..........
ఆంధ్రభూమి - నాటా కథల పోటీలో ఎంపికైన రచన
............
రామానాయుడు రోడ్డులో ట్రాఫిక్ జాం! అక్కడ ఓ వృద్ధుడు రోడ్డుకి అడ్డంగా కూర్చుండిపోయాడు. ఆయన ఎందుకలా కూచున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు విషయం తెలుసుకున్నారు. ఎన్నో వాహనాలు నిలిచిపోయాయి. ఒకటే హారన్ల మోత! విసుక్కున్న వాళ్లు విసుక్కుంటున్నారు. పక్కనుంచి పోయే చిన్న వాహనాలు కొన్ని.
ఆయన చెప్పిన సంగతి విని తెల్లబోయినవారు కొందరైతే, మద్దతిచ్చిన వాళ్లు మరికొందరు. రోడ్డుకి అడ్డంగా కూర్చున్న కారణమడిగితే లేచి ‘‘అందరికీ నమస్కారం! ఈ రోడ్డు గుంతలు, గతుకులు పడి పదేళ్ల కాలమైంది. ఈలోగా రెండుసార్లు ఎన్నికలొచ్చాయి నాయకులను మనమే గెలిపించుకున్నాం. హామీలిచ్చారు తప్ప దీని బాగుకై ఎవ్వరూ నడుం కట్టలేదు. ఈ దారి మనకిబ్బందని తెలిసినప్పటికీ ఎవరూ స్పందించలేదు. మరి ఈ రోజు నేనీ విధంగా దీన్ని బాగు చేయాలని చెప్పే నిరసన వ్యక్తం చేస్తూ ఇలా బైఠాయించాను’’ అని అందరివైపూ చూసాడు అచ్యుతరామయ్య.
అక్కడ గుమిగూడిన అందరితోపాటుగా అభిజిత్ కూడా ఉన్నాడు. తన ఆఫీసుకి వెళ్లబోతూ ఆగి, చూసి షాకయ్యాడు. అక్కడ అడ్డంగా కూర్చుని నిరసన చేస్తున్నది ఎవరో కాదు అక్షరాలా తన తండ్రి!
ఇదేంటి ఈయనకిగాని పిచ్చి పట్టిందా? తన మిత్రులెవరైనా చూస్తే నవ్విపోతారు. ఎంత నామర్దా! పబ్లిక్‌లో ఇలా అల్లరిపాలవడం ఎంతవరకూ సబబు? ఇక్కడ జరిగినదంతా పత్రికలు రాయకమానవు. టీవీలో చూపకమానరు. ఎవరైనా ప్రశ్నలతో గుచ్చి గుచ్చి చంపేది తననే. తనిప్పుడు కల్పించుకుని తండ్రిని ఆపినా నిష్ఠురపడడమే తప్ప ప్రయోజనం ఉండదు.
బుర్ర తిరిగిపోయింది అభిజిత్‌కి. ఆఫీసుకు ఫోన్ చేసి సిఎల్ రాయమని ఇంటికి తిరుగుముఖం పట్టాడు.
* * * *
సరిగ్గా పదిరోజుల కిందట పదవీ విరమణ చేశాడు అచ్యుతరామయ్య. జిల్లాపరిషత్‌లో ఓ సామాన్య గుమాస్తాగా పనిచేసి రిటైరయ్యాడు. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు కూడా ఏనాడూ కక్కుర్తిపడి లంచాల జోలికి పోలేదు. చుట్టుపక్కల వాళ్లు ఇవ్వజూపినా సరే వద్దనడమే కాక వాళ్లని కూడా అడ్డుదోవలు తొక్కద్దనేవాడు. వాళ్లు అచ్యుతరామయ్య హితబోధను పెడచెవిన పెట్టి బల్లకింద చేతులుంచి ఆమ్యామ్యాల కోసం తహతహలాడేవారు. ఒకట్రెండుసార్లు అదే ఆఫీసులో గుమాస్తాలిద్దరు అవినీతి నిరోధక శాఖ వారి వలలో చిక్కుకుపోయి సస్పెండయ్యారు. మళ్లా వాళ్లు ఉద్యోగం పొందడానికి నానా యాతనా పడాల్సి వచ్చింది. తిరిగి చేరాక అదే పద్ధతిలో నడుస్తుంటే ‘ఒకసారి బొప్పి కట్టినా మీకు బుద్ధి రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. మీ వెనక మీ కుటుంబం ఒకటి ఆధారపడి ఉందన్న సంగతి మరువద్దు’ అని తలవాచేలా చీవాట్లు పెట్టాడు అచ్యుతరామయ్య.
