Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భారీ కసరత్తు

$
0
0

కాకినాడ, నవంబర్ 21: నీలం తుపాను నష్టంపై పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 27వ తేదీన సమర్పించేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. తుది నివేదికను ఏ విధమైన తప్పులకు ఆస్కారం లేకుండా పంపేందుకు అధికార్లు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 23వ తేదీ నాటికి జిల్లాలో తుపాను నష్టం అంచనా ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తిచేసి, మండల స్థాయి పర్యవేక్షక బృందాలచే ర్యాండమ్‌గా తనిఖీలు చేసి ఆ వివరాలను గ్రామ పంచాయితీల్లో పెట్టి అభ్యంతరాలుంటే పరిష్కరించి, 25వ తేదీ నాటికి నష్టం అంచనాల పూర్తి నివేదికను తయారుచేసేలా కార్యాచరణ రూపొందించారు. నష్టంపై సిద్ధం చేసిన తుది నివేదికను 27వ తేదీన ప్రభుత్వానికి అందజేయనున్నారు. నష్టం అంచనాలను రూపొందించడంలో ఏ విధమైన తప్పులకు ఆస్కారం లేకుండా చూడాలని, అంచనాలను సరిగా వేయలేదని నిర్ధారణ జరిగితే సంబంధిత అధికార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినపుడు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సిఎం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఎన్యుమరేషన్‌ను నూరు శాతం పక్కాగా నిర్వహించే పనిలో అధికార్లు తలమునకలయ్యారు. జిల్లాలో నీలం తుపాను సృష్టించిన విలయంతో వ్యవసాయానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సుమారు 4 లక్షల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాలో తేలింది. ఏయే ప్రాంతాల్లో ఏమేరకు వరికి నష్టం వాటిల్లిందన్న విషయమై ఎన్యుమరేషన్ బృందాలు నివేదికలో పొందుపరుస్తున్నాయి. పంట నష్టం అంచనా రూపకల్పనలో లిబరల్‌గా వ్యవహరించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో నష్టపోయిన ప్రతి రైతును జాబితాలో చేర్చేందుకు అధికార్లు కృషి చేస్తున్నప్పటికీ పరిహారం పంపిణీ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం రైతాంగంలో చర్చనీయాంశమైంది. వరితో పాటు జిల్లాలో ఉద్యానవన పంటలకు సైతం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. గృహాలకు సంబంధించి మొత్తం 778 గ్రామాల్లో ఎన్యుమరేషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 9వేల గృహాలు తుపానుకు పూర్తిగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాలో గుర్తించారు. ఇవి కాక పాక్షికంగా దెబ్బతిన్న గృహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అంచనాలకు మించి జిల్లాలో గృహ నష్టం జరిగిందని, నిరుపేదల ఇళ్ళు పూర్తిగా నేలమట్టం కావడంతో ఆయా కుటుంబాలకు పక్కా ఇళ్ళు నిర్మించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేట్ ఆస్తులకు వాటిల్లిన నష్టం వందల కోట్లలో ఉండగా, మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ, ఉద్యానవన, పశుసంవర్ధక, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ట్రాన్స్‌కో, నీటి పారుదల శాఖ తదితర ప్రభుత్వ శాఖల ఆస్తులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆస్తుల నష్టం వివరాలను సైతం ఎన్యుమరేషన్ చేసి ప్రభుత్వానికి నివేదించే పనిలో అధికారులున్నారు.

నేడు రాజమండ్రిలో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఆత్మీయ సత్కారం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 21: మాజీ ముఖ్యమంత్రి, రాజనీతిజ్ఞుడు, తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె రోశయ్యకు గురువారం రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జిల్లా ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ గౌరవ సత్కారం జరగనుంది. సాయంత్రం 4గంటలకు జరగనున్న ఈ సత్కార సభకు ఎపిఐఐసి మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరగనున్న ఈ సత్కార సభకు సుమారు 10వేల మందికిపైనే ఆర్యవైశ్య సంఘాల సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరగనున్న రోశయ్య సత్కార సభకు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరుకానున్నారు. రోశయ్య సత్కార సభకు అన్ని వర్గాలకు చెందిన వ్యాపారస్తులు, అభిమానులు హాజరయ్యేందుకు వీలుగా వ్యాపార సంస్థలకు రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ సాయంత్రం 4గంటల నుండి సెలవు ప్రకటించింది. గవర్నర్ రోశయ్యకు సత్కార సభ ఏర్పాట్లను ప్రత్యక్షంగా ఆర్యవైశ్యసంఘాల నాయకులు పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఈ సభకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు హాజరయ్యేందుకు సుముఖంగా ఉండటంతో భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి. ఈ సభకు విశిష్ఠ అతిథులుగా కేంద్ర మంత్రి పళ్లంరాజు, రాష్ట్ర మంత్రులు తోట నరసింహం, పినిపె విశ్వరూప్‌తో పాటు జిల్లాకు చెందిన ఎంపిలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జివి హర్షకుమార్, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు విమానంలో మధురపూడి విమానాశ్రయానికి రోశయ్య చేరుకుంటారు. అక్కడి నుండి రాజమండ్రిలోని హోటల్ రివర్‌బేకు చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం సాయంత్రం సుబ్రహ్మణ్య మైదానానికి చేరుకుంటారు.

