వెల్దుర్తి, నవంబర్ 21: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. భగీరథ విజయయాత్ర బుధవారం వెల్దుర్తి మండలంలోని మల్లేపల్లె గ్రామానికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమాచార, ప్రచారశాఖ మంత్రి డికె ఆరుణ, డిప్యూటీ స్వీకర్ భట్టి విక్రమార్క, అనంతపురం ఎంపి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. పత్తికొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రైతులు కరవు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నారన్న ఉద్దేశ్యంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు సర్వే చేయించారన్నారు. ఆ తర్వాత 2005లో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రూ. 1800 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని తెలిపారు. మంత్రి అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే వ్యవసాయ ప్రాజెక్టులు పూర్తయి పంట పొలాలు సస్యశ్యామలంగా మారాయన్నారు. ఒక్కప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలతో ప్రజలు ఎంతో నష్టపోయారని, ప్రస్తుతం హంద్రీనీవా ప్రాజెక్టు పనుల ద్వారా 33 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హంద్రీనీవా లిఫ్టు ఇరిగేషన్ పనులకు ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు 8 లిఫ్టు ఇరిగేషన్ల ద్వారా నీరు అందిస్తామని, ఇటువంటి ప్రాజెక్టు ఆసియా ఖండంలో మరెక్కడా లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టు నీరు సద్వినియోగం చేసుకుని రైతులు ఏడాదికి రెండు సార్లు పంటలు పండించుకుని ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రులకు భావితరాలు ఎంతో రుణపడి వుంటాయని తెలిపారు. కార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, మాజీ ఎంపిపి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హంద్రీనీవా 3వ లిఫ్టు ఇరిగేషన్ పనులు ప్రారంభం
భగీరథ విజయయాత్రలో భాగంగా మండల పరిధిలోని మల్లేపల్లె గ్రామంలో నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి 3వ లిఫ్టు ఇరిగేషన్ పనులను బుధవారం రాష్ట్ర మంత్రుల బృందం ప్రారంభించింది. 3 రోజుల క్రితం నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల దగ్గర ప్రారంభమైన భగీరథ విజయయాత్ర బుధవారం పాణ్యం నియోజకవర్గంలోని ఉలిందకొండ నుంచి ప్రారంభమై వెల్దుర్తి మండలంలోని మల్లేపల్లె గ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ శివారులో హంద్రీనీవా 3వ లిఫ్టు ఇరిగేషన్ రిజర్వాయర్ వద్ద మంత్రి రఘువీరారెడ్డి స్విచ్ ఆన్ చేసి నీళ్లు వదిలారు. మంత్రి అరుణ, డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అరుణ మాట్లాడుతూ హంద్రీనీవా లాంటి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆసియా ఖండంలో మరెక్కడా లేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులను నీటితో నింపేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, మురళీకృష్ణ, పత్తికొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
రైతులను జైల్లో పెట్టించిన
ఘనత బాబుదే..
* కర్నూలు సభలో వైఎస్ విజయమ్మ
కర్నూలు, నవంబర్ 21: చంద్రబాబు పాలనలో అప్పల బాధ తాళలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. జిల్లాలో షర్మిల పాదయాత్ర బుధవారం నాటితో ముగియటంతో కర్నూలు నగరంలోని పాతబస్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ హాజరై మాట్లాడుతూ వ్యవసాయం దండగ అని రైతులను జైళ్లలో పెట్టించిన ఘనత బాబుకే దక్కిందన్నారు. వైఎస్ సిఎం అయిన తరువాత రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే దుస్తులు ఆరేసుకోవడానికి పనికొస్తాయన్న చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. విద్యుత్ బిల్లులు కట్టలేని రైతులను జైల్లో పెట్టించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో ఆస్తులను జప్తు చేయించిన బాబు, నేడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అధికార దాహంతో బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి సి ఎం పీఠం దక్కించుకున్న బాబు నీతు లు మాట్లాడటం ఎంతవరకూ న్యాయమన్నారు. ఎన్టీఆర్ రూ. 2 బియ్యం ఇచ్చి, బెల్టుషాపులు రద్దు చేస్తే బాబు తిరిగి ప్రారంభించారన్నారు. జగన్ త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని, మళ్లీ వైఎస్ స్వర్ణయుగాన్ని అందిస్తారన్నారు. విద్యార్థులకు ఫీజులు, వృద్ధులకు పింఛన్లు ఆగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ చనిపోయిన తరువాత రోశయ్య, కిరణ్‌లు సిఎంలు అయి ఏమి సాధించారని ప్రశ్నించారు. మానాన్న కష్టపడి అధికారం తెస్తే పెద్దమనుషులు అధికారం అనుభవిస్తూ జగనన్నను జైలులో పెట్టించారని ధ్వజమెత్తారు. పేదల కష్టాలు తీర్చుతానని గొప్పలు చెబుతున్న బాబు 9 ఏళ్ల పాలనలో ఏమి చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, నాయకులు వైవి సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగుగంగ కాలువలో పడి
