(గత సంచిక తరువాయ)
కొంతమందికి కళ్లు చింతనిప్పుల్లా ఎర్రగా తయారై ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దురదలు, మంటలు, కళ్లు మసకగా కనిపించటం వంటివి సమాంతరంగా బాధిస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటికి సమాధానం ఈ ఔషధం. 50 గ్రాముల వేపాకులను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరండి. చిన్నచిన్న చక్రికలుగా చేసి ఆవనూనెలో ఉడికించండి. ఈ చక్రికలు నల్లగా మారిన తరువాత వాటిని అదే నూనెతో సహా మెత్తగా నూరి 10వ వంతు పచ్చకర్పూరాన్ని, 10వ వంతు కాలిమిషోరాను కలిపి తిరిగి మెత్తగా నూరి ఒక సీసాలో నిలువ చేసుకోండి. దీనిని ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు కంట్లో కాటుక మాదిరిగా అంజనంగా ప్రయోగిస్తూ ఉదయం పూట త్రిఫలా కషాయంతో కళ్లను కడుక్కుంటూ ఉండండి. ఇది కంటి దురదలు, కంటి మంట, కళ్ల ఎరుపుదనం, కళ్లు స్పష్టంగా కనిపించకపోవడం అనే సమస్యలను తగ్గించటమే కాకుండా కంటి దృష్టిని కూడా పెంచుతుంది. కాకపోతే దీనిని వాడే విషయంలో పరిశుభ్రత చాలాచాలా ముఖ్యం.
కన్ను అన్ని ఇంద్రియాల్లోకి ప్రధానమైనది. అతి సున్నితమైనది కూడా. దురదృష్టవశాత్తూ కంటిచూపు తగ్గటం, కళ్లు మసకలు బారటం అనే సమస్యలు నేటి కంప్యూటర్ రోజుల్లో చాలా సాధారణమై పోయాయి. కంటిచూపు తగ్గిపోయి కళ్ల ముందు మంచు తెరలు కమ్మినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కళ్లద్దాలతో కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి వారి కోసం ఈ చికిత్స. లేతవేపాకులు 20, జశద భస్మం 20 గ్రాములు, లవంగాలు 6, చిన్న యాలుకలు 6, పటికబెల్లం (మిశ్రీ) 20 గ్రాములు గ్రహించండి. అన్నిటినీ కలిపి మెత్తగా నూరి స్వచ్ఛమైన గుడ్డతో జల్లించి నిల్వ చేసుకోండి. ఒక చక్కని సూర్మా సిద్ధమైందన్నమాట. దీనిని కంటికి ఐ-లైనర్‌లా ప్రయోగిస్తూంటే కంట్లో పుసులు కట్టడం, కళ్లు మసక బారడం, కంటి దురదలు తగ్గుతాయి. అంతేకాకుండా బోనస్‌గా నేత్ర దృష్టి పెరుగుతుంది.
వాతావరణ ప్రతికూల పరిస్థితులకు ముందుగా దెబ్బతినేవి కళ్లే. వేడి వాతావరణం వల్ల కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. దీనిని అనుసరించి దురదలు, కళ్లు మసకలు బారటం, కళ్లు ఎర్రబడటం తదితర సమస్యలు కూడా తయారై ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని అన్నిటినీ తగ్గించగల ఔషధం ఇది. 10 గ్రాముల దూదిని తీసుకుని పొరలాగా పరచండి. దీని మీద 20 ఎండిన వేపాకుల పొడినీ, 1 గ్రాము కర్పూరం పొడినీ జల్లి దూదిని లోపలికి పరుపును చుట్టినట్లు చుట్టి 10 గ్రాముల ఆవు నెయ్యితో తడిపి మండించండి. నల్లని కాటుక వంటి తైల సంబంధ పదార్థం కిందకి బొట్లు బొట్లుగా కారుతుంది. దీనిని సేకరించండి. ఇదే సుర్మా. దీనిని రాత్రి పడుకునే ముందు కంటికి అంజనంగా ప్రయోగించండి. ఇది కంటి దురదలతో పాటు కళ్ల మసకలు, కళ్ల నుండి నీళ్లు కారటం, కళ్ల ఎరుపుదనం తదితర కంటి సమస్యలు తగ్గించటమే కాకుండా నేత్ర దృష్టిని కూడా పెంచుతుంది. ఇది చిన్న పిల్లల్లో సైతం చక్కని ఫలితాన్ని చూపిస్తుంది.
కళ్లను అతిగా వినియోగించే వారికి కంటి వాపు, కంటి నొప్పి, కనుకొసలు ఎర్రగా మారటం, కళ్లు గుంజుతున్నట్లుండటం తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి వేపాకుల రసాన్ని తాజాగా తీసి కొద్దిగా చిక్కబడేంత వరకు కదల్చకుండా ఉంచి కంటికి కాటుక మాదిరిగా పెట్టుకోవాలి.