‘‘ఏదో మా దురదృష్టంకొద్దీ దొరికిపోయాం. మా పిల్లలకు ఖరీదైన చదువులు చెప్పించాలంటే ఈ జీతాలతో అవుతుందా? అసలే ధరలోటి మండిపోతున్నాయి’’ అని ఎద్దేవా చేశారాయన్ని. అయినా ఉండబట్టక హెచ్చరిస్తునే ఉండేవాడు.
ఆయన స్వభావం అక్కడందరికీ గండకత్తెర మాదిరైంది.
అచ్యుతరామయ్య పదవీ విరమణ ఆఫీసులో అందరికీ కొండంత ఊపిరిపోసింది. సన్మానం చేసేసి పంపేస్తే ఓ పనైపోతుందనుకున్నారు. అప్పుడే ఇద్దరు కూతుళ్లు హాసాన్విత, వౌక్తిక తన భర్తలతో దిగారు.
పదవీ విరమణ సభలో తాను కుటుంబం కోసం కేవలం జీతం రాళ్లతో ఎలా గడుపుకొచ్చిందీ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలకు ఇంటిల్లిపాదీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పెద్ద కూతురు హాసాన్విత, అల్లుడు మనోజ్ వజ్రం పొదిగిన ఉంగరాన్ని కానుకగా చదివించారు. రెండోకూతురు వౌక్తిక భర్త స్వరూప్ తాహతుకు తగ్గట్టుగా వెండిపళ్లెం ఇచ్చింది. కొడుకు అభిజిత్ ఓ బంగారు గొలుసును బహూకరించాడు.
రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందనే పదిరోజులపాటు ఉండాలని ప్లాన్ చేసుకుని వచ్చారు వాళ్లంతా. అభిజిత్ విజయనగరంలో కలెక్టరాఫీసులో పనిచేస్తున్నాడు. తల్లి, దండ్రి అతని దగ్గరే ఉంటున్నారు. ఒకరోజు హాసాన్విత తండ్రి దగ్గరగా వచ్చి గోముగా ‘‘నాన్నగారూ! మీకు వచ్చే డబ్బు గురించి గాని, మరేమైనా కాని అడగడానికి రాలేదు. మీ అల్లుడిగారికి నాకూ ఇద్దరికీ ఉద్యోగాల రీత్యా ఇప్పట్లో మన దేశానికి రాలేని పరిస్థితి. పిల్లలను చూసుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పలేను. అందువల్ల మీరిప్పుడు కాకపోయినా, మీ పెన్షన్ వగైరాలన్నీ సెటిల్ చేసుకుని రండి, మీరిక్కడుండి గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటమేగా! దయచేసి మా కోరికను మన్నించండి’‘ అని సుతిమెత్తగా మాట్లాడింది.
అల్లుడు మనోజ్ కూడా తనదైన శైలిలో వివరించాడు. అక్కడికొస్తే కొత్త కొత్త ప్రదేశాలు చూడవచ్చని ఆశ పెట్టాడు.
‘‘లేదమ్మా! ఇప్పట్లో నేనీ ఊరు విడిచి రాలేను. అమ్మ వస్తానంటే పంపిస్తా. నాకేమీ అభ్యంతరం లేదు. నేనిక్కడ అన్నయ్య, వదినల దగ్గరుంటాను’‘ అనేశాడు నిర్మొహమాటంగా.
‘‘రిటైరైన తర్వాత మీరు మాకెంతో ఉపయోగపడతారనుకున్నాను. ఈ జవాబు మీ నుండి వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు’’ అనేసి తల్లివైపుకు చూసి అడిగింది.
దేశం కాని దేశంలో తనను భర్తను వదిలిపెట్టి రాలేనని, తనది, భర్తది ఒకటే మాటంటూ తల్లి వనజాక్షి కూడా మొగ్గకపోవడం ఆశ్చర్యమనిపించింది హాసాన్విత దంపతులకు.
‘‘విదేశాలకంటే ఎగిరి గంతేసి మరీ వస్తారనుకున్నాం. మీకు యోగం లేకపోతే మేమేం చేయగలం?’’ అనేశాడు కాస్త కటువుగానే మనోజ్. వాళ్ల హావభావాలు ఎలా ఉంటాయో తెలుసు వారికి. అందుకే మిన్నకుండిపోయారా దంపతులు.
ఇక రెండో కుమార్తె వౌక్తిక కూడా తండ్రిని సహాయ సహకారాలర్ధించాలనే యోచనలోనే ఉంది. తన భర్తకు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంవల్ల ఆదాయం చాలటం లేదని, తమ అపార్ట్‌మెంట్ దిగువన ఓ చిన్న దుకాణం పెట్టుకుంటామని, అక్కడ కూర్చోడానికి ఉండవలసిందిగా అభ్యర్థించింది. తండ్రి అచ్యుతరామయ్య ఉద్యోగ బాధ్యతలనుండి వీడిపోయాక అతనికి పూర్తిగా ఖాళీయేనన్న భావనతోనే ఉన్నారింత కాలం.
