వికారాబాద్, నవంబర్ 21: జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సరైన విధంగా నష్టపరిహారం బాధితులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో నమోదైన 42 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, నష్టపరిహారంపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేసుల వారీగా పరిశీలించి తక్కువ నష్టపరిహారం అందిన కేసుల విషయమై అధికారులతో చర్చించారు. ఒకే కేసు రెండు సార్లు నమోదవడంపై వివరణ అడిగారు. కేసులకు సంబంధించి కన్సాల్టెడ్ కాపీని రంగారెడ్డి జిల్లా ఎస్పీకి అందించాలన్నారు. ఓ కేసులో 15 వేల రూపాయల నష్టపరిహారం సరికాదని, అంతకన్నా ఎక్కువ ఉండాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కులధ్రువీకరణ పత్రాలను తొందరగా ఇస్తే పురోగతిని తొందరగా సాధించవచ్చన్నారు.
చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల 30వ తేదీన గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో తప్పుడు కేసులపై ఫిర్యాదులు వస్తే పిలిచి మాట్లాడుతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 42 కేసులున్నా కేవలం ఒకే ఒక్క పిపి ఉండటం మూలాన ఇబ్బందులెదురవుతున్నాయన్నారు.
తప్పుడు కేసులపై అధికారులు నివేదికలు ఇస్తున్నారని తెలిపారు. కేసుల దర్యాప్తు సాగుతోందని తెలిపారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, తాండూర్ ఇంచార్జి డిఎస్పీ టి.ఎస్.రవికుమార్, వికారాబాద్ డిఎస్పీ కె.చౌడేశ్వరి, చేవెళ్ళ సిఐ బి.శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి, ఎస్‌బిఐ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యల్ని పరిష్కరిస్తూనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: తలసాని
తార్నాక, నవంబర్ 21: తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌లు ఆయా డివిజన్‌లలో ప్రజాసమస్యలపై దేశం కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం టిడిపి నగర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈనెల 30వతేదిన టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన నిజాం కళాశాల బహిరంగ సభను జయప్రదం చేయడంలో కార్పొరేటర్‌లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. డివిజన్ అధ్యక్షులతో సమన్వయంతో ముందుకు సాగాలని నగరంలో తెలుగుదేశం పార్టీని తిరిగి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో కార్పొరేటర్‌లు పార్టీ కోసం నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని తలసాని వారికి సూచించారు.
ప్రతి శనివారం ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే పాదయాత్రల్లో కార్పొరేటర్‌లు విధిగా పాలుపంచుకోవాలని, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూనే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అస్లమ్, శేషుకుమారి, చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యా ప్రమాణాలు
తాండూరు, నవంబర్ 21: తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత విద్యాప్రమాణాలు సాధించడం అభినందనీయని ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్య అందుబాటులో ఉందని అన్నారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. కళాశాలలో ఫర్నిచర్ కోసం రూ.5లక్షలు ఎమ్మెల్యే నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తాగునీరు, ఇతర వౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని చెప్పారు. డివిఇవో గౌరిశంకర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, నాలుగు దశాబ్దాల చరిత్ర కల్గిన తాండూరు కళాశాల మంచి విద్యాప్రమాణాలు కలిగి ఉత్తమ విద్యను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.శంకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలో క్రీడలకు ప్రోత్సాహం
వికారాబాద్, నవంబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని అందులో భాగంగా రెండు శాతం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక సెయింట్ జూడ్స్ హైస్కూల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వంలో క్రీడలకు ప్రోత్సాహం లభించలేదని విమర్శించారు. క్రీడల్లో పాల్గొని విద్యార్థులు రాణించాలని టిడిపి ప్రభుత్వం రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అమలుచేశారన్నారు. రిజర్వేషన్‌తో క్రీడల్లో ఆడిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే అవకాశముందన్నారు. జిల్లా స్థాయి క్రీడాపోటీలను వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు. గ్రామీణప్రాంత విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేలా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందన్నారు. గతంలో క్రీడలకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించగా ప్రస్తుతం దాన్ని 220 కోట్లకు పెంచిందన్నారు. పాఠశాల స్థాయి క్రీడలకు కేటాయిస్తున్న మూడు కోట్ల రూపాయలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులు ఒకరికొకరు పరిచయం చేసుకుని మాట్లాడి ఎక్కడ ఏంజరుగుతుందో తెలుసుకుని విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. క్రీడల్లో ఓడిన వారు గెలిచేందుకు, గెలిచినవారు పైస్థాయికి వెళ్ళేందుకు కృషిచేయాలని సూచించారు. జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారు రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు కృషిచేయాలన్నారు. తానూ క్రీడల్లో చురుకుగా పాల్గొనేవాడినని, 1981లో వాలీబాల్ అంటే తనకిష్టమని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు ఏ అవకాశం వచ్చినా తనవంతు కృషిచేస్తామన్నారు. గతంలో క్రీడలు హైద్రాబాద్ పరిసర మండలాల్లో జరిగేవని గుర్తుచేశారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్.శశాంక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు కేటాయిస్తున్న బడ్జెట్ సరిపోవడం లేదని నిర్వాహకులు స్పాన్సర్స్ కోసం వెతకాల్సిన పరిస్థితి ఉందని బడ్జెట్ పెరిగేందుకు కృషి చేయాలని మంత్రిని కోరారు. బడ్జెట్ పెరిగితేనే క్రీడలకు వచ్చే పిల్లలకు పౌష్టికాహారం, వసతులు, సౌకర్యాలు అందించగలరని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు హెచ్.శివకుమార్ మాట్లాడుతూ పరిగిలో జరగాల్సిన జిల్లా స్థాయి క్రీడలు మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవో వికారాబాద్‌లో జరుగుతున్నాయన్నారు.