ఇద్దరి మృతి
రుద్రవరం, నవంబర్ 21: మండల పరిధిలోని రెడ్డిపల్లె గ్రామ సమీపంలో బుధవారం తెలుగుగంగ 21 బ్లాక్ ఛానల్ కాలువలో పడి నాగరాజు (35), బొజ్జయ్య (22) మృతి చెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ముద్దాసు నాగరాజు, గుర్రం బొజ్జయ్య, శివ ముగ్గు రూ కలిసి పంట పొలాల్లో పని ముగించుకుని సమీపంలోని చందలూరు, మందలూరు గ్రామాలకు సాగునీరు అందించే తెలుగుగంగ బ్లాక్ ఛా నల్ డ్రాపు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. డ్రాపు అవతలివైపు వున్న వలను తెచ్చేందుకు వెళ్తుండగా బొజ్జయ్య ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడ్డాడు. వెంటనే అతడిని కాపాడేందుకు నాగరాజు కాలువలోకి దూకా డు. అయితే కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా వుండడంతో ఒడ్డుకు చేరలేక ఒకరిని ఒకరు పట్టుకుని కొట్టుకుపోయారు. దీంతో ఒడ్డున ఉన్న శివ ఈ విషయాన్ని సమీపంలోని పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులకు తెలిపారు. వెంటనే రైతులు కాలువ వద్దకు వచ్చి చూడగా వారిద్దరు అప్పటికే మృతి చెందడంతో మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును గ్రామస్థులను అడి గి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైధ్యశాలకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నాగరాజు, బొజ్జయ్య మృతితో వారి కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి.
మిట్టపల్లె వద్ద మరొకరి మృతి
ఆళ్లగడ్డ : మండల పరిధిలోని మిట్టపల్లె గ్రామానికి చెందిన రైతు హరినారాయణ (33) బుధవారం ప్రమాదశాత్తూ తెలుగుగంగ 28వ బ్లాక్ ఉప ప్రధాన కాలువలో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. మూడు రోజుల క్రితం అయ్యప్ప మాల ధరించిన హరినారాయణ అదే గ్రామానికి చెందిన బాలుడు నాగేష్ కాలువ నీటిలో ఈత కొడుడూ ప్రమాదంలో చిక్కుకోగా గమనించిన రైతు బాలుడిని రక్షించాడు. అనంతరం ఒంటికి అతుక్కున్న బురదను శుభ్రం చేసుకుంటుండగా కాలు జారి ప్రమాదవశాత్తూ కాలువలో పడ్డాడు. ఆ సమయంలో నీటి ప్రవాహ ఉద్ధృతి అధికంగా వుండడంతో ఒడ్డుకు చేరలేక నీటిలో మునిగి పోయాడు. కాలువ సమీపంలో ఉన్న రైతులు గమనించి రైతును ఒడ్డుకు చేర్చాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో
ఇద్దరి మృతి
* యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్న కార్మికులు
బేతంచర్ల, నవంబర్ 21: పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కార్మికుల బంధవులు తెలిపిన వివరాలు.. సిమెంట్ నగర్‌కు చెందిన నాగరాజు (30), శివశంకర్ (20), లక్ష్మన్న బుధవారం విధి నిర్వహణలో భాగంగా ప్యాకింగ్ సెక్షన్‌లో పేరుకుపోయిన సిమెంట్‌ను కదిలిస్తుండగా ఒక్కసారిగా వారిపై టన్నుల కొద్దీ సిమెంట్ పడింది. దీంతో నాగరాజు, శివశంకర్ సిమెంట్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మన్న తీవ్రంగా గాయపడడంతో కర్నూలుకు తరలించారు. ఇదిలా ఉండగా శివశంకర్ బంధువులు మృతదేహాన్ని ఫ్యాక్టరీ గేట్ వద్ద వుంచి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే వీరు మృతి చెందారని మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంకాలం 5 గంటల వరకూ ఆందోళన చేపట్టారు. అయితే ఫ్యాక్టరీ ప్రతినిధులు ఎవరూ సంఘటనా స్థలానికి రాకపోవడంతో ఆందోళనకారులు బస్సు అద్దాలు, ఇతర సామాగ్రి పగులగొట్టేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికుల సహచరులతో, మృతుడి బంధువులతో ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఫ్యాక్టరీలో ఎలాంటి రక్షణ పరికారులు అందుబాటులో ఉంచడం లేదని, ఏదైనా ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేతో మొర పెట్టుకున్నారు. అలాగే వేతనాలు కూడా 3 నెలలకోసారి ఇస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వాపోయారు. అనంతరం ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించి మృతదేహాలను తీసుకెళ్లారు. బేతంచర్ల సిఐ మహేశ్వరరెడ్డి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అధికారులు బాధ్యతగా