పై దేశం వెళ్లడానికి ఇష్టపడరని, తమ వ్యాపారానికి చేదోడు వాదోడుగా నిలుస్తారని భారీగానే అంచనా వేశారు. కానీ ఆ అంచనా కాస్తా తల్లకిందులవడానికి అట్టే సమయం పట్టలేదు.
‘‘లేదమ్మా! మీ ఒక్కరికే పరిమితమయ్యే పనికే నేను అంకితమైపోలేను. మీకు మరేదైనా సహాయం కావలిస్తే చేయగలను. అందరికీ ఉపయోగపడే పనులు చేపట్టాలని నా ఆశయం’’ అనేసారు నిష్కర్షగా.
‘‘అందరికీ ఉపయోగపడే పనులంటే ఏమిటో! పెద్ద చెప్పొచ్చారు. ఇదో కుంటి సాకంతే!’’ అని దెప్పింది వౌక్తిక.
ఓ స్కూలు తెరిచి, దాని బాధ్యతలను తండ్రికి అప్పచెబుదామనుకున్నాడు అభిజిత్. అక్కలిద్దరికీ జరిగిన సంఘటనలను చూసాక తన మనసులో మాటను అణిచేసుకున్నాడు.
‘‘నీకేం బాబూ! హాయిగా అమ్మా నాన్నలిద్దరూ నీ దగ్గరే ఉంటారు కాబట్టి, మా బాధలు నీకుండవు’’ అని ఇద్దరక్కలు తలో రకంగా ఆడిపోసుకున్నారు అభిజిత్‌ను.
అందరికీ ప్రయోజననం చేకూర్చే పని మాత్రమే చేస్తారట! ఆ మాట అచ్యుతరామయ్య నోటంట పదే పదే రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
* * *
ఇంట్లోకి దూసుకొచ్చిన వెంటనే టీవీ ఆన్ చేసిన కొడుకును చూస్తూనే నిర్విణ్ణురాలైంది వనజాక్షి.
కొన్ని ఛానల్స్ గాలించాక ఒక చోట ఆపి ‘‘చూడమ్మా! చూడు! మీ ఆయనగారి ఘనత! మండుటెండలో రోడ్డుకి అడ్డంగా కూర్చుని, ఏం చేస్తున్నారో చూడు. ఆ గగ్గోలు విను. ఈయన గారేమన్నా అన్నాహజారే అనుకుంటున్నారా? రోడ్డు పాడైపోయినా ఎవరూ బాగుచేయలేదట! మరి ఈయన ఒక్కరికే కనిపించిందా? ఆ దారంట ఎందరో వెళ్లడంలేదా? ఈయనకిష్టం లేకుంటే అట్నుంచి వెళ్లడం మానేయాలి. అంతే తప్ప ఈ వయసులో ఎందుకీ ప్రయాస! ఈయన విన్యాసాలు చూసి నా కొలీగ్స్ ఎంతలా వెటకరిస్తారో?! నాకెందుకీ టెన్షన్? అక్కలు పిలిచారు. వాళ్లతోనైనా వెడితే బాగుండేది. ఈ సమాజాన్ని మనమొక్కరమే మార్చేయగలమా?’’ అని చాలా బాధగా చెప్పాడు అభిజిత్.
అక్కడ దృశ్యాలన్నీ పదే పదే టీవీ వాళ్లు వ్యాఖ్యానాలతో చూపిస్తున్నారు. పక్కనున్న ప్రజల స్పందనను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ‘పదవికే గాని సేవాభావానికి విరమణ లేదని నిరూపిస్తున్న విశ్రాంత ఉద్యోగి అచ్యుతరామయ్య’...‘ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనంతట మనమే నడుం కట్టాలని రుజువు చేసిన మనీషి’ అని ఇలా రకరకాలుగా అచ్యుతరామయ్య చేసిన పనిని హైలెట్ చేయడానికేగాక రాజకీయ నాయకులను తూర్పారబట్టడానికి కూడా టీవీ వాళ్లకి మంచి అదను చిక్కింది.
భర్త చేష్టలు చూసి తల్లడిల్లి పోతుందనుకున్న తన తల్లి వనజాక్షి కళ్లల్లో ఎటువంటి భయాందోళనలు కనిపించకపోవడం చిత్రమనిపించింది అభిజిత్‌కు.
‘‘అందరికీ ఉపయోగపడేలా ప్రవర్తించాలన్న ఆయన ఆశయం గొప్పదిరా!’’ అని తల్లి అనేసరికి మారు మాట్లాడలేకపోయాడు అభిజిత్.
