Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భర్త, బిడ్డపై కిరోసిన్ పోసి నిప్పంటించిన మహిళ

$
0
0

నాదెండ్ల, నవంబర్ 21: భర్త, కుమారుని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించిన సంఘటన మండలంలోని గొరిజవోలులో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేట మండలం గురవాయపాలెంకు చెందిన రూతమ్మకు నాదెండ్ల మండలం గురిజవోలుకు చెందిన జొన్నలగడ్డ గన్నయ్యకు నాలుగేళ్ల కుమార్తె, 10 నెలల బాబు ఉన్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో భర్త గన్నయ్య, కుమారుడు ఆనంద్‌పాల్ (పది నెలలు)పై రూతమ్మ కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఆనందపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త గన్నయ్య బయటకువచ్చి కేకలు వేసి, పక్కనే ఉన్న నీటితొట్టిలోకి దూకాడు. స్థానికులు గన్నయ్యను ఆటోలో నరసరావుపేటలోని వైద్యశాలకు తరలిస్తుండగా, సమాచారం అందుకున్న 108వాహన సిబ్బంది మార్గమధ్యలో ఉన్న గన్నయ్యను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గన్నయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది కాలంగా భార్య రూతమ్మ మానసిక పరిస్థితి సక్రమంగా లేదని రూతమ్మ తల్లి గన్నమ్మ తెలిపింది. సమాచారం తెలుసుకున్న సిఐ జె శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యలను నివారించేందుకు
రైతులకు కౌనె్సలింగ్

ప కాల్‌సెంటర్ ఏర్పాటుకు చర్యలు ప కలెక్టర్ సురేష్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, నవంబర్ 21: భూమిని నమ్ముకున్న రైతు కొన్ని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడిలకులోనై ఆత్మహత్యలు చేసుకోవడం చాలా విచారకరమని, అటువంటి వారిని గుర్తించి కౌనె్సలింగ్ నిర్వహించడం ద్వారా రైతుల ఆత్మహత్యలను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నెంబర్‌ను కేటాయించాలన్నారు. రైతు సంఘం సభ్యులను కూడా కాల్‌సెంటర్‌కు పిలిచి ఫోన్ ద్వారా కాని, వ్యక్తిగతంగా గాని రైతు కేంద్రానికి వచ్చినప్పుడు అవసరమైన కౌనె్సలింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. దానికితోడు కనీసం ఇద్దరు మానసిక వైద్యులను కూడా ఉంచడం జరుగుతుందని, తద్వారా వారికి కౌనె్సలింగ్‌తో పాటు సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2004వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 405 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఫిర్యాదులందాయని, వీటిలో 255 కేసులు ఆత్మహత్యలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 242 కేసులకు సంబంధించి మృతిచెందిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చామన్నారు. 13 కేసులను విచారించి నివేదికను ప్రభుత్వానికి పంపించామని, ఆదేశాలు అందిన వెంటనే ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు మరో 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందున, వాటిని కూడా విచారించాల్సిందిగా రెవెన్యూ డివిజనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంబంధిత ఆర్‌డిఒ, ఇతర శాఖల అధికారులతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటికి వెళ్లి స్వయంగా విచారించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతు, కౌలురైతు వ్వవసాయం చేయడం వల్ల అప్పులపాలై మానసిక సంఘర్షణలో ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే తప్పనిసరిగా సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు మృతి చెందిన రైతు కుటుంబానికి పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. రైతుకు సంబంధించిన పిల్లలను సాంఘిక, సంక్షేమ వసతి గృహాల్లో చదివించడంతో పాటు సంబంధిత కుటుంబానికి ఇల్లు లేనిపక్షంలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వర్తింపజేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెసి డాక్టర్ ఎన్ యువరాజ్, డిఆర్‌ఒ కె నాగబాబు, ఆర్‌డిఒలు అరుణ్‌బాబు, వెంకటరమణ, డిఆర్‌డిఎ పిడి బి వెంకటరెడ్డి, సోషల్‌వెల్ఫేర్ డిడి హనుమంతునాయక్, హౌసింగ్ పిడి సురేష్‌బాబు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నల్ల బాడ్జీలతో మత్స్యకారుల నిరసన
నిజాంపట్నం, నవంబర్ 21: రాష్ట్రంలోనే ఏకైక మత్స్యకార మంత్రిగా మోపిదేవి వెంకటరమణారావును సిబిఐ అధికారులు అక్రమంగా అరెస్టు చేయటం దారుణమని నిజాంపట్నం మాజీ ఎంపిపి ప్రసాదం వాసుదేవ అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బుధవారం బోట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి అరెస్టుకు నిరసగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వాసుదేవ మాట్లాడుతూ మోపిదేవిని అరెస్టుచేసి ఇప్పటివరకు బెయిల్‌మంజూరు చేయకపోవటం సిబిఐ పక్షపాతవైఖరికి నిదర్శనమని అన్నారు. బోట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నా నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి మంత్రులు ఆరుగురు ఉండగా వారినివదలి సిబిఐ బిసి నాయకుడైన మోపిదేవిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే మాజీమంత్రికి బెయిల్‌మంజూరు చేయకుంటే రాష్ట్రంలో 80లక్షల మంది మత్స్యకారులతోకలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిజాంపట్నంలోని దుకాణాలు బంద్ పాటించి వేయిమందికిపైగా నల్లబాడ్జీలు ధరిం చి పాదయాత్రగా వెళ్లి మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ నాగేశ్వరావుకు వినతిపత్రం అందజేయటంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మోపిదేవి హరినాధ్‌బాబు, శ్రీనివాసరావు, నాగేశ్వరావు, మత్స్యకారులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
పేట ప్రజల అభిమానం పొందడం నా అదృష్టం