గుండె కోత!
కోనపాపపేటలో కోతకు గురౌతున్న గృహాలు
యు కొత్తపల్లి, నవంబర్ 21: అల్ప పీడన ప్రభావానికి వీస్తున్న ఈదురుగాలులకు కోనపాప పేటలో గృహాలు కోత బారిన పడుతున్నాయి. బుధవారం యు కొత్తపల్లి మండలం కోనపాప పేట గ్రామంలో కెరటాల తాకిడికి బలంగా వీస్తున్న ఈదురు గాలులకు తీరం కోతకు గురౌతుంది. ఈ నేపథ్యంలో మేరుగు అబ్బాయి, సూరాడ సత్యారావు, సోదే శ్యామ్యూల్, చొక్కా సుబ్బారావులకు చెందిన గృహాలు కోతకు గురయ్యాయి. బుధవారం రాత్రి ఈదురు గాలులు మరింత బలంగా వీస్తే మరికొన్ని కోతకు గురయ్యే అవకాశాలున్నాయి. స్థానిక మత్స్యకారులు మాత్రం గతంలో కోతకు గురైన గృహాలను తాజాగా చూపిస్తూ సుమారు 15 గృహాలు కోతకు గురౌతున్నట్లు తెలియజేశారు. కాగా ఉప్పాడ తీరంలో ఈదురుగాలులకు కెరటాల తాకిడి తీవ్రత అధికమైంది. ఉప్పాడ శివారు మాయాపట్నం నుండి కొత్తపట్నం వరకు నిర్మంచిన జియోట్యూబ్ రక్షణ గోడగా నిలిచి గృహాలు కోత బారిన పడకుండా కాపాడుతోంది. ఈ నెల 18వ తేదీన వేటకు వెళ్ళిన మత్స్యకారులు సముద్రంలో వాయుగుండం ప్రభావానికి తిరుగుముఖం పట్టి 19వ తేదీకి గృహాలు చేరారు. అప్పటి నుండి సముద్రంలో సాధారణ పరిస్ధితులు నెలకోనే వరకు వేటను విరమించాలని మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షులు దాసరి సత్యనారాయణ అన్నారు.

ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
పర్సన్ ఇన్‌ఛార్జిగా ఆర్డీవో వేణుగోపాలరెడ్డి
కాంగ్రెస్ ఆధిపత్య పోరే కారణం - ఎన్నికలు ఇక అనుమానమే!
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 21: ఆర్యాపురం సహకార అర్బన్ బ్యాంకు పర్సన్ ఇన్‌ఛార్జిగా రాజమండ్రి ఆర్డీవో ఎం వేణుగోపాలరెడ్డిని నియమిస్తూ సహకారశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసారు. శుక్రవారం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళవారంతో సహకార అర్బన్ బ్యాంకు ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసిన సంగతి విదితమే. దాంతో సహకారశాఖ రిజిస్ట్రార్ రాజమండ్రి ఆర్డీఓను ప్రత్యేకాధికారిగా నియమించారు. బ్యాంకుకు పాలకవర్గ ఎన్నికలు సకాలంలో జరగని సందర్భాల్లో జిల్లా కలెక్టర్‌ను రాష్ట్రప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జిగా నియమించేది. కానీ ఈ సారి మాత్రం ఆర్డీవోను పర్సన్ ఇన్‌చార్జిగా నియమించటం కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు అప్పటి పాలకవర్గాలనే పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీలుగా రెండేళ్లుగా కొనసాగిస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆర్యాపురం సహకార అర్బన్ బ్యాంకుకు మాత్రం ప్రత్యేక విధానాన్ని అమలుచేయటం సహకార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రూ.250కోట్లు డిపాజిట్లుదాటిన ఆర్యాపురం అర్బన్ బ్యాంకుపై పెత్తనం చెలయించేందుకు రాజకీయవర్గాలు ఆరాటపడటం, అందులోనూ అధికార కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు ఆధిపత్యపోరు సాగించటం తదితర పరిణామాల నేపథ్యంలో సహకారశాఖ ప్రత్యేకాధికారిని నియమించింది. ఇది కూడా కొంత మంది అధికార పార్టీ పెద్దల సిఫార్సుతోనే జరిగినట్టు తెలుస్తోంది. పరిస్థితిచూస్తుంటే ఇక ఆర్యాపురం సహకార అర్బన్ బ్యాంకుకు ఇప్పట్లో ఎన్నికలు కూడా జరగకపోవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదో ఒక కారణాన్ని చూపించి, ఎన్నికలను వాయిదావేసుకుంటూ వెళ్లేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్‌కు జాతీయ భద్రతా పురస్కారం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 21: రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్ వరుసగా 7వ సారి జాతీయ భద్రతా పురస్కారాన్ని అందుకుంది. 2008లో అతి తక్కువ ప్రమాదాలు సంభవించి, గాయపడ్డ వారి సంఖ్య కూడా కనిష్ఠ స్థాయిలో నమోదవటంతో ఈ అవార్డు రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్‌కు లభించింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును రాజమండ్రి అసెట్ మేనేజర్, గ్రూపు జనరల్ మేనేజర్ పికె రావు, పెట్రోలియం ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కె సురేష్‌కుమార్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు రాజమండ్రి ఒఎన్‌జిసి అసెట్ మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంది. 2010 చమురు బావుల డ్రిల్లింగ్‌లో అతి తక్కువ ప్రమాదాలు సంభవించిన రికార్డును సాధించటంతో రాజమండ్రి అసెట్‌కు అవార్డు లభించింది. ఈ అవార్డును ఆరోగ్య భద్రత, పర్యావరణ విభాగం అధిపతి, జిఎం ఎస్ గురురాజన్, గ్రేడ్-2 హెల్పర్ కె సన్యాసిరావు అందుకున్నారు. 2009లో రాజమండ్రి అసెట్‌లో ప్రమాదాలులేని డ్రిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించటంతో అవార్డు లభించింది. ఈ అవార్డును డ్రిల్లింగ్ జిఎం హెచ్‌ఎల్ పటేల్, గ్రేడ్-2 అటెండెంట్ టి శ్రీనివాస్ అందుకున్నారు. 2008లో ఉత్పత్తిలో ఉన్న బావుల్లో ప్రమాదాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించినందుకు లభించిన అవార్డును డిఎమ్మార్ శేఖర్, డివికె రాజు అందుకున్నారు. ఈ జాతీయ భద్రతా అవార్డుల ప్రధానోత్సవానికి కార్మికశాఖ మంత్రి మల్లికార్జునకర్గె, కార్మికశాఖ సహాయమంత్రి కె సురేష్ హాజరయ్యారని ఒఎన్‌జిసి రాజమండ్రి అసెట్ కార్యాలయం విడుదలచేసిన ప్రకటనలో తెలిపింది.

169 డ్రైవర్ పోస్టుల భర్తీకి చర్యలు
దళారుల మాటలు నమ్మవద్దు: ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రమాకాంత్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, నవంబర్ 21: జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్ల నియామకానికి రంగం సిద్ధంచేస్తున్నట్టు రాజమండ్రి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి రమాకాంత్ చెప్పారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 169డ్రైవర్ల పోస్టులను భర్తీచేస్తామన్నారు. రెండు దశల్లో పూర్తి పారదర్శకంగా డ్రైవర్ల ఎంపిక కార్యక్రమం జరుగుతుందన్నారు. సమారు 2వేల 500మంది అభ్యర్ధులు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుకున్నారని, ఈ దరఖాస్తులను, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించే కార్యక్రమం మొదటి దశలో జరుగుతుందన్నారు. భారీ వాహనాలను నడపటంలో కనీసం ఏడాదిన్నర అనుభవం, 160సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉన్న , 2012 జూలై 1వ తేదీ నాటికి 22సంవత్సరాలు నిండిన, 35ఏళ్లు మించని అభ్యర్ధులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్ధులకు 5ఏళ్ల సడలింపు ఉంటుందని, మాజీ సైనికులకు 45ఏళ్ల వరకు సడలింపు ఉందన్నారు. ఈ నెల 26 నుండి దరఖాస్తులు, లైసెన్సులు, ఇతర అంశాలను పరీక్షించే కార్యక్రమం ప్రారంభమవుతుందని, తొలి దశలో అర్హత పొందిన అభ్యర్ధులకు రెండో దశలో 28 నుండి డ్రైవింగ్ పరీక్షలు జరుగుతాయన్నారు. దరఖాస్తులు, సర్ట్ఫికెట్లు పరిశీలన కార్యక్రమం డిసెంబరు 12వరకు జరుగుతుందన్నారు. రోజుకు 200మంది సర్ట్ఫికెట్లు, దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. రోజుకు 70మంది అభ్యర్ధులకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఆర్‌ఎం చెప్పారు. డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు సభ్యులు కలిగిన బృందం వస్తుందన్నారు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, అభ్యర్ధుల ప్రతిభపైనే ఎంపిక ఆధారపడి ఉంటుందన్నారు. దళారుల మాటలు ఎవరూ నమ్మవద్దని, సిఫార్సులకు తావుండదని ఆర్‌ఎం రమాకాంత్ చెప్పారు. మాయ మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దన్నారు. విలేఖర్ల సమావేశంలో డిప్యుటీ సిటిఎం వరప్రసాద్, జిల్లాలోని వివిధ డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.

