ఏలూరు, నవంబర్ 18: యజ్ఞాలు, యాగాలు చేస్తే ప్రాజెక్టులు సాధ్యం కావని, దానికి రాజకీయ పట్టుదల అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కోసం యాగం చేస్తున్నారని, దానిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారన్న ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ యజ్ఞయాగాదుల వల్ల ప్రాజెక్టులు వచ్చే పరిస్థితి వుండదని, అదే నిజమైతే దేశమంతా యాగాలే ఉంటాయని చెప్పారు. ఎంత ఖర్చయినా పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద న్నారు. రాష్ట్రంలో తెలంగాణ సమస్యను పరిష్కరించనంత కాలం అనిశ్చితి కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయంలో వ్యక్తులను మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించలేక సమర్ధమైన పాలనను అందించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఆ వైఫల్యాలపై చర్చ రాకుండా ఉండేందుకే నాయకత్వ మార్పు అంశాన్ని తెరపైకి తెస్తోందన్నారు.
ఎఫ్‌డిఐపై నేడు నిరసనలు
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రంలో వున్న బెస్ట్ ప్రైస్ షాపుల ముందు తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఏల పేరుతో (్ఫ్యయల్ సర్‌ఛార్జ్ అడ్జస్ట్‌మెంట్) ట్రాన్స్‌కో 14 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి బిల్లుల రూపంలో వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 3న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య దళారీలా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. రెండు టిఎంసిల హంద్రీనీవా నీటి కోసం కిరణ్ సర్కార్ ఆందోళన చేయడం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని నారాయణ వ్యాఖ్యానించారు. తుంగభద్ర నుంచి 22 టిఎంసిల నీటిని సాధించడానికి ఆందోళనచేస్తే సిపిఐ పూర్తి మద్దతు వుంటుందని అన్నారు. నీలం తుపానులో పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 10 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
.............
పడిపోయిన ప్రకాశం
బ్యారేజీ నీటిమట్టం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 18: నీలం తుపాను ప్రభావంతో కొద్దిరోజులపాటు ప్రకాశం బ్యారేజీ నుంచి ఓ దశలో లక్ష క్యూసెక్కులపైన వరద నీరు సముద్రంలోకి వెళ్లగా ప్రస్తుతం ఎగువ నుంచి చుక్కనీరు అందక బ్యారేజీ నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. సాధారణంగా ఏడాది పొడవునా 12 అడుగులు ఉండాల్సింఉండగా ఆదివారం సాయంత్రానికి కేవలం 10.2 అడుగులు మాత్రమే ఉంది. డెల్టా ఆయకట్టులో కొన్ని ప్రాంతాల్లో వరికి నీటి అవసరంతో 3,200 క్యూసెక్కులను వదులుతుండడంతో నీటిమట్టం పడిపోతున్నది.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
english title:
y
Date:
Monday, November 19, 2012