డెర్రీ లేదా లండన్ డెర్రీ అని పిలవబడే ఇది ఉత్తర ఐర్లండ్‌లోని రెండవ పెద్ద నగరం. క్రీ.శ 1121లో స్థాపించబడ్డ ఈ నగరం ప్రపంచంలో పర్యాటకులు యూరప్‌లో అధికంగా సందర్శించే నగరాల్లో ఒకటి. 1972లో దీని పేరుని డెర్రీగా మార్చాలని నేషనలిస్ట్ పార్టీవారు, లండన్ డెర్రీగా మార్చాలని యూనియనిస్ట్ పార్టీవాళ్లు వాదించారు. స్థానిక ప్రభుత్వం దీన్ని డెర్రీగా గుర్తించినా లండన్ డెర్రీగా కూడా పిలువబడుతోంది. రోడ్లపక్కన సైన్ బోర్డులలో ఒక్కోచోట ఒక్కో పేరుని వాడుతున్నారు.దీని జనాభా లక్షా ఐదువేలు.
ఇక్కడ చూడదగ్గ ప్రధాన విశేషాలు
సిటీవాల్స్: యూరప్‌లో ఓ నగరానికి సరిహద్దు గోడ ప్రధమంగా ఇక్కడే నిర్మించారు. ఒకటిన్నర కిలోమీటర్ల చుట్టుకొలతతో 12నుంచి 35 అడుగుల వెడల్పుతో ఈ గోడని 1613-1619లో నిర్మించారు. దీనికి మొత్తం ఏడు గేట్లు ఉన్నాయి. ఇది చూడదగ్గ చారిత్రాత్మక విశేషం.
హార్బర్ మ్యూజియం: లండన్ డెర్రీ పోర్ట్ అండ్ హార్బర్ కమిషనర్ కార్యాలయం నిర్మించిన భవంతిలో మే 1995లో హార్బర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసారు. ప్రాచీన మేప్‌లు, సిటీ ప్లాన్స్, ఇక్కడినుంచి ఏఏ ప్రదేశాలకి సముద్రయానం చేసారు మొదలైన వివరాలు ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఆనాడు వారు ఉపయోగించిన ఓడల నమూనాలు, వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రవేశం ఉచితం.
ది టవర్ మ్యూజియం: యూనియన్ హోర్‌ప్లేస్ అనే చోట సిటీవాల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన టవర్ మ్యూజియం చూడదగ్గ మరో మ్యూజియం. ఏటా ఇక్కడ తాత్కాలిక వస్తువుల ప్రదర్శన కూడా జరుగుతుంటుంది. వీటిని మరోసారి చూసే అవకాశం ఉండదు. ‘ది స్టోరీ ఆఫ్ డెర్రీ’ అనే విభాగంలో ఈ నగర నిర్మాణంనుంచి నేటి దాకా గల చరిత్రని చూడొచ్చు. పురాతన రాజుల చిత్రపటాలు, వారి ఆయుధాలు, మేప్‌లు, దుస్తులు మొదలైనవి ఇందులో చూడొచ్చు. మరో విభాగం అయిన ‘ఆర్మదా షిప్‌రెక్’లో ఆర్మదా ఓడల సముదాయంలోని పెద్ద ఓడల గురించి అవి ప్రమాదానికి గురైన వివరాలు చూడొచ్చు. 1588లో కిన్నగోబే కంపెనీకి చెందిన ఓ ఓడ మునిగిపోయింది. 400 ఏళ్ల తర్వాత 1988లో దీన్ని కనుగొన్నారు.
ఆ ఓడలో లభించిన ఫిరంగులు, దుస్తులు, పాత్రలు, వైన్ గ్లాసులు, నాణేలు, బూట్లు మొదలైనవి ఇక్కడ చూడొచ్చు. 4 అంతస్తుల్లో గల దీనికి ప్రవేశ రుసుము ఉంది.