కోడలు ప్రణయ మాత్రం ఊరుకోలేక ‘మీకేం పోయింది రాజకీయ నాయకులు కక్షగట్టి పోలీసులచేత కౌకు దెబ్బలు తినిపిస్తే తెలుస్తుంది. విడిపించడానికి నానా బాధలు పడాలి. మీ కొడుక్కి అంత పలుకుబడి, డబ్బు రెండూ లేవు’ అనేసింది.
‘‘బాగా చెప్పావమ్మా! ఆనాడు గాంధీగారు మనందరి స్వేచ్ఛకోసం ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారని? ఎన్నిసార్లు జైలుకెళ్లారని? ఆ రోజు ఆయనే వెనక్కి తగ్గి ఉంటే ఈరోజు మన దేశం ఏ పరిస్థితిలో ఉండేదో ఆలోచించు!’’ అని భర్త తరఫున మాట్లాడింది వనజాక్షి.
ఆ జవాబు ప్రణయకు చెంపపెట్టులాగ తగిలింది.
మరో ఛానల్‌లో కలెక్టర్‌గారు రావడం, అత్యుతరామయ్యను లేపి నిరసనను విరమించమంటూ కోరడం, త్వరలోనే రోడ్డుకి మోక్షం కలుగుతుందని చెప్పడం అక్కడున్న ప్రజలంతా హర్షధ్వానాలు చేయడం నిముషాల్లో జరిగిపోయింది.
ఆ దృశ్యం చూసిన అభిజిత్, ప్రణయల మొహాల్లో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. వనజాక్షి పెదాలపై సన్నని చిరునవ్వు మొలిచింది.
* * *
మండుటెండలో కూర్చోవడంవల్ల అచ్యుతరామయ్య కాస్త వడలిన మాట వాస్తవం. తండ్రి ఇంటికి రావడంతోనే దెబ్బలాటకు దిగాడు అభిజిత్. ఒకవైపు విచారం, మరోవైపు ఆగ్రహం రెండూ కలిగాయి.
‘‘లేనిపోనివన్నీ ఎందుకు తలకెత్తుకుంటారు నాన్నా? ఈ పట్నంలో మరెవరికీ లేని బాధ మీకొక్కరికే ఎందుకని? రాజకీయ నాయకులంతా గుడ్డిగా ప్రవర్తిస్తుంటే మీకెందుకు? మీ దైనందిన కార్యక్రమాలతో హాయిగా, ప్రశాంతంగా జీవించండి. మీకేది కావాలంటే అది నేను చేసిపెడతాను’’ ఈసారి అనునయంగానే చెప్పాడు అభిజిత్ తండ్రికి.
‘‘నేను అప్పుడూ ఇప్పుడు ఒకే మాట! అందరికీ ఉపయోగపడేలాగ ఈ చివరి జీవితం గడపాలని’’ అని ఠక్కున జవాబిచ్చాడు అచ్యుతరామయ్య.
అప్పుడు కూడా ఖాళీగా లేకుండా భార్య వనజాక్షి చేత ఏదో రాయిస్తున్నారు. ఆమె తన గుండ్రని దస్తూరీతో రాస్తోంది. ఏదో వినతిపత్రం. ఈ మధ్యన తంగుడుబిల్లిలో మట్టిపెళ్లలు విరిగి పడి ఇద్దరు కూలీలు దారుణంగా మరణించారు. అప్పుడు వారి కుటుంబాలు వీధినపడ్డాయి. ఆ సమయంలో ఉన్న కాంట్రాక్టర్ తప్పించుకుని తిరిగాడు. మంత్రుల హామీలు గాల్లో కలిసాయి. నష్టపరిహారం ఇవ్వక వారి బిడ్డలు పూటకి గతిలేని అనాధలయ్యారు. ఈ విషయం మరుగునపడిపోయినా సరే అచ్యుతరామయ్య పైకి తీసి అన్ని శాఖల వారికీ వినతిపత్రాలు పంపాలని నిశ్చయించుకుని తయారుచేస్తున్నాడు. లోగడ పత్రికల్లో వచ్చిన వార్తలు, ఫోటోలు కత్తిరించి లేఖలతోపాటు జతచేసాడు. కొన్ని స్వయంగా ఇచ్చి, మరికొన్ని పోస్టుద్వారా పంపాడు. అదే విషయాన్ని విలేకరులకు సమావేశం పెట్టి వెల్లడించాడు. ‘‘మీరింతలా కింద మీదా పడ్డా కాలదోషం పట్టిన అంశానికి స్పందన లభిస్తుందని నే ననుకోవడంలేదు’’ అనేసి నీరుగార్చాడు అభిజిత్.
