చిత్తూరు, నవంబర్ 21: అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని జిల్లాకలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం చిత్తూరులో బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల నుండి రుణ అర్హత కార్డులు పొందిన కౌలు రైతులకు మరో 15 రోజుల లోపు జాబితాను పొందాలని సూచించారు. ఆమేరకు బ్యాంకర్లు రుణాలు అందించేందుకు ముందుకు రావాలన్నారు. గతంలో రుణాలు పొందిన రైతులు రుణం తిరిగి చెల్లిస్తే కొత్త రుణాలు వర్తిస్తాయని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని, కొత్త రైతులను గుర్తించి వారికి బ్యాంకర్లు రుణాలు అందించుటలో చొరవ చూపాలన్నారు. ఈ ఏడాది రూ.40కోట్లు కౌలు రైతులకు రుణం కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేచించిందన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ఖరీఫ్‌లో దాదాపు రూ.73కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ బ్యాంకు ద్వారా రైతుల ఖాతాలకు జమ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. బ్యాంకర్లు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖరీఫ్ 2011 వరకు రైతులకు ఒక లక్ష రూపాయలు వరకు పావలా వడ్డీ రుణం, ఖరీఫ్ 2012 నుండి ఒక లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు వర్తిస్తాయని, ఆ పై పావలా వడ్డీ రుణం సక్రమంగా తిరిగి చెల్లించిన రైతులకు వర్తిస్తుందన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రుణాలు మంజూరు చేయుటలో ఇప్పటి వరకు దాదాపు 10వేల దరఖాస్తులను బ్యాంకర్లుకు పంపగా 2,575 దరఖాస్తులను బ్యాంకర్లు ఆమోదించారని, తక్కిన దరఖాస్తులను కూడా వేగవంతంగా ఆమోదించాలన్నారు. ఎస్‌హెచ్‌జి బ్యాంకు లింకేజీ ఇప్పటి వరకు రూ.399కోట్లు అందించారని, వీటిని వేగవంతం చేయాలన్నారు. అర్బన్ ఐకెపి కింద రూ.100కోట్లు లక్ష్యానికి గాను రూ.77కోట్లు సాధించారని తెలిపారు. పశు సంవర్థక శాఖ ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1176యూనిట్ల మంజూరు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించామని, బ్యాంకర్లు ఇందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ నాగరాజు, నాబార్డు ఏజిఎం శ్రీనివాసరావు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సుధాకర్‌రావు, ఆంధ్రబ్యాంకు ఏజిఎం సాయిప్రసాద్, ఎజెసి వెంకటసుబ్బారెడ్డి, డిఆర్‌డిఎ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి తదితర జిల్లా శాఖాధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
అనివృద్ధి పనులకు నిధులు మంజూరు
జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు స్పెషల్ డెవలప్‌మెంట్ పండ్ కింద 2011-12, 2012-13సంవత్సరాలకు రూ.83.94కోట్లు మంజూరు అయ్యాయని, పనులు వేగవంతం చేయాలని జిల్లాకలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో స్పెషల్ డెవలప్‌మెంట్ పండ్ ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఎపిఇడబ్ల్యూఎస్‌ఐడిసి, ఆర్‌అండ్‌బి, పిఐయు శాఖల ఇంజనీర్లు, మునిసిపల్ కమిషనర్లతో పూర్తయిన పనులు, జరుగుతున్న పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. 15రోజులకు ఒక సారి ప్రగతిని ప్రత్యేక ఫార్మెట్‌లో ముఖ్య ప్రణాళికాధికారికి పంపాలని, ప్లానింగ్ డిపార్ట్‌మెంటు హైదరాబాదుకు పంపాల్సి వుంటుందన్నారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లె పంచాయతీలో తాగునీటి సరఫరాపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎస్‌ఇ ఆర్‌డబ్ల్యూఎస్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎజెసి వెంకటసుబ్బారెడ్డి, సిపిఓ భాస్కర్‌శర్మ, అర్‌డబ్ల్యూఎస్ ఎస్.ఇ శ్రీనివాస్, ఈఈ పిఐయు రమణ, ఎపిఇడబ్ల్యూఎస్‌ఐడిసి, ఈఈ నగేష్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో మురిగిన పౌష్టికాహారం!