వయసు పెరిగే కొద్దీ తప్పనిసరిగా కనిపించే మార్పుల్లో కాటరాక్ట్ ఒకటి. ఈ సమస్య ఉన్నవాళ్లకు కంటి లోపల కటకం అపారదర్శకంగా మారిపోతుంది. దీనితో చూపులో స్పష్టత ఉండదు. ఈ సమస్య వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా కనిపించేదయినప్పటికీ ఎండకు గురయ్యే వాళ్లలోనూ, కళ్లను అతిగా వినియోగించే వారిలోనూ తక్కువ వయస్సులోనే ప్రారంభమవుతూ ఉంటుంది. దీనిని నివారించగల అద్భుత ఔషధం ఇది. వేపగింజలను ముద్దగా నూరి, అవసరమైతే తగినంత తేనె, నెయ్యిలను కలిపి కంటికి అంజనం కింద పెట్టుకుంటూ ఉంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఇది కాటరాక్ట్ సమస్యను తగ్గించటమే కాకుండా నివారణగా కూడా పని చేస్తుంది.
విష రసాయనాల ప్రభావం వల్ల, అతి వినిమయం వల్ల, ఇన్‌ఫెక్షన్స్ వల్ల కళ్లల్లో ఇన్‌ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది. దీనిని తగ్గించగల ఔషధాన్ని తెలుసుకుందాం. వేపాకులను నీడలో ఆరబెట్టి, సమాన భాగం కలిమిషారా కలిపి మెత్తగా పొడిచేసి పల్చని గుడ్డతో జల్లెడ పట్టి నిల్వ చేసుకోండి. దీనిని కంట్లో అంజనంగా ప్రయోగిస్తూ ఉంటే కళ్లలో వాపు, కళ్ల ముందు మంచు తెరలు పరచుకున్నట్లుగా అనిపించటం తగ్గుతాయి. దీనితో కంటి దృష్టి కూడా పెరుగుతుంది. ఒకవేళ రాత్రి పూట కళ్లు సరిగ్గా కనిపించని సమస్య ఉంటే పచ్చివేపకాయల నుండి సేకరించిన పాల లాంటి నిర్యాసాన్ని ప్రయోగించవలసి ఉంటుంది.
తలనొప్పి చాలా సాధారణమైన సమస్య. ఎంత సాధారణమంటే ప్రతి వాళ్లను ఈ సమస్య బాధపెడుతూనే ఉంటుంది. తలనొప్పులలో ఒంటి కణత నొప్పి మరీ బాధాకరమైంది. ఈ సమస్యతో బాధ పడుతున్నవారు ఎండిన వేపాకులు, మిరియాలు, బియ్యం సమభాగాలు తీసుకొని మెత్తగా పొడిచేసి సూర్యోదయానికి ముందు ఏ వైపు తలలో నొప్పి ఉంటుందో ఆ వైపు ముక్కు రంధ్రంతో చిటికెడు మోతాదుగా ముక్కు పొడుం మాదిరిగా పీల్చాలి. ఈ చికిత్సతో ఎంతోకాలం నుంచి బాధించే ఒంటి కణత నొప్పి, మైగ్రేన్ తలనొప్పులు నమ్మకంగా తగ్గిపోతాయి.
కిరణ్మయి (వరంగల్)
ప్రశ్న: నాకు మూడేళ్ల పాప ఉంది. చాలా సన్నగా, ఊదితే చాలు పడిపోయేట్లు ఉంటుంది. బరువు కేవలం పది కిలోలు మాత్రమే ఉంటుంది. రోజుకి తనకి రెండు గ్లాసుల పాలు ఇస్తాను. అలాగే నానబెట్టిన బాదం గింజలలు, కిస్‌మిస్ పండ్లను కూడా ఇస్తాను. పోయిన ఏడాది అశ్వగంధ చూర్ణాన్ని పాలకు కలిపి కూడా ఇచ్చి చూశాను. ఐనప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఈ పాపతోపాటు నాకు ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. పదిహేడు కిలోలు ఉంటాడు. మా పిల్లలు బరువు పెరిగి చక్కగా, అందరి పిల్లలలాగా బొద్దుగా తయారవ్వాలంటే నేను ఏం చేయాలి? శారీరక బరువు పెరగటానికి చక్కటి ఇంటి వైద్యం లేదా ఆయుర్వేదం ఔషధాలు ఉంటే తెలపండి.
జ: దీనికి ‘పిండస్వేదం’ అనే చికిత్సా ప్రక్రియ చాలా బాగా పని చేస్తుంది. ఒక ప్రత్యేక రకమైన బియ్యాన్ని పాలతో కలిపి ఉడకబెట్టి, మూటలుగా కట్టి ‘బలా’ అనే మొక్క వేళ్లతో తయారుచేసిన కషాయంలో ముంచి శరీరమంతా సున్నితంగా వత్తిడి ప్రయోగిస్తూ చేసే మర్దనా చికిత్సకు పిండస్వేదం అని పేరు. దీనిని 21 రోజులపాటు వరుసగా చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. దీంతోపాటు అమృత ప్రాశ ఘృతం అనే ఔషధాన్ని ఇస్తే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఆకలి, అరుగుదలలను పెంచటం కోసం ‘అరవిందాసవం’ అనే మందును కూడా కడుపులోపలకు వాడాల్సి ఉంటుంది. ఈ చికిత్సలను, వీటి కోసం ఉపయోగించాల్సిన ఔషధాలను శరీర తత్వాన్నిబట్టి తగిన అనుపానాలతో ఇవ్వటం అవసరం. *
మీ సమస్యలు, సందేహాలు పంపించాల్సిన చిరునామా:
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, యూసఫ్‌గుడ, మెయన్ రోడ్,
అమీర్‌పేట, హైదరాబాద్.
ఫోన్ నెం. 924 657 5510