అయినా పట్టించుకోకుండా ‘‘ఓ వృద్ధుడు ఓ మొక్క పాతుతుంటే దారంట పోయేవాళ్లంతా కాటికి కాళ్లు చాచుకుని నీకెందుకయ్యా? దానికి కాచేపండ్లు నువ్వు తిందామనేనా? అని ఎద్దేవా చేసారట! అప్పుడా ముదుసలి ఏమన్నాడో తెలుసా? నా కోసం కాదు రాబోయే తరం కోసం! అని’’. అచ్యుతరామయ్య అన్న మాటలో ఎంత నిగూడార్థం ఉందో అవగాహనకొచ్చింది అభిజిత్, స్వరూపలకు.
తను చేయవలసిన పనులేమిటి? ఎవరికి ఏది ఉపయోగపడుతుంది అని వాటిని అన్నిటిని, ఒక జాబితాలాగ తయారుచేసి నోట్స్ రాసుకున్నాడు అచ్యుతరామయ్య. వాటిలో ఒకటి ముందు, ఒకటి వెనకగా చేసుకుంటూ వెళ్తున్నాడు. దేనిలోను రాజీపడకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించాలని యోచిస్తున్నాడు. తోడొచ్చిన వాళ్లు వస్తున్నారు...
మధ్యలో కూతుళ్ల దగ్గరనుంచి ఫోన్లొచ్చేవి. అవి కేవలం తండ్రి చేస్తున్న కార్యక్రమాలపై నిందలు, విమర్శనల కోసమే! ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను మరువరాదని హెచ్చరిక చేసేవారు. అలాటి వాటిని ఏనాడూ పట్టించుకునేవాడు కాదు అచ్యుతరామయ్య. అప్పుడు సైతం ఆయన ఆత్మవిశ్వాసం మరింత బలపడి ముందడుగు వేయడానికి తోడైంది.
* * * *
తన చుట్టుపక్కల యువతీ యువకులను పోగుచేసి వారందరినీ తనతోపాటుగా తీసుకుని ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టాడు అచ్యుతరామయ్య.
‘‘మనం దేహం వీడినా మన నేత్రాలు వేరొకరికి చూపును ప్రసాదిస్తాయి కాబట్టి మరణానంతరం వాటిని దానం చేయడం చాలా మంచిది’’ అని చెబుతూనే హామీ పత్రాలపై సంతకాలు చేయించి సంబంధిత అధికారులకు అందచేయసాగాడు. ముందుగా తనే శ్రీకారం చుట్టాడు. అంతేకాక భార్య వనజాక్షిచేత కూడా నేత్రదానం పత్రాలపై సంతకం చేయించాడు.
‘‘అవకరం ఉన్న దేహానికి అంత్యక్రియలు నిర్వహించినా ఆత్మకు శాంతి కలగదట! ఏకంగా నరకానికే పోతారట!’’ అని కాళ్లల్లో కర్రపెట్టాడు అభిజిత్.
‘‘అసలు స్వర్గనరకాలంటూ చూసేది పైకెళ్లాకనే! ప్రస్తుతం చూపొస్తే సాటి మనుషులకు స్వర్గం చూపించడమేగా!’’ అని తన ఉద్దేశాన్ని ముందుగా కాలేజీల్లోను, ఫంక్షన్లలోను, సాహితీ సభల్లోను అవగాహన సదస్సులాంటివి చేపట్టాడు. అదే సమయంలో రక్తదానం కూడా మనిషి ప్రాణాలను కాపాడ్డంలో ప్రధాన పాత్ర వహిస్తుందని విశదీకరించేవాడు. దానికి కూడా విశేష స్పందన లభించింది. ఎందరెందరో తమ గ్రూపు వివరాలు, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇచ్చారు.
దీనికి అచ్యుతరామయ్యకు తోడయింది యువతే కాకుండా ఉద్యోగస్తులు కూడా!
* * * *
లోగడ అచ్యుతరామయ్యతోపాటు పనిచేసిన కొందరు ఉద్యోగస్తులు కనిపించినపుడల్లా ‘‘మీకెందుకండీ! ఈ వయోభారంతో అరవచాకిరీ! సమాజాన్ని మీరెంత బాగు చేయాలనుకున్నా మళ్లా ఖరాబవుతూనే ఉంటుంది. మరి వృధా ప్రయాసేలా?’’ అని, మరికొంతమంది ‘‘్భష్! ఇంటికి పాటుపడేవాళ్లనే చూసాం. ఇలా ఇతరులకోసం తమ కాలాన్నంతా వినియోగించే మనిషిని మిమ్మల్నే చూస్తున్నాం!’’ అని పొగిడి పొంగించేవారు.