అడ్వాన్సుల సొమ్ము చెల్లించని ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు
మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్
సామర్లకోట, నవంబర్ 21: జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు తీసుకున్న అడ్వాన్సుల సొమ్ము ఈ నెలాఖరులోగా తిరిగి చెల్లించకుంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోక తప్పదని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ వి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లాస్థాయిలో కార్పోరేషన్‌లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలతో ఆర్డీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి హెచ్చరిస్తున్నా నేటికి జిల్లాలో సుమారు 158 మంది మున్సిపల్ ఉద్యోగులు రూ.1.3కోట్లు అడ్వాన్సులు రికవరీ కావల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించారు. డిసెంబర్ 10వ తేదీ లోగా అడ్వాన్సులు చెల్లించకుంటే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్లు లోకాయుక్త ఎదుట హాజరుకావలసి ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 10,930 ఆడిట్ అభ్యంతరాలు ఉండగా, వాటిలో రూ.20.51 కోట్లు విలువగల 1590 అభ్యంతరాలు పరిష్కారమైనట్టు తెలిపారు. మిగిలిన 6654 అభ్యంతరాలు 2013 మార్చిలోగా పరిష్కరించాలని కమిషనర్లను ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, వికలాంగ, మహిళలకు కేటాయించిన నిధులు సరిగా ఖర్చుచేయడం లేదని ఆర్‌డి అసంతృప్తి వ్యక్తంజేశారు. జిల్లా వ్యాప్తంగా 361 సెల్ టవర్లు ఉండగా, వాటిలో కేవలం 110 టవర్లకు మాత్రమే పన్నుల వసూలు చేస్తున్నారని, మిగిలిన వాటికి కూడా పన్నులు విధించాలన్నారు. సమావేశంలో రాజమండ్రి, కాకినాడ కార్పోరేషన్‌ల కమిషనర్‌లు ఎం జితేంద్ర, కె సత్యవేణి, మున్సిపల్ కమిషనర్లు జ్యోతుల నాగేంద్ర ప్రసాద్ (సామర్లకోట), శారదాదేవి (తుని), జీవరత్నం (రామచంద్రపురం), రాము (పిఠాపురం), శర్మ, బాపిరాజు,నాగేశ్వరరావు, ఎం రామ్మోహానరావు, డి సుధాకర్ పాల్గొన్నారు.

డిసెంబర్ 3వరకు విశాఖ-విజయవాడ ప్యాసింజర్ రద్దు
రాజమండ్రి, నవంబర్ 21: విజయవాడ రైల్వేస్టేషన్‌లో చేపట్టిన పనుల దృష్ట్యా డిసెంబర్ 3వ తేదీ వరకు విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రద్దు చేసినట్లు రాజమండ్రి స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్ర్తీ వెల్లడించారు. ఈనెల 19వ తేదీ నుంచి ప్యాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. ఈవిషయాన్ని ప్రయాణీకులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