* పంపిణీపై ఆగ్రహించిన మహిళలు
* అంగన్‌వాడీ కార్యకర్త విధుల నుంచి తొలగింపు
రొంపిచెర్ల, నవంబర్ 21: మండలంలోని బోడిపాటివారిపల్లె పంచాయతీ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు, తల్లులకు మురిగిపోయిన కోడిగుడ్లు పంపిణీ చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఈ సంఘటనతో అంగన్‌వాడీ కేంద్రం వద్ద మహిళలు ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న చిన్నగొటిగల్లు సిడిపిఓ నాగశైలజ హుటాహుటిని బోడిపాటివారిపల్లెకు చేరుకుని ఆందోళన చేస్తున్న తల్లులను విచారించారు. దీనితో అంగన్‌వాడీ కార్యకర్త పనితీరుపై ఆమె ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు, గర్భిణులకు, తల్లులకు పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని దుర్వినియోగం చేస్తుందని కార్యకర్త నిర్మలపై ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ఇచ్చి చెడిపోయిన కోడిగుడ్లను సిడిపిఓ ముందు పగులకొట్టి చూపించారు. కోడిగుడ్లు నల్లబారి చెడిపోయి ఉండటంతో వాటిని చూసిన సిడిపిఓ కార్యకర్త, ఆయాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను సీజ్ చేశారు. కార్యకర్త నిర్మలను విధుల నుంచి తొలగించి ఇంచార్జిగా దద్దాలవారిపల్లె కేంద్రం కార్యకర్త అనసూయమ్మను నియమించారు. ఆమె పనితీరుపై ఉన్నతాధికారులకు, కలెక్టరుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మూడు నెలల క్రితం సరఫరా చేసిన కోడిగుడ్లను ఇప్పుడు తల్లీబిడ్డలకు సరఫరా చేశారని, ఇవి చెడిపోయి ఉండటం వాస్తవమేనని అన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కాపాడాల్సిన కార్యకర్త ఈవిధంగా నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడం క్షమించరాని నేరమన్నారు.
మానవాళికి గోమాత తల్లి వంటిది
* టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం అభివర్ణన
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, నవంబర్ 21: పంచగవ్యాలతో భూక్షేత్రాన్ని పవిత్రం చేసి వ్యవసాయోత్పత్తికి దోహదపడుతున్న గోమాత మానవాళికి తల్లికాని తల్లి అని టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం అభివర్ణించారు. నవంబర్ 28న నిర్వహించనున్న మనగుడి ఉత్సవంలో భాగంగా బుధవారం గోపాష్టమి సందర్భంగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, టిటిడి పరిపాలనాభవనంలో ఘనంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి వారి ఆలయంలో టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం విలేఖరులతో మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 400 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గోవు సర్వదేవతా స్వరూపమని, నుదిటిలో శివుడు, కొమ్ముల్లో బ్రహ్మ, విష్ణువులు, నాశికలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉంటారని తెలిపారు. మన పూర్వీకులు గోవును గుడిలో అంతర్భాగంగా భావించేవారని, భక్తులు మొదట గోదర్శనం చేసుకునేవారని చెప్పారు. ప్రతి ఆలయంలోనూ గోపూజను ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా అర్చకులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో గోపూజ నిర్వహించి గోవులను సంరక్షించాలని కోరారు. గోవు పాలలో పోషక పదార్థాలు అధికంగా ఉన్నాయని పరిశోధనల్లో నిరూపితమైందని, ఇవి అనేక వ్యాధుల నుండి మానవాళికి రక్షణ కల్పిస్తున్నాయని ఇఓ తెలిపారు. పంచగవ్యాలైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గోమూత్రంను పలు ఔషధాల తయారీకి ఉపయోగిస్తున్నారని వివరించారు. ఎక్కడ గోవు పూజలందుకుంటుందో అక్కడ దారిద్య్రం దూరమవుతుందన్నారు. భారతీయ సంప్రదాయంలో ఇంతటి విశిష్టత గల గోవును వధించడం శోచనీయమని పేర్కొన్నారు. అంతకుముందు తిరుపతి జెఇఓ వెంకట్రామిరెడ్డితో కలసి ఇఓ సంప్రదాయబద్దంగా గోపూజ నిర్వహించారు. అలంకరించిన గోవుకు పూలమాల వేసి పూజలు చేశారు. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదే విధంగా టిటిడి పరిపాలనా భవనంలో ఉద్యోగులతో కలసి ఇఓ గోపూజ చేశారు. తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాల, శ్రీకోదండరామస్వామి వారి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలో శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజ నిర్వహించారు.