పొగిడినప్పుడు పొంగి, తెగిడినప్పుడు కృంగిపోవడం ఏనాడూ చేయలేదు. సమపాళ్లలోనే ప్రవర్తించాడు అచ్యుతరామయ్య
‘‘ఏమండీ! మీ దృక్పథం మంచిదే! నాకు మరో గొప్ప ఆలోచన తట్టింది. దాన్ని ఆచరణలో పెడితే మంచిదని నా ఉద్దేశం’’ అన్నది వనజాక్షి.
‘‘ఏమిటో చెప్పు. ఈ ఊపిరి ఉన్నంత వరకు నా శక్త్యానుసారం సహాయపడతాను’’ అన్నాడు దృఢ చిత్తంతో.
‘‘మన చుట్టూ ఎందరో అనాధలున్నారు. మనంతట మనం ఆశ్రమాలు నిర్వహించలేకపోవచ్చు. కాని ఉన్న ఆశ్రమాలను ఎలా వినియోగించుకోవాలో తెలీని వారిని తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది?’ అని సలహా ఇచ్చింది.
భార్య చెప్పిన సూచన అచ్యుతరామయ్యను హత్తుకుంది. ఆ వెంటనే ఆ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. మురికివాడల్లోను, ఫుట్‌పాత్‌లపై, రైల్వే స్టేషన్ దగ్గర బతుకు వెళ్లదీసే వాళ్లని గుర్తించి ఆశ్రయం కల్పించడమే కాక చదువుకూడా మప్పేటట్టుగా ఆశ్రమ నిర్వాహకులను కలిసి ఏర్పాటు చేశాడు.
* * * *
ఒకరోజున ఆఫీసుకు బయలుదేరాడు అభిజిత్. తను రోజూ వెళ్లే దారిలోంచి వెడ్తుంటే దారి మూసేసి ఉన్నది. అది ఒకప్పుడు తన తండ్రి నిరసన తెలియజేసిన రామానాయుడు రోడ్డు. అదే ఇప్పుడు బ్లాక్ చేసారు. బాగుచేసి కొత్త రోడ్డు వేస్తారట!
ఒకనాడు తన తండ్రి మండుటెండలో కూర్చుని నినాదాలు చేస్తుంటే ఆయనను చూసి కుతకుతలాడిపోయాడు తను.
మరి ఈరోజు! మార్పు చూసేసరికి మనసంతా ఎంచక్కటి హాయినిచ్చింది. దారి మళ్లించి వేరేదారంట ఎన్‌సిఎస్ థియేటర్ పక్కనుంచి ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఆఫీసులో ఉన్నాడన్న మాటేగానీ ఇంటివైపు దృష్టి మరలింది అభిజిత్‌కి. పని వత్తిడివల్ల సాధ్యంకాలేదు. ఉండబట్టక తండ్రికి ఫోన్ చేశాడు.
‘‘ఏరా అబ్బాయ్! నేనిక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నా! మహా బిజీగా ఉంది. తర్వాత ఫోన్ చేయి’’ అని ఫోన్ పెట్టేసాడు అచ్యుతరామయ్య.
తండ్రి నిరంతర వ్యాపకం సేవా తత్పరతే!
రాత్రి ఇంటికి వెళ్లేసరికి తల్లి వనజాక్షి టీవీ చూస్తోంది. ‘‘పట్నంలో బాగోగులు’’ ప్రోగ్రాంలో రామానాయుడు రోడ్డుకి మోక్షం క్లిప్పింగ్స్‌తో పాతవన్నీ ఒకటొకటే చూపిస్తున్నారు. గతంలో అచ్యుతరామయ్య చేసిన నిరసన వల్లే, చూపిన పట్టుదలవల్లే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని న్యూస్ రిపోర్టర్ పదే పదే చెప్పసాగాడు. తన భార్య ప్రణయ కూడా అత్తగారితో కలిసి చూడ్డం అభిజిత్‌కి సంతృప్తినిచ్చింది.
* * * *
అచ్యుతరామయ్య రిటైరై సుమారు రెండు సంవత్సరాలవుతోంది. ఇక షష్టిపూర్తికి దగ్గరగా ఉన్నాడు. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగ అది.
‘‘ఒరే అభీ! మీ అందరి బాగోగులను చూసిన మనిషి మీ నాన్నగారు. ఆయన మిమ్మల్ని వ్యతిరేకించారనుకుంటే అది మీ అవివేకం!పదవి విరమించాక సమాజానికి సేవ చేద్దామన్న దృక్పథం ఆయనలో బాగా నాటుకోవడంవల్ల తన మనుషుల దగ్గర పడి ఉండడానికి అంగీకరించలేదు. మీరంతా కలిసి ఆయనకు చేయవలసిన షష్టిపూర్తి మహోత్సవాన్ని బాగా జరిపించండి. అదే నేను కోరుకునేది’’ అని విన్నవించింది వనజాక్షి.