మరో ఐదు సబ్-కంట్రోలు రూంలు
ఆటోవాలాల ఆగడాలకు చెక్:ఎస్పీ మూర్తి
రాజమండ్రి, నవంబర్ 21: ప్రజల వద్దకు పోలీసులను చేరువ చేసే చర్యల్లో భాగంగా రాజమండ్రిలో మరో ఐదు ప్రాంతాల్లో సబ్ కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అర్బన్ ఎస్పీ టి రవికుమార్‌మూర్తి వెల్లడించారు. సబ్‌కంట్రోల్‌రూమ్‌లు పోలీసు ఔట్‌పోస్టులుగా పనిచేస్తాయని, ప్రజల నుంచి ఇక్కడ ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. బుధవారం రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో సబ్‌కంట్రోల్‌రూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సబ్‌కంట్రోల్‌రూమ్ 24గంటలు పనిచేస్తుందన్నారు. ఒక హెచ్‌సి, ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తారన్నారు. ఉదయం 3నుంచి రాత్రి 8గంటల వరకు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు సిబ్బందితో పాటు, ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉంటారన్నారు. ముఖ్యంగా ఆటోవాలాలు ప్రయాణీకులను బెదిరించి, అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జేబుదొంగతనాలు, ఇతర నేరాల నిరోధానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు. కోటిపల్లిబస్టాండ్‌లో కూడా ఆటోవాలాల ఆగడాలను అరికట్టేందుకు ఔట్‌పోస్టును ఏర్పాటు చేశామన్నారు. సబ్‌కంట్రోళ్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తామన్నారు. రాజమండ్రి అర్బన్‌జిల్లాలోని మోరంపూడి, లాలాచెరువు, క్వారీమార్కెట్, వై జంక్షన్, తాడితోట, కొంతమూరు, రాజానగరం, గోకవరంలో కూడా సబ్‌కంట్రోళ్లను ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్ వరదరాజు, డిఎస్పీలు కె అనిల్‌కుమార్, వి రాజగోపాల్, పి ఉమాపతివర్మ, జిఆర్‌పి డిఎస్పీ వరప్రసాద్, సిఐ రామ్మోహన్, ఆర్పీఎఫ్ సిఐ బి రాజు, జిఆర్పీ సిఐ పార్థసారధి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వణికిస్తున్న చలిగాలులు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 21: జిల్లాను చలిగాలులు వణికిస్తున్నాయి. బుధవారం సాయంత్రం చాలాచోట్ల వర్షాలు పడి వాతావరణం మరింత చల్లబడింది. జిల్లాలో 0.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం, మొత్తంమీద 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రానికి చలి గాలుల తీవ్రత అధికం కావడంతో పాటు కాకినాడ-ఉప్పాడ మధ్య సముద్రపు అలల ఉద్ధృతి పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడటంతో జిల్లాకు తుపాను ముప్పు తప్పినప్పటికీ దాని ప్రభావంతోనే సముద్రపు అలల పోటు పెరిగి, చలి గాలులు తీవ్రమయ్యాయి. మరోసారి తుపాను భయం ఉందంటూ మూడు రోజుల క్రితం విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో గత మూడు రోజుల నుండి చేపల వేట స్తంభించగా మెకనైజ్డ్ బోట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్ళిన మత్స్యకారులు దాదాపు అందరూ సురక్షితంగా తీరానికి చేరుకున్నట్టు అధికార్లు చెప్పారు.

దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం
పెదపూడి, నవంబర్ 21: పెదపూడి మండలం ఎపిత్రయంలో తుపానుకు నష్టపోయిన పంట పొలాలను కేంద్ర బృందం బుధవారం పరిశీలించింది. భారత ఆహార సంస్థకు చెందిన సత్యప్రసాద్, సుధాకర్‌ల ఆధ్వర్యంలో నీలం తుఫాన్‌కు గురైన పంట పొలాలను పరిశీలించారు. నీలం తుఫాన్ వల్ల అపార నష్టం వాటిల్లిందని రైతు నేతలు ఎన్‌ఎస్‌ఎన్ రాజు, ఆరుమిల్లి సత్యప్రసాద్, ఎం ఈశ్వరరావు, పెండెం కృష్ణ తదితరులు కేంద్ర బృందానికి వివరించారు. పెదపూడి మండలంలోని 12 గ్రామాలకు సంబంధించి వరి పంటకు ఏర్పడిన నష్టాలను పెదపూడి ఎఒ ఇందిరాఝాన్సీ కేంద్ర బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం నుండి వచ్చిన ఎఫ్‌సిఐ అధికారి సత్యప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వరి పంటకు అపార నష్టం వాటిల్లిందని, కొనుగోలు కేంద్రాల ధాన్యం కోనేందుకు కూడా పనికిరాని స్ధితిలో వరి పంట ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేస్తామన్నారు. పెదపూడి ఎఓ ఇందిరాఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వై జయ, డిప్యూటీ తహసీల్దార్ సీతాపతిరావు, వ్యవసాయ విస్తరణాధికారులు త్రినాథరావు, అమృత తదితరులు పాల్గొన్నారు.

......................

27న తుపాను నష్టంపై ప్రభుత్వానికి తుది నివేదిక - చకచకా ఎన్యూమరేషన్
english title: 
ba

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>