కర్నూలు, నవంబర్ 18: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతం కృషి చేసే తాము భగీరథ విజయయాత్ర పేర చేస్తున్నది రాజకీయయాత్ర ఎంత మాత్రం కాదని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. రాయలసీమకు సాగునీరందించేందుకు నిర్మించిన హంద్రీ-నీవా మొదటి దశను ప్రారంభించిన సందర్భంగా హంద్రీ-నీవా కాలువ వెంట రఘువీరా చేపట్టనున్న పాదయాత్రను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు జరిగిన బహిరంగ సభలో మంత్రి రఘువీరా మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు గత 50 సంవత్సరాలుగా కృష్ణా జలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వారి కోరిక తీర్చడం కోసం 2004వ సంవత్సరం నుంచి పడ్డ శ్రమకు ఇప్పుడు ఫలితమొచ్చిందన్నారు. దిగువ నుంచి 1200 అడుగుల ఎత్తుకు నీటిని తరలించడం అన్నది సాధారణమేమి కాదని, అయితే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన తాము ప్రజల కలలను నిజం చేశామన్నారు. కృష్ణా జలాల కోసం తపిస్తున్న ప్రజలకు వాటిని అందించి వారందించే ఆశీస్సుల కోసమే భగీరథ విజయయాత్ర చేపట్టామని వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లు తాను రాజకీయం కోసం ఈ పాదయాత్ర చేపట్టడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రియాశీలక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నవి రాజకీయయాత్రలని విమర్శించారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు ఇపుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రజలే అంటున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు. వ్యవసాయరంగంపై ప్రధానంగా ఆధారపడిన ప్రజల కోరికను తీర్చాల్సిన చంద్రబాబు ఆనాడు వ్యవసాయం గురించి పట్టించుకోక పోగా దండగ అంటూ గాలికొదిలేశారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న మరో రాజకీయ యాత్ర అధికారాన్ని దక్కించుకోవడం కోసమే తప్ప మరెందుకో కాదన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై బురదజల్లేందుకు ప్రాధాన్యతనివ్వడమే షర్మిల ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దిగువ నుంచి ఎగువకు నీటిని తీసుకెళ్లడం అనేది భగీరథ ప్రయత్నమేనని అందుకే దీనికి భగీరథ విజయయాత్రగా నామకరణం చేశామన్నారు. ఈ యాత్రలో రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు.
ఏం చేసినా ప్రజల కోసమే: మంత్రి రఘువీరా
english title:
ma
Date:
Monday, November 19, 2012