‘‘అలాగేనమ్మా! నువ్వంతగా చెప్పాలా! మా బాధ్యత అది. నేను అక్కలతో మాట్లాడుతా! నువ్వేం బెంగపడకు’’ అనేసి ఆ వెంటనే పెద్దక్క హాసాన్వితకు కాల్ చేసాడు.
‘‘అదేంట్రా! మేం ఇక్కడకు రమ్మంటే రాచ కార్యాలున్నట్లుగా రావడం మానేసారు. దేశం కాని దేశంనుంచి బోలెడు డబ్బు పెట్టుకుని మేం రాగలమా చెప్పు’’ అని వ్యంగ్యంగా అన్నది హాసాన్విత. అభిజిత్ ఆమె అన్న మాటలు తప్పని చెబుతూనే తండ్రి చేస్తున్న కార్యక్రమాలు చక్కగా ఉంటున్నాయని అవగాహన పరిచాడు. రెండు నెలల తర్వాత తప్పక రావాలని తేదీతో సహా చెప్పాడు. తండ్రిగా లోగడ ఇంటికి చేసిన మేలు మరువకూడదని, ఆయనకు చేయవలసిన వాటిని చేయడం బాధ్యతగా భావించాలని బోధపరిచాడు. అదే సమయంలో మనోజ్‌తో కూడా మాట్లాడాడు. అతను మెత్తబడి సరేనన్నాడు.
ఆ రాత్రే వౌక్తికకు, భర్తకు విషయం వివరించాడు అభిజిత్. తమ్ముడి మాటను కొట్టిపారేయలేకపోయిందామె.
* * * *
అచ్యుతరామయ్య మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. షష్టిపూర్తిలాటివి తనకు పడవన్నాడు. కానీ హటాత్తుగా కూతుళ్లు, అల్లుళ్లు ఇంట్లో అడుగుపెట్టి బలవంతం చేయడంతో సరేననాల్సి వచ్చింది. ఇంట్లో అందరూ ఉన్నా సరే తండ్రి కుదురుగా ఉండకపోవడం కాస్త చికాగ్గానే అనిపించింది.
ఓ రోజున ఎవరో తలుపు తడితే తీసింది హాసాన్విత. ఎవరో అలగామనుషులు. ‘‘అబ్బ డర్టీగా ఉన్నారే...ఎవరు వీళ్లు?’’ అన్నది ఇబ్బందిగా మొహం పెడుతూ.
‘‘అమ్మా! రామయ్య బాబులేరా!’’ అనడిగారు ఒకమ్మాయి, ఓ కుర్రాడు
‘‘బయటకెళ్లారు... వెళ్లండి తర్వాత రండి’’ అని పంపేయబోతే ప్రణయ వచ్చి ఎవరని పలకరించి విషయం అడిగింది.
వాళ్లు తమ చేతిలో కాగితాలు ప్రణయకిచ్చారు. అవి ఇంగ్లీషులో ఉండడంవల్ల అక్కడే ఉన్న హాసాన్వితకు ఇచ్చింది.
మొత్తం చదివి ‘మీ పేర్లేమిటి?’ అని ప్రశ్నించింది హాసాన్విత.
‘‘పెంటంనాయుడు, రత్నాలు’’ అన్నారు వాళ్లు.
అదే సమయంలో మనోజ్ వచ్చి కాగితంలో విషయం చదివి ‘‘మట్టి పెళ్లలు విరిగి పడ్డ కారణంగా తల్లిదండ్రుల మృతివల్ల పిల్లలైన వీళ్లకి నష్టపరిహారంగా ప్రభుత్వం రెండు లక్షల రూపాయలను మంజూరు చేసింది’’ అని విడమరిచి చెప్పాడు.
‘‘ఔను! మీ మామగారు మూడునెల్ల క్రితం వీళ్ల తరఫున అందరికీ అర్జీలు పెట్టారు. దాని ఫలితం ఇప్పుడు దక్కింది’’ అన్నది వనజాక్షి.
అవతల ఉన్న ఆ పసిముఖాల్లో మెరుపును గమనించారంతా!
‘దరమ పెబువులయ్యా! రామయ్యబాబు... మా అమ్మనాన్నలు పోయినా మాకోసం కలకటేరుకాడికి, మంత్రుల కాడికి ఎన్నిసుట్లో తిరిగినారు’’ అని కళ్లంట నీళ్లు పెట్టుకున్నారు వాళ్లు. వాళ్లని మర్నాడు రమ్మని చెప్పి పంపేసాడు అభిజిత్.
ఇంట్లో అందరికీ అచ్యుతరామయ్య వ్యక్తిత్వం ఒక్కసారిగా అర్థమైంది.