పనిచేయాలి:కలెక్టర్
బనగానపల్లె, నవంబర్ 21: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలోని పొదుపు భవనంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాధాన్యతా క్రమంలో ఆయా శాఖలపై సమీక్ష జరిపారు. మండలంలో ఖరీఫ్, రబీ పంటల పరిస్థితి, రుణాలు తదితర అంశాలపై వ్యవసాయాధికారులను అడిగారు. తాగునీటి సమస్యపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో ఆరా తీశారు. అలాగే విద్య, వైద్యం గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే మండలంలో 5 గ్రామాలను ఎంపిక చేయాలని నిర్మల్ డెవలప్‌మెంట్ పథకం కింద ఆ గ్రామ పంచాయతీలకు రూ. 55 వేల ప్రకారం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఐసిడిఎస్, డిఆర్‌డిఎ ఇంకా పలు శాఖల సిబ్బంది సమన్వయంగా పనిచేసి శిశు మరణాలు తగ్గేలా చూడాలని సూచించారు. సమావేశంలో నంద్యాల ఆర్డీఓ శంకర్, జడ్పీ సిఇఓ సూర్యప్రకాశ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రవిబాబు, ఇఇ హరేరామ్, సంక్షేమ హాస్టళ్ల డిప్యూటీ డైరెక్టర్ సారయ్య, ఎడిఎ, తహశీల్దార్ శేషఫణి, ఎంపిడిఓ సి.వెంగన్న, ప్రత్యేకాధికారి సుజాత, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, విఆర్‌ఓలు, వార్డెన్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ
కలెక్టర్ మంగళవారం రాత్రి పట్టణంలోని కొండపేట ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేసిన విషయం విధితమే. అయితే బుధవారం ఉదయం 6 గంటలకే ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, కస్తూరిబా పాఠశాల దాని అనుబంధ హాస్టల్, ఇతర సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి హడలెత్తించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంక్షేమ హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.
ప్రయాణికుల సౌకర్యాలకే ప్రాధాన్యత
* గుంటూరు రైల్వే డిఆర్‌ఎం ప్రసాద్
నంద్యాల అర్బన్, నవంబర్ 21: ప్రయాణికుల సౌకర్యాలకే రైల్వేశాఖ ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుంటూరు డివిజన్ డిఆర్‌ఎం ఎన్‌కె ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన నంద్యాల రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. అలాగే నందిపల్లె కొత్తరైల్వేస్టేషన్ పనుల ప్రగతిని పరిశీలించి త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లో ప్ర యాణికుల సౌకర్యార్థం ఫుడ్‌ప్లాజా ఏర్పాటుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం సైకిల్‌స్టాండ్ ప్రాంతంలో ఫుడ్‌ప్లాజా ఏర్పాటుచేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే నంద్యాల స్టేషన్‌లో ప్రయాణీకులకు వసతి కల్పించేందుకు 10 ఎసి రూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్ శుభ్రంగా ఉంచడంతో పాటు ఖాలీ స్థలాల్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణం కాపాడేందుకు చర్యలు చేపట్టామన్నారు. స్టేషన్ మొత్తం కలియతిరిగి కింది అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెలాఖరులోగాని, డిసెంబర్ మొదటి వారంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ నంద్యాలలో పర్యటిస్తారన్నారు. ఈ దశలో గుంటూరు వైపు వెళ్లే రైలు గంట అలస్యంగా రావడం, గిద్దలూరు వైపు వెళ్లే ప్రయాణీకులు డిఆర్‌ఎంకు ఫిర్యాదు చేశా రు. డోన్ గుంటూరు ప్యాసింజరు రైలు గతంలో నంద్యాలకు ఉదయం 7.20 నిమిషాలకు వచ్చేదని అయితే మార్చి న వేళల ప్రకారం 8.30 వస్తోందని అదికూడ అలస్యం అయితే గిద్దలూరు వరకు ప్రతిరోజు సీజన్ టిక్కెట్‌లపై ప్రయాణించే ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. ఈ రైలును నంద్యాలకు గతం లో లాగా 7.20కి వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డిఆర్‌ఎం వెంట సీనియర్ డిసిఎం శ్యామ్‌సుందర్, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ వెస్ట్ జయప్రకాష్‌రెడ్డి, నంద్యాల ఎస్‌ఎస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు-కాచిగూడ రైలు 24 నుంచి పునరుద్ధరణ
ట్రాక్ మరమ్మతుల కారణంగా పాక్షికంగా రద్దుచేసిన కాచిగూడ-గుంటూరు, గుంటూరు-కాచిగూడ రైళ్లను 24వ తేదీ నుంచి పునరుద్దరిస్తారిని సీనియర్ డిసిఎం తెలిపారు.