జాతీయ స్థాయి క్రీడల్లో మన రాష్ట్రం నుండి ఎంతో మంది పాల్గొన్నారని, క్రీడల్లో రాణించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ప్రతి పాఠశాలలో పిఇటి పోస్టును భర్తీ చేయాలని కోరారు. వికారాబాద్ పట్టణంలో ఉన్న డైట్ కళాశాలలో ఉన్న పిఇటి డిప్యుటేషన్‌పై హైద్రాబాద్‌లో ఉంటున్నారని, అలా కాకుండా డైట్‌లో పిఇటి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా సహకరించాలన్నారు.
మర్పల్లి మాజీ ఎంపిపి నర్సింలు మాట్లాడుతూ 430 ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 50 పాఠశాలల్లో మాత్రమే పిఇటిలు ఉన్నారని, మిగతా 380 పాఠశాలల్లో పిఇటిలను భర్తీ చేయాలన్నారు.
కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిష్టయ్య అధ్యక్షత వహించగా కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ధారూర్ మాజీ ఎంపిపి పి.నర్సింహారెడ్డి, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్‌కుమార్, కొత్తగడి, బంటారం పిఎసిఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాంచంద్రారెడ్డి, బంటారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వహీద్, పతంజలి యోగా సమితి అధ్యక్షుడు ప్యాట మల్లేశం, బంటారం మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పటేల్ సంగమేశ్వర్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎల్.మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పిఇటిల నుండి పిడిలుగా పదోన్నతి పొందిన వారిని సన్మానించారు.
శృంగేరి శంకర మఠాన్ని దర్శించిన గవర్నర్
శంషాబాద్, నవంబర్ 21: శంషాబాద్ ఊట్‌పల్లిలో నిర్మించిన శృంగేరి శంకర మఠాన్ని బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు సందర్శించారు. జగద్గురు శంకరాచార్య భారతీ తీర్థ మహాస్వామి ఆశీర్వచనాలు పొందారు. గవర్నర్ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాస్వామితో సుమారు అరగంట పాటు గవర్నర్ గడిపారు. జగద్గురు శ్రీచరణాలకు పాదపూజ, బిక్షావందనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం, హరికథ కాలక్షేపం, రా.8.30 నిమిషాలకు మహాస్వామి వారిచే శ్రీ శారదా చంద్రవౌళీశ్వర పూజ కార్యమ్రం నిర్వహిస్తారు.
దర్శించుకున్న హోంమంత్రి
శృంగేరి శంకర మఠాన్ని బుధవారం హోంమంత్రి సబితారెడ్డి సందర్శించారు. జగద్దుగరు శంకారచార్య భారతీతీర్థ మహాస్వామి ఆశ్వీరాదాలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శంషాబాద్‌లోని ఊట్‌పల్లిలో రూ.3కోట్లతో ఆలయం నిర్మించడం, మహాస్వామిని దర్శించుకోవడం సంతోషం కలిగిందని అన్నారు.