* * * *
‘‘మీరంతా నాకోసం షష్టిపూర్తి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఆ రోజున నేను అనాధాశ్రమంలో గడపదలిచాను. మీకెవరికీ అభ్యంతరం లేకపోతే నాకు మీరిద్దామనుకున్న కానుకలకు బదులుగా విరాళాల రూపంలో డబ్బిచ్చినట్లయితే దాన్ని ఏమీ లేని అనాధలకు ఇచ్చేస్తాను.
ఎందుకంటే మీరేమైనా ఆభరణాలిచ్చినా వాటిని ధరించి ఆనందించలేదు. దయచేసి నన్నర్థం చేసుకుని నాకు సహకరించండి. మీరు వారితోపాటు సహపంక్తి భోజనం చేయండి’’ అని అందరి ముఖాల్లోకి చూసాడు అచ్యుతరామయ్య.
ఎవరూ ఆయన అభిప్రాయాన్ని ఖండించలేకపోయారు. ఆయనకు సంతోషాన్ని కలిగించేదే తామివ్వగలగాలి. లేనప్పుడు ఏదిచ్చినా ఉత్తదే! అనే ధోరణికి వచ్చారు.
మళ్లా అచ్యుతరామయ్యే అన్నాడు. ‘‘మీరు కోరినట్లుగా రిటైరైన తర్వాత మీ ఇళ్లదగ్గరే నేను గడిపి ఉంటే అది కేవలం మీ సేవకే పరిమితమయ్యేది. మనవలను చూసుకోవడం నేను కాకపోయినా మరెవరైనా చేయగలరు. స్కూలు పెట్టి అక్కడ నేను కాపలాగా ఉన్నా లేకున్నా ఎవరైనా డబ్బుకైనా దొరుకుతారు. అభిజిత్‌కు దుకాణం చూసుకోవడానికి మనుషులు దొరక్కపోరు కానీ పాడైపోతున్న సమాజాన్ని కొలిక్కి తేవడానికి ఎవరూ ముందుకురారు. ఎవరో వస్తారనేకంటే ఆ ఒకరు మనమెందుక్కాకూడదు అనే ఆలోచన చేయగలిగితే ఈ దేశం ఎప్పడో బాగుపడేది. నేను సర్వీసులో ఉన్నన్నాళ్లు దేన్నయినా వ్యతిరేకిద్దామన్నా, ఉద్ధరిద్దామన్నా ఉద్యోగిగా ముందుకెళ్లడానికి ఒక ఆటంకం ఉండేది. అందుకే నేను రిటైరైనాక సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను’’ అనేసి తన భావాలను ప్రకటించాడు అచ్యుతరామయ్య.
అందరికీ ఆయన మనోభావాలు అర్థం అయ్యాయి. ఆయన సలహా మేర నడచుకోవాలన్న నిర్ణయానికొచ్చారు.
* * *
షష్టిపూర్తి రోజు రానే వచ్చింది. అనాధల మధ్యన అచ్యుతరామయ్య ఉన్నాడు. ఇంట్లో వాళ్లంతా అక్కడికి చేరారు. అతి నిరాడంబరంగా జరిగింది. అనాధ బాలల అభ్యర్థన మేరకు కలెక్టర్ హాజరు కావడం అందరినీ విస్మయపరిచింది.
ఆయన వచ్చి అచ్యుతరామయ్యను ఉచితరీతిన సత్కరించి జ్ఞాపికను అందించారు.
‘‘ఏ కొందరో తన స్వార్థం విడిచిపెట్టి పొరుగువారికి సాయపడాలనుకుంటారు. ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో చలాకీగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అరుదు. మనిషికి కావాల్సింది మానవత్వం. అది పుష్కలంగా రామయ్యగారిలో ఉంది. భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆయుష్షును ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ముగించి సమయాభావం వల్ల వెళ్లిపోయారు.
ఆ దృశ్యం చూసిన అచ్యుతరామయ్య ఇంట్లోని వారికి ఆయనకు ఎంతటి పేరు ప్రఖ్యాతులేర్పడ్డాయో అర్థమైంది. ఆ క్షణమే ఆయన చేతులమీదుగా తమవంతు ఇద్దామనుకున్న విరాళాలు అందించారు.
లోగడ తామెంత తప్పుగా భావించిందీ తెలుసుకుని పశ్చాత్తాప పడ్డారు. తమకు మాత్రమే పరిమితమైతే అచ్యుతరామయ్య మామూలు మనిషే! కానీ ఇప్పుడో.... అందరి పాలిట దేముడిలాటి మనీషి!!
రచయిత చిరునామా
కె.కె.రఘునందన, 25-12-11, యస్.4
శ్రీ ప్రకాష్ టవర్స్, సెకండ్ ఫ్లోర్,
ఓరుగంటివారి తోట, దాసన్నపేట,
విజయనగరం - 535 002.
9492620382, 9705411897