షర్మిల పాదయాత్రకు జననీరాజనం
కల్లూరు, నవంబర్ 21: గత 14 రోజులుగా జిల్లాలో వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్రకు జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. మంగళవారం రాత్రి నగర శివారులోని క్లారెంట్ పాఠశాలలో బస చేసిన ఆమె బుధవారం 11 గంటలకు వైకాపా నాయకులు, మహిళా నాయకురాళ్లు, అశేషజ నం వెంట రాగా పాదయాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామంటూ పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలింది. పాదయాత్ర ప్రారంభం కాకముందే షర్మిలను చూడడానికి రహదారులకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ము ఖ్యంగా షర్మిలను చూడడానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బళ్లారి చౌరస్తాలో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. కొన్ని సందర్భాల్లో ప్రజలను కట్టడి చేయడానికి అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిజెప్పారు. అలాగే ముఖ్య కూడల్లో ప్రజలు షర్మిలపై పూల వర్షం కురిపిస్తూ, బాణసంచా పేలుస్తూ అభిమానం చాటుకున్నారు. మధ్యాహ్నం స్థానిక బిర్లా కాంపౌండులో షర్మిల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వికలాంగులతో కలిసి భోజనం చేశారు. అక్కడి నుండి పాదయాత్రలో వైకాపా గౌ రవాధ్యక్షురాలు విజయమ్మ చేరడంతో అభిమానుల సంతోషానికి అదుపు లేకుండా పోయింది. అక్కడి నుండి స్థానిక సి.క్యాంపు సెంటర్, బుధవార పేట మీదుగా పాతనగరానికి యాత్ర చేరుకుంది. ఆ తర్వాత ప్రకాష్ నగర్, రోజాల మీదు గా సుంకేసుల రోడ్డుకు చేరుకుని సెయింట్ జోసఫ్ మహిళా కళశాలలో రాత్రి బస చేసింది. గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. పాదయాత్రలో ఎంపి మేకపాటి రామోహన్‌రావు, మాజీ మంత్రి మారెప్ప, భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకట్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే శోభనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, లక్ష్మీపార్వతి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, తోట కృష్ణారెడ్డి, సిహెచ్ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో నేటితో
ముగియనున్న పాదయాత్ర
కర్నూలు : షర్మిల పాదయాత్ర బుధవారం నాటితో జిల్లాలో ముగియనుంది. ఈ నెల 8వ తేదీ జిల్లాలోకి ప్రవేశించిన ఈ పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మం త్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూ రు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా షర్మిల ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. బధవారం ఉదయం 11 గంటలకు నగరంలోని సెయింట్ క్లారెట్ స్కూల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్, కృష్ణానగర్, మసీదు సెంటర్, గాయిత్రీ ఎస్టేట్ రోడ్డు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ మీదుగా బుధవారపేట నుంచి హంద్రీ బ్రిడ్జి నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పూలబజార్, పెద్దమార్కెట్, పాతబస్టాండ్, పోలీస్‌క్వాటర్స్‌లైన్, ప్రకాష్‌నగర్ గుండా సెయింట్ జోసౌఫ్ కాలేజ్ వరకూ 12 కీలోమీటర్ల పాదయాత్ర సాగింది. కళాశాల ఆవరణలోనే రాత్రి బస చేసి గురువారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లాలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశించనుంది.
4వ ఎత్తిపోతల విభాగానికి చేరుకున్న
భగీరథ విజయయాత్ర
క్రిష్ణగిరి, నవంబర్ 21: హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెంట మంత్రి రఘువీరా చేపట్టిన భగీరథ విజయయాత్ర బుధవారం సాయంత్రం మండల పరిధిలోని తొగర్చేడు గ్రామం వద్ద 4వ ఎత్తిపోతల విభాగానికి చేరుకుంది. ఈ యాత్రకు సంఘీభావంగా డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో మంత్రి రఘువీరా తొగర్చేడు గ్రామ మహిళలను, రైతులను ఆప్యాయంగా పలకరించారు. కాలువలో నీరు ప్రవహిస్తుంది, ఇక పంటలు బాగా పండుతాయని మంత్రి ధైర్యం చెప్పారు. పాదయాత్రలో అనంతపురం ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, మడకశిర, ధర్మవరం, గుత్తి ఎమ్మెల్యేలు సుధాకర్, వెంకట్రామిరెడ్డి, మధుసూదన్‌గుప్తా, ఎమ్మెల్సీ తిప్పేస్వామి, శివ, బ్రహ్మానందారెడ్డి, చంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
* రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి
english title:
rai
Date:
Thursday, November 22, 2012