పార్టీలు మారే ఎమ్మెల్యేలపై కఠినచర్యలు తీసుకోవాలి
* మద్యం కుంభకోణం కేసును సిబిఐకి అప్పగించాలి
* కసబ్ ఉరిశిక్ష స్వాగతించదగ్గదే
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ స్పష్టం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 21: పార్టీలు మారే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతిలోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీల్లో బలాల ఆధారంగా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఎవరు ఎందుకు మారతారన్నది ప్రశ్న కాదని. ఎవరు ఏ పార్టీ మార్చినా తమ రాజకీయ స్వార్థం కోసమేనన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు అని అంచనా వేసుకుని, ఒక రాజకీయ లక్ష్యంతోనే పార్టీలు మారుతున్నారన్నారు. అలా పార్టీలు మారుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థమరింత భ్రష్టు పట్టిపోయే ప్రమాదం వుందన్నారు. ఇందుకు కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ లేఖతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలు అవినీతిపరులని తేలిపోయిందన్నారు. అవినీతి కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కేవలం 2 టిఎంసిల హంద్రీనీవా కాలువ నీళ్లు ప్రారంభించినందులకే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చంకలు గుద్దుకుంటున్నారన్నారు. పరమానందయ్య శిష్యుడిలా డాంబికాలు పలుకుతూ అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. 20 టిఎంసిల నీళ్లు ఇచ్చినప్పుడే తాము స్వాగతిస్తామన్నారు. పయ్యావుల కేశవ్ ఏడ్వాల్సిన అవసరం లేదని, తాను పార్టీలు మారడం లేదని చెపితే చాలన్నారు. ఇక మద్యం కుంభకోణం విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. విచారణ అధికారిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి బదిలీ చేయడంతోనే ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నట్లు స్పష్టం అవుతోందన్నారు. ఈ కేసులో కొండను తవ్వి ఎలుకను కాదు ఎలుక తోకను కూడా పట్టలేకపోయిందన్నారు. ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే ఎసిబి నుండి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాది కసబ్‌ను ఉరి తీయడం స్వాగతించదగ్గ విషయమేనన్నారు. ఇది ఎప్పుడో చేయాల్సిన పని అని, ఇప్పటికైనా చేయడం అభినందనీయమన్నారు. కసబ్ కొంత మందిపైనా, ఒక ప్రాంతంపై దాడి చేయలేదని యావత్ భారత ప్రజాస్వామ్యంపై దాడి చేశాడన్నారు. రాక్షసత్వం కల్గిన ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయడం సబబేనన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హరినాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం వెల్లడి
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, నవంబర్ 21: శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా త్వరలో ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీనివాసకల్యాణాలు నిర్వహించనున్నట్లు టిటిడి ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. స్థానిక మాధవం కాంప్లెక్స్‌లోని శ్రీకల్యాణోత్సవం ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రాజెక్టు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీనివాసకల్యాణాల నిర్వహణకు గాను సీనియర్ అధికారుల బృందం పర్యటించి ముందస్తుగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. మహాయోగులు నివసించిన ప్రాంతాలైన మంత్రాలయం, కైవారం, కలాడి, శ్రీపెరంబూర్, హరిహరపురం, బ్రహ్మంగారి మఠం, నారాయణవనం తదితర ప్రదేశాల్లో శక్తిపీఠాలున్న ప్రదేశాల్లో ప్రణాళికాబద్ధంగా శ్రీనివాసకల్యాణాలు నిర్వహించాల్సిన అవసరముందున్నారు. జనవరిలో అలహాబాదులో జరగనున్న కుంభమేళాకు కోట్లాది మంది హిందువులు హాజరవుతారని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ సహకారంతో స్వామివారి వైభవాన్ని అందరికి తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. శ్రీనివాస కల్యాణాలపై బుక్‌లెట్ రూపొందించాలని ఇఓ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి వెంకట్రామిరెడ్డి, అడిషనల్ ఎఫ్‌ఎ అండ్ సిఎఓ బాలాజీ, శ్రీకల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి రామకృష్ణ, సేవల విభాగం ప్రత్యేకశ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కువ