ప తమిళనాడు గవర్నర్ రోశయ్య
నరసరావుపేట, నవంబర్ 21: నరసరావుపేట పట్టణ ప్రజల ప్రేమాభిమానాలను పొందే అవకాశం తనకు లభించిందని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య అన్నారు. బుధవారం స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని కాళికాదేవి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఆరుకోట్ల రూపాయల అంచనాలతో నిర్మించతలపెట్టిన వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రం, వాన ప్రస్థాశ్రమానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. కార్యక్రమానికి అన్నదాన సత్రం అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ అధ్యక్షత వహించారు. మీలో ఒకడిగా నరసరావుపేటకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, వసతులు ఇంకా కావాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధాశ్రమం సర్వహంగులతో రూపుదిద్దుకోవాలని సూచించారు. వయోభారంతో ఉన్న వారు పిల్లలు ఉపాధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు కుటుంబం దూరంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆశ్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వయోవృద్ధులకు వైద్యసేవలు కూడా ఆశ్రమంలో అందిస్తామనడం హర్షణీయమన్నారు. గతంలో ఇతర దేశాల్లో ఇలాంటి వృద్ధాశ్రమాలు ఉండేవని, అప్పుడు పాశ్చాత్య సంస్కృతి అని అనుకోవడం జరిగిందని, నేడు మనదేశంలో అవసరాలను బట్టి ఇలాంటి వానప్రస్థాశ్రమాలను నిర్మించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాను 80 సంవత్సరాలకు చేరుకున్నానని, ఈ నిర్మాణం చూసే భాగ్యం తనకు కలుగుతుందో, లేదోనని అన్నారు. సంపూర్ణ విశ్వాసంతో త్వరితగతిన ఆశ్రమాన్ని నిర్మించాలని సూచించారు. కమిటీ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ మాట్లాడుతూ ఏడాది కాలంలో సంపూర్ణ స్థాయిలో అన్నదాన సత్రం, వాన ప్రస్థాశ్రమాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులు కాకుమాను పెదపేరిరెడ్డి, ఆర్డీవో పి అరుణ్‌బాబు, వ్యవస్థాపక అధ్యక్షుడు చీతిరాల గురుపెద్దన్న, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి రాజేంద్రప్రసాదరావు, గొడవర్తి చంద్రశేఖర్, కూకట్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇస్సపాలెం శ్రీ కాళికాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తదుపరి చీతిగురుపెద్దన్న సరస్వతి ఏసి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు. అనంతరం సత్తెనపల్లిరోడ్డులోని మెడికల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించారు. తొలుత కపలవాయి విజయకుమార్ గృహంలోను, బొలిశెట్టి రామమోహనరావుగృహంలోను కొద్దిసేపు అతిథులు, బంధువులతో ముచ్చటించారు.
పులిచింతల పునరావాస కార్యక్రమాలను
వేగవంతం చేయండి
