తిరుచానూరు, నవంబర్ 18: శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం పంచమీతీర్థం (చక్రస్నానం) ఆదివారం నేత్రపర్వంగా సాగింది. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మసరోవరంలో కార్తీకమాసం, శుక్లపక్ష పంచమి తిధి, ఉత్తరాషాడ నక్షత్రంలో శుక్రవారం రోజున స్వర్ణకమలంలో అమ్మవారు పద్మావతీదేవిగా అవతరించి అనుగ్రహం ప్రసాదించిందని ప్రశస్థి. అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో ప్రతియేటా నిర్వహించే పంచమీతీర్థం రోజున స్నానమాచరిస్తే సకల పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నిత్యకైంకర్యాలు పూర్తయిన తర్వాత అమ్మవారు, చక్రతాళ్వార్లను సన్నిధి నుండి వేంచేపుగా పద్మసరోవరంలోని పంచమీతీర్థం మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అక్కడ స్నపనతిరుమంజనం సమర్పించి తిరుమల నుంచి శ్రీవారు పంపిన సారెను ఊరేగింపుగా పద్మసరోవరానికి తీసుకువచ్చి అమ్మవారికి ధరింపచేశారు. అనంతరం అమ్మవారి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్లకు పంచమితీర్థం (చక్రస్నానం) వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వాములు చక్రతాళ్వారును భక్తుల గోవిందనామస్మరణల మధ్య పద్మసరోవరంలోనికి తీసుకువచ్చి మూడు మునకలు వేయించారు. అప్పటివరకు వేచి ఉన్న భక్తజనకోటి ఒక్కసారిగా మరింత బిగ్గరగా గోవిందనామస్మరణలు చేస్తూ పద్మసరోవరంలో పవిత్ర స్నానమాచరించి భక్తితో పులకించారు. అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో జరిగే చక్రస్నానం రోజున పుణ్యస్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే ఆంధ్రరాష్ట్రం నుండే తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుపతి నుండి తిరుచానూరు వరకు ఉన్న మార్గం మొత్తం భక్తజనకోటి సంద్రమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో గోవిందనామస్మరణలు చేస్తూ ఆలయం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. సుమారు రెండులక్షల మంది భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించి ఉంటారని టిటిడి అధికారుల అంచనా. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, తిరుపతి, తిరుమల జెఇఓలు వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసరాజు, ఎంపి రాయపాటి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, డిఐజి చారుసిన్హాతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన పంచమీతీర్థం (చక్రస్నానం)కు భక్తులు పోటెత్తారు. కాగా, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఈనెల 10వతేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరిగాయి. రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారు వివిధ వాహనాల్లో పలు రూపాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చివరిరోజు ఆదివారం ఉదయం 11.45 గంటలకు పద్మసరోవరం లో అమ్మవారి ప్రతినిధిగా చక్రత్తాళ్వార్లకు పంచమీతీర్థం స్నానం చేయించారు. రాత్రి అమ్మవారిని బంగారు తిరుచ్చిపై మాడా వీధుల్లో ఊరేగించారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకులు ధ్వజ స్తంభంపై ఉన్న గజచిత్రపటాన్ని అవరోహణం చేయడంతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
వేడుకగా పద్మ సరోవరంలో చక్రస్నానం ముగిసిన తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
english title:
koti
Date:
Monday, November 19, 2012