బ్లడీ సన్‌డే మెమోరియల్: ఇది పైన పిరమిడ్ ఆకారం గల నాలుగు పలకల రాయి. 30 జనవరి 1972 ఆదివారం రోజు బ్రిటిష్ ఆర్మీ ఇక్కడ 14మంది పౌరులను కాల్చి చంపింది. ఆ రోజు ఉత్తర ఐర్లండ్ పౌర హక్కుల సంఘం విచారణ లేకుండా ఖైదు చేయడానికి వ్యతిరేకంగా శాంతియుతంగా మార్చ్ చేస్తుంటే ఈ సంఘటన జరిగింది. ఇందులో 15వేల మంది పౌరులు పాల్గొన్నారు. హతుల గౌరవార్ధం ఈ ఫలకాన్ని నిర్మించారు. ఆ రోజు 108 గుళ్లని పేల్చిన సైనికుల మీద విచారణ జరపలేదు. పర్యాటకులు అధికంగా ఫోటోలు తీసుకునే ప్రదేశం ఇది.
సెయింట్ కొలంబస్ కేథడ్రిల్: 1633లో నిర్మించబడ్డ ఇది ఈ నగరంలోని అతి పురాతనమైన చర్చి. ఇక్కడ ఓ చోట దీని వివరాలు చెక్కిన శిలాఫలకం కూడా ఉంది. అంతకు మునుపు 1164లో ఇక్కడ నిర్మించబడ్డ సెల్‌కోల్మిసిల్ చర్చి పడిపోవడంతో దీన్ని నిర్మించారు. ఇక్కడ అనేక చారిత్రాత్మక కళా వస్తువులు, చిత్రాలు, పాత ఫోటోలు, 17వ శతాబ్దంలో సిటీగేట్స్‌కి ఉపయోగించిన తాళం కప్పలు మొదలైనవి చూడవచ్చు.
లాంగ్ టవర్ చర్చ్: సిటీవాల్స్ బయట 1784లో నియోరినైసెన్స్ స్టయిల్‌లో నిర్మించబడ్డ లాంగ్ టవర్ చర్చి డెర్రీలోని మొదటి పోస్ట్ రిఫార్మేషన్ కేథలిక్ చర్చ్. 1164లో అక్కడే నిర్మించబడ్డ గ్రేట్ చర్చి శిధిలమైపోతే అక్కడ దీన్ని నిర్మించారు. 1609లో గ్రేట్ చర్చ్ పునాది రాళ్లని వెలికి తీసి సిటీ వాల్స్ నిర్మాణంలో వాడారు.
పీపుల్స్ గేలరీ మ్యూరల్స్: 12 మ్యూరల్స్ గల ఈ చిన్న గేలరీ కూడా ప్రాచుర్యం పొందింది. 1997 నుంచి 2001 దాకా ముగ్గురు కళాకారులు చిత్రించిన ఈ మ్యూరల్స్‌లో బ్లడీ సండే సంఘటనకి చెందిన దృశ్యాలని చూడొచ్చు. బ్రిటిష్ సైనికుడు సుత్తితో ఓ ఇంటి తలుపుని పగలకొట్టే ఓ దృశ్యం, దాన్ని చూసిన టామ్‌కెల్లీ గీసాడు. ఆఖరి మ్యూరల్ పీస్ మ్యూరల్‌లో నెత్తుటి మడుగులోంచి ఎగిరే తెల్లటి పావురాన్ని చిత్రించారు.
ఇంకా ఇక్కడి మ్యూజియం ఆఫ్ ఫ్రీడెర్రీ, ఫ్రీ డెర్రీ కార్నర్, గిల్డ్‌హాల్, వర్క్ హౌస్ మ్యూజియం, సెయింట్ ఈజునెస్ కెథడ్రిల్, మెక్‌గిలోవే గేలరీ, బాక్సైడ్ ఆర్టిస్ట్స్ స్టుడియో, హంగర్ స్ట్రయికర్స్ మెమోరియల్ మొదలైనవి చూడొచ్చు.
ఇక్కడికి లండన్ నుంచి విమానం ద్వారా లేదా బెల్‌ఫాస్ట్‌నుంచి రైలు లేక బస్ ద్వారా చేరుకోవచ్చు. జూన్,జూలై ఆగస్టు నెలల్లో పర్యాటకానికి అనువు.
పర్యాటకం
english title:
tourism
Date:
Sunday, November 18, 2012