గుంటూరు, నవంబర్ 21: పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో పులిచింతల ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా వంటి వౌలిక వసతుల కల్పనకు అధికారులు చొరవ చూపాలన్నారు. స్వయం సహాయక సంఘాల గ్రూపులను కొత్తగా పునర్వవస్థీకరించి సమీపంలోని బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాలని సూచించారు. రివాల్వింగ్ ఫండ్ కింద 10 వేల రూపాయల చొప్పున పంపిణీ చేసే ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస కాలనీల్లో అవసరమైన రేషన్‌షాపులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్‌డిఒను ఆదేశించారు. పునరావాస కాలనీల్లో అవసరమైన చోట అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, పులిచింతల ప్రాజెక్టు కింద ముంపుకు గురైన కాలనీలను ఆయా పంచాయితీల్లో కలిపేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే చేపట్టిన జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ నివాసం లేని వారిపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో గృహనిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి అర్హత కల్గిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఇప్పటికే గృహనిర్మాణాలు చేపట్టని వారిని గుర్తించి నిర్మాణాలు చేపట్టేలా చూడాలని కోరారు. వౌలిక వసతుల కల్పనకు రెండు వారాల్లో ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. జెసి యువరాజ్ మాట్లాడుతూ పునరావాస కాలనీల్లో పంచాయితీ భవనాల నిర్మాణాలకు అవసరమైన భూములకు సంబంధించి సర్వే నెంబర్లను జిల్లా పంచాయితీ అధికారి సూచించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సిహెచ్ లక్ష్మ య్య, గుం టూరు, నరసరావుపేట ఆర్‌డిఒలు వెంకటరమణ, అరుణ్‌బాబు, డిఆర్‌డిఎ పిడి వెంకటరెడ్డి పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇద్దరు దొంగల అరెస్ట్
* మూడున్నర లక్షల చోరీసొత్తు స్వాధీనం
గుంటూరు (క్రైం), నవంబర్ 21: వేర్వేరు కేసుల్లో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి సుమారు మూడున్నర లక్షల రూపాయల విలువచేసే చోరీసొత్తును అరండల్‌పేట పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక గౌతమినగర్‌కు చెందిన చంద్రశేఖర్ గత నెల 27వ తేదీన బండ్లమూడి గార్డెన్స్ ఫంక్షన్ హాలులోకి వెళ్లి పెళ్లికూతురి గదిలో రెండు లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మరోఘటనలో భారత్‌పేటకు చెందిన వెంకటకృష్ణ సెప్టెంబర్ నెలలో మూడు ద్విచక్ర వాహనాలను చోరీచేశాడు. అతన్ని అరెస్ట్ చేసి వాహనాలను అరండల్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితుల వద్ద నుండి మూడున్నర లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు అరండల్‌పేట డిఎస్‌పి వెంకటేశ్వరరావు బుధవారం మీడియాకు తెలిపారు.
అధిక బరువుతో వెళ్లే వాహనాల యజమానులపై
ఇక నాన్ బెయిలబుల్ కేసులు

గుంటూరు, నవంబర్ 21: పరిమితికి మించి అధికలోడ్‌తో వెళ్లే వాహనాల యజమానులు, డ్రైవర్లపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ యాక్టు 1984ను అనుసరించి ఇకపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ టి రఘునాథ్ స్పష్టం చేశారు. బుధవారం పట్ట్భాపురంలోని తన కార్యాలయంలో రఘునాథ్ విలేఖర్లతో మాట్లాడుతూ నాన్‌బెయిలబుల్ కేసులతో పాటు అపరాధ రుసుం కూడా వసూలు చేయనున్నట్లు చెప్పారు.

*కుమారుడు మృతి... భర్త పరిస్థితి విషమం * భార్య మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఘటన
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>