నెల్లూరుసిటీ, నవంబర్ 21: నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లపై కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులతో బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ టిఎస్‌ఆర్ ఆంజనేయులు సమిక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24నుంచి 28వ తేదీ వరకు రొట్టెల పండుగ ఉంటుందన్నారు. బారాషాహిద్ దర్గాను సుమారుగా 5లక్షల మంది భక్తులు సందర్శిస్తారని చెప్పారు. దర్గాలో 24గంటల పాటు భక్తులు ఉంటారని వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. 23వ తేదీ సాయంత్రం నుంచే భక్తులు దర్గాకు చేరుకోవచ్చున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పనిచేయాలని సూచించారు. భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. దర్గా ఆవరణలో మొత్తం 1000 లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల మీద షాపులను పెట్టనివ్వకుండా సిటీ ప్లానింగ్ అధికారులు షాపుల కోసం మార్కింగ్ ఇవ్వాలన్నారు. మార్కింగ్ ఇచ్చిన స్థలాలోనే షాపులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ముందుకు వస్తే ఆ షాపులను తొలగిస్తామని హెచ్చరించారు. భక్తులకు తాగునీరు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ, రైల్వేస్టేషన్, దర్గా ఆవరణ, పోలీసు పేరేడ్ గ్రౌండ్‌లో తాగునీరు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి తాగునీరు కేంద్రం వద్ద క్లోరోస్కోప్‌తో వాటర్‌ను చెక్ చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం కలగుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దర్గాలో పారిశుద్ధ్యం లోపించకుండా ఫెనాయిల్, బ్లీచింగ్, సున్నంను వాడాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు యాప్రన్స్ ఉండే విధంగా చూడాలన్నారు. యాప్రన్స్ ధరించకుండా పని చేస్తే వారికి జీతాన్ని కట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా వారిని గైర్హాజరు కింద పరిగణిస్తామన్నారు. మొత్తం 250 యాప్రన్స్‌ను రెడీగా ఉంచుకువాలన్నారు. దర్గా ఆవరణలో మొత్తం 18 డంపర్ బిన్‌లను ఏర్పాటు చేస్తున్నాట్లు తెలిపారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఏడుగురు అధికారులను ప్రత్యేకంగా నియమించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ సుబ్బరాజు, ఎస్‌ఇ జానకీరామ్, సిపి వరప్రసాద్, డిప్యూటీ కమిషనర్ కె భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
లిక్కర్ డాన్లపై చర్యలకు
రంగం సిద్ధం
రంగం సిద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే ఆలస్యంగా మద్యం అక్రమాల్లో నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఏసిబి యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ఏడాదికాలంగా నత్తనడకన సాగుతూ వచ్చిన మద్యం అమ్మకాల్లో అక్రమాలపై ఏసిబి దర్యాప్తు వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పదుగురులోపుమద్యం వ్యాపారులు, వందలోపుఎక్సైజ్ అధికారయంత్రాంగం, ఏభైలోపుపోలీసులు నిందితులుగా ఉన్నారు. చార్జీషీట్ దాఖలు నేపథ్యంతో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, పోలీసుల్ని అరెస్ట్ చేసేందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి పొందేందుకు ఏసిబి అధికారులు నివేదికలు పంపారు. ఇప్పటికే హైకోర్టు కూడా నాలుగువారాల గడువువిధించడంతో ఆలోగానే అందరూ అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే అప్పటిలోగా ఈ కేసు నీరుగార్చే ప్రయత్నాలు కూడా ఏదో ఒక కోణంలో చోటుచేసుకోవచ్చనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కేసు నమోదు చేసిన తొలినాళ్లలోనే బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడు గ్రామ నాయకుడు, కోవూరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం సిండికేట్ మాఫియాలో కీలక పాత్ర పోషించే శ్రీనివాసులురెడ్డిని ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పట్లోనే ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్‌ను, సిండికేట్ కార్యాలయంలో పనిచేసే గుమస్తా నరసింహుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం విదితమే. చార్జీషీట్ వ్యవహారం కొలిక్కివస్తున్న నేపథ్యంలో నిందితులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాలనేది ఏసిబి యంత్రాంగం అనుసరిస్తున్న వైనంగా తెలియవచ్చింది. ఇదిలాఉంటే జిల్లాలో మూడు వందలకుపైగా మద్యం దుకాణాలుండగా అందులో తొమ్మిది మంది మాత్రమే కేసుల్ని పరిమితం చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లా అప్పుడు, ఇప్పుడు ఎమ్మార్పీలకంటే అధిక మొత్తాలకు విక్రయించడం, లూజు విక్రయాలు సాగించడం వంటి అవకతవకలు తెలిసినవే. అయితే రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో కేవలం తొమ్మిది మంది వ్యాపారులపై మాత్రమే చార్జీషీట్ వరకు దర్యాప్తు కొనసాగినట్లు తెలుస్తోంది. అలాగే తెల్ల(బియ్యం) రేషన్ కార్డు ఓ వైపున కలిగి ఉంటూ మద్యం వ్యాపారపరంగా లైసెన్స్‌లు పొందిన వారిపైనా ఏసిబి కసరత్తు కొనసాగించింది. అయితే ఎట్టకేలకు ఈ నేరాన్ని కార్డుల రద్దుకు సంబంధించి కలెక్టర్‌కు ప్రతిపాదించడంతోనే సరిపెట్టినట్లు సమాచారం. తెల్లకార్డుల్ని కలిగి ఉండటం నేరంగా పరిగణించి శిక్ష పడేలా చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యల్లేకపోవడం గమనార్హం.
