కర్నూలు, నవంబర్ 18: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నామని చెప్పుకుంటున్న షర్మిల ఆ విషయం మరిచి కేవలం కాంగ్రెస్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్నూలు జిల్లా మల్యాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ షర్మిల, చంద్రబాబు యాత్రలపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు. పాదయాత్రలో షర్మిల ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారో లేదో గానీ తన తండ్రి హయాంలో అంటూ జనం నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు. షర్మిల తన తండ్రి వైఎస్ ఏం చేశారో చెప్పడం కన్నా సోదరుడు ఏం చేసి జైలులో కూర్చున్నారో చెబితే బాగుంటుందని అన్నారు. వైఎస్ అంటే తామందరికీ గౌరవమేనని, ఆయన హయాంలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో తమ వంతు పాత్ర కూడా ఉందన్న విషయం మరిచిపోకూడదన్నారు. తండ్రి చేసింది చెప్పడం కన్నా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడన్న ఆరోపణలపై జగన్ జైలుకు వెళ్లారని షర్మిల చెప్పాలన్నారు. ఇక చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు పాలిస్తే అందులో ఏడు సంవత్సరాలు కరవు కాటకాలతో రాష్ట్రం అతలాకుతలమైందన్న విషయం ప్రజలు మర్చిపోలేరన్నారు. ఆయన పాదయాత్ర కాదు తలకిందుల యాత్ర చేసినా అధికారంలోకి రావడం జరగదని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలు ఇప్పుడు పాదయాత్ర చేస్తేనే తెలుస్తున్నాయా, అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తే ప్రజలకు ఫలితం ఉండాలే కాని యాత్రల వల్ల ఇద్దరు నేతలు ప్రజలకు శిరోభారంగా పరిణమించా రాదన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి చేపట్టే యాత్ర ప్రజల కోసమని కితాబునిచ్చారు. రాయలసీమ ప్రజలు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న కృష్ణాజలాలను తీసుకెళ్లి ఇదుగోండి మీ సమస్య పరిష్కరించానని చెప్పడం కోసం రఘువీరా పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు. పాదయాత్ర అంటే ఇలా ఉండాలే గానీ ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించడం కాదని చురకంటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నామని
english title:
b
Date:
Monday, November 19, 2012