తక్షణమే పిఆర్సీకి కమిటీ వేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 21: వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ పిఆర్సీ చెల్లించేందుకువెంటనే కమిటీని వేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ టి.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర స్థాయి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటం వల్లే మళ్లీ తాము ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఆర్సీ చెల్లింపులపై ఇప్పటి వరకు ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదని, డిసెంబర్ 19లోపు కమిటీని ఏర్పాటు చేసి, 1,జూలై 2013 నుంచి పిఆర్సీ అమలు చేసేందుకు చర్యలు తీసుకోని పక్షంలో వెంటనే నిరవధిక సమ్మెకు ఉద్యోగులు దిగుతారని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 42 రోజులు నిర్వహించిన సకల జనుల సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరించాలని ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా పర్మినెంటు చేయాలని, తెలంగాణ ప్రాంతంలోనే అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని, జివో 610ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిరవేర్చటం లేదంటూ జెఎసి అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె కాలంలో ఉద్యోగులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా అమలు కాలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని జెఎసి కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఈ ధర్నాలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, రంగారెడ్డి జిల్లా టిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, నర్సింహ్మారావు, బాల్‌రాజు రాష్ట్ర స్థాయి కమిటీ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 21: ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను వారం లోపు పంపించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జగన్నాథం, డిప్యూటీ కలెక్టర్‌లు తహశీల్దార్‌లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన 22-ఎ ప్రతిపాదనలపై సమీక్షించారు. మండలాల్లోని విలువైన భూములను కబ్జాలకు గురికాకుండా నివారించేందుకు తహసీల్దార్ కృషిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములు, స్థానిక సంస్థలు, దేవాదాయశాఖ, విద్యా, సాంస్కృతిక సంస్థలకు చెందిన భూములు, చారిటబుల్ సంస్థలు, వక్ఫ్, భూదాన్, మిగులు భూముల వివరాలను సమగ్రంగా క్రోడీకరించి నివేదికలను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆయన ఆదేశాలిచ్చారు. ఈ వివరాలను సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించడం జరుగుతుందని, దీనివల్ల రిజిస్ట్రేషన్ చేయకుండా నిరోధించేందుకు వీలుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ జాబితాపై మరింత సమాచారంకోసం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి జాబితాను రూపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డివోలు రవీందర్‌రెడ్డి, సూర్యారావు, లా అధికారి వేణుగోపాల్‌తోపాటు పలువురు డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
అక్రమ కట్టడాలు తొలగింపు
శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెం.28, 70లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. గుడిసెలతోపాటు పటేల్ చెరువులోని అక్రమ కట్టడాలనుకూడా తొలగించినట్లు ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
డిప్యూటీ సర్వేయర్ల నియామకం
రంగారెడ్డి జిల్లాలో ఖాళీగావున్న డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను భర్తీచేస్తూ 13మంది అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా భూమి కొలతలు, రికార్డుల విభాగంలో ధృవపత్రాలను పరీశీలించేందుకు ఇంకా హాజరుకావల్సిన చిన్నం లక్ష్మీనారాయణ, పూజారి ఆనంద్‌కుమార్, ఎన్.ప్రసీద, ధారావత్ శ్రీనివాస్ నాయక్‌లను ఈ నెల 23 సాయంత్రం నాలుగు గంటలకు హాజరుకావాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాలిచ్చారు. వీరిని ఈ నెల 19వ తేదీన ధృవీకరణ పత్రాల పరిశీలనకోసం హాజరుకావాలని సమాచారం ఇచ్చినప్పటికీ రాలేదని, మానవతా దృక్ఫదంతో మరోమారు అవకాశాన్ని కల్పిస్తూ ఈ మేరకు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఎంపికైన 17మంది అభ్యర్థుల్లో ధృవపత్రాలను పరిశీలించిన 13మంది అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులు జారీచేశారు.
నిరుద్యోగ యువతకు శిక్షణ
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హునార్‌సే రోజ్‌గార్ పథకంద్వారా 18నుండి 28 సం.రాల మధ్య వయసు ఉండి 8వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.
ఫుడ్ అండ్ బీవరేజ్ సర్వీసులో ఆరు వారాలపాటు శిక్షణ, ఫుడ్ ప్రొడక్షన్‌లో 8 వారాలు, హౌస్‌కీపింగ్‌లో ఆరు వారాలు, బేకరీ తయారీలో 8 వారాలపాటు టూరిజం అసిస్టెంట్ కోర్సులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు స్టయిఫండ్‌తోపాటు భోజన, యూనిఫాం సదుపాయం కల్పించడం జరుగుతుందని ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీనికోసం రాజీవ్ యువకిరణాల జాబ్స్‌మేనేజర్ హమీద్‌ను (9849908911) సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న కిరోసిన్
జీడిమెట్ల, నవంబర్ 21: సర్కిల్ పరిధిలో కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ డీలర్లు జేబులు నింపుకుంటున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తుస్తున్నాయి. రంగారెడ్డినగర్, గాంధీనగర్, జగద్గిరిగుట్ట, అంజయ్యనగర్, శ్రీనివాస్‌నగర్, నెహ్రూనగర్, దేవమ్మబస్తీ, సంజయ్‌గాంధీనగర్ తదితర ప్రాంతాలలోని కిరోసిన్ డీలర్లు అసలు దుకాణాలను ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు తెరవరో తెలియని దుస్థితి నెలకొందని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. నెలలో కనీసం రెండుసార్లు కూడా షాపును తెరవడం లేరని నిత్యం కార్డుదారులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. రేషన్ దుకాణాలు 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు తప్పనిసరిగా తెరవాలని ప్రభుత్వం ఆదేశించగా కిరోసిన్ షాపులకు అది వర్తించదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం 3 లీటర్‌ల కిరోసిన్‌ను ఇవ్వాలని ఆదేశించగా కేవలం 2 లీటర్‌ల కిరోసిన్‌ను ఇస్తూ తమకు కోటా రాలేదని డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇచ్చే 2 లీటర్‌ల కిరోసిన్‌లో సైతం సుమారు అర్ధ లీటర్ వరకు తక్కువగా పోస్తూ డీలర