భక్తిశ్రద్ధలతో గోపూజలు
నెల్లూరు కల్చరల్, నవంబర్ 21: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన గుడి కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక రుక్మిణీసత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలోని గోశాలలో గోవులకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోమాతలను అలంకరించారు. ఈసందర్భంగా దేవస్థానం వేద పండితులు మాట్లాడుతూ కార్తీకశుద్ధ అష్టమిని గోపాష్టమిగా భావించి గోపూజలు జరుపుకునే సంప్రదాయం ఉందన్నారు. గోవు విశ్వమాతని, సర్వ దేవతా స్వరూపం కాబట్టి గోవులను పూజించాలని, రక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చక స్వాములు, భక్తులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ఆలయాల్లో గోపూజలు నిర్వహించారు. మన గుడి కార్యక్రమంలో భాగంగా 24వ తేదీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో కైశిక ఏకాదశి, ఉదయం 9 గంటల నుండి లక్ష తులసి అర్చన, విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతాయి. 28వ తేదీ ఉదయం 11 గంటలకు సత్యనారాయణస్వామి వ్రతం, సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవం జరుగుతాయి.
పాఠశాలల మనుగడను కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే
కోట, నవంబర్ 21: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గకుండా చూసుకుంటూ పాఠశాలల మనుగడను కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కోట మండలంలోని చిట్టేడు, కోట గ్రామాల్లోని ఎస్టీ, ఎస్సీ, బిసి గురుకుల పాఠశాలలను, కళాశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరానికి ప్రభుత్వం 32 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. విద్యార్థుల శాతం తగ్గిన ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. ప్రతి సంవత్సరం ఆర్వీఎంల ద్వారా 15 కోట్ల రూపాయలను విద్యారంగానికి ఖర్చుచేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదన్నారు. ప్రస్తుత విద్యావస్థ పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించగా పరిస్థితులను మెరుగుపరుస్తానని సిఎం హామీ ఇచ్చారని తెలిపారు. బిసి గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాల స్థానానికి పెంచాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్సీని కోరారు. తాగునీటి సమస్య వుందని, ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించాలని విద్యార్థులు ఎమ్మేల్సీకి వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట యుటిఎఫ్ నాయకులు జనార్ధన్ పలువురు ఉపాధ్యాయులు వున్నారు.
గూడూరులో గ్యాస్ ఏజెన్సీపై సబ్ కలెక్టర్ కొరడా
గూడూరు, నవంబర్ 21: గృహ అవసరాలకు అందాల్సిన వంటగ్యాస్ అక్రమమార్గంలో ఉన్న 57 గ్యాస్ సిలెండర్లును సబ్‌కలెక్టర్ జె నివాస్ బుధవారం సీజ్‌చేసి గ్యాస్ ఏజెన్సీపై కేసు నమోదు చేశారు. ఆయన పట్టణంలోని పలు వ్యాపార దుకాణాలను, హోటళ్లను, టిఫిన్ అంగళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహ అవసరాలకు సంబంధించి బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు క్రమ పద్ధతిలో గ్యాస్ సిలెండర్లను డెలివరీ చేయాల్సి ఉండగా వాటిని సిబ్బంది వ్యాపార అవసరాలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో సబ్‌కలెక్టర్ తన సిబ్బందితో బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలలోని వ్యాపార దుకాణాలపై దాడులు నిర్వహించి గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలెండర్లను వ్యాపా అవసరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించి 57 సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన గూడూరులోని సాయి గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ను చేరుకుని స్టాక్‌ను పరిశీలించారు. ఉండాల్సిన స్టాక్‌కన్నా 26 సిలిడర్లు వ్యత్యాసంగా ఉండడంతో ఆ ఏజెన్సీపై కేసు నమోదుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ గృహ అవసరాలకు సకాలంలో అందాల్సిన వంట గ్యాస్‌ను గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పక్కదారి పట్టించి వ్యాపార వర్గాలకు బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం తమ దృష్టికా రావడంతో తాను పట్టణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి సిలిండర్లను స్వాధీనం చేసుకుసన్నట్లు చెప్పారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న 21 రోజులకు డోర్‌డెలివరీ ద్వారా సిలిండర్లను అందజేయాల్సిఉండగా సిబ్బంది తమ చేతివాటడం ప్రదర్శిస్తూ బ్లాక్‌లో విక్రయాలు జరుపుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయనవెంట మండల తహశీల్దార్ మైత్రేయ, ఆర్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు.
బడ్జెట్ కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఏదీ ?
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, నవంబర్ 21: ప్రతి ఏటా రాష్ట్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయలకుపైగానే మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని బెస్త సంఘ జిల్లా అధ్యక్షులు పుట్టుబోయిన సుబ్బరాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ వల్ల ఎంతగానో ఆదాయం సమకూరుతున్నా మత్స్యకారుల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం అందులో ఒక వంతుకూడా లేకపోవడం దారుణమన్నారు. బుధవారం ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఏకరవుపెట్టారు. ఇప్పటికైనా పాలకులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడం ద్వారా పరిష్కరించాలని విన్నవించుకున్నారు. జిల్లాలో బెస్తమత్స్యకారులు ఏ రోజుకారోజు, ఏ పూటకాపూట అనేలా బతుకులీడుస్తున్నారు. మత్స్యకార్ల సంఘాలకు పావలా వడ్డీ రుణాల్ని బ్యాంకు ద్వారా ఇప్పించడంలో ప్రభుత్వమే తనఖాగా ఉండాల్సిన నియమం ఆచరణకు నోచుకుంటున్న వైనం అంతంతమాత్రంగానే ఉంటోందన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో, ఇతర నీటి వనరుల్లో మత్స్యసాగుబడి నిమిత్తం చేప పిల్లల్ని ఏభైశాతం రాయితీతో అందజేయాల్సిన నిబంధన సైతం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 700 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో మత్స్యకార విద్యార్థులకు తగిన రిజర్వేషన్ అమలుపరచాలని డిమాండ్ చేశారు. మత్స్యకార్లకు గతంలో నలభై కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. అయితే అప్పట్లో మాఫీకి నోచుకోని మత్స్యకార్లకు ఇప్పుడు వడ్డీరాయితీ అవకాశం కల్పించాలని కోరారు. ప్రమాద బీమా కింద ఏభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెంచిన విధానం సమంజసంగా అమలుకావాలన్నారు. భారతదేశపుమత్స్య ఉత్పత్తుల్లో సముద్రం నుంచి అవుతున్న రాశి 16లక్షల టన్నుల వరకు ఉందన్నారు. అందులో ఆంధ్రప్రదేశే ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రా నుంచి 18 రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రం మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిల్లో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో 974 కిలోమీటర్ల సముద్రతీరంలో, చెరువుల్లో, ఇతర నీటి వనరుల్లో 45.38 కోట్ల రూపాయల చేపల పిల్లల్ని నిల్వ చేస్తున్నట్లు కూడా సుబ్బరాయుడు వివరించారు. రాష్ట్రంలో 400 మహిళా మత్స్యకార సహకార సంఘాలు ఏర్పాటు చేసి తమ యూనియన్ తరఫున ఇతోధికంగా సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఏదేమైనా మత్స్యకార్ల సంక్షేమం కోసం ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
ప్రభుత్వ పథకాల విజయవంతానికి శ్రమించండి
కావలి, నవంబర్ 21: ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను సమర్ధవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా శ్రమించాలని జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ వివిధ శాఖల అధికారులకు ఉద్బోదించారు. బుధవారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో కావలి నియోజకవర్గ పరిధిలోని బోగోలు, అల్లూరు, దగదర్తి, కావలి మండలాల ఎంపిడి ఓలు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు, ఆర్‌డిఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనగా త్వరలో చేపట్టనున్న ఆరోవిడత భూపంపిణీకి సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కౌలురైతులకు రుణాలు అందించడంలో వ్యవసాయ శాఖ, బ్యాంక్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రతి ఒక్కరికి రుణం అందేలా చూడాలని కోరారు. నీటి తీరువా వసూళ్ళను, బ్యాంక్‌లింకేజ్ రుణాలను సకాలంలో అందచేయాలని సూచించారు. ఎస్‌సి ఎస్‌టి బిసి రుణాలను వెంటనే మంజూరుచేసి యూనిట్లు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. దీపం, నిర్మల భారతి అభియాన్, ఇందిరమ్మ పథకం సక్రమంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈసమీక్ష సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి అధికారులు సరైన సమాధానాలు, వివరణలు సక్రమంగా ఇవ్వకపోవడంతో పలు సందర్భాలలో వారిపై అసహనం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు క్షేత్రస్థాయిలో పథకాల అమల్లో వున్న లోపాలను, ప్రభుత్వ సిబ్బంది వైఫల్యాను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ వీరభద్రరావు, ద్వామా పిడి గౌతమి, ఎస్‌సి, బిసి కార్పొరేషన్‌లు ఇడిలు సోమయ్య, కోటేశ్వరరావు, ఐటిడి ఏ పి ఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ హుస్సేన్‌రెడ్డి, వ్యవసాయశాఖ జెడి ఏ సుబ్బారావు పాల్గొన్నారు.