ మధురమైన పాత పాటలు పొందుపరిచిన వెబ్‌సైట్స్‌కి లింక్స్ ఇచ్చారు.
పిల్లల కోసం శీర్షికలో కథలు, పద్యాలు, సామెతలు వంటివెన్నో పొందుపరిచి, పిల్లలకి ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు.
ఇంకా, రచయితలూ, అనువాదకులు, ప్రచురణకర్తలు, గ్రంథాలయాలు, అలాగే పలు సంస్థల వివరాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఇతర తెలుగు వెబ్‌సైట్ల లింక్స్ కూడా ఇచ్చారు. నిఘంటువు కూడా పొందుపరిచారు. ‘మాకు రాయండి’ అంటూ మీ పేరు, ఈమెయిల్ ఇస్తూ మీ సూచనలు కూడా పంపించే వీలు కల్పించారు. తెలుగు భాష గురించి, సాహిత్యం గురించి తెలిపే చక్కటి సైట్ ఇది.
పాలలా కమ్మగా, తేనెలా తీయగా ఉండేది
english title:
telugu
Date:
Sunday, November 18, 2012