చాంద్రాయణగుట్ట, నవంబర్ 21: హైదరాబాద్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు మార్పు కార్యక్రమంద్వారా తగు చర్యలు చేపట్టనున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ తెలిపారు. నాంపల్లి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా ఆరోగ్యశాఖ, జిహెచ్‌ఎంసి, పిడి మహిళ, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, వయోజన విద్యశాఖాధికారులతో కలెక్టర్ సమావేశమై మాతా శిశు సంరక్షణకు మార్పు కార్యక్రమంద్వారా అమలు చేయాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ వివిద శాఖలద్వారా ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు బస్తీలలో గర్భీణీలకు, మాతా శిశు సంరక్షణకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారని, ఇంకా పకడ్బందీ ప్రణాళికతో వివిధ శాఖల సమన్వయంతో విస్తృత సేవలు అందిస్తూ జిల్లాలో మాతా శిశు మరణాలను అరికట్టేందుకు జిల్లా స్థాయినుండి బస్తీ స్థాయి వరకు మార్పు కార్యక్రమాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇకనుండి స్వయం సహాయక బృందాలనకూడా ఈ కార్యక్రమంలో భాగస్తులను చేసి బస్తీలలో క్షేత్ర స్థాయివరకు ప్రభుత్వ గర్భిణీలకు, మాతా శిశువులకు చేసే సేవలు ప్రచారంచేసి సేవలను అందరూ ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తారు. ప్రతి గర్భణీ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడాలన్నారు.
ఈ మేరకు జిల్లా సర్కిల్, బస్తీ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో అదనపు జాయింట్ కలెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లు, డిఎం అండ్ హెచ్‌ఓ, పిడి మహిళా శిశు సంక్షేమశాఖ సర్కిల్ స్థాయిలో డిపివోలు, సిడిపివోలు, సూపర్‌వైజర్లు, మెడికల్ అధికార్లు, బస్తీ స్థాయిలో ఎస్‌ఎల్‌ఎఫ్, అంగన్‌వాడీ వర్కర్లు, ఎఎన్‌ఎంలు కమిటీలలో సభ్యులుగా ఉండాలన్నారు. వారం లోపు డిపివోలు, సివోలు స్వయం సహాయక బృందాలతో సమావేశం ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్‌కు కలెక్టర్ సూచించారు. మార్పు కార్యక్రమం ద్వారా అమలుచేసే 20 సూత్రాలను కలెక్టర్ అధికారులకు వివరించారు.
23, 24 తేదీల్లో జిల్లా స్థాయిలో సైన్స్, ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిబిషన్
చాంద్రాయణగుట్ట, నవంబర్ 21: పాఠశాలల విద్యార్థుల్లో సైన్స్, పర్యావరణంపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 23, 24 తేదీల్లో సికిందరాబాద్ బోయిన్‌పల్లిలోని సిఎంఆర్ మోడల్ స్కూలులో జిల్లా స్థాయి సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనదలచిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ పేర్లను బోయిన్‌పల్లిలోని సిఎంఆర్ మోడల్ స్కూలులో ఈనెల 22వ తేదీన పేర్లను నమోదు చేసుకోవాల్సి వుంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 23వ తేదీన శుక్రవారం 10 గంటలకు జిల్లా కలెక్టర్ రిజ్వీ ముఖ్యఅతిధిగా విచ్చేసి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మారెడ్డి, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ శాఖ సభ్యులు డా.బి.ఎన్.రెడ్డి, మల్లారెడ్డి గూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ సిహెచ్ మల్లారెడ్డి పాల్గొంటారన్నారు.
26 నుంచి ఉద్యమం ఉద్ధృతం
- లంబాడీ హక్కుల పోరాట సమితి -
ఖైరతాబాద్, నవంబర్ 21: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈనెల 26 నుంచి దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోరాటసమితి అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్, డి.శ్రీనివాస్ నాయక్, ధరావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వివక్షకు గురౌతున్న గిరిజనులపై నోరు మెదపని పార్టీలు, బిసీ, ఎస్సీ, మైనారిటీ, వికలాంగ సంక్షేమం కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.
లంబాడీ తండాలను పంచాయతీలుగా గుర్తించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, లంబాడీలకు ఏజెన్సీ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని, మైదాన ప్రాంత గిరిజనులకు ప్రత్యేక ఐటిడిఏలను ఏర్పాటుచేసి బడ్జెట్ కేటాయించాలని, విద్యార్ధులకు మెస్‌చార్జీలు పెంచాలని, పక్కా హాస్టల్ భవనాలు నిర్మించాలని ప్రభుత్వాలకు వినతులు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని, ఈ నేపధ్యంలోనే తాము హక్కుల సాధన కోసం ఉద్యమించనున్నట్టు ఆయన తెలిపారు. 26న నల్లబ్యాడ్జీలు ధరించి అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు, డిసెంబర్ 3న ఆర్‌డిఓ కార్యాలయాల ముందు నిరసన, డిసెంబర్ 27న జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు నిరసన, మార్చి రెండో వారంలో లక్షలాది మందితో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు పాల